Sunday, November 26, 2006

మన మున్సిపాలిటీ బ్రాండ్ ఎన్నికలు

మనందరికి తెలుసు, భాగ్యనగరం ఒక మేడిపండు అని. కొత్తగా ఋజువులు కూడా అక్కరలేదు. ఇప్పుడు ఆ మేడిపండుకు మన ఎమ్.సి.హెచ్ కొత్త రంగులద్దబోతుంది. వారి ప్రకారం మన నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలిట. నగరానికి బ్రాండ్ ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. అదీ పక్కా ఇంగిలిపీసులో. నిజంగా చెప్పలంటే భాగ్యనగరానికి ఒక లోగో కావలంటే ఇలా ఉండాలి...(అపహాస్యానికి క్షమించాలి..కానీ పరిస్థితి ఇలానే ఉంది మరి).

hydlogo

 

ఈ హాస్యాన్ని పక్కన పెడితే, మనకు ఎంచుకోవటానికి ఇక్కడ నాలుగు లోగోలు ఉన్నాయి..నేను B కి వోటేసా...అది కొద్దిగా బిర్యాని పద్ధతిలో ఉంది, రాజసంగా...:-) మరి మీరు ఓటెయ్యండి మరి...www.ourmch.com లో నవంబరు 28 లోపు మీరు మీ ఓటు నమోదు చెయ్యవచ్చు.

Hyd LogosHyd logoSnagIt CaptureSnagIt Capture

తెలుగు బ్లాగర్లను దోచుకొనుట

ఈ మధ్య అద్భుతమైన తెలుగు బ్లాగర్లు పుట్టుకొస్తున్నారు. మంచి మంచి వంటకాలతో నోరూరించేవి కొన్ని అయితే, గడ గడ లాడించే రాజకీయాల విసుర్లతో కొన్ని. చిన్ననాటి ముచ్చట్లు, నసీరుద్దీన్ పకపకలు, అందమైన భావాలు, గేయాలు, నీతి కధలు, సాంకేతిక విషయాలు ఒకటేమిటి...చదవటానికి తీరిక లేనన్ని...మరి ఇవన్నీ ఎలా చదవకుండా వదిలెయ్యటం? అందుకని మనం చెయ్యగలిగేది ఒక్కటే...వాటిని తస్కరించి మన దగ్గర భధ్రపరచుకుని, తీరిగ్గా పకోడీలు (బ్లాగులో నేర్చుకున్నవి) నముల్తూ ఏదో ఒక రోజు చదువుకుంటే బాగుంటుంది కదా...

సరిగ్గా మన లాంటి వారికోసమే ఉంది ఈ క్లిప్ మార్క్స్ అనే ఉపకరణం...

ఇది ఒక్క సారి మన బ్రౌజరులో వ్యవస్థాపితం చేసుకుంటే...ఒక పండగే పండగ..:-)...ముందుగా ఈ క్లిప్ మార్క్స్ ని ఇక్కడి నుంచి వ్యవస్థాపితం చేసుకోండి...


SnagIt Capture

మనము ఏదైనా పేజిలో ఉన్నప్పుడు ఈ క్లిప్ మార్కు బటన్ (బ్రౌజరు టూలు బార్ మీద ఉంటుంది) ని నొక్కితే పేజీ మొత్తం ఎంపిక మోడ్ లోనికి మారుతుంది. అప్పుడు మనకు కావలసిన విషయం, పేరాల మీద మౌస్ ను ఉంచితే వాటి చుట్టూ ఒక గీతతో డబ్బా కనిపిస్తుంది. మనకు సరిపోయే విధంగా డబ్బా కనిపిస్తే ఒక్క మౌస్ నొక్కు నొక్కటమే...ఆ డబ్బాలో ఉన్నదంతా మన క్లిప్ స్టోర్ లోనికి వచ్చేస్తుంది...అప్పుడు చివరిసారిగా "సేవ్ క్లిప్ మార్కు" బొమ్మను నొక్కటమే...లాగిన్ అయ్యాక మన క్లిప్పులను అది సురక్షితంగా భధ్రపరుస్తుంది. వీటిని ఎక్కడినుంచి అయినా చదువుకోవచ్చు...ఇంకొకరి చేత చదివించ వచ్చూ...నా క్లిప్పులను ఇక్కడ మీరు చూడవచ్చు..

SnagIt Capture

భలే ఉంది కదా ! ఇక ఆలస్యం ఎందుకూ? క్లిప్పుల వేట మొదలుపెట్టండి...రండి...పకోడీలను మరింత రుచికరంగా చేద్దాం ...:-)

Saturday, November 25, 2006

బీడీకట్ట రాజకీయాలు

రాష్ట్రంలో నవ్వు పుట్టించే కుళ్ళు రాజకీయాలు ఊపందుకున్నాయి...అందులో కొన్ని..

 •  హటాత్తుగా బీడీ కార్మికుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మన కె.సీ.ఆర్ కు. ఈ రోజు ఆవేశంగా ప్రసంగించేస్తున్నాడు..మీ తోనే నా బతుకు, నా చావు అని...తమరు రెండు సంవత్సరాలుగా వెలగ బెట్టిన కేంద్ర మంత్రి పదవిలో ఏం చేసారు సారూ ! ఈగలు తోలుతున్నారా? అసలు పుర్రె వలన ఎంత మంది పొగ తాగటం మానేస్తారబ్బా? అసలు ఈ తాