Monday, April 02, 2012

చాలా రోజులకు...

ఎందుకో మళ్ళీ బ్లాగ్ రాయటం మొదలు పెట్టాలనిపిస్తోంది...ఎంత సీరియస్ గా రాస్తానో చూడాలి...పెద్దగా నమ్మకం లేదు కానీ...చూద్దాం ! :-)

Friday, December 26, 2008

ఇప్పుడు విండోస్ లైవ్ రైటర్ లో లేఖిని లభ్యం

టపా లేఖిని అభిమానుల కోసం. ఇప్పుడు లేఖినిని విండోస్ లైవ్ రైటర్లోనే వాడుకునే విధంగా చిన్న ఆడ్-ఆన్ ని తయారు చేశాను. ఒక గంటలోనే ఇది రాయటం అయిపోయినా, హంగులు, బగ్గు ఫిక్సులు అన్నీ అయ్యే సరికి కొంత సేపు పట్టింది. మంచి బగ్గులు పట్టుకున్న కిరణ్ చావా కు, జ్యోతి గారికి ధన్యవాదాలు. పూర్తి  సహాయ సహకారాలందించిన లేఖినిపిత వీవెన్కు నెనర్లు.

ఇక విషయానికొస్తే, దీనిని వ్యవస్థాపితం చేసుకోదలచిన వారు పాటించాల్సిన సోపానాలు..

౦౧
. విండోస్ లైవ్ రైటర్ ని మొదట వ్యవస్థాపితం చేసుకోవాలి. (ఇదిగో లంకె
)
౦౨. క్రింద ఇవ్వబడిన DLL file ను దిగుమతి చేసుకోండి.౦౩. ఆ ఫైల్ ను తాపీగా "C:\Program Files\Windows Live\Writer\Plugins" అనే ఫోల్డర్ లోనికి కాపీ చెయ్యండి. (మీరు లైవ్ రైటర్ ను "D" డ్రైవ్ లో install చేసివుంటే "D:\Program Files\Windows Live\Writer\Plugins" అనే ఫోల్డర్)

అంతే....ఇక విండోస్ లైవ్ రైటర్ మొదలు పెట్టండి.

మీరు మొదటగా (అన్నీ సుబ్బరంగా పని చేస్తే...) దిగువన చూపినట్లుగా ఒక ఐకన్ ను గమనిస్తారు. దానిని క్లిక్ చెయ్యండి. ఇక లేఖిని మీ ముందు ప్రత్యక్షం.లేఖిని ఈ రకంగా మీకు కనిపిస్తుంది.

ఇక మిగిలిన విషయాలు నేను చెప్పనక్కరలేదు కదా :-). ఎప్పుడైనా మీరు ఇక రాయటం అయిపోయిందనిపిస్తే "ఫినిష్" నొక్కండి. లేదా "Append & Continue" నొక్కండి.

ఏవైనా బగ్గులు కనిపిస్తే తెలుగు బ్లాగుల సమూహంలో ఫిర్యాదు చెయ్యండి.

Wednesday, March 12, 2008

తక్షణ సాంకేతిక సహాయం అందించటం ఎలా?

ఒక మాట మేము (సాంకేతిక నిపుణులు) ఒప్పుకుని తీరాలి. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, కంప్యూటర్లు మాత్రం ఇంకా సామాన్య జనాలకు కొరుకుడు పడటం లేదు. ఆపరేటింగ్ సిస్టంలు మొదలుకుని, అన్ని రకాల అప్లికేషన్లూ రకరకాల తికమకలతో సామాన్య యూజర్ ను విసిగిస్తూనే వుంటాయి. కొంత మంది అయితే అసలు తాము అలా ఎందుకు చెయ్యాలో తెలియకుండానే కంప్యూటర్లను గుడ్డిగా వాడేస్తుంటారు. పాపం అది వాళ్ళ తప్పు కూడా కాదు. వారికి నేర్పించిన వారి తప్పు మాత్రమే. డెస్క్ టాప్ మీద వూరికే పదే పదే  రైట్ క్లిక్కొట్టి రిఫ్రెష్ చెయ్యటం, ముందూ వెనకా చూడకుండా అన్ని చోట్లా   Yes క్లిక్కు చెయ్యటం లాంటివి సర్వసాధారణంగా మారిపోయి, వారసత్వంగా పరిణమించింది.

మీరే కనక మంచి సాంకేతిక నిపుణులయితే? తక్షణం మీ స్నేహితులకు సాయం అందించాలంటే ?

ఫోన్ లో చెప్తే చచ్చినా ఎవరికీ ఏమీ అర్ధం కాదు. ఛాట్ అయితే ఓకే...గానీ పూర్తిగా అర్ధం కాదు.

ఈ సమస్యను మరి ఎలా పరిష్కరించటం? వారి పక్కన కూర్చుని మనం ఆ పని చేసి చూపటమే....సరిగ్గా  ఈ సమస్య కోసమే ఇప్పుడు చాలా కంపనీలు Remote Help Software లతో వస్తున్నాయి. Team Viewer కూడా అటువంటిదే.

నేను సౌలభ్యం దృష్ట్యా Microsoft SharedView ని వాడుతా. దీనిని దిగుమతి ఇక్కడి నుంచి చేసుకోవచ్చు.

దృశ్య సూచిక - 1 : లాగిన్tafiti-1

 

దృశ్య సూచిక - 2 : సహాయ సెషన్ ప్రారంభం

tafiti-2

 

దృశ్య సూచిక - ౩ : స్క్రీన్ ను షేర్ చెయ్యటం, ఛాట్ చెయ్యటం

tafiti-3

 

దృశ్య సూచిక - 4 : డాక్యుమెంట్లు పంచుకోవడం

tafiti-4

 

దృశ్య సూచిక - 5 : ఆప్షన్ స్క్రీన్

tafiti-5

ఇక మీ స్నేహితులెవరైనా సాంకేతిక సహాయం అడిగితే, ఇక ఫోన్ అక్కరలేదు. షేర్‍డ్ వ్యూ మీ దగ్గర వుంటే చాలు.

