Showing posts with label సినిమాలు. Show all posts
Showing posts with label సినిమాలు. Show all posts

Sunday, January 27, 2008

కొన్ని మంచి సినిమాలు చూసా !

చాలా రోజులకు ఒక రెండు సినిమాలు ఇంట్లో చూసే భాగ్యం దక్కింది. అది కూడా లాప్ టాప్లో మాత్రమే. ఒక సిడాడే డి డ్యూస్ (సిటీ ఆఫ్ గాడ్స్) అనే బ్రెజిలియన్ సినిమా. గ్యాంగ్‍స్టర్ సినిమాలలో ఒక రేంజి వున్న సినిమా ఇది.

CidadedeDeus  రియోడి జెనీరోలో శరణార్ధుల శిబిరాల్లో పుట్టే బాల గ్యాంగ్‍స్టర్ ముఠాలపై తీసిన సినిమా ఇది. చాలా మంది నటులు నిజజీవితపు పాత్రలనే ఇందులో పోషించారు. అద్భుతమైన టెక్నిక్ ఈ సినిమా సొంతం. కధను వెనక నుంచి మొదలు పెట్టి Iamlegendఅంతం తాలుకా ఆరంభం అనే స్టయిల్లో చెప్పిన కధ ఇది. వీలయితే మీరు చూడండి. పద్దెనిమిది ఏళ్లు దాటని వారు చూడకూడని హింస వుంది ఈ సినిమాలో, కాబట్టి పిల్లల్తో జాగ్రత్త.

E! మ్యాగజైన్ దీనిని Movies to watch before you Die అనే పట్టికలో మూడో స్థానంలో చేర్చిందంటే ఈ సినిమా స్థాయి అర్ధం అవుతుంది. అంతే కాక Times  దీనిని All Time Top 100 సినిమాలలో చేర్చింది.

ఇక రెండో సినిమా "ఐ యామ్ లిజెండ్". ఇది సినిమా హాలు లోనే చూడల్సిన సినిమా. విల్ స్మిత్ అభిమానిగా ఈ సినిమా చూసాను. స్పెషెల్ ఎఫెక్ట్స్ పరంగా బాగానే వుంది కానీ, తప్పక చూడాల్సిన సినిమా అయితే కాదు. 

ఇక టీవి సినిమాలు చెప్పుకోవాలంటే జీ స్టూడియో, హెచ్.బీ.ఓ, స్టార్ మూవీస్, పిక్స్ ఎప్పటిలానే పాత చింతకాయ పచ్చళ్లతో చెడుగుడాడుకున్నాయ్. చెత్త సినిమాలను అసలు పదే పదే ఎందుకు వేస్తార్రా బాబు :-(

Wednesday, December 26, 2007

మరిచిపోయిన మధురగీతం

ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు. గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను. ఎమ్.యస్ రామారావు గారి అతి మధురమైన, అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి.

చిమట సంగీత ప్రపంచపు లంకెలో చివరి పాటను వినండి.

ఈ పాటకు మధురమైన సంగీతాన్ని ఓపీ నయ్యర్ జీ అందించారు.

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో...

నిదురించు జహాపనా -  ||

పండు వెన్నెల్లో వెండి కొండల్లే

తాజ్ మహల్ ధవళా కాంతుల్లో ||

నిదురించు జహాపనా - ౨

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨

ముంతాజ్ సతీ సమాధి

సమీపాన నిదురించు - ౨

జహాపనా...

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

Monday, February 19, 2007

తెలుగు సినిమాల భవితవ్యం

ప్రస్తుతానికి ఇలాంటి సీనులు చాలా వున్నాయనుకోండి. కానీ ఈ సీను మాత్రం అల్టిమేట్ కిల్లర్ సీను. బహుశా బాలయ్య దీనిని చెయ్యటానికి సాహసించవచ్చు. గతంలో అతను ట్రైనుని వెనక్కి, కుర్చీలను ముందుకూ కంటి చూపుతో కదిపిన అనుభవం వుంది. పదో తరగతి కూడా పాస్ కానీ స్టంటు మాస్టర్లు, దర్శకులు సినిమాలలోకి వస్తే ఇలానే వుంటది మరి. జై వజ్రోత్సవ లిజెండ్సెలిబ్రిటీ సహిత తెలుగు చిత్ర మాత! జై. !

