Tuesday, October 30, 2007

అ అంటే అసురులు…ఆ అంటే ఆటోవాలా

పై విధంగా భవిష్యత్తులో పిల్లలు చదువుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే వారు రోజు స్కూలుకు వెళ్లే ఆటోనే వారికి మొదటి స్కూలుగా తయారయి ఆటో వాలాల పెడ బుద్ధులు అలవాటు అయ్యే లక్షణాలున్నాయి మరి.

ఆటోని 99 శాతం వాడేది మధ్య తరగతి, దిగువ తరగతి ప్రయాణీకులే. ఇప్పుడు జరుగుతున్న సమరమంతా వారిని ఎన్ని రకాలుగా దోచుకోవాలా అన్నదే. ఆ మధ్య ఆరుగురు పిల్లలు వెళ్తున్న ఒక ఆటోను చూసి అవాక్కయ్యాను. వారందరూ చిన్న పిల్లలే అయినా, పెద్ద పెద్ద మూటలలాంటి బ్యాగులు వున్నాయి. అమ్మాయిలూ వున్నారు. అప్పటికే ఆటోలో ఎలానో సర్దుకు కూర్చుని అమాయకంగా చూస్తున్నారు పాపం. వారిని అలా పంపిస్తున్న తల్లితండ్రుల మీద చిర్రెత్తుకొచ్చినా, స్కూల్లు, వాటి దూరాలు, ఆర్దిక కారణాలు గుర్తొచ్చి "పాపం పేరెంట్స్" అనుకున్నాను.

ఇప్పుడు ఆ సంఖ్యను "ఎనిమిది" కి పెంచాలంట. పిల్లకాయలు అని సరదాగా అనుకుంటాం..వారేమీ నిజంగానే "కాయలు" కాదు. బస్తాల్లో కుక్కినట్లు ఆటోలో కుక్కడానికి. ఈ ముదనష్టపు ఐడియాకి సీ.పి.యమ్, సీపిఐ లాంటి అవకాశవాద బూర్జువా పార్టీల మద్దతు. కాంగ్రెస్‍వి వోటు బ్యాంకు రాజకీయాలంటూనే తెలుగు దేశం కూడా ఈ చెత్త బ్లాక్ మెయిలింగ్ అంశాలకు మద్దతు ప్రకటించింది.

"ఠాగుర్" చిత్రంలో ప్రకాశ్ రాజ్ తన పాట్లు చూసి గేలిగా నవ్విన తోటి కానిష్టేబుల్ ని ఉద్దేశించి ఇలా అంటాడు "నవ్వురా నవ్వు…నువ్వు ఈ రోజు నన్ను చూసి నవ్వుతున్నావు…రేపు నిన్ను చూసి నేను నవ్వుతాను…ఇలా మనం ఉండబట్టే మన జీవితాలను చూసి అందరూ నవ్వుతారు" అని. సరిగ్గా ఈ డైలాగ్ గుర్తులేదు కానీ, అది సరిగ్గా మన రాజకీయ పార్టీలకు సరిపోతుంది. ఒక సరళీకరణ మార్పును ప్రభుత్వం తెస్తుంది అంటే, వారిని అభినందించి సహకరించటం మానేసి దోపిడీ మూకలకు మద్దతిచ్చేస్తున్నాయి ఇప్పటి పార్టీలు.

కొన్నాల్లకు కనీసం పారిపోయే ఛాన్స్ ఇవ్వకుండా పట్టేసుకుంటున్నారని గజ దొంగలందరూ ఒక ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను వినిపించినా "హాశ్చెర్యం" లేదు. దానికి అన్ని పార్టీలు "బే సిగ్గు" గా మద్దతు ప్రకటించేస్తాయి. మద్దతేగా….ఫ్రీ నే గదా..ప్రకటిస్తే పోలా…

ఇక ఆటో చెత్త విషయం..

అందరికి తెలుసు ఈ క్రింది విషయాలు….

