toondoo.com అనే అతి చల్లని (cool) వెబ్ సైటు మనకు అతి సులభంగా వ్యంగ్య చిత్రాలు చేసుకునే సదుపాయం ఇస్తుంది. నా మొదటి కార్టూను ఇలా ఏడిసింది :-)
Thursday, March 29, 2007
Tuesday, March 27, 2007
కదులుతున్న క్రికెట్ డొంక..సంచలనాత్మక SMS
ఫ్లాష్ న్యూస్ : సీ.యన్.యన్ ఐ.బి.యన్ లైవ్ వారు ఇప్పుడే సమర్పించిన వార్త కదంబం (లైవ్) సంచలనాత్మక విషయాలను బయట పెట్టింది.
వారి ప్రకారం…
గ్రెగ్ ఛాపెల్ ఒక బాంబు లాంటి SMS ను సీనియర్ క్రికెట్ పాత్రికేయుడు రాజన్ బాలా కు పంపాడు…అది చాలా కొత్త విషయాలను, BCCI లో లుకలుకలను బయట పెడుతోంది. అందరూ గ్రెగ్ ఛాపెల్ మీద మండి పడటం సహించలేని రాజన్ బాల ఆ SMS ను బహిర్గతం చేసారు.
అందులోని కొన్ని విషయాలు…
- గ్రెగ్ ఛాపెల్ సీనియర్లు (సచిన్, సౌరవ్, ద్రావిడ్, సెహ్వాగ్) లను ఇంటికి పంపమని పోరుతూనే వున్నాడు.
- మీడియా భయంతో BCCI అందుకు అంగీకరించలేదు
- సురేశ్ రైనా తప్పని సరిగా వుండాలని ఛాపెల్ పట్టుబట్టాడు
- సురేశ్ రైనా వుండటం BCCI కి ఇష్టం లేదు
- సెహ్వాగ్ వుండి తీరాల్సిందే అని ద్రావిడ్ పట్టు పట్టాడు (కరణ్ థాపర్ తో వెంగ్ సర్కార్)
- కార్తీక్ ను తీసుకోవాలని ఛాపెల్ కోరాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు వున్నాయని అలా కోరాడు
- సచిన్ వైస్ కెప్టెన్ అవ్వటం ఛాపెల్ ను విస్మయ పరిచింది. సచిన్ కెప్టెన్ గా పూర్తిగా విఫలం చెందిన రికార్డ్ వుండటం అందుకు కారణం.
- సీనియర్లు, యువ క్రికెటర్లను వరల్డ్ కప్ టీమ్ లోనికి ఎంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
- ఛాపెల్ రాజన్ తో : మీరన్నట్లు యువరాజ్ ను తీసుకోవటం ఒక రిస్క్. అతడు తననొక స్టార్ క్రికెటర్ గా భావించుకుంటాడు. అతను ఒక ఎదుగుతున్న క్రికెటర్ మాత్రమే.
- రాజన్ బాల : మొహమ్మద్ కైఫ్ కు ఇండియా-A టీమ్ కెప్టెన్ గా అద్భుతమైన రికార్డులున్నాయి. అతడిని ఎందుకు పక్కన పెట్టారో అర్ధం కాలేదు.
ఇదిలా వుండగా BCCI , ఛాపెల్ విషయమై నిలువుగా చీలిందని వార్త
Saturday, March 24, 2007
భారతీయులు…క్రీడా స్పూర్థి
హమ్మయ్య ఒక పని అయిపోయింది.
- ఇక నోరు తెరుచుకుని TV చూసే పని తప్పింది.
- కూరలు మాడిపోయే ప్రమాదం తప్పింది.
- గుండె పోట్లతో అభిమానులు పోయే ప్రమాదాలు తప్పాయి.
- వెధవ పాచి పళ్ల దాసరి TV Ads అదే పనిగా చూసే పనీ తప్పింది.
- ఆఫీసుల్లో పని మానేసి టీవీ గదిలో పని చేసే పని తప్పింది
- లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా కాబోతున్నది.
- మరి కొన్ని లక్షల కేలరీల శక్తి మనందరిలో ఆదా కాబోతున్నది
- కొన్ని వేల మందికి కంటి చూపు కొద్దిగా మందగించే ప్రమాదమూ తప్పింది.
ఇన్ని మంచి పనులు జరుగుతుంటే ఈ మీడియా ఏంటో ….ఏదో ఇండియా క్రికెట్ జట్టు కలసికట్టుగా సతీ సహగమనం చేసినట్లు గోల పెడుతుంది? నిజానికి మన భారత ప్రజలకు ఈ తిట్టే హక్కు వుందా?
చూద్దాం !
మన ఉపఖండంలో మనం పట్టించుకునే ఒకే ఒక ఆట "క్రికెట్టు". అది కూడా భారత జట్టు ప్రపంచ కప్పు గెలిచాకనే ఎక్కువయింది. అసలు మనలో ఈ ఆట పట్ల నిజంగా అంత అభిమానం వుందా? లేదా విజయం పట్ల అభిమానం వున్నదా? పశ్చిమ దేశాలలో, రష్యన్ దేశాలలో తీసుకుంటే…వారు ఆటను అభిమానిస్తే అన్ని స్థాయిలలో అభిమానిస్తారు. అంటే హైస్కూలు స్థాయిలో జరిగినా ఒక రెండు వందల మంది అభిమానులు గుమిగూడుతారు. ఆ స్థాయిలో కూడా చాలా మనసు పెట్టి ఆడుతారు. నిజానికి పెద్ద పెద్ద కోచ్‍లు అందరూ అక్కడి నుంచే వస్తారు. ప్రతీ రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయి జట్టు వుంటుంది. వారికి ఎనలేని అభిమానులూ వుంటారు.
మన దేశంలో మిగతా ఆటలు వదిలేస్తే…క్రికెట్టుకు కూడా ఈ స్థాయి ఇంకా లేదు. రెండు రాష్ట్రాల మధ్య రంజీ మ్యాచ్ అయితే ఎంత మంది చూస్తున్నాం? మనోళ్లు అభిమానించేది ఒక స్థాయికి వెళ్లి, గ్లామర్ సంపాదించుకున్న ఆటగాళ్లనే అనటంలో సందేహం లేదు. ఈ అభిమానం ముదిరి, వెర్రిగా మారి, తరువాత హక్కుగా మారింది. నిజానికి ఇప్పుడున్న క్రికెట్ జట్టు ఒక ప్రొఫెషనల్ జట్టు. అంటే వారు ప్రభుత్వం తరపున అధికారకంగా ఏమీ ఆడటం లేదు. వారికి ఒక స్వతంత్ర కార్యాలయం వుంది. అయితే మన అభిమానం వారికి ఎనలేని సిరి సంపదలు తెచ్చిపెట్టిన విషయం మాత్రం వాస్తవం. అయితే ఆ కారణంగా మనం వాళ్లని ప్రతీ వైఫల్యానికి తిట్టవచ్చా అంటే…అది మన విజ్ఞత మీద, హుందాతనం మీద ఆధారపడి వుంది. ప్రొఫెషనల్ స్థాయి క్రీడ అయిన టెన్నిస్ లో కూడా ఈ అవస్థ తప్పలేదు. మోనికా సెలెస్ వంటి అద్భుత క్రీడాకారిణి శాశ్వతంగా తప్పుకోవాల్సివచ్చింది. మన దేశంలో ఆ స్థాయి రాకూడదని ఆశిద్దాం.