Tuesday, February 26, 2008

తెలుగులో అత్యుత్తమ బ్లాగులు

26, ఫిబ్రవరి : టపా కొద్దిగా సాగు చేయబడింది...

ఈ టపా రాద్దామని చాలా రోజుల నుంచి తెలుగు టీవి డైలీ సీరియల్ లాగా లాగుతూ వస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. తెలుగులో వెలుగులు విరజిమ్మే తెలుగు బ్లాగులను పట్టుకోవటం అంత కష్టమేమి కాదనుకోండి. అయితే నా దృష్టిలో, మూడు సంవత్సరాలకు పైగా తెలుగులో బ్లాగుతున్న ఒక బ్లాగరుగా మంచి తెలుగు బ్లాగుకు ఉన్న నిర్వచాల ప్రకారం తెలుగులో అత్యుత్తమ బ్లాగులను గూర్చి రాయదలచుకున్నాను. నేను ముఖ్యంగా ఒరిజినాలిటీ, పారదర్శకత, సృజనాత్మకత, బ్లాగు క్రమ శిక్షణ, సమాచార పరిశోధనల పరంగా ఈ బ్లాగులను ఎంచుకున్నాను. వీటిలో నేను ర్యాంకింగ్ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇవన్నీ వాటికవే సాటి. ఆ బ్లాగులు ఆ బ్లాగర్లు మాత్రమే రాయగలరనే బ్లాగులు. పోటీ ప్రసక్తే లేదు.

 • గుండె చప్పుడు : http://hridayam.wordpress.com/ : దిలీప్ గారు రాసే గుండె చప్పుడు ఇది. సమాచారం అంతా పక్కాగా వుంటుంది. మీరు వ్యాఖ్య రాయాలన్న జాగ్రత్తగా టపా చదివి రాయాలనేంత చక్కగా వుంటాయ్ టపాలు. బ్లాగు పేరుకు సరిసాటిగా వుంటాయ్.
 • చదువరి : http://chaduvari.blogspot.com/ : ఒరిజినాలిటి అడుగడుగునా ఉట్టిపడే తెలుగు బ్లాగులలో ఒకటి. ముక్కు సూటిగా మొట్టికాయలు వేసే ఈ బ్లాగు అందరికీ సుపరిచితం.
 • అంతరంగం : http://blog.charasala.com/ : అమెరికాని, ఆంధ్రాని..ఆవకాయతో కలపి తింటున్నామా అనిపించేటట్లు చక్కగా తన అంతరంగాన్ని ప్రసాద్ చరసాల గారు రాస్తారిక్కడ.
 • తెలుగు నేల : http://nagaraja.info/telugu_nEla/ : నాగరాజా గారు తన తెలుగు సౌరభాలను, హాస్యాన్ని, మానవత్వాన్ని, ఆధ్యాత్మికత తో కలపి రాస్తున్న చల్లని బ్లాగు.
 • సత్య శోధన : http://satyasodhana.blogspot.com/ : సత్య సాయి కొవ్వలి గారు, కొరియా కబుర్లంటూ మెల్లగా మొదలు పెట్టి, అతి త్వరగా మంచి బ్లాగుల క్లబ్బులో స్థానం కొట్టేసారు. రాసినవి 45 టపాలే అయినా మరీ మరీ చదవాలనిపించే బ్లాగ్.
 • ప్రసాదం : http://prasadm.wordpress.com/ : హాస్యాన్ని జంధ్యాలను గుర్తుకు తెచ్చే స్థాయిలో ప్రసాదం లా పంచే ప్రసాదం గారి బ్లాగు.
 • రెండు రెళ్ళ ఆరు : http://thotaramudu.blogspot.com/ : రాసినవి కేవలం పది హేను టపాలు. కానీ ఈ బ్లాగు నవ్వించి కళ్ళంబడి నీరు కారించిన వారు వేలలోనే వుంటారు. ఈ బ్లాగ్ టపాలు ఈ-లేఖలుగా ఇప్పటికీ తిరుగుతున్నాయంటే నమ్మండి. గౌతమ్ DSG అనే చెన్నయ్ చంద్రుడు రాసే బ్లాగిది. నవ్వలేక చావాలి. జాగ్రత్త.
 • కలగూరగంప : http://www.tadepally.com/ : మంచి సమాచారం, పరిశీలనాత్మకంగా, విమర్శనాత్మకంగా తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు రాసే పక్కా తెలుగు బ్లాగ్ ఇది.
 • విహారి : http://blog.vihaari.net/ : హాస్యపు జల్లుల బేహారి, తెలుగు బ్లాగ్స్ంఘ ఆస్థాన విదూషకుడన్న బిరుదున్న విహారి గారు రాసే పక్కా నవ్వుల బ్లాగు ఇది. మీకు మనసు బాగోలేనప్పుడు ఈ బ్లాగు పూటకు ఒక సారి వేసుకోండి. సరిపోతుంది.
 • నా మదిలో : http://praveengarlapati.blogspot.com/ : తెలుగులో సాంకేతిక అంశాలకు టెక్ క్రంచ్ లాంటి బ్లాగేమైనా వుంది అంటే అది ప్రవీణ్ గార్లపాటి "నా మదిలో" మాత్రమే. పేరుకు తగినట్లు ఏ బేషజం లేకుండా సీదాగా వుండి మరీ మరీ చదవాలనిపిస్తుంది.
 • సాలభంజికలు : http://canopusconsulting.com/salabanjhikalu/ : తెలుగు సాహిత్య వైద్యం చేసే అతి కొద్ది బ్లాగులలో నాగరాజు గారి సాలభంజికలు బ్లాగు ఒకటి. అత్యున్నత ప్రమాణాలు దీని సొంతం.
 • రానారె : http://yarnar.blogspot.com/index.html : తెలుగు బ్లాగులు చదివే వారికి బాగా పరిచయమున్న రాజు గారు, యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి (ముద్దుగా రానారె) రాసే ఆణిముత్యాల జల్లు ఈ బ్లాగు. తెలుగులో ఒక మంచి రచయత రచనలు అచ్చు వేయించుకోకుండా బ్లాగు రాస్తే మరి ఇలానే వుంటాది...మరి యేం జెప్తాం !
 • అప్పుడు ఏం జరిగిందంటే : http://kranthigayam.blogspot.com/ : క్రాంతి గారు ఈ మధ్యనే మొదలు పెట్టిన బ్లాగు. మంచి హాస్యంతో ఆపకుండా చదివించే బ్లాగు.
 • 24 ఫ్రేములు, 64 కళలు : http://www.24fps.co.in/ : మన తెలుగు వెంకట్, నిశితంగా తను గమనిస్తున్న చిత్ర పరిశ్రమ మీద, చరిత్ర మీద రాస్తున్న అతి వైవిధ్యమైన బ్లాగు.
 • సౌమ్య : http://vbsowmya.wordpress.com/ : తెలుగు బ్లాగర్లకు సుపరిచితమైన సౌమ్య IIIT లో చదువుతూనే సాగిస్తున్న ఒక సాహిత్య యాత్ర ఈ బ్లాగులో మీ ముందు. చాలా మంచి పుస్తకాలు మీకు పరిచయం అవుతాయ్ ఇక్కడ.
 • నా బ్లాగు, నా సోది, నా నస : http://www.mpradeep.net/ : వికీ వీరుడు ప్రదీప్ రాసే బ్లాగు ఇది. కలగూరగంపలా వున్నా మంచి విషయ పరిజ్ఞానం ఉన్న బ్లాగు ఇది.
 • ఓనామాలు : http://onamaalu.wordpress.com/ : తెలుగు ఫర్ కిడ్స్ అనే వెబ్ సైట్ ను నిర్వహించే లలిత గారు రాసే ఓనామాలు బ్లాగు ఇది. చాలా స్ప్రష్టమైన అభిప్రాయాలు, చాలా వరకూ జీవితపు అనుభవాల మాలికతో అందంగా సాగిపోయే బ్లాగ్. ఈ బ్లాగును నాగరాజు గారు సూచించారు. అందుకు ధన్యవాదాలు.