Saturday, February 17, 2007

దేశ ముదురు - ( A )

చాలా రోజులుగా తెలుగు సినిమా చూడలేదు కదా అని అలా ఏదో ఒక సినిమా చూద్దామని ఫ్రెండ్స్ తో కలసి పైన చెప్పున సినిమాకు వెళ్ళాను. ఆహా ఏమి చిత్ర రాజం?

అసలు ఇది పూరి జగన్నాధ్ చిత్రమేనా అనిపించింది ముందర (అమ్మా..నాన్న..తమిళమ్మాయి ప్రభావం వలన). తరువాత మెల్లగా ఇలాంటి సినిమాలు కేవలం పూరి మాత్రమే తియ్యగలడు అని అర్ధం అయింది. అసలు కధ ఏమిటో ఎందుకు ముందుకు సాగుతుందో అర్ధం కాదు. కధతో సంబంధం లేని కామెడీ ట్రాకు (కాస్త బాగున్నది ఇదే). విపరీతమైన అరుపులు సినిమా అంతటా సమంగా పరచుకున్నాయి. హీరోయిన్ తప్పితే ప్రధాన పాత్రలు అన్ని కనీసం 150 డెసిబల్స్ స్థాయిలో అరుపులు, సంభాషణలు సాగిస్తాయి. అది పూరి మార్కు.

ఇక కధ విషయానికొస్తే పెద్దగా ఏమి లేదు. అన్ని తెలుగు సినిమాలలాగానే బయటి రాష్ట్రాలలో (కులూ, మనాలి) అందరూ తెలుగు మాట్లాడేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ఉన్న విలనీయులు మాత్రం తెలంగాణా యాసతో కూడిన తమిళం (అదే మరి పూరి స్టయిల్) మాట్లాడుతుంటారు (అరుస్తుంటారు). హీరో విషయానికొస్తే తండ్రిని ఏరా అని పిలిచే స్థాయి ఉన్న ఒక చిన్న సైజు సిల్వస్టర్ స్టాలిన్. ఇతనికి ఎదురంటూ పెద్దగా ఏమీ లేవు/లేదు. పిట్ట కొంచం కూత ఘనం అన్న మాట. మా-టీవి ని సొంత టీవి లా వాడేసుకుంటూ వుంటాడు.(అల్లు అరవింద్ కి కూడా మా-టీవీ వాటాలున్నాయా? కొంపతీసి?). ఒక టీవి ఛానల్ వారు గూండాలు వస్తున్నారని వణికి పోవటం మనం ఈ చిత్రంలో చూస్తాం.

హీరో ఉద్యోగ నిమిత్తం కులూ, మనాలి వెళ్ళి అక్కడ ఉన్న ఒక యోగినిని ప్రేమ అని వేధించటం చిత్రంలో 50% వుంటుంది. అది కూడా పూరీ మార్కులో "ఏమే…నాకు ఏం తక్కువే? , నీకు కొవ్వెక్కిందే? …" ఇలా సాగిపోతుంది. ఇలా వేధిస్తే ప్రేమలో పడే అమ్మాయిలు ఎక్కడ వుంటారో పూరికే ఎరుక. ఈ యోగినిలు కూడా చాలా విచిత్రంగా వుంటారు. పూర్తిగా మస్కారా, లిప్ స్టిక్కు, ఫేషియల్ తో భలే వుంటారన్న మాట. అన్నట్లు కలర్డ్ జుత్తు కూడా. అన్ని తెలుగు సినిమాలలానే హీరోయిన్ అందరి మధ్యలో, ముందరగా నడుస్తూ ఫ్రేమ్ ను లీడ్ చేస్తూ వుంటుంది.

