Sunday, January 27, 2008

కొన్ని మంచి సినిమాలు చూసా !

చాలా రోజులకు ఒక రెండు సినిమాలు ఇంట్లో చూసే భాగ్యం దక్కింది. అది కూడా లాప్ టాప్లో మాత్రమే. ఒక సిడాడే డి డ్యూస్ (సిటీ ఆఫ్ గాడ్స్) అనే బ్రెజిలియన్ సినిమా. గ్యాంగ్‍స్టర్ సినిమాలలో ఒక రేంజి వున్న సినిమా ఇది.

CidadedeDeus  రియోడి జెనీరోలో శరణార్ధుల శిబిరాల్లో పుట్టే బాల గ్యాంగ్‍స్టర్ ముఠాలపై తీసిన సినిమా ఇది. చాలా మంది నటులు నిజజీవితపు పాత్రలనే ఇందులో పోషించారు. అద్భుతమైన టెక్నిక్ ఈ సినిమా సొంతం. కధను వెనక నుంచి మొదలు పెట్టి Iamlegendఅంతం తాలుకా ఆరంభం అనే స్టయిల్లో చెప్పిన కధ ఇది. వీలయితే మీరు చూడండి. పద్దెనిమిది ఏళ్లు దాటని వారు చూడకూడని హింస వుంది ఈ సినిమాలో, కాబట్టి పిల్లల్తో జాగ్రత్త.

E! మ్యాగజైన్ దీనిని Movies to watch before you Die అనే పట్టికలో మూడో స్థానంలో చేర్చిందంటే ఈ సినిమా స్థాయి అర్ధం అవుతుంది. అంతే కాక Times  దీనిని All Time Top 100 సినిమాలలో చేర్చింది.

ఇక రెండో సినిమా "ఐ యామ్ లిజెండ్". ఇది సినిమా హాలు లోనే చూడల్సిన సినిమా. విల్ స్మిత్ అభిమానిగా ఈ సినిమా చూసాను. స్పెషెల్ ఎఫెక్ట్స్ పరంగా బాగానే వుంది కానీ, తప్పక చూడాల్సిన సినిమా అయితే కాదు. 

ఇక టీవి సినిమాలు చెప్పుకోవాలంటే జీ స్టూడియో, హెచ్.బీ.ఓ, స్టార్ మూవీస్, పిక్స్ ఎప్పటిలానే పాత చింతకాయ పచ్చళ్లతో చెడుగుడాడుకున్నాయ్. చెత్త సినిమాలను అసలు పదే పదే ఎందుకు వేస్తార్రా బాబు :-(

Wednesday, January 09, 2008

వెబ్ లో ఆడియో ఇప్పుడు ఎంత సులభమో....యాహూ....!

యాహూ గాడిని ముద్దెట్టు కోవాలి. ఆడియోను వెబ్ సైట్లలో పెట్టుకోవటాన్ని ఇంత సులభం చేసినందుకు. చెయ్యాల్సిందంతా ఆడియో ఫైల్ ఒక చోట పెట్టి దాని లింకు ఇవ్వటమే. మిగతాదంతా యాహూ మీడియా ప్లేయరే చేసిపెడుతుంది.

ఆడియోను ఎక్కడికి అప్లోడు చెయ్యాలి?

01. Windows Live SkyDrive సైట్ కి వెళ్ళండి. సైన్ ఇన్ అవ్వండి. (ఏ ఫైల్ స్టోరేజీ సైటైనా వాడవచ్చు)

02. మీకు నచ్చిన mp3 పాటను పబ్లిక్ ఫోల్డర్లోకి ఎక్కించండి

03. పాట పుటకు వెళ్ళి క్రింద చూపిన బొమ్మ మీద Right Click చేసి Copy Shortcut చెయ్యండి.

04. ఇప్పుడు మీ దగ్గర మీ పాట లంకె వున్నది. లంకె నుంచి "?Download" తీసెయ్యండి.

05. మీకు నచ్చిన చోట ఈ HTML కోడ్ ను పెట్టండి (example.mp3 బదులుగా మీ పాట లంకె)

<a href="example1.mp3">My first song</a>

06. తరువాత మీ బ్లాగు/సైటు HTML కోడులో క్రింద ఇవ్వబడిన కోడు చివరిగా పెట్టండి. (</body> ముందర)

<script type="text/javascript" src="http://mediaplayer.yahoo.com/js"></script>

అంతే. మీరు ఎన్ని ఆడియో లంకెలు పెట్టినా, అవన్నీ అక్కడికక్కడే వినేలా యాహూ మీడియా ప్లేయర్ చూస్తుంది. (క్రింద చూపిన విధంగా)

మచ్చుకి ఈ పాట వినండి.