౦౧. నగరంలో ఎనభై శాతం చెత్త మీటర్లే వాడుబడుతున్నాయి (ఇది ఒక శాతం అని ఆటోవాల్ల కారు కూత)

౦౨. చాలా వరకు ప్రమాదాలకు కారణం ఆటోలు (ఈ ప్రమాదాలలో అవి ఏమి అవ్వవు…)

౦౩. అతి ప్రమాదకర డ్రయివింగుకు చిరునామా ఆటోవారే

౦౪. తొంభై శాతం ఆటోలు సిగ్నల్స్ ను పాటించే సీనే లేదు

౦౫. చాలా వరకూ ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పేవే…(వాటి సొంతదారులందరూ బడా బాబులు…)

౦౬. మహిళలకు రాత్రుల్లు ఇప్పటికీ ఆటో ప్రయాణం సురక్షితం కాదు (ఇక ఆటోల స్థానే కార్లు వస్తే? వామ్మో…)

౦౭. నగరంలో ట్రాఫిక్ నరకానికి ప్రధాన కారణాలలో ఒక కారణం ఈ ఆటోలే.

౦౮. ఆని రకాల ఆక్రమణలు వీరు సొంతం ..బస్ స్టాండులు, రోడ్డులో కొంత భాగం, ప్రధాన రోడ్ల మలుపులు ఒకటేమిటి.


మొన్న మా అఫీసులో ఒక మహిళా కొలీగ్ ఇలా అన్నారు…"అసలు ఈ లక్ష ఆటోలను తీసేసి చిన్న చిన్న బస్సులు తిపితే నయమండి…సుఖంగా వుంటుందని". నిజమే అనిపించింది. ఆటోలు ప్రయాణ సాధనాలు. అంతే. అక్కడితో ఆగాలి. అంతే గాని అదేదో కల్లు గీత పరిశ్రమలాగా హడావిడి చేసి యూనియన్లుగా తయారైతే ఇలానే వుంటుంది.

రేప్పొద్దున్న సిటీ బస్సుల సంఖ్యను తగ్గించమని డిమాండు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

భవిష్యత్తులో ఈ నగర జనాభాను ఆ దేవుడే రక్షించాలి…చివరకు "ఆటోల యూనియన్ నుంచి", "తోపుడు బల్ల సంఘం నుంచి", "జూబ్లీ హిల్స్ కాల్పు గాళ్ళ సమితి నుంచి", "కొజ్జా నేరగాళ్ళ యువత నుంచి",

రాజకీయమా ! నువ్వు మాత్రం నీ కుళ్లు నవ్వు ఆపకు. నీకది అచ్చి వచ్చిన నవ్వు. కనీసం తరువాతి ఎన్నికల వరకూ..

6 comments:

సాయి ఋత్విక్ said...

