Tuesday, February 27, 2007

మన రంజని : గల్ఫ్ దేశాలకు తెలుగు వీనులవిందు

వచ్చే మార్చి ఇరవై నుంచి "మన రంజని" అనే తెలుగు రేడియో మొదలవబోతుంది. మన హైదరాబాదులో కాదు లెండి. గల్ఫ్ లో వున్న ఏడెనిమిది దేశాలలో. ఈ రేడియో ముందర ప్రతి శుక్రవారం రెండు గంటలు వచ్చేదంట. బాగా అందరికి నచ్చడంతో ఇప్పుడు ప్రతి రోజూ నాలుగు గంటలు (మధ్యాహ్నం మూడు నుంచి ఏడు గంటల వరకూ) ప్రసారం చెయ్యబోతున్నారు.

గల్ఫ్ దేశాలలో వున్న తెలుగు వారందరు 1152 AM ద్వారా ఈ ప్రసారం విని ఆనందించవచ్చు.

Sunday, February 25, 2007

సీమాస్ పై "సీ" లిపి సాహసం

ఈ మధ్య ఒక స్టూడెంట్ ఇంటర్న్ తో మాట్లాడుతూ వుంటే "సీ" ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ మీదకు విషయం మళ్ళి చర్చ రసవత్తరంగా సాగింది. ఆ సందర్భంగా మేము కాలేజీ రోజుల్లో చేసిన "C"లిపి పని ఒకటి గుర్తుకొచ్చి అది ఇక్కడ రాస్తున్నా….

 

అవి విశాఖలో కంప్యూటర్ సైన్సు పీ.జీ వెలగబెడుతున్న రోజులు. జీవితం హాయిగా వున్న రోజులన్న మాట. వీలయితే క్లాస్ కు వెళ్లటం, ఆ క్లాస్ నచ్చక పోతే పొలోమని ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి పోయి అక్కడ యుగాల తరబడి పీ.హెచ్.డి లు గట్రా చేసుకుంటున్న హాస్టల్ పక్షులతో క్రికెట్ ఆడుకోవటం. ఆనక MVP Colony సెంటర్ కి గానీ, కైలాసగిరి గానీ ఎక్కి కూర్చుని రాత్రి ఎనిమిదికి ఇంటికి చేరటం. ఇదంతా ఎలా సాధ్యమయ్యేదంటే రూములో కంప్యూటర్ లేక పోవటమే. ఆ రోజులలో కంప్యూటర్ కొనటమంటే కొద్దిగా ఇబ్బంది అయిన విషయమే..(మనకి కాదు…మన నాన్నలకి ;-))

మా రూములో మొత్తం నలుగురుం వుండే వారం. ఓనరు గారు కూడా పక్క ఇంట్లోనే వుండేవారు. మాతో బాటు ఓనర్ అంకుల్ గారి బంధువులబ్బాయి కూడా ఒకతను వుండేవాడు. ఈ కధలో బాధితుడు అతడే. పేరు రావు. ఇతడు కొద్దిగా 'అతి' మనిషి. ఆశు కోతత్వం అనే విద్య ఒంట బట్టిన వాడు. కోసే కోతలకు అంతే వుండేది కాదు. ఒకప్పుడు తను వైరస్ ప్రోగ్రామర్ అని చెప్పుకునే వాడు. మా ఫ్రెండ్ ఒకడికి అప్పట్లో ఎలా అయినా జీవితంలో ఒక వైరస్ రాద్దామనే చెత్త కోరిక వుండేది. IBM వారు ప్రచురించిన ఒక పెద్ద పుస్తకం "DOS Interrupts" ని పట్టి తెగ చదివేస్తూ వుండేవాడు. Interrupts తో ప్రోగ్రామింగ్ చెయ్యటమంటే దాదాపు కంప్యూటర్ జీవితంతో చెలగాటం ఆడుకోవటమన్నట్లే…రాసిన కోడ్ వల్ల కంప్యూటర్ ఎప్పటికీ పనికి రాకుండా పోవచ్చు.

 

అయితే అదలా వుంచి వాడితో సహా మొత్తం అందరం రావు గారి కోతలు ముందర నమ్మేసాం. అప్పట్లో మాకు సీ లాంగ్వేజీలో ఏదేదో చేసేద్దామని మహా ఇదిగా వుండేది. అది అతను వుపయోగించుకుని అలా కోతలు కోసాడన్నమాట. కాకపోతే తరువాత అర్ధం అయ్యింది అసలు భాగోతం అనుకోండి.

 

అయితే ఈ రావు గారు ఒకానొక దుర్ముహర్తంలో గుంటూరు నుంచి తన కంప్యూటర్ను తెచ్చాడు. తెచ్చాడే కానీ అతనికి గుండె గుబ గుబ మంటూనే వుండేది.ఎక్కడ మా "C" ప్రయోగాలు ఆ కంప్యూటర్ మీద చేస్తామో అని. మా రూమ్మేట్ గాడు "C" లో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చేసేవాడు. ఒక తెల్ల కాగితం మీద అడ్డదిడ్డంగా కోడు తెగ రాసుకుపోయి వాళ్ళ కాలేజీ ల్యాబ్లో టైపు, రన్ చేసి సరదా పడిపోయే వాడన్న మాట. అలాంటి వాడికి ఇక రూముకు ఒక కంప్యూటర్ వస్తే ఆనందానికి హద్దేముంది?

 

అయితే ప్రమాదాన్ని పసిగట్టిన రావు, తన కంప్యూటర్‍కు BIOS స్థాయిలో పాస్‍వర్డ్ ఒకటి పెట్టేసాడు. ఆ పాస్ వర్డ్ CMOS అనే చోట భధ్రపరచబడి వుంటుంది. అది ఇవ్వకపోతే కనీసం ప్లాపీ కూడా పనిచెయ్యదన్నమాటే. తను వున్నపుడు పాస్‍వర్డ్ కొట్టి మాకు కొంత సేపు కంప్యూటర్ ఇచ్చేవాడు. పాస్‍వర్డ్ కూడా చెప్పేవాడు. కానీ రాత్రికి రాత్రి మరలా పాస్‍వర్డ్ మార్చేసే వాడు. అదేంటి మీరిచ్చిన పాస్‍వర్డ్ పనిచెయ్యటం లేదంటే…అదీ…కొన్ని సార్లు మదర్ బోర్డు మీద బ్యాటరీ వీక్ అయితే అలా పాస్‍వర్డ్ మారిపోతుందని చెప్పేవాడు. ఇదంతా మాకు చాలా అవమానంగా తోచింది. కొద్దిగా R & D చేస్తే అర్ధమయింది ఏమిటంటే మదర్ బోర్డు మీద బ్యాటరీ ఒక సారి పీకి మరలా పెడితే ఆ పాస్‍వర్డు పోతుందని అర్ధం అయింది. కానీ అలా చెయ్యాలంటే మొత్తం కంప్యూటర్ ను విప్పాలి. అది జరగని పని కదా…ఇక ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించి "C" లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసి ఆ పాస్‍వర్డును తీసేస్తే ఎలా వుంటది? అనే ఛండాలమయిన అవుడియా వచ్చింది. రావటమే తరువాయి, మా వాడు రంగంలోనికి దిగి ఎక్కడి నుంచో ఒక రెండు లైనుల ప్రోగ్రాము తెచ్చాడు. దానిని వాడు వాళ్ల కాలేజీ లాబ్లో క్షుణ్ణంగా పరీక్షించి మరీ ఒక ఫ్లాపీలో తెచ్చాడు.

 

అయితే ఇప్పుడు ఆ ప్రోగ్రామును ఆ కంప్యూటర్లో RUN ఎలా చెయ్యాలి. రావు ఎప్పుడు మాతోనే వుండేవాడు. బయటకు వెళితే పాస్‍వర్డ్ మార్చేసి చక్కా పోయేవాడు. కాబట్టి ఒక మంచి అవకాశం కోసం సిద్ధంగా వుండే వాళ్లం. ఒక మంచి ముహూర్తాన ఎందుకో చేస్తున్న పని మధ్యలో రావు గారికి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, దాని కోసం అతను ఓనరు గారి పోర్షన్ లోనికి వెళ్ళాడు. దొరికిందిరా ఛాన్సు అని మా ఫ్లాపీ పెట్టి ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసాం. టెన్షన్ గా వుంది…అసలు వర్కవుట్ అవుతుందో లేదో అని. ఒక మా వాడి మీద నాకు డౌటు. అసలు ఈ ప్రోగ్రామ్ పని చేస్తుందా లేదా అని. మొత్తానికి ఒక సెకండ్లో RUN అయింది. కానీ ఏమీ జరగ లేదు. అంతా నార్మల్ గా వుంది. Password పోయే వుంటుందని మా ఫ్లాపీ తీసేసి బుద్ధిమంతుల్లా కూర్చున్నాం. ఆ రోజు మా అదృష్టం వలన అతడు మాకు పాస్‍వర్డ్ చెప్పలేదు. మేం చచ్చినా అడగలేదు. అడిగితే ఎక్కడ మరలా కొత్త పాస్‍వర్డ్ పెడతాడో అని భయం :-)…..మొత్తానికి మరుసటి రోజు అతను కాలేజీకి వెళ్ళాక మేం కంప్యూటర్ ఆన్ చేసాం.