ఈ పైన పేర్కొన్న బ్లాగులు నాకు తెలిసిన, బాగా విరివిగా రాస్తున్న బ్లాగులనుంచి తీసుకున్నాను. పైన చెప్పినట్లు నేను ఆ ఐదు అంశాలకు లోబడే ఈ జాబితా తయారు చేసాను. నేను సంకలనం చెయ్యని మంచి బ్లాగ్ ఏమైనా ఉంటే నాకు ఈ-లేఖ పంపండి. ఈ చిట్టాకు జత చేస్తాను. నేను ఈ చిట్టా తయారులో కొన్ని బ్లాగులను వదిలేసాను. దానికి చాలా కారణాలు వున్నాయి. డాక్యుమెంటేషన్ బ్లాగులు, ఆపేసిన బ్లాగులు, సేకరణ బ్లాగులు, లింకు బ్లాగులను నేను పరిగణనలోనికి తీసుకోలేదు. బ్లాగు అంటే నా దృష్టిలో ...ఇడియట్ చిత్రంలో హీరో చెప్పినట్లు "బుర్రలో ఏముందో అదే నా నోటి నుంచి వస్తుంది. నోట్లో ఏముందో అదే నా బ్లాగులో రాస్తా.." అనే వారు రాసే డైరీ. తెలుగులో పైన ఉన్న బ్లాగుల లాంటివి ఒక ఐదు వేలు వస్తే జన్మ ధన్యమైనట్లే. తెలుగు బ్లాగులు చరిత్ర సృష్టించినట్లే అని నేను నమ్ముతాను.

ఆఖరుగా....ఒక మాట

"ఎన్ని బ్లాగులు రాస్తున్నాం అనేది ముఖ్యం కాదన్నయ్యా !....అసలు సిసలు టపాలు రాస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంటు" :-)

Wednesday, February 20, 2008

బ్లాగర్ ఇప్పుడు తెలుగు రాత సౌకర్యంతో మీ కోసం

బ్లాగర్.కామ్ ఇప్పుడు తెలుగు టపాలు రాసుకునేందుకు లేఖిని వంటివి వాడకం అవసరం లేకుండా మన కోసం ఒక సౌకర్యాన్ని తెచ్చింది. ఇప్పటి వరకూ హిందీకి మాత్రమే వున్న ట్రాన్స్ లిటరేషన్ ఇప్పుడు మరికొన్ని భారతీయ బాషలలో కూడా లభ్యం అవుతుంది. అందులో మన తెలుగు కూడా వుంది. :-)

మీరు బ్లాగర్.కామ్ ను మీ తెలుగు బ్లాగు రాసుకునేందుకు వాడుతుంటే కనక, క్రింది సోపానాలు పాటించండి చాలు.

౦౧. బ్లాగర్ లోనికి లాగిన్ కండి.

౦౨. సెట్టింగ్స్ విభాగంలో బేసిక్ లోనికి వెళ్ళండి.

౦౩. గ్లోబల్ సెట్టింగ్స్ అనే విభాగంలో క్రింద చెప్పిన విధంగా చెయ్యండి.

google transliteration

౦౪. ఇప్పుడు మీ బ్లాగుల టపాల (Posts) విభాగంలో కంపోజ్ (Compose) విభాగంలో మీరు కొత్త టపా పూర్తిగా తెలుగులో రాసుకుంటూ పోవచ్చు. ఆంగ్లంలో రాయాలంటే "అ" అని కనిపించే బటన్ ను ఒక నొక్కు నొక్కటమే. తెలుగులో రాయాలన్నా అదే బటన్ ను మరో సారి నొక్కటమే.

google transliteration2

౦౫. ఇక మిమ్మల్ని ఆపేదెవరు? విజృంభించండి :-)

Thursday, February 14, 2008

సోనియా...తస్లీమా...

మన దేశ లౌకిక వాదాన్ని చూస్తే కళ్ళంబడి ఆనంద బాష్పాలొచ్చేస్తున్నాయి. ఎంత ఎత్తుగెదిగిపోయారో మన నాయకులు. అసలు వీరందరూ రహస్యంగా ఏదో కొత్త "స్వామ్యాన్ని" కనుక్కొన్నట్లే వుంది. ఓటుస్వామ్యం అని దానికి పేరు పెట్టుకుందాం.

