Friday, August 25, 2006

ద్రోహి...ద్రోహి...ద్రోహి...ఎవడురా ఈ ద్రోహి (రఘువరన్ ఫక్కీ లో)

తె.రా.స : కాంగ్రెస్ తెలంగాణా ద్రోహి
తె.దే.పా : తె.రా.స తెలంగాణని మోసం చేస్తోంది
కాంగ్రెస్ : తెలుగుదేశం తెలంగాణ ద్రోహి
భాజపా : కాంగ్రెస్,తెదేపాలు తెలంగాణా ద్రోహులు
వామపక్షాలు : రాష్ట్ర విభజన అంత వీజీ కాదు

విజయశాంతి : నేను పుట్టిందే తెలంగాణా కోసం, నాకు బుర్రలేదన్నవాళ్ళకి అస్సలు బుర్రలు లేవు
నరేంద్ర : రక్తవర్షం చిందిస్తాం, తడాఖా చూపిస్తాం (గత రెండు సం.లు గా ఇదే కలవరింత డాక్టరు గారు :-()
కే.సి.ఆర్ : ప్రజలు తిరగబడి దొమ్మీలు, దాడులు చేస్తే మా పూచి కాదు (ఇదొక హింటా?)

ఎమ్మెస్ : తెలంగాణ మరో పదేళ్ళకు కానీ రాదు
వై.యస్ : తెలంగాణాకి కావల్సింది విభజన కాదు..అభివృధ్ధి

తెలంగాణా ప్రజలు : అయో????? @$%%^%%్%$%$$%$ ???మయం

తెలుగు భాష : హమ్మయ్య ఇన్నాళ్ళకు ఒక అచ్చ తెలుగు పదం "ద్రోహి" పదే పదే అందరూ వాడుతుంటే బలే వుంది...శభాష్ బిడ్డలు, తాంబూలాలిచ్చేసారుగా ఇక తన్నుకు చావండి.

Thursday, August 24, 2006

ఆర్యభట్ట : అమెరికా సమావేశం

ఈ వెబ్ సైట్ చూసిన తరువాత నాకు చాలా సంతోషం కలిగింది. మన గడ్డ మీద పుట్టిన ఆర్యభట్ట ని మనం ఐన్‌స్టీన్ ని గుర్తించినంతగా కూడా గుర్తించక పోయినా, ప్రతిష్టాత్మకమైన ఆర్.యస్.ఏ సమావేశం ఈ సంవత్సరపు ప్రత్యేకాంశంగా స్వీకరించింది. ఈ సమావేశం ఫిబ్రవరి, 2006 లో జరిగింది.

ఆర్యభట్ట గురించి కొద్దిగా : ఆర్యభట్ట భారతదేశ అత్యున్నత గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్ట కుసుమపుర (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయ, ఆర్య సిధ్ధాంత, గోళాధ్యాయ మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్ట 'పై' విలువని సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొజ్యా" గా నిర్వచించాడు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన అని చెప్పాడు. సూర్య గ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు.

భూమి ఏదైనా స్థిర నక్షత్రం చుట్టూ తిరగటానికి పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది. ఇప్పుడు చెప్పండి ఐన్‌స్టీన్ కంటే ఆర్యభట్ట ఏ విషయం లో తక్కువ. అతని కాలం లో శాస్త్ర పరికరాలు అంతగా అభివృద్ధి చెంది లేవు కూడా.

ఒక పరిపూర్ణ భారత రత్న అయిన ఆర్యభట్టకు చేతులెత్తి ఇవే నా జోహార్లు. మన దేశంలో మన ప్రాచీన గణిత ప్రాభవం తెలియని చాలా మంది ఇంజనీర్లు వుండటం ఎంతో విచారకరం. ఈ మధ్యనే ఎవరో గుర్తులేదు గాని, ఆర్యభట్ట అంటే సున్నా కనిపెట్టిన వాడు కదా అని నాతో అన్నారు. నిజానికి ఆర్యభట్ట ప్రతిపాదించిన సంస్కృత సంఖ్యలలో "శూన్య" లేదు. సున్నా కి చాలా పెద్ద చరిత్ర వుందండోయ్ :-)

Tuesday, August 22, 2006

ముఖ్యమంత్రిగారి "పత్రికల పై దాడి"


