Wednesday, July 26, 2006

నా బాల్యం - మక్సీం గోర్కి

నాకు నచ్చిన మంచి పుస్తకాలలో మక్సీం గోర్కి రచించిన "నా బాల్యం". అసలు గోర్కి తన బాల్యాన్ని అంత నిశితంగా ఎలా అవలోకించాడా ? అనిపిస్తుంది నాకు...ఎంతో అసహ్యకరమైన విప్లవ పూర్వపు రష్యను ప్రపంచం లో అతను వర్ణనాతీతమైన అందమైన తన సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.

"సూర్యుడస్తమిస్తూ అకాశాన్నంతా అగ్ని ప్రవాహంతో నింపేసేవాడు. నిప్పులు ఆరిపోయి తోటలో పరచిన ఆకుపచ్చని తివాచీ మీద బంగారంతోనూ, కెంపులతోనూ నిండిన బూడిద వెదచల్లేసేవి. దాంతో చుట్టుపక్కల నెమ్మదిగా చీకటి అలుముకుని విస్తరించి, సర్వాన్ని తనలో యిమిడ్చేసుకుని వుబ్బిపోయేది. సూర్య కిరణాలను తృష్ణ తీరా దిగమింగేసి తృప్తి చెందిన ఆకులు కొమ్మల మీద సొమ్మసిల్లి వాలిపోయేవి. గడ్డి మొక్కలు తమ ఆకులు భూమి మీద వాల్చేసేవి. ప్రతి వస్తువూ కొత్త విలువల నార్జించుకుని మరింత కోమలంగా మరింత శోభాయమానంగా రూపొంది సంగీతంలా మృదువైన సువాసనతో పరిమళించేది.దూరాన పొలాల్లో వున్న సైనిక శిబిరాల నుండి సంగీతం గాలిలో తేలుతూ చెవిన పడేది. తల్లి ప్రేమకి యెలాగైంతే మనిషి తేట పడి బలపడతాడో, అలాంటి అనుభూతినే కలిగిస్తుంది రాత్రి కూడా. తల్లి కౌగిలిలాగే ఆ నిశ్శబ్దం కూడా హృదయాన్ని మృదువైన వెచ్చని చేతులతో జోకొట్టుతూ మరచిపోవలసిన దాన్నంతా - పగటిపూట పది పేరుకుపోయిన తుప్పునీ, చౌడునీ ధూలిధూసరాన్నంతటిని తుడిచివేస్తూ మరపించేస్తుంది"

Monday, July 24, 2006

భాష ఇండియా.కాం వారి ఉత్తమ బ్లాగ్ అవార్డ్ (తెలుగు లో)...

నమ్మశక్యం కాకుండా ఉంది. నేను భాష ఇండియా.కాం వారి ఉత్తమ బ్లాగ్ అవార్డ్ (తెలుగు లో) గెలుచుకున్నాను. :-) కానీ నాకు తెలిసి మహా మహులైన తెలుగు బ్లాగర్లు వున్నారు. వారు బహుశా ఈ పోటీ లో పాల్గొనలేదేమో ? ఏమైతేనేమి కొంచెం ఆనందం గానే వుంది :-)Thursday, July 13, 2006

రక్తాశ్రువులు..ఇంకా ఎన్నాళ్ళు ?

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం..
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.

రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు..
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం

మరొక్క సారి ముంబై నగరం రక్తాశ్రువులు చిందించాల్సి వచ్చింది. రెండవ పాకిస్తాన్ గా తయారవుతున్న హైదరబాద్ నుంచే ఈ కుట్ర ప్రధాన పాత్రధారి బయటపడటం కలవరపాడల్సిన విషయం. మన పోలీసులు ఎలాగు కలవర పడరులెండి..అది వేరే విషయం. మన నగర పోలీస్ శాఖ లో సగానికి పైగా పైరవీల మీద వచ్చిన వారే అన్నది నగ్న సత్యం. మన నగరం లో ముంబై పోలీస్ తమ శాఖ ను ఏర్పాటు చేస్తె బాగుంటుంది అనిపిస్తుంది.
ప్రశాంతంగా ధర్నా (సత్యాగ్రహం అనవచ్చా?) చేసుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్ధుల మీద ప్రతాపం చూపించారు మన పోలీస్. వీళ్ళకు అసలు హృదయం అనేది వుందా అనిపిస్తుంది. ఇదే జులుం ప్రసాద్స్ ఐమాక్స్ మీద రాళ్ళు రువ్వినా వాళ్ళ మీద చెయ్యమనండి చూద్దాం. పోలీస్ కి కూడ వోట్ బ్యాంకు విలువ అవసరం లా వుంది. రంగ్ దే బసంతి గుర్తుకు వస్తోంది కదా.