సోనియా : పదేళ్ళ పాటు భారత పౌరసత్వం తీసుకోమని అత్త ఇందిర ప్రాధేయపడినా ససేమిరా అన్న ఘనత సొంతం. భర్తను ఇటలీ పోదాం బాబో అని పోరెట్టిన ఘనత కూడా వుంది. చివరికి తనను కాస్తయినా గుర్తించేది భారత్ లోనే అని ఈ మధ్యనే అర్ధం అయి పౌరసత్వం స్వీకరించి , ఆ తర్వాతే హిందీ నేర్చుకున్న ఘనత. ఈమెను మన దేశ నాయకులు ఇంట్లో భార్యకు ఇచ్చే విలువ కంటే ఒక పది రెట్లు ఎక్కువ గానే ఇస్తారు. తెలంగాణా ఇవ్వాలన్నా ఆమె, విమానం ఎగరాలన్నా ఆమెనే. దేశ ప్లానింగ్ కమీషన్ కే ఆమె చైర్ పర్సన్.

తస్లీమా : తన దేశం, భాష మీద అపార ప్రేమ, మానవత్వం మీద విపరీత నమ్మకం, హింస మీద అసహ్యంతో అత్యంత నిర్భీతిగా రాసే ఒక రచయత్రి. కుహానా లౌకిక వాదాలను చీల్చి చెండానికి వీరనారి. అసలయిన లౌకిక వాదానికి భారత్ లో చోటుందని, కలకత్తాలో తనకు, తన భాషకూ చోటుందని ఆశతో మన దేశ పౌరసత్వాన్ని గత కొన్నేళ్ళగా అర్ధిస్తున్నది. మన నాయకులకు ఆమె అస్సలు కనపడరు. ఆమె విన్నపాలు వినపడవు. ఆమె మీద దాడి చేసిన వెధవలకు అసలు శిక్ష కూడ పడదు. తోటి రచయత్రి అరుంధతీ రాయ్, మేధా పాట్కర్ లాంటి షో-ఉమన్ లకు ఆమె విషయం అస్సలు ఒక వస్తువు కానే కాదు. అవును మరి, ఆమె మన పార్లమెంటు మీద దాడి చేసుంటే బాగుండేది. కనీసం భారత్ లో తన కోసం ర్యాలీ తీసే గుంపు ఒకటి దొరికేది కదా....ఇప్పుడు తాజాగా మన ప్రభుత్వం సెలవిచ్చిందేమిటంటే...ఆమెకు ఇష్టం లేకుంటే దేశం విడిచి వెల్లొచ్చంట. ఆమె ఎప్పుడైనా ఇష్టం లేదని చెప్పిందా? ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు ?

ఈ దేశానికి, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వెధవ నాయకత్వానికి ఒక దండం రా దేవుడా !

రవీంద్రుడి గీతాంజలిలో దేశం కోసం, ప్రజల కోసం చేసిన వినతి ఈ రోజుకీ దేవుడు నెరవేర్చలేదు.

Wednesday, February 13, 2008

నంది అవార్డులు...2006

2006 వ సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు. ఎప్పటిలానే నంది అవార్డుల కమిటీ తన నాసిరకాన్ని కొంత బయట పెట్టుకుంది. ప్రభుత్వ ప్రాపకంలో వున్న ఏ కమిటీ అయినా అలానే పనిచేస్తుందని నిరూపించింది.

మనకర్ధం కాని కొన్ని అవార్డులు ఇవి...

ఉత్తమ నటుడు : నాగార్జున (రామదాసు). :- రామదాసు చూస్తే నాకు రాఘవేంద్రరావు తప్ప ఎవరూ కనపడలా. అసలు రామదాసు జాడే లేదు. అక్కినేని నాగార్జున కొన్ని సీన్లలో, అన్నమయ్య కొన్ని సీన్లలో కనిపించారు. మరి ఏ ప్రాతిపదికన నాగ్ కు ఈ అవార్డ్ ఇచ్చేశారో ఆ రాముడికే తెలియాలి. ఈ విభాగంలో ఈ అవార్డు మిస్సయిన అసలు  ఉత్తమ నటులు : ప్రకాష్ రాజ్, సిద్ధార్ధ్, మహేష్ బాబు.

ఉత్తమ సందేశాత్మక చిత్రం : స్టాలిన్ :- ఇది మరీ టూ మచ్. స్టాలిన్ లో ఉన్న సందేశం ఏమిటో అసలు అర్ధం కాలేదు. సినిమా ప్రారంభంలోనే కధానాయకుడు ఒక పెద్ద పచ్చని చెట్టుని నేల కూల్చి కొంత మందిని అడ్డుకునే దృశ్యం చిత్రానికే హైలైట్. ముగ్గురు మరో ముగ్గురికి సాయం అనేది కొంపదీసి సందేశమా? ఏమో?

నచ్చిన, సత్తా నిజంగా వుండి గెలుచుకున్న అవార్డులు ఇవి...

ఉత్తమ దర్శకుడు : శేఖర్ కమ్ముల (గోదావరి) :-  తెలుగు సినిమాని ఎంత సులభంగా, తక్కువ ఖర్చులో , అందరికి నచ్చేట్లు , అసలు ఏ పకోడీ స్టార్లు లేకుండా ఎలా తీయొచ్చో మరీ మరీ నిరూపిస్తున్న మన పక్కింటి కుర్రాడు. హాట్సాఫ్.

ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (బొమ్మరిల్లు) :- ఎదురులేని వాచకం ఇతని సొత్తు. ఏ సినిమాలో  ఉన్నా సరే అతడే  హీరో అనిపిస్తాడు.

ఉత్తమ సంభాషణల రచయత : అబ్బూరి రవి (బొమ్మరిల్లు):- హాయిగా, సరదాగా ఎంతా బాగా ఉంటాయ్ కదా బొమ్మరిల్లు డైలాగులు.

ఉత్తమ చిత్రం : బొమ్మరిల్లు :- అవును. ఇదే ఉత్తమ చిత్రం. ముమ్మాటికీ. దీని ముందర ఏ దాదాలు, బాబులు పనికి రారు.