బిల్ గేట్స్ కి పని పిసరంత కూడా లేని ఆఖరి ఆఫీస్ రోజు

ఎవరు ఎంత ఆడిపోసుకున్నా, సన్నాయి నొక్కులు నొక్కినా బిల్ గేట్స్ కి బిల్ గేట్సే సాటి అని నా గట్టి నమ్మకం. ఈ యుగంలో ఇంటింటికీ కంప్యూటరుండాలనే ఆశను నిజం చేయాలని తపించిన కంప్యూటర్ యుగకర్తలలో బిల్ ఒకరు. అంతే కాక గీకు వీరుడిగా నేను బాగా అభిమానించే వ్యక్తులలో బిల్ ఒకడు. అలాంటి వ్యక్తి ఒక రోజు హటాత్తుగా ఆఫీస్ కి ఇదే ఆఖరు రోజు అని ప్రకటించేసాడు. CES 2008 లో బిల్ తన చివరి ప్రసంగాన్ని వెలువరించాడు. ఆ సందర్భంగా ఏ పనీ లేక పోతే బిల్ ఆఫీస్ లో చేసే పనులేమిటి? అనే విషయం మీద ఒక సరదా కామెడీ వీడియో చేసారు. భలే ఫన్నీగా వుంది. చూడండి.

Sunday, January 06, 2008

అంపైర్ చేతిలో రాయి

చాలా రోజులకి, మైదానంలో అంపైర్లు క్రికెట్ ఆడారు. ఆస్ట్రేలియన్లు సైతం సిగ్గుపడేలా ఒక ఇరవై సంవత్సరాలు క్రికెట్ క్రీడను ఈ ఇద్దరు అంపైర్లు "స్టీవ్ బక్నర్, బెన్సన్" లు తీసుకుపోయారు. జిల్లా స్థాయి అంపైర్లు సైతం ఇలాంటి పొరపాట్లు చెయ్యరేమో. అసలు వయసు అంతగా మీద పడిన వీరిని ఎందుకు ఐ.సి.సి ఇంకా పోషిస్తుందో అర్ధం కాదు. ఈ రోజు భారత్ టెస్టు మాచ్ కోల్పోవడంలో ఆసీస్ క్రీడాకారుల ప్రమేయమ్ ఏమీలేదు. అంతా మన అంపైర్ల మహిమే. అందులో స్టీవ్ బక్నర్ సంగతి అందరికి తెలిసిందే. మూడో అంపైర్ నిద్రపోతున్నాడనుకుంటాడేమో అర్ధం కాదు. వరల్డ్ కప్ 2007 లో వీరు చేసిన మహిమలు ఎవరికి తెలియదు? చీకట్లో ఆటను నడిపిన ఘనత వుంది.

అసలు మ్యాచ్ ఫిక్సింగులలో ఈ తెల్లకోటు కుర్రాళ్ళకు కూడా వాటాలు రావటం మొదలుపెట్టాయా?

వీటన్నింటిని మించినది ఆసీస్ నీతి నిజాయతీలు. తెల్లోల్ల దరిద్రపు బుద్ధి మాత్రం ఎక్కడకు పోతుంది. అవుటయ్యానని మూడు సార్లు తెలిసిన కోతి వెధవ చక్కగా సెంచరీ చేసుకున్నాడు. అది కాక జాతి వివక్షత అని అబధ్దాలు చెప్పటం. వీడిని కోతి అంటే కోతి జాతికే అవమానం కాదా? నక్క అంటే సరిపోతుంది.

ఈ టెస్టు మాచ్ ద్వారా అపఖ్యాతి తెచ్చుకున్న ప్రఖ్యాత ఆసీ గాడిదలు వీరే

౦౧. రికీ పాంటింగ్ (వీడి మీద ఆస్ట్రేలియన్స్ కే ఇష్టం లేదు.)

౦౨. సైమండ్స్ (తూచ్..తూచ్ అని చివర వరకూ ఆడేస్తాడు)

౦౩. క్లార్క్ (కింద పడిన బంతులు పట్టేయటంలో దిట్ట)

౦౪. హస్సీ (సిగ్గు లేకుండా..అంపైర్ అవుటంటే కానీ క్రీజు కదలడు)

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బీ.సి.సి.ఐ ఇప్పుడు ఫిర్యాదు చేస్తుందంట. క్రికెట్లో సింహ భాగాన్ని ఆక్రమించుకున్న భారత ఉపఖండపు దేశాలు, ఐ.సి.సి విషయంలో మాత్రం పిల్లులలానే వుంటాయి. మన ఖర్మ. అసలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కలసి ఒక పోటీ క్రికెట్ కౌన్సిల్ ఎందుకు పెట్టకూడదు?

బక్నర్ గాడిని పంపెయ్యమని ఐ.సి.సి కి పిటిషన్ ఒకటి పెట్టారు. మీరు కూడా మరి సంతకం చెయ్యండి.

http://www.petitiononline.com/RetireSB/petition.html

Wednesday, January 02, 2008

అందమైన పాటకు అద్భుతమైన యానిమేషన్

ఈ పాటను నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం మొదటి సారి చూసివుంటాను. అప్పడే దీనిని జాగ్రత్తగా ఒక ఫ్లాష్ ఫైల్ గా దాచుకున్నాను. అయితే అది కనపడక మరల వెతుక్కుంటే దొరికిందీ ఆణిముత్యం లాంటి అందమైన యానిమేషన్. పాట మొత్తం వింటూ సబ్ టైటిల్స్ చదవండి. మీకే తెలుస్తుంది.