నాకు మన ముఖ్యమంత్రిగారి "పత్రికల పై దాడి" చూస్తే కాసేపు నవ్వు (అతని విధంగా కాదండీ) వచ్చింది. అంత బట్ట బయలుగా ఆ విషయాలను చెప్పినందుకు నాకు అతను ఒక కోణం లో చాలా నచ్చాడు :-). కానీ అతను మరీ చిన్న పిల్లాడిలా రామరావు సి.ఎం కావటానికి, చంద్రబాబు సి.యం కావటానికి ఒక పత్రిక కారణం అనటం ప్రజాస్వామ్యాన్ని కించపరచి మాట్లాడటమే అవుతుంది. నిజానికి రాజశేఖర రెడ్డి పాద యాత్రకు తెగ వార్తలు రాసింది,అతను ప్రతిపక్షం లో వుండే కాలం లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్యపాన నిషేధానికి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసిందీ ఈనాడు పత్రికే. అయితే ఈనాడుకు ప్రజల వోట్ బ్యాంకును ప్రభావితం చేసే శక్తి వుందని అనుకోవటం అవివేకం. అలా వుండి వుంటే చంద్ర బాబు అంత చిత్తుగా వోడిపోయేవాడా? :-) ఎవరేమి అనుకున్నా ఈనాడు మరీ వార్త అంత చెత్త పత్రిక మాత్రం కాదు.

ఇక నవ్వటం అంటారా ? తప్పనిసరిగా ఎవరో మానసిక వైద్యులు ఇచ్చిన సలహా మేరకు ఒత్తిడి తగ్గించుకోవటానికి మన సి.యం గారు అలా తెగ నవ్వటం మొదలు పెట్టారని నా నమ్మకం. లేక పోతే సంజ్యూ ది ఆర్ట్ ఆఫ్ వార్ ని ఆచరణలో పెడుతున్నాడా కొంపతీసి :-)

వందేమాతర గీతం వరస మారుతున్నది

వందేమాతర గీతం ఏ సందర్భం లోనూ పాడనక్కరలేదంట. ఎందుకని అడక్కండి. అసలు ఆ గీతానికి రాజ్యాంగంలో వున్న/కల్పించిన ప్రాముఖ్యత మంటగలిసిపోతుందా అనిపిస్తోంది. ఆ గీతం ఏమైనా హిందూ గీతమా? సాహిత్యమా? మన పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే జరిమానాలు, వందేమాతరం పాడమంటే నిరసనలు, పిల్లలో బలవంతపు మత మార్పిడులు, వారి చేత హిందూ దేవతల పటాలు తగుల పెట్టటం...ఏమిటిదంతా? మరో సాంస్కృతిక దండయాత్రా? హిందూ ధర్మానికి హిందూ మతం అని పేరు పెట్టి చాలా తప్పు చేశారేమో.

నా చెత్త రాత

నేను ఈ నెల తెలుగు బ్లాగర్ల సమావేశానికి వెళ్ళలేకపోయినా (మనం ఆదివారం లేచేదే పదిన్నరకి..ఇంకెక్కడకి వెళ్తాం. అయితే నేను కిరణ్ చావా కంటే నయమే లేండి..అతను పదకొండుకు లేచాడు :-)) నాకు బాగ నచ్చిన ఒక అంశం "తెలుగు చేతి రాతని బ్లాగ్ చెయ్యటం". వీవెన్ గారి ఈ పోస్ట్ చూసి, నేను కూడా ఆవేశంగా కలం కలపాలని నిర్ణయించుకున్నా అది పై విధంగా విషాదాన్ని చిందించిందండి :-(

నిత్య జీవితంలో హాస్య నటులు...

ఈ మధ్యలో నేను చూసిన చాల కామెడీ మనుషుల్లో కుమారి విజయ శాంతి ఒకరు. ఆమె తెలుగు వింటూ ఉంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. సినిమాలు జనాలని ప్రభావితం చెయ్యటం చూసాం గాని, ఇలా నటులను కూడా ఇలా ప్రభావితం చేస్తాయనుకోలేదు. నాకు తెలిసి దేవానంద్ తరువాత, విజయశాంతి తను నటించిన పాత్రల వల్ల బాగా ప్రభావితం చెందిందనుకోవచ్చు.:-)