Friday, February 08, 2008

కానన్ కెమెరా చరిత్ర...మన బుద్ధుడు

Canon అంటే తెలియని వారుండరు. కెమెరాలలో ఒకానొక అగ్రగామి సంస్థగా, సునిశితమైన కెమెరా తయారీదారిగా ప్రపంచ సుపరిచితం. మరి ఈ కానన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ ప్రఖ్యాత కంపనీకి, మన బుద్ధునితో గల సంబంధం మీకు తెలుసా?

1933 లో ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్ష్ట్రుమెంట్స్ లాబరేటరీ కెమరాలను తయారీ చెయ్యటం మొదలుపెట్టింది.

తమ కెమెరాలకు "క్వానన్" అనే పేరును ఖాయం చేసి, పక్కన కనిపిస్తున్న లోగోను ఖాయం చేసింది. "క్వానన్" అంటే బౌద్ధ మతంలో "దయ"కు  దేవత. ఆ పేరును, దేవతను తమ లోగోగా మార్చుకున్నా, 1935 లో ఆ పేరును రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రపంచమంతా అర్ధం అయ్యేటట్లు "కానన్" అని చెయ్యటం జరిగింది. కానన్ కు కొత్త అర్ధాలు చాలానే వున్నాయి. అదీ సంగతి.

Sunday, February 03, 2008

కంప్యూటర్లో తెలుగు రాయటం కష్టమా?

ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. ఈనాడులో వ్యాసం చదివిన వారికెవరికైనా ఈ ఆలోచన వస్తే ఈ టపా ఉపయుక్తంగా వుంటుందని రాస్తున్నా...

నిజానికి మూడేళ్ళ క్రిందట నాకూ ఈ భయం వుండేది. తెలుగులో టైపింగ్ నేర్చుకోవాలేమో అనుకునే వాడిని. కానీ ఒక సారి మొదలెట్టాక తెలిసింది. చాలా వీజీ అని :-)

మామూలుగా విండోస్ ఎక్స్ పి లో అయితే తెలుగు చదవటానికి ఏ ప్రత్యేక పరిష్కారం అవసరం లేదు. ఈ తెలుగు యూనికోడ్ అనే ప్రత్యేక యూనివర్సల్ ఫాంట్ తో రాయబడినవి. అంటే ఈ తెలుగును చదవటానికి మీకు ప్రత్యేకంగా ఫాంట్లు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్న మాట.

అయితే తెలుగులో సులభంగా రాయాలంటే చిన్న చిన్న సాఫ్ట్ వేర్లు ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు.

Windows XP లో తెలుగు పని చెయ్యాలంటే ఏమి చెయ్యాలో ప్రవీణ్ తయారు చేసిన ఈ వీడియోను చూడండి.

అంతర్జాలం (ఇంటర్నెట్) లో తెలుగు రాయటం రెండు రకాలు...

01. తెలుగుని ఇంగ్లీష్ లో రాయటం (చాలా మందికి ఇది అలవాటు). SMS, Chat లలో విరివిగా వాడుతుంటారు.
      eppudu vastunnaav ayithe? అని రాస్తుంటాం కదా? ఇదే రకపు రాతను రాస్తే తెలుగులోనికి మార్చే సాఫ్ట్ వేర్లు వున్నాయ్. కాకపోతే దీర్ఘాలకు, వత్తులకు మీరు Capitals వంటివి వాడితే సరిపోతుంది.

ఈ క్రింద చెప్పినవి చూడండి. తెలుగు రాయటం ఎంత సులభమో అర్ధం అవుతుంది.

పైన చెప్పిన ఉపకరణాలు, మీరు ఎలా రాసినా సాధ్యమైనంత వరకూ అర్ధం చేసుకుని మీకు తెలుగును అందిస్తాయి. మీరు ఆ తెలుగును ఈ-మెయిల్, డాక్యుమెంట్లు వంటి వాటిలో కాపీ, పేస్ట్ చేసుకోవచ్చు.

ఇది కాక, మీకు తెలుగును, ఇంగ్లీష్లో రాయటం బాగా వచ్చి, ధీర్ఘాలు, వత్తులు వంటివి కూడా మీరే రాసే అలవాటుంటే మీరు RTS అనే శైలి వాడుతున్నట్లు లెక్క. ఎలా RTS వచ్చినవారు చాలా వేగంగా రాస్తారు. నేను ప్రస్తుతం దానిలోనే రాస్తున్నాను. ఈ శైలి వచ్చిన వారు క్రింద చెప్పిన ఉపకరణాలు వాడవచ్చు.

02. తెలుగును తెలుగు మాధ్యమంలో రాయటం

దీనిలో రాయాలంటే మన కీబోర్డ్ లో తెలుగు అక్షరాలు వూహించుకోవాలి. అంటే తెలుగులోనే టైపింగ్ అన్న మాట. దీనిని ఇన్ స్క్రిప్ట్ అంటారు. మొదట్లో కష్టంగా వుంటుందేమో కానీ, ఇది వచ్చిన వారు మాత్రం సూపర్ వేగంగా తెలుగు రాసి పడేస్తారు :-)

 

అదండీ తెలుగులో రాత. మొదలు పెడితే మీకే తెలుస్తుంది. ఇది ఎంత సులభమో. ఏ ఫాంట్లు అక్కరలేదు. తెలుగు టైపింగ్ రానక్కరలేదు. ఇంకా మిగతా విషయాల కోసం మా ఈ-తెలుగు సహాయ కేంద్రాన్ని సందర్శించండి.

ఈ తెలుగు సహాయ కేంద్రం

ఇవి కాక మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మీకు సహాయం చెయ్యటానికి మీలానే తెలుగు రాయటం మొదలుపెట్టి, చక్కగా బ్లాగులు రాస్తున్న తెలుగు బ్లాగర్ల సమూహం వుండనే వుంది. తెలుగు బ్లాగర్ల సమూహంలో చేరండి.

