Monday, December 25, 2006

మన ఇంటి సావి3

తల్లి, చెల్లి, భార్య, వదిన, ప్రియురాలు ఎవరైనా వారికి ఒక మోడల్ మన మహాభినేత్రి సావిత్రి. చిలిపిగా హాస్యాన్ని ఒలికించాలన్నా,గంభీరంగా మగరాయిడులా నటించాలన్నా ఆమెకే సాధ్యం, ఆ నటన అద్వితీయం. అగ్రస్థాయి నటీమణులకే అభిమాన నటీమణి, మన సావిత్రి 1981, december 26 న పరమపదించారు.


ఆ మహానటి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఇవే నా హ్రుదయపూర్వక అంజలి.

 

మహానటి సావిత్రి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వికీ వ్యాసం చదవండి

Sunday, December 24, 2006

పావుకిలో పేరు మార్చాలి

పావుకిలో పేరు మార్చాల్సిందిగా ఈ భారత ప్రభుత్వానికివే నా విన్నపాలు. పావుకిలో అనే దానిని ఇక మీదట కిలో అని పేరు మారిస్తే, కనీసం మధ్య తరగతి ప్రజలు "అబ్బా కిలో టొమేటో ఆరు రూపాయలేనా" అని సంతోష పడతారు.

రైతుకు దక్కుతున్న టొమేటో ధర కిలోకు (1000 gms) రూ. 0.50. మహా అయితే రెండు రూపాయలు. జూబిలీ హిల్స్ ఫ్రెష్ అండ్ నాచురల్ లో టొమేటో ధర కిలోకు రూ. 28.00. వీరు ఈ టొమేటోలను ఆల్ప్స్ పర్వతాలనుంచి దిగుమతి చేసుకోవటం లేదు. ఇక్కడే రంగారెడ్డి జిల్లా రైతుల రక్తం కన్నీరుగా మారితే ఎర్రగా పండిన టొమేటోలు అవి. వారు పడుతున్న బాధలు చూస్తే మనిషనే వాడికి కంట తడి రాక మానదు.


ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలకు మైనారిటీలు, రిజర్వేషన్లు తప్పితే ఇంకేమీ పట్టవా? ఎప్పటికి గ్రామీణ రైతు స్వావలంబన సాధ్యమవుతుంది. ఈ భారత దేశంలో మైనారిటీలు ఎవరంటే కళ్ళు మూసుకుని "రైతులు" అని చెప్పవచ్చు. వీరు ఎవరికి అవసరం లేదు. వీరు చావు ఎవరికి పట్టదు. ఎందుకంటే రైతులు ఏ మతానికి సంభందించిన, కులానికి సంభందించిన వర్గం కారు. వారు ఈ రాజకీయ కుల మహా సభలు నిర్వహించి రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకు బలం చూపి హెచ్చరికలు పంపలేరు.

రైతు బజార్లు మొదలయినప్పుడు కొంతవరకూ దాని ప్రభావం కనిపించింది. RTC  ప్రత్యేక బస్సులు కూడా నడిపింది. ఈ పధ్ధతి చాలా ఉత్తమ మైనది. కాకపోతే ఈ బజార్లలో కూడా దళారీలు ప్రవేశించటం, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, అవినీతి విజృంభించింది. వీటిని బాగు చేస్తే ఎక్కడ తెలుగు దేశానికి పేరు వస్తుందో అని కాంగ్రెస్ వాటిని అలానే వదిలేసింది తప్పితే రైతుల గురించి పట్టించుకోవటం మానేసింది. అదీ కాక సిగ్గు లేకుండా మాది రైతు ప్రభుత్వం అని బాజా ఒకటి.

 

రైతులకు మేలు చెయ్యాలంటే, ఈ ప్రభుత్వాల దృష్టిలో వారికి ఉచిత విద్యుత్తు ఇచ్చెయ్యటమో (మాట వరసకు), రుణాలు ఇచ్చెయ్యటమో అనుకుంటే అంతకంటే గుడ్డితనం మరొకటి ఉండదు. పట్టణాల మోజులో పడి, వేసిన రోడ్లనే మళ్లీ మళ్ళీ వెయ్యటం, పరిశ్రమలన్ని పట్టణాలలో పెట్టుకుని, రింగు రోడ్లకు మాత్రం పొలాలని తవ్వుకుంటూ పోవటం...ఏమిటి ఈ దోపిడీ? ఇంత చిన్న అంశం కూడా ఆలోచించలేని పరిస్థితులలో ఉందా భారత ప్రభుత్వం?