ఆటలో గెలుపు, ఓటములు సర్వ సాధారణం. అందులో ఒక రోజు క్రికెట్టు అనేది శకుని జూదం లాంటింది. ఒక మేఘం కూడా ఆటలో భాగం కావచ్చు. గంటకు దాదాపు 135 మైళ్ల వేగంతో దూసుకు వచ్చే బంతి బ్యాటును తాకే మధ్య సమయం దాదాపు 2 సెకండ్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో కూడా బంతి తాలుకా వాలు, వేగం, పిచ్ స్వభావం అంచనా వేస్తూ, క్రికెట్లో వున్న పదకొండు రకాల షాట్లలో ఏది ఆడాలో నిర్ణయించుకుని ఆటగాడు సిద్ధం కావాలి. ఇదంతా ఆటగాడి నాడీ వ్యవస్థ పైన, మెదడు, రక్త ప్రసరణ పైన అత్యంత విపరీతమైన వత్తిడికి గురిచేస్తుంది…ప్రతీ బంతికి కూడా…అది కూడా కోట్ల అభిమానుల ఆశల మధ్య. ఇవన్నీ చాలక ఇప్పుడు మన అభిమానం వెర్రిగా మారితే అది మరింత ఒత్తిడిని పెంచి, స్థైర్యతను దెబ్బతీయక మానదు. కంగారూలు జగజ్జేతలవటానికి కారణం ఇదే…ఆసీయులు క్రికెట్ ని అభిమానిస్తారే తప్ప….శాసించరు. ఇళ్ల మీద దాడి చెయ్యరు.
వీటికి తోడు మన చెత్త మీడియా…సగం దరిద్రానికి కారణం వీళ్లే…దండలు వేసి పులులు అనేది వీరే….కాగితం పులులు అనేదీ వీరే…ఒక్క క్రికెటర్ కూడా ఇప్పటి వరకు "మన జట్టు పులుల జట్టు" అని ఎప్పుడూ అనలేదు. ఆఖరికి BCCI కూడా…ఇక మనం మీడియా గురించి మాట్లాడితే అంతు వుండదు.
కాబట్టి…మనం క్రీడా స్పూర్థికి ముందు పదును పెట్టుకుని…ఓడితే హాయిగా నవ్వేసి వదిలెయ్యటం అలవాటు చేసుకుంటే మంచిది. అంతే గానీ ఏదో మన జేబు నుంచి ప్రతీ నెలా క్రికెట్ జట్టుకు ఒక పది రూపాయలు చందా కడుతున్నట్లు రెచ్చి పోయి తిట్టడం, కాల్చడం, దాడి చెయ్యటం చేస్తే అది ఈ దేశానికి భవిష్యత్తులో చాలా చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం వుంది.
Sunday, March 11, 2007
ది దోహా డిబేట్ : బి.బి.సి
ఈ కార్యక్రమం మన దేశంలో చేసివుంటే BBC ని నరకయాతనకు గురిచేసేవారు మన రాజకీయనాయకులు. ది దోహా డిబేట్స్ అనే కార్యక్రమం అరబ్ దేశాలలో BBC చేస్తున్న అత్యంత సాహసోపేతమైన చర్చా కార్యక్రమం. మహామహులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఉన్నదున్నట్లు కుండ బద్దలుకొట్టి మరీ మాట్లాడుతారు. నిన్న రాత్రి నేను చూసిన కార్యక్రమం కూడా అలానే వుంది. వీలయితే మీరూ చూడండి..
The Doha Debates (ఈ రోజు ఆదివారం మరలా 9:40 PM IST కి)
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది టిమ్ సెబాష్టియన్ (ప్రఖ్యాత BBC HardTalk నిర్వాహకులు).
ఇది చూసాక అనిపించింది...మన దేశంలో ఇంత ధైర్యంగా నిజం మాట్లాడే రోజు ఎప్పుడొస్తుందా అని. BBC అభినందనీయురాలు.
Saturday, March 10, 2007
ప్రజాసాహిత్యం అంటే ఏమిటి? కాస్త చెప్పండీ...
ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను. అందులో చెప్పిందేమిటంటే రచయతలు "ఇజాలలో" పడి పాళీల ములుకులు వంకర చేసుకుంటున్నారని. ఒకటే మూసలో రాసేస్తూ, ఒకటే కోణం నుంచి చూస్తు రాయటం అన్న మాట. ఉదాహరణలు రంగనాయకమ్మ గారు. మొదట్లో నాకు తెగ నచ్చిన రామాయణ విష వృక్షం రెండు అధ్యాయాలు దాటే సరికి రంగనాయకమ్మ గారికి రాయటంలో మరీ వెకిలితనం శృతి మించినట్లు కనిపించింది. అయితే ఆమెను తప్పుపట్టే స్థాయి నాకు లేదనుకోండి. నా అభిప్రాయం అది. అంతే.
ఇక విషయానికొస్తే…
మూస రచన అంటే ఇది.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాకళ వారు ప్రచురించిన కవిత చదవండి. బుర్ర బద్దలు కొట్టుకున్నా దాని భావమేంటో నాకర్ధం కాలేదు. దానికి తోడు ఆ బొమ్మ తాలుకా అంతరార్ధం ఏమిటో కూడా అర్ధం కాలేదు. (మార్పు : బొమ్మ ఇప్పుడు మార్చబడింది)
అర్ధం అయ్యిందల్లా...ప్రజాకళ లేదా ప్రజా సాహిత్యం అంటే "యుద్ధోన్మాది, రక్తం, శవాలు, రష్యా" లాంటివి వుండి తీరాలేమో అనిపిస్తుంది. నేనైతే "ఏరువాకా సాగరో .." లాంటి పాటలు కూడా ప్రజల సాహిత్యం అని నమ్మేవాడిని. ఈనాటి ప్రజా సాహిత్యం మనకర్ధం కావటం అటుంచి, పల్లె ప్రజలలో ఒక్క ముక్క అర్ధం అవుతుందో లేదో తెలియటం లేదు. సాదా మాటలలో, ఉదాత్త సాహిత్యంతో ప్రజలను రంజించి, ఆలోచింప చేసిన పాటలు, సాహిత్యం ఎన్ని రాలేదు? పాటల వరకూ ఎందుకు, "నిగ్గ దీసి అడుగు, సిగ్గు లేని జనాన్ని….మారదు లోకం" అంటూ మాటలతోనే పరుగులు పెట్టించిన సాహిత్యం ప్రజా సాహిత్యం కాదా? "ఘర్జన, దూషణ, ఘోషన, అమెరికా, రక్తం, కామ్రేడ్, శవాలు, నక్కలు, ముక్కలు, కుక్కలు, బూర్జువా" లాంటి పదాలు దాటి ఈ ప్రజా కవులు ముందుకు పోలేరా?
నిజం ఒప్పుకోండి…ప్రజా సాహిత్యం విఫలం కావటానికి కేవలం రచయతలే కారణం. ప్రతీ ఒక్కడు మోనార్కే. రాస్తే సద్దాం మీద ఒక వంద కవితలు…లేక పోతే ప్రపంచ బ్యాంకుపై కోటి తిట్లు…ఇవేనా ప్రజా సాహిత్యం…చస్తే కాదు..కావాలంటే మక్సీమ్ గోర్కీని పోయి అడగండి…లేదా పావెల్ తాలుకా "అమ్మ" ని అడగండి.