హుర్రే ! Password Gayab…..Password పోయిందే….:-) అప్పుడు చూడాలి మా ఆనందం. దాన్ని అణుచుకుంటూ అక్కడితో ఆగకుండా అప్పుడే ఒక క్రూరమైన పని చేసాం. ఆ కంప్యూటర్ BIOS కు మా పాస్‍వర్డు పెట్టేసాం. రావు గారి పేరు, virus కలసి వచ్చేలా ఏదో పెట్టాం. ఆ ఆనందంలో సాయింత్రం ఛాట్ గట్రా గడ్డీ గాదరా బాగా తిని ఆనందంగా రూమ్ కి చేరేటప్పటికి రావు గారు ఆదుర్దాగా రకరకాల పాస్ వర్డ్ల్ లు కొడుతూ కనిపించారు. కాసేపయ్యాక మా దగ్గరకు వచ్చి పాస్ వర్డు పనిచెయ్యటం లేదయ్యా అన్నాడు బిక్క మొహం వేసి. మేం అంతకంటే అమాయకంగా మొహం పెట్టి అలాగా పాపం…బ్యాటరీ వీక్ అయ్యిందేమోనండీ అన్నాం …ఉబికి వస్తున్న విలన్ నవ్వునాపుకుంటూ…ఒక్క సారి షాక్ తినటం అతని వంతయ్యింది. ఎందుకంటే అతని బాణం అతనికే ఎవరైనా ఎక్కుపెడతారని వూహించలేదు మరి. ఇంకేమీ అనలేక…అవునంటారా? అదే అయివుంటుంది అన్నాడు. అతను మాతో కోతలయితే కోసాడు కానీ, ఆ బ్యాటరీ ఒక సారి పీకి పెడితే పాస్ వర్డ్ పోతుందని తెలియదు :-)

 

అప్పటి నుంచి ఇక ఆ కంప్యూటర్ మా మాట మాత్రమే వినటం మొదలయింది. రావు బయటకు వెళ్లటం మొదలు…మరలా వచ్చే వరకు అది పని చేసేది. తరువాత మూగ బాటే. కొన్నాళ్లకు ఆ కంప్యూటర్ని మొత్తం గుంటూరు తీసుకు వెళ్లి బ్యాటరీ పీకించి పాస్ వర్డ్ మార్చారనుకోండి :-) ఇదంతా జరగడానికి ఒక మూడు నెలలు పట్టింది.

 

కాకపోతే అప్పటి నుంచి రావు గారి పేరు మా మిత్ర బృందంలో "CMOS(సీమాస్)" గా మారిపోయింది :-) ఇప్పటికి కూడా అదే పేరు. అయితే ఇప్పటికీ అతనికి ఈ విషయం తెలియదు. కాబట్టి హుష్…ఎవ్వరూ చెప్పొద్దు ;-)

Friday, February 23, 2007

జాగ్ : ఆర్డర్ ఆఫ్ కెనడా

ఇది లోకంలో సగానికి పైగా వున్న సాఫ్టువేరు నిపుణులకు ఆనందకరమైన వార్త. ఇందుగలడందులేడను సందేహము లేని జావా భాషను కనిపెట్టిన సాఫ్టువేరు శిల్పి జేమ్స్ గోస్లింగ్ (జాగ్ గా అందరికి పరిచయం) ని కెనడా ప్రభుత్వం వారి ఉన్నతమైన గుర్తింపు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ కెనడాతో సముచితంగా సత్కరించుకోనుంది.

ప్రస్తుతం జాగ్, సన్ మైక్రో సిస్టమ్స్ లో ఉపాధ్యక్షులుగా వున్నారు. జాగ్ బ్లాగు ఇదిగో ఇక్కడ చూడండి.

మాట రాని ఆనందమిది...

2006 సంవత్సరానికి ఇండీబ్లాగీస్ వారి అవార్డులు ప్రకటించబడ్డాయి.

నా బ్లాగు అవార్డు గెలుచుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు బ్లాగుల మువ్వల సవ్వడి అంత అద్భుతంగా వుంది. దీనికి సాక్ష్యం వోట్ల సంఖ్య . దాదాపు అన్ని బ్లాగులూ మంచి ఎన్నిక శాతాన్ని సంపాదించాయి. అన్ని మంచి బ్లాగులే అయితే ఏది మంచిదో తేల్చుకోవటం కష్టమే కదా. ఇది చాల మంచి శకునం. ఖచ్చితంగా తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయి. దీనంతటికి కారణమైన లేఖిని , కూడలి, తేనె గూడు మరియు తెలుగు బ్లాగుల ప్రపంచానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా బ్లాగుకు ఈ గుర్తింపు రావటానికి కారకులైన తోటి తెలుగు బ్లాగరులకు, నా బ్లాగు పాఠకులకు మనసా వాచా ధన్యవాదాలు. తెలుగు బ్లాగు పోటీల జ్యూరీ సభ్య్లులకు ధన్యవాదాలు.
ఈ e-తెలుగు ప్రపంచానికి తెలుగు బ్లాగర్లు, తెలుగు బ్లాగు పాఠకులే ప్రాణవాయువు . మీరు లేని ప్రపంచంలో బ్లాగింగు ఎడారిలో ఎలుగెత్తి మాట్లడమే అవుతుంది . తెలుగు బ్లాగులను ఇలాగే ఎప్పుడూ ఆదరిస్తారని, సద్విమర్శలతో దిన దిన ప్రవర్ధమానం చేస్తారని ఆశిస్తూ...మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్న....

మీ
సుధాకర్ (శోధన)

Wednesday, February 21, 2007

మాతృ భాషా దేవో భవ...

ఈ రోజు ప్రపంచ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా TV9 మన తెలుగు ప్రజలు తెలుగుని ఎంత వుపయోగిస్తున్నారు అనే విషయం మీద చిన్న సర్వే చేసారు. అట్టా ఆశ్చెర్యపోకబ్బాయ్…అప్పుడప్పుడు దయ్యాలు కూడా వేదాలొల్లిస్తాయ్ మరి. మొత్తానికి ఏదయితేనేం సర్వే చేసారు.

ఈ సర్వేలో తెలిసినదేంటి అంటే చాలా మందికి అచ్చులు ఎన్నో, హల్లులు ఎన్నో తెలియవు.

కొంతమంది ఋ, ౠ లను మర్చిపోయారు

కొంతమందికి హల్లులు నాలుగేనంట :-) (కొంపతీసి A B C D లా? )

ఒకరేమో తెలుగులో అచ్చులు, హల్లులు వుంటాయని మీరడిగితేనే తెలిసింది.

వీటన్నింటికి కారణం మనకు ఆంగ్లంపై వున్న మక్కువనుకుంటున్నారా? కానే కాదు. తల్లి తండ్రులు అంతకన్నా కాదు. అస్తవ్యస్తంగా వున్న విద్యా వ్యవస్థ, అరకొర జీతాలతో బతుకుతున్న ఉపాధ్యాయులు…అసలు తమకే సరిగా విద్య రాని ఉపాధ్యాయులు దీనికి ప్రధాన కారణం.

అయితే ఒక్కటి మాత్రం నిజం. తెలుగు ఒక భాషగా మాత్రం చచ్చిపోయే ప్రసక్తే లేదు. కొన్ని కోట్ల రూపాయల టీ.వీ ఛానల్లు, సినిమా పరిశ్రమ ఈ భాష మీదే బ్రతుకుతున్నాయి మరి. అవి ఎంత పెరిగితే తెలుగు అంత క్షేమం (ఎదో ఒక రూపంలో).

ఒక్క సారి అచ్చులు , హల్లులు చూడటానికి బాల శిక్ష చూద్దాం పదండి.

http://balasiksha.wordpress.com/

Monday, February 19, 2007

తెలుగు సినిమాల భవితవ్యం

ప్రస్తుతానికి ఇలాంటి సీనులు చాలా వున్నాయనుకోండి. కానీ ఈ సీను మాత్రం అల్టిమేట్ కిల్లర్ సీను. బహుశా బాలయ్య దీనిని చెయ్యటానికి సాహసించవచ్చు. గతంలో అతను ట్రైనుని వెనక్కి, కుర్చీలను ముందుకూ కంటి చూపుతో కదిపిన అనుభవం వుంది. పదో తరగతి కూడా పాస్ కానీ స్టంటు మాస్టర్లు, దర్శకులు సినిమాలలోకి వస్తే ఇలానే వుంటది మరి. జై వజ్రోత్సవ లిజెండ్సెలిబ్రిటీ సహిత తెలుగు చిత్ర మాత! జై. !

ఇది నవ్వే విషయమా?

నాకు తెలియదు....

అంతా చట్ట ప్రకారమే...

చంద్రబాబును కోర్టుకు వెళ్ళమనండి..

ఏదీ తెలియకపోవడమే నాకున్న పెద్ద మంచి లక్షణం...

సీ.ఎన్.ఎన్ ఐ.బి.ఎన్ వారి "చీల్చి చెండాట" భలే వుంది. సమాజం కోసం అని చంకలు గుద్దుకునే TV9 ఒక్క సారి ఈ ఛానల్ వారి నాణ్యత చూస్తే మంచిది. రేప్పొద్దున్న ఈ ఛానల్ చంద్రబాబును కూడా ఇలానే ప్రశ్నలు అడగవచ్చు.
ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకటి అర్ధమైంది. పిచ్చ కోపం వచ్చినప్పుడు రాజశేఖరరెడ్డి నవ్వుతారని. :-) ఇది Art Of Living స్టయిలా? లేకపోతే మున్నాభాయి MBBS మామూ స్టయిలా :-)

మొత్తానికి మన CM గారికి చాలా ఇంటి విషయాలు తెలియవని అర్ధం అవుతుంది. చాలా ప్రదేశాలలో తనకు భూములు వున్నందువలన కొన్ని (తన సొంత Income Tax declarations) తనకు తెలియవని వారు సెలవిచ్చారు. ప్రతి పది నిమిషాలకు "చంద్రబాబును కోర్టుకు వెళ్ళమనండి" అని సవాల్లు విసిరారు. తను ప్రజలకు జవాబుదారీ కానీ చంద్రబాబుకు కాదని అతను ఎప్పుడు అర్ధం చే్సుకుంటారో. "నా ప్రజలలో ఎవరినైనా కోర్టుకు వెళ్ళమనండి" అని వుంటే బాగుండేది. మొత్తానికి విషయమేమిటంటే...ఏ చెత్త పని అయినా చెయ్యు. కానీ చట్టానికి దొరకని విధంగా చెయ్యు. ఎదుటి వాడిని కోర్టుకు వెళ్ళమని సవాలు చెయ్యు. ఇదండీ మనం నేర్చుకోవాల్సిన ఆధునిక నీతి.

ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోకుండా, రాష్ట్రానికి సేవలు చేసే ముఖ్యమంత్రులు ఎందరుంటారు చెప్పండీ. కోటికొక్కరుంటారేమో ! ఎంతైనా ఆంధ్రులు అదృష్టవంతులు. :-)

Saturday, February 17, 2007

దేశ ముదురు - ( A )

చాలా రోజులుగా తెలుగు సినిమా చూడలేదు కదా అని అలా ఏదో ఒక సినిమా చూద్దామని ఫ్రెండ్స్ తో కలసి పైన చెప్పున సినిమాకు వెళ్ళాను. ఆహా ఏమి చిత్ర రాజం?

అసలు ఇది పూరి జగన్నాధ్ చిత్రమేనా అనిపించింది ముందర (అమ్మా..నాన్న..తమిళమ్మాయి ప్రభావం వలన). తరువాత మెల్లగా ఇలాంటి సినిమాలు కేవలం పూరి మాత్రమే తియ్యగలడు అని అర్ధం అయింది. అసలు కధ ఏమిటో ఎందుకు ముందుకు సాగుతుందో అర్ధం కాదు. కధతో సంబంధం లేని కామెడీ ట్రాకు (కాస్త బాగున్నది ఇదే). విపరీతమైన అరుపులు సినిమా అంతటా సమంగా పరచుకున్నాయి. హీరోయిన్ తప్పితే ప్రధాన పాత్రలు అన్ని కనీసం 150 డెసిబల్స్ స్థాయిలో అరుపులు, సంభాషణలు సాగిస్తాయి. అది పూరి మార్కు.

ఇక కధ విషయానికొస్తే పెద్దగా ఏమి లేదు. అన్ని తెలుగు సినిమాలలాగానే బయటి రాష్ట్రాలలో (కులూ, మనాలి) అందరూ తెలుగు మాట్లాడేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ఉన్న విలనీయులు మాత్రం తెలంగాణా యాసతో కూడిన తమిళం (అదే మరి పూరి స్టయిల్) మాట్లాడుతుంటారు (అరుస్తుంటారు). హీరో విషయానికొస్తే తండ్రిని ఏరా అని పిలిచే స్థాయి ఉన్న ఒక చిన్న సైజు సిల్వస్టర్ స్టాలిన్. ఇతనికి ఎదురంటూ పెద్దగా ఏమీ లేవు/లేదు. పిట్ట కొంచం కూత ఘనం అన్న మాట. మా-టీవి ని సొంత టీవి లా వాడేసుకుంటూ వుంటాడు.(అల్లు అరవింద్ కి కూడా మా-టీవీ వాటాలున్నాయా? కొంపతీసి?). ఒక టీవి ఛానల్ వారు గూండాలు వస్తున్నారని వణికి పోవటం మనం ఈ చిత్రంలో చూస్తాం.

హీరో ఉద్యోగ నిమిత్తం కులూ, మనాలి వెళ్ళి అక్కడ ఉన్న ఒక యోగినిని ప్రేమ అని వేధించటం చిత్రంలో 50% వుంటుంది. అది కూడా పూరీ మార్కులో "ఏమే…నాకు ఏం తక్కువే? , నీకు కొవ్వెక్కిందే? …" ఇలా సాగిపోతుంది. ఇలా వేధిస్తే ప్రేమలో పడే అమ్మాయిలు ఎక్కడ వుంటారో పూరికే ఎరుక. ఈ యోగినిలు కూడా చాలా విచిత్రంగా వుంటారు. పూర్తిగా మస్కారా, లిప్ స్టిక్కు, ఫేషియల్ తో భలే వుంటారన్న మాట. అన్నట్లు కలర్డ్ జుత్తు కూడా. అన్ని తెలుగు సినిమాలలానే హీరోయిన్ అందరి మధ్యలో, ముందరగా నడుస్తూ ఫ్రేమ్ ను లీడ్ చేస్తూ వుంటుంది.

ఇక మిగతా విషయాలు…దయ చేసి మీ పిల్లలను మాత్రం ఈ చిత్రానికి తీసుకు వెళ్ళవద్దు. విపరీతమైన హింస, మొహానికి రక్తాలు రాసుకోవడాలు లాంటివి జుగుప్సాకరంగా వున్నాయి. మనిషిని పట్టుకుని పరపరా మధ్యకు విరిచెయ్యటం వంటివి అయితే చెప్పనక్కరలేదు.

చక్రి, పూరి కలిస్తే ఎలా వుంటుంది? చెవులు దిమ్మెక్కిపోయే అరుపులుతో కూడన పాటలు పుట్టాయి. అవి కూడా చక్రి తనదైన గొంతులో పాడి చిరాకు తెప్పించాడు. అర్జున్ చేసిన డాన్సులు మాత్రం బాగున్నాయి.

మొత్తం మీద ఈ చిత్రం నన్ను బాగా నిరాశ పరిచింది. నేను ఈ చిత్రం మీద ఏ రకమైన ఊహతో వెళ్ళలేదు కానీ, కనీసం ఒక మంచి తెలుగు చిత్రం స్థాయిలో అయినా వుంటుందని ఆశించాను. పదికి మూడు మార్కులు వస్తాయి ఈ చిత్రానికి.

Friday, February 16, 2007

జగన్నాటకం మొదలయింది

చాలా రోజుల నుంచి అనుకుంటున్నట్టుగా జగన్నాటకం మొదలు పెట్టాను. ప్రస్తుతానికి నేను, త్రివిక్రం గారు ఈ బ్లాగు సభ్యులం. మీకు కూడా ఈ బ్లాగులో రాయటానికి ఆసక్తి ఉంటే చెప్పండి. ఆనందాహ్వానం సిద్ధంగా ఉంటుంది.

