Friday, August 31, 2007

ఎంతకాలం ఈ ఆత్మ ద్రోహం ?

పని వత్తిడి వలన ఇంతకాలం కొన్ని టపాలు చదవలేకపోయాను. అందులో ఈ మంచి టపా ఒకటి. చదివితే కొంతమంది బాధపడినా, అది నిప్పులాంటి నిజాన్ని ఒప్పుకోమని చెప్పగలిగిందనేది వాస్తవం. అవన్నీ చూసి, నిష్టూరాలు వేసే ముందు మొదట భారతదేశ సమీకరణాన్ని చూద్దాం, చరిత్ర చూద్దాం...ఎందుకు, ఏమిటి, ఎలా అనే మూడు చదువుదాం.

(CIA Fact Book, July 2007 లెక్కల ప్రకారం)

భారత దేశ ప్రస్తుత జనాభా : 1,129,866,154

మతాల పరంగా చూస్తే

హిందువులు : 80.5%

ముస్లిములు : 13.4%

క్రిష్టియన్లు : 2.3%

సిక్కులు : 1.9%

మిగిలిన వారు : 1.8%

అయితే భారతదేశం రాజ్యాంగపరంగా ఈ శాతాలను వేటినీ పరిపాలనా సిద్ధాంతాలకు ప్రాతిపదికగా తీసుకోజాలదు. మనది ప్రజాస్వామ్య లౌకిక సార్వభౌమ దేశం కాబట్టి. పాకిస్తాన్, బంగ్లాదేశాలలో ఈ శాతాలు మొత్తం ప్రభుత్వాలనే మత ప్రాతిపదికగా ఏర్పరిచాయి. ఆ దేశాలలో మైనారిటీల గోల వేరు. బాధలు వేరు. వారిని ఎవరూ పట్టించుకోరు. ఒక పట్టించుకుని ఎవరన్నా చిన్న పుస్తకం రాస్తే దేవుడి పేర తల తీసెయ్యమని ఒక ఫత్వా ప్రపంచవ్యాప్తంగా జారీ అయుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవడో ఒకడు దానిని అమలు చేసెస్తాడు.

ఇక మన దేశంలో....మైనారిటి చట్టాలు ఎలా వుంటాయంటే, వారిని భారతదేశ పౌరులమేనా మనం అనే రకంగా భావించుకునేటట్లుగా నిర్ణయింపబడ్డాయి. వారి చట్టాలు వేరు, నిధులు వేరు, ఎండోమెంటు పనులు వేరు, స్త్రీల చట్టాలు వేరు, స్కూళ్ళు వేరు, ఆఖరికి కాలేజీలు కూడా వేరే. మన దేశంలో ఇంకా ఫత్వా అనేదానికి అర్ధం వుంది. అది ఒక ఇమామ్ జారీ చేసాడు కూడా. అదే ఫత్వాలో సగం తీవ్రతతో ఒక వాఖ్య ఏదైనా ఎవడైనా ఒంకొకడు చేస్తే పార్లమెంటు దుమ్మెత్తిపోతుంది. పార్టీలు పోటీలు పడి మైనారిటీ ప్రేమను చూపిస్తాయి. ఆ అన్నవాడికి మతతత్వాన్ని అంటగట్టేస్తాయి. ఈ డ్రామా చాలా రోజులనుంచి ఇలానే జరుగుతుంది. 

అలా అని ఈ దేశంలో హిందువులేమి తక్కువ కాదు. వారిలోనూ అతివాదులున్నారు. వెధవ పనులూ చేసారు, ప్రాణాలూ తీసారు. కానీ దేశంలో ఎంత మంది వారికి చేయూతనిస్తున్నారు? వారి  నెట్వర్క్ ఏమిటి? మహా అయితే ఒకటి రెండు రాజకీయ పార్టీలు. అవి కూడా దేశ రాజ్యాంగానికి లోబడినవి. వీరి నుంచి అన్య మతాలకు కొద్దిగా ఇరకాటాలుంటాయి, కానీ దేశానికి చిచ్చు మాత్రం పెట్టరు. అంటే పార్లమెంటు మీద దాడి చెయ్యటం లాంటివన్న మాట.