చాలా మంచి ఆర్టిచల్ ను చదివానన్న సంతృప్తి కలిగింది. ఆటొల విషయంలొ మన ప్రభుత్వాలు మొదటి నుంచీ వివక్షతను చూపిస్తునే వున్నాయి. న్యాయాన్ని పరిరక్షించాల్సిన వారు అన్యాయంతొ చెతులు కలుపుతున్నారు.రాష్ట్రంలొ వున్న ఆటోలలొ 90 % వాటికి మీటర్లు మరియు లైట్లు పని చేయ్యవు. సరైన లైసెన్సులు, పర్మిట్లు లెకుండా తిరుగుతున్నాయి. ప్రయాణీకుల నుండి ఇష్టం వచ్చినట్లు డబ్బు వసూలు చేస్తున్నారు, ఇదెమిటని అడిగితే నీ ఇష్టం వచ్చిన చొట కంప్లైటు చెసుకొ అని దురుసుగా మాట్లాడుతున్నారు.కొన్ని సార్లు ప్రయాణికూల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నా పట్టించుకునే నాధుడే లెడు.స్కూల్ ఆటొల పరిస్తితి అయితే మరీ దారుణం. కెపాసిటీకి మించి ఎక్కిస్తూ పిల్లల ప్రాణాలతో ఆదుకుంటున్నారు. ఈ మధ్య కాలంలొ పిల్లలను ఎక్కించుకు వెళ్తున్న ఆటొలు ప్రమాదాలకు గురై అమాయకులాYన పిల్లలు ప్రాణాలను పొగొట్టుకున్నా ప్రభుత్వాలలొ చలనం రాలెదు. బహుశా వారి వోటు బ్యాంక్ పట్ల ప్రభుత్వాలు కన్నెసి వుండ వచ్చు. తాము చేసెది రిస్కుతొ కూడుకున్నది అయినా పేరుగుతున్న చార్జీలకు భయపడి మధ్య తరగతి ప్రజానీకం ఈ దిక్కుమాలిన ఆటోలలొనె తమ పిల్లల్ని పంపిస్తున్నారు.ఇన్నాళకు ఆటోలకు దిజిటల్ మీటర్లు బిగించ మని ప్రభుత్వం ఒక సద్దుదేశ్యంతొ జీవో జారీ చేస్తే రాజకీయ పార్టీల ఒత్తిడితో సమ్మె పెరుతో ఆ నిర్ణయాలి తుంగ లోకి తోక్కె ప్రయత్నం చేస్తున్నారు మన ఆటో వాళ్ళు.ప్రభుత్వం ఈ విషయంలొ కఠినంగా వ్యవహరించి ఈ జీవో జారీ అయ్యెలా చూడాలి. నిభంధనలను అతిక్రమించిన ఆటో వాలాలకు కఠినమైన శిక్ష విధించాలి.

Unknown said...

ఒక సంఘం యేర్పాటు చేస్తేచాలు. అది ఎలాంటిది, ఎలాంటి డిమాండ్లు చేస్తున్నదని, ఆలోచించే ప్రసక్తే లేదు. వాళ్ళకు కావాల్సింది గొర్రెలు. ప్రజాస్వామ్యంలో జనబలంతో ఏదైనా చేయవచ్చు మరి. యూనియన్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి!!

Anonymous said...

కుండ బద్దలు కొట్టినళ్లు చెపారు. దన్యవాదాలు

రానారె said...

చాలా మంచి టపా. ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగు చాలా ముఖ్యమైనది. మనమంతా గుర్తుంచుకోవలసిన మాట.

Anonymous said...

సుధాకర్ బాబు నీవు జుబ్లీహిల్స్ కాల్పులు ఇంకా మరిచిపొలేదా(బహుశా ఏకసంతాగ్రాహివేమో),హైదరాబాద్ లో వేరే విషయం లేనట్లు.

చదువరి said...

85 వేల చిల్లర ఆటోలు, ఓ లక్ష చిల్లర ఆటోవాలాలు; వాళ్ళకోసం 50 లక్షల మంది ఎదుర్కొంటున్న దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం నా..నుస్తూ ఉంది. ఆటోల విషయమే కాదు.. చాలా విషయాల్లో కొందరి ప్రయోజనం కోసం ఎంతోమందిని కష్టపెట్టడం మామూలైపోయింది రాజకీయులకి. రోడ్డు పక్కన ఉండే వెండర్లు ట్రాఫిక్ జాముకు ఒక ప్రధాన కారణం.., వాళ్ళని తరలించాలంటే అడ్డం పడిపోతారు! కోటిలో రోడ్డు పక్కన ఉన్న పుస్తకాల కొట్లు తీసెయ్యడం బ్రహ్మప్రళయమై పోయింది కొన్నేళ్ళ కిందట. సనత్‌నగరు దగ్గర వంతెన కట్టేటపుడు (ఫతేనగరు వంతెన) అక్కడ ఉన్న కొందరిని ఖాళీ చేయించడానికి మనఘనులు అడ్డుకోడం మూలాన ఆ వంతెనను చాలా సన్నగా కట్టారు. దానిమీద బిజీ సమయాల్లో వెళ్ళడం నరకప్రాయమే! ఇక రోడ్డు మధ్యలో ఉండే గుళ్ళూ, మసీదుల సంగతి చెప్పేపనే లేదు గదా!

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name