Thursday, March 29, 2007

గ్రహాంతరవాసులు - క్రికెటాట

toondoo.com అనే అతి చల్లని (cool) వెబ్ సైటు మనకు అతి సులభంగా వ్యంగ్య చిత్రాలు చేసుకునే సదుపాయం ఇస్తుంది. నా మొదటి కార్టూను ఇలా ఏడిసింది :-)

alien cricket

Tuesday, March 27, 2007

కదులుతున్న క్రికెట్ డొంక..సంచలనాత్మక SMS

ఫ్లాష్ న్యూస్ : సీ.యన్.యన్ ఐ.బి.యన్ లైవ్ వారు ఇప్పుడే సమర్పించిన వార్త కదంబం (లైవ్) సంచలనాత్మక విషయాలను బయట పెట్టింది.

వారి ప్రకారం…

గ్రెగ్ ఛాపెల్ ఒక బాంబు లాంటి SMS ను సీనియర్ క్రికెట్ పాత్రికేయుడు రాజన్ బాలా కు పంపాడు…అది చాలా కొత్త విషయాలను, BCCI లో లుకలుకలను బయట పెడుతోంది. అందరూ గ్రెగ్ ఛాపెల్ మీద మండి పడటం సహించలేని రాజన్ బాల ఆ SMS ను బహిర్గతం చేసారు.

అందులోని కొన్ని విషయాలు…

  • గ్రెగ్ ఛాపెల్ సీనియర్లు (సచిన్, సౌరవ్, ద్రావిడ్, సెహ్వాగ్) లను ఇంటికి పంపమని పోరుతూనే వున్నాడు.
  • మీడియా భయంతో BCCI అందుకు అంగీకరించలేదు
  • సురేశ్ రైనా తప్పని సరిగా వుండాలని ఛాపెల్ పట్టుబట్టాడు
  • సురేశ్ రైనా వుండటం BCCI కి ఇష్టం లేదు
  • సెహ్వాగ్ వుండి తీరాల్సిందే అని ద్రావిడ్ పట్టు పట్టాడు (కరణ్ థాపర్ తో వెంగ్ సర్కార్)
  • కార్తీక్ ను తీసుకోవాలని ఛాపెల్ కోరాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు వున్నాయని అలా కోరాడు
  • సచిన్ వైస్ కెప్టెన్ అవ్వటం ఛాపెల్ ను విస్మయ పరిచింది. సచిన్ కెప్టెన్ గా పూర్తిగా విఫలం చెందిన రికార్డ్ వుండటం అందుకు కారణం.
  • సీనియర్లు, యువ క్రికెటర్లను వరల్డ్ కప్ టీమ్ లోనికి ఎంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
  • ఛాపెల్ రాజన్ తో : మీరన్నట్లు యువరాజ్ ను తీసుకోవటం ఒక రిస్క్. అతడు తననొక స్టార్ క్రికెటర్ గా భావించుకుంటాడు. అతను ఒక ఎదుగుతున్న క్రికెటర్ మాత్రమే.
  • రాజన్ బాల : మొహమ్మద్ కైఫ్ కు ఇండియా-A టీమ్ కెప్టెన్ గా అద్భుతమైన రికార్డులున్నాయి. అతడిని ఎందుకు పక్కన పెట్టారో అర్ధం కాలేదు.


ఇదిలా వుండగా BCCI , ఛాపెల్ విషయమై నిలువుగా చీలిందని వార్త

Saturday, March 24, 2007

భారతీయులు…క్రీడా స్పూర్థి

హమ్మయ్య ఒక పని అయిపోయింది.

  • ఇక నోరు తెరుచుకుని TV చూసే పని తప్పింది.
  • కూరలు మాడిపోయే ప్రమాదం తప్పింది.
  • గుండె పోట్లతో అభిమానులు పోయే ప్రమాదాలు తప్పాయి.
  • వెధవ పాచి పళ్ల దాసరి TV Ads అదే పనిగా చూసే పనీ తప్పింది.
  • ఆఫీసుల్లో పని మానేసి టీవీ గదిలో పని చేసే పని తప్పింది
  • లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా కాబోతున్నది.
  • మరి కొన్ని లక్షల కేలరీల శక్తి మనందరిలో ఆదా కాబోతున్నది
  • కొన్ని వేల మందికి కంటి చూపు కొద్దిగా మందగించే ప్రమాదమూ తప్పింది.