ఇక మిగిలిన శాతం చూద్దాం. 13.4% శాతంలో మహా అయితే 1.0 % శాతం మాత్రమే అతివాదులుంటారు. కానీ ఈ ఒక్క శాతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అందరికి తెలిసిందే. దానిని ఎవడూ ఒప్పుకోడు. ఒప్పుకుంటే వోట్లు రాలవన్న భయం. అసలు నాకర్ధం కానిది, "అఫ్జల్" గాడిని వురి తీస్తే మన దేశంలో ముస్లింలు ఎందుకు ఓట్లు వెయ్యరు? అలా అని రాజకీయపార్టీలు ఎందుకనుకుంటున్నాయి? ఆ లెక్కన మన దేశంలో ముస్లింలు దేశభక్తి ఏమన్నా లేని వారా? అద్భుత కళాకారులు, రాజ్యాంగ నిపుణులు, వైద్యులు అన్ని రంగాలలో స్రష్టలు వున్నారు కదా? మరి ఎక్కడుందీ సమస్య? ఎవరు ఈ ఇమేజ్ ను మన దేశపు ముస్లిములకు అంటగడుతున్నారు? ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి మన దేశంలో చేయూత లభిస్తుంది?

బహుశా ఇవి కొన్ని కారణాలు కావచ్చు...

౦౧. ప్రభుత్వాలు, మదరస్సాలు వారిలో అవిద్యను పెంచి పోషించటం
౦౨. ప్రభుత్వపు సవతి తల్లి ప్రేమ
౦౩. అధిక స్థాయిలో పేదరికం
౦౪. పాత తరపు చాందస వాద ఇస్లామిక్ పార్టీల పట్టు

పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం, ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ, ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ చేసిన వాడు పారిపోవాలి, లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు. వాహనాలు తగలబెడతారు. ఈ కార్యక్రమంలో సాక్షాత్తు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేనో, ఎంపీనో పాల్గొంటారు. భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ఆ ప్రాంతాలను ఏలుతున్నాయి. ఒక అభివృద్ది వుండదు. అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు. ఎవరూ ఏ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు. వెళ్తే వస్తారో రారో చెప్పలేం. ఇలా వుంది పరిస్థితి. దీనిని సరి చెయ్యటానికి ఏ పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు. ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం. ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి. అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే, ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట. ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అంతే కానీ వారి అభివృద్ధి గానీ, విద్య గానీ అస్సలు పట్టదు.

పైన చెప్పిన జాడ్యాలన్ని తీవ్రవాద పార్టీలకు అచ్చంగా మన ప్రభుత్వం ఇచ్చిన వరాలు. ప్రస్తుతం పరిస్థితి ఎలా వుందంటే ఒక తీవ్రవాది దొరికితే వాడికి శిక్ష కూడా వోట్ల రాజకీయాల బట్టి అమలు చేస్తున్నారు.

ఈ మతం మత్తునుంచి దేశం ఎప్పుడు బయట పడుతుంది? తీవ్రవాది, దేశ ద్రోహి అన్నాక ఏ మతమైనా ఒకటే. మతాన్ని దానికి జోడించి ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ఇది ఇలానే జరిగుతూ పోతే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు దేశ భావ స్రవంతి నుంచి క్రమంగా దూరమైపోతారు. తమ దేశంలోనే పరాయిగా బతుకుతారు.

ఎంతకాలం ఇలా మనం స్వీయమోసం చేసుకుంటాం? ఒక జాతి, ఒక జాతి అని లక్ష సార్లు అరిచేకంటే, ఒక్క జాతిగా బతికి చూపితే మంచిదేమో?  

