Wednesday, May 30, 2007

తెలుగు వికీపీడియా శోధన

ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5, 2.0 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన ఇక్కడ దిగువున మీకు కనిపిస్తున్నట్లుగా మనకు కావలసిన శోధనా పరికరాలను మీ బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని మన తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను. మీరు చెయ్యవలసినదల్లా మీ బ్రౌజరు బట్టి ఒక శోధనా పరికరాన్ని ఎంచుకుని "క్లిక్కు" చెయ్యటమే :-)

image    image

 

image

Click Here :  తెలుగు వికీపీడియా శోధన

శివాజీ వచ్చేస్తున్నాడు

అందరు తెలుగు నిర్మాతలను గజ గజ లాడిస్తున్న శివాజీ ట్రయలర్ ను సీ.యన్.యన్. ఐ.బి.యన్ తమ సైట్ లో పెట్టింది. అంచనాలు భారీగా వున్నాయి. చంద్రముఖి స్థాయిలో వుంటుందో లేదో మరి చూడాలి...

టక టకా..టక్నోరటి శోధన

ప్రముఖ బ్లాగు శోధనా యంత్రం అయిన టెక్నోరటి ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంది. అంతే కాక తన శోధనా యంత్రానికి పదును పెట్టింది కూడా…

మీరు http://s.technorati.com కు వెళ్లి చూస్తే, చాలా సీదా సాదాగా వున్న ఒక పుట ఇలా కనిపిస్తుంది.

technorati_1

technorati_2

శోధనా ఫలితాలు చూసారా? నిన్ననే రాసిన టపా కూడా ఫలితాలలో ప్రత్యక్షమయింది. కుడి వైపు వున్న ఫిల్టర్ (authority) ద్వారా మనం మనం వెతుకుతున్న పదం అతి ఎక్కువగా వాడినవి దొరకపుచ్చుకోవచ్చు.

తెలుగు సమాచార బ్లాగులు ఎక్కువవుతున్న ఈ రోజులలో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి

Tuesday, May 29, 2007

రండి రండి రండీ...దయ చేయండీ..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !

సాఫ్టు‍వేరు ఉద్యోగులను ఆకర్షించటానికి బహుళ జాతి కంపనీలు ఏమైనా చెయ్యగలవు. వారి ఉద్యోగపు మొదటి రోజుని చిరస్మరణీయంగా మార్చివేయనూ గలవు. బంగళూరు లోని ఒక పెద్ద కంపనీ వారి కొత్త ఉద్యోగులను ఎలా స్వాగతిస్తుందో చూడండి. బహుశా మీ కంపనీ అడ్మిన్ చూస్తే మంచిదేమో :-)

గమనిక : ఈ వీడియో "నువ్వొక గొట్టం" (యూట్యూబు) మీద వున్నది. ఈ వీడియోకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు.




ఈ వీడియో సౌజన్యం : కిరుబా శంకర్

అమెరికాలో భారతీయ అనుభవం - 3

ఇది నేను చాలా రోజులుగా రాయాలని అనుకుని నాలోని ప్రొక్రాష్టినేటరును జయించలేక వదిలేసిన టపా. గత కొద్ది రోజులుగా ఇది పూర్తి చెయ్యాలనుకున్నాను కానీ, ఈ రోజు సీ.బి. రావు గారి వ్యాఖ్య చూసి, హమ్మో ఈ టపాను గమనిస్తున్నవారు కనీసం ఒక్కరున్నారని కంగారేసి ఇప్పుడు రాస్తున్నాను.

ఈ సోది చదవని వారు ముందర ఇది చదవండి…

తరువాత ఓపికుంటే ఇది చదవండి…

అప్పటికీ నిద్ర రాకపోతే….ఈ టపా చదవండి.

న్యూయార్కు నుంచి సిన్ సినాటి వెళ్లే విమానం ఎలానో వెతుక్కుని తాపీగా కూర్చున్నానే గానీ "బాగా ఆలస్యం అయిందే" అని మనసులో కొద్దిగా పీకుతూనే వుంది ఎందుకంటే నన్ను రిసీవ్ చేసుకోవటానికి రావాల్సిన వ్యక్తి అసలు వేచి ఉంటాడో లేదో తెలియదు. మొత్తానికి ఆ దేశవాళీ విమానం మెల్లగా డల్లాస్-ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగేటప్పటికి రాత్రి పన్నెండు గంటలయ్యింది. డెల్టా వాళ్లకు నా బాగేజీ మిస్ అయిన సంగతి రిపోర్టు చేసి అటు ఇటు చూసాను. విమానాశ్రయం మొత్తం మీద ఒక పది మంది వుంటారేమో. అంత ఖాళీగా వుంది. దగ్గరలో వున్న ఫోన్ నుంచి మా పీ.యమ్ కు ఫోన్ చేద్దామంటే అన్ని ఫోన్లూ క్రెడిట్ కార్డుతో పని చేసేవే. కాసేపు తిట్టుకుని ఎవరైనా నా గురించి లాంజ్ లో వున్నారేమో అని వెతికా…ఒక్కడూ లేడూ. ఎందుకుంటారు? ఏడు గంటలకు రావాల్సిన విమానం పన్నెండుకు వస్తే.

ఇక బయటకు వెళ్లే దారి చూసుకుంటూ నడక ప్రారంభించాను. ఒక దగ్గర క్రిందకు పోతున్న ఎస్కలేటర్ కనిపించింది. సరే చూద్దాం అని క్రిందకు దిగితే అక్కడ ఒక గది, దానికి బయటకు పోయే తలుపు వున్నాయి. ఆ తలుపు తీసుకుని చూస్తే అది పార్కింగుకు పోయే భూగర్బ టన్నెల్ అని అనిపించింది. నర సంచారమే లేదు. అందులో రుయ్యి మని చప్పుడు చేస్తూ చలి గాలి. డల్లాస్ లో పగలు అదిరిపోయే ఎండ, రాత్రి ఇలా చలిగా వుంటుందని తరువాత రోజులలో నాకర్ధం అయింది. సరే ఇక వెనక్కు వద్దామని చూస్తే పైకి వెళ్లే ఎస్కలేటర్ లేదు. అది వన్ వే అన్న మాట. చచ్చి చెడి ఎస్కలేటర్ కు అడ్డం పడి పైకెక్కాను. కాసేపు నడిచాకా బయట అద్దాలు, వాటి వెనుక కొంత మంది మనుషులు కనబడి, అక్కడ ఒక ఎస్కలేటర్ పట్టుకుని క్రిందకు దిగాను.

దూరాన చిన్న టేబుల్ ఒకటి వేసుకుని ఒకమ్మాయి కూర్చుని కనిపించింది. ఆమె చుట్టు ఒక నలుగురు బ్లాక్స్ మాట్లాడుతూ కనిపించారు. మెల్లగా వెళ్లి నా విషయం చెప్పాను. అడ్రెస్ వుందా? అనడిగింది ఆమె. ఉందని చెప్పాక, నేను ఇండియా నుంచి వచ్చానని అర్ధం చేసుకుని "మొహమ్మద్" అని అరిచింది. ఒక గోల్డెన్ కాబ్ వచ్చి ఆగింది. అతను మీ దేశమే, నిన్ను దిగపెడతాడు అని చెప్పి ఆ టాక్సీ ఎక్కించింది.

ఇక టాక్సీలో సంభాషణ భలే నడిచింది. పరిచయాలు అయ్యాక ఆ డ్రయివర్ ఒక పాకిస్తానీ అని తెలిసింది. మనకు చిన్నప్పటి నుంచి పాలతో పాటూ పాకిస్తాన్ అంటే ద్వేషం నేర్పించేస్తారు కాబట్టి, నాకు కొద్దిగా భయం వేసింది. అయితే అతడు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఆ భయం పోగొట్టాడు. మధ్యలో కాఫీ తాగిస్తానని బలవంతం చేసినా, డల్లాస్ అంత మంచి పేరున్న వూరు కాదు కాబట్టి సున్నితంగా తిరస్కరించాను. ఈలోగా రాజకీయాలు మాట్లాడటం మొదలు పెట్టి ఇండియా, పాక్ రాజకీయనాయకులను చెడా మడా తిట్టాడు. కొద్ది సేపటి తరువాత నా అడ్రస్ తీసుకుని ఒక మాప్ తీసి దానిని గుర్తించాడు. అయితే నా ఆఫీస్ వాళ్లు నాకు పొరపాటున తప్పు అడ్రస్ ఇచ్చారు. Colby Street, 2026 అని ఇవ్వబోయి Colby Street 24 అని ఇచ్చారు. కాసేపు రకరకాల ఫోన్లు చేసి మొత్తానికి ఆ వీధిని పట్టేసాడు. ఇక చూడాలి మా పాట్లు. అక్కడ అన్నీ బంగళాలే. మా దగ్గరున్న నెంబరు ఎక్కడా లేదు. ఇలా కాదని అతని ఫోన్ నుంచి నా పీ.యమ్ కు ఒక కాల్ చేసాం. మా పీ.యమ్ పేరు సైమన్ జాన్సన్. అతడు బ్ర్టిటీష్ జాతీయుడు. జనరల్ డయ్యర్ కు స్వయాన ముని ముని ముని మనవడు. అచ్చమైన బ్రిటీష్ యాసలో మాట్లాడే వాడు. ఇక కాల్ ఎత్తిన తరువాత నేను మాట్లాడి డ్రయవర్ కు దారి చెప్పమని మొబైల్ డ్రయవర్ కు ఇచ్చాను. అతను మాట్లాడే ఇంగ్లీష్ నా డ్రయవర్ కు ఒక్క ముక్క అర్ధం కాలేదు. యస్, యస్, యస్..ఓఖే అని పెట్టేసి ఇక తిట్లు మొదలు పెట్టాడు బ్రిటీష్ వాళ్లని. రెండు మూడు రౌండ్లు తిరిగి మొత్తానికి బంగళాని పట్టుకున్నాం. అప్పుడు జరిగింది నేను మరచిపోలేని సంఘటన…మా కోసం చూస్తున్న మా పీ.యమ్ నైట్ గౌన్ వేసుకుని బయట ఎదురు చూస్తున్నాడు. కారు ఆగగానే దగ్గరకి వచ్చి…తలుపు తెరచి నేను దిగటానికి సాయం చేసాడు..

పాకిస్తానీ డ్రయవర్, భారత పాసింజర్….డయ్యర్ వంశంలోని ఒక బ్రిటిష్ వ్యక్తి తలుపు తీసి పట్టుకోవటం ..అంతా మాయలా అనిపించింది.

సాఫ్టువేరు మాతా ! నీకు  వందనాలు అనుకున్నాను :-)

స్వతహాగా ఎంతో మంచివాడైన సైమన్ తరువాత చాలా ఫీలయ్యి విమానాశ్రయంలో ఎవరూ లేనందుకు క్షమాపణ చెప్పాడు.

అదండీ నా మొదటి అమెరికా అనుభవం.

హలో…నిద్రపోయారా?

Monday, May 28, 2007

గుర్తుకొస్తున్నాయీ...గుర్తుకొస్తున్నాయి...

నా జీవితంలో అతి మధురంగా, అలా అలా గడచిపోయిన రోజులు నా చిన్న నాటి రోజులు, పీ.జీ చదువుతున్న రోజులు. అవన్నీ ఒక్క సారి గుర్తుకొస్తే ఛ ! ఏం హైదరాబాదు బ్రతుకురా బాబు అనిపిస్తుంది. ఇక్కడ నా స్నేహితులు కొంత మంది ఒక్క సారి కూడా పొలం గానీ, పల్లెటూరు గానీ చూడలేదంటే నమ్ముతారా? వారి బాల్యం నుంచి పట్టణపు వాసమే. వారికి నా బాల్యం ఒక సినిమాలా చెప్పే ఛాన్సు దక్కినందుకు కొద్దిగా అప్పుడప్పుడూ సరదాగా వుంటుంది. ప్రతీ విద్యార్ధి అసలు ఒక్క సంవత్సరమైనా పల్లెలో గడపాలనే స్కూల్ల్లు వస్తే ఎంత బాగుంటుందో? పల్లె చెప్పే పాఠాలు, కబుర్లు పట్టణం చచ్చినా చెప్పలేదేమో కదా?

మా నాన్నగారు ఉద్యోగరీత్యా ప్రతీ మూడేళ్లకు బదిలీల మీద ఊర్లు మారుతుండేవారు. ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి పోయి చదవటమే మన పని. అది ఎంత చిన్న పల్లె అయినా సరే. అలా మొట్టమొదటి సారిగా మారిన వూరు "వజ్రపుకొత్తూరు". అది ఒక ఉద్దానం పల్లె. ఉద్దానం అంటే ఉత్తర కోస్తాలో తీర ప్రాంతం అన్న మాట. ఆ వూరు ఒక మోస్తరు పల్లె. మండల కార్యాలయం, హైస్కూలు ఉన్న పల్లె అన్న మాట. ఊరికి ఒక వైపంతా సముద్రం. కాలుష్యం అంటే తెలియని తీరప్రాంతం వుంటుంది. ఊరి నుంచి ఒక రెండు కిలో మీటర్ల దూరంలో సముద్రం వుండటం వలన రాత్రంతా సముద్ర ఘోష మంద్ర స్థాయిలో వినిపిస్తూనే వుంటుంది. సముద్ర తీరానికి వెళ్లాలంటే మనం రకరకాల తోటలు (కొబ్బరి, జీడి, సర్వీ) మధ్యలో నుంచి తూర్పు వైపు గుడ్డిగా నడిచెయ్యటమేనన్న మాట. ప్రతీ తోటకూ, తోటకూ మధ్యలో ఒక సన్నని ఎడ్ల బండి దారి వుండి, దారి మొత్తం రెండువైపులా మొగలి పొదలతో కప్పబడి వుంటుంది. అందువలన అక్కడొక దారి వుందని మనకి బాగా తెలిస్తే తప్ప కనపడదు. ఆ దారి కూడా మొత్తం మోకాలి లోతు సముద్రపు ఇసుకతో ఉంటుంది. ఎడ్ల బళ్లు జాగ్రత్తగా ముందరి బళ్లు ఏర్పరిచిన రెండు లోతైన గీతల మీదగానే పోతాయి. లేక పోతే ఎద్దులు లాగలేవు ఆ ఇసుకలో.

చిన్న వూరవటం వల్లన చాలా మందికి అక్కడ ఒకరికొకరు పేర్లతో సహా పరిచయం. అందులోనూ ఆ ప్రాంత ప్రజల ప్రేమ వర్ణనాతీతం. పెద్దగా బాదరాబందీలు లేని జీవితం, కాలుష్యం లేని తోటలు, ప్రవాసం (అండమాను దీవులు) వెళ్లిన కుటుంబ సభ్యులు. ఇవే వారి జీవితం. అంతర్లీనంగా నక్సలిజం కూడా వుంటుంది. మనకు కనిపించదు, కనపడనివ్వరు కూడా(అచ్చం సిందూరం సినిమాలానే). మనం ఏ తోటలో నుంచి వెళ్లినా ఆదరంగా పలకరిస్తారు. వీలైతే ఒక రెండు కొబ్బరి బోండాలు తాగమని బలవంతం చేస్తారు. అక్కడ జీడి పళ్లు ఎవరూ పెద్దగా తినరు. ఒక పెద్ద గోతిలో కుప్పలుగా ఎర్రని, తియ్యని జీడిపళ్లను పోస్తారు. అవి పశువులు తింటాయన్నమాట. మాకు జీడి పళ్లు కొనుక్కు తినటం అలవాటు కాబట్టి, అక్కడ అలా గోతిలో పారేస్తుంటే మనస్సు చివుక్కుమనేది. మనం ఆ పళ్లు తినే జీవులని తెలిసి మాకు దోరగా, ఎర్రగా వుండే జీడి పళ్లు ఇచ్చేవారనుకోండి. అక్కడ మనం ఎన్ని పళ్లయినా కోసుకు తినవచ్చు. జీడిపిక్కలు మాత్రం చెట్ల దగ్గరే పడెయ్యాలి. అది మాత్రం ఒక రూలు. దారికి రెండు వైపులా వుండే మొగిలి పొదలు చాలా గుబులు పుట్టిస్తాయి. ఎందుకంటే అవి పాములకు మంచి ఆవాసం. కాకపోతే మొగలి పువ్వుల సువాసన మాత్రం అద్భుతంగా వుంటుంది. ఆ పువ్వుల రేకులను అల్లి మరలా పువ్వులా చేసుకొని ధరిస్తారు. మొగలి పొదల మధ్యలో అక్కడక్కడా సీతాఫలం చెట్లు తప్పనిసరిగా వుంటాయి. నేను నా స్నేహితులతో సీతా ఫలం పళ్ల వేటకు తరచుగా వెళ్లేవాడిని. ఒక పది, పదిహేను పెద్ద పళ్లు దొరికాక, దగ్గరలో ఒక మొగలిపొద దగ్గరలో మాలో ధైర్యం కాస్త వున్నోడు ఒక గొయ్య తవ్వి అందుకో ఆ పళ్లను పోసి, ఇసుక పోసి కప్పి, పైన ఏదో కొండ గుర్తు పెట్టేవాడు. మరుచటి రోజు వచ్చేసరికి ఘుమఘుమ లాడే సీతాఫలం పళ్లు తయారుగా వుండేవి. స్కూలు ఇంటర్వల్ (సాయింత్రం) ఇవ్వగానే మేము ఈ ఫలాల స్నాక్స్ తినటానికి దగ్గరలో వున్న తోటల్లోనికి పరారయ్యేవాళ్లం.