Thursday, March 08, 2007
అంతర్జాతీయ మహిళల దగా దినోత్సవం
ఈ రోజంతా ప్రపంచంలో వున్న సర్వ మహిళా జనం అమాయకంగా మురిసిపోయిన రోజు ఇది. ఓహో మీరు అదుర్స్, మీరు కత్తి, మీరు కమాల్ అని ఈ రోజంతా ఒకటే ఊదర. రకరకాల కంపనీలు మహిళా సాధికార దినోత్సవాలు హడావిడిగా జరిపేసాయి. అందులో కూడా పాల్గొన్న వారంతా సాధికారత సాధించిన వారే. మళ్ళీ వారికి దగ్గులు నేర్పడం ఎందుకో అర్ధం కాదు. ఏదైనా పల్లెటూరుకో, సిటీలో ఏదో గల్ల్లీకి వెళ్లి, అక్కడ అమ్మలక్కలందరికి అవసరమైన సాధికారత గూర్చి చెప్పొచ్చు కదా…
RTC బస్సులలో ఈ విధంగా రాసి వుంటుంది. "మహిళను గౌరవించటం మన సంప్రదాయం. వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం". ఇక్కడ "మనం" ఎవరు? ఆ "మనం"లో మహిళలు లేరా? "కూర్చోనిద్దాం" ఏమిటి? ఏదో "అవి కుక్క బిస్కట్టు, దానినే తిననిద్దాం" అన్నట్లు? ఇవి రాసిన వెధవలకున్న భావ దారిద్ర్యం మనలో చాలా మందికి ఉంది. బయట ఒప్పుకోలేకపోతే…టాయిలెట్లోకి వెళ్లి ఒప్పేసుకోవచ్చు. అక్కడెవరూ వుండరు.
ఇదే మంచి రోజని ఒక ఎక్స్ ప్రెస్ రైలులో మహిళా బోగీ దోపిడీకి గురి అయింది. రాజకీయ నాయకులందరికీ ఒక్క సారి మహిళా బిల్లు గుర్తుకొచ్చింది (ఊహించిందే…) పాపం మహిళా ప్రజా ప్రతినిధులందరూ ఒకే తాటిపై నిలబడినా లాభం లేక పోయింది. అందరు మగరాయిళ్ళు నిశ్శబ్ధంగా చోద్యం చూసారు. బల్లలు చరచడం ..పోడియం పైకి దూసుకుపోవడం అంతకన్నా మరచిపోయారు. చివరికి చప్పటి గొంతుతో మన ప్రధాని "అందరి సానుకూలతతో" ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. నేరస్తుల మీద ఒక ఫైలును తిప్పిన రాష్ట్రపతినే ఏకగ్రీవ తీర్మానంతో ఖంగు తినిపించి సంతకం పెట్టించిన మన ప్రజా ప్రతినిధులకు ఈ బిల్లు అంటే తెగ చేదు. అసలు 33% ఏమిటి? 50% శాతం ఎందుకు ఇవ్వకూడదు? అలా జరిగిన రోజు తప్పని సరిగా మన పార్లమెంటులో మంచి వాతావరణం, పనికి వచ్చే చర్చలు జరుగుతాయి.
ఒక టీవీలో సాధికారత సాధించిన మహిళలంటూ ర్యాంప్ మోడల్లు, వర్ద్గమాన తెలుగు సినీ హీరోయిన్లను (పేర్లు మనకు తెలియవు లెండి) తెగ ఇంటర్వూలు చేసేసారు. మహిళలంటే అత్యంత నీచంగా ప్రవర్తించే సినిమా పరిశ్రమ నుంచా ఉదాహరణలు? అదా సాధికారత?
గత సంవత్సరం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య దాదాపు 900. అంటే 356 రోజులలో 900. ఇవి కేవలం ఠాణాలలో నమోదు అయినవి మాత్రమే. రోజుకు దాదాపు నలుగురి అన్యాయానికి గురి అవుతున్నారు మన రాష్ట్రంలో. ఇదే విషయం మీద ఆ మధ్య రాఖీ అని ఒక మంచి సినిమా వచ్చింది. ఇవి ఏమైనా తగ్గుతున్నాయా? లేవే? అసలు మహిళా కమీషన్ ఏం చేస్తుంది? వారి ప్రోగ్రెస్ ఫలితాలు ఎక్కడ?
ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్త్రీని ముందు మనిషిగా గౌరవించటం నేర్చుకుని మసలుకోవడం మంచిది. అదేదో ఇంట్లో నుంచే మొదలు పెడితే మరీ మంచిది.
(ఈ వ్యాసం లో మీ మగ పాత్ర లేదని అనిపిస్తే మీరు మా మంచి మగరాజన్న మాట, ఏ మాత్రం వున్నట్లనిపించినా…ఏమి అనుకోమాకండి…ఇది నా ఆలోచనలకు ఒక రూపం, ఒక ఆశ అంతే)
Wednesday, March 07, 2007
క్రికెటాభిమానులూ ..జర భధ్రం
ఈ నెల రోజులూ ప్రపంచ క్రికెట్ దేవతలు కనువిందు చెయ్యనుండటం చేత…మీ అందరూ తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త ఒకటున్నది…
మ్యాచ్ విశేషాలను చచ్చినా ఒక ఛానల్లో మాత్రం చూడవద్దు. ఏ ఛానలో అర్ధం అయిందా? కాకపోతే ఇవి చదివి అర్ధం చేసుకోండేం !
౦౧. ఇది ఒక వార్తా ప్రసార వాహిక
౦౨. సమాజం కోసం పడి….చచ్చి పోతూ వుంది.
౦౩. నిరభ్యంతరంగా అసభ్య దృశ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ప్రసారం చేయగల సత్త వుంది
౦౪. అందరూ అదృష్ట సంఖ్యగా భావించే ఒక సంఖ్యతో వీరికి చాలా దగ్గర
ఇప్పుడు బుర్రలో దీపం వెలిగుంటుంది.
క్రికెట్ వ్యాఖ్యానన్ని వీరి కంటే పరమ దరిద్రంగా, నీచంగా ఎవరూ చెప్పలేరు. కావాలంటే పందెం కాస్తా…
మచ్చుకు ఈ రోజు వారి వ్యాఖ్యానం ఇలా వుంది….
" వన్ ట్వంటీ రేంజి దాటలేని పఠాన్ తో ఎటాక్ స్టార్టు చెయ్యించటమే మన బౌలింగ్ రిసోర్సెస్ కెపాసిటికి అద్దం పట్టింది. యువరాజు డ్రీమ్ స్పెల్, స్పిన్ ట్విన్స్ కుంబ్లే, హరభజన్ రొటీన్ కంట్రిబ్యుషన్స్ తో……"
మీకి నాకి మాట్లు నమ్మకమ్ లేక్పోతే ఈ రోజుది రాత్రి వార్తలలో ఆ ఛానల్ సూసి నాకి మర్‌లా చెప్పండి. (ఇదే కాస్త నయమేమో…వారి తెగులు కన్నా) :-)
కాబట్టి…ఇక చెప్పడానికి ఏమీ లేదు…చూస్తే Live చూడండి. లేకపోతే హాయిగా కూడలిలో ఎవరో ఒకరు వ్యాఖ్యానం రాస్తారు..చదవండి..లేకపోతే మంచి వార్తా పత్రికలోనో చదవండి. అది కాదనుకుంటే హాయిగా పడుకోండి.