Thursday, August 30, 2007

కంప్యూటర్ ఎరా తెలుగు వెలుగులు...

కంప్యూటర్ ఎరా తెలుగు సాంకేతిక పత్రిక "వెబ్ లో తెలుగు వెలుగులు" పతాక శీర్షికతో ఇప్పుడు లభ్యం. అన్ని విషయాలను (ఏదీ వదల లేదేమో బహుశా) అంత నేర్పుగా కూరి కూరి అద్భుతంగా వండి పడేసిన ఘనత మాత్రం జ్యోతి గారిదే. అన్ని పేజీలకు తమ అమూల్యమైన పత్రిక పుటలను కేటాయించిన పెద్ద మనసు మన నల్లమోతు శ్రీధర్ గారిదే...వారిద్దరికి మనసారా ధన్యవాదాలు. నిన్న రాత్రి నేను నా ప్రతి కొనుక్కున్నా...పదిహేను రూపాయలలో మీకు పది రోజులకు సరిపడా చదువుకునేందుకు అందులో విషయాలు వున్నాయి. మరెందుకిక ఆలస్యం...మీ ప్రతి కొనుక్కునేందుకు బయల్దేరండి. లేదా సంవత్సర చందాదారులుగా చేరండి. మన అమ్మా నాన్నలకు కంప్యూటర్ నేర్పాలంటే ఇంతకంటే మంచి పుస్తకం దొరకదు.

Monday, August 27, 2007

మా వైద్యుడు...అప్పిచ్చువాడు...నగరం

 అప్పిచ్చువాడు....వైద్యుడు వున్న వూరిలో వుండాలని పెద్దలెపుడో చెప్పారు.

అలానే అనుకుని పాపం అమాయక ప్రజలు నమ్మారు...

కోకొల్లలుగా వూరిలో మకాం పెట్టేసారు...

వూరిని నగరంగా మార్చేసారు....

నగరంగా మారిన వూరు కూడా ఒళ్లు విరుచుకుని గర్వపడింది....దాని రాబడి కూడా పెరిగింది.

దాంతో నగరం పక్కదారులు పట్టింది.

ఇక వైద్యుడు తన అసలు పని మానేసి రాజకీయాలలో ఆరితేరాడు..

ప్రజలు తనను నమ్ముకున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చాడు.

క్రమంగా అందరూ రాజకీయులే ఆ నగరానికి అన్ని దిక్కులయ్యారు...

ఏడీ వైద్యుడు కనిపించడే....అలా అని ఉన్న వూరిమీద మమకారం ప్రజలను వదలదే...

ఆ మమకారంతో ప్రజలు నగరాన్ని వదలటం లేదు...

అప్పిచ్చువాడు..అప్పు ఇస్తూనే నగరాన్ని దోచుకోవటం మొదలుపెట్టాడు...కుటుంబాలు చితికిపోయాయి

నగరానికి పట్టిన రోగంలో మాడి మసయిపోయిన ప్రజలను పట్టించుకునే వైద్యుడు ఎలాను లేడు...ఇంకేముంది నగరంలో కొల్లొలుగా రాబందులు తయారయ్యాయి.

శవాలపైన ఎగరుతూ వారి బంధువులను ఓదార్చడమే పనిగా పెట్టుకున్నాయి.

వైద్యుడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు....ప్రస్తుతం వైద్యం మానేసి పోష్టుమార్టమే చెయ్యటం మొదలెట్టాడు

ఇప్పుడు అతడు ఎవరు ఎందుకు చనిపోయారో మాత్రమే చెప్పగలడు...అతికష్టం మీద...

రక్షించు మహాప్రభో అంటే...ఎక్కడో దేహంలో దాడి జరిగితే నా కళ్లకు ఎలా కనిపిస్తుంది అని అమాయకంగా అడుగుతాడు..

