Tuesday, October 31, 2006

రాష్ట్ర అవతరణోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తోటి తెలుగు వారందరికి ఇవే నా శుభాకాంక్షలు. ఆ తెలుగు తల్లికి వందనాలు. ఈ సందర్భంగా ఈ వ్యాసాలు తప్పక చదవండి.

(తెలుగు వికీ నుంచి)

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మరు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

Friday, October 27, 2006

చిత్ర బ్లాగు పునర్దర్శనం

నా కూర్గు పర్యటన ఒక మోస్తరుగా ముగిసింది. అయితే ఈ పర్యటనలో నేను తీసిన కొన్ని చిత్రాల వలన మరలా నా చిత్ర బ్లాగును కొనసాగించటం మొదలుపెట్టాను.

కూల్ క్లిక్స్ : http://coolclicks.blogspot.com

తెలుగు మీకు ఇప్పుడు బ్రౌజరులో ఒక భాగం

మనం రోజూ చాలా తెలుగు పత్రికలు, బ్లాగులు చదువుతుంటాం. కానీ అవన్నీ గుర్తుంచుకోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటం కోసం నేను ఈ తెలుగు ఉపకరణ పట్టీ తయారు చేశాను. దీన్ని వ్యవస్థాపితం చేసుకుని మీరు కూడలిని శోధించగలరు, తెలుగు సైట్లకు వెళ్ళగలరు, తెలుగు పత్రికలు, కూడలి మరియు లేఖినిని దర్శించగలరు.

ఈ ఉపకరణ పట్టీ ప్రస్తుతం మీరు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 5+, ఫైర్ ఫాక్స్ 1+ లలో వ్యవస్థాపితం చెయ్యగలరు. దీనిలో ఇంకొక సౌలభ్యం ఏమిటంటే, మీరు ఈ పట్టీ కొత్త పరికరాలను ఎప్పటికప్పుడు పొందుతారు. మరలా మీరు ఎన్నడూ దీన్ని వ్యవస్థాపితం చెయ్యనక్కరలేదు.

ఇంకా ఆలస్యం ఎందుకూ? ఈ తెలుగోపకరణ పట్టీని దిగువ లంకె నుంచి ఆనందించండి.

తెలుగోపకరణ పట్టీ (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 5+, ఫైర్ ఫాక్స్ 1+)

గమనిక : ఈ పట్టీలో నాకు తెలిసి ఏ స్పైవేరు, మాల్వేరు, ఏడ్ వేర్ జత చెయ్యబడలేదు. ఈ సాఫ్ట్ వేరు యొక్క ప్రవర్తన, కలగ చేసే అదనపు ఇక్కట్లతో నాకు సంబంధం లేదు.  మరిన్ని వివరాలకై

Friday, October 20, 2006

తెలుగులో మాట్లాడండి ఇక యాహూ మెసెంజర్లో...

 

యాహూ తన నూతన యాహూ గ్యాలరీ లో భారతీయ బాషలలో సందేశం పంపుకునే వీలు కల్పించే ప్లగిన్ లను జత చేసింది. జోల్ అనే ఈ ప్లగిన్ వ్యవస్థాపితం చేసుకొనటం వలన మీరు ఇక తెలుగులో హాయిగా తిట్టుకోవచ్చు..

yahoojoha

మీరు జోల్ ని వ్యవస్థాపితం చేసుకోవాలంటే ఇక్కడ సందర్శించండి.

Thursday, October 19, 2006

బాబోయ్ టీవీ 9

టీ.వీ 9 తెలుగుకు నా శత కోటి నమస్కారాలు...వీళ్ళని ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు. ఏదో బీ.బీ.సి వాళ్లు తయారుచేసిన తెలుగును చదువుతున్నట్లుగా ఉంది. నానాటికి తీసికట్టు అంటే ఇదే మరి. ఈ భాషా ఖూనీ ఎక్కువగా దీప్తి వాజ్ పేయి చదువుతున్నప్పుడే జరగటం గమనార్హం.

కొన్ని ఉదాహరణలు...