ఈనాడులో తెలుగు బ్లాగర్లు

ఈనాడు ఈ రోజు వారాంతపు సంచికలో తెలుగు అంతర్జాలపు వెలుగులు, తెలుగు బ్లాగర్లపై ఒక సమగ్ర వ్యాసాన్ని వెలువరించింది.

మీరు ఇక్కడ చదవవచ్చు.

http://eenadu.net/htm/weekend.asp

ఎప్పుడో ఒక పది మందిమి కలసి మొదలు పెట్టిన బ్లాగు సంఘం, ఇంత స్థాయికి ఎదిగిందంటే చాలా ఆనందంగా వుంది. ఈనాడుకు ధన్యవాదాలు.

Friday, February 01, 2008

ఆంధ్రానా? తెలంగాణా?

తెరాసా రాగం మళ్లీ మారుస్తోందా? ఇన్నాళ్ళు ఆంధ్రులంటే చెప్పిన అర్ధాలను తిరగరాయబోతుందా? ఇప్పటి వరకూ చెప్పిన కొన్ని అర్ధాలు..గంజి మెతుకులు తింటూ వచ్చి, బిర్యానీలు తినేవారి కడుపు కొట్టేవారు....ఇక్కడి భూములను కొల్లగొట్టి బంగళాలు కట్టినవారు....ఆనపకాయను సొరకాయనే వాళ్ళు..ఇలా చాలా చాలా వున్నాయి. ఉద్యోగులు చాలా మందిని పంపించేసారు....కొంతమందిని బతిమాలే నెపంతో బెదిరించారు కూడా..

ఇప్పుడు చిరంజీవి హఠాత్తుగా వీరికి తెలంగాణా మనిషి ఎలా, ఏ రూలు ప్రకారం అయ్యాడు చెప్మా? బంగళాలు అన్నీ అతనికి ఇక్కడే వున్నాయే? అదీ తెలంగానా ఆత్మ గౌరవ సభలో చెప్పటం కొసమెరుపు.

ఇదంతా బాగానే వుంది....ఇంతకీ ఆంధ్రులెవరు? పొట్టకూటి కోసం చిన్న చిన్న వుద్యోగాలు చేసుకునే వాళ్ళు, ’విశ్వ’ విద్యాలయాల్లో చదూకోడానికొచ్చిన పిల్లలూనా?

Monday, January 28, 2008

అన్నయ్యనంటారా హన్నా...

ఈ టపా చదివే తమ్ముళ్ళందరికీ (అలా చెప్పుకుంటున్న వారికి) ఒక విన్నపం. మన భారతదేశం ఒక పచ్చని ప్రజాస్వామిక దేశం (రాజకీయ నాయకులు అనే చీడ పురుగులను పక్కన పెడితే). ఇక్కడ ప్రభుత్వం అందరికీ పుట్టిన వెంటనే ప్రాధమిక హక్కులు ప్రసాదిస్తుంది. ఇది మనకు ఐదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠాలలోనే చెప్పడం జరిగింది. వ్యక్తిగతపరంగా అందరికీ కుల, మత సంబంధం లేకుండా దక్కే హక్కు వాక్స్వాతంత్రం. ఇది మనకు రాజుల, బ్రిటీష్ వారి కాలంలో వుండేది కాదు. ఎవరైనా ఏమైనా నచ్చనిది మాట్లాడినా, పత్రికలలో రాసిన అది రాజద్రోహమే. వారి మీద నిష్కారణంగా దాడి చేసి జైల్లో పెట్టేది ప్రభుత్వం. దీనికి పెద్ద పెద్ద నాయకులే బలి అయ్యారు. జనరల్ డయ్యర్ కూడా చరిత్రలో ఇలాంటి అణిచివేత వలనే చరిత్రలో నిలిచిపోయాడు.

ఇక విషయానికొస్తే...

అభిమానం హద్దులు దాటడమనే ప్రమాదకర స్థితిని ఈ రోజు రాజశేఖర్...కాదు కాదు, చిరంజీవికి రుచి చూపించారు మన తమ్ముళ్ళు. రాజకీయకంపును రుచి చూపించారు. గత ఇరవై సంవత్సరాలుగా మెట్లు ఎక్కడమేగానీ దిగటం తెలియని అతను ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పుకోవటం చాలా బాధాకరం. ఈ దాడి చేసిన వారి వికృత మనస్తత్వం చిరంజీవికి భవిశ్యత్తులో చాలా ప్రమాదకరం. ఇలా జరుగుతూ పోతే చిరంజీవి జీవితమంతా క్షమాపణలు చెప్పుకోవడంతోనే సరిపోతుంది.

రాజశేఖర్ అన్నది పెద్ద విషయం కూడా కాదు. వున్న మాటే కదా? దానిని పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా? అవును చిరంజీవి కి రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లోనికి రాకుండా అది ఎలా వస్తుంది? ఇది పచ్చి నిజం. చిరంజీవి అది స్వయంగా ఒప్పుకున్నారు. ఒక వేళ నిజంగా ఈ దాడి చేసిన వెధవలు ఫ్యాన్సే అయితే, చిరంజీవి మాత్రం బహుశా అలాంటి ఫ్యాన్స్ ఉండటాన్ని పక్కలో ముల్లుగానే భావిస్తారు.

ఇక ఇలాంటి విషయాలు చిరంజీవిని పార్టీ స్థాపించాలనే వుద్దేశాన్ని దెబ్బ తీస్తాయా? ఏమో?

ఇలాంటి అభిమానులుంటే చస్తే ఎవడూ చిరును విమర్శించడానికి సాహసించడు. కాకపోతే ప్రజాస్వామ్యం మరొక్క సారి మానభంగానికి గురవుతుంది అంతే...

తమ్ముళ్ళూ మన రాష్ట్రాన్ని మరో తమిళనాడు చెయ్యకండి. ఒక్క సారి ఆలోచించండి. మీ తల్లి తండ్రుల మీద మీరిలాంటి అభిమానాన్ని ఎప్పుడైనా ప్రదర్శించారా? వారిని ఎవరైనా లంచం ఆడిగితే ఎప్పుడైనా అడిగిన వాడి మీద దాడి చేసారా? కనీసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? మనం చాలా అభిమానించాల్సిన వారు చాలా మంది మన ఇంట్లోనే వుంటారు. ముందర వారిని సరిగా చూసుకుందాం. తరువాత బయటి వారి గురించి బాధపడొచ్చు. మన వీర వెర్రాభిమానం మనం అభిమానించే నటులకు బాధ కలిగించకుండా వుంటే చాలు.