ఇన్ని మంచి పనులు జరుగుతుంటే ఈ మీడియా ఏంటో ….ఏదో ఇండియా క్రికెట్ జట్టు కలసికట్టుగా సతీ సహగమనం చేసినట్లు గోల పెడుతుంది? నిజానికి మన భారత ప్రజలకు ఈ తిట్టే హక్కు వుందా?

 

చూద్దాం !

 

మన ఉపఖండంలో మనం పట్టించుకునే ఒకే ఒక ఆట "క్రికెట్టు". అది కూడా భారత జట్టు ప్రపంచ కప్పు గెలిచాకనే ఎక్కువయింది. అసలు మనలో ఈ ఆట పట్ల నిజంగా అంత అభిమానం వుందా? లేదా విజయం పట్ల అభిమానం వున్నదా? పశ్చిమ దేశాలలో, రష్యన్ దేశాలలో తీసుకుంటే…వారు ఆటను అభిమానిస్తే అన్ని స్థాయిలలో అభిమానిస్తారు. అంటే హైస్కూలు స్థాయిలో జరిగినా ఒక రెండు వందల మంది అభిమానులు గుమిగూడుతారు. ఆ స్థాయిలో కూడా చాలా మనసు పెట్టి ఆడుతారు. నిజానికి పెద్ద పెద్ద కోచ్‍లు అందరూ అక్కడి నుంచే వస్తారు. ప్రతీ రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయి జట్టు వుంటుంది. వారికి ఎనలేని అభిమానులూ వుంటారు.

 

మన దేశంలో మిగతా ఆటలు వదిలేస్తే…క్రికెట్టుకు కూడా ఈ స్థాయి ఇంకా లేదు. రెండు రాష్ట్రాల మధ్య రంజీ మ్యాచ్ అయితే ఎంత మంది చూస్తున్నాం? మనోళ్లు అభిమానించేది ఒక స్థాయికి వెళ్లి, గ్లామర్ సంపాదించుకున్న ఆటగాళ్లనే అనటంలో సందేహం లేదు. ఈ అభిమానం ముదిరి, వెర్రిగా మారి, తరువాత హక్కుగా మారింది. నిజానికి ఇప్పుడున్న క్రికెట్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టు. అంటే వారు ప్రభుత్వం తరపున అధికారకంగా ఏమీ ఆడటం లేదు. వారికి ఒక స్వతంత్ర కార్యాలయం వుంది. అయితే మన అభిమానం వారికి ఎనలేని సిరి సంపదలు తెచ్చిపెట్టిన విషయం మాత్రం వాస్తవం. అయితే ఆ కారణంగా మనం వాళ్లని ప్రతీ వైఫల్యానికి తిట్టవచ్చా అంటే…అది మన విజ్ఞత మీద, హుందాతనం మీద ఆధారపడి వుంది. ప్రొఫెషనల్ స్థాయి క్రీడ అయిన టెన్నిస్ లో కూడా ఈ అవస్థ తప్పలేదు. మోనికా సెలెస్ వంటి అద్భుత క్రీడాకారిణి శాశ్వతంగా తప్పుకోవాల్సివచ్చింది. మన దేశంలో ఆ స్థాయి రాకూడదని ఆశిద్దాం.

 

ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణం. అందులో ఒక రోజు క్రికెట్టు అనేది శకుని జూదం లాంటింది. ఒక మేఘం కూడా ఆటలో భాగం కావచ్చు. గంటకు దాదాపు 135 మైళ్ల వేగంతో దూసుకు వచ్చే బంతి బ్యాటును తాకే మధ్య సమయం దాదాపు 2 సెకండ్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో కూడా బంతి తాలుకా వాలు, వేగం, పిచ్ స్వభావం అంచనా వేస్తూ, క్రికెట్లో వున్న పదకొండు రకాల షాట్లలో ఏది ఆడాలో నిర్ణయించుకుని ఆటగాడు సిద్ధం కావాలి. ఇదంతా ఆటగాడి నాడీ వ్యవస్థ పైన, మెదడు, రక్త ప్రసరణ పైన అత్యంత విపరీతమైన వత్తిడికి గురిచేస్తుంది…ప్రతీ బంతికి కూడా…అది కూడా కోట్ల అభిమానుల ఆశల మధ్య. ఇవన్నీ చాలక ఇప్పుడు మన అభిమానం వెర్రిగా మారితే అది మరింత ఒత్తిడిని పెంచి, స్థైర్యతను దెబ్బతీయక మానదు. కంగారూలు జగజ్జేతలవటానికి కారణం ఇదే…ఆసీయులు క్రికెట్ ని అభిమానిస్తారే తప్ప….శాసించరు. ఇళ్ల మీద దాడి చెయ్యరు.

 

వీటికి తోడు మన చెత్త మీడియా…సగం దరిద్రానికి కారణం వీళ్లే…దండలు వేసి పులులు అనేది వీరే….కాగితం పులులు అనేదీ వీరే…ఒక్క క్రికెటర్ కూడా ఇప్పటి వరకు "మన జట్టు పులుల జట్టు" అని ఎప్పుడూ అనలేదు. ఆఖరికి BCCI కూడా…ఇక మనం మీడియా గురించి మాట్లాడితే అంతు వుండదు.

 

కాబట్టి…మనం క్రీడా స్పూర్థికి ముందు పదును పెట్టుకుని…ఓడితే హాయిగా నవ్వేసి వదిలెయ్యటం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే గానీ ఏదో మన జేబు నుంచి ప్రతీ నెలా క్రికెట్ జట్టుకు ఒక పది రూపాయలు చందా కడుతున్నట్లు రెచ్చి పోయి తిట్టడం, కాల్చడం, దాడి చెయ్యటం చేస్తే అది ఈ దేశానికి భవిష్యత్తులో చాలా చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం వుంది.

Sunday, March 11, 2007

ది దోహా డిబేట్ : బి.బి.సి

ఈ కార్యక్రమం మన దేశంలో చేసివుంటే BBC ని నరకయాతనకు గురిచేసేవారు మన రాజకీయనాయకులు. ది దోహా డిబేట్స్ అనే కార్యక్రమం అరబ్ దేశాలలో BBC చేస్తున్న అత్యంత సాహసోపేతమైన చర్చా కార్యక్రమం. మహామహులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఉన్నదున్నట్లు కుండ బద్దలుకొట్టి మరీ మాట్లాడుతారు. నిన్న రాత్రి నేను చూసిన కార్యక్రమం కూడా అలానే వుంది. వీలయితే మీరూ చూడండి..

The Doha Debates (ఈ రోజు ఆదివారం మరలా 9:40 PM IST కి)

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది టిమ్ సెబాష్టియన్ (ప్రఖ్యాత BBC HardTalk నిర్వాహకులు).

ఇది చూసాక అనిపించింది...మన దేశంలో ఇంత ధైర్యంగా నిజం మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందా అని. BBC అభినందనీయురాలు.

Saturday, March 10, 2007

ప్రజాసాహిత్యం అంటే ఏమిటి? కాస్త చెప్పండీ...

ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను. అందులో చెప్పిందేమిటంటే రచయతలు "ఇజాలలో" పడి పాళీల ములుకులు వంకర చేసుకుంటున్నారని. ఒకటే మూసలో రాసేస్తూ, ఒకటే కోణం నుంచి చూస్తు రాయటం అన్న మాట. ఉదాహరణలు రంగనాయకమ్మ గారు. మొదట్లో నాకు తెగ నచ్చిన రామాయణ విష వృక్షం రెండు అధ్యాయాలు దాటే సరికి రంగనాయకమ్మ గారికి రాయటంలో మరీ వెకిలితనం శృతి మించినట్లు కనిపించింది. అయితే ఆమెను తప్పుపట్టే స్థాయి నాకు లేదనుకోండి. నా అభిప్రాయం అది. అంతే.