ఇక మిగతా విషయాలు…దయ చేసి మీ పిల్లలను మాత్రం ఈ చిత్రానికి తీసుకు వెళ్ళవద్దు. విపరీతమైన హింస, మొహానికి రక్తాలు రాసుకోవడాలు లాంటివి జుగుప్సాకరంగా వున్నాయి. మనిషిని పట్టుకుని పరపరా మధ్యకు విరిచెయ్యటం వంటివి అయితే చెప్పనక్కరలేదు.

చక్రి, పూరి కలిస్తే ఎలా వుంటుంది? చెవులు దిమ్మెక్కిపోయే అరుపులుతో కూడన పాటలు పుట్టాయి. అవి కూడా చక్రి తనదైన గొంతులో పాడి చిరాకు తెప్పించాడు. అర్జున్ చేసిన డాన్సులు మాత్రం బాగున్నాయి.

మొత్తం మీద ఈ చిత్రం నన్ను బాగా నిరాశ పరిచింది. నేను ఈ చిత్రం మీద ఏ రకమైన ఊహతో వెళ్ళలేదు కానీ, కనీసం ఒక మంచి తెలుగు చిత్రం స్థాయిలో అయినా వుంటుందని ఆశించాను. పదికి మూడు మార్కులు వస్తాయి ఈ చిత్రానికి.

Tuesday, January 30, 2007

తెలుగు సినిమా వజ్రోత్సవాలు..హీరోలు, జీరోలు

తెలుగు సినిమా వజ్రోత్సవాలు ధాటిగా ప్రారంభమై వాగ్ధాటిగా ముగిసాయి. ఈ హడావిడిలో కొన్ని నిజాలు తెలిసాయి. నటీ నటుల నిజమైన హీరోయిజం అర్ధమయింది.

ఈ వజ్రోత్సవాలలో హీరోగా నిలచి అందరి మనసులు కొల్ల గొట్టిన వాడు ఒకే ఒక్కడు...

ఆశ్చర్యంగా ఉన్నా అది...బాలకృష్ణ

హుందాతనం, చెరగని చిరునవ్వు, పెద్దలంటే గౌరవం, చిన్న పెద్ద తారతమ్యం లేకపోవటం , కొట్టొచ్చిన అమాయకత్వం, బోళాతనం అందరిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయాలకు పూర్తిగా అతీతంగా కనిపించాడు.

నేను ముందర బాలకృష్ణ అంటే చాలా తేలిగ్గా తీసి పడేసే వాడిని. (సినిమాల వలన).కానీ బాలకృష్ణ నిజ జీవితంలో పూర్తిగా తేడా ఉందనిపించింది. నాకు ఇవన్నీ చూస్తే అలనాటి విమాన ప్రమాదం ఒక్క సారి గుర్తుకొచ్చింది. చిరంజీవి భోరున ఏడుస్తూ పొలాల నుంచి బయటకు వస్తే, ఒక్క బాలకృష్ణ మాత్రం చాలా స్థిమితంగా, ప్రశాంతంగా బయటకు నడుచుకు వచ్చేసాడు.

ఇక జీరోలు

౦౧. ఖచ్చితంగా ఈ ఉత్సవాల కమిటి. ఖర్చు పెట్టిన డబ్బంతా ఎక్కడ పోయిందో అర్ధం కాలేదు. విమానం ఛార్జీలు చెల్లించి మరీ ముంబయి హీరోయిన్లను రప్పించారో ఏంటో? దిగ్గజాలన్నారు...బతికున్న మహామహులను మర్చిపోయారు. చనిపోయిన మహా నటుల కుటుంబాలను ఆహ్వానించి వారికి ఇవ్వొచ్చుగా దిగ్గజాల అవార్డులు? అలా అయితే ఖచ్చితంగా ఇప్పటి తరం నటులు మొదటి 75  దిగ్గజాలలో ఉండరు.  రంగస్థలం మీద కనీసం సినీ మహామహుల చిత్రాలు లేవు. కార్యక్రమాలన్నీ ముంబాయి భామలు, చెన్నై భామల చేతుల మీదగానే. శ్రీదేవి(ఇప్పటి), సుహాసిని(ఇప్పటి) వంటి తెలుగు తారలు నృత్యాలకే పరిమితం.పురుషాధిక్యత సుస్ప్రష్టం. శ్రీదేవి(సీనియర్) వంటి సినీ దిగ్గజం అసలు హాజరు కాలేదు. చిరంజీవి పద్మ భూషణ్ సత్కారానికి ఇంతకంటే బాగనే తెలుగు హీరోయిన్లు వచ్చారేమో.