మన తెలుగు ప్రజలు సినీ నటులకు ఇచ్చే అతి గౌరవాన్ని ఎలా వాడుకోవచ్చొ ఈమెనే అడగాలి. సినిమాలు తప్పితే, ఆమెకు అసలు ఈ రాష్ట్రం మీద ఏ మాత్రం అవగాహన వుందో తెలియటం లేదు. ఆమెకు తోడు మన టైగర్(ఈయన అంతా రక్తం, మాంసం అనే పదాలే వాడుతూ మాట్లాడుతారు) ఆంధ్ర (ఎవరు ఆంధ్రులు? తెలుగు మాట్లాడే వారా? లేకా ఇంకెవరైనా వున్నారా? :-)) వారి చిత్రాలు ఆడనివ్వరంట...ఇంత కంటే పెద్ద జోకు మరొకటి వుండదు. కర్నాటక లో కొద్ది రోజులు తెలుగు చిత్రాలు ఆపితేనే అక్కడి ప్రజలు తెగ నిరసించారు...మరి మన సొంత రాష్ట్రంలో మన చిత్రాలు కాక పోతే ఇంకెవరి చిత్రాలు చూస్తామబ్బా ! ఇదేదో తెలుగు తాలిబాన్ ల గుంపు లా కనిపిస్తుంది నాకు.

చిరంజీవ చిరంజీవ

 

తెలుగు/తెలుగేతర ప్రజలని గత ఇరవై ఏల్లకు పైగా తన నటనతో రంజింప చేయటమే పనిగా పెట్టుకున్న ఈ మేరునగ ధీరునికి, అద్వితీయం అనే పదానికి అర్ధం చూపించిన మన చిరు కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

Sunday, August 20, 2006

తాళి కట్టు శుభవేళ

గత వారం రోజుల వ్యవధిలో మన ఆంధ్ర రాష్త్రం లో ఇలాంటి అందమైన వివాహాలు ఒక మూడు వేలు జరిగాయంటంటండి :-) ఏది ఏమైనా తెలుగు పెళ్ళికి సాటి వచ్చేది మరలా ఆ సీతా రాముల పెళ్ళేనేమో? మరి ఈ సందర్భంగా మనకున్న అందమైన పెళ్ళి పాటలలో ఒక పాటని ఆనందిద్దాం.

Saturday, August 19, 2006

శభాష్ "ఇలక్కణం"

ఇలక్కణం అనే ఈ తమిళ చిత్రం భాషాభిమానులకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈ చిత్ర నిర్మాతలు నన్నెరి సంస్థ ఈ చిత్రం లో ఒక్కటంటే ఒక్క ఆంగ్ల పదం వాడినట్లు చూపిస్తే ఒక లక్ష బహుమతి ఇస్తామని ఎంతో ధీమాగా ప్రకటించారు. తమిళ నాట భాషాభిమానం ఎప్పుడూ విజేత గా నిలబెడుతుంది అనేది విదితమే. ఇలా నిర్మించిన తెలుగు చిత్రాలకు ప్రభుత్వమే రాయతీలు ఇచ్చి ప్రోత్సహించేటట్లు మన ఏ.బీ.వీ.కే ప్రసాద్ గారు ప్రయత్నిస్తే బాగుండు.

Wednesday, August 16, 2006

ఆహా...మీడియా...నీకు జోహార్లు

నిన్న టీవీలో ఒక దారుణమైన న్యూస్ వీడియో చూపించారు. మనోజ్ మిశ్రా అనే ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సుధా డైరీ ముందు కూర్చుని తన వంటికి నిప్పు అంటించుకోవటం.

అగ్గి పుల్ల గీసిన దగ్గరనుంచి (రెండు సార్లు వెలగలేదు) మీడియా మహానుభావులు దాన్ని చిత్రీకరిస్తూనే వున్నారు తప్పితే ఆపే ప్రయత్నం చెయ్యకపోవటం దారుణమైన విషయం. కెమెరా ముందరే అతను సజీవంగా మాడిపోయాడు. అది చూస్తున్నప్పుడు నేను మంచం నుంచి అప్రయత్నంగా లేచి నిల్చున్నా...ఏమి చెయ్యలేనని తెలిసినా..:-(


అసలు ఎందుకు ఇలా మానవత్వం మంట కలసిపోతుంది? పోలీసులు కాస్త ఆలస్యం చేస్తే విరుచుకు పడే మీడియా తనకు మాత్రం బాధ్యత అవసరం లేదనుకుంటుందా? రేపు ఎవరైనా నాగర్జున సాగర్ కింద బాంబు అమరిస్తే దాన్ని అమర్చడం వీడియో తీస్తారేమొ గాని, చచ్చినా దాన్ని ఆపరు....