లంక బౌలర్స్ అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేసి పాక్ బ్యాటింగ్ను కొలాప్స్ చేసారు...

వివరాలు యాడ్స్ తరువాత, ఐ విల్ కమ్ బ్యాక్, డోంట్ గో ఎవే ఎనీవేర్...వెల్కమ్ బ్యాక్ అగైన్

ఇలాంటివి కోకొల్లలు...నాకర్ధం అయ్యింది ఏమిటంటే, ఎన్.ఆర్.ఐ తెలుగు వాళ్ళకు అర్ధం అయ్యేలా చదువుతున్నారేమో అని...కాని ఎన్.ఆర్.ఐ తెలుగు ఆంధ్ర తెలుగు కంటే ఇంకా స్వఛ్ఛంగా ఉంటుందని వారు తెలుసుకుంటే మంచిది.

Monday, October 16, 2006

దిక్కు మాలిన తెలివితేటలు

రాజకీయ నాయకులకు దిక్కుమాలిన తెలివితేటలు మెండు అని నిరూపించాలంటే మన కె.సి.ఆర్ ని ఒక పది నిమిషాలు మాట్లాడిస్తే చాలు. అతని ది.మా.తె లకు కొన్ని మచ్చు తునకలు.

"ఆంధ్రా వాళ్ళు సొరకాయ అంటారు, తెలంగాణా వాళ్ళు ఆనపకాయ అంటారు."  :- ఇతనెప్పుడైనా ఉత్తరాంధ్ర మొహం చూస్తే కదా తెలిసేది. మా వైపు సొరకాయ అంటే ఎవడికీ అర్ధం కాదు, ఆనపకాయ అనే వాడుతారు. అయినా కూరగాయ పేర్లు కూడా వివాదాస్పదం చెయ్యటం ఒక పరాకాష్ట. ఆల్ప్స్ పర్వతాలలో పుట్టిన టొమేటో పండుకు రామ ములగ పండు అని ఓ జమాన కాలం నుంచి పేరు...మరి కె.సి.ఆర్ బజారుకు వెలితే ఏ పదం వాడుతాడో? తెలంగాణా కూరగాయలపై ఆధిపత్యం వహిస్తున్న ఈ యూరోపియన్ కూరగాయల్ని తరిమేద్దాం అంటాడేమో !

 

తెలంగాణా వారికి తెలివి లేదని ఆంధ్రా వాళ్లు అంటారంట. ఏంటీ విచిత్ర వాదన? అయ్యా మీతో అలా ఎవరైనా అన్నప్పుడు ఇంత వరకు ఎందుకు ఊరుకున్నారు? పళ్లు రాలగొట్టండి పర్వాలేదు. ఏ ప్రాంతంలోనైనా మీ లాంటి రాజకీయ నాయకులు మాత్రమే ప్రజలంతా తెలివితక్కువ వారని భావిస్తారు. దానికి మీకు ప్రాంతాలతో సంబంధం లేదులెండి.


జొన్నన్నం తిని బతికి గుంటూరు వాసులు ఇప్పుడు తెలంగాణా నీటి వనరులు కొల్ల గొట్టి సన్నన్నం తినే స్తాయికి చేరి మనల్ని జొన్నన్నం తినే స్తాయికి దిగ జార్చిండ్రు. సారూ...జొన్నన్నం తినే స్తాయి గానీ, పత్తి పురుగుల రైతుల ఆత్మహత్యలు గాని, తెలంగాణాలో తీవ్రమైన ఫ్లోరైడు సమస్య గానీ మీ రాజకీయనాయకుల పుణ్యమే ! మీరు ఎన్ని తెలంగాణా ఊర్లను ఈ సమస్యలనుంచి బయట పడేసారు? ఎన్ని ఊర్లకు మీ ఖర్చుతో టాంకర్లతో నీరు అందిచారు? గుంటూరులో జొన్నన్నం తింటారని ఇప్పటి వరకూ తెలియదు. మీరు ఇంకొకటి తెలుసుకోవాలి. రాయలసీమలో ఇప్పటికి సంకటి తిని పడుకునే ఊర్లు వేల కొలది ఉన్నాయి. కోస్తాలో గంజి తాగి బతికే కుటుంబాలు లక్షలున్నాయి. వారికి జొన్నలు పండవు, సన్నన్నం దొరకదు...మీ రాజకీయ నాయకులిచ్చే ముక్కిపోయిన బియ్యం డీలరు తినేస్తాడు.