ఏమంటారు?

Sunday, January 27, 2008

కొన్ని మంచి సినిమాలు చూసా !

చాలా రోజులకు ఒక రెండు సినిమాలు ఇంట్లో చూసే భాగ్యం దక్కింది. అది కూడా లాప్ టాప్లో మాత్రమే. ఒక సిడాడే డి డ్యూస్ (సిటీ ఆఫ్ గాడ్స్) అనే బ్రెజిలియన్ సినిమా. గ్యాంగ్‍స్టర్ సినిమాలలో ఒక రేంజి వున్న సినిమా ఇది.

CidadedeDeus  రియోడి జెనీరోలో శరణార్ధుల శిబిరాల్లో పుట్టే బాల గ్యాంగ్‍స్టర్ ముఠాలపై తీసిన సినిమా ఇది. చాలా మంది నటులు నిజజీవితపు పాత్రలనే ఇందులో పోషించారు. అద్భుతమైన టెక్నిక్ ఈ సినిమా సొంతం. కధను వెనక నుంచి మొదలు పెట్టి Iamlegendఅంతం తాలుకా ఆరంభం అనే స్టయిల్లో చెప్పిన కధ ఇది. వీలయితే మీరు చూడండి. పద్దెనిమిది ఏళ్లు దాటని వారు చూడకూడని హింస వుంది ఈ సినిమాలో, కాబట్టి పిల్లల్తో జాగ్రత్త.

E! మ్యాగజైన్ దీనిని Movies to watch before you Die అనే పట్టికలో మూడో స్థానంలో చేర్చిందంటే ఈ సినిమా స్థాయి అర్ధం అవుతుంది. అంతే కాక Times  దీనిని All Time Top 100 సినిమాలలో చేర్చింది.

ఇక రెండో సినిమా "ఐ యామ్ లిజెండ్". ఇది సినిమా హాలు లోనే చూడల్సిన సినిమా. విల్ స్మిత్ అభిమానిగా ఈ సినిమా చూసాను. స్పెషెల్ ఎఫెక్ట్స్ పరంగా బాగానే వుంది కానీ, తప్పక చూడాల్సిన సినిమా అయితే కాదు. 

ఇక టీవి సినిమాలు చెప్పుకోవాలంటే జీ స్టూడియో, హెచ్.బీ.ఓ, స్టార్ మూవీస్, పిక్స్ ఎప్పటిలానే పాత చింతకాయ పచ్చళ్లతో చెడుగుడాడుకున్నాయ్. చెత్త సినిమాలను అసలు పదే పదే ఎందుకు వేస్తార్రా బాబు :-(

Wednesday, January 09, 2008

వెబ్ లో ఆడియో ఇప్పుడు ఎంత సులభమో....యాహూ....!

యాహూ గాడిని ముద్దెట్టు కోవాలి. ఆడియోను వెబ్ సైట్లలో పెట్టుకోవటాన్ని ఇంత సులభం చేసినందుకు. చెయ్యాల్సిందంతా ఆడియో ఫైల్ ఒక చోట పెట్టి దాని లింకు ఇవ్వటమే. మిగతాదంతా యాహూ మీడియా ప్లేయరే చేసిపెడుతుంది.

ఆడియోను ఎక్కడికి అప్లోడు చెయ్యాలి?

01. Windows Live SkyDrive సైట్ కి వెళ్ళండి. సైన్ ఇన్ అవ్వండి. (ఏ ఫైల్ స్టోరేజీ సైటైనా వాడవచ్చు)

02. మీకు నచ్చిన mp3 పాటను పబ్లిక్ ఫోల్డర్లోకి ఎక్కించండి

03. పాట పుటకు వెళ్ళి క్రింద చూపిన బొమ్మ మీద Right Click చేసి Copy Shortcut చెయ్యండి.

04. ఇప్పుడు మీ దగ్గర మీ పాట లంకె వున్నది. లంకె నుంచి "?Download" తీసెయ్యండి.

05. మీకు నచ్చిన చోట ఈ HTML కోడ్ ను పెట్టండి (example.mp3 బదులుగా మీ పాట లంకె)

<a href="example1.mp3">My first song</a>

06. తరువాత మీ బ్లాగు/సైటు HTML కోడులో క్రింద ఇవ్వబడిన కోడు చివరిగా పెట్టండి. (</body> ముందర)

<script type="text/javascript" src="http://mediaplayer.yahoo.com/js"></script>

అంతే. మీరు ఎన్ని ఆడియో లంకెలు పెట్టినా, అవన్నీ అక్కడికక్కడే వినేలా యాహూ మీడియా ప్లేయర్ చూస్తుంది. (క్రింద చూపిన విధంగా)

మచ్చుకి ఈ పాట వినండి.

బిల్ గేట్స్ కి పని పిసరంత కూడా లేని ఆఖరి ఆఫీస్ రోజు

ఎవరు ఎంత ఆడిపోసుకున్నా, సన్నాయి నొక్కులు నొక్కినా బిల్ గేట్స్ కి బిల్ గేట్సే సాటి అని నా గట్టి నమ్మకం. ఈ యుగంలో ఇంటింటికీ కంప్యూటరుండాలనే ఆశను నిజం చేయాలని తపించిన కంప్యూటర్ యుగకర్తలలో బిల్ ఒకరు. అంతే కాక గీకు వీరుడిగా నేను బాగా అభిమానించే వ్యక్తులలో బిల్ ఒకడు. అలాంటి వ్యక్తి ఒక రోజు హటాత్తుగా ఆఫీస్ కి ఇదే ఆఖరు రోజు అని ప్రకటించేసాడు. CES 2008 లో బిల్ తన చివరి ప్రసంగాన్ని వెలువరించాడు. ఆ సందర్భంగా ఏ పనీ లేక పోతే బిల్ ఆఫీస్ లో చేసే పనులేమిటి? అనే విషయం మీద ఒక సరదా కామెడీ వీడియో చేసారు. భలే ఫన్నీగా వుంది. చూడండి.