ఒక రోజు ఇలాంటి ప్రయత్నంలో నేను ఒక పది నిమిషాలు వెనకబడ్డాను. కాకపోతే గొయ్య తవ్విన స్థలం తెలుసుకాబట్టి నడుస్తూ, పరిగెడుతూ ఆ తోట దారి (గోర్జి అంటారు) వెంబడి వెళుతున్నాను. ఒక దగ్గర దారి రెండుగా చీలివుంది. అంటే నా ఎదురుగా గంభీరంగా వున్న మొగలిపొదల గోడ వుంది. నేను మధ్యలో ఆగి ఎటువైపా అని చూస్తున్నాను. సాధారణంగానే మొగలి పొదలు కప్పేసిన దారికో పగలు కూడా సాయింత్రం లానే వుంటుంది. ఇక సాయింత్రాలు చెప్పాలా? నాకు కొద్దిగా జంకు మొదలయ్యింది. చుట్టుపక్కల ఎవరూ లేరు, చీమ చిటుక్కుమన్న శబ్ధమూ లేదు. వెనక్కు తిరుగుదామా అని ఆలోచిస్తున్న సమయంలో ఏదో శబ్ధం వినిపించింది. నాకు గుండె గొంతులోకి వచ్చింది. అటూ, ఇటూ పరికించా…ఎవరూ లేరు. నా ముందర ఏదో కదలిక అతి దగ్గరలో అయినట్లనిపించి అటు తిరిగా…ఎవరూ లేరు. నాకు చెమటలు పట్టేసాయి. అప్పటికి నా దెయ్యాల కధలు చాలా మంది చెప్పేవారు. నేనూ నమ్మేవాడిని కూడా. అందువలన నా మెదడు అటువైపు ఆలోచన మొదలుపెట్టడంతో నాలుక పిడచకట్టుకుపోయింది. అయితే అప్పుడు కనిపించింది నాకు, ఆ అలజడికి కారణం అయిన భూతం. అంతే ! నా మెదడు మొద్దుబారిపోయింది. సరిగ్గా నా ఎదురుగా, నాకు ఒక రెండు మీటర్ల దూరంలో మొగలి పొదల మధ్య పడగ విశాలంగా విప్పి చూస్తుంది ఒక త్రాచు పాము. ఒక్క సారిగా జరజరమని ప్రాకింది. అప్పుడు చూశాను దాని పొడవు. అంతే వెనక్కు తిరిగి పరుగు లంకించుకున్నాను. శనిగాడు ముందరికాళ్లతో తంతే గాడిద వెనక్కాల్ల దగ్గర పడ్డానన్నట్లు, పారిపోతున్నప్పుడే ఒక చెప్పు(హవాయి చెప్పులు) ఇసుకలో కూరుకుపోయింది. వెనక్కు గబుక్కున తిరిగాను కానీ, పాము వున్న వైపు చూసే ధైర్యం లేదు, అలా అని చెప్పును సరిగా పట్టుకోలేపోతున్నాను. మొత్తానికి రెండు చెప్పులూ మర్యాదగా చేత్తో పట్టుకుని డెకథ్లాన్ క్రీడాకారుడిగా ఇంటికి చేరిపోయి పక్క ఎక్కేసాను. ఆ రోజు తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది.

మరిన్ని మధుర జ్జాపకాలు తరువాత….

Thursday, May 24, 2007

నేను ఈ మధ్య చూడాలని ఎదురు చూస్తున్న/అనుకుంటున్న చిత్రాలు

pirates

 

౦౧. పైరేట్స్ ఆప్ కారిబ్బియన్ - ఎట్ వరల్డ్స్ ఎండ్ -- ఇది వరస చిత్రాలలో మూడవది. రెండవ భాగంలో కెప్టన్ జాక్ స్పారో (జానీ డెప్) క్రాకన్ చేత మింగబడటంతో అతనిని రక్షించటానికి కెప్టన్ బార్బోసా (మొదటి భాగంలో విలన్) నాయకత్వంలో ఎలిజబెత్ స్వాన్ (కీరా నైట్లీ), విల టర్నర్ (ఓర్లాండో బ్లూమ్) బయలు దేరటంతో ఈ కధ మొదలవుతుంది. ఇది కూడా రికార్డులు సృష్టిస్తుందని అంచనాలు వున్నాయి. ప్రపంచమంతా ఆంగ్ల దేశాలలో మే 25 న, మిగతా దేశాలలో మే 24 న విడుదల కానున్నది ఈ చిత్ర రాజం.

ఈ చిత్రంలో ఒకొక్క పాత్రలో నటులు ఎలా ఒదిగిపోయారంటే, మనకు వారి మిగతా చిత్రాలు చూస్తున్నా ఈ పాత్రలే గుర్తుకొస్తాయి.

౦౨. ష్రెక్ - 3

సరదాగా సాగి పోయే మంచి సినిమా ఇది. ప్రేమ, ఆత్మ గౌరవం ఎంత విలువైనవో తెలుపుతుంది.

shrek3

౦౩. హ్యారీ పాటర్ - ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్ -- ఇప్పటి వరకూ మొదటి మూడూ చాలా సార్లు చూసేసాను. తరువాతి చిత్రం కూడా అదే స్థాయిలో వుంటుందని ఆశ. ఇది జూలై పదమూడున రాబోతున్నది. ఇందులో నాకిష్టమైన పాత్ర హెర్మొయన్ గ్రేంజర్ (ఎమ్మా వాట్సన్) అనే చాలా తెలివితేటలు, అందం, మంచితనం వున్న అమ్మాయి. అసలు అన్ని చిత్రాలలో ఆమే హీరోనా అనిపిస్తుంది.

harry and friends

మీరూ వీలయితే వీటి ముందరి భాగాలు చూసి వీటి కోసం తయారుకండి.

Tuesday, May 22, 2007

బోడి నిర్దారణ కమిటీలు.. వాటి కార్యక్రమాలు

ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూడండి. కొంత మంది పని లేని వాళ్లు ప్రతీ విషయాన్ని పచ్చి వ్యతిరేకవాదంలో చూస్తు, బాధ్యతా రాహిత్యమైన వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారో చదవండి.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/may/21new40

వారు పెట్టుకున్న కమిటీ పేరు "నిజ నిర్దారణ కమిటీ". అలాంటప్పుడు వారు తమ శక్తి యుక్తులను నిజాన్ని కనుక్కోవటంలో పెడితే మంచిది. అంతే గానీ ఇలా వ్యర్ధ ప్రసంగాలకు దిగి వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టనక్కరలేదు. ఇలాంటి మాటలు చాలా చెత్తగా సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. టీ కొట్టులో హాయిగా చాయ్ తాగుతున్న ఇద్దరు ముస్లిం - హిందు మిత్రులు ఇది చదివి వాదించుకుని విడిపోయినా పోవచ్చు.