జగన్నాటకం

Wednesday, February 14, 2007

నా గిజ్మో కోరికల చిట్టా 2005 - నేనెక్కడున్నాను

2005 వ సంవత్సరంలో నేను తప్పని సరిగా కొనుక్కోవలసిన గాడ్జెట్ లన్నీ ఒక చిట్టా తయారు చేసుకొని బ్లాగులో ఇక్కడ రాసుకున్నాను.

ఇప్పుడవన్నీ చూసుకుంటే నవ్వు + ఏడుపు వస్తున్నాయి :-)

ఒక సారి సరి చూసుకుంటే ..పరిస్థితి ఇలా ఉంది.

  1. 20 GB ఐపాడ్ : ఇప్పుడు 20 GB పోయి 30, 80 GB లు వచ్చేసాయి. ఈ మధ్యలో నాకు మైక్రోసాఫ్టు జూన్ వచ్చి పోవడం (అమ్మేసా ;-)) 80GB ఐపాడ్ కొనుక్కోవటం జరిగాయి ….ఇక్కడ హాపీ…
  2. ఒక శక్తివంతమైన టెలిస్కోప్ : భూమి మీద ఉన్న ప్రదేశాలు చూడాలంటే లక్షలు పెట్టాలి. ఒక పది వేలు పడేస్తే మంచి న్యూటోవియన్ టెలిస్కోప్ కొనుక్కుని అంతరిక్షంలోనికే చూడొచ్చు కదా…ఈ కోరిక ఇంకా తీరలేదు…:-(
  3. క్రెడిట్ కార్డు సైజు 10 GB సోనీ హార్డు డిస్కు : కొనలేకపోయాను. కానీ చిన్న పెళ్ళి కార్డు సైజులో ఉండే western digital 120 GB హార్డు డిస్కు కొనుక్కున్నాను….కాబట్టి ఇక్కడ ఫరవాలేదు :-)
  4. సోనీ హోమ్ థియేటర్ సిస్టం + సోనీ వెగా 29" TV : వెగా టీ.వి కొనగలిగా కానీ, సొంత ఇల్లు లేక పోవటం వలన హోమ్ థియేటర్ సిస్టం కొనలేక పోయాను. హోమే లేక పోతే ఇంక దానికొక థియేటర్ ఇంకెక్కడ? :-(
  5. కొత్తగా చిట్టాలో చేరినది : Canon Rebel Xti 400D : ఇంకా కొనే సీను రాలేదు. :-)

Tuesday, February 13, 2007

మిత్రులందరికీ హర్షాతిరేక ధన్యవాదాలు

తెలుగు బ్లాగు మిత్రులందరికి,

శోధన బ్లాగును తెలుగు బ్లాగుల వర్గంలో ఇండీబ్లాగీస్ అవార్డులకై నామినేట్ చేసినందుకు హర్షాతిరేకాలతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ అభిమానం, ప్రోత్సాహం ముందు ఏ అవార్డు పనికిరాదని నేను విహరిస్తున్న ఆనందలోకం చెప్పకనే చెప్తుంది.

మీరు ఇలానే తెలుగు బ్లాగులను, జీవితంలో మంచి కాఫీ కప్పుతో సమానంగా ఎప్పటికీ ఆదరిస్తూ ఉంటారని భావిస్తూ....

మీ బ్లాగ్భవదీయుడు,

సుధాకర్.

అందమైన జీవితమా? అందమైన సెల్ ఫోనా?

ఈ మధ్య నా సెల్ ఫోన్ నా వైపు చూసి నవ్వుతున్నట్లనిపిస్తుంది. అది నా పై స్వారీ చేస్తుందో లేదా నేనే దానిని నెత్తి మీదకెక్కించుకున్నానో అర్ధం కావటం లేదు. ఒకప్పటి రోజులు గుర్తుకొస్తుంటే మరీ బాధగా ఉంది. అందంగా ఆలోచించి మరీ ఇన్ లాండు లెటరులలో ఉత్తరాలు మిత్రులకు రాస్తే ఆ మజానే వేరు. ఒకే ఉత్త్రరంలో అమ్మకు, నాన్నకు, చెల్లికీ ఒకో వేరే పేరాలలో వేరే భావాలతో ఉత్తరం రాసి ఒక జన్మ అయినట్లుంది. దీనంతటికి కారణం ఈ సెల్లుటకాజీ అని నేను బల్ల గుద్ది చెప్పగలను. ఇప్పుడు కాల్ ఎత్తక పోతే ఎవడికో ఎక్కడో కాలిపోతుంది. ఎవరో చెప్పాపెట్ట కుండా అలుగుతారు. ఏంట్రా ఎన్ని కాల్స్ చేసినా ఎత్తవు? ఆ సెల్లు తీసుకెల్లి పొయ్యలో తగలెయ్ అని తిట్టేవారు లేకపోలేదు. ఒక రోజంతా సెల్లు ఎత్తక పోతే కొంప తీసి కిడ్నాపయిపోయాడా అని ఆలోచిస్తున్నారు.

సెల్లు విశ్వరూపం వలన ముఖ్యంగా ప్రభావితం అయ్యింది అమ్మాయిలు. అమీరుపేట లో ఒక్క పది నిమిషాలు గమనిస్తే కనీసం ఒక పది మంది అమ్మాయిలు సెల్లు చెవికి తగిలించుకుని అదేదో లోకాలలో తేలిపోతూ నేలకు ఒక్క అర ఇంచీ ఎత్తులో నడుస్తు అడ్డ దిడ్డంగా వెలుతుంటారు. ఒక భారీ ట్రక్కు వారికి పది ఇంచీల దూరంగా బ్రేకు వేసి ఆగినా కూడా కనీసం చూడని సంఘటనలు నేను చూసాను. ఇక లేడీస్ హాష్టల్ అయితే సరే సరి. రాత్రి ఫోనులో మాట్లాడని అమ్మాయి ఒక బకరా టైపు కింద లెక్కట. ఇది ఫోను పిచ్చి ఉన్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను మెల్లగా కదిపితే తెలిసింది. ఇక అబ్బాయిలంటారా? వీరిదీ అదే దారి ..కాక పోతే వీరు బైకులపై మెడకాయతో సెల్లును భుజం మీద అదిమి అదో రకమైన విన్యాసం చేస్తూ ఊరంతా తిరిగేస్తుంటారు. వీళ్ళు ఊడబొడిచే ఉద్యోగాలేంటో, అంత కంగారు ఎందుకో అర్ధం కాదు.

ఈ మధ్య మనం ఫోనులో మాట్లాడే మాటల నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. టీవి సీరియల్ల మీద గుక్క తిప్పుకోకుండా మాటలు, ఆదివారం అవాక్కయిపోవడానికి చిట్కాలు, కదిలిస్తే కనక మహాలక్ష్మి మాటలు, "ఇంకా ఏంటి చెప్పు…?" అని ఒక వంద సార్లు….అక్కడ ఎండలెలా ఉన్నయి? వర్షం పడుతుందా? ఇక్కడ పడట్లా…కొన్ని సార్లు మన మాటలు వింటే మనకే నవ్వు రాక మానదు. ఇంత భారీగా మాట్లాడే చాలా మందికి ఉద్యోగాలలో కావల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అస్సలు ఉండవంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ జాడ్యాలన్నింటి వలన లాభపడుతున్నది ఎవరూ? నోకియా వారిది అగ్ర తాంబూలం…వారి విపణిలో నలభై శాతం ఇండియా లోనే అమ్ముతారంట. తరువాతి స్థానం మొబైలు సర్వీసు ప్రొవైడర్లది. వీళ్ళు కోట్లు ఆర్జిస్తున్నారు. ఒకొక్కరికి ఒక రేటు. బాగా జీతాలొచ్చే వాడికి తక్కువ బిల్లింగు…సెల్ వైపు చూడననుకునే వాడికి రకరకాల జీవిత ప్లానులతో మంగళ సెల్లు మెడకు కట్టెయ్యటం. తరువాత స్థానం టీవీలది. ప్రస్తుతం ఉన్న అతి చెత్త మీడియా ఇదే. పత్రికలలా లేఖలు రాయనివ్వరు, ఈమెయిల్లు ఉండవు. ఏది చెప్పాలన్నా అది SMS మాత్రమే చెయ్యాలి. ఈ SMS ల బిజినెస్ సామాన్య మానవుడుకి ఇంకా అర్ధం కావటం లేదు. అయితే గుండెలు బాదుకుంటాదు. కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి కార్యక్రమాలలో విజేతకు ఇచ్చే కోటి రూపాయలు టీవీ వారికి ఒక్క నెలలో SMS ల ద్వారానే వచ్చేస్తాయి. మిగిలినదంతా మనం అమితాబు, షారుక్ ల కోసం ధార పోస్తామన్న మాట.