నేను వైద్యం చెయ్యలేనందుకు .... నీకు ఎక్స్ గ్రేషియా ఇస్తానంటాడు.

ప్రజలు పైన పెద్దలు చెప్పిన పద్యాన్ని మరొకసారి చదువుకున్నారు.

ఏమీ తోచలేదు...ఎక్కడకు పోవాలో సమఝవ్వలేదు...

మన బతుకింతే అని పద్యాన్ని మార్చి రాసేసుకున్నారు...

పిల్లలకూ అదే నేర్పారు...

అమ్మా, నాన్నలతో వుంటే అన్నింటి కంటే సురక్షితమనుకునే పిల్లలకు ఇవి అర్ధం కాలేదు.

వారు పెద్దయ్యాక కూడా ఇంకా వారు పాత పద్యాన్నే నమ్మసాగారు...

నగరం మాత్రం నవ్వుతూ తన శరీరాన్ని అమ్ముకుంటూ పెంచుకుంటూనే వుంది.

దానికిప్పుడు ఈ రోగాలు పెద్దగా పట్టవు...వైద్యుడి అవసరం అంతకన్నా లేదు....

Saturday, August 25, 2007

ఇదేనా భాగ్య నగరం ?

దాదాపు నలభై మంది వరకూ మృతి. వంద మందికి పైగా క్షతగాత్రులు...

బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ..ఇవీ ఈ నగర ప్రజల వినే ప్రభుత్వపు చివరి పలుకులు.

బహుశా వారి పని కావచ్చు...బహుశా వీరి పని కావచ్చు..ఇవి పోలిసుల అరిగిపోయిన రికార్డులు...

ఇది పిరికిపందల చర్య ...పనికి రాని కేంద్రం..

ఛీ మనదీ ఒక సమాజమేనా? ఇక్కడ ప్రాణాలకు విలువ ఐదు లక్షలా? అన్ని రకాల ఇంటలిజెన్స్ నివేదికలూ పోలీసులను ముందుగానే హెచ్చరిస్తాయి..గానీ అక్కడ వినటానికి నిజమైన పోలీస్ వుంటేగా...ప్రతీ ఒక్కడు ఎన్నెన్ని లక్షలు పోసి ఇక్కడకు పోస్టింగులు చెయ్యించుకుంటారో చెత్తనా వెధవలు....అందరూ వాళ్లే వుంటే ఇక నిజమైన పోలీసులు ఎక్కడ? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ప్రభుత్వానికి ఎప్పుడు పడుతుంది?

పేలుడు తరువాతి దృశ్యాలు చూస్తుంటే అసలు మన దేశంలో క్రైమ్ సీన్ అనే దానికి అర్ధం వుందా? అనిపించింది. శవాల మధ్యన తిరుగుతున్న పది పదిహేను జతల కాళ్ళు...ఏ క్లూ ఎవడి కాళ్ల క్రింద నలిగిపోతుందో అర్ధం కాదు. ఒక పోలీస్ సెక్యూరిటీ లైన్ అంతకంటే లేదు.

అంబులెన్సులు గంట తరువాత వచ్చాయి....మరి ఎలా రాగలవు? మనది అద్భుతమైన ట్రాఫిక్ కదా? ఎలా వస్తాయి?

సీ.యన్.యన్ ఐబి యన్ ఒక్క ముక్కలో మన నగర పరిస్థితి చెప్పింది.... హైదరాబాదుకు సెక్యూరిటి కల్చర్ లేదు.

అవును ఒప్పుకోవాల్సిందే...అస్సలు లేదు.

తమకు సంబంధించని వైషమ్యాలలో, తమకు తెలియని సమాజం జరిపిన దాడిలో, తమకు తెలిసేలోపే అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న మన  సమాజ పౌరులకు సిగ్గుతో తలవంచుకుని శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.