ఇలా అయితే కష్టం
ఇండియా చెత్త బౌలింగు...దానికి పోటీనా అన్నట్లు నెదర్లాండు టెస్టు బ్యాటింగు. ఎంత ప్రాక్టీసు మ్యాచ్ అయినా ఇంత చెత్తగా ఆడాలా? :-( పదిహేను ఓవర్లలో ఒక వికెట్టుకు నలభై పరుగులా...ఛీ ఛీ
నేను తీవ్రంగా ఈ బ్లాగుముఖంగా నిరసన వ్యక్తం చేస్తూ నిద్రకుపక్రమిస్తున్నాను(ఇంకేమీ చెయ్యలేక)
Sunday, March 04, 2007
ఈ విషయం మరో ముగ్గురికి చెప్పండి...
చాలా రోజుల తర్వాత ఏపి మీడియాలో వజ్రోత్సవ తగవు మీద ఒక జాబు వచ్చింది. ఆ జాబు పాఠంలో కొంత యూనికోడ్లో మీ కోసం. ఇందులో ప్రస్తావించిన పేర్లు, విషయాల మీద నాకు ఏ మాత్రం సంభంధం లేదు. మీకు ఏమైనా అభిప్రాయాలు రచయతకు తెల్పాలని అనిపిస్తే apmedia.blogspot.com లో తెలపండి.
"రాజకీయాలు, సినిమాలు - రెండు రంగాల్లోనూ ఎంతో డ్రామా ఉంటుంది. ఎందరో నటులు కూడా ఉంటారు. ఆప్యాయంగా పలకరించుకోవటం, అభిమానంగా మాట్లాడుకోవడం- ఇవన్నీ బయటకు కనిపించేవి అయితే లోపల్లోపల కారాలు, మిరియాలు నూరుతూ వీలయునంత లోతైన గోతులు తవ్వటం కూడా మనకు తెలుసు. …..
రంగు పడిందిరో !
ఈ రోజు హోలీ…మన దేశంలో జరిగే అందమైన పండుగలలో ఒకటి. అయితే ఈ రోజు నేను ఎక్కడికీ బయటకు వెళ్లలేదు. చాలా రోజుల క్రితం జరిగిన ఒక కామెడీ సంఘటన వలన హోలీ అంటేనే ఏదో తెలియని అయిష్టత ఏర్పడిపోయింది. ఆ సంఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ మా స్నేహితులందరం తెగ నవ్వుకుంటాం.
పీ.జీ చేస్తున్న రోజులలో కొంతమంది స్నేహితులతో కలసి విశాఖలో మద్దిలపాలెంలో కొన్ని రోజులు వున్నాను. అప్పుడు వచ్చిన హోలీ రోజు జరిగినది ఎప్పటికీ మర్చిపోలేని కామెడీ.
తెల్లవారు జామున ఏడు గంటలకు అనుకుంటా తలుపు ఎవరో చాలా వైల్డ్ గా బాదుతున్నారు. బద్ధకంగా అటు ఇటూ దొర్లుతున్న నేను "ఇది కల…ఇది కలే కదా" అని కోట శ్రీనివాసరావు టైపులో అనుకుంటుండగా, అలా అనుకోలేని నా స్నేహితుడు వెళ్లి తలుపు తీసేశాడు. అప్పుడు తీసిన తలుపు మరలా తియ్యటానికి మాకు మధ్యాహ్నం రెండు వరకూ కుదరలేదు..ఎందుకో తెలియాలంటే మొత్తం చదవాలి మరి.
తలుపు తీసి చూసిన వెంటనే మెరుపు వేగంతో మొహాల మీద రంగులు ఎవరో పులిమేస్తున్నారు. నిద్రలోనుంచి మొత్తం తేరుకుని చూస్తే మా రాజు గాడు. వాడు తెళ్లారే సరికి మరో కోతి పనుల స్పెషలిష్టు అమర్, మిగతా వాళ్లను వేసుకుని మా మీదకు దండయాత్రకు వచ్చాడన్న మాట. మాకు జరిగిన సత్కారమే మిగిలిన వారికి జరిగిందనటానికి వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న అతి ఆనందం తెలుపుతుంది. అదీ కాక మమ్మల్ని త్వరగా తయారు కమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. కష్టం మీద కాలకృత్యాలు తీర్చుకుని, ఒక పనికి రాని టీ-షర్టు వేసుకుని ఆ గుంపులో పడి రోడ్డు మీద పడ్డాం. రోడ్ల మీద ఎక్కడ చూసిన తెగ హడావిడిగా రంగులు జల్లుకుంటూ తిరుగుతున్నారు. అలా వెళ్తూ మా బెంగాలీ ఫ్రెండు సౌరవ్ భౌమిక్ ఇంటికి వెళ్లాం…వాడి సుడి బాగుండి ఎక్కడికో తెలియని ప్రదేశానికి అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు. వాడికి ఎవరయినా ఉప్పందించారో ఏమో మరి.
మొత్తానికి ఎలా అయితేనేం బయలు దేరి అలా RTC X Roads కు వచ్చాం. ఇంతలో అతి దగ్గరలో ఒక పోలీస్ జీప్ కనిపించింది. వైజాగ్‌లో ఎలాగూ పోలిస్ హడావిడి ఎక్కువే గదా అని వారి దగ్గరగా వెళ్లాం. అందరూ త్వరగా ఎక్కాలమ్మా…త్వరగా అని వినిపించింది. ఎవరిని వీళ్లు ఎక్కమంటున్నార్రా అని చూస్తే…అక్కడ మేం తప్ప ఇంకెవరూ లేరని అర్ధం అయింది. కానిష్టేబుల్ కొద్దిగా మర్యాదగా చెప్పాడన్నమాట. మా వాడు ధైర్యంగా ఎందుకు,ఏమిటి, ఎలా అని వారిని అడిగాడు. పోలీస్ ఎప్పుడయినా జవాబు చెప్తాడా..? ఉట్టిదేనమ్మా…కొద్దిగా అల్లర్లు అవుతున్నాయి. మిమ్మల్ని తీసుకెల్లి ప్రశ్నలు నాలుగడిగి వదిలేస్తారంతే అన్నాడు. సరే ప్రశ్నలన్ని స్టేషన్ హెడ్డు గారినడగండి, ముందు ఎక్కండి బాబు అన్నాడు. మేము ఏం తప్పు చెయ్యలేదు కనక హాయిగా లిఫ్టు అడిగి ఎక్కి కూర్చున్నట్లు జీపులో మొత్తం పొలో అని ఎక్కేసాం. మేం పోలీసుల మీద, వారు మా మీద జోకులేసుకుంటుండగా 2-టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేసింది. అదే జీవితంలో మొదటి సారి ఒక పోలీస్ స్టేషన్లోనికి పోయి కూర్చోవటం. అక్కడా ఒక ఏభై మంది వరకూ విధ్యార్ధులు వున్నారు. అందరి మొహాలు రంగు రంగులతో కోతుల్లా వున్నారు.
కాసేపు హెడ్డు గారిని సతాయించితే మాకొక దండం పెట్టేసి అక్కడ గోల చెయ్యకుండా కూచోండి బాబు అని బెంచీలు చూపించారు. సరే అని కూర్చున్నాం. మనసు వూరుకోక అలా వైర్లెస్ సెట్లో వస్తున్న మాటలు వినసాగాం..