Friday, December 28, 2007

గూగులు తెలుగు

గూగుల్ భారతీయ భాషలపై చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. భారతీయ మార్కెట్ ను సొమ్ము చేసుకోవాలంటే వారి భాషలోనే ప్రయత్నించాలనే ప్రధమ సూత్రాన్ని తొందరగా వంటపట్టించుకుంది. మన దేశంలో పిచ్చి పిచ్చిగా కుర్ర జనం వాడే ఓర్కుట్ తోనే అది శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఓర్కుట్లో హాయిగా తెలుగులో స్క్రాప్ లు రాసుకోవచ్చు. దీనికి RTS రానక్కరలేదు. తెలుగును ఆంగ్లంలో రాసుకుంటూ పోవడమే.

orkut_telugu

ఇప్పుడు మూలనున్న ముసలమ్మలు కూడ ఓర్కుట్లోకి దూకుతారనడంలో ఆశ్చర్యం లేదు.

Thursday, December 27, 2007

మానవత్వం మతంతో మరో సారి ఓడింది

పోయిన చోటే వెతుక్కోమని ఎవడు చెప్పాడో గానీ, అది పాకిస్తాన్ లాంటి మతమౌఢ్యపు నాయకులున్న రాజ్యంలో పనికి రాదని తెలుసుకోవాలి. తివిరి ఇనుమున తైలమ్ము తీయవచ్చేమో గానీ ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఒక్క చుక్క కూడా పిండలేం.

ముదనష్టపు బుష్షు గాడు ఏమంటాడో మరి. వాడికసలే జనరల్ బుషారఫ్ అంటే తెగ మోజు.

Wednesday, December 26, 2007

మరిచిపోయిన మధురగీతం

ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు. గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను. ఎమ్.యస్ రామారావు గారి అతి మధురమైన, అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి.

చిమట సంగీత ప్రపంచపు లంకెలో చివరి పాటను వినండి.

ఈ పాటకు మధురమైన సంగీతాన్ని ఓపీ నయ్యర్ జీ అందించారు.

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో...

నిదురించు జహాపనా -  ||

పండు వెన్నెల్లో వెండి కొండల్లే

తాజ్ మహల్ ధవళా కాంతుల్లో ||

నిదురించు జహాపనా - ౨

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨

ముంతాజ్ సతీ సమాధి

సమీపాన నిదురించు - ౨

జహాపనా...

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

Monday, December 17, 2007

వింటర్ విస్టా : ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూర

ఇక్కడ రాస్తున్న కూర చాలా జాగ్రత్తగా చెయ్యాల్సిన కూర. ఒక విప్లవాత్మకమైన కూర. చెయ్యటానికి విశాల దృక్ఫదం వుండాలి. ముఖ్యంగా సహనం వుండాలి. ఇది నేను సొంతంగా తయారుచేసిన, పేరు పెట్టిన కూర. తయారు చేసి మీ తిట్లు వ్యాఖ్యలుగా రాయవచ్చు. కూర మొత్తం చేసాక ఈ కూరకు ఈ పేరు ఎందుకు పెట్టానో అర్ధం అవుతుంది. ఇది చాలా తక్కువ కాలరీలు కలిగే ఆరోగ్యకరమైన కూర.

కావలసిన దినుసులు

ఎర్రని కారట్ దుంపలు - నాలుగు

ఉల్లిపాయలు - రెండు

కాలీ పువ్వు రెమ్మలు - పది

పచ్చ్ఝ బఠానీలు - వంద గ్రాములు

గుడ్లు - రెండు

బంగాళా దుంప - ఒకటి (చిన్నది)

కార్న్ పిండి - వంద గ్రాములు

టొమేటోలు - మూడు (పెద్దవి, బాగా పండినవి)

పచ్చి మిరప - ఐదు కాయలు

ఆలివ్ ఆయిల్ - ఒక టీ స్పూన్

కార్న్ ఆయిల్ - మూడు టీ స్పూనులు

జీలకర్ర - ఒక స్పూను

మిరియాలు - పది

ముందుగా గుడ్లు, బంగాళా దుంప బాగా ఉడకబెట్టి పక్కన పెట్టాలి. గుడ్లు ఒలిచి మధ్యలో వుండే పచ్చని భాగాన్ని తీసుకుని, తొక్క తీసిన బంగాళాదుంపతో కలపి మిక్సీలో వేసి బాగా ముద్దగా చేసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

పచ్చ బఠానీలు, కాలీ పువ్వు రెమ్మలు, క్యారట్లు, జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయలు (ముక్కలు కావు) కలిపి కుక్కర్లో వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి, రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టి మూడు కూతలు వచ్చే వరకూ వుంచి దింపెయ్యాలి.

కొంత సేపయ్యాక కుక్కరు మూత తీసి కూరగాయల నీటిని ఒక పాత్రలో సేకరించాలి.ఈ నీరు చాలా ముఖ్యం.

ఉడికిన కూరగాయలు పక్కన పెట్టి, ఉడికిన క్యారట్లు తీసుకుని నిలువుగా చీల్చాలి. ఇలా చీల్చిన వాటిని కార్న్ ప్లోర్, జీలకర్ర పొడి కలపిన ద్రావకంలో ముంచి నూనెలో బాగా వేపి ప్రక్కన పెట్టుకోవాలి.