చిత్తశుద్ధితో ప్రయత్నించితే తెలంగాణా అదే వస్తుంది, అంతే గానీ ఇలాంటి దిక్కు మాలిన మాటలు మాట్లాడితే మీ వెనక ఉన్న సిద్ధాంతకర్త జయశంకర్ గారే సిగ్గు పడాల్సి వస్తుంది. మీరు సిధ్ధార్ధుడిలా ఇంటిలోనే ఉండి కబుర్లు చెప్పకుండా ఒక్క సారి రధం బయటకు తీసి మొత్తం రాష్ట్రం తిరిగి మాట్లాడితే కొద్దిగా బాగుంటుందేమో కదా?

Wednesday, October 11, 2006

కె.కె సంగీత విభావరి

నిన్న రాత్రి మా కంపెనీ వారి వార్షిక ఉత్సవం ఒకటి జరిగింది. చాల చిత్రంగా దానికి కుటుంబాలను అనుమతించలేదు, అందువలన కార్యక్రమంలో అందరూ కాస్త కృత్రిమంగా ప్రవర్తించినా చివరికి వినోద కార్యక్రమాలతో ఫరవాలేదనిపించారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి లోనే జరిపిన అవార్డుల కార్యక్రమంలో తొలి అవార్డు గ్రహీత గైర్హాజరు...ఘనంగా అవార్డును చదివి పిలిచినా ఆ శాల్తీ అందుకోవాటానికి రాలేదు. ఆ శాల్తీ మరెవరో కాదు....మనమే...ఆ టైములో తీరిగ్గా బయలుదేరుతుంటే ఇక ఇడియట్ బాక్సు-2 మోగటం మొదలు పెట్టింది. ఆప్పుడు వచ్చిన కాల్సు వలన  అర్ధం అయ్యింది మిస్సయిపోయాన్రా బాబు అని. మరి అది ఈ సందర్భంలో ఇస్తారని నాకెవ్వరూ చెప్పలేదు. smile_sad. తీరా హుటాహుటిన అక్కడికి వెళ్ళాక ఎందుకు రాలేదు, ఎక్కడున్నావు అని జనాల ప్రశ్నల పరంపర. అలా విచారంగా మొదలయ్యింది నా సాయింత్రం.

తరువాత , వీర్ దాస్ అని ఒక కమెడియన్ (గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో ఫేమ్) కడుపుబ్బా నవ్వించాడు. ఆడవాళ్ళను పొగుడుతూనే వారి మీద జోకులు వేసి అదరగొట్టాడు. అదొక తప్పనిసరిగా రావలసిన  ఇంటి విద్య లా అనిపించింది. (పెళ్ళయిన మగ వాళ్ళకు ).

 

తరువాత కొన్ని వినోద కార్యక్రమాల తర్వాత, కెకె సంగీత విభావరి మొదలయ్యింది. మొదట్లో మెల్లగా సాగే పాటలు పాడినా, తర్వాత మంచి బీట్ ఉండే పాటలు, శంకర్ మహదేవన్ పాటలు, బ్రయాన్ ఆడమ్స్ పాట (Summer of 69) అద్భుతంగా పాడాడు.

 

kk_me

మా ఇద్దరం కలసి పెయింట్.నెట్ లో ఒక ఫోటో తీయుంచుకున్నాం ఇలా...smile_tongue

నాకు నచ్చిన కె.కె పాడిన పాటలు ..