కొన్ని చానల్స్ అయితే "మెరుగైన సమాజం కోసం" అని రాసుకుంటున్నాయి. వారు ఇంటిని చక్క బెట్టి రచ్చ మీదకి బయలుదేరితే మంచిది...

"హిందూ" ఎక్కడి నుంచి పుట్టింది ?

నాకు ఒక మిత్రుడు పంపిన వివరాలలో ఒక ఆసక్తిసరమైన విషయం తెలిసింది. అది మన 'హిందూ పదం యొక్క పుట్టుక. హిందూ నాగరికత ప్రధానంగా సింధూ నాగరికత అనే విషయం తెలిసిందే కదా. మరి ఈ హిందూ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందబ్బా? మనకు ఏ పురాణలలో కూడ ఈ శబ్దం ఎక్కడా వున్నట్లు లేదు కదా? (నాకు తెలియదు, వుంటే క్షమించాలి :-))

పారశీకులు ఈ శబ్దానికి మూల కారకులు అంట. వీరు ఋగ్వేద ఆర్యులు నుంచి విడిపోయిన ఒక జాతి. వీరికి "స" అక్షరం సరిగా పలకడం రాదు. వీరు భారత ద్వీపకల్పంలో అడుగు పెట్టిన మొదట్లో ఎదురైన నది "సింధూ నది". దాన్ని వారు "హిందూ నది" గా పిలవటం మొదలుపెట్టారు. నాగరికత అంతా సింధూ లోయ వెంబడే వుండటం చూసి, వారు మన దేశాన్ని "హిందూ దేశం" గా పిలిచారు. అదే తరువాత "ఇండస్ సివిలైజేషన్" అయింది. మన దేశం ఇండియా అయింది.

అందువల్లనే, హిందూ మతం అనేది ఒక అద్భుతమైన ఆర్య సంస్కృతి,సింధూ నాగరికతల మిశ్రమ ఫలితంగ ఏర్పడిన ఒక "మతం". ప్రత్యేకంగా హిందూ మతం అనేది ఎక్కడా పుట్టలేదు. వేదాలలో ప్రస్తావించబడలేదు. ఎందుకంటే వేదాలు కుల ప్రాతిపదికగ సమాజంలో పుట్టినవి. మతానికి అప్పట్లో అర్ధం లేనే లేదు.

Tuesday, August 15, 2006

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు

 

ఆప్తులకు, మిత్రులకు మరియు ఈ బ్లాగు పాఠకులకు భారత స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు.

 దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడొక మహాకవి. మరి   ఆ లెక్కన మన దేశ ప్రజల మనస్సులకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా? లేకా 'ఇండియా' అనే భూమికి మాత్రం చెర వీడిందా?

మన మనస్సులలోంచి బానిసత్వపు జాడలు పోయాయా? పోతే ఇంకా మనలో దొరలు, సార్లు, అయ్యగారు, అమ్మగారు, బాబుగార్లు ఇంకా ఎందుకున్నట్టబ్బా? మనకి ఇంకా పోలీసులంటే భూతాలే అనిపిస్తుందే !!! మన ప్రాధమిక హక్కులు ఎంటో కూడా చాలమందికి తెలియవే? అమెరికా లాంటి దేశం లో సైతం పోలీస్ తో నా హక్కులేంటో నాకు తెలుసు అని చెప్పే వీలుంది కాని, మన దేశం లో అలా చెప్తే పిచ్చోడిలా చూస్తారు.

చెప్పండి, ఇది స్వాతంత్రమా? సర్వతోముఖాభివృధ్ధా? ఎదో నూతన్ ప్రసాద్ కామెడీ డైలాగ్ లా వుందేమో గాని, నిజంగా దేశం చాల క్లిష్ట పరిస్థితులలో వుంది. గడచిన 60 ఏళ్ళలో లేనంతగా....

Monday, August 14, 2006

ఇది ఒక ప్రయోగాత్మక పోస్ట్

దీనిని నేను విండోస్ లైవ్ రైటర్ ని వుపయోగించి రాసాను. చాలా సులభంగా మరియు అందంగా వుంది. మీరూ ప్రయత్నించి చూడండి.

దీనిని వ్యవస్థాపితం చేసుకునటానికి ఇక్కడ చూడండి. http://download.microsoft.com/download/f/9/a/f9a19...

మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి : http://windowslivewriter.spaces.live.com/blog/

గమనిక : తెలుగు లిపిలో రాయటానికి నేను లేఖిని ని వాడాను. లేఖిని ఈ పరికరం లో భాగం కాదు.