ఆ సార్ ఇక్కడ ఒక పది మందిని తెస్తున్నాం సార్…ఓవర్
లేదు సార్..నేను బీచ్ పార్టీ సార్…అవును సార్ మొత్తం ఒక ఇరవై మంది వుంటారు సార్ ఓవర్
ఇలా సాగిపోతుంటే…ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. నవ్వటానికి కండరాలు మొరాయిస్తున్నాయ్. మెల్లగా ఒక కానిస్టేబుల్ ని కదిపితే అసలు విషయం తెలిసింది. అదేమిటంటే…
ఆ రోజు చాలా మంది ఆకతాయిలు రంగులలో కోడిగుడ్లు కలిపేసి జనాల మీద చల్లటం మొదలు పెట్టారు. కొంత మంది దారిన పోతున్న నన్స్ మీద పొయ్యటంతో వాళ్లు ఫిర్యాదు చేసారంట. అంతే ఇక విశాఖ పోలీసులకు అసలే పని వుండదు. ఇలాంటి అవకాశాలు వదులుతారా? జీపులేసుకుని రోడ్ల మీద పడ్దారు. ఫలితం మేం ఇక్కడా ఈ విషయాన్ని గురించి ఆరా తీస్తూ….కూర్చున్నాం. నాకు ఆ భయం కంటే ఆ రోజు కాలేజీలో వున్న ఇంటర్నల్ పరీక్ష మీదే దృష్టంతా….డుమ్మా కొడితే ఫలితాలు ఎలా వుంటాయో చెప్పలేం. కాసేపయ్యాక మేమందరం ఒక వంద మంది తయారయ్యాం. అప్పట్లో సెల్ ఫోన్లు అంతగా లేవు కనక ఎవరినీ పిలవలేని పరిస్థితి. ఒక పక్క ఆకలి.
మా అందరినీ మేడ పైన ఉన్న ఒక పెద్ద రూములో సమావేశపరిచి మమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో ఒకతను వివరించాడు. అందరూ పిల్లి గుడ్లేసుకుని విని "ఆ మనం కాదులే" అనుకున్నారు. నిజానికి అక్కడున్న వాళ్లందరూ అమాయకులే. మొహాన రంగున్న పాపానికి అక్కడ వున్నారు.ఒకడు మెల్లగా హెడ్డు దగ్గరకు వెళ్లి, "సార్ నేను AVN College సీనియర్ ని సార్" అన్నాడు…ఏదో డాన్ కి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్లు. హెడ్డు అదోలా మొహం పెట్టి…"అహా అలాగా…అయితే ఇప్పుడు ఏంటి?" అన్నాడు. పప్పులుడకవని అర్ధం అయ్యి వాడు మెల్లగా జారుకున్నాడు.
మా స్నేహితులలోని ఒకడు లాయర్ గారి అబ్బాయి. వాడు మెల్లగా ఎలాగో ఒక ఫోన్ చెయ్యించాడు ఇంటికి. ఆ తరువాత మేం ధీమా సరదాగా కూర్చుని మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మా ఎనిమిది మందిని మాత్రమే వదిలారు. అది కూడా ఆ లాయర్ గారు చేసిన కాల్ వలన. మేం హమ్మ్యయ్య అనుకుని ఇంటికి వచ్చి తలుపు మరలా తీసే సరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే, పాపం మిగిలిన వాళ్లందరికి రాత్రి ఎనిమిది గంటల వరకూ వుంచేసారంట. అప్పుడు వేసింది మాకు భయం :-)
అలా జరిగింది ఆ హోలీ. రంగులన్నీ కలిస్తే తెలుపు రంగు అవుతుంది. మాకు మాత్రం ఎరుపు రంగు తయారయింది. చివరికి రంగు పడింది :-)
Tuesday, February 27, 2007
మన రంజని : గల్ఫ్ దేశాలకు తెలుగు వీనులవిందు
వచ్చే మార్చి ఇరవై నుంచి "మన రంజని" అనే తెలుగు రేడియో మొదలవబోతుంది. మన హైదరాబాదులో కాదు లెండి. గల్ఫ్ లో వున్న ఏడెనిమిది దేశాలలో. ఈ రేడియో ముందర ప్రతి శుక్రవారం రెండు గంటలు వచ్చేదంట. బాగా అందరికి నచ్చడంతో ఇప్పుడు ప్రతి రోజూ నాలుగు గంటలు (మధ్యాహ్నం మూడు నుంచి ఏడు గంటల వరకూ) ప్రసారం చెయ్యబోతున్నారు.
గల్ఫ్ దేశాలలో వున్న తెలుగు వారందరు 1152 AM ద్వారా ఈ ప్రసారం విని ఆనందించవచ్చు.
Sunday, February 25, 2007
సీమాస్ పై "సీ" లిపి సాహసం
ఈ మధ్య ఒక స్టూడెంట్ ఇంటర్న్ తో మాట్లాడుతూ వుంటే "సీ" ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ మీదకు విషయం మళ్ళి చర్చ రసవత్తరంగా సాగింది. ఆ సందర్భంగా మేము కాలేజీ రోజుల్లో చేసిన "C"లిపి పని ఒకటి గుర్తుకొచ్చి అది ఇక్కడ రాస్తున్నా….
అవి విశాఖలో కంప్యూటర్ సైన్సు పీ.జీ వెలగబెడుతున్న రోజులు. జీవితం హాయిగా వున్న రోజులన్న మాట. వీలయితే క్లాస్ కు వెళ్లటం, ఆ క్లాస్ నచ్చక పోతే పొలోమని ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి పోయి అక్కడ యుగాల తరబడి పీ.హెచ్.డి లు గట్రా చేసుకుంటున్న హాస్టల్ పక్షులతో క్రికెట్ ఆడుకోవటం. ఆనక MVP Colony సెంటర్ కి గానీ, కైలాసగిరి గానీ ఎక్కి కూర్చుని రాత్రి ఎనిమిదికి ఇంటికి చేరటం. ఇదంతా ఎలా సాధ్యమయ్యేదంటే రూములో కంప్యూటర్ లేక పోవటమే. ఆ రోజులలో కంప్యూటర్ కొనటమంటే కొద్దిగా ఇబ్బంది అయిన విషయమే..(మనకి కాదు…మన నాన్నలకి ;-))
మా రూములో మొత్తం నలుగురుం వుండే వారం. ఓనరు గారు కూడా పక్క ఇంట్లోనే వుండేవారు. మాతో బాటు ఓనర్ అంకుల్ గారి బంధువులబ్బాయి కూడా ఒకతను వుండేవాడు. ఈ కధలో బాధితుడు అతడే. పేరు రావు. ఇతడు కొద్దిగా 'అతి' మనిషి. ఆశు కోతత్వం అనే విద్య ఒంట బట్టిన వాడు. కోసే కోతలకు అంతే వుండేది కాదు. ఒకప్పుడు తను వైరస్ ప్రోగ్రామర్ అని చెప్పుకునే వాడు. మా ఫ్రెండ్ ఒకడికి అప్పట్లో ఎలా అయినా జీవితంలో ఒక వైరస్ రాద్దామనే చెత్త కోరిక వుండేది. IBM వారు ప్రచురించిన ఒక పెద్ద పుస్తకం "DOS Interrupts" ని పట్టి తెగ చదివేస్తూ వుండేవాడు. Interrupts తో ప్రోగ్రామింగ్ చెయ్యటమంటే దాదాపు కంప్యూటర్ జీవితంతో చెలగాటం ఆడుకోవటమన్నట్లే…రాసిన కోడ్ వల్ల కంప్యూటర్ ఎప్పటికీ పనికి రాకుండా పోవచ్చు.
