Saturday, June 30, 2007

తానా తందానా

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రయాణిస్తున్న దిశ చూస్తే నవ్వు వస్తుంది. ఇది కొన్నాళ్లకు ఎన్.ఆర్.ఐ పెట్టుబడుల సంఘంగా మారుతుందేమో అన్న సందేహమూ వస్తుంది. ఇప్పుడు అది అమెరికా రాజకీయాలలో దూరేంతవరకూ పోయింది. సోనియాను ఇటాలియన్ అని తిట్టే చంద్ర బాబు, తెలుగు జనాలు అమెరికా రాజకీయాలలోనికి దూరటాన్ని ఎలా సమర్ధిస్తాడో మరి. ప్రతి రాజకీయ ప్రతినిధి అమెరికా వెళ్లడం, అక్కడి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమనటం. పెట్టుబడులు తప్ప మరేమి చెయ్యలేరా వారు? సిలికానాంధ్ర లాంటి సంస్థలు ఎలాగు మన రాజకీయనాయకులకు పట్టవు.

హిల్లరీ క్లింటన్ ఎన్నికలకు ఒక మిలియన్ డాలర్లు తానా తరుపున ఇవ్వబోతున్నారంట. అంటే దాదాపు నలభై కోట్లు. ఆ డబ్బుతో ఎంత మంది తెలుగు రైతులకు విత్తనాలు కొనివ్వవచ్చు? ఎంతమంది వరద బాధితులను ఆదుకోవచ్చు? అసలు మన రాష్ట్రంలో వరదలు, తుఫాన్ సంగతి వారికి అసలు పట్టిందా? లేదా విడుదలవ్వబోయే చిరంజీవి సినిమాకు అమెరికా హక్కుల మీదే ఆలోచనా?

తెలుగు భాషగా కాక సంస్కృతిగా మారినందువలన, వారిని ఎవరూ తెలుగు వారు కాదనటం లేదు. కానీ కనీసం మిగిలన దేశాల కాలనీలు, వలస వెళ్లిన జనాల సంస్కృతి, మాతృ దేశం మీద ఆరాటం, సేవ తెలుసుకుంటే చాలు.

[కొసరు] : తలో గ్రామం దత్తత తీసుకోండి. - ప్రవాసాంధ్రులతో చంద్రబాబు (ఇక్కడ చూడండి)

ఏమి చెయ్యలేని రాజకీయనాయకుల్లా కాకుండా, కాస్త మానవ సేవ కూడా చూడండి అని చెప్పకనే చెప్పినట్లుంది. చంద్రబాబు చాలా గుణ పాఠాలు నేర్చుకున్నట్లుందే? క్రితం సారి పెట్టుబడులు అడిగినట్లు గుర్తు Tongue out

Friday, June 29, 2007

కొత్త ఆపిల్ మొబైల్ - విశేషాలు

ఇంకొన్ని గంటలలో ఆపిల్ తన సరికొత్త సమ్మోహనాస్త్రాన్ని ప్రపంచం మీద ప్రయోగించబోతోంది. ఐపాడ్ తో ఆపిల్ సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. దాదాపు మూసేస్తారేమో అనుకున్న ఆపిల్ కంపనీ ఊపిరి పీల్చుకుని నిలబడటానికి కారణం ఐపాడే. మానవ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగిన సంగీత ఉపకరణం ఐపాడ్ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఐపాడ్ విజయంతో ఊపిరి పీల్చుకున్న ఆపిల్ ఇక మిగిలిన అవకాశాల వైపు దృష్టి సారించింది. ఐఫోన్ తో ఇప్పుడు ముందుకొచ్చింది. ఈ ఐఫోన్ మీద జరిగిన హడావిడి ఇంతా అంతా కాదు. ఈ మధ్య ఒక చిత్రానికి జరిగిన హంగామా స్థాయిలోనే ఇది కూడా జరిగింది.

ఈ రోజు సాయింత్రం ఆరు గంటలకు (పసిఫిక్ కాలమానం) విడుదలవ్వబోయే ఈ ఫోన్ కొనుక్కునేందుకు ఒక న్యూయార్క్ ఆపిల్ దుకాణం ముందర బారులు తీరిన జనాలను చూడండి. మనం అమెరికా వీసాలకు కాన్సులేట్ల ముందర ఒకానొక కాలంలో ఇలా ఎదురు చూసే వాళ్లం కదా? Hee hee.