ఇక ఈ సెల్ రోగాన్ని కొద్దిగా తగ్గించుకుని బాగు పడటం ఎలా?

  1. "ఇంకా ఏంటి చెప్పు…" అని ఎప్పుడయితే మొదటి సారి మీ నోటంట గానీ, అవతలి నుంచి గానీ వచ్చిందో అప్పుడే అవసరం అయిన మాట్లన్ని అయిపోయినట్లు. అయితే ఇక ఉంటా, తరువాత మాట్లాడుదాం అని సున్నితంగా ఫోను పెట్టెయ్యటం మంచిది.
  2. ఫోను మోగ గానే గాభరాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తి మాట్లాడటం తగ్గించుకుని, కాస్త నెమ్మదిగా నెంబరు చూసుకుని మాట్లాడటం మంచిది. ఒకరనుకుని మరొకరితో మాట్లాడటం చాలా ప్రమాదకరం.
  3. బైకుపైన గానీ, క్లాసులో గానీ, మీటింగులలో గానీ చస్తే ఫోను ముట్టుకోనని ఒట్టేసుకోవాలి. దగ్గరి వారు పదే పదే చేస్తే, బైకు ఒక పక్కకు మెల్లగా ఆపి మీరు ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నారో వెంటనే చెప్పాలి. అవతలి వ్యక్తి విషయం పెద్దగా అవసరం కానిది అయితే మిమ్మలని రోడ్దు మీద మాట్లాడమని కోరడు. చాలా మంది ముందు జాగ్రత్తగా "ఎక్కడున్నావు" అని అడుగుతారు. ఇది చాల మంచి పద్ధతి. మీరు ఫోను చేసిన వ్యక్తి మీ ఫోను వలన బైకుపై వెళుతూ మాట్లాడడం వలన ప్రమాదం జరిగి దుర్మరణం పాలయితే తట్టుకో గలరా? ఆలోచించండి.
  4. ఖాళీ సమయాలలో ఫోనుతో ఆటలాడటం తగ్గించాలి. వీలయితే పుస్తకాలు చదవండి. అవి మెదడును యుక్త వయస్సులో ఉంచుతాయి. ఊసుపోక ఎవరికో కాల్ చెయ్యటం, SMS చెయ్యటం అనేవి మరీ చిన్న పిల్లల లక్షణాలు. అవి ఆపుకోవాలి.
  5. వంద రకాల పనులు చేసే సెల్ ఫోను కొనేటప్పుడు, అసలు మనం ఆ పనిముట్లనీ వాడతామా? అని ఆలోచించాలి. ఈ రకమైన సెల్ ఫోన్ల వలన ఎక్కువగా ఎవరికైనా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది.
  6. ప్రతి నెలా సెల్ ఫోనుకు ఒక ఖచ్చితమైన బడ్జెట్ పెట్టుకోవాలి. అది దాటుతుంటే ఒక సారి మన వాడకం ఎలా ఉందో చూసుకోవటం మంచిది.
  7. ప్రతీ చెత్త టీవీ ప్రోగ్రాములకూ SMS లు పంపటం మానండి. అవన్నీ లాటరీని అందంగా ఒక టీవీ ప్రోగ్రాములా మలచి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారాలు. ప్రభుత్వానికి అది అర్ధమయ్యేలోపు మన జేబులు ఖాళీ. గృహిణులు ఎక్కువగా ఈ పని చేస్తుంటారు.
  8. టీవీలలో "మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగే ప్రశ్నలకు SMS వ్యాఖ్యలు పంపేటప్పుడు ఒక్క సారి ప్రశ్నను గమనించండి. చాలా ప్రశ్నలు మనలోని సున్నితమైన భావాలను గుచ్చుకునేలా, ఉద్రేకపడేలా తయారు చేస్తారు. ఎంత ఎక్కువ మంది ఉద్రేకపడితే అన్ని ఎక్కువ SMS లు, అంత ఎక్కువ లాభం అన్న మాట.
  9. పదే పదే మిస్డ్ కాల్ల్స్ చేసి ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు. వారి ఏకాంతానికి, జీవితానికి మీరు భంగం కలిగించినట్లవుతుంది. అత్యవసరం అయితే తప్ప ఇలా చెయ్యకూడదు.
  10. ఆఖరుగా సెల్ ఫోనును ఒక సెల్ ఫోనులానే వాడాలి, అంతే గానీ, మన గళానికి, చెవులకు ప్రధమ ప్రతినిధిగా పదవోన్నతి ఇస్తే అంతే సంగతులు. జీవితాన్ని మన చేతులలోకి తీసుకోవాలంటే సెల్ ఫోన్ ని కాసేపు కింద పెట్టక తప్పదు. అందులో తప్పేమీ లేదు. అందమైన జీవితం కావాలా? అందమైన సెల్ ఫోన్ కావాలా? తేల్చుకోండి మరి.

Saturday, February 10, 2007

అప్పుడు యుద్ధమే ఉండదు కదా ప్రభూ !

ఈ రోజు ఎందుకో మౌల్వీ నసీరుద్దీన్ గుర్తొచ్చాడు. అతని జోకుల్లో నాకిష్టమైనది ఒకటి

తైమూరు ప్రభువు భారీ సైన్యంతో ఇతర రాజ్యాల మీదకు దండ యాత్రకు బయలు దేరాడు. నసీరుద్దీన్ ని కూడా పిలిచి యుద్దానికి బయలు దేరమన్నాడు. ఆ మాటతో నసీరుద్దీన్ కు కాళ్ళు, చేతులు వణకడం మొదలయినాయి. కానీ కాదంటే తల తీయించే మూర్ఖ ప్రభువు తైమూరు. అందువలన నోరు మూసుకుని బయలు దేరాడు.

తన కుంటి ముసలి గాడిద మీద ఠీవిగా కూచుని వచ్చాడు. అది చూసి తైమూరు నవ్వాపుకోలేక పోయాడు.

అబ్బో గాడిద మీద ఇంకో గాడిద యుద్ధానికి బయలు దేరటం నేను ఇదే మొదటి సారి చూడటం అని జోకాడు.

ఆ మాటకు నసీరుద్దీన్ సిగ్గుతో ఏదో మీ దయవలన రాజ్యంలో గాడిదలకు కొదవలేదు ప్రభూ అన్నాడు.

తైమూరు…అది అర్ధం చేసుకోలేక…నవ్వుతూ..సరే…బాగానే వచ్చావు..విల్లొక్కటే ఉంది….మరి బాణాలేవి ? అన్నాడు.

బాణాలెందుకు ప్రభూ…శత్రువులు వేసిన బాణాలే అందుకుని వాటినే వారి మీదకు ఉపయోగిస్తా..అన్నాడు నసీరుద్దీన్.

అవాక్కయిన తైమూరు…"మరి శత్రువులు బాణాలే వెయ్యకపోతే?" అన్నాడు తెలివిగా …దొరికాడు వెధవ ఆనందంగా అనుకుంటూ..

ఏముంది ప్రభూ…అప్పుడు యుద్దమే ఉండదు కదా….నాకిక బాణాలేసే పని ఏముంటుంది?

తైమూరు : ‍%$#$#@%^&^%&6%#@!@#$.....

Friday, February 09, 2007

అమెరికా : ఎదర వారికి చెప్పేందుకే నీతులు

అందరికి నీతులు చెప్పే అమెరికా తన దగ్గరికి వచ్చే సరికి మాత్రం ఈ విధంగా ప్రవర్తిసుంది.

ఇది చదవండి.


బయటి దేశాలలో అమెరికన్ పౌరులు మాయమైతే అమెరికా చేసే గలాటా అందరికీ తెలిసిందే.

బిగ్ వజ్రోత్సవాలు...పోల్ ఫలితాలు

వజ్రోత్సవాల హడావిడి కాస్త తగ్గు ముఖం పట్టింది. అందువలన దానిపై పెట్టిన పోల్ ని ఆపేస్తున్నాను. ఇప్పటి వరకూ 48 వోట్లు పోలయ్యాయి. ఫలితాల ప్రకారం చాలా మందికి మోహన్ బాబే పెద్ద విలన్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇవి కేవలం 48 మంది వెలిబుచ్చిన అభిప్రాయాలని గమనిక.

big

Thursday, February 08, 2007

అమెరికాలో భారతీయ అనుభవం - 2

అమెరికాలో భారతీయ అనుభవం - 1 ముందర చదవండి.