ఇక విషయానికొస్తే…

మూస రచన అంటే ఇది.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాకళ వారు ప్రచురించిన కవిత చదవండి. బుర్ర బద్దలు కొట్టుకున్నా దాని భావమేంటో నాకర్ధం కాలేదు. దానికి తోడు ఆ బొమ్మ తాలుకా అంతరార్ధం ఏమిటో కూడా అర్ధం కాలేదు. (మార్పు : బొమ్మ ఇప్పుడు మార్చబడింది)

అర్ధం అయ్యిందల్లా...ప్రజాకళ లేదా ప్రజా సాహిత్యం అంటే "యుద్ధోన్మాది, రక్తం, శవాలు, రష్యా" లాంటివి వుండి తీరాలేమో అనిపిస్తుంది. నేనైతే "ఏరువాకా సాగరో .." లాంటి పాటలు కూడా ప్రజల సాహిత్యం అని నమ్మేవాడిని. ఈనాటి ప్రజా సాహిత్యం మనకర్ధం కావటం అటుంచి, పల్లె ప్రజలలో ఒక్క ముక్క అర్ధం అవుతుందో లేదో తెలియటం లేదు. సాదా మాటలలో, ఉదాత్త సాహిత్యంతో ప్రజలను రంజించి, ఆలోచింప చేసిన పాటలు, సాహిత్యం ఎన్ని రాలేదు? పాటల వరకూ ఎందుకు, "నిగ్గ దీసి అడుగు, సిగ్గు లేని జనాన్ని….మారదు లోకం" అంటూ మాటలతోనే పరుగులు పెట్టించిన సాహిత్యం ప్రజా సాహిత్యం కాదా? "ఘర్జన, దూషణ, ఘోషన, అమెరికా, రక్తం, కామ్రేడ్, శవాలు, నక్కలు, ముక్కలు, కుక్కలు, బూర్జువా" లాంటి పదాలు దాటి ఈ ప్రజా కవులు ముందుకు పోలేరా?

నిజం ఒప్పుకోండి…ప్రజా సాహిత్యం విఫలం కావటానికి కేవలం రచయతలే కారణం. ప్రతీ ఒక్కడు మోనార్కే. రాస్తే సద్దాం మీద ఒక వంద కవితలు…లేక పోతే ప్రపంచ బ్యాంకుపై కోటి తిట్లు…ఇవేనా ప్రజా సాహిత్యం…చస్తే కాదు..కావాలంటే మక్సీమ్ గోర్కీని పోయి అడగండి…లేదా పావెల్ తాలుకా "అమ్మ" ని అడగండి.

Thursday, March 08, 2007

అంతర్జాతీయ మహిళల దగా దినోత్సవం

ఈ రోజంతా ప్రపంచంలో వున్న సర్వ మహిళా జనం అమాయకంగా మురిసిపోయిన రోజు ఇది. ఓహో మీరు అదుర్స్, మీరు కత్తి, మీరు కమాల్ అని ఈ రోజంతా ఒకటే ఊదర. రకరకాల కంపనీలు మహిళా సాధికార దినోత్సవాలు హడావిడిగా జరిపేసాయి. అందులో కూడా పాల్గొన్న వారంతా సాధికారత సాధించిన వారే. మళ్ళీ వారికి దగ్గులు నేర్పడం ఎందుకో అర్ధం కాదు. ఏదైనా పల్లెటూరుకో, సిటీలో ఏదో గల్ల్లీకి వెళ్లి, అక్కడ అమ్మలక్కలందరికి అవసరమైన సాధికారత గూర్చి చెప్పొచ్చు కదా…

RTC బస్సులలో ఈ విధంగా రాసి వుంటుంది. "మహిళను గౌరవించటం మన సంప్రదాయం. వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం". ఇక్కడ "మనం" ఎవరు? ఆ "మనం"లో మహిళలు లేరా? "కూర్చోనిద్దాం" ఏమిటి? ఏదో "అవి కుక్క బిస్కట్టు, దానినే తిననిద్దాం" అన్నట్లు? ఇవి రాసిన వెధవలకున్న భావ దారిద్ర్యం మనలో చాలా మందికి ఉంది. బయట ఒప్పుకోలేకపోతే…టాయిలెట్లోకి వెళ్లి ఒప్పేసుకోవచ్చు. అక్కడెవరూ వుండరు.