ఒక బాణలి తీసుకుని కొద్దిగా కార్న్ నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేసి పోపు వెయ్యాలి.

దానిలో ఉడికిన కూరగాయలన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వటం మొదలుపెట్టాలి.

పక్కన పెట్టుకున్న కూరగాయల నీటిలో గుడ్ల, బంగాళా దుంపల పేస్టుని కలిపి బాగా బీట్ చెయ్యాలి. దీనిలో కొద్దిగా కార్న్ పిండిని కొద్దిగా కలుపుకోవచ్చు.

ఇప్పుడు ఉడుకుతున్న కూరలో, మెల్లగా ఈ నీటిని కలిపి బాగా కలిపి అలానే ఒక పదిహేను నిమిషాలు ఉడకపెట్టి (ఉప్పు తగినంత కలిపి) బాగా కూర చిక్కబడిన తరువాత దింపాలి.

ఇప్పుడు దానిపై బాగా తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వింటర్ విస్టా కర్రీ రెడీ.

మీ విజిటింగ్ కార్డుపై అందమైన క్యాలండరు

మనం చాలా మంది విజిటింగ్ కార్డులు అచ్చు వేయిస్తుంటాం. కానీ మనం ఇచ్చిన ముక్కలు వెనక్కి తిరిగేలోపు పర్సులో ఓ మూలకు పోతాయి. అలా కాకుండా సంవత్సరమంతా మన ముక్కనే మరీ మరీ వాడుకునే విధంగా చెయ్యాలంటే క్రింద చూపిన విధంగా ఒక అందమైన క్యాలండరు వెనుక ముద్రిస్తే సరి :-)



ఇక దీనిని వాడటం చాలా సులువు. ఏ నెల చూడాలో అది మాత్రమే కనిపించేటట్లు ఈ కార్డుని వేళ్ళతో పట్టుకుంటే సరి.


మీకు ఇంకా మిగతా సైజులు కావాలంటే ఇక్కడి నుంచి తెచ్చుకోండి.

ThumbCalendar

Sunday, December 09, 2007

ఏమిటీ చిరు భజన?

ఎవరేమనుకున్నా మన ఆంధ్రులకు ఒక చెత్త గుణం వుంది. అదేమిటంటే మాస్ హిస్టీరియా గుణం. ఎవడో ఏదో మొదలుపెట్టడం, దానికి అసలు ఆలోచనే లేకుండా చెక్క భజన గుడ్డిగా చెయ్యటం మనకు మామూలయ్యింది. దీనికి తోడుగా ఇప్పటి పార్టీలు కూడా తయారయ్యాయి. ఇది చాలా ప్రమాదకరం.

టాటా టీ వారి ఒక ప్రకటన ఇప్పుడు వస్తూ వుంది. అందులో వోట్లు అడగటానికి వచ్చిన రాజకీయ నాయకుడికి టీ తాగమని చెప్పి అతని పరిపాలనా దక్షత గురించి ఒక యువకుడు అడుగుతాడు. దానికి ఆ నాయకుడు హేళనగా నవ్వి నన్ను ఇంటర్వూ చేస్తున్నావా? ఏ ఉద్యోగానికి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడి ఈ దేశాన్ని పాలించే ఉద్యోగం అని కళ్ళు తెరుచుకునే సమాధానం ఇస్తాడు. అవును ఈ దేశంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత దక్షత కావాల్సిన ఉద్యోగం "నాయకుడు". ఈ నిజం జనాలు మరిచిపోయే విధంగా మన నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తూ వుంటారు. ఆ నిజం మన దేశ పౌరుల నరనరాల జీర్ణించుకున్న మరుక్షణం దేశం బాగు పడటం మొదలవుతుంది.

చిరంజీవి తెలుగు ప్రజలు గర్వించే నటుడిగా అందరికి తెలుసు. నాకు చాలా నచ్చే నటులలో చిరు ఒకరు. ఒక మనిషిగా కూడా. అయితే అవి సినిమాలకే పరిమితం. అతని ప్రమేయం లేకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిరు భజన ఏమిటో అర్ధం కావటం లేదు. స్వతహాగా చిరంజీవిలో నాకు నాయకత్వ లక్షణాలు అంతగా కనిపించవు. చాలా సున్నిత మనస్కుడుగా అనిపిస్తాడు. అది చాలా విషయాలలో బాహాటంగా తెలిసిన విషయమే. అయితే ఒక మంచి మనిషిగా చిరంజీవి చాలా పనులు చెయ్యటం అనేది కేవలం అతని వ్యక్తిగత స్వభావం, నిర్ణయము మాత్రమే అని తీసుకోకుండా దానిని రాజకీయం చెయ్యటం మన రాష్ట్రానికే చెల్లింది. నిజానికి మన దేశంలో, రాష్ట్రంలో ఇంతకంటే చాలా ఎక్కువ మంచి సేవలు చేసేవారెందరో వున్నారు. వారెవ్వరికీ ఈ గుర్తింపులు, పద్మ భూషణ్ లు అవసరం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి కూడా ఈ గుర్తింపుల కోసం చేస్తున్నారనిపించదు. మరి ఈ హడావిడికి కారణమెవ్వరు?