౦౨. మోహన్ బాబు : చెప్పేదంతా నిజమే అనిపించినా చెప్పిన విధానం చాలా చవకబారుగా ఉంది. నేను గొప్ప అని చెప్పుకోవటం గొప్పవాళ్ళ లక్షణం అసలు కాదు. చెప్పిన కారణాలు కూడా కొద్దిగా అతడు ఆలోచించుకుని చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యా సంస్థను స్థాపించటం గొప్ప కాదు...అందులో 25% ఉచిత విద్య మరీ అంత గొప్ప విషయం కాదు. పూర్తిగా ఉచితంగా వైద్యం చేసే వైదులు, చదువు చెప్పే టీచర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక రాజ్య సభకు ఎంపిక కావటం. అతను ఆ సభకు ఎలా వెళ్ళాడు? రాజ్య సభ అంటే ఒకొప్పుడు మేధావుల సభ.ఇప్పుడు అది ఒక రాజకీయ పునరావాస సభ. అందువలన వాటిని ప్రాతిపదికగా తీసుకుని సినీ దిగ్గజం అంటారనుకుంటే టొమేటో పప్పులో కాలు వేసినట్లే.ఇతడికి అస్సలు క్రమశిక్షణ లేదు. ఒక నలభై నిమిషాలు తినేసాడు (నాలుగు నిమిషాల ప్రసంగం చెయ్యబోయి).

౦౩. ఇక చిరంజీవి....మొదలు పెట్టటమే ఉబికి వస్తున్న కన్నీళ్ళతో మొదలు పెట్టాడు. చెప్పేది మోహన్ బాబును ఉద్దేశించి అయినా ముందర మోహన్ బాబు సభలో ఉన్నాడో, లేనిదీ ఒక సారి టెస్ట్ చేసి (ఏడీ మోహన్ బాబు...) మరీ మొదలు పెట్టాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కాదు ..నేనే అనిపించాడు, క్లాస్ గానే మాట్లాడుతూ డ్రామా రక్తి కట్టించాడు. ఇతడు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఒక విషయంలో పొంతన కుదరలేదు. ఒకప్పుడు దర్శకులు పిలిచి వేషం ఇస్తే ఎంతో సంతోషంగా చేసేవాళ్ళం, ఒదిగి ఉండే వాళ్ళం...ఇప్పుడూ అలానే ఉందాం..అర్ధాకలితో ఉందాం అన్నాడు. అయితే ఆ ప్రసంగానికి ఒక రోజు ముందరే పూరీ జగన్నాధ్ సుమతో "చిరంజీవి గారికి నాలుగు కధలు వినిపించా, కానీ అతనికి నచ్చలేదు" అని చెప్పాడు. ఇప్పుడు తెలుగులో ఉన్న దుస్థుతి ఇది. ఇదే కారణం మీద రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో సినిమాకు గుడ్ బై చెప్పేసాడు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమనే తన్ని పోయాడు. ముఖ్యమంత్రి చేతుల మీదగా ఇచ్చిన అవార్డును తిరస్కరించి చాలా తప్పు చేసాడు. అది ముఖ్యమంత్రికే అవమానం. అది చాలక డ్రామా సహితంగా టైమ్ కాప్స్యూల్ లో వెయ్యటం ఒకటి. ఆ పెట్టెలో ఏమి వెయ్యవచ్చో అల్లు అరవింద్ పది సార్లు చెప్పినా కూడా చిరంజీవి ఆ పని చెయ్యటం ద్వారా ఈ అవమానకర సంఘటనను తరువాత ఇరవై అయిదు సంవత్సరాలకు, ప్రతిష్టాత్మకమైన శత వత్సర పండుగ వరకు పొడిగించారు. అప్పటికి చిరంజీవి, మోహన్ బాబు స్నేహితులుగా చెట్టా పట్టాలు వేసుకుని ఉంటే వారికి ఆ శత వత్సర పండుగలో వారు చేసిన పనులు చాలా చెత్తగా అనిపించక మానవు. ఎప్పుడూ  ఆదర్శంగా
మాట్లాడే చిరంజీవి ఇలా ప్రవర్తించటం అసలు ఊహించనిది.