అయితే అదలా వుంచి వాడితో సహా మొత్తం అందరం రావు గారి కోతలు ముందర నమ్మేసాం. అప్పట్లో మాకు సీ లాంగ్వేజీలో ఏదేదో చేసేద్దామని మహా ఇదిగా వుండేది. అది అతను వుపయోగించుకుని అలా కోతలు కోసాడన్నమాట. కాకపోతే తరువాత అర్ధం అయ్యింది అసలు భాగోతం అనుకోండి.
అయితే ఈ రావు గారు ఒకానొక దుర్ముహర్తంలో గుంటూరు నుంచి తన కంప్యూటర్ను తెచ్చాడు. తెచ్చాడే కానీ అతనికి గుండె గుబ గుబ మంటూనే వుండేది.ఎక్కడ మా "C" ప్రయోగాలు ఆ కంప్యూటర్ మీద చేస్తామో అని. మా రూమ్మేట్ గాడు "C" లో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చేసేవాడు. ఒక తెల్ల కాగితం మీద అడ్డదిడ్డంగా కోడు తెగ రాసుకుపోయి వాళ్ళ కాలేజీ ల్యాబ్లో టైపు, రన్ చేసి సరదా పడిపోయే వాడన్న మాట. అలాంటి వాడికి ఇక రూముకు ఒక కంప్యూటర్ వస్తే ఆనందానికి హద్దేముంది?
అయితే ప్రమాదాన్ని పసిగట్టిన రావు, తన కంప్యూటర్‍కు BIOS స్థాయిలో పాస్‍వర్డ్ ఒకటి పెట్టేసాడు. ఆ పాస్ వర్డ్ CMOS అనే చోట భధ్రపరచబడి వుంటుంది. అది ఇవ్వకపోతే కనీసం ప్లాపీ కూడా పనిచెయ్యదన్నమాటే. తను వున్నపుడు పాస్‍వర్డ్ కొట్టి మాకు కొంత సేపు కంప్యూటర్ ఇచ్చేవాడు. పాస్‍వర్డ్ కూడా చెప్పేవాడు. కానీ రాత్రికి రాత్రి మరలా పాస్‍వర్డ్ మార్చేసే వాడు. అదేంటి మీరిచ్చిన పాస్‍వర్డ్ పనిచెయ్యటం లేదంటే…అదీ…కొన్ని సార్లు మదర్ బోర్డు మీద బ్యాటరీ వీక్ అయితే అలా పాస్‍వర్డ్ మారిపోతుందని చెప్పేవాడు. ఇదంతా మాకు చాలా అవమానంగా తోచింది. కొద్దిగా R & D చేస్తే అర్ధమయింది ఏమిటంటే మదర్ బోర్డు మీద బ్యాటరీ ఒక సారి పీకి మరలా పెడితే ఆ పాస్‍వర్డు పోతుందని అర్ధం అయింది. కానీ అలా చెయ్యాలంటే మొత్తం కంప్యూటర్ ను విప్పాలి. అది జరగని పని కదా…ఇక ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించి "C" లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసి ఆ పాస్‍వర్డును తీసేస్తే ఎలా వుంటది? అనే ఛండాలమయిన అవుడియా వచ్చింది. రావటమే తరువాయి, మా వాడు రంగంలోనికి దిగి ఎక్కడి నుంచో ఒక రెండు లైనుల ప్రోగ్రాము తెచ్చాడు. దానిని వాడు వాళ్ల కాలేజీ లాబ్లో క్షుణ్ణంగా పరీక్షించి మరీ ఒక ఫ్లాపీలో తెచ్చాడు.
అయితే ఇప్పుడు ఆ ప్రోగ్రామును ఆ కంప్యూటర్లో RUN ఎలా చెయ్యాలి. రావు ఎప్పుడు మాతోనే వుండేవాడు. బయటకు వెళితే పాస్‍వర్డ్ మార్చేసి చక్కా పోయేవాడు. కాబట్టి ఒక మంచి అవకాశం కోసం సిద్ధంగా వుండే వాళ్లం. ఒక మంచి ముహూర్తాన ఎందుకో చేస్తున్న పని మధ్యలో రావు గారికి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, దాని కోసం అతను ఓనరు గారి పోర్షన్ లోనికి వెళ్ళాడు. దొరికిందిరా ఛాన్సు అని మా ఫ్లాపీ పెట్టి ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసాం. టెన్షన్ గా వుంది…అసలు వర్కవుట్ అవుతుందో లేదో అని. ఒక మా వాడి మీద నాకు డౌటు. అసలు ఈ ప్రోగ్రామ్ పని చేస్తుందా లేదా అని. మొత్తానికి ఒక సెకండ్లో RUN అయింది. కానీ ఏమీ జరగ లేదు. అంతా నార్మల్ గా వుంది. Password పోయే వుంటుందని మా ఫ్లాపీ తీసేసి బుద్ధిమంతుల్లా కూర్చున్నాం. ఆ రోజు మా అదృష్టం వలన అతడు మాకు పాస్‍వర్డ్ చెప్పలేదు. మేం చచ్చినా అడగలేదు. అడిగితే ఎక్కడ మరలా కొత్త పాస్‍వర్డ్ పెడతాడో అని భయం :-)…..మొత్తానికి మరుసటి రోజు అతను కాలేజీకి వెళ్ళాక మేం కంప్యూటర్ ఆన్ చేసాం.
హుర్రే ! Password Gayab…..Password పోయిందే….:-) అప్పుడు చూడాలి మా ఆనందం. దాన్ని అణుచుకుంటూ అక్కడితో ఆగకుండా అప్పుడే ఒక క్రూరమైన పని చేసాం. ఆ కంప్యూటర్ BIOS కు మా పాస్‍వర్డు పెట్టేసాం. రావు గారి పేరు, virus కలసి వచ్చేలా ఏదో పెట్టాం. ఆ ఆనందంలో సాయింత్రం ఛాట్ గట్రా గడ్డీ గాదరా బాగా తిని ఆనందంగా రూమ్ కి చేరేటప్పటికి రావు గారు ఆదుర్దాగా రకరకాల పాస్ వర్డ్ల్ లు కొడుతూ కనిపించారు. కాసేపయ్యాక మా దగ్గరకు వచ్చి పాస్ వర్డు పనిచెయ్యటం లేదయ్యా అన్నాడు బిక్క మొహం వేసి. మేం అంతకంటే అమాయకంగా మొహం పెట్టి అలాగా పాపం…బ్యాటరీ వీక్ అయ్యిందేమోనండీ అన్నాం …ఉబికి వస్తున్న విలన్ నవ్వునాపుకుంటూ…ఒక్క సారి షాక్ తినటం అతని వంతయ్యింది. ఎందుకంటే అతని బాణం అతనికే ఎవరైనా ఎక్కుపెడతారని వూహించలేదు మరి. ఇంకేమీ అనలేక…అవునంటారా? అదే అయివుంటుంది అన్నాడు. అతను మాతో కోతలయితే కోసాడు కానీ, ఆ బ్యాటరీ ఒక సారి పీకి పెడితే పాస్ వర్డ్ పోతుందని తెలియదు :-)
అప్పటి నుంచి ఇక ఆ కంప్యూటర్ మా మాట మాత్రమే వినటం మొదలయింది. రావు బయటకు వెళ్లటం మొదలు…మరలా వచ్చే వరకు అది పని చేసేది. తరువాత మూగ బాటే. కొన్నాళ్లకు ఆ కంప్యూటర్ని మొత్తం గుంటూరు తీసుకు వెళ్లి బ్యాటరీ పీకించి పాస్ వర్డ్ మార్చారనుకోండి :-) ఇదంతా జరగడానికి ఒక మూడు నెలలు పట్టింది.