నిజానికి ఈ హడావిడి చిరంజీవి అభిమానుల పేరు మీద జరుగుతున్నా, దీని వెనుక ఒక బలమైన కుల వర్గం వుంది. చిరంజీవి ఇప్పుడున్న మేరు నగ స్థానానికి కారణం కులం కాదు. కానీ అతని జీవితంలో తరువాయి అంకంలో రాబోయే అన్ని మచ్చలకూ అదే కారణం అవుతుంది. ఈ బెల్లం చుట్టూ మూగిన ఈగల గోల కూడా దాని వల్లనే. అది అలా వదిలేస్తే, కేవలం సినిమాలు, కొన్ని ఛారిటీ పనులు చేసినంత మాత్రాన వచ్చిన ఫేమ్ ను పరిపాలానాధికారాలు సాధించడానికి వాడుకోవటం విజ్ఞత కూడా కాదు. మొదట ఈ ప్రభుత్వాల మీద, పరిపాలన మీద తనకున్న ఆలోచనలను ప్రజలతో ప్రస్పుటంగా పంచుకోవాలి. అందులో ఒక విజన్ వుండాలి. అవి వుంటే ఎవరూ చిరంజీవి రాజకీయ ప్రవేశం మీద లేశమాత్రమైనా వ్యాఖ్యలు చెయ్యరు.

ఇప్పుడున్న రాజకీయనాయకులకు వోటు ఎందుకు వెయ్యకూడదు అనుకుంటే సవాలక్ష కారణాలు వరసగా చెప్పుకుపోవచ్చు. అందుకే నేనిప్పటి వరకూ వోటు వెయ్యలేదు. పొరపాటున కూడా నా వోటు హక్కు కోసం నేను ఒక వెధవ నాయకుడికి వోటు వెయ్యనుగాక వెయ్యను.

నేను చిరుకు ఓటు వెయ్యాలంటే, వేస్తా…నా మట్టుకు అతని వెయ్యకపోవటానికి ఏ కారణాలూ లేవు. కానీ ఎందుకు వెయ్యాలి అని ఆలోచిస్తే నాకు మనస్సులో అంతా ఖాళీగా వుండకూడదు. అప్పుడే మనస్పూర్తిగా వోటు వెయ్యగలుగుతా. లేక పోతే నా వోటు ఒక వంద రోజుల సినిమా టికెట్ట్లుకు సమానం. సినిమా అయిపోయాకా దానికి ఏ మాత్రం విలువుండదు.

Saturday, December 08, 2007

చెన్నయ్ సూపర్ స్టార్ర్సు....!

ఐసియల్ ప్రకటనలు చాలా సృజనాత్మకంగా భలే వున్నాయి. మచ్చుకి ఇది చూడండి. :-)

Thursday, November 29, 2007

నిప్పులాంటి నిజాం

పైన రాసిన టైటిల్ని చూస్తే మీకు ఒళ్ళు మండిందా? అయితే మీరు ఖచ్చితంగా తెలంగాణా స్వాతంత్ర సమరయోధుల కష్టాలతో తడిసిన చరిత్ర తెలిసిన వారయి వుంటారు. మరి ఇప్పుడు అనుకోకుండా నిజాం నిప్పు ఎలా అయ్యాడబ్బా? పోనీ ఎవడైనా రాత్రి బాగా తాగి మాట్లాడినా చాలా వరకూ నిజాలు కక్కుతారు గానీ ఇలా అడ్డగోలు చరిత్ర మాట్లాడరే ?. ఈ లెక్కన మనకు పాకిస్తాను, బంగ్లాదేశు కూడా అద్భుతమైన పాలకులు పరిపాలించిన దేశాల క్రిందే లెక్క.పోనీ మన మాష్టారు నిజమే చెప్పారనుకుందాం...మరి ఆ లెక్కన తెలంగాణా ఉద్యమం ఎవరికి ఎదురొడ్డి జరిగింది? అది కూడా కొంపతీసి వలస వాదుల మీదేనా? రజాకార్లందరూ తూర్పు గోదావరి, గుంటూరుల నుంచి భూములు కొనటానికి వచ్చిన తురుమ్ ఖాన్లా? సరిగ్గా చెప్తే చరిత్ర మార్చేసుకుంటాం కదా?

పీవీ నరసింహారావు గారి ఆటో బయోగ్రఫీ చదువుతుంటే అందులో ఆనంద్ పాత్రధారి పర్షియన్ భాష చదివి, అది ఎందుకు చదవాల్సి వచ్చిందో చెప్తూ వుంటే మనిషన్న వాడికి మంట పుట్టటం ఖాయం.ఫలక్ నుమా వాడు కట్టాడు, అసెంబ్లీ హాలు వీడు కట్టాడు అని చెప్పేముందర అవి ఇప్పుడు వాడుతున్న కారణాల కోసం అప్పటి రోత నవాబులు కట్టలేదని పిల్లి పిడికిలంత మెదడున్నవాడికెవడికైనా అర్ధం అవుతుంది.మరి అంత మంచి నిజాము ఇక్కడుండకుండా టర్కీ ఎందుకెళ్ళి బతుకుతున్నాడో ఈ మన నవాబుకే తెలియాలి.