ఇదే మంచి రోజని ఒక ఎక్స్ ప్రెస్ రైలులో మహిళా బోగీ దోపిడీకి గురి అయింది. రాజకీయ నాయకులందరికీ ఒక్క సారి మహిళా బిల్లు గుర్తుకొచ్చింది (ఊహించిందే…) పాపం మహిళా ప్రజా ప్రతినిధులందరూ ఒకే తాటిపై నిలబడినా లాభం లేక పోయింది. అందరు మగరాయిళ్ళు నిశ్శబ్ధంగా చోద్యం చూసారు. బల్లలు చరచడం ..పోడియం పైకి దూసుకుపోవడం అంతకన్నా మరచిపోయారు. చివరికి చప్పటి గొంతుతో మన ప్రధాని "అందరి సానుకూలతతో" ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. నేరస్తుల మీద ఒక ఫైలును తిప్పిన రాష్ట్రపతినే ఏకగ్రీవ తీర్మానంతో ఖంగు తినిపించి సంతకం పెట్టించిన మన ప్రజా ప్రతినిధులకు ఈ బిల్లు అంటే తెగ చేదు. అసలు 33% ఏమిటి? 50% శాతం ఎందుకు ఇవ్వకూడదు? అలా జరిగిన రోజు తప్పని సరిగా మన పార్లమెంటులో మంచి వాతావరణం, పనికి వచ్చే చర్చలు జరుగుతాయి.

ఒక టీవీలో సాధికారత సాధించిన మహిళలంటూ ర్యాంప్ మోడల్లు, వర్ద్గమాన తెలుగు సినీ హీరోయిన్లను (పేర్లు మనకు తెలియవు లెండి) తెగ ఇంటర్వూలు చేసేసారు. మహిళలంటే అత్యంత నీచంగా ప్రవర్తించే సినిమా పరిశ్రమ నుంచా ఉదాహరణలు? అదా సాధికారత?

గత సంవత్సరం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య దాదాపు 900. అంటే 356 రోజులలో 900. ఇవి కేవలం ఠాణాలలో నమోదు అయినవి మాత్రమే. రోజుకు దాదాపు నలుగురి అన్యాయానికి గురి అవుతున్నారు మన రాష్ట్రంలో. ఇదే విషయం మీద ఆ మధ్య రాఖీ అని ఒక మంచి సినిమా వచ్చింది. ఇవి ఏమైనా తగ్గుతున్నాయా? లేవే? అసలు మహిళా కమీషన్ ఏం చేస్తుంది? వారి ప్రోగ్రెస్ ఫలితాలు ఎక్కడ?

ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్త్రీని ముందు మనిషిగా గౌరవించటం నేర్చుకుని మసలుకోవడం మంచిది. అదేదో ఇంట్లో నుంచే మొదలు పెడితే మరీ మంచిది.

(ఈ వ్యాసం లో మీ మగ పాత్ర లేదని అనిపిస్తే మీరు మా మంచి మగరాజన్న మాట, ఏ మాత్రం వున్నట్లనిపించినా…ఏమి అనుకోమాకండి…ఇది నా ఆలోచనలకు ఒక రూపం, ఒక ఆశ అంతే)

Wednesday, March 07, 2007

క్రికెటాభిమానులూ ..జర భధ్రం

ఈ నెల రోజులూ ప్రపంచ క్రికెట్ దేవతలు కనువిందు చెయ్యనుండటం చేత…మీ అందరూ తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త ఒకటున్నది…

మ్యాచ్ విశేషాలను చచ్చినా ఒక ఛానల్లో మాత్రం చూడవద్దు. ఏ ఛానలో అర్ధం అయిందా? కాకపోతే ఇవి చదివి అర్ధం చేసుకోండేం !

౦౧. ఇది ఒక వార్తా ప్రసార వాహిక

౦౨. సమాజం కోసం పడి….చచ్చి పోతూ వుంది.

౦౩. నిరభ్యంతరంగా అసభ్య దృశ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ప్రసారం చేయగల సత్త వుంది

౦౪. అందరూ అదృష్ట సంఖ్యగా భావించే ఒక సంఖ్యతో వీరికి చాలా దగ్గర

ఇప్పుడు బుర్రలో దీపం వెలిగుంటుంది.

