2006 వ సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు. ఎప్పటిలానే నంది అవార్డుల కమిటీ తన నాసిరకాన్ని కొంత బయట పెట్టుకుంది. ప్రభుత్వ ప్రాపకంలో వున్న ఏ కమిటీ అయినా అలానే పనిచేస్తుందని నిరూపించింది.
మనకర్ధం కాని కొన్ని అవార్డులు ఇవి...
ఉత్తమ నటుడు : నాగార్జున (రామదాసు). :- రామదాసు చూస్తే నాకు రాఘవేంద్రరావు తప్ప ఎవరూ కనపడలా. అసలు రామదాసు జాడే లేదు. అక్కినేని నాగార్జున కొన్ని సీన్లలో, అన్నమయ్య కొన్ని సీన్లలో కనిపించారు. మరి ఏ ప్రాతిపదికన నాగ్ కు ఈ అవార్డ్ ఇచ్చేశారో ఆ రాముడికే తెలియాలి. ఈ విభాగంలో ఈ అవార్డు మిస్సయిన అసలు ఉత్తమ నటులు : ప్రకాష్ రాజ్, సిద్ధార్ధ్, మహేష్ బాబు.
ఉత్తమ సందేశాత్మక చిత్రం : స్టాలిన్ :- ఇది మరీ టూ మచ్. స్టాలిన్ లో ఉన్న సందేశం ఏమిటో అసలు అర్ధం కాలేదు. సినిమా ప్రారంభంలోనే కధానాయకుడు ఒక పెద్ద పచ్చని చెట్టుని నేల కూల్చి కొంత మందిని అడ్డుకునే దృశ్యం చిత్రానికే హైలైట్. ముగ్గురు మరో ముగ్గురికి సాయం అనేది కొంపదీసి సందేశమా? ఏమో?
నచ్చిన, సత్తా నిజంగా వుండి గెలుచుకున్న అవార్డులు ఇవి...
ఉత్తమ దర్శకుడు : శేఖర్ కమ్ముల (గోదావరి) :- తెలుగు సినిమాని ఎంత సులభంగా, తక్కువ ఖర్చులో , అందరికి నచ్చేట్లు , అసలు ఏ పకోడీ స్టార్లు లేకుండా ఎలా తీయొచ్చో మరీ మరీ నిరూపిస్తున్న మన పక్కింటి కుర్రాడు. హాట్సాఫ్.
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (బొమ్మరిల్లు) :- ఎదురులేని వాచకం ఇతని సొత్తు. ఏ సినిమాలో ఉన్నా సరే అతడే హీరో అనిపిస్తాడు.
ఉత్తమ సంభాషణల రచయత : అబ్బూరి రవి (బొమ్మరిల్లు):- హాయిగా, సరదాగా ఎంతా బాగా ఉంటాయ్ కదా బొమ్మరిల్లు డైలాగులు.
ఉత్తమ చిత్రం : బొమ్మరిల్లు :- అవును. ఇదే ఉత్తమ చిత్రం. ముమ్మాటికీ. దీని ముందర ఏ దాదాలు, బాబులు పనికి రారు.