ఈ వెబ్ సైట్ చూసిన తరువాత నాకు చాలా సంతోషం కలిగింది. మన గడ్డ మీద పుట్టిన ఆర్యభట్ట ని మనం ఐన్‌స్టీన్ ని గుర్తించినంతగా కూడా గుర్తించక పోయినా, ప్రతిష్టాత్మకమైన ఆర్.యస్.ఏ సమావేశం ఈ సంవత్సరపు ప్రత్యేకాంశంగా స్వీకరించింది. ఈ సమావేశం ఫిబ్రవరి, 2006 లో జరిగింది.
ఆర్యభట్ట గురించి కొద్దిగా : ఆర్యభట్ట భారతదేశ అత్యున్నత గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్ట కుసుమపుర (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయ, ఆర్య సిధ్ధాంత, గోళాధ్యాయ మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్ట 'పై' విలువని సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొజ్యా" గా నిర్వచించాడు.
ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన అని చెప్పాడు. సూర్య గ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు.
భూమి ఏదైనా స్థిర నక్షత్రం చుట్టూ తిరగటానికి పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది. ఇప్పుడు చెప్పండి ఐన్‌స్టీన్ కంటే ఆర్యభట్ట ఏ విషయం లో తక్కువ. అతని కాలం లో శాస్త్ర పరికరాలు అంతగా అభివృద్ధి చెంది లేవు కూడా.
ఒక పరిపూర్ణ భారత రత్న అయిన ఆర్యభట్టకు చేతులెత్తి ఇవే నా జోహార్లు. మన దేశంలో మన ప్రాచీన గణిత ప్రాభవం తెలియని చాలా మంది ఇంజనీర్లు వుండటం ఎంతో విచారకరం. ఈ మధ్యనే ఎవరో గుర్తులేదు గాని, ఆర్యభట్ట అంటే సున్నా కనిపెట్టిన వాడు కదా అని నాతో అన్నారు. నిజానికి ఆర్యభట్ట ప్రతిపాదించిన సంస్కృత సంఖ్యలలో "శూన్య" లేదు. సున్నా కి చాలా పెద్ద చరిత్ర వుందండోయ్ :-)
5 comments:
మంచి టపా! వీటి గురించి తెవికీలో రాయాలి.
నిజముగా మంచి టపా
మంచి సమాచారం ఇచ్చారు, థాంక్స్! తెవికీలో రాయండి.
http://te.wikipedia.org/wiki/ఆర్యభట్టారకుడు
లో జత పరిచానండీ
బాబోయ్! సమయం చూసుకుంటే ఎలా గడిచిందో తెలియట్లేదు. మీ ఆర్యబట్ట వికి లంకెలు పట్టుకొని వికి సముద్రంలో ప్రాచీన భారత శాస్త్రజ్ఞులను చూసి వచ్చేసరికి నా రోజంతా అయిపోయింది. ఈ మద్య తెలుగు బ్లాగులు, వికి నాకో వ్యసనంగా మారిపోయాయి. ఎంత కొంపలంటుకుపోయే పని వున్నా ఒక్కసారన్నా కూడలి చూడందే పొద్దు గడవదే!
-- ప్రసాద్
http://charasala.wordpress.com
Post a Comment