Friday, August 24, 2007

మన రాజధానికే ఇవి సొంతం....పోటీయే లేదు

మన భాగ్యనగరానికే సొంతం అయిన అవలక్షణాలలో ఆణిముత్యాల లాంటి నాలుగు అవలక్షణాలను నేను ఈ మధ్య సరదాగా నా సెల్ ఫోన్ తో క్లిక్కు మనిపించా...వీటిలో కొన్ని ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి, ఇంకా చాలా మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూనే వున్నాయి. అయినా "నాకేంటంటా? అహ...నాకేమిటంట?" అనే రకంగా వున్న ప్రభుత్వ వ్యవస్థ పిల్లి నిద్ర పోతూనే వుంది.

౦౧. మహానగరపు అమీర్ పేట సార్వత్రిక విశ్వవిద్యాలయం జడల మర్రి

బ్యానరు కడతారు....కొద్ది రోజులలో కొత్త కోర్సు వస్తుంది....బ్యానరు విప్పరు...తెంపుతారు...కొత్తది కడతారు. ఇలా తాళి మీద తాళి ఈ స్థంభానికి కడుతూనే వుంటారు. ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.

౦౨. ప్రత్యక్ష నరక ప్రాయమైన ట్రాఫిక్

 ప్రపంచంలోనే అతి విచిత్రమైన ట్రాఫిక్. రోడ్లు విశాలంగా వుంటే ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. వున్నా వారికి సగానికి పైగా రూల్స్ తెలియవు. వారికి తెలిసి ఎవరిని ఆపినా ఎవరూ ఆగరు...పారిపోతారు. అడ్డంగా కట్టి పడేసిన మసీదులు, గుడులు, సమాధులు ఈ నరక ప్రగతికి సోపానాలు.

౦౩. కబ్జా కింగుల కనక సింహాసనం

ఎక్కడ చెరువుంటే, సముద్రముంటే అక్కడ నాగరికతా, ప్రకృతి వెల్లివిరుస్తాయి. ఇక్కడ మాత్రం డంపింగు విరిసి కురుస్తుంది. ఆనక ఆ చెరువుని మెల్లగా కప్పేస్తుంది. కబ్జా చేస్తుంది.

౦౪. అధికారుల ధన దురాశాపరత్వం : గ్రేటర్ మెగా యాడ్ సిటీ

మీరు ఒక గంట రోడ్డు మధ్య కదలకుండా నిల్చుంటే, మీ వీపు భాగాన్ని బల్దియా జాలిమ్ లోషన్ వారికి యాడ్ అతికించుకోవటానికి అద్దెకిచ్చేస్తుంది. నగరమంతటా యాడ్లే. ఫుట్ ఓవర్ వంతెనలు కూడా వదలరు. చెట్లు నాటితే ఏమొస్తుంది నా బొంద...యాడ్లు నాటుదాం రండి. రాత్రింబవళ్ళు విద్యుత్తు సరఫరా కూడా వుంటుంది. యాడు వున్నా లేకున్నా సరే...

Thursday, August 23, 2007

శ్వేత భారతీయ సౌందర్యం

ఈ మధ్య నేను నిశితంగా గమనిస్తున్నవి వివిధ రకాల ప్రకటనలు. నాకీ అలవాటు అమూల్ ప్రకటనల పట్ల ఇష్టంతో మొదలయ్యింది. అమూల్ ప్రకటనలు అత్యంత భారతీయంగా చూడగానే నవ్వొచ్చే సమకాలీన అంశాలను పేరడీ చేస్తూ చాలా బాగుంటాయి. అలా మొదలయ్యిన ఇష్టం అమెరికాలో ప్రకటనలు చూసాకా ఇంకా ఎక్కువయింది. అయితే ఈ మధ్య మన దేశంలో వస్తున్న టీవీ, హోర్డింగుల ప్రకటనలు చూస్తే చాలా బాధగా వుంది. అసలు ఈ ప్రకటనలపై ఒక సెన్సారు బోర్డు వుందా లేదో నాకు తెలియదు కానీ...వుంటే బాగుండునేమో అనిపిస్తుంది. కొన్ని యాడ్లు ఆగి చూస్తే గానీ అర్ధం కావు. మరికొన్ని కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తు వుంటాయి. జాగ్రత్తగా అలోచిస్తే గానీ అవి అర్ధం కావు.