నిజం చెప్పుకోవాలి…చార్లెస్ డీ గాల్ విమానాశ్రయం చాలా గందరగోళంగా ఉంది. సెక్యూరిటీ స్టాఫ్ చాలా రఫ్‍గా వ్యవహరించటం, అస్సలు వారికి ఇంగ్లీష్ రాక పోవటం ప్రయాణీకులకు చిరాకు తెప్పించి వారి మీద విరుచుకు పడటంతో వారు కొద్దిగా తగ్గారు. మర్యాదగా దారి చూపించారు. ఏదో ఒక రకంగా మరలా చెక్ -ఇన్ అయ్యాననిపించి న్యూయార్క్ వెళ్ళే విమానం ఎక్కా…

 

పక్క సీట్లో ఒక ఫ్రెంచి ముసలతను. ఒక్క ముక్క ఇంగ్లీషు రానట్టుంది. సైగలతో మొత్తానికి తను న్యూయార్క్ వెళుతున్నానని చెప్పాడు. ఆ సైగల భాషతో అలసి పోయి ఇక నిద్ర పట్టేసింది. నిద్ర లేచే సరికి కమ్మని భారతీయ చికెన్ బిరియాని అందించారు. ఔరా ఎయిర్ ఫ్రాన్సు అనుకున్నా…

 

కత్తిరిస్తే…జె.ఎఫ్.కె విమానాశ్రయం. ఇక్కడే మొదలయింది మన పార్వతీశం స్థాయి తమాషా. న్యూయార్క్ నాకు పోర్టు ఆఫ్ ఎంట్రీ కాబట్టి, అమెరికన్లు అసలు నేను వారి దేశానికి ఎందుకు విచ్చేయాల్సివచ్చింది? ఎప్పుడు దయ చేస్తారు? వగైరా ప్రశ్నలు ఆడుగుతారన్న మాట.

నా దగ్గర కేవలం ఒక బ్యాక్ ప్యాక్ సంచి మాత్రం ఉంది. దానిలో ఏమున్నాయో తెలుసుకదా? బెదురూ, తత్తరపాటు కనిపించకుండా నిర్లక్ష్యంగా లైనులో నిలబడ్డాను. పాస్‍పోర్టు, వీసా పరిశీలించి రెండు మూడు ప్రశ్నలు వేసిన తరువాత వదిలాడు. ఇక అక్కడి నుంచి మనం అమెరికాలో కాలు పెడతామన్న మాట. నేనైతే సిన్‍సినాటి (ఒహియో) వెళ్ళే విమానం అందుకోవాల్సి ఉంది. మెల్లగా పోయి సెక్యూరిటీ చెక్ దగ్గర నిలబడ్డాను. అన్ని రకాల ఎక్స్ రేలు తీసాక, నీ లగేజి ఏది? అన్నాడు. వాడికి నా బ్యాగ్ ఇచ్చా. ఒక్క నిమిషం అర్దం కాలేదు. ఇదొక్కటేనా అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ప్రపంచంలో ఎవడూ నాలుగు పేపర్లు, బ్రష్షు, పేస్టూ సరంజామా మాత్రమే పట్టుకుని విమానం ఎక్కడు కదా…:-) నేను జరిగిన కధంతా చెప్పాను. అక్కడ నేను తప్ప మిగతా లగేజీ బాధితులెవ్వరూ లేరు. చాలా మంది అట్లాంటా వేళ్ళేవారు. వాడు నన్ను కాసేపు అక్కడే ఉండమని చెప్పి వాడి బాస్ దగ్గరకు పోయి చెప్పాడు. కాసేపు ఫోన్ కాల్స్, కంప్యూటర్లో ఏవో చెక్ లు చేసి నిర్దారించుకున్నాడు. విచిత్రం ఏమిటంటే లగేజీ లేని ఒక విమానం వచ్చినట్లు డెల్టా న్యూయార్క్ వారికి కూడా అప్పుడే తెలిసిందంట. బతుకు జీవుడా అనుకుని నా తరువాతి విమానం చేరుకోవటానికి బయలుదేరా. ఒక కిలో మీటరు నడిచాకా నాకు కావల్సిన గేట్ నంబరు కనిపించింది.

 

అక్కడికి చేరుకున్నాక నేనక్కాల్సిన విమానం ఇంకొక మూడు గంటల తరువాత అని తెలిసింది. ముంబయిలో ఆలస్యం నన్ను అలా వెంటాడుతూ ఉందన్న మాట. చుట్టూతా కాసేపు అమెరికాని ఆరాధనగా చూసి, అమెరికన్లను విచిత్రంగా చూసి, ఒక అరగంట తర్వాత ఈ లోకంలోనికి వచ్చాను. భారతానికి ఒక కాల్ చేస్తే ఎలా ఉంటుంది అని చుట్టూ చూసా. దూరాన ఎర్రని ఫోను పెట్టెల్లాంటివి కనిపించాయి. పోయి చూస్తే ఇంకేముంది? అవి క్రెడిట్ కార్డుల ద్వారా పని చేసే ఫోనులు. కాసుల ఏర్పాటు కూడా ఉన్నట్టుంది. నా HSBC కార్డుతో ప్రయత్నించా. ఉహూ లాభం లేదు. పని చెయ్యటం లేదు. పర్సులో చూస్తే అన్నీ 50, 100 డాలర్ల నోట్లే ఉన్నాయి. చిల్లర ఎందుకు తేలేదురా బాబు అని తిట్టుకుని, మన పక్క భారతీయ పద్ధతిలో (…సార్ చిల్లరుందా అనే మొదటి ట్రిక్కు అమెరికాలో పని చెయ్యదనిపించింది) ఏదైనా కొనటం ద్వారా చిల్లర కోసం ప్రయత్నం చేసాను. బాగా పరిశీలించి ఒక కోక్ కొనుక్కుని మొత్తానికి చిల్లర సంపాదించాను. తరువాత మెల్లగా కోక్ చప్పరించా…అంతే ఎక్కడైనా బయటకు ఉమ్మాలనిపించేలా ఉంది ఆ కోక్. తమాయించుకుని ఆ బాటిల్ ని పరిశీలనగా చూసాను. అప్పుడే నాకు తెలిసింది. కోక్ లో వెనిల్లా కోక్ (ఇది ఇండియాలో అట్టర్ ఫ్లాప్ డ్రింకు) అనేది ఒకటుంటుందనిన్ను, దానిని కొనుక్కుని నేను ఒక మేక అయిపోయాననిన్నూ, చచ్చినట్లు అదిప్పుడు తాగాలనిన్నూ అర్ధం అయ్యే సరికి నా చుట్టూ ఉన్న అమెరికా పగలబడి నవ్వుతున్నట్టనిపించి చుట్టూతా చూసా. కానీ ఎవరి గోలలో వారున్నారు.

-సశేషం

Tuesday, February 06, 2007

తెలుగు బ్లాగు దెబ్బలు

రాముయో : ఒరే సోముయో ఈ బ్లాగు, కూడలి ఇవన్నీ ఏమిట్రా (ఏడుపు మొహంతో)

సోముయో : ఏం ఎందుకడుగుతున్నావ్? అరె.. ఏరా ఆ ఒళ్ళంతా దెబ్బలేంది. ఏమయింది.

రాముయో : ఆ గీతాని గత పది రోజుల నుంచి లైన్ వేస్తున్నానా?

సోముయో : అవును…అందుకని ఇలా నిన్ను పోలిసులతో కొట్టించిందా (కోపంగా)

రాముయో : లేదురా, గీతకొక అన్న ఉన్నాడు. వాడు ఇప్పటికి నాకు ఆరు సార్లు వార్నింగులు ఇచ్చాడు. అవి నేను లెక్క చెయ్యటం లేదని చితక బాదాడు..ఆబ్బా..

సోముయో : ఒరేయ్ మరి వాడలా వార్నింగులు ఇస్తే , జాగ్రత్తగా ఉండాలి కదరా…ఎందుకు ఆ అమ్మాయి వెనక పడ్డావు.

రాముయో : వాడు…..వాడి తెలుగు బ్లాగులో వార్నింగులు ఇచ్చాడంటరా, నాకెట్టా తెలుస్తుంది…వా….వా….వా. క్షమాపణ కూడా అదేదో వ్యాఖ్యలలో చెప్పాలంట. లేక పోతే రెండో కోటింగు ఉంటాదంట...వా...వా..

సోముయో : ఆ !

Monday, February 05, 2007

గోల్కొండ అందాలు

 

ఆఖరి వారం స్నేహితులతో సరదాగా గోల్కొండ వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు పై సంచికలో పెట్టాను.  