Thursday, August 03, 2006

ఇంకా చంపకండి ప్లీజ్.

ఈ రోజు ఈనాడులో హుడా వారి ప్రకటన (5వ పేజీలో) చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు.ఒక ప్రభుత్వరంగ సంస్థ, ఇంత బజారు ప్రకటన చెయ్యటం అవసరమా అనిపిస్తోంది. సమాచార హక్కు కింద మీరు 10 రూపాయలు ఎన్ని సార్లు చలాన కట్టి అడిగినా రాని సమాచారం, ఈ భావోద్వేగాలతో ప్రచురించటం ఏంటో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే అర్ధం కావాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే జవాబుదారీ కావాలి తప్ప, ఏ అధిక సర్కులేషన్ వున్న పత్రికకో కాదు. ఈ ప్రకటనకు నాకు అంచనా ప్రకారం ఒక 3 లక్షలు అవుతుంది(ఒక పత్రికకి).ఎవడబ్బ సొమ్మని ఈ ప్రకటనలు ఇస్తున్నారు? హుడా అంత ఉద్వేగానికి గురి కావల్సిన పని ఏముంది. అయితే వారి ప్రకటనలో ఒక వాస్తవం మనకు కనిపిస్తుంది. మన 5వ స్తంభం(మీడీయా) కూడా కుళ్ళిపోయింది. అది ఈనాడు కానియండి,వార్త లేకా టివి9 కానీయండి. నాకు ఈ విషయాలలో ప్రత్యక్ష అనుభవాలు వున్నాయి. అందుకే కొంతమంది విలేఖరులను చూస్తే లాగి కొట్ట బుద్ధి అవుతుంది.

రాజకీయ నాయకులకు, పత్రికలకు, బ్యూరాక్రాట్లకు ...చేతులు జోడించి ఇదే విన్నపం...చచ్చిన ప్రజాస్వామ్యన్ని, సోషలిజాన్నీ ఇంకా చంపకండి ప్లీజ్.

Tuesday, August 01, 2006

ఈ వారం విశాలాంధ్ర పై దాడి

కొత్తగా కొన్న పుస్తకాలు...

01. చివరకు మిగిలేది - బుచ్చిబాబు
02. మిసెస్ అండర్‌స్టాండింగ్ - బ్నిం
03. అమ్మ - గోర్కి (ఇది నేను మూడవ సారి కొనటం...2 సార్లు స్నేహితులు జాతీయం చేసేసారు)
04. సాహితీ సర్వస్వం - ముళ్ళపూడి వెంకట రమణ (8 సంపుటాలు)
05. తెలుగు నేర్పటం ఎలా - రంగ నాయకమ్మ
06. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఆరుద్ర (తెలుగు అకాడమీ - 4 సంపుటాలు)
07. రామాయణ విషవృక్షం - రంగనాయకమ్మ

సాగర ఘోష...ఎవడికి పట్టిందీ?

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తనకూ బాధ్యతలు వున్నాయని చాటి చెప్పింది. గణేశుడి నిమజ్జనంపై మూడు రోజులలో తేల్చాలని ప్రభుత్వానికి ఆఙ్ఞ ఇవ్వటం నాకు ఎంతో సంతోషంగా వుంది. మరో వైపు నిమజ్జన కమిటీ ప్రవర్తన మరీ బజారు ప్రవర్తన లా వుంది. ఒరేయ్ నీకు లెక్కలలో 3 మార్కులు వచ్చెయేంట్రా అని తండ్రి అడిగితే..పక్కింటి గోపి గాడికి 0 వచ్చాయి...వాడినెవరైనా అడిగారా అని తిరిగి కోపంగా చూసే పనికిరాని లాజిక్కులతో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

ఒక పక్క టన్నుల కొద్ది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో హుస్సేన్ సాగరం అడుగున ఒక గట్టి మందమైన పొర ఏర్పడిపోతుందిరా బాబు అని కాలుష్య నివారణ సంస్థలు ఏడుస్తుంటే, దాన్ని కనీసం ఒక సమస్యగా కూడా పట్టించుకోక పోవటం, వారి కళ్ళకు పట్టిన ధన మదం అని చెప్పకనే చెపుతుంది. అసలు మన దేశంలో పి.సి.బి కి అత్యున్నతమైన అధికారాలు ఎప్పుడు వస్తాయో కదా :-(.......

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name