చిత్రం : ఏ.బీ.సి సౌజన్యంతో

అయితే ముందర ఈ ఐఫోన్ వివరాలు,అది ఎలాంటి సేవలు అందిస్తుందో చూద్దాం...

స్టోరేజీ సామర్ధ్యం : 4 లేదా 8  గిగాబైట్ల ఫ్లాష్ డ్రైవ్
ఫోన్ బ్యాండ్ : జీ.యస్.యమ్ క్వాడ్ బాండ్
టాక్ సమయం : ఎనిమిది గంటలు
స్టాండ్ బై సమయం : రెండు వందల ఏభై గంటలు
ఇంటర్నెట్ సమయం : ఆరు గంటలు
వీడియో సమయం : ఏడు గంటలు
నిర్వహణ వ్యవస్థ : ఓ.యస్.ఎక్స్ (మాక్)|
కెమరా : 2 మెగా పిక్సెల్స్
వైర్లెస్ వ్యవస్థ : వై.ఫీ, ఎడ్జ్, బ్లూ టూత్
శబ్ధ వ్యవస్థ : AAC, MP3, AIFF, WAV
దృశ్య వ్యవస్థ : H.264, M4V, MOV

బరువు : 138 గ్రాములు

 

ఇది పాకెట్ పీసీ స్థాయిలో తయారు చేసిన వినూత్నమైన ఫోన్ లా కనిపిస్తుంది. చాలా తేలికగా, అందరికి అర్ధమయ్యే రీతిలో తయారు చేసిన అందమైన నిర్వహణ వ్యవస్థతో లభించనుంది. దీనిలో ఇప్పటి వరకు ఏ ఫోన్ లో లేని సేవలు ఏమీ పెద్దగా లేవు గానీ ఉన్న వాటినే చాలా ఆకర్షణీయంగా తయారు చేసింది ఆపిల్. ఇప్పటికే పాకెట్ పీసి తెగ వాడిన వారికి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. అయితే దీనిలో వున్న ఐపాడ్ ఈ పరికరానికే ఒక పెద్ద ఆకర్షణ.

ఈ ఫోన్ను, ఇప్పటికే చలామణిలో వున్న ప్రముఖ ఫోన్లతో పోల్చితే

ఇప్పటికి ఈ వివరాలు చాలనుకుంటా :-)

తరువాయి టపాలో అసలు ఐఫోన్ కు అంత సీన్ వుందా? లేదా అనేది రాస్తా...

Wednesday, June 20, 2007

మేరా రాష్ట్ర మహాన్ (నా రాష్ట్రం చాలా గొప్పది)

ఈ మధ్య రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే, ఎందుకురా బాబు పుట్టాం ఈ రాష్ట్రంలో పోయి పోయి అనిపిస్తుంది. భాషా ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రం పుట్టినందుకు కోపమొస్తుంది. ఎక్కడి నుంచో ఒక తెల్లోడు వచ్చు నాలుగు వేల కోట్ల భూమి నాలుగు కోట్లకు ఇక్కడ కొనుక్కోవచ్చంట. ఇదే రాష్ట్రంలో పుట్టి పెరిగి, ఒకే భాష ఇంకో యాసలో మాట్లాడే వాడు మాత్రం నాలుగు వేల జీతానికి పనిచెయ్యకూడదు. ఈ ముష్టి జీవోలతో ఎవరి కడుపు కొడుతున్నారో అర్ధం అవ్వటం లేదు.