Tuesday, November 13, 2007

TV9 : కోఠీ కాలేజీపై కుక్కల దాడి (కేవలం TV9 లో)

ఇరవై నాలుగ్గంటల వార్తల ఛానల్ పెడితే ఇన్ని కష్టాలుంటాయని తెలీదు. :-)కాదేదీ వార్తా స్రవంతికి అనర్హం అని నిరూపించారు. అదీ లైవ్ కామెంటరీ (చాలా కామెడి కామెంటరీ)

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హాట్ హాట్. ఏ వీడియో పడితే ఆ వీడియోని ప్రైవసీ అనే పదాన్నే పట్టించుకోకుండా ప్రసారం చేసే TV9 మరి ఈ వీడియోని కూడా ప్రసారం చేస్తే మంచిది.

Sunday, November 11, 2007

అంతా నువ్వే చేశావు....అవును అంతా నువ్వే చేశావు.

ఈ మధ్య ఈనాడు ఆదివారం సంచికలో ఇదే తరహాలో ఒక పేరడీ ప్రచురించారు. అది చూసి, ఆ ప్రేరణతో రాసినది ఇది.

ఇవి బొమ్మరిల్లు అనే మంచి చిత్రంల్లో, బాగా హిట్టయిన సంభాషణల పరంపర. దీనిని సిద్ధార్ద్, ప్రకాష్ రాజ్ అద్భుతంగా రక్తి కట్టించారు.



గోపి : అంతా నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు. చాలు రాధా పెళ్ళైన నాటి నుంచి నువ్వు నా చేత చెయ్యించిన పనులు చాలు. ఇక వద్దు ప్లీజ్.

రాధ : గోపీ…నేనేం చేసాను

గోపి : ఇంకా అర్ధం కాలేదా నీకు. పక్కింటి బ్యాచిలర్ కుర్రోడు దగ్గర ఏముందో, అదే నేను కోల్ఫోయింది. ఆనందం. జీవితంలో సొంత ఆనందాలను కోల్పోయాను నీ వల్ల.

నువ్వు ప్రపంచంలోనే గొప్ప భార్యవి రాధా. నీ భర్త ప్రపంచంలోనే ఒక గ్రీకు వీరుడు అవ్వాలని ఆలోచిస్తావు తప్ప, అసలు నా సీను ఏంటో అర్ధం చేసుకోవు.

రాధ : నేనేది చేసినా వెయ్యి సార్లు మీకు అది బాగుంటుందో లేదో ఆలోచిస్తా గదండి.

గోపి : అవును వెయ్యిసార్లు నాకు బాగుంటుందో లేదో ఆలోచిస్తావు, నాకు నచ్చిందో లేదో ఆలోచించవు.

పని చెయ్యటంలో ఆనందం నీకు తెలుసు. గానీ ఏ పని చెయ్యనివ్వకపోతే పడే కష్టం ఏంటో నాకు తెలుసు.

అసలు నన్ను ఏదైనా చెయ్యనిస్తేగా నా బాధేంటో తెలియటానికి. నీకు ఏదైనా ప్రాబ్లెం వస్తే ఎదురింటి రిటైర్డు ముసలాయన్ను సలహా అడుగుతావు. నన్ను అడగవు. నాతో మాట్లాడు రాధా…ఫ్రెండ్లీగా వుండు రాధా…

రాధ : ఆ మాట అనేది నేను కదండీ (గద్గద స్వరంతో)

గోపి : అంటావు. కానీ వుండవు. ఎందుకంటే అంతా నువ్వనుకున్నట్లే జరగాలి కదా

ఈ కూరలు కొనాలో నువ్వే చెప్తావు. నాకెలా వుంటుందో తెలుసా. నాకు ఆ కాకరకాయ నచ్చదూ అని గొంతెత్తి అరవాలనిపిస్తుంది. నేను తినను అని పారిపోవాలనిపిస్తుంది.

బజారుకెళ్ళి చికెన్ తెమ్మంటావు. అక్కడికి వెళ్లేలోగానే పక్కింటి కుర్రాడిని పంపి వాడి చేతే అది బేరమాడించి కొనిపించేస్తావ్. నవ్వుతున్నారు రాధా బజారులో అందరూ.

నేనేదో క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటాను. గానీ నువ్వు నేను "సాగే జీవితం 34233 వ ఎపిసోడ్" చూసి ఆనందించాలనుకుంటావ్. అదే నాకిష్టమని అందరితో చెప్తావు.

నేనేదో మాడి పోయిన మసాలా దోశ ఒకటి వెయ్యాలనుకుంటాను. కానీ నువ్వు దానిని ఇంకా బాగా, అందంగా ఎలా చెయ్యెచ్చో చెప్తూ నా దోశ కూడా నువ్వే వేసేసి సరదా పడిపోతావ్. నేనెలా చెయ్యాలో కూడా నువ్వే చెప్ర్తుంటే ఇంకా నేనెందుకు రాధా దోశలు వెయ్యటం?