 

రైతుల విద్యపై ప్రభుత్వం గట్టిగా చూపు సారించాలి. వారికోసం ప్రతి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల నెలకొల్పాలి. వ్యవసాయ కళాశాలలో పట్టబధ్రులయిన రైతులను ఇతర రైతులకు మార్గదర్శులుగా (mentors) గా నియమించాలి. ఈ మార్గదర్శులకు ఏటా అవార్డులను ప్రదానం చెయ్యాలి(ఉత్పత్తి ప్రకారం). ప్రతి జిల్లా నుంచి వీరు ఆయా జిల్లాల వ్యవసాయ కార్యాలయాల ప్రోటొకాల్ లో ఒక భాగస్వామ్యులుగా చెయ్యాలి.

ప్రతి గ్రామంలో వ్యవసాయ సంఘాలను పరిపుష్టం చెయ్యాలి. ఈ సంఘాల నిధులకు NRI లు కూడా ఒక హస్తం వేసేలా చేస్తే గ్రామీణ సౌభాగ్యం సాధించటం చాలా సులభం. మన ఊరు బాగుపడాలి, మన ఊరి రైతులు బాగు పడాలి అని ఏ NRI కోరుకోరు? నేను NRI అని ప్రత్యేకంగా ఎందుకు అన్నానంటే...వారికి కన్న భూమిమీద, సొంత ఊరు మీద ఉన్న అభిమానం మనలో ఉండదు మరి.

దేశంలో రిటైల్ చైనులు పెరగాలి. రిలయన్స్, భారతి, సుభిక్ష, వాల్ మార్టు వంటివి ఎన్ని ఎక్కువయితే రైతుకు అంత లాభం. వీరు రైతుల నుంచి మార్కెట్ ధరకు కొంటారు. కొద్దిగ లాభానికి ఎక్కువ మొత్తంలో సరుకును తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తారు. ఈ మార్టులు ఎక్కువ అవుతున్నాయని రాజకీయ పార్టీలు చేసే గోల పట్టించుకోనక్కరలేదు. వారు ఆ సరుకులను ఎక్కడినుంచో కొనటం లేదు, మన రైతుల నుంచే, మన దళారీల కంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. చిన్న చిన్న కిరాణా కొట్లలో ఉండే అపరిశుభ్రత, మోసం, కల్తీ అందరికీ తెలిసిందే...వారు నష్టపోతారని గొంతు చించుకోనక్కరలేదు.


నేను అమెరికాలో కూరగాయల దుకాణం చూసాను. ఒక అంధుడు కూడా నిరభ్యంతరంగా కూరగాయలను కొనుక్కోవచ్చు. అంతటి ప్రమాణాలు పాటిస్తారు. ఒక రోజు ధరలు తగ్గుతాయి, ఒక రోజు పెరుగుతాయి...అంతా రైతు దగ్గర కొన్న ధరల ప్రకారమే. ఎక్కువగా అమ్ముడయ్యేవి తక్కువ ధరకు దొరుకుతాయి (మనకు పూర్తి వ్యతిరేకం). ఏది నచ్చక పోయినా మర్యాదగా మార్చెయ్యటమో లేదా డబ్బులు తిరిగి ఇచ్చెయ్యటమో చేస్తారు. అదంతా చూస్తే నాకనిపించింది. "ఎక్కడ నిజాయతీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది".

Wednesday, December 20, 2006

తెలుగు పుస్తక ప్రియుల కోసం...

ఒక మంచి తెలుగు పుస్తకాలమ్మే ఆన్ లైన్ దుకాణం లేదేంట్రా అని బాధ పడే వారికి శుభవార్త...

ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారి ఇండియా వార్త పుస్తక శాల చూడండి.

ధర కూడా ఒక్క పైసా కూడా అసలు ధరకు ఎక్కువ లేదు. (నేను కొన్న పుస్తకాలతో సరి చూసా).
కొన్ని పుస్తకాలు

సాక్షి చివరకు మిగిలేది బాపు కార్టూన్లు దర్గా మిట్ట కతలు

Tuesday, December 19, 2006

పొద్దు పొడిచింది

poddu

పొద్దు ఈ-పత్రిక చూసారా? ఇది మరొక బ్లాగో, లేదా పత్రికో మాత్రం కాదు. ఇంటర్నెట్ లో తెలుగు తేజాన్ని అన్ని కోణాలలో పరిశోధిస్తూ, అభినందిస్తూ చక్కని పరిశోధనాత్మక వ్యాసాలు అందించే తెలుగు కుసుమం అని చెప్పవచ్చు.