  • పిచ్చ పిచ్చగా డబ్బులు సంపాదించుకున్న భూస్వాములు
  • సినిమాలు చూపించి బెంజిలలో తిరుగుతున్న కులనట శేఖరులు (వీరిది నటకులం కాదు)
  • రెండెకరాలతో మొదలెట్టి రెండు వేల కోట్లతో రాజకీయాలు చేస్తున్న నాయకులు
  • రోడ్డు మీద రోడ్డు ప్రతి సంవత్సరం వేస్తున్న కాంట్రాక్టరులు

పైన పేర్కొన్న వారిలో ఒక్కడిని కూడా ఈ జీవో కనీసం ఈగ వాలినంత కూడా ముట్టుకోదు. మూటా ముల్లె సర్దుకుపోయే వాళ్లంతా కూడా మధ్యతరగతి బడుగు జీవులే. ఒక అయిదు శాతం పెద్ద అధికారులు వుంటారేమో. మొదటి విడతగా నాలుగు వందల మంది కానిష్టేబుల్లు పంప బడ్డారు. అసలు ఇక్కడ అర్ధం కానిదేమిటంటే అసలు మనం వున్నది ఎక్కడ? పాకిస్థాన్ లోనా? లేకా ఇంకేమైనా దేశమా? లండన్ లో వున్నమన డాక్టర్లను మాత్రం వారు ఇంటికి పంపబోతే మనకు ఎక్కడలేని ఎన్.ఆర్.ఐ ప్రేమ పుట్టుకొస్తుందే? అలాంటిది రెసిడెంట్స్ మీద ఎందుకీ కక్ష? ఈ కక్ష ద్వారా ఎవరి వోట్లు సాధిద్దామని?

దీనికి తోడు నోటికి హద్దులేని కె.సీ.ఆర్ వ్యాఖ్యలు…."లుంగీలు కట్టుకుని, చెప్పులు చేత పట్టుకొచ్చిన ఆంధ్రా వాళ్లు"…ఎవరీ ఆంధ్రా వాళ్లు? తెలంగాణాలో దాష్టీకం సాగించిన నవాబుల మోచేతి నీళ్లు తాగిన కె.సి.ఆర్ లాంటి దొరలైతే కానే కాదు. అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణా పేదోల్లు మీలా బిర్యానీలు తింటూ, షాయరీలు చెప్పుకోలేదు, చెప్పుకోవటం లేదు. తాగుబోతు మాట్లాడే కె.సీ.ఆర్ కు తన వీధిలోని పేదోళ్ల సంగతి తెలుసా కనీసం? ఏమైనా ఛారిటీ నడుపుతున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి ఏ అర్హత చూసుకుని, ఏ జ్ఞానంతో ఎవరిని ఆంధ్రా అని అంటున్నాడో, అసలు తెలంగాణ తప్పితే చుట్టుపక్కల వున్న రాష్ట్ర సంస్కృతి, ప్రాభవాలు అతనికి నిజంగా స్కూల్లో మాష్టారులు నేర్పలేదో మనకర్ధం కాదు.

కాకతీయుల అద్భుత సంస్కృతి చెప్పుకుంటే ఆంధ్రుడనేవాడికెవరికయినా ఒళ్ళు పులకరిస్తుంది. మరి మన ముక్కు బాబు గారికి నవాబులు, బిర్యానిలు దాటి మానసిక వికాసం లేకపోవటం చాలా చెత్తగా వుంది. వరంగల్ లో వేయి స్థంభాల గుడిని చూసి అప్పటి టూరిజం శాఖా మంత్రి రేణుకను మా మిత్ర బృందం తిట్టుకున్న సందర్భం ఇప్పటికీ గుర్తుంది. అంతవరకెందుకు ఈయన చంకలు గుద్దులునే నవాబులు కట్టించిన అద్భుత కట్టడం గోల్కొండ అతి దీన స్థితిలో వుంది.

ఇవనీ వదిలేస్తే…

ఈయన, ఇతని పులిరాజా (ఇప్పుడు శత్రువు) ఇద్దరూ జనాలని అక్రమంగా దుబాయి తరలించే కేసులలో నిందితులుగా నిలబడ్డారు. రెండు రోజులలో పులిరాజాని అరెష్టు చేస్తారని నమ్మబలికన ముక్కుబాబు గారు ఇప్పుడు కిమ్మనకుండా వున్నారెందుకో అర్ధం కాదు. ముక్కుబాబు ముఠా కధలన్నీ విప్పుతానన్న పులిరాజా ఇంకా గడ్డి ఎందుకు మేస్తుందో అసలు అర్దం కాదు. వీరిద్దరికి నాలుగు తగిలించి నిజాలను రప్పించకుండా అసలు పోలీసు కుక్కలేం చేస్తున్నాయో ఆ బ్రహ్మ దేవుడికి కూడా అర్ధం కాదు. రషీదే వీరి పేర్లు కాక ఎవరైనా సామాన్యుల పేర్లు చెప్పివుంటే వారి తాట ఈ పాటికి లేచి పోయి వుండేది.