క్రికెట్ వ్యాఖ్యానన్ని వీరి కంటే పరమ దరిద్రంగా, నీచంగా ఎవరూ చెప్పలేరు. కావాలంటే పందెం కాస్తా…

మచ్చుకు ఈ రోజు వారి వ్యాఖ్యానం ఇలా వుంది….

" వన్ ట్వంటీ రేంజి దాటలేని పఠాన్ తో ఎటాక్ స్టార్టు చెయ్యించటమే మన బౌలింగ్ రిసోర్సెస్ కెపాసిటికి అద్దం పట్టింది. యువరాజు డ్రీమ్ స్పెల్, స్పిన్ ట్విన్స్ కుంబ్లే, హరభజన్ రొటీన్ కంట్రిబ్యుషన్స్ తో……"

మీకి నాకి మాట్లు నమ్మకమ్ లేక్పోతే ఈ రోజుది రాత్రి వార్తలలో ఆ ఛానల్ సూసి నాకి మర్‌లా చెప్పండి. (ఇదే కాస్త నయమేమో…వారి తెగులు కన్నా) :-)

కాబట్టి…ఇక చెప్పడానికి ఏమీ లేదు…చూస్తే Live చూడండి. లేకపోతే హాయిగా కూడలిలో ఎవరో ఒకరు వ్యాఖ్యానం రాస్తారు..చదవండి..లేకపోతే మంచి వార్తా పత్రికలోనో చదవండి. అది కాదనుకుంటే హాయిగా పడుకోండి.

ఇలా అయితే కష్టం

ఇండియా చెత్త బౌలింగు...దానికి పోటీనా అన్నట్లు నెదర్లాండు టెస్టు బ్యాటింగు. ఎంత ప్రాక్టీసు మ్యాచ్ అయినా ఇంత చెత్తగా ఆడాలా? :-(   పదిహేను ఓవర్లలో ఒక వికెట్టుకు నలభై పరుగులా...ఛీ ఛీ

నేను తీవ్రంగా ఈ బ్లాగుముఖంగా నిరసన వ్యక్తం చేస్తూ నిద్రకుపక్రమిస్తున్నాను(ఇంకేమీ చెయ్యలేక)

Sunday, March 04, 2007

ఈ విషయం మరో ముగ్గురికి చెప్పండి...

చాలా రోజుల తర్వాత ఏపి మీడియాలో వజ్రోత్సవ తగవు మీద ఒక జాబు వచ్చింది. ఆ జాబు పాఠంలో కొంత యూనికోడ్లో మీ కోసం. ఇందులో ప్రస్తావించిన పేర్లు, విషయాల మీద నాకు ఏ మాత్రం సంభంధం లేదు. మీకు ఏమైనా అభిప్రాయాలు రచయతకు తెల్పాలని అనిపిస్తే apmedia.blogspot.com లో తెలపండి.

"రాజకీయాలు, సినిమాలు - రెండు రంగాల్లోనూ ఎంతో డ్రామా ఉంటుంది. ఎందరో నటులు కూడా ఉంటారు. ఆప్యాయంగా పలకరించుకోవటం, అభిమానంగా మాట్లాడుకోవడం- ఇవన్నీ బయటకు కనిపించేవి అయితే లోపల్లోపల కారాలు, మిరియాలు నూరుతూ వీలయునంత లోతైన గోతులు తవ్వటం కూడా మనకు తెలుసు. …..

ఇక పూర్తి పాఠం ఇక్కడ చదవండి.

రంగు పడిందిరో !

ఈ రోజు హోలీ…మన దేశంలో జరిగే అందమైన పండుగలలో ఒకటి. అయితే ఈ రోజు నేను ఎక్కడికీ బయటకు వెళ్లలేదు. చాలా రోజుల క్రితం జరిగిన ఒక కామెడీ సంఘటన వలన హోలీ అంటేనే ఏదో తెలియని అయిష్టత ఏర్పడిపోయింది. ఆ సంఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ మా స్నేహితులందరం తెగ నవ్వుకుంటాం.

పీ.జీ చేస్తున్న రోజులలో కొంతమంది స్నేహితులతో కలసి విశాఖలో మద్దిలపాలెంలో కొన్ని రోజులు వున్నాను. అప్పుడు వచ్చిన హోలీ రోజు జరిగినది ఎప్పటికీ మర్చిపోలేని కామెడీ.