ముఖ్యంగా ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనలు. ఈ ప్రకటనలు ఎంతకు తెగిస్తున్నాయంటే నలుపు అనేది అందవికారానికి చిహ్నం అని నూరిపోసేంతగా.. ఒక క్రీము కంపనీ ఒక నల్లని అమ్మాయిని చూపించి...ఆమెని మైకేల్ జాక్సన్ తెలుపుకు క్రమంగా తెచ్చి "అందమే ఆత్మ విశ్వాసం" అని డప్పు కొడుతుంది. ఫెయిర్ నెస్ అంటే "తెలుపు" రంగనుకునే బ్రిటీష్ కాలపు బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతాం?

ఇంకొక క్రీము కంపనీ...మగవాళ్లు ఆడవారి క్రీమ్ వాడటమా అని హేళన చెయ్యటం. స్త్రీల మీద వారి వుద్దేశ్యమేంటో అర్ధం కాదు. అసలు ఈ క్రీముల వలన చర్మంలోని మెలనిన్ శాతాన్ని తగ్గించగలం అని ఇప్పటివరకూ ఎవడు ఇతమిధ్ధంగా నిరూపించలేకపోయారు. ఈ మధ్య ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటి అంటే ఆసియన్లకు తెలుపు మీద వెర్రి ప్రేమ అని, అదే అమెరికన్ తెగలకు కాంతివంతమైన చర్మం మీద అధికమని. ఈ కారణం మీద అన్ని ప్రకటనలు ఇప్పుడు "తెలుపు" మంత్రాన్ని "అందానికి" అందలంగా చూపిస్తున్నాయి, డబ్బులు పిండుకుంటున్నాయి. మన దేశంలో ఈ దరిద్రమైన  ఆర్యన్ దేహ "అందపు" నిర్వచనానికి బలం చేకూర్చే ఎటువంటి పనినైనా ప్రభుత్వం సెన్సారు చెయ్యాల్సిన పని వుంది. లేకపోతే ఇప్పటికే తెల్లవాళ్లకు అమ్ముడు పోయిన ఆత్మ గౌరవపు చివరి ఎంగిలి మెతుకుల్ని కూడా "తెలుపు" రంగు పేరిట చాలా మంది కోల్పోయి అందుకు నల్లగా పుట్టాన్రా బాబు అని బాధపడుతూనే వుంటారు.

Thursday, August 16, 2007

గూగుల్ తెలుగు ఆన్ లైన్ కీ బోర్డు

ప్రస్తుతానికి ఇది చాలా సాదాగా వుంది. ఐగూగుల్ మాడ్యూల్ గానే లభ్యం అవుతుంది. దిగువ చూపిన లంకె నుంచి దీనిని మీరు మీ గూగుల్ హోమ్ పేజీకి జత చెయ్యవచ్చు.

Indic On-Screen Keyboard iGoogle Gadgets

Tuesday, August 14, 2007

నోకియా బాంబులు...మీ దగ్గరా వున్నాయా?

నోకియా బ్యాటరీల పేలుడు వార్తలు విన్నారా?

మీరు గనక క్రింద ఇవ్వబడిన మోడల్ నోకియా మొబైల్ ఫోన్ వాడుతున్నట్టయితే వెంటనే ఒక్క సారి మీ బ్యాటరీ మోడల్ చూడండి.

