Tuesday, January 31, 2006

మనమెక్కడ?

ప్రపంచం లో అత్యధికంగా వాడబడే భాషల పట్టిక మీరు ఇక్కడ చూడవచ్చు.

ఆశ్చర్యకరంగా బెంగాలీ బాబులు తమ తిరుగులేని బాషాభిమానం తో 5 వ స్థానం లో
వున్నారు.

మిగిలిన భారతీయ బాషలు, వాటి స్థానాలు..

06. హిందీ
17. తెలుగు
19. మరాఠీ
20. తమిళం
25. గుజరాతీ
30. మలయాళం

కానీ ఇది వాస్తవం కాకపోవచ్చు కూడా...ఎందుకంటే వికిపీడియా ప్రకారం హిందీ రెండవ స్థానం లో వుంది.

Monday, January 30, 2006

ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ? అందాలనద్దమని అడుగు అడుగుకు...

ఇటీవల సంక్రాంతి తరువాత ఇంటి నుంచి తిరుగు ప్రయాణం ఫలక్ నుమా లో (రెండు గంటలు ఆలస్యం) వచ్చాను.రాత్రి అంతా బాగానే గడిచింది కాని, తెల్లవారాకా నాకు ఆ ఏ.సి కంపార్టుమెంటు తిక్క పుట్తించింది.పెద్దగా మాటలాడటానికి ఇష్టపడని ప్రయాణీకులు, ఇష్టపడినా భాష రాని బెంగాలీ వాళ్లు, తెరవలేని గాజు అద్దాలు, తెల్లవారి బారెడు పొద్దు ఎక్కినా, బెర్తులు దిగని మహానుభావులు, అందరిని చూస్తే జాలి, కోపం రెండూ వచ్చాయి.

బయట అందమయిన పొలాలు, కరకు రాతి నేలలు, చిన్న చిన్న కాలువలు వెనక్కు పరుగులు తీస్తుంటే చూసి ఆనందించలేక, కృత్రిమ చల్లదనాన్ని ఆబగా ఆలింగనం చేసుకున్న బడుధ్ధాయిలు అనిపించింది.

బయటకు వెళ్లి కాసేపు కోచ్ అటెండెంట్ తో మాట్లాడాకా, తలుపు తీసా, ఎదో పచ్చని పల్లె ఒక్క సారి నా కళ్లను మొత్తం తన వయిపు తిప్పుకునేలా చేసి, ముసి ముసి నవ్వులు రువ్వినట్టయింది.ఆ నిలుచున్న కాసేపు నా మదిలో సాగిన ఆలోచనల రూపం ఇది.

సంక్రాంతి లక్ష్మి పెద్దగా సిరులు ఇవ్వక పోయినా, పల్లె మొహాలలో వదిలివెల్లిన సంతోషం ఛాయలు...
పండక్కి కొత్త టైరు దొరికితే, దాన్ని బెంజి కారులా తోలుకెల్తున్న భావి పల్లె పౌరులు...
దొరికిన గాలిపటాల నన్నింటిని, అందిచ్చుకుని, ఎడా పెడా జడలో తురుముకుని మురిసిపోతున్న మర్రిమానులు, రావి చెట్లు...
ఆ చెట్ల పైనే కొత్తగా వచ్చిన గాలి పటాల తో యుద్ధం చేస్తూ, వాటిని కుళ్ళబొడిచేస్తున్న కాకులు...
మేని నిండా రాసిన పసుపుతో గర్వంగా, భూమిలోకి ముందుకి చొచ్చుకు పోతున్న ఇనుపనాగల్లూ...
శ్వేత ఛాయ మేనితో మెరిసిపోతూ, యజమాని కళ్ల మెరుపు లో కదుల్తున్న గిత్తలు...

ఇవన్నీ చూస్తుంటే, ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ? అందాలనద్దమని అడుగు అడుగుకు అని పేరడీ పాడాలనిపిస్తుంది.

Sunday, January 29, 2006

తెలుగు బ్లాగు, తెలుగు టెలివిజన్ లో...

రేపు టివి 9 (తెలుగు లో ఒక ప్రముఖ వార్తా ఛానెల్) వారి టెక్నోబైట్స్ అనే సాంకేతిక సంబంధిత కార్యక్రమం, తెలుగు లో బ్లాగింగు గూర్చి కిరణ్ చావా గారితో ముఖాముఖి ప్రసారం చెయ్యబోతోంది.

నేను కూడా కాసేపు బ్లాగుల గూర్చి మాటాడాను కాని, English లో :-) నేను ఈ కార్యక్రమం లో, కాసేపు బ్లాగు అంటే ఏమిటి? ఏలా మొదలు పెట్టాలి? మొదలగు విషయాలు చెప్పాను.

ఈ కార్యక్రమం, ఈ ఆదివారం అంటే 30-January-2006, 12:30 PM కి ప్రసారం కాబోతుంది. మరలా, తరువాతి బుధవారం, సాయంత్రం అయిదున్నర గంటలకు ప్రసారం అవుతుంది.