అమాయక చలి చీమలు క్రూర సర్పాన్ని వాటి తలల మీదగా ఎక్కించుకుని రక్షణ కల్పిస్తున్నట్లు వుంది ఇప్పటి రాజకీయ ప్రజా ప్రతినిధుల హవా.

గమనిక : ఈ టపా నా వ్యక్తిగత ఆలోచనల నుంచి పుట్టింది కాబట్టి, అందులో కొన్నిఆలోచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చక పోవచ్చు.

అది వ్యాఖ్యల ద్వారా తెలుపగలరు. అంతకు మించి నాకు ఏ కుల,రాజకీయ పక్షాల మీద ప్రత్యేక సానుభూతి గాని, అభిమానం గానీ లేదని మనవి చేసుకుంటున్నాను. :-)

Tuesday, June 12, 2007

హైతెబ్లాస మొదటి వర్షాకాల సమావేశం శుభారంభం

భారత క్రికెట్ కోచ్ పేరు గురించి కూడా ఇంత టెన్షన్ లేదేమో...కానీ హైదరాబాదు తెలుగు బ్లాగర్ల మొదటి వర్షాకాల సమావేశపు వివరాల గురించి మాత్రం తెగ వత్తిడి జరిగింది. కొందరు ఈ-మెయిల్లు, కొందరు SMSలు, మరికొందరు ఫోనులు చేసే సరికి, ఆ దెబ్బకి నాలో బధ్దకస్తుడు బుద్ధి తెచ్చుకుని ఇప్పటి వరకూ దానిని గుర్తున్నంత వరకూ రాసి బొమ్మలు చేర్చి వీవెన్ సహాయంతో ఈతెలుగు గోడ మీద పిడకలా వేసే సరికి ఈ సమయం (12:21 am) అయ్యింది.

హైతెబ్లాస/ఈతెలుగు సంఘం మొదటి వర్షాకాల సమావేశ విశేషాలు, అత్యంత గోప్యనీయంగా వుంచబడిన రెండు ఐ.యస్.ఐ రహస్యాలు తెలియాలంటే ...ఇక్కడ చదవండి.

ఈతెలుగు సైట్లో వ్యాఖ్యలు రాయలేక పోతే...వ్యాఖ్యలేవయినా వుంటే ఇక్కడ రాయండి.

Sunday, June 10, 2007

అమెరికాలో భారతీయ అనుభవం - కొసమెరుపు

మీరు ఈ మిగతా మూడు టపాలు చదివి వుంటేనే ఈ టపా చదవండి. :-)

ఈ సోది చదవని వారు ముందర ఇది చదవండి…

తరువాత ఓపికుంటే ఇది చదవండి…

అప్పటికీ నిద్ర రాకపోతే….ఈ టపా చదవండి.