Sunday, January 06, 2008

అంపైర్ చేతిలో రాయి

చాలా రోజులకి, మైదానంలో అంపైర్లు క్రికెట్ ఆడారు. ఆస్ట్రేలియన్లు సైతం సిగ్గుపడేలా ఒక ఇరవై సంవత్సరాలు క్రికెట్ క్రీడను ఈ ఇద్దరు అంపైర్లు "స్టీవ్ బక్నర్, బెన్సన్" లు తీసుకుపోయారు. జిల్లా స్థాయి అంపైర్లు సైతం ఇలాంటి పొరపాట్లు చెయ్యరేమో. అసలు వయసు అంతగా మీద పడిన వీరిని ఎందుకు ఐ.సి.సి ఇంకా పోషిస్తుందో అర్ధం కాదు. ఈ రోజు భారత్ టెస్టు మాచ్ కోల్పోవడంలో ఆసీస్ క్రీడాకారుల ప్రమేయమ్ ఏమీలేదు. అంతా మన అంపైర్ల మహిమే. అందులో స్టీవ్ బక్నర్ సంగతి అందరికి తెలిసిందే. మూడో అంపైర్ నిద్రపోతున్నాడనుకుంటాడేమో అర్ధం కాదు. వరల్డ్ కప్ 2007 లో వీరు చేసిన మహిమలు ఎవరికి తెలియదు? చీకట్లో ఆటను నడిపిన ఘనత వుంది.

అసలు మ్యాచ్ ఫిక్సింగులలో ఈ తెల్లకోటు కుర్రాళ్ళకు కూడా వాటాలు రావటం మొదలుపెట్టాయా?

వీటన్నింటిని మించినది ఆసీస్ నీతి నిజాయతీలు. తెల్లోల్ల దరిద్రపు బుద్ధి మాత్రం ఎక్కడకు పోతుంది. అవుటయ్యానని మూడు సార్లు తెలిసిన కోతి వెధవ చక్కగా సెంచరీ చేసుకున్నాడు. అది కాక జాతి వివక్షత అని అబధ్దాలు చెప్పటం. వీడిని కోతి అంటే కోతి జాతికే అవమానం కాదా? నక్క అంటే సరిపోతుంది.

ఈ టెస్టు మాచ్ ద్వారా అపఖ్యాతి తెచ్చుకున్న ప్రఖ్యాత ఆసీ గాడిదలు వీరే

౦౧. రికీ పాంటింగ్ (వీడి మీద ఆస్ట్రేలియన్స్ కే ఇష్టం లేదు.)

౦౨. సైమండ్స్ (తూచ్..తూచ్ అని చివర వరకూ ఆడేస్తాడు)

౦౩. క్లార్క్ (కింద పడిన బంతులు పట్టేయటంలో దిట్ట)

౦౪. హస్సీ (సిగ్గు లేకుండా..అంపైర్ అవుటంటే కానీ క్రీజు కదలడు)

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బీ.సి.సి.ఐ ఇప్పుడు ఫిర్యాదు చేస్తుందంట. క్రికెట్లో సింహ భాగాన్ని ఆక్రమించుకున్న భారత ఉపఖండపు దేశాలు, ఐ.సి.సి విషయంలో మాత్రం పిల్లులలానే వుంటాయి. మన ఖర్మ. అసలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కలసి ఒక పోటీ క్రికెట్ కౌన్సిల్ ఎందుకు పెట్టకూడదు?

బక్నర్ గాడిని పంపెయ్యమని ఐ.సి.సి కి పిటిషన్ ఒకటి పెట్టారు. మీరు కూడా మరి సంతకం చెయ్యండి.

http://www.petitiononline.com/RetireSB/petition.html

Wednesday, January 02, 2008

అందమైన పాటకు అద్భుతమైన యానిమేషన్

ఈ పాటను నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం మొదటి సారి చూసివుంటాను. అప్పడే దీనిని జాగ్రత్తగా ఒక ఫ్లాష్ ఫైల్ గా దాచుకున్నాను. అయితే అది కనపడక మరల వెతుక్కుంటే దొరికిందీ ఆణిముత్యం లాంటి అందమైన యానిమేషన్. పాట మొత్తం వింటూ సబ్ టైటిల్స్ చదవండి. మీకే తెలుస్తుంది.

Friday, December 28, 2007

గూగులు తెలుగు

గూగుల్ భారతీయ భాషలపై చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. భారతీయ మార్కెట్ ను సొమ్ము చేసుకోవాలంటే వారి భాషలోనే ప్రయత్నించాలనే ప్రధమ సూత్రాన్ని తొందరగా వంటపట్టించుకుంది. మన దేశంలో పిచ్చి పిచ్చిగా కుర్ర జనం వాడే ఓర్కుట్ తోనే అది శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఓర్కుట్లో హాయిగా తెలుగులో స్క్రాప్ లు రాసుకోవచ్చు. దీనికి RTS రానక్కరలేదు. తెలుగును ఆంగ్లంలో రాసుకుంటూ పోవడమే.

orkut_telugu

ఇప్పుడు మూలనున్న ముసలమ్మలు కూడ ఓర్కుట్లోకి దూకుతారనడంలో ఆశ్చర్యం లేదు.

Thursday, December 27, 2007

మానవత్వం మతంతో మరో సారి ఓడింది

పోయిన చోటే వెతుక్కోమని ఎవడు చెప్పాడో గానీ, అది పాకిస్తాన్ లాంటి మతమౌఢ్యపు నాయకులున్న రాజ్యంలో పనికి రాదని తెలుసుకోవాలి. తివిరి ఇనుమున తైలమ్ము తీయవచ్చేమో గానీ ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఒక్క చుక్క కూడా పిండలేం.

ముదనష్టపు బుష్షు గాడు ఏమంటాడో మరి. వాడికసలే జనరల్ బుషారఫ్ అంటే తెగ మోజు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name