ఏ ముస్లిం అయినా మసీదులో బాంబు పెట్టుకోడు అని ఎలా నిర్ణయించేసారు ?. దానికేమైనా నిర్ద్గారణ వున్నదా? ఆ మాట కొస్తే ఏ నిజమైన ముస్లిం కూడా టెర్రరిజాన్ని పవిత్రయుద్ధంగా సమర్దించడు. తీవ్ర వాద ఇస్లామిక్ పార్టీలు చేస్తున్న మారణకాండను సమర్ధించడు. కానీ రక్తపాతాన్ని, దేశ స్థిరత్వాన్ని దెబ్బ తీయాలంటే తీవ్ర వాదులు ఎక్కడైనా పెడతారు బాంబులు. 9/11 దాడిలో చాలా మంది ముస్లింలు టవర్స్ లో ప్రాణాలు వదిలారు. అది ఏమైనా లాడెన్ కు తోచిందా?

ఇక ఇది చదవండి http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/may/21main8

ఛాందసవాదం ఎక్కువైతే మతాలతో సంభంధం లేదు. ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారు. ఎలాంటి పనులైనా చేస్తారు.

ఇక హిందూ మతోన్మాదులు సంగతి. ఈ మధ్య వీరు కొద్దిగా ఎక్కువగానే తయారయ్యారు. కానీ ఒక తీవ్రవాద గుంపు స్థాయిలో ఎక్కడా తయారయ్యారా అనేది తేల్చాల్సివుంది. ఒక వేళ వీరే ఆ పని చేస్తే దొరికిన సిమ్ కార్డు నుంచి దుబాయి, మలేషియా ఎందుకు కాల్స్ వెళ్లాయో తేల్చాలి.

ఇదంతా వదిలేస్తే అనుమానిస్తున్న "షాహెద్ బిలాల్" ఏమీ ఐస్ ఫ్రూట్ తినే అమాయకుడు కాదు. చాలా మంచి పోలిస్ రికార్డులున్నాయి.

నిజ నిర్ధారణ కమిటీలు, తొక్కలో దివిటీలు అన్నీ నిజం మీద దృష్టి పెడితే మంచిది. లేకపోతే ప్రభుత్వాలకు మళ్లే వీరు కూడా అమాయక జనాలను తప్పు దోవ పట్టిస్తునే వుంటారు వారి మార్గంలో. అది సమాజానికి ప్రమాదకరం.

మొన్న సద్దాం ను ఎక్కాడికో ఎత్తేసారు. అఫ్జల్ కు వురి పడలేదు…ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు షాహెద్ బిలాల్. రేపు అమెరికా లాడెన్ పట్టుకుని చంపేస్తే ? అప్పుడూ లాడెన్ మీద కవితలు రాసేసి..అమెరికన్లే ట్విన్ టవర్స్ కూల్చేసి లాడెన్ మీద పడ్డారంటారేమో?

మొత్తానికి ఐటమ్ లాంటి జనాలు వున్నారు మనకు.

Saturday, May 19, 2007

జీ-తెలుగు లో స రి గ మ ప

మీరు జీ-తెలుగు లో స రి గ మ ప లిటిల్ స్టార్స్ చూస్తున్నారా? చూడకపోతే మీరు చాలా మిస్ అవుతున్నారు. అద్భుతమైన గళాలతో న్యాయ నిర్ణేతలనే పరవశింపచేస్తున్నారు ఆ చిన్నారులు. పాత మధురాలను మరలా సుశీల, లీల, జిక్కి కూడా ఇలానే పాడేరేమో అన్నంత మధురంగా పాడుతున్నారు.

జీ-తెలుగుకు ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం అందిస్తున్నారు.

పది పైసల పిట్టకు పదిరూపాయల మసాలా

ఇక్కడ పది పైసల పిట్ట ఏది? :- మున్నా అనే ఒక హింసాత్మక సినిమా (సినిమాలోపల, ప్రేక్షకుడి బుర్రలోనూ)

పది రూపాయల మసాల వండే ఏకైక TV చానల్ ఏదో ఒక చెప్పనవసరంలేదు.


అసలే తెలుగు సినిమా దౌర్భాగ్యంలో వుంటే ఇలా తెలుగు టీవీ ప్రసార వాహికలు నిర్మాణాత్మక విమర్శ చెయ్యటం అటుంచి, ఒక్కో సినిమాను పట్టుకుని దాని నిర్మాత నుంచి, లైట్ బాయ్ వరకు ఇంటర్వూలు చేసి వారి చేత "ఇదే నా జీవితంలో చేసిన అత్యద్భుత కత్తి కమాల్ ఇరగ సినిమా" అని చెప్పించటం. ఆ సినిమాని పేర్లు పడటం నుంచి విశ్లేషించి (ఏదో మేకింగ్ ఆఫ్ టైటానిక్ విత్ జేమ్స్ కామెరూన్ లా) ఊదరగొట్టెయ్యటం మరీ పెరిగింది.

అయినా ఈ మధ్య ఆ తొమ్మిది చానల్ కు ఏమీ ప్రసారం చెయ్యటానికి లేక గోల్లు గిల్లుకుంటుందని ఏపీ మీడియా కధనం.

Thursday, May 17, 2007

రామా? సేతువు కట్టావా? లేదా?

సేతుసముద్రం పై చర్చలు, నిరసనలు ఇప్పుడు వూపందుకున్నాయి. సేతు సముద్రం గురించి తరువాత చెప్తా గానీ, ఈ వివాదానికి కారణమైన రామ సేతు (ఆడమ్స్ బ్రిడ్జి) ని గూర్చి మాట్లాడుదాం.

రామ సేతు గురించి తెలియని వాడు భారతదేశంలో ఎవరూ వుండక పోవచ్చు, మతాలతో సంబంధం లేకుండా. మన పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు, వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు. సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు కొంతమంది. ఏది ఏమైతేనేం రామాయణ కాలంలో (మూడు లక్షల సంవత్సరాల క్రితం) ఇది కట్టబడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పాక్ జలసంధి అని పిలుస్తున్నారు.