కాకపోతే అప్పటి నుంచి రావు గారి పేరు మా మిత్ర బృందంలో "CMOS(సీమాస్)" గా మారిపోయింది :-) ఇప్పటికి కూడా అదే పేరు. అయితే ఇప్పటికీ అతనికి ఈ విషయం తెలియదు. కాబట్టి హుష్…ఎవ్వరూ చెప్పొద్దు ;-)
Friday, February 23, 2007
జాగ్ : ఆర్డర్ ఆఫ్ కెనడా
ఇది లోకంలో సగానికి పైగా వున్న సాఫ్టువేరు నిపుణులకు ఆనందకరమైన వార్త. ఇందుగలడందులేడను సందేహము లేని జావా భాషను కనిపెట్టిన సాఫ్టువేరు శిల్పి జేమ్స్ గోస్లింగ్ (జాగ్ గా అందరికి పరిచయం) ని కెనడా ప్రభుత్వం వారి ఉన్నతమైన గుర్తింపు ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ కెనడాతో సముచితంగా సత్కరించుకోనుంది.
ప్రస్తుతం జాగ్, సన్ మైక్రో సిస్టమ్స్ లో ఉపాధ్యక్షులుగా వున్నారు. జాగ్ బ్లాగు ఇదిగో ఇక్కడ చూడండి.
మాట రాని ఆనందమిది...
నా బ్లాగు అవార్డు గెలుచుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు బ్లాగుల మువ్వల సవ్వడి అంత అద్భుతంగా వుంది. దీనికి సాక్ష్యం వోట్ల సంఖ్య . దాదాపు అన్ని బ్లాగులూ మంచి ఎన్నిక శాతాన్ని సంపాదించాయి. అన్ని మంచి బ్లాగులే అయితే ఏది మంచిదో తేల్చుకోవటం కష్టమే కదా. ఇది చాల మంచి శకునం. ఖచ్చితంగా తెలుగు బ్లాగులకు మంచి రోజులొచ్చాయి. దీనంతటికి కారణమైన లేఖిని , కూడలి, తేనె గూడు మరియు తెలుగు బ్లాగుల ప్రపంచానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా బ్లాగుకు ఈ గుర్తింపు రావటానికి కారకులైన తోటి తెలుగు బ్లాగరులకు, నా బ్లాగు పాఠకులకు మనసా వాచా ధన్యవాదాలు. తెలుగు బ్లాగు పోటీల జ్యూరీ సభ్య్లులకు ధన్యవాదాలు.
ఈ e-తెలుగు ప్రపంచానికి తెలుగు బ్లాగర్లు, తెలుగు బ్లాగు పాఠకులే ప్రాణవాయువు . మీరు లేని ప్రపంచంలో బ్లాగింగు ఎడారిలో ఎలుగెత్తి మాట్లడమే అవుతుంది . తెలుగు బ్లాగులను ఇలాగే ఎప్పుడూ ఆదరిస్తారని, సద్విమర్శలతో దిన దిన ప్రవర్ధమానం చేస్తారని ఆశిస్తూ...మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటున్న....
మీ
సుధాకర్ (శోధన)
Wednesday, February 21, 2007
మాతృ భాషా దేవో భవ...
ఈ రోజు ప్రపంచ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా TV9 మన తెలుగు ప్రజలు తెలుగుని ఎంత వుపయోగిస్తున్నారు అనే విషయం మీద చిన్న సర్వే చేసారు. అట్టా ఆశ్చెర్యపోకబ్బాయ్…అప్పుడప్పుడు దయ్యాలు కూడా వేదాలొల్లిస్తాయ్ మరి. మొత్తానికి ఏదయితేనేం సర్వే చేసారు.
ఈ సర్వేలో తెలిసినదేంటి అంటే చాలా మందికి అచ్చులు ఎన్నో, హల్లులు ఎన్నో తెలియవు.
కొంతమంది ఋ, ౠ లను మర్చిపోయారు
కొంతమందికి హల్లులు నాలుగేనంట :-) (కొంపతీసి A B C D లా? )
ఒకరేమో తెలుగులో అచ్చులు, హల్లులు వుంటాయని మీరడిగితేనే తెలిసింది.
వీటన్నింటికి కారణం మనకు ఆంగ్లంపై వున్న మక్కువనుకుంటున్నారా? కానే కాదు. తల్లి తండ్రులు అంతకన్నా కాదు. అస్తవ్యస్తంగా వున్న విద్యా వ్యవస్థ, అరకొర జీతాలతో బతుకుతున్న ఉపాధ్యాయులు…అసలు తమకే సరిగా విద్య రాని ఉపాధ్యాయులు దీనికి ప్రధాన కారణం.
అయితే ఒక్కటి మాత్రం నిజం. తెలుగు ఒక భాషగా మాత్రం చచ్చిపోయే ప్రసక్తే లేదు. కొన్ని కోట్ల రూపాయల టీ.వీ ఛానల్లు, సినిమా పరిశ్రమ ఈ భాష మీదే బ్రతుకుతున్నాయి మరి. అవి ఎంత పెరిగితే తెలుగు అంత క్షేమం (ఎదో ఒక రూపంలో).
ఒక్క సారి అచ్చులు , హల్లులు చూడటానికి బాల శిక్ష చూద్దాం పదండి.
Monday, February 19, 2007
తెలుగు సినిమాల భవితవ్యం
ప్రస్తుతానికి ఇలాంటి సీనులు చాలా వున్నాయనుకోండి. కానీ ఈ సీను మాత్రం అల్టిమేట్ కిల్లర్ సీను. బహుశా బాలయ్య దీనిని చెయ్యటానికి సాహసించవచ్చు. గతంలో అతను ట్రైనుని వెనక్కి, కుర్చీలను ముందుకూ కంటి చూపుతో కదిపిన అనుభవం వుంది. పదో తరగతి కూడా పాస్ కానీ స్టంటు మాస్టర్లు, దర్శకులు సినిమాలలోకి వస్తే ఇలానే వుంటది మరి. జై వజ్రోత్సవ లిజెండ్సెలిబ్రిటీ సహిత తెలుగు చిత్ర మాత! జై. !
ఇది నవ్వే విషయమా?
నాకు తెలియదు....
అంతా చట్ట ప్రకారమే...
చంద్రబాబును కోర్టుకు వెళ్ళమనండి..
ఏదీ తెలియకపోవడమే నాకున్న పెద్ద మంచి లక్షణం...
సీ.ఎన్.ఎన్ ఐ.బి.ఎన్ వారి "చీల్చి చెండాట" భలే వుంది. సమాజం కోసం అని చంకలు గుద్దుకునే TV9 ఒక్క సారి ఈ ఛానల్ వారి నాణ్యత చూస్తే మంచిది. రేప్పొద్దున్న ఈ ఛానల్ చంద్రబాబును కూడా ఇలానే ప్రశ్నలు అడగవచ్చు.
ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకటి అర్ధమైంది. పిచ్చ కోపం వచ్చినప్పుడు రాజశేఖరరెడ్డి నవ్వుతారని. :-) ఇది Art Of Living స్టయిలా? లేకపోతే మున్నాభాయి MBBS మామూ స్టయిలా :-)
మొత్తానికి మన CM గారికి చాలా ఇంటి విషయాలు తెలియవని అర్ధం అవుతుంది. చాలా ప్రదేశాలలో తనకు భూములు వున్నందువలన కొన్ని (తన సొంత Income Tax declarations) తనకు తెలియవని వారు సెలవిచ్చారు. ప్రతి పది నిమిషాలకు "చంద్రబాబును కోర్టుకు వెళ్ళమనండి" అని సవాల్లు విసిరారు. తను ప్రజలకు జవాబుదారీ కానీ చంద్రబాబుకు కాదని అతను ఎప్పుడు అర్ధం చే్సుకుంటారో. "నా ప్రజలలో ఎవరినైనా కోర్టుకు వెళ్ళమనండి" అని వుంటే బాగుండేది. మొత్తానికి విషయమేమిటంటే...ఏ చెత్త పని అయినా చెయ్యు. కానీ చట్టానికి దొరకని విధంగా చెయ్యు. ఎదుటి వాడిని కోర్టుకు వెళ్ళమని సవాలు చెయ్యు. ఇదండీ మనం నేర్చుకోవాల్సిన ఆధునిక నీతి.
ఇంటి విషయాలు అస్సలు పట్టించుకోకుండా, రాష్ట్రానికి సేవలు చేసే ముఖ్యమంత్రులు ఎందరుంటారు చెప్పండీ. కోటికొక్కరుంటారేమో ! ఎంతైనా ఆంధ్రులు అదృష్టవంతులు. :-)
Saturday, February 17, 2007
దేశ ముదురు - ( A )
చాలా రోజులుగా తెలుగు సినిమా చూడలేదు కదా అని అలా ఏదో ఒక సినిమా చూద్దామని ఫ్రెండ్స్ తో కలసి పైన చెప్పున సినిమాకు వెళ్ళాను. ఆహా ఏమి చిత్ర రాజం?
అసలు ఇది పూరి జగన్నాధ్ చిత్రమేనా అనిపించింది ముందర (అమ్మా..నాన్న..తమిళమ్మాయి ప్రభావం వలన). తరువాత మెల్లగా ఇలాంటి సినిమాలు కేవలం పూరి మాత్రమే తియ్యగలడు అని అర్ధం అయింది. అసలు కధ ఏమిటో ఎందుకు ముందుకు సాగుతుందో అర్ధం కాదు. కధతో సంబంధం లేని కామెడీ ట్రాకు (కాస్త బాగున్నది ఇదే). విపరీతమైన అరుపులు సినిమా అంతటా సమంగా పరచుకున్నాయి. హీరోయిన్ తప్పితే ప్రధాన పాత్రలు అన్ని కనీసం 150 డెసిబల్స్ స్థాయిలో అరుపులు, సంభాషణలు సాగిస్తాయి. అది పూరి మార్కు.
ఇక కధ విషయానికొస్తే పెద్దగా ఏమి లేదు. అన్ని తెలుగు సినిమాలలాగానే బయటి రాష్ట్రాలలో (కులూ, మనాలి) అందరూ తెలుగు మాట్లాడేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ఉన్న విలనీయులు మాత్రం తెలంగాణా యాసతో కూడిన తమిళం (అదే మరి పూరి స్టయిల్) మాట్లాడుతుంటారు (అరుస్తుంటారు). హీరో విషయానికొస్తే తండ్రిని ఏరా అని పిలిచే స్థాయి ఉన్న ఒక చిన్న సైజు సిల్వస్టర్ స్టాలిన్. ఇతనికి ఎదురంటూ పెద్దగా ఏమీ లేవు/లేదు. పిట్ట కొంచం కూత ఘనం అన్న మాట. మా-టీవి ని సొంత టీవి లా వాడేసుకుంటూ వుంటాడు.(అల్లు అరవింద్ కి కూడా మా-టీవీ వాటాలున్నాయా? కొంపతీసి?). ఒక టీవి ఛానల్ వారు గూండాలు వస్తున్నారని వణికి పోవటం మనం ఈ చిత్రంలో చూస్తాం.
హీరో ఉద్యోగ నిమిత్తం కులూ, మనాలి వెళ్ళి అక్కడ ఉన్న ఒక యోగినిని ప్రేమ అని వేధించటం చిత్రంలో 50% వుంటుంది. అది కూడా పూరీ మార్కులో "ఏమే…నాకు ఏం తక్కువే? , నీకు కొవ్వెక్కిందే? …" ఇలా సాగిపోతుంది. ఇలా వేధిస్తే ప్రేమలో పడే అమ్మాయిలు ఎక్కడ వుంటారో పూరికే ఎరుక. ఈ యోగినిలు కూడా చాలా విచిత్రంగా వుంటారు. పూర్తిగా మస్కారా, లిప్ స్టిక్కు, ఫేషియల్ తో భలే వుంటారన్న మాట. అన్నట్లు కలర్డ్ జుత్తు కూడా. అన్ని తెలుగు సినిమాలలానే హీరోయిన్ అందరి మధ్యలో, ముందరగా నడుస్తూ ఫ్రేమ్ ను లీడ్ చేస్తూ వుంటుంది.
ఇక మిగతా విషయాలు…దయ చేసి మీ పిల్లలను మాత్రం ఈ చిత్రానికి తీసుకు వెళ్ళవద్దు. విపరీతమైన హింస, మొహానికి రక్తాలు రాసుకోవడాలు లాంటివి జుగుప్సాకరంగా వున్నాయి. మనిషిని పట్టుకుని పరపరా మధ్యకు విరిచెయ్యటం వంటివి అయితే చెప్పనక్కరలేదు.
చక్రి, పూరి కలిస్తే ఎలా వుంటుంది? చెవులు దిమ్మెక్కిపోయే అరుపులుతో కూడన పాటలు పుట్టాయి. అవి కూడా చక్రి తనదైన గొంతులో పాడి చిరాకు తెప్పించాడు. అర్జున్ చేసిన డాన్సులు మాత్రం బాగున్నాయి.
మొత్తం మీద ఈ చిత్రం నన్ను బాగా నిరాశ పరిచింది. నేను ఈ చిత్రం మీద ఏ రకమైన ఊహతో వెళ్ళలేదు కానీ, కనీసం ఒక మంచి తెలుగు చిత్రం స్థాయిలో అయినా వుంటుందని ఆశించాను. పదికి మూడు మార్కులు వస్తాయి ఈ చిత్రానికి.
Friday, February 16, 2007
జగన్నాటకం మొదలయింది
చాలా రోజుల నుంచి అనుకుంటున్నట్టుగా జగన్నాటకం మొదలు పెట్టాను. ప్రస్తుతానికి నేను, త్రివిక్రం గారు ఈ బ్లాగు సభ్యులం. మీకు కూడా ఈ బ్లాగులో రాయటానికి ఆసక్తి ఉంటే చెప్పండి. ఆనందాహ్వానం సిద్ధంగా ఉంటుంది.