నేను గోల్కొండ వెళ్ళడం అదే మొదటి సారి. ఎంతో ఊహించుకున్న నాకు గోల్కొండ దుస్థుతి చూసి బాధ వేసింది. ఎక్కడ పడితే అక్కడ చెత్తా, చెదారం, అతి అపురూపంగా ఉంచుకోవాల్సినా గోడలపై ఐ లవ్ యూ రాతలు. మన దేశంలో ప్రేమ ఎక్కువో, పోయేకాలం ఎక్కువో అర్ధం కాదు. ఇదే గోల్కొండ స్పెయిన్ లోనో, బ్రిటన్ లోనో ఉంటే దానిని అద్భుతంగా తీర్చి దిద్ది భారీగా టికెట్టు కూడా పెట్టే వారేమో. చాలా విచిత్రంగా మన గోల్కొండ టికెట్టు కేవలం ఐదు రూపాయలు.


ఉండేది చెత్తా చెదారమయినా, అందాల ఫోజులకు ఏమీ తీసి పోనంది గోల్కొండ. చూసి ఆనందించండి. :-)

Sunday, February 04, 2007

అమెరికాలో భారతీయ అనుభవం - 1

ఈ మధ్యనే కొంత మంది మిత్రులతో వారి అమెరికా అనుభవాలు పంచుకుంటుంటే నా మొదటి అనుభవం కూడా గుర్తుకొచ్చింది. బారిష్టరు పార్వతీశం లా కాక పోయినా నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అది. తప్పక బ్లాగాల్సిన విషయం కూడా….

ఐదు సంవత్సరాల క్రితం. అది నాకు మొదటి సారి అమెరికా ప్రయాణం. కాబట్టి చాలా ఉత్సాహంగా ముంబయి విమానాశ్రయంలో చెక్-ఇన్ అయిపోయాను. రెండు వెర్రి ప్రశ్నలు వేసి ఎంబార్కేషన్ లో ఒక స్టాంపు వేసి ఇక పో మళ్ళీ రాకు అన్నట్ట్లుగా నిర్వికారంగా చూసాడు మన తోటి భారతీయుడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఎగరాల్సిన డెల్టా గాలి మార్గాల వారి విమానం చల్లగా తెల్లవారు ఝామున నాలుగు గంటలకు బయలు దేరింది. విమానం ఎక్కాక బిజినెస్ క్లాసులో(అప్పటి కంపనీ వారి దయ) సీటు వెతుక్కుని కూర్చున్నాక విమాన సేవిక చల్లగా చావు కబురు చెప్పింది. అదేమిటంటే ఆ విమానంలో సామానులు ఉంచే గదిలో అగ్ని మాపక వ్యవస్థ పని చేయనందున సామాను మొత్తం మరుచటి రోజు విమానంలో వచ్చును. అది ఇష్టం లేని వారు దిగి ఆ విమానం లో రావచ్చు లేదా, అందరు ఒప్పుకుంటే ప్రస్తుత విమానం రద్దు చేయబడును అని. వెంటనే ప్రయాణీకులు హాహాకారాలు మొదలు పెట్టారు. ఒకతను వాషింగ్టన్ లో జరగబోయే ఒక రోజు సెమినార్ కు వెళ్తున్నాడు. అతను వెర్రిగా చూశాడు. నా లగేజీ అమెరికా వచ్చే సరికి నేను ఇండియా బయలు దేరిపోతాన్రా బాబు అని. ఇలా రక రకాల గోలల తరువాత చాలా మంది విమానం బయలు దేరటానికి ఓటు చేసి టైమే మాకు ప్రధానం అని తేల్చి చెప్పేసారు. నా కేబిన్ లగేజిలో కేవలం పాస్ పోర్టు, వీసా, బ్రష్, పేస్టు వంటివి, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే వున్నాయి. నేను అవి తలుచుకోగానే బుర్ర దిమ్మెక్కింది. సరే ఒక్క రోజే కదా అని హాయిగా కూర్చున్నా.

చాలా గంటల ప్రయాణం తరువాత ప్యారిస్ ఛార్లెస్ డీ గాల్ విమానాశ్రయంలో దిగాం. తెల్ల వారు ఝామున మసక మసకగా ఉన్న వెలుతురులో పూర్తిగా తెల్లని మంచులో కప్పబడి ఉంది ఆ ప్రేమ నగరం, ఫ్యాషన్ రాజధాని.

త్వరలో తరువాయి భాగం…..

Friday, February 02, 2007

యాహూ....ఇక తెలుగులో :-)

http://in.telugu.yahoo.com కు సుస్వాగతం :-)

యమ్.యస్.యన్ తెలుగు తరువాత యాహూ కూడా తెలుగు ప్రపంచంలోకి అడుగిడింది. ఇక రెడిఫ్, గూగులు వంతే తరువాయి.

తెలుగు సినిమా వజ్రోత్సవాల సైడ్ ఎఫెక్టులు

పుణ్యానికి పోతే…ఏదో అన్నట్లు కోట్లు పెట్టినా కూడా తెలుగు సినిమా వజ్రోత్సవాలు అన్ని స్థాయిల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు విమర్శలు, తిట్లు తెచ్చి పెట్టాయి. తాతకు నేర్పకండి దగ్గులు అన్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఎగుడు, దిగుడుకు సాక్షులైన ప్రేక్షకులూ చిరాకు పడుతున్నారు. మన సినిమాల మహత్యం గురించి మనకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది? . అదీ కాక కె.యస్.ఆర్ (ఏంటో ఇలాంటి పేర్లున్న వారికి నోటి దురద ఎక్కువనుకుంటా) పత్రికల మీద నోరు పారేసుకోవటం. అంత కంటే తేనె తుట్టలో నోరు పెట్టి తేనె తాగటం సులభం. ఏది ఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమ నిజాయతీగా తన రోగాన్ని బయట పెట్టుకుంది. ఈ సందర్భంగా అందరూ (టీవిలలో, పత్రికలలో, బ్లాగులలో) అనుకుంటున్న విషయాలు…

గత డభ్భయి ఐదు వత్సరాలలో

౦౧. సినిమా : విలువలు (కుటుంబ, నైతిక, చట్ట, వినోద పరమైన) నాశనం అయిపోయాయి. సుమోలలో కత్త్లులు తిప్పతూ రోడ్లపై వెళ్ళటం, తల అడ్డంగా నరికెయ్యటం (పాతాల భైరవిలో దృశ్యానికి ఇప్పటికీ ఎంత తేడా? ). వికలాంగులపై జోకులు, శారీరక అవస్థలపై జోకులు, ప్రాంతీయ యాసలపై జోకులు ..ఓహ్ ఒకటేమిటి…అంతా కలపి చూస్తే మన సినిమా దేహం ఒక అష్టావక్ర అని చెప్పుకోవచ్చు.

౦౨. హీరోలు : కధ కాకుండా, పాత్రలు హీరోలు గా మారారు. హీరో గారి కధే సినిమా…వారికి కధ నచ్చాలి. అది అరువు తెచ్చుకున్న కధ అయితే మన హీరో గారి ఇమేజ్‍ని బట్టి కోతలు, కత్త్రిరింపులూను. ఆఖరికి పాటలు, హీరోయిన్ కూడా హీరోకి నచ్చాలి. ఇవన్నీ కాక కొంత మంది ఈ మధ్య దర్శకుడి పనుల్లో వేలు పెడుతున్నారంట. ఈ మధ్య వచ్చిన ఒక అగ్ర కధానాయకుడి రష్యన్ కమ్యూనిష్టు నాయకుడి పేరుతో వచ్చిన సినిమాకూ ఇదే గతి పట్టి, దర్శకుడు మధ్యలోనే పెట్టే, బేడా సర్దుకుని చెన్నయి చెక్కేసాడంట. తెలుగు సినిమా వజ్రపు హీన స్థాయికి వీరు చేసిన కృషి అనన్యం.

౦౩. హీరోయిన్లు : బజారు స్థాయికి దిగ జారారు. ఇది దర్శకుల అభిరుచికి పరాకాష్ట. ప్రేక్షకులు అలా కోరుకుంటున్నారనే వాడిని చెప్పుచ్చుకు కొట్టొచ్చు. వీరి పాత్రలకు కమెడియన్ కు ఉండే ప్రాధాన్యత కూడా ఉండదు. వస్తారు…హీరో వెనక పడతారు (కొన్ని సినిమాలలో అయినా విపరీతమైన కోరికలు, వికారమైన పాటలతో)…నాలుగు పాటలు….కట్ అయిపోయింది వీరి పాత్ర. తెర బయట కూడా వీరి జీవితాలు కుక్క జీవితం. సార్ అని ఎవరినైనా పిలవకపోతే ఇంటికే….నాకు తెలిసిన ఒక అసిస్టెంటు కెమరామన్ చెప్పిన ప్రకారం అయితే మనసున్న (ఆత్మాభిమానం) మనిషి ఎవరూ తెలుగు సినిమాలో హీరోయిన్ గా చెయ్యలేరు. అందుకే ఇందులో తెలుగు హీరోయిన్లు అతి కొద్దిగా ఉన్నారు.