ప్రస్తుతం మనకు ఇది ఉపగ్రహ చిత్రాల ద్వారా కనిపిస్తుంది. క్రింద చూపబడిన విధంగా…

raamasethu

నమ్మడానికి ఎంత బాగుందో అని పాడుకోవాలనిపిస్తుంది కదా? :-) కానీ నాసా, మన పురావస్తు శాఖ వారితో చేసిన పరిశోధనల ప్రకారం ఈ సేతువు మానవమాత్రులెవరూ నిర్మించినది కాదని, అది కేవలం ఇసుక రాళ్ల సమూహం అని అర్ధం అయ్యింది. అది కూడా కేవలం మూడు వేల ఏళ్ల క్రితం మాత్రమే ఏర్పడినది అని కార్బన్ డేటింగు ద్వారా తేల్చారు.

నాసా అయితే ఏకంగా రామాయణ కాలంలో (మూడు లక్షల ఏభై వేల ఏళ్ల క్రితం) ఈ భూభాగం మీద మానవులు నివసించే ఆధారమేదీ లేదని కొట్టి పారేసారు. హిందు పత్రిక కూడా దీనికి ఆధారాలను ప్రచురించింది.  అయితే కొంత మంది శాస్త్రవేత్తలు సైతం రామ సేతు ప్రకృతి పరంగా ఏర్పడినది కాదని, దానిని ఎవరో నిర్మించి వుంటారని వాదిస్తున్నారు

ఈ బ్రిడ్జి దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం పాటు వ్యాపించి వుంది. కొన్ని చోట్ల అది సముద్ర తలానికి కేవలం మూడు నుంచి ముప్ఫై మీటర్ల లోతులో మాత్రమే వుంది. దీనివలన ఈ మార్గం గుండా భారీ నౌకలు ప్రయాణించలేవు. ప్రయాణించినా అతి ప్రమాదకరం కూడా. పదిహేనవ శతాబ్ధి వరకూ ఈ సేతువు పై నుంచి కాలి నడకన వెళ్లే విధంగా వుండేదంట. ఆ తరువాత వచ్చిన తుఫానులు, వాతావరణ మార్పులు ఈ మార్గాన్ని కాస్త లోతుగా మార్చివేసాయి.

అయితే ఇప్పుడు ఈ పాక్ జలసంధిని లోతు చెయ్యటం ద్వారా భారీ నౌకలను ఈ ప్ర్రాంతం ద్వారా నడిపించవచ్చని భారత ప్రభుత్వం ఆశ. తద్వారా అరేబియన్ సముద్రం నుంచి హిందు మహ సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లే బాధ తప్పుతుంది. భారత ప్రభుత్వానికి కూడా చేతినిండా డబ్బులు వస్తాయి. ఈ ప్రాజెక్టు పేరే సేతు సముద్రం ప్రాజెక్టు. దీని వలన దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అంచనా. అంటే దాదాపు ముప్ఫై గంటల ప్రయాణం తగ్గుతుంది.

అయితే ఈ ప్రాజెక్టు వలన ఆ ప్రాంతంలో వున్న పగడపు దీవులు (coral reefs) అన్ని పోతాయి. రామ సేతు పోతుంది. సునామీ వంటివి వస్తే దానిని కొంతవరకు ఆపేది ఈ రామ సేతు నే. ఇప్పుడు అది పోతే ధనుష్కోటిని బట్టలు విప్పి సముద్రపు వొడ్డున నిలబెట్టినట్లు అవుతుంది.

శాస్త్ర పరంగా దీని నిర్మాణాన్ని ఎదుర్కోవటం చాలా మంచిది. మంచి కన్నా చెడు జరిగే సూచనలు ఎక్కువున్నాయి. కానీ భా.జ.పా వంటి పార్టీలు రాముడికి ద్రోహం చేస్తున్నట్లు దీనిని ప్రచారం చేస్తూ ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం వుంది. సెక్యులర్ భావాలను కాలరాసే పార్టీగా దానికి వున్న మచ్చనే ఆయుధంగా చేసుకుని వారు వాదన త్రోసిపుచ్చవచ్చు.

చంద్రబాబు ...చెణుకులు

ఈ రోజు టీవిలో మాట్లాడుతూ చంద్రబాబు భలే జోకాడు.

"ఎముకలు, పుర్రె, శవాలు వున్న బీడీలు ఎవరూ తాగరు...జ్ఞానం, ఇంగితం వున్నోడు ఎవ్వడూ అవి జేబులో పెట్టుకు తిరగడు".

ఆహా, అంటే అవి లేకుంటే, జేబులో పెట్టుకు తిరిగేవాడికి ఇంగితం వున్నట్లా? :-)

Friday, May 11, 2007

స్పయిడర్ మాన్ - మూడు, మన మూడు

ఒక స్నేహితుడు ఎక్కడో టోరెంట్లో సంపాదించిన స్పైడర్ మాన్ - 3 DivX మూవీ రాత్రి చూసాను....చూస్తూ మధ్యలో నిద్ర పోయాను. ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు చూసిన సినిమా ఏమీ గుర్తుకు రావటం లేదు...అదీ సంగతి. మన మూడు బాగుండాలంటే ఈ 3 చూడకపోవటమే మంచిది. 180 Rs టికెట్ + 100 Rs జంక్ తిండి మిగులుతాయి.

Wednesday, May 09, 2007

నేను ఒక కవిని....ఎందుకూ?