తెల్లవారు జామున ఏడు గంటలకు అనుకుంటా తలుపు ఎవరో చాలా వైల్డ్ గా బాదుతున్నారు. బద్ధకంగా అటు ఇటూ దొర్లుతున్న నేను "ఇది కల…ఇది కలే కదా" అని కోట శ్రీనివాసరావు టైపులో అనుకుంటుండగా, అలా అనుకోలేని నా స్నేహితుడు వెళ్లి తలుపు తీసేశాడు. అప్పుడు తీసిన తలుపు మరలా తియ్యటానికి మాకు మధ్యాహ్నం రెండు వరకూ కుదరలేదు..ఎందుకో తెలియాలంటే మొత్తం చదవాలి మరి.

తలుపు తీసి చూసిన వెంటనే మెరుపు వేగంతో మొహాల మీద రంగులు ఎవరో పులిమేస్తున్నారు. నిద్రలోనుంచి మొత్తం తేరుకుని చూస్తే మా రాజు గాడు. వాడు తెళ్లారే సరికి మరో కోతి పనుల స్పెషలిష్టు అమర్, మిగతా వాళ్లను వేసుకుని మా మీదకు దండయాత్రకు వచ్చాడన్న మాట. మాకు జరిగిన సత్కారమే మిగిలిన వారికి జరిగిందనటానికి వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న అతి ఆనందం తెలుపుతుంది. అదీ కాక మమ్మల్ని త్వరగా తయారు కమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. కష్టం మీద కాలకృత్యాలు తీర్చుకుని, ఒక పనికి రాని టీ-షర్టు వేసుకుని ఆ గుంపులో పడి రోడ్డు మీద పడ్డాం. రోడ్ల మీద ఎక్కడ చూసిన తెగ హడావిడిగా రంగులు జల్లుకుంటూ తిరుగుతున్నారు. అలా వెళ్తూ మా బెంగాలీ ఫ్రెండు సౌరవ్ భౌమిక్ ఇంటికి వెళ్లాం…వాడి సుడి బాగుండి ఎక్కడికో తెలియని ప్రదేశానికి అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు. వాడికి ఎవరయినా ఉప్పందించారో ఏమో మరి.

మొత్తానికి ఎలా అయితేనేం బయలు దేరి అలా RTC X Roads కు వచ్చాం. ఇంతలో అతి దగ్గరలో ఒక పోలీస్ జీప్ కనిపించింది. వైజాగ్‌లో ఎలాగూ పోలిస్ హడావిడి ఎక్కువే గదా అని వారి దగ్గరగా వెళ్లాం. అందరూ త్వరగా ఎక్కాలమ్మా…త్వరగా అని వినిపించింది. ఎవరిని వీళ్లు ఎక్కమంటున్నార్రా అని చూస్తే…అక్కడ మేం తప్ప ఇంకెవరూ లేరని అర్ధం అయింది. కానిష్టేబుల్ కొద్దిగా మర్యాదగా చెప్పాడన్నమాట. మా వాడు ధైర్యంగా ఎందుకు,ఏమిటి, ఎలా అని వారిని అడిగాడు. పోలీస్ ఎప్పుడయినా జవాబు చెప్తాడా..? ఉట్టిదేనమ్మా…కొద్దిగా అల్లర్లు అవుతున్నాయి. మిమ్మల్ని తీసుకెల్లి ప్రశ్నలు నాలుగడిగి వదిలేస్తారంతే అన్నాడు. సరే ప్రశ్నలన్ని స్టేషన్ హెడ్డు గారినడగండి, ముందు ఎక్కండి బాబు అన్నాడు. మేము ఏం తప్పు చెయ్యలేదు కనక హాయిగా లిఫ్టు అడిగి ఎక్కి కూర్చున్నట్లు జీపులో మొత్తం పొలో అని ఎక్కేసాం. మేం పోలీసుల మీద, వారు మా మీద జోకులేసుకుంటుండగా 2-టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేసింది. అదే జీవితంలో మొదటి సారి ఒక పోలీస్ స్టేషన్లోనికి పోయి కూర్చోవటం. అక్కడా ఒక ఏభై మంది వరకూ విధ్యార్ధులు వున్నారు. అందరి మొహాలు రంగు రంగులతో కోతుల్లా వున్నారు.