౦౪. దాసరి : శకుని పాత్ర అంటున్నారు.


౦౫. పవన్ కల్యాణ్ : అస్సలు మెచ్యూరీటీ లేదు. తప్పనిరిగా మానసిక వైద్యం అవసరం. నాకుండే గౌరవం పోయింది.

Monday, December 25, 2006

మన ఇంటి సావి3

తల్లి, చెల్లి, భార్య, వదిన, ప్రియురాలు ఎవరైనా వారికి ఒక మోడల్ మన మహాభినేత్రి సావిత్రి. చిలిపిగా హాస్యాన్ని ఒలికించాలన్నా,గంభీరంగా మగరాయిడులా నటించాలన్నా ఆమెకే సాధ్యం, ఆ నటన అద్వితీయం. అగ్రస్థాయి నటీమణులకే అభిమాన నటీమణి, మన సావిత్రి 1981, december 26 న పరమపదించారు.


ఆ మహానటి వర్ధంతి సందర్భంగా ఆమెకు ఇవే నా హ్రుదయపూర్వక అంజలి.

 

మహానటి సావిత్రి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వికీ వ్యాసం చదవండి

Tuesday, December 05, 2006

దీనినే 'అతి' అందురూ...

ఇది చదివి ఢామ్మని కింద పడబోయి ఆపుకున్నాను. దీని బట్టి చిరంజీవి రోజుకు ఎంత మంది భట్రాజులతో వేగుతున్నాడో కదా...ఈ అవుడియా మన అద్భుత భట్రాజ సోదర ద్వయం పరుచూరి వారికి రాలేదెందుకబ్బా !


నాయనా! చిరు జర జాగర్తగుండు...శ్రేయోభిలాషిని చెప్తుండాను.

గంధర్వ గళానికివే నివాళులు

తెలుగు ప్రజలు తెలుగుకు చెవి కోసుకుంటారో లేదో కానీ, ఈ సుమధుర గాయకుడి గళానికి మాత్రం తన్మయత్వంతో చెవులప్పగించేస్తారు. సంగీత దర్శకునిగా, గాయకుడిగా అతడు సంపాదించిన ఖ్యాతి, కంటి చూపుకు అందనంత ఎత్తులో ఉంది. తెలుగులో ఒకప్పటి అగ్ర కధానాయకులందరికి ఊపిరి అందించిన ఖ్యాతి మన ప్రియతమ పద్మశ్రీ ఘంటసాల వారిది.


భగవద్గీత అయినా, భక్తి పారవశ్యంతో కూడిన గీతమైనా అవి తెలుగు ప్రజలకు ఘంటసాల గొంతు ద్వారా పరిచయమైనవే.


అపర గాన గంధర్వునికివే జయంతి సందర్భంగా నా నివాళులు. ఈ సందర్భంగా మచ్చుకు కొన్ని జాతి రత్నాల్లాంటి పాటలు ఇక్కడ వినండి. భగవద్గీత ను ఇక్కడ వినండి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name