ఎప్పుడూ కిరణ్ చావా తో మాట్లాడినా నేను అడిగే ప్రశ్న ఒకటుంటుంది. అది అసలు ఈ కవిత్వం ఎలా చదువుతారండీ బాబు అని. అందులోనూ ఈ మధ్య తెలుగు బ్లాగులలో కవిత్వపు జోరు విజృంభిస్తున్నది కూడా..మరే భాషా బ్లాగులలో ఇంత కవిత్వపువేడి లేదేమో. ఏమైతేనేం మన తెలుగు వాళ్లు మంచి భావుకలని నిరూపిస్తున్నారు. అయితే నాక్కూడా ఈ రోజు కవిత్వం రాసేద్దామని "దుర్భుద్ది" పుట్టింది. :-) కాకపోతే అందరూ రాసినట్లు మంచి మంచి కవితలెందుకు రాయాలి…సరదాగా ఒక చెత్త కవిత రాద్దామనిపించింది. ప్రతీ ఒకడు ఈ కవిత చదవాలి (మీ లాగా). చదివి తిట్టుకోవాలి అని నా ఆశ…సి.నా.రే గళంలో చదువుకోండి.

 

నేను ఒక కవిని

ఎందుకో తెలుసా?

నేను కవిత్వం రాస్తా కాబట్టీ….

 

నేను కవిని కాక ముందు ఒక జీవిని

ఎందుకో తెలుసా? మీకు తెలుసా?

జీవం వున్నవాడిని కాబట్టీ….

 

ఈ కవిత నేను రాసాను

ఎందుకు రాసాను?

ఏ పనీ లేదు కనకా…

 

ఈ కవిత ఇప్పుడు చదవబడుతుంది

ఎందుకు చదవబడుతుందీ?

చదివుతున్న వ్యక్తికి అస్సలు పనిలేదు కనకా...

 

ఈ కవిత, నా కవిత

చెపుతుంది ఒక కత

చదివే వాడికి ఇది ఒక వెత

చెప్పేవాడికి చదివేవాడు మెతక

 

Sunday, May 06, 2007

మన అభాగ్యనగర్

మొన్న ఒక ప్రముఖ బ్లాగరుతో జీటాక్ లో మాట్లాడుతుంటే, విషయం ప్రమాదాల మీదకు, భద్రత మీదకు మళ్లింది. హైదరాబాదు ప్రస్తుతం అన్ని నగరాల కంటే అతి సుఖవంతమైన, భద్రత కలిగిన నగరం అని ఆ బ్లాగరు అంటే నాకు ఒక్క సారి మన నగర ముఖ చిత్రం కళ్ల ముందర గిర్రున తిరిగింది. అందువల్లన ఆ విషయ ముఖంగా నాకు తెలిసిన నాలుగు ముక్కలు, వార్తా పత్రికల ఆధారంగా ఒక చిన్న అవలోకనం.

హైదరాబాదు ప్రస్తుతానికి పౌర జీవన ప్రమాణాల సూచీలో చాలా తక్కువ స్థాయి కలిగివుందని నా అభిప్రాయం. ఎందుకో చూద్దాం.

పౌర జీవన ప్రమాణ సూచీ (Life Index) అనేది అనేక కారణాల మీద అధారపడి వుంటుంది. చక్కని పొందిక కలిగిన సమాజం, ఆరోగ్యకరమైన గాలి, నీరు, శుభ్రత, నాణ్యత కలిగిన సేవలు, ఆర్ధిక సమానతలు, పేదరికం అనే విషయాలు ముఖ్యమైనవి. అయితే ఇవి కాక మరికొన్ని కారణాలు కూడా ఈ సూచీ ని ప్రభావితం చేస్తాయి. అవి మానసిక ఆనందం, ప్రశాంతత, పర్యావరణం, సమాజ చైతన్యం వంటివి. అయితే ఇవన్నీ మన రాజధాని నగరంలో ఎలా వున్నాయి?

శాంతి భద్రతలు : అతి దీనావస్థలో వున్నవి ఇవే. పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో తొమ్మిది కోట్ల చోరీ, అసలు ఇప్పటికి అంతు చిక్కని ఆంధ్రా బ్యాంకు చోరీ, పట్ట పగలు దోపిడీలు లాంటివి మచ్చుకు కొన్నొ. తీవ్ర కొరత వున్న పోలిస్ సిబ్బంది. వున్న కొద్ది మంది కూడా రకరకాల గడ్డి తిని, తినిపించి రాజధాని నగరంలో పోష్టింగులు వెయ్యించుకుని ఏదో కొంత వెనకాద్దామనుకునేవాళ్లే. కొన్ని పోలిస్ స్టేషన్ల యస్.ఐ, సీ.ఐ పోష్టులయితే దాదాపు నలభై లక్షలవరకూ పలుకుతున్నాయి. రోడ్డు మీద అన్యాయం జరిగితే పిలుద్దామంటే కనుచూపు మేరలో కనిపించని పోలీసులు ఇక్కడే వున్నారు. "పోలీస్ ను పిలుస్తా" అంటే…పిల్చుకో ఫో, వాళ్ల సెటిల్మెంట్ ఎప్పుడో అయిపోయిందనే మాటలు ఇక్కడ సర్వ సాధారణం.

అవసరం అయిన దానికంటే కనీసం అరవై శాతం మంది తక్కువున్న ట్రాఫిక్ పోలీసులు. అందులో కొంత మంది సరి అయిన ట్రైనింగు, అధికారం లేని హోమ్ గార్డులు. ఇక ట్రాఫిక్ గురించి మాట్లాడే ముందు ఈ నగరంలో ప్రమాదాల సంగతి చూద్దాం.