కాసేపు హెడ్డు గారిని సతాయించితే మాకొక దండం పెట్టేసి అక్కడ గోల చెయ్యకుండా కూచోండి బాబు అని బెంచీలు చూపించారు. సరే అని కూర్చున్నాం. మనసు వూరుకోక అలా వైర్లెస్ సెట్లో వస్తున్న మాటలు వినసాగాం..

ఆ సార్ ఇక్కడ ఒక పది మందిని తెస్తున్నాం సార్…ఓవర్

లేదు సార్..నేను బీచ్ పార్టీ సార్…అవును సార్ మొత్తం ఒక ఇరవై మంది వుంటారు సార్ ఓవర్

ఇలా సాగిపోతుంటే…ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. నవ్వటానికి కండరాలు మొరాయిస్తున్నాయ్. మెల్లగా ఒక కానిస్టేబుల్ ని కదిపితే అసలు విషయం తెలిసింది. అదేమిటంటే…

ఆ రోజు చాలా మంది ఆకతాయిలు రంగులలో కోడిగుడ్లు కలిపేసి జనాల మీద చల్లటం మొదలు పెట్టారు. కొంత మంది దారిన పోతున్న నన్స్ మీద పొయ్యటంతో వాళ్లు ఫిర్యాదు చేసారంట. అంతే ఇక విశాఖ పోలీసులకు అసలే పని వుండదు. ఇలాంటి అవకాశాలు వదులుతారా? జీపులేసుకుని రోడ్ల మీద పడ్దారు. ఫలితం మేం ఇక్కడా ఈ విషయాన్ని గురించి ఆరా తీస్తూ….కూర్చున్నాం. నాకు ఆ భయం కంటే ఆ రోజు కాలేజీలో వున్న ఇంటర్నల్ పరీక్ష మీదే దృష్టంతా….డుమ్మా కొడితే ఫలితాలు ఎలా వుంటాయో చెప్పలేం. కాసేపయ్యాక మేమందరం ఒక వంద మంది తయారయ్యాం. అప్పట్లో సెల్ ఫోన్లు అంతగా లేవు కనక ఎవరినీ పిలవలేని పరిస్థితి. ఒక పక్క ఆకలి.

మా అందరినీ మేడ పైన ఉన్న ఒక పెద్ద రూములో సమావేశపరిచి మమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో ఒకతను వివరించాడు. అందరూ పిల్లి గుడ్లేసుకుని విని "ఆ మనం కాదులే" అనుకున్నారు. నిజానికి అక్కడున్న వాళ్లందరూ అమాయకులే. మొహాన రంగున్న పాపానికి అక్కడ వున్నారు.ఒకడు మెల్లగా హెడ్డు దగ్గరకు వెళ్లి, "సార్ నేను AVN College సీనియర్ ని సార్" అన్నాడు…ఏదో డాన్ కి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్లు. హెడ్డు అదోలా మొహం పెట్టి…"అహా అలాగా…అయితే ఇప్పుడు ఏంటి?" అన్నాడు. పప్పులుడకవని అర్ధం అయ్యి వాడు మెల్లగా జారుకున్నాడు.

మా స్నేహితులలోని ఒకడు లాయర్ గారి అబ్బాయి. వాడు మెల్లగా ఎలాగో ఒక ఫోన్ చెయ్యించాడు ఇంటికి. ఆ తరువాత మేం ధీమా సరదాగా కూర్చుని మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మా ఎనిమిది మందిని మాత్రమే వదిలారు. అది కూడా ఆ లాయర్ గారు చేసిన కాల్ వలన. మేం హమ్మ్యయ్య అనుకుని ఇంటికి వచ్చి తలుపు మరలా తీసే సరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే, పాపం మిగిలిన వాళ్లందరికి రాత్రి ఎనిమిది గంటల వరకూ వుంచేసారంట. అప్పుడు వేసింది మాకు భయం :-)

అలా జరిగింది ఆ హోలీ. రంగులన్నీ కలిస్తే తెలుపు రంగు అవుతుంది. మాకు మాత్రం ఎరుపు రంగు తయారయింది. చివరికి రంగు పడింది :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name