పై మూడూ చదివితే (శభాష్) చచ్చినట్లు ఇది చదవాల్సిందేనని మనవి...ఇది సీరియల్ ముగింపు..ఎలా వదిలేస్తారు?
-------------
నా లగేజీ కోసం ఇక వేట మొదలయ్యింది. మొదటి రెండు రోజులు డెల్టా వాడికి ఫోన్ చేసి విసిగిపోయాను. ఇక మా పీ.యమ్ రంగంలోనికి దిగి వారిని చెడామడా తిట్టి మిలియన్ డాలర్ల నష్టపరిహారం వేస్తా అన్న తీరులో మాట్లాడితే చావు కబురు చల్లగా చెప్పారు. ముంబయిలో నా లగేజీని మోసుకున్న తరువాతి విమానం పారిస్ వచ్చేసరికి, అక్కడ ఒక దరిద్రపు సమ్మె మొదయిందంట. ఛార్లెస్ డీ గాల్ విమానాశ్రయం మొత్తం సమ్మెలోనికి దిగిందంట. అందువలన దాదాపు ఎనభయి వేల బ్యాగేజీ పీసులు సిబ్బంది లేక అలా పడివున్నాయని డెల్టా భామ చెప్పింది. మా పీయమ్ ని కొద్దిగా చల్లబరచటానికి ఏదో అమెరికన్ జోక్ పేల్చి తెగ నవ్వింది కానీ, మా బ్రిటీష్ పీయమ్ గాడు సీరియస్ గా ఫోన్ పెట్టేసి, నా వైపు, నా బట్టల వైపు చూసాడు. "అదీ సంగతి" అని జీవం లేని నవ్వు నవ్వాడు. నేను ఏడుపుని బలవంతంగా నవ్వుగా మార్చుకుంటూ అయితే ఇప్పుడేం చేద్దాం అన్నా. "పద షాపింగ్ కి....నేను కొంటా నీకు బట్టలు...కంపెనీనే డబ్బులిస్తుంది...కంగారు పడక" అని ఓదార్పు చెప్పాడు.

సాయింత్రం ఒక పెద్ద షాపింగ్ మాల్ కు తీసుకెళ్లాడు. అప్పడు నాకర్ధం అయ్యింది. ఇక్కడ చెడ్డీలు అమ్ముకున్నా కోటీశ్వరుడు కావచ్చని. భారీ ధరలు, తీరా చూస్తే మన దేశంలో దొరికే రకాలే అన్నీ కూడా...సగానికి పైగా జీన్స్ బ్రాండులకు అరవింద్ మిల్స్ నుంచే కాటన్ ముడి సరుకు. సగటు అమెరికన్ల మీద కొద్దిగా జాలి వేసింది. నేను ముందర కొద్దిగా ధరలు చూసి కంగారు పడి.."కొద్దిగా ధరలు అధికంగా వున్నాయి కదా" అన్నాను. "ఏం ఫర్వాలేదు..కంపనీ కొంటుంది కదా ..." అని భరోసా ఇచ్చాడు. దానితో ఇక నాకు చుట్టూ వున్న షాపులన్నీ మన పుట్ పాతులమీద షాపులలాగా కనిపించటం మొదలుపెట్టాయి :-)

నేను రెండు ప్యాంట్స్ , మూడు షర్టులు తీసుకున్నా,..ప్యాంట్లు గాప్ జీన్స్ అని గుర్తుంది కానీ, మిగిలినవి గుర్తులేదు. మొత్తం బిల్లు మూడొందల డాలర్ల వరకు అయ్యింది. హమ్మయ్య అనుకుని ఇక ఇంటికి బయలు దేరాం. మధ్యలో ఏవో పచారీలు కొనుక్కొని రూము చేరేసరికి....

డెల్టా వాడు ఒక వ్యాన్లో నా సామాను, ఆలస్యానికి పరిహారంగా ఒక క్షమాపణ పత్రం పట్టుకొచ్చి సిద్ధంగా వున్నాడు. నేను మా పీయమ్ వైపు చూసి చిన్నగా నవ్వా...వాడు నా వైపు చూసి నవ్వలేక నవ్వాడు. ఆ చూపుల్లో నీ సామాను వచ్చిందని ఆఫీస్ లో ఎవరికీ చెప్పకు ప్లీజ్ అన్న వేడుకోలు కనిపించింది.

మొత్తానికి కధ అలా సుఖాంతమయిందన్న మాట...

త్వరలో మళ్లీ అమెరికా వెళ్లవచ్చు, మరి ఆ మలి అనుభవాలు ఎలా వుంటాయో....(ఈ మధ్య మన భారతీయులను మొత్తం బట్టలూడదీసి చెక్ చేస్తున్నారంట...వార్నాయనో...)

Friday, June 01, 2007

పదివేల దర్శనం

2007 లో నా బ్లాగు సందర్శకుల సంఖ్య 10000 (10,670 ఈ రోజుకు) దాటిందని సభాముఖంగా తెలియచేస్తూ ఆ విధంగా ముందుకు పోతానని మీ అందరికి తెలియ జేసుకుంటున్నాను. :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name