చివరికి షేవింగ్ ఎలా చేసుకోవాలో కూడా నువ్వు చెప్తుంటే గడ్డం అస్సలు తెగటం లేదు రాధా. నీకు తెలీదు. నువ్వు చెప్పింది చెయ్యలేక, నాకు నచ్చింది చెప్పలేక నరకం అనుభవించాను రాధా. నరకం.

ఈ ఫ్రస్టేషన్, బాధ ఎవరిమీద చూపించాలో తెలియక ఒక సారి మన టామీ మీద గట్టిగా అరిచాను కూడా. అది ఇప్పటికీ నా వైపు అనుమానంగా చూస్తునేవుంది. దగ్గరికి రావటం లేదు.

సరే, నేనిప్పుడు ధోనీలా జుత్తు పెంచాలి అంతే గదా? మీసాలు తీసెయ్యాలి అంతే కదా. చేస్తాను రాధా. నేను అవి చేస్తే ఛండాలంగా వుంటానని తెలుసు. అయినా చేస్తాను.

భార్యగా నువ్వు ఇన్నాళ్లు ఉప్పొంగిపోతున్నావు కదా? నువ్వలా ఉప్పొంగిపోవటం కోసం గత ఏడు సంవత్సరాలుగా నేను భర్తగా ఓడిపోతూనే వున్నాను రాధా. ఇలా ఓడి పోతూ వుంటే మరో మూడేళ్ళలో నా పెళ్ళి జీవితం ఏంట్రా అని చూస్తే, అందులో నేనుండను. నువ్వుంటావు. అంతా నువ్వే వుంటావు.

Friday, November 09, 2007

ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే

రాత్రి హ్యాపీ డేస్ సినిమాకెళ్లాను. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ (మన నగరానికి అదొక నగ అని చంద్రబాబు అభిప్రాయం) రాత్రి పది నలభై అయిదు నిమిషాలకు సినిమా అయితే నేను దాదాపు తొమ్మిదిన్నరకే చేరుకున్నా (ఇంటర్నెట్ కొనుగోలు కాబట్టి). నా స్నేహితుడు రావటానికి ఇంకా సమయముండటం వలన అటూ ఇటూ తిరుగుతుండగా సెక్యూరిటి మనుషులు నా దృష్టిని ఆకర్షించారు. అసలు వీల్లెలా పని చేస్తున్నారో చూద్దామని ఆసక్తిగా గమనించటం మొదలు పెట్టా…

అక్కడ రెండు సెక్యూరిటీ ద్వారాలున్నాయి. చెక్కతో చేసినవవి. కాబట్టి కాస్త చవకవే కొనుక్కున్నట్టున్నారు. రెండింటి గుండా పొలో మని జనాలు రావటం మొదలుపెట్టారు. మగవాళ్ళందరిని ఆపి ఏదో తడమాలన్నట్లు తడిమి వదులుతున్నారు.( నన్ను తనిఖీ చేసినపుడయితే వాడి చెయ్యి నా మొబైల్ని ముట్టలేదు కూడా). ఈలోగా కొంతమంది స్త్రీలు వచ్చారు. లోపలికి వచ్చాక దిక్కులు చూస్తున్నారు. బహుశా తనిఖీ చేస్తారని అనుకుంటా..

మీరెళ్ళండి మేడమ్ అని వారిని లోపలకు పంపేసారు. ఇక అప్పటి నుంచి వస్తున్న స్త్రీలందరికి ఇదే తంతు. మరి ఇదే రకం సెక్యూరిటినో అర్ధం కాదు. మగోల్లేమన్నా బాంబులు బుర్రలో పెట్టుకుని పుట్టారా? ఆడోల్లలో ఆత్మహత్యా బాంబర్లు వుండరా? అసలే ఈ మధ్య ఆడోల్లు మగాళ్ళతో పొట్టలలో సమానత్వం సాధించేసారు. (సీరియస్ గా తీసుకోవద్దు…ఇది మా ఆఫీస్లో ఆడోల్లు వేసుకునే జోకే…:-))

నేను వుండబట్టలేక వెళ్ళి వాడినడిగా. వాడు నా వైపు చూసి హి హి అని నవ్వాడు. నేను కాస్త సీరియస్ గా చూసేసరికి "నన్నడుతారేంటండి…మానేజర్ని అడగండి" అన్నాడు. వాళ్లే అమ్మాయిలను పెట్టటం లేదు ఈ పనికి…మేమేం చేస్తాం సార్ అన్నాడు. అయితే మీ మానేజర్ని పిలు అన్నాను. వాడికి లైట్లు ఆరిపోయాయి. మౌనంగా తన పని తను చెయ్యటం మొదలుపెట్టాడు. మరీ తిడితే ఫీలవుతాడేమొనని నేను నోర్మూసుకుని సినిమా చూడటనికి పోయాను. ఇక్కడ సంగతేంటంటే స్త్రీలను తనిఖీ చేసే స్త్రీలు రాత్రి తొమ్మిది తర్వాత పని చెయ్యరంట. మరి ఈ పద్దతితో వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఏడుస్తుందో అర్ధం అవుతుంది.