౦౪. దర్శకులు : పాపం వీరి బాధలే వేరు. చాలా మంది దర్శకులు ఇప్పటికీ మంచి అభిరుచి ఉన్నవారే. కానీ వారిని దర్శకత్వం చెయ్యనిస్తే కదా? ఒక పేద్ద హిట్ కొడితే గానీ పెద్ద హీరోలు దగ్గరికి కూడా రానివ్వరు. ఒక్క శ్రీహరి మాత్రం ఈ విషయంలో చాలా మంచి వ్యక్తి అని విన్నాను. ఇప్పటి హీరోలకు ఉన్న పరాజయ భయాలకు ముఖ్యంగా బలవుతున్నది దర్శకులే. అందరూ రామ్ గోపాల్ వర్మలా చెయ్యలేరు కదా? వీరిలో కొంతమంది పళ్ళు, పువ్వులకు ప్రసిద్ధి, కొంతమంది కత్త్లులు, కటారులకు ప్రసిద్ధి. ఇలా రకరకాలుగా ఈ శాఖ అభివృద్ధి చెందింది. పాత దర్శకుల వరకూ ఎందుకూ, ఇప్పటి దాసరితో కూడా సరిపోలరు కొంతమంది.

౦౫. నిర్మాత : సొమ్మొకడిది, సోకొకడిది అనే సామెతకు అర్ధం పరమార్దం తెలుగు పరిశ్రమలో ఏ నిర్మాతనైనా అడగండి. ఆగకుండా అరగంట చెప్తాడు. సినిమా మొదలు పెట్టేదీ, చేతిలో కొంగు పట్టుకుని సిద్ధంగా ఉండేది వీరే అయినా, వీల్లకు సినిమామీద ఏమీ పట్టు ఉండదు. హీరో గారు గోదావరి వద్దు, మిసిసిపి ఒడ్డులో పాట ప్రెస్టేజియస్ తీద్దామంటే…ఓ అంతకన్నా భాగ్యమా అని టికెట్లకు డబ్బులు ఇవ్వటమే ఇప్పడు వీరి పని. చాలా కొద్ది మంది నిర్మాతలు మాత్రమే 'అభిరుచి' కలిగి ఉన్నారు.

౦౬. సంగీత దర్శకులు : గర్వ పడే స్థాయి నుంచి సంతోషపడే స్థాయికి వచ్చాం. ఇంకా దిగ జారలేదు. సంగీతానికి బాషతో సంబంధం లేదు కాబట్టి, తప్పని సరిగా ప్రతిభ ఉండాలి కాబట్టి మనం బ్రతికి పోయాం. బాధ పడాల్సినదేమిటంటే హోరు పెరిగింది, పాటలలో సాహిత్యం (ఉంటే) వినబడనివ్వటం లేదు. సాహిత్యాన్ని సంగీతం ఓడించడం అంటే ఇదే. అచ్చు పిల్లి (కాపీ క్యాట్) సంగీతం బాగా పెరిగింది. అదేదో మహా సంగీతం అన్నట్లు డాల్బీలు, డీటీయస్ లు, లండన్ లో రికార్డింగు. పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా అవసరం అయితేనే డీటీయస్ మిక్స్ చేస్తారు. మనకు మాత్రం అది డీఫాల్ట్.

౦౭. గాయక బృందం : మంచి నైపుణ్యం గలవారు ఉన్నారు. బాలు, జానకి, సుశీలలు ఇప్పటికీ మనం గర్వపడవలసిన గాయకులు. అయితే గాయక, గాయకీమణులు కూడా చిత్ర పరిశ్రమ వికృత పోకడలకు తలవంచి బూతు పాటలు పాడుతున్నారు. పాడనని మొండికేస్తే మొత్తం సినిమా పరిశ్రమ వారిని నిషేధించినా ఆశ్చర్యం అక్కరలేదు. వచ్చిన డబ్బు కూడా పోతుంది. జాతీయ అవార్డులు సాధిస్తారని ఆశలు పెట్టుకుంటే వీళ్ళ మీదే పెట్టుకోవాలి.

౦౮. ప్రతినాయకులు : పాత్రలకు కొద్దిగా న్యాయం చేస్తున్నది వీరే. కొన్ని సార్లు అనిపిస్తుంది…విలన్ పాత్రధారి ఆ పాత్రకు సరిపోయినట్లుగా హీరో సరిపోలేదు అని. ప్రకాష్‍రాజ్ వంటి ప్రతిభాశాలులు ఈ పాత్రలకు వన్నె తెచ్చారు. సత్యన్నారయణ, కోట వంటి వారు కొత్త ట్రెండుని సృష్టించారు. రావు గోపాలరావు గారి తర్వాత అంతమయి పోయిందనుకున్న ఈ శాఖ ప్రతిష్టను నిలబెట్టారు.

౦౯. హాస్య నటులు : ప్రతిభ అయితే పుష్కలం. కాకపోతే వీరిని చిత్ర దర్శకులు, మాటల రచయతలు జుగుప్సాకరంగా ఉపయోగించుకుంటున్నారు. వీరికి చిత్ర కధతో సంబంధం కూడా ఉండదు. ఈ మధ్యనే కొన్ని మంచి సినిమాలలో హాస్య నటులను బాగా ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలు.

ఆనంద భారతి

హమ్మయ్య చాన్నాళ్ళకు కేంద్రం ఒక మంచి పని, అదీ క్యాపిటల్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ చేసింది. ఇకనుంచి ఏ  కంపనీ

అయినా ఎన్ని కోట్లు పెట్టి కొన్నా, వారు ప్రసారం చేసే అన్ని భారత్ ఆడే క్రికెట్ మ్యాచులు, భారత్ లో జరిగే క్రికెట్ మ్యాచులు ప్రసార వాహికను ప్రసార భారతికి తప్పని సరిగా ఇవ్వాలి. ఆ విధంగా కేంద్రం ఒక ఆర్డినెన్సు జారీ చెయ్యటం ముదావహం.

టీమ్ మనది….

పిచ్చిగా అభిమానించి, క్రికెటర్లను దేవుళ్ళు చేసి, క్రికెట్ ను కాసులు కురిపించే ఆటగా మార్చేసిన అభిమానులు మన వాళ్ళు….

క్రికెటర్లు రక రకాల ప్రకటనలలో కనిపించి నేను అది వాడతా, ఇది వాడతా, ఇది నా సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ …మీరు వాడంది అని చెప్పేదీ మనకే….

ప్రసార భారతి మనది...

ఆడే స్టేడియాలు మనవి...

మహా మాయగాడు జగ్మోహన్ దాల్మియా పుణ్యాన బీ.సి.సి.ఐ ఈ రోజు ఇవన్నీ విస్మరించి ప్రసార హక్కులు (నిజానికి చూసే భారత అభిమాని హక్కులు) ఒక పాశ్చాత్య మీడియా కంపనీకి కట్టపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. వారు మొండిగా దేశంలో 2% కూడా చూడని NEC sports అనే ప్రసార వాహికలో ప్రసారం చెయ్యటం ఇంకా విడ్డూరం. ఇదొక రకమైన నూతన స్వేచ్చా దోపిడి అన్న మాట.

మన దేశం వచ్చి, మన వాళ్ళు ఆడే ఆటను, మన ప్రసార భారతికి, మనకు ప్రసారం చెయ్యటానికి నిబంధనలు, ఆంక్షలు పెట్టడం…

ఇలాంటివి ముందు ముందు ఏ రంగంలోనూ జరగకుండా భారతీయులు జాగ్రత్త పడాలి. లేకపోతే వేల కొద్ది ఈస్టిండియా కంపనీలు ఇండియాలో తిష్ట వేస్తాయి, తమ పరపతితో పార్టీలను, ఎం.పిలను కొనటం మొదలు పెడతాయి. ప్రజల బతుకు బానిస బతుకై పోతుంది.

బహు పరాక్.

Thursday, February 01, 2007

అపరిచిత శునకం

ఈ విచిత్రమైన కుక్క నాకు కొన్ని సరదా ఈ-మయిల్లలో వచ్చింది. ఇది అపరిచితుడు స్టయిల్ అన్న మాట...ఇక దాని డైలాగ్ ల గురించి నన్ను అడగవద్దు....వీలయితే శంకర్ నే అడగండి. :-)

aparichurhudu

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name