Nokia 1100, Nokia 1100c, Nokia 1101, Nokia 1108, Nokia 1110, Nokia 1112, Nokia 1255, Nokia 1315, Nokia 1600, Nokia 2112, Nokia 2118, Nokia 2255, Nokia 2272, Nokia 2275, Nokia 2300, Nokia 2300c, Nokia 2310, Nokia 2355, Nokia 2600, Nokia 2610, Nokia 2610b, Nokia 2626, Nokia 3100, Nokia 3105, Nokia 3120, Nokia 3125, Nokia 6030, Nokia 6085, Nokia 6086, Nokia 6108, Nokia 6175i, Nokia 6178i, Nokia 6230, Nokia 6230i, Nokia 6270, Nokia 6600, Nokia 6620, Nokia 6630, Nokia 6631, Nokia 6670, Nokia 6680, Nokia 6681, Nokia 6682, Nokia 6820, Nokia 6822, Nokia 7610, Nokia N70, Nokia N71, Nokia N72, Nokia N91, Nokia E50, Nokia E60

అది బీ యల్ - ఐదు సీ (BL-5C) అయితే కనుక వెంటనే ఇక్కడ చూపిన విధంగా మీ బ్యాటరీ సీరియల్ నంబరుతో ఒక్క సారి సరి చూడండి.

మీ బ్యాటరీ కనుక పేలే సంభావ్యత వున్నట్టుగా తేలితే, దగ్గరలో వున్న నోకియా షోరూం (హైదరాబాదులో అయితే సోమాజిగుడ) దర్శించితే మీకు కొత్త బ్యాటరీ లభిస్తుంది.

మొబైల్ వంక భయంగా చూడటం మాని, తొందరగా కొత్త బ్యాటరీ తెచ్చుకోండి మరి...

Sunday, August 12, 2007

నా బ్లాగ్నిశ్సబ్ధం

దాదాపు నెల తరువాత మరలా నా బ్లాగు ప్రపంచంలోనికి అడుగుపెట్టాను. (హడావిడిలో రాసిన క్రింది టపాను మినహాయించితే) గత నెల రోజులుగా నేను ఎందుకు ఒక్క టపా కూడా రాయలేకపోయానంటే అందుకు పెద్దగా కారణాలు కనిపించటంలేదు :-) పని ఒత్తిడి కొద్దిగా పెరిగింది. బహుశా సియాటిల్ లో స్నేహితులు నన్ను తెగ తిప్పి అన్నీ చూపించటం వలన వచ్చిన అలసటా కావచ్చు. నా బద్ధకం వలన ఎవరి వ్యాఖ్యలైనా వెంటనే అప్రూవ్ చెయ్యలేక పోయిండవచ్చు, తిరిగి నా అభిప్రాయాలు రాయలేక పోయి వుండవచ్చు. (కొంతమంది దీనిపై నన్ను విమర్శించారు కూడా...:-)). అందుకు నన్ను క్షమించ కోరుతున్నాను.

కానీ మరొక్క సారి నేను కొన్ని విషయాలు చెప్పదలచు కున్నాను.

01. ఈ బ్లాగు లో నేను రాసిన ఏ విషయమైనా పూర్తిగా నా భావం మాత్రమే. అది అందరికి నచ్చుతుందని గ్యారంటీ నేను ఇవ్వలేను. నా బ్లాగే కాదు ...ఏ బ్లాగు అది ఇవ్వదు.

02. ఇక నా బ్లాగులో వ్యాఖ్యానాలు అవి రాసిన వారి సొంతం. నాకు ఏ మాత్రము సంబంధమూ లేదు. అయితే పరస్పర దూషణలకు ఈ బ్లాగు వేదిక కాకుండా చిన్న జాగ్రత్త తీసుకునేందుకు "అనామిక" వ్యాఖ్యలను చాలా వరకు కత్తిరించదలచుకున్నాను. అలానే డిగ్నిటీ లేనివి కూడా...:-) నన్ను తిట్టాలంటే మీరు నాకు ఒక ఈలేఖ (సుధాకర్ @ జీ మెయిల్) రాసి పడెయ్యండి.

అదండీ సంగతి...
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name