ఆ ద్వారాల నుంచి పోతుంటే ఒక సారి కుయ్ మని , ఒక కుయ్ కుయ్ కుయ్, కక్, క్వీ అంటుంది. ఈ భాషకు అర్ధం వాళ్లకు తెలుసా అంటే…ఏమో చెప్పలేం.

ఏది ఏమైనా పేరు గొప్ప వూరు దిబ్బ అన్న నానుడి ఈ ప్రసాద్ ఐమాక్స్ కు సరిపోతుంది. పాప్ కార్న్, ఖరీదయిన మంచి నీరు అమ్మటానికి కుప్పలు కుప్పలు జనాలుండే ఈ థియేటర్లో ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే.

మాకు తెలీదేటి మరి

ఏటండీ ఈ ఇడ్డూరం. నీ సంగతి నాకు తెలుసంతారొకరు….సె ఎల్లెహె నీ సంగతి నాకూ తెలుసంతాడింకొకాయన. మరి తెలిస్తే మాకు సెప్పకుండా ఎందుకూంతున్నారు బాబు. అహ నా కర్ద్గం గానేదు కానీ, ఈ సంగతులేవో సెప్పేత్తే మా బాగా వుంటాది కదా.

ఓహొ మా బాబులు మా సెవుల్లో పువ్వుల్నేవండీ. మాకందరికీ మీ ఇద్దరి సంగతులూ తెలుసునండీ బాబులు. ఏటి? అలా సూత్తారేటి. ఎందుకు మిమ్మల్ని అదే పనిగా గుద్ది గుద్ది గెలిపిత్తన్నామనా?

అదేనండి మా జన్మలో చేసుకున్న ఖర్మ..

మీరంతే రోజు గుప్పెళ్లు, గుప్పెళ్లు కారం, వుప్పు తింతారు. మాకు అవి అట్టుకురావటానికి సొమ్ములేవి? అందుకే మామవి తినం.

అందువల్ల మాకు సిగ్గు నేదు, శరం నేదు. వోట్లు గుద్ది మిమ్మల్ని ఆ మాయదారి ఇల్లు, అదేటండి అంటారు….ఆ ఏదో అసెంబులీ అని….అక్కడికి పంపుతాం. కొట్టుకు సావడానికి మీ జిమ్మలరిగి పోయేలా…

Thursday, November 08, 2007

ఒప్పించే శక్తి ఒక వరం

ఈ మధ్యన ముంబైలో ఒక సెమినార్ కు హాజరయ్యాను. ఆ సెమినార్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ ఫర్ సాఫ్ట్ వేర్ ఆర్కిటక్ట్స్ అనే అంశం మీద ఒకాయన అద్బుతంగా ప్రసంగించాడు. అందులో నాకు బాగా నచ్చింది "conviction" అనే అంశం. మనం చెప్పేది తప్పా? ఒప్పా అనే విషయం ఎక్కడా పనిచెయ్యదు. మనం ఎదుటివారిని కన్విన్స్ చేసామా లేదా? అనేదే ముఖ్యం. అందుకు ముందర మనలని మనం కన్విన్స్ చేస్తుకోవటం చాలా ముఖ్యం. ప్రముఖ వార్తా పత్రికలు చేసేది అదే. అవి రాసేది తప్పుడు వార్తలయినా ఈ "conviction" అనే దానిని మహా బలంగా వాడుతాయి. జనాలలో వున్న Negative Pulse ని బాగా లాగి లాగి ఒక్క సారి వదిలి, అప్పుడు విషయాన్ని రాస్తాయి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. పైన చెప్పిన వక్త ఒక మంచి జోకు కూడా చెప్పాడు (ప్రసంగం మొత్తం నవ్విస్తూనే వున్నాడనుకోండి)

ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.

అది ఒక సాఫ్టు వేర్ నిపుణుడు చూసి, అతనిని ఎలా అయినా ఆపాలని…కేకలు వేస్తూ ఒక్కసారి ఆగు వస్తున్నా అని అరిచాడు

అతడు మనోడి వైపు చూసి, కొద్ది సేపు ఆగాడు…

అతికష్టం మీద ఆ శిఖరం ఎక్కి అతని దగ్గరకు వెళ్ళాడు

ఒక పది నిముషాలు వాళ్లిద్దరు మాట్లాడుకున్నాక……

ఇద్దరూ ఆ శిఖరం మీది నుంచి దూకి చచ్చారు.

అదన్న మాట "conviction" కి వున్న శక్తి. :-)

Sunday, November 04, 2007

ఎంత అందమైన లోకం? - లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్

ఈ పాట నాకు జాజ్ సంగీతంలో తెలిసిన ఏకైక పాట. అత్యంత ఇష్టమైన పాట. రాప్సోడీలో ఈ పాటను రోజుకొక్కసారయినా వినాలనిపిస్తుంది.
మీరు వినండి. ఈ పాటను ప్రఖ్యాత జాజ్ గాయకుడైన లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ పాడారు. ఆనందం, మార్దవం, ఆప్యాయత అంతా ఒకే సారి చూడాలనుకుంటే లూయిస్ పాడుతున్నపుడు అతన్ని చూడాలి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name