ఈ ప్రయోగకర్తలు చదువరి గారికి, త్రివిక్రం గారికి, మరియూ వీవెన్ గారికి హార్దిక శుభాభినందనలు.

మొదటి సంచికలో నా అభిమాన బ్లాగరు రా.నా.రె పరిచయం కావటం ఎంతో ఆనందంగా ఉంది.

Tuesday, December 12, 2006

మీటనక్కరలేని రాతలు

కంప్యూటర్ తో, ఇంటర్నెట్ తో కాస్తో కూస్తో పరిచయం ఉన్నవారందరు ఈలేఖలు రాయటం అనేది తప్పని సరిగా చేసి తీరుతారు. లేక పోయినా ఏదో ఒక రకంగా పదాలను టైప్ చెయ్యటం మాత్రం తప్పించుకోలేరు. రోజూ కంప్యూటర్ తోనే సహవాసం చేసే వాళ్ళకు కీబోర్డు వాడటం బాగానే ఉంటుంది గానీ, వయస్సులో పెద్ద వారికి, వికలాంగులకు ఇది చాలా సంకటంగా ఉంటుంది. ఇక తెలుగులో రాయాలంటే చెప్పాలా?

సరిగ్గ ఇటువంటి వారికోసమే తయారు చేసిన సాఫ్టువేరు "డాషర్"

ఒక్క ముక్కలో చెప్పాలంటే దీనిని ఉపయోగించి రాయాలంటే ఒక కీ కూడా నొక్కనక్కరలేదు. అక్షరాలను త్రిమితి అంతరిక్షంలో ఏరుకుంటూ ఒక పక్క పేర్చుకుంటూ పోవటమే. ఇది చాలా భాషలలో ఉపయోగించవచ్చు. మన తెలుగు కూడా అందులో ఉంది.


పైన సరి చూసే గీత చూసారు కదా. అది స్థిరంగా ఉంటుంది.  ఎంపిక గీత అనేది ఒక పాయింటర్ లా నాలుగు వైపులా తిప్పవచ్చు. ఈ గీతను పదాల అక్షాంశానికి దగ్గరగా, దూరంగా తీసుకుపోతూ ఉంటే అవి పెద్దవిగా,చిన్నవి గా మారుతూ ఉంటాయి. మనకు కావాల్సిన అక్షరం సరి చూసే గీత మీద ఉన్న + మీదగా పోనించి దాటిస్తే దానిని ఏరుకున్నట్లే. అలా ఏరుకున్న పదాలు "రాసిన పదాలు" అనే చోట చేర్చ బడతాయి. ఇది చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది గానీ, అత్యంత సులభమైన రాత పధ్ధతి.

ఇక ఆంగ్లబాష అయితే T9 (predictive text input) సౌలభ్యం కూడా ఉంది. అంటే Hello అని రాసిన తరువాత How, are, you  అనే అక్షరాలు నన్ను ఎంచుకుంటావా అన్నట్లు మన దగ్గరలోకి వచ్చేస్తాయి :-)


ఇది పక్కగా పరిశోధనలతొ చేసిన సాఫ్టువేరు. దీనిని గొంతుతో, కళ్ళతో కూడా అక్షరాలను ఎంచుకునే సౌలభ్యం కల్పించారంటే ఇక దీని స్థాయి అర్ధం అవుతుంది.

మీరు ఇంకా తెల్లమొహంతోనే ఉంటే ఈ వీడియో చూడండి. అర్ధం అవుతుంది.

Monday, December 11, 2006

చొప్పదంటు పరిశీలన...

గతంలో మీకు ఆంధ్ర జ్యోతి లో దంటు కనకదుర్గ గారు రాసిన ఒక చొప్పదంటు పరిశీలన గుర్తు ఉండే ఉంటుంది. లేకపోతే ముందర ఇది చదవండి. కాసేపు కింద పడి నవ్వుకుని మరలా ఇక్కడికి రండి.