Wednesday, July 12, 2006

కధా వాహిని 2006

రచన పత్రిక లో 2005 సంవత్సరం లో ప్రచురితమైన కధల లో ఎంపిక చేసిన 27 ముత్యాల లాంటి కధలు "కధా వాహిని 2006" గా ప్రచురించారు. ఈ కధల సంపుటి లో కవన శర్మ, కాళీపట్నం మాస్టారు, వసుంధర, పొత్తూరి విజయలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి, వివిన మూర్తి, ఎలక్ట్రాన్, బీన దేవి, వి.యస్ రమాదేవి వంటి హేమా హేమి రచయతల కధలున్నాయి.

ప్రతులకు :
వాహిని బుక్ ట్రస్ట్, 1-9-286/3,విద్యా నగర్,హైదరాబాద్ - 44
పేజీలు : 201, వెల : రూ. 100/- మాత్రమే.

Saturday, July 08, 2006

సుజన రంజని జూలై నెల సంచిక

సుజన రంజని జూలై నెల సంచిక విడుదల అయ్యింది.

http://www.siliconandhra.org/monthly/2006/july2006/index.html

యూనికోడ్ లో వుంటే మరింత బాగుండేది కదా :-(

Friday, July 07, 2006

చీమ మరియు పట్టు పురుగు

ఈ కధ ఏసొప్ ఫేబుల్స్ నుంచి తర్జుమా చేసాను.

అది ఒక ప్రభాత సమయం. ఒక చీమ వడి వడి గా అడుగులు వేసుకుంటూ ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. దారిలో దానికి ఒక పట్టు పురుగు కనిపించింది. అది దాదాపుగా సీతా కోక చిలుకగా మారే సమయం వచ్చింది కానీ ఇంకా పట్టు గూడు నుంచి బయట పడలేదు. చీమ దగ్గరకు రాగానే అది తన తోకను కాస్తా కదిలించింది. అది చీమను ఆకర్షించింది. చీమ ఎప్పుడూ అలాంటి జీవిని చూడలేదు మరి.
అరే, పాపం అనుకుంది చీమ. ఎంతటి దురదృష్టం నీది అంది. నేను ఎక్కడికి కావాలంటె అక్కడికి నడవగలను, చెట్లు ఎక్కగలను...చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నాను...నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నీ జీవితం అంతా ఆ గూడు లోనే వుండాలి...మహా అయితే నీ తోక ని అటూ ఇటూ కదపగలవేమొ అంది. ఇదంతా విన్న పట్టు పురుగు ఏమి మాట్లాడకుండా వూరుకుంది.

కొన్ని రోజుల తరువాత చీమ అదే దారి వైపు వచ్చింది. దానికి అక్కడ ఖాళీ గూడు తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు. చీమ ఆశ్చర్యపోయింది. అయితే ఒక్క సారిగా ఏదో పెద్ద నీడ తనని కప్పివేసినట్లు అనిపించి వెనక్కు తిరిగి చూసింది. ఒక అందమైన సీతాకోకచిలుక పెద్ద పెద్ద రెక్కలతో తన వైపే చూస్తూ కనిపించింది.సీతాకోకచిలుక మాట్లాడ సాగింది...నన్ను తెగ వెక్కిరించిన ఓ మిత్రుడా.....ఇప్పుడు నీ శక్తులన్ని ఉపయోగించి నడిచి, పరిగెత్తి , చెట్టులెక్కి నన్ను వెంబడించగలవేమో చూడు అని ఒక్క సారిగా గాలిలోకి ఎగిరి ఆ వేసవి గాలుల వెంట ఎగురుతూ చీమ దృష్టి నుంచి శాశ్వతంగా మాయమయ్యింది.

నీతి : కంటికి కనిపించేవి అన్నీ నిజం కావు.మోసపూరితంగా వుండవచ్చు.