dangers

అంటే మిగతా రాష్ట్ర ప్రజలందరి కంటే, ఈ నగర పౌరుడికి రోడ్డు మీద ప్రమాదానికి గురి అయ్యే సంభావ్యత చాలా అధికంగా వుంది. బయటకు బండి వేసుకు వెళ్తే తిరిగి వస్తామో రామో తెలియదు. ఏ టిప్పర్ (ఇవి రాజధాని లోగో కింద పెట్టుకోవచ్చు) ఎటువైపు నుంచి వచ్చి గుద్దేస్తుందో తెలియదు. ఏ బీ.పి.వో కారు (వీటికి ప్రత్యేకంగా ఫార్ములా - 0 రేస్ పెట్టొచ్చు) మనల్ని రాసుకుంటూ పోతుందో తెలియని భయం. అసలు ఆ కార్లకు అన్ని సొట్టలు, గీతలు, మరకలు (ఇవి సర్వ సాధారణం) ఎలా వచ్చాయని మన పోలీస్ లకు ఒక ఆలోచన వచ్చి ఏడిస్తే కదా? రోడ్లన్ని తమవే అనుకుని తిరిగే ఆటోవారి ఆగడాలు ఇక చెప్పనక్కరలేదు. లెక్కకు మించిన ఆటోలు ఇక్కడ వున్నాయి. ఏదో సర్వే వారు హైదరాబాదులో ప్రతీ పన్నెండు మందికీ ఒక ఆటో వుందని తేల్చారు. నిజమో కాదో తెలియదు కానీ, అసలు కొత్త ఆటోలను ఈ ప్రభుత్వం ఆపుతున్నట్లు లేదు. ఒకొక్క ఆటోలో పది మంది ప్రయాణించటం (స్కూలు పిల్లలు కూడా) ఇక్కడ సర్వ సాధారణం. ఎవడో ఎప్పుడో చస్తే అప్పుడు హడావిడిగా ఒక ప్రకటన మాత్రం చేస్తారు, ఇకపై అది నిషిద్ధం, ఇది నిషిద్ధం అని. అది ఒక పది రోజులు అమలు. తర్వాత అందరూ మర్చిపోతారు. ఇద్దరు ముగ్గురు పిల్లల ప్రాణాలు పోతే గానీ క్రాస్ ఓవర్ బ్రిడ్జీలు కట్టారా? ఇక్కడ అన్నీ ప్రాణాలు పణంగా పెడితే గానీ జరగవా?

ఈ రోజు ఈనాడు వార్త చదివితే చాలు…శాంతి భద్రతలు మసి పూసిన మారేడు కాయని అర్ధం అవుతుంది.

ఇక క్రిమినల్స్ సంఖ్య చూస్తే గుండె గుభిల్లు మనే గణాంకాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడి కేసులకూ పుట్టినిల్లు మన వూరే. తాళాలు వేస్తే చాలు, కూరగాయలకు వెళ్లి వచ్చేలోపే ఇళ్ళు ఖాలీ చేసిన కేసులు కనిపిస్తాయి. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి లెక్క చెయ్యని ముఠాలు ఇక్కడే తిరుగుతున్నాయి.

పర్యావరణం : మన నగరం ఇటీవలే దేశ రాజధానిని తోసి అత్యంత కాలుష్య నగరాల పట్టికలో నిలిచింది చల్లగా జలాశయాలలోనికి విషాన్ని వదిలేసే ఫ్యాక్టరీలు, అవి అస్సలు కనిపించని గుడ్డి పీ.సీ.బీ ఇక్కడ వున్నాయి. పత్రికలు విషయాలు బయట పెడితే కానీ పని చెయ్యని సంస్థ అది.

వందల సంఖ్యలో అక్రమ బోరు బావులు తవ్వి, ఆ నీటిని ట్యాంకర్ల లెక్కన అమ్మేస్తున్నారు. దీని వలన భూగర్బ జలాలు తీవ్ర స్థాయిలో పడి పోతున్నాయి. ఎక్కడో వున్న బాబ్లీనీరు రాక పోవటం కాదు, మన క్రింద పారుతున్న నీరు మనమే పోగొట్టుకుంటున్నాం. ఇది అస్సలు రాజకీయ పార్టీలకు, రాష్త్ట్ర సమితులకు బుర్రకు పొరపాటున కూడా అందని విషయం. ఇది ఇలానే జరిగితే రానున్న పదేళ్లలో హైదరాబాదు ఒక చెన్నయి లా మారుతుంది.

రోడ్ల పక్కన వున్న చెట్లను పెంచటం మాట తరువాయి. వాటిని చల్లగా నరికేస్తున్నారు, వాటి స్థానే యాడ్ బోర్డులు పుట్ట గొడుగుల్లా వస్తున్నయి.

వున్న వేల ఆటోలు అన్నీ కిరోసిన్ కల్తీ పెట్రోలును వాడుతున్నాయి. అలా అయితే డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ. దీనివలన కాలుష్యం భూతంలా నగరాన్ని కమ్ముకుంటుంది.

సమాజం: అతి దరిద్రంగా వుంది. పక్కింటోల్లు ఎవడో కూడా తెలియని ఆపార్టుమెంట్లు వేలు వున్నాయి. మొహంలో నవ్వు కాదు సరికదా, పలకరింపు కూడా ఇక్కడ దొరకదు. అందరూ సీరియస్ గా అగ్ని మాపక సిబ్బందిలా రోడ్డు మీద హార్న్ కొట్టుకుంటూ వెళ్లిపోవటమే. ఆంబులెన్స్ లకే దారి దొరకడం లేదంటే ఇక ఇంకేముంది? ఇక్కడ గుండె పోటొస్తే దగ్గరలో వున్న గుడికి వెళ్లటమే మంచిది. కనీసం రోడ్డు మీద కన్ను మూయకుండా వుంటాం.

ప్రపంచ అతి లంచావతారాలన్నీ ఈ నగరంలోనే తిష్ట వేసాయి. MLA, MP, IPS, IAS ల నుంచి గుమాస్తాల వరకూ చెయ్య తడపనిదే పని జరగదు. అసలు ఇప్పుడు ఇక్కడ లంచం అనే దానికి అర్ధం లేదు. అది కూడా పనిలో ఒక భాగం.

తెలుగు వారు సహజంగా పాటించే గౌరవం ఇక్కడ మీకు దొరకదు. అతి నిర్దాక్షిణ్యమైన, కరుకైన సమాధానాలు, స్వార్ధం పొంగుతో కలసి వస్తుంటాయి. ఎంతో బిజీ నగరం అయినా ముంబయిలో కూడా ఇలాంటి ప్రజని చూడలేదు. ముంబయ్ ప్రజలు కష్టంలో ఆదుకునే తీరు చూస్తే ముచ్చటేస్తుంది.

ఇక ఈవ్ టీజింగు గురించి చెప్పనక్కరలేదు…చెప్పలేని సంఘటనలు, అసభ్య మూకలు లెక్కకు మిక్కిలిగా వున్నాయ్.

ఇక మిగతా భాగాలు వీలు చిక్కినపుడు రాస్తా….

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name