Thursday, January 05, 2006

Rx...మన తేనె, ఒక చెంబుడు, ప్రతీ రోజు...ఏదో ఒక సమయం లో...

నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. తెల్లవారు జామునే తేనెపట్టు దొరికితే ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పండి :-)అందులో నాకు ఎంతో నచ్చిన "రచన" ఇంటర్నెట్ లో లభ్యమవటం ఒకటి. తపో సాధన లాంటి ఆ సాహిత్య మరియు బాషా తృష్ణకు మన తెలుగు భాషా సంఘం శాయి గారి ని సత్కరించి తీరాలి.

నాకు రచన పరిచయమయ్యింది నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో అనుకుంటా...మల్లాది క్రిష్ణమూర్తి గారి "మూడు ప్రశ్నలు, ఒకటే సమాధానం" పోటీ ని నేను చాలా సీరియస్ గా చదివే వాడిని. ఒక సారి మాత్రం నాకు ద్వితీయ బహుమతి క్రింద 58 రూ. (అర్ధనూటపదార్లు అన్నమాట :-)) వచ్చాయి. అందులో ఒక అయిదు రూపాయలు తెచ్చిన పోస్టుమాన్ కి. కాకపోతే అది తప్పనిసరిగా లంచం కాదు సుమండీ :-)

తెలుగు వారంతా ఒకరిని అదుకొని తమని తాము అభిషేకించుకోవాలంటే తప్పక "రచన" లాంటి పత్రిక చదవాలి, వాటి మనుగడకు తోడ్పడాలి. ఒక్కసారి ఈ జనవరి నెల సంచిక చదవండి. మొదటి పుటలోనే నేను ఈ మధ్యనే కొన్న "బాల విహంగ వీక్షణ సంపుటి" గురించి ప్రకటన చూసాను.

ఈ రోజు దొరికిన ఇంకొక సాహిత్య కుసుమం, ఈమాట. నాకు ఇది కిరణ్ గారి సోది కామెంట్లు చదువుతుంటే దొరికింది. ఇది నిజంగా ఒక తేనె పట్టు. ఖాళీ సమయాలలో idlebrain.com చదవటం కంటే ఈ రెండూ కళ్లకద్దుకోవటం మంచిదని నా అభిప్రాయం.

Tuesday, January 03, 2006

పుస్తకాలతో పరిచయం

చాలా రోజుల తరువాత మరలా నేను తెలుగు లో రాయటానికి సమయం చిక్కింది. ఇంత కాలం ఏమి వెలగ బెట్టాడంటా అని అనుకోవచ్చు.దానికి ఒక కారణం ఉంది. ఎప్పుడు బ్లాగు చెయ్యాలన్నా, ఎవేవో పిచ్చి పిచ్చి విషయాలు, పనికి రాని రాజకీయాలు బుర్రలో కొట్టుకుని చివరకి నా చేతి పైన విజయం సాధించి వాటి గూర్చి రాయించుకునేవి.

వాటిని జయించాలంటే, ఒకటి మన సంఘం లో కుళ్లు పట్టించుకోకూడదు. (ఇది మనకు కష్టమయిన పని). రెండవది, తెగ పుస్తకాల తో సావసం చెయ్యటం. నేను రెండవ మార్గం ఎంచుకున్నాను. ఎందుకంటే నేను చదవని పుస్తకాలు తెలుగులో చాలా వున్నాయి మరి.

ఈ మధ్య భాగ్యనగరం లో పుస్తక ప్రదర్శన జరిగింది. నేను కూడా మా మిత్ర బృందం తో కలసి దొరికిన మంచి పుస్తకాలు అన్ని కొన్నాను. ఇదిగో ఆ చిట్తా...

01. బాల పత్రిక (1945-1959) విహంగ వీక్షణ సంపుటి (4 సంపుటాలు)
02. వంశీ గారి "మా పసలపూడి కధలు"
03. ఈ విప్లవం అంతరంగం లో - జిడ్దు కృష్ణమూర్తి గారు
04. ఒక యోగి ఆత్మ కధ
05. ఓంకార్ ఆల్ ఇన్ ఒన్
06. కాలబిలాలు పిల్లవిశ్వాలు - హాకింగ్
07. కాలం కధ - హాకింగ్
08. ఈనాడు కార్టూనులు - శ్రీధర్
09. ఇండియా ట్రావెల్ గైడు.
10. అమ్మ - గోర్కి

ఇవి కాక మునుపు కొన్న 18 సంపుటాల కాశీ మజిలీ కధలు, వేయిన్నొక్క రాత్రులు పూర్తి చెయ్యాల్సి వుంది. ప్రస్తుతం మంచి పల్లె లో, మొగలి డొంకల్లో పుట్టిన మొగలి పువ్వుల్లాంటి "మా పసలపూడి కధలు" చదువుతున్నాను. త్వరలో వాటి గురించి రాయాలని అనిపిస్తుంది.
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name