Sunday, July 02, 2006

ఒక రెండు వారాల విశేషాల కషాయం

రోజులు మంచి గానే పోతున్నయి. ఏదో ఏడిస్ ఈజిప్టీ అనే దోమంట, ఆ.ప్ర తో ఆడుకుంటుంది. మన ప్రభుత్వ పటిమ దోమలకూ అర్ధం అయినట్లుంది. అందరికి ఆ దోమ జ్వరం తో పాటు ఫుట్‌బాల్ జ్వరం కూడా పట్టుకుంది. నాక్కూడా (ఆట జ్వరం మాత్రమే):-)
మా ఆఫీస్ టీం అంతా కలసి ప్రగతి రిసార్ట్స్ అని ఒక ప్రదేశానికి వెళ్ళాం. మాతో పాటు అక్కడ మరో 7 కంపెనీల జనం వున్నారు. వెళ్ళీ వెళ్ళగానే ఆవేశంగా ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టాం. నాకు ఆ రోజు ఆ ఆట ఆడటం జీవితంలో మొదటిసారి. మొదట్లో సరదాగానే అనిపించింది గాని, ఒక 20 నిమిషాల తరువాత అది అంత ఆషామాషిగా ఆడుకునే ఆట కాదని తెలిసింది. వుత్తి పాదాలతో ఆడటం వలన అరికాళ్ళు మంట పుట్టటం మొదలయ్యింది. కాకపోతే నేను మా జట్టు తరఫున ఏకైక గోల్ చేసాను. అప్పటి నుంచీ నన్ను ఒకడు వెంబడించి మరీ అడ్డుకోవటం మొదలుపెట్టాడు. ఈ హంగామా లో నా ఒల్లంతా హూనం. ఈ రోజుకి (7 రోజుల తరువాత) కూడా అక్కడక్కడా నొప్పిగా వుంది.
ఆట బాగా ఆడి అలసిపోయాక, స్విమ్మింగ్ పూల్ లోకి దూకాము. ఆనందం వస్తే మది అన్నింటిని పక్కన పెడుతుంది కదా.....అందువలన ఒక 2 గంటలు పూల్ లో వివిధ విన్యాసాలు, ఆటలు జరిగాయి. దాని ఫలితమే ఈ రోజుకూ నన్ను పీడిస్తున్న రొంప.
జూలై 2, నా పుట్టిన రోజు, బహుశా ఈ మధ్య కాలం లో చాలా బిజీ రోజు అయివుండవచ్చు. ఈ రోజు పోకిరి అనే సినిమా చూసా. నాకు పెద్దగా నచ్చలేదు. శ్రుతి మించిన రక్తపాతం, పస లేని అతుకుల కామెడీ ట్రాకు. అయితే మహేష్ బాబు నటనకు చాల మంచి రోజున్నాయి అని ఈ సినిమా నిరూపిస్తుంది.
ఈ మధ్య చూసిన ఒక మంచి చిత్రం 'ఫనా". చక్కని కధ, పాటలు, కధా నాయక, నాయకీమణుల నటన పోటీ పడుతూ మనల్ని ఆనందింపచేస్తాయి. నా హిట్ లిస్ట్ లో వున్న కొన్ని సినిమాలు ..
01. గోదావరి
02. సూపర్‌మేన్
03. ఎం.ఐ 3
04. ది వైల్డ్
05. పైరేట్స్ ఆఫ్ కరీబియన్ - ది డెడ్ మ్యాన్స్ టేల్.

Saturday, July 01, 2006

హాయ్ నా పేరు గణపతి...అయాం ఫ్రం పారిస్.ప్లాస్టర్ ఆఫ్ పారిస్...

వినాయక చవితి వచ్చేస్తుంది...హుస్సేన్ సాగర్ కు ముచ్చెమటలు పోస్తున్నాయి. చాలా పకడ్బందీగా, ఐ.ఏ.యస్ లు, ఐ.పి.యస్ లు, రాజకీయ నాయకులు, విద్యావంతుల సాక్షిగా....ఆ బొజ్జ గణపతి పేరు మీద నగరానికి ఒక తల మానికమైన జలాశయం కొన్ని వందల టన్నుల విషాన్ని మౌనం గా దిగమింగాలి. గత సంవత్సరం ప్రభుత్వం అట్టహాసంగా ఏదో జీ.వో జారీ చేసినట్లు గుర్తుకొచ్చింది. అది ఏమిటంటే ఈ సంవత్సరం నుంచి అన్ని విగ్రహాలు కేవలం మట్టి తోనే చెయ్యలనీ. మరి ఎవరు దీన్ని పర్వవేక్షిస్తారు? ఈ రోజు కూకట్‌పల్లి లో చూసాను, వేల విగ్రహాలు యధాతధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసేస్తున్నారు. ఒక 8 నెలల ముందు గానే ఆ కార్మికులకు కొంత అవగాహన, మట్టితో బొమ్మలు చెయ్యటానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించవచ్చు కదా. మన ఖర్మ కొద్దీ మనకు ఈలాంటి పనికిమాలిన ఐ.ఏ.యస్ లు దొరుకుతున్నారు. వాళ్ళు హైదరాబాద్ కి లంచాల కోసమే బదిలీల మీద వస్తున్నట్టుగా వుంది.
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name