కనకదుర్గ గారు వీరావేశంతో చేసిన ఆ పరిశీలన (ఈవిడకి కొంపతీసి డాక్టరేటు రాలేదు కదా?) చదివి చాలా మంది ఆవేశపడ్దారు, కొంత మంది చిరాకు పడ్డారు, కొంత మంది నవ్వుకున్నారు, కొంత మంది తిక మక పడ్డారు. నేను మాత్రం నోరు ముయ్యటం మర్చి పోయాను. ఎందుకంటే తెలుగు అనే పదాన్ని సృష్టించింది ముస్లిం పాలకులని ఈవిడ అభిప్రాయం. ఈమె ప్రకారం పోతన భాగవతం కూడా తెలంగాణ యాస లోనే రాశాడు కానీ, ఆంధ్ర ప్రచురణ కర్తలు దాన్ని శ్రీ మధాంధ్ర భాగవతం చేసి పారేశారంట...కాళోజి అనే కవి (ఇతనాంధ్రుడో, తెలుగు వాడో, తెలంగాణా వాడో...) రాసిన ఆంధ్ర తిట్ల పురాణం (అతగాడి యాసని ఎవడో వెక్కిరించాడంట విజయవాడలో..అందుకని ఇక ఆ వెక్కిరింత తెలంగాణ అందరికి వెక్కిరింత అని అనేసుకుని రంగంలోకి దిగి పేజీలకు పేజీలు ప్రజా కవిత్వం రాసారీయన) ఉదాహరణగా చూపటం ఒక మూర్ఖత్వం అవుతుంది. కాళోజీకి ఆ మాత్రం సువిశాల భావ చైతన్యం లేకుండా అంత పేరు ఎలా వచ్చిందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఆంగ్లం కలపి మాట్లాడం లేదు తెలంగాణ గడ్డ మీద? తరతరాలుగా ఎకసెక్కాలకు గురవుతున్న ఉత్తరాంధ్ర యాస సంగతి ఏమిటి? వంద శాతం తెలుగు ఉండి కూడా అపహాస్యానికి గురి అవుతున్నదే? ఆ లెక్కన తప్పు తడకల బానిస బతుకుల ఉర్దూ సంకరం ఉన్న యాసకు ఒక జాతి అని పేరు ఎలా పెట్టిందో ఈ మహానుభావురాలు నాకు అర్ధం కావటం లేదు. యాసకైనా తల్లి భాషే...అది తెలుగు తల్లి మాత్రమే. ఎవరైనా భాషను అన్య భాషలతో సంకరం చేసుకుంటే అది వారు ఖర్మ, అంతే గాని కాళోజీలా దానికి ఆంధ్ర భాష అని పేరు పెట్టనక్కరలేదు.

ఈ దంటు దుర్గ గారి వ్యాసం మీద తాజాగా ఆంధ్ర జ్యోతిలో పులికొండ సుబ్బాచారి గారు రాసిన వ్యాఖ్య చదవండి..సాయి బ్రహ్మానందం గారు రాసిన వ్యాఖ్యలు కూడా చదవండి.

రాజకీయాలు ధనానికి, మద్యానికి, బంధు ప్రీతికి పట్టం కట్టి, జనాలను కొల్లగొట్టినా సహిస్తున్నారు ప్రజలు, గానీ ఇలా తల్లి రొమ్ము గుద్ది పాలు తాగాలనుకోవటం భయంకరమైన ఆలోచన.

Wednesday, December 06, 2006

పిచ్చి భారతం

తెరాస ప్రతినిధి TV9 లో : "భారత రాజకీయాలు ఒక తులసి వనం అయితే, కాంగ్రెస్ అందులో ఒక కలుపు మొక్క"

పిచ్చి పుల్లయ్య : వార్నీ నీకు మన రాజకీయాలు తులసీ వనంలా అగుపిత్తాన్నాయట్రా...ధూ...మన రాజకీయాలను పేడతో పోలిస్తే పిడకలు అలుగుతాయి, గొబ్బెమ్మలు నీలుగుతాయి. మిమ్మల్ని గాడిదలతో పోలిత్తే అవి సేస్తున్న పని మానేసి పారిపోతాయి. మీకు ఇంకొకిరితో పోలికేంది సామీ..మీరందరూ మీకు మీరే సాటి. అందరూ ఆ తాను ముక్కలే.