  •  చెలియ చెలియా (ఘర్షణ)
  •  Summer of 69 (బ్రయాన్ ఆడమ్స్)
  •  ఆవారాపన్ బంజారాపన్ (జిస్మ్)
  •  ఓ హమ్ దమ్ సోనియారే (సాథియా)
  •  తూ ఆషికీ హై (ఝంకార్ బీట్స్)
  •  దస్ బహానే (దస్)

Thursday, October 05, 2006

గురజాడ పై గుర్రు

చదువరి గారు అందించిన ఈ వ్యాసం చదువుతుంటే కొంచెం నవ్వు, ఆలోచనా, చిరాకు కలిగి నా అభిప్రాయం రాయలనుకుంటున్నాను. నాకు తెలుగు భాషా శిల్పం, అది ఎలా ఉండాలి? ఇది ఇలా ఉండాలీ ..ఇవన్నీ తెలియవు కానీ గురజాడ రాసిన నవలను చదివిన సామాన్యుడిగా నా అభిప్రాయం ఇది..

నా మొదటి అభిప్రాయం : ఈ వ్యాస రచయత పక్కా కమ్యూనిష్టులా రాశాడు. అసలు తన సమస్య ఏంటో సూటిగా చెప్పకుండా ఎవరినో ఎందుకు తిడుతున్నామో తెలియకుండా తిట్టాడు. బాగానే ఉంది. నాకు అర్ఢం కానిది ఏమిటంటే, జాతి సంస్కృతి విధ్వంసం ఒక్కటే...అసలు గురజాడ కన్యాశుల్కం జాతిని ఏమైనా ఉద్ధరించిందా? లేదు కదా ! మరి ఈ విధ్వంసం ఏమిటి? కొంప తీసి వరకట్నం తీసుకోవటం గురజాడ వలన మొదలయ్యిందటారేమో మన నవరసాల గారు. (వీరిలో పిరికితనం, భయం అడుగడుగునా కనిపిస్తూ ఉంది...అసలు పేరుతో రాయొచ్చు కదా?). దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఒక విధ్వంసకారుడు ఎలా రాయగలడు...?

అసలు ఒక పక్క అప్పట్లో బలమైన వర్గమైన బ్రాహ్మణ వర్గ ఆచారాలపై కన్యాశుల్కం లో విరుచుకు పడిన తీరు చూస్తే పిరికితనం, భయం ఎక్కడ కనిపించాయో అర్ధం కావటం లేదు. గురజాడ పనికట్టుకుని ఏమి రాయలేదు, అప్పటికి ఏంటి ఖర్మ, ఇప్పటికీ మనం చాలా అరుదుగా కన్యాశుల్కంలో హాస్యానికి వాడుకున్న ఘట్టాలను చూడవచ్చు.

 

గురజాడ బ్రిటీషు వారిని కీర్తించాడు అన్నారు...బ్రిటీష్ వారు నయవంచకులు, విభజించి పాలించ వారు అన్నారు..మరి వారు మన దేశాన్ని పరిపాలించక మునుపు ఉన్న రాజులు ఏమి చేస్తున్నారు? జనాలను నాలుగు ప్రధాన కులాలుగా విభజించి పరిపాలించడానికి కారకులెవ్వరు? రాజుల పంచన వేల సంవత్సరాల నుంచి బతుకుతున్న ప్రధాన సామజిక వర్గమేది ? సీ.పి బ్రౌన్ ఎవరు? ఆర్ధర్ కాటన్ ఎవరు?

 

కాంగ్రెస్ ను అవహేళన చేశాడన్నారు, మరి ఎలానో రాయలేదు. విమర్శ అనుకోవచ్చుగా? అయినా కాంగ్రెస్ అంత కడిగిన ముత్యమేమీ కాదే? గురజాడ పతితలను వెనెకేసుకొస్తాడు అని నవరసాల గారి ఉవాచ. అతను ఒక్క  సారి "కన్యక" కావ్యం చదివితే మంచిది. పతిత అని ఒకరిని సంభోదించడంలో వినిపించే మగ దురహంకారం, భ్రష్టత్వం నాకు గురజాడ "జాతి విధ్వంసకర" కన్యాశులంలో కనిపించలేదేంటబ్బా?