 

నరేంద్ర విజయ దరహాసంతో : "కరీంనగర్ ప్రజలు తెలంగాణా పోరాటానికి ఒక కొత్త అర్ధం చెప్పినారు, ఈ ఫలితం చాలు తెలంగాణా సాధనకు"

పిచ్చి పుల్లయ్య : పులి బాబు గారు, మరక్కడ ఏభై శాతమే పోలయినాయంట గందా? గుర్తింపు కార్డున్న ఓటరులెంతమంది? అందులో ఏభై శాతం ఎంత మంది? ఈ ఏభై శాతంల రిగ్గుంగు ఎవరూ (అంటే తవరు గాదు, ఎగస్పార్టీ వాళ్ళు..అట్టా గుర్రుగా సూడమాకండి బావు) సెయ్యనేదంటారా? పోలీసులు జనాల్ని బయపెట్టేసినారంట గందా? సారా, దుడ్డుకోసరమని పోలీసులకు బయపడకుండా లగెత్తుకొచ్చిన జనాలు ఓటేసేటప్పుడు బయపడ్డమేంది సెప్మా? అహా...నాకు సిన్న డౌటండి సారు.ఇవన్నీ తీసేత్తే అసలు మనస్పూరకంగా ఓటేసినోల్లెంతమందండి బాబు?

 

కరుణానిధి : "అతనికి టెండూల్కర్ అని పేరు రావటానికి కారణం అతని పరుగులన్నీ పది లోపల ఉండటమే"

పిచ్చి పుల్లయ్య : మరి తమరి పేరు లోని "కరుణ" ఎంత ? నిధి ఎంత సారు? తమరికి ఆ జయ అమ్మాయిగోరి చీరూడిపించిన సెరిత్ర ఉంది గందా...

 

తెరాస ప్రతినిధి TV9 లో : "మాకు వస్తున్న అభినందనల ఫోన్ కాల్స్ లో చాలా మంది కాంగ్రెస్, తెలుగు దేశం కార్యకర్తలు ఉన్నారు. వారు వారి పార్టీలకు ప్రచారం చేసినా మాకే ఓటేసారంట. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఎవరు గెలుస్తారో"

పిచ్చి పుల్లయ్య : ఆచ్హెర్యంగా ఉంది సామి. తవరి ఆనందం సూత్తే నవ్వాల్నో, ఏడవాల్నో తెలియగుందుండి. చానా మంచిది. కానీ అట్టాంటి నీచ్ కమీన్ కుత్తే కార్యకర్తలని తవరు పార్టీలోకి పొరపాటన రానీకండి సామీ...తమరి వీపు ఎప్పుడో ఇలానే విమానం మోత మోగించేత్తారు...

Tuesday, December 05, 2006

దీనినే 'అతి' అందురూ...

ఇది చదివి ఢామ్మని కింద పడబోయి ఆపుకున్నాను. దీని బట్టి చిరంజీవి రోజుకు ఎంత మంది భట్రాజులతో వేగుతున్నాడో కదా...ఈ అవుడియా మన అద్భుత భట్రాజ సోదర ద్వయం పరుచూరి వారికి రాలేదెందుకబ్బా !


నాయనా! చిరు జర జాగర్తగుండు...శ్రేయోభిలాషిని చెప్తుండాను.

గంధర్వ గళానికివే నివాళులు

తెలుగు ప్రజలు తెలుగుకు చెవి కోసుకుంటారో లేదో కానీ, ఈ సుమధుర గాయకుడి గళానికి మాత్రం తన్మయత్వంతో చెవులప్పగించేస్తారు. సంగీత దర్శకునిగా, గాయకుడిగా అతడు సంపాదించిన ఖ్యాతి, కంటి చూపుకు అందనంత ఎత్తులో ఉంది. తెలుగులో ఒకప్పటి అగ్ర కధానాయకులందరికి ఊపిరి అందించిన ఖ్యాతి మన ప్రియతమ పద్మశ్రీ ఘంటసాల వారిది.


భగవద్గీత అయినా, భక్తి పారవశ్యంతో కూడిన గీతమైనా అవి తెలుగు ప్రజలకు ఘంటసాల గొంతు ద్వారా పరిచయమైనవే.


అపర గాన గంధర్వునికివే జయంతి సందర్భంగా నా నివాళులు. ఈ సందర్భంగా మచ్చుకు కొన్ని జాతి రత్నాల్లాంటి పాటలు ఇక్కడ వినండి. భగవద్గీత ను ఇక్కడ వినండి.

Monday, December 04, 2006

ఈ వారం "కధా" కమామీషు

ఈ వారాంతం హైదరాబాదు పుస్తక జాతరకు వెళ్ళాను. తెలుగులో కొని చదవాల్సిన చాలా పుస్తకాలు అక్కడ ఉన్నాయి. ఈ సారి రష్యన్ బాల సాహిత్యం కూడా లభ్యమవుతుంది. నేను ఆంధ్ర కేసరి ఆత్మ కధ, బారిష్టరు పార్వతీశం, దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు కొన్నాను... విచిత్రం ఏమిటంటే బారిష్టరు పార్వతీశం రాసిన మొక్కపాటి, ఆంధ్ర కేసరి ప్రకాశం దగ్గర ప్లీడరు గా ఉండేవారు. ఆ విధంగా గురు శిష్యులిద్దరి రచనలు ఒకే రోజు కొన్నట్లు అయ్యింది. అక్కడే కలసిన చావా కిరణ్ కూడా ఆంధ్ర కేసరి పుస్తకంతోనే కనిపించటం మరొక విషయం :-).

ప్రస్తుతం పి.వి "లోపలి మనిషి" చదువుతున్నాను. పి.వి.నరసింహరావు గారి రచనా శైలి, భావ ఉన్నతి అద్భుతం అని చెప్పక తప్పదు. ముఖ్యంగా బాల్యం గురించి వివరించేటప్పుడు....


ఇక పోతే, ఈ మధ్య జరుగుతున్న వెధవ రాజకీయాల గురించి చాలా ఆసక్తికరమైన చర్చలు మిత్రులతో జరిగాయి. ప్రతి ఒక్కరు రాజకీయాన్ని తిట్టి మరీ సంభాషణ మొదలు పెడుతున్నారు.

శుభ్రంగా ఎన్నుకున్న ప్రజలని కాలదన్ని కె.సి.ఆర్ రాజీనామా చెయ్యటం ఏమిటీ? చేసాక మరలా ఎన్నిక కావటం కోసం అష్టకష్టాలు పడటం ఏమిటి? అతగాడు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్, టి.డి.పి లకు సారా, డబ్బు పంచడానికి అవకాశం ఇవ్వటం ఏమిటి? ఇవన్నీ జరగటానికి ఎవరు కారణం ? శుభ్రంగా ఉన్న సీటుకు రాజీనామా చేసి, ఇప్పుడు ఆ ఎన్నిక తెలంగాణ ఆత్మభిమానానికి పరీక్ష అనటం ఏమిటి? రెండు సంవత్సరాలు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగినది అస్సలు తెలియనట్లు ఇప్పుడు శఫధాలు చెయ్యటం ఏమిటి?

కేవలం, కరీంనగర్ ఎన్నిక దానిని ఎలా నిర్ణయిస్తుంది? అలా అయితే దారుణంగా ఒడిపోయిన జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల సంగతి ఏమిటి?

ఈ రోజు, ఈనాడు ప్రతిధ్వనిలో ఒకతను భలే చెప్పాడు...

తెలంగాణ : ప్రతి పార్టి అంటుంది, మేమే మొదలు పెట్టాం. మేమే తెస్తాం.

బీడి పుర్రె : ప్రతి పార్టి అంటుంది, మేము చెయ్యలేదు, మేమే తీసెయ్యగలం.


దాదాపు వందకోట్ల అవినీతి ధనం, మూడు కోట్ల వరకు ప్రజాధనం కరీంనగర్ ఎన్నికలలో ఖర్చు అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పాపం వోక్స్ అవినీతిని కూడా మించిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని తీవ్రస్థాయిలో మానభంగం చెయ్యటమే.

నా అంచనా నిజమైతే..కరీంనగర్ కె.సి.ఆర్ కు దక్కుతుంది, బొబ్బిలి తెలుగుదేశంకు దక్కుతుంది. కాంగ్రెస్ కు వోటేసి గెలిపించే ధైర్యం బొబ్బిలిలో అయితే చెయ్యరు. అసలే అక్కడ కుటుంబాలకు కుటుంబాలు అవినీతి గబ్బిలాలు వేలాడుతున్నాయి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name