Tuesday, October 03, 2006

శ్రీవారి ఆదాయం : తొమ్మిది కోట్లు

అయితే ఏంటంటా గొప్ప? తొమ్మిది రోజులు కష్టపడి, కిలోల కొద్ది ఆభరణాలు ధరించి, రక రకాలుగా ఊరేగి నిద్ర కూడా లేకుండా భక్తులకు అలసి సొలసి దర్శనమిస్తే తొమ్మిది కోట్లు వచ్చాయి పాపం.

హైదరాబాదులో రోజుకు మూడున్నర కోట్లు వసూలవుతాయి...స్వామీ వింటున్నారా? ఈ నగరంలో మందుబాబులందరూ కలసి అక్షరాలా రోజుకు మూడున్నర కోట్లు మధుపాత్రకు సమర్పిస్తారు.... అంటే తొమ్మిది రోజులలో ముప్ఫైరెండు కోట్లు...:-)...పాపం గాంధీ గారు కూడా ఈ రాబడి ఒక్క రోజు ఆపలేకపోయారు.

అలా నీళ్ళు నమలకుండా ఏదో చెయ్యొచ్చు కదా? మీకూ హుండీ ఆదాయం పెరగొచ్చు, ఈ తాగుబోతులు తగ్గితే...అసలు మీకు ఏమైనా ఆలోచించటానికి భక్తులు సమయమిస్తే కదా !

Monday, October 02, 2006

ఒక్కడు

రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం

సీతారాం సీతారాం, భజ ప్యారే తు సీతారాం

ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్ కో సన్మతి దే భగవాన్. ||

పుట్టిన తరువాత, నూటా ముప్పై ఏళ్ళకు పైగా గడచినా, ఈ ఒకే ఒక్కడు కలలు గన్న దార్శనిక లోకం, యావత్ ప్రపంచాన్ని ఇంకా విభ్రమంలో ముంచెత్తుతూనే ఉంది.

భగవంతుడు, భారతీయులకు ఉమ్మడిగా ఇచ్చిన వరం "బాపు" జన్మదిన సంధర్భంగా, వారికివే హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం యధావిధిగా "ఈనాడు గాంధిగిరీ పనిచేస్తుందా?" అనే విషయం మీద చాల ప్రసార వాహికలు చర్చలు జరిపాయి. అందులో నాకు నచ్చింది సీ.యన్.యన్-ఐ.బి.యన్ వారు నిర్వచించిన కార్యక్రమం. సంతోషకరమైన విషయం ఏమిటంటే, యువతరం ఇంకా కొంత వరకు గాంధీ అడుగు జాడలపైన ఆశలు పెట్టుకోవటం.అయితే కొంత మంది చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి చెప్పినదేమంటే, "ఒక చెంప మీద కొడితే, రెండో చెంప చూపిస్తే, దాన్నీ వాయించి, ఉచితంగా వీపు గూడా వాయగొట్టే కాలం ఇది" :-) కొంత వరకూ నిజమే కదా ! ఇప్పుడు నాకు తెలిసీ గాంధీగిరి కొద్దిగా పనికొస్తున్నది "మౌన పోరటాలు" వరకే. అంత వరకూ ఎందుకూ, గాంధీ బాటలో చిత్త శుద్ధితో నడచిన పొట్టి శ్రీరాములు చనిపోయే వరకూ అప్పటి ప్రభుత్వం దిగి రాలేదు కదా ! నా స్నేహితులొకరు చెప్పినట్లు "బ్రిటీషు వారు కాబట్టి గాంధీ సిధ్ధాంతాలు పని చేశాయి, అదే కనక జర్మన్లు అయితే, భారత దేశ జనాభా సగం తుడిచిపెట్టుకుకు పొయేది, గాంధీతో సహా". అంతే మరి ...శత్రువు బట్టే శరం కూడా ఎంపిక చేసుకోవాలి.

ఐన్‍స్టీన్ అన్నట్లు : రాబోయే తరాలు, అస్సలు ఇలాంటి మనిషి భూమి మీద రక్త, మాంసాలతో నడచేడంటే నమ్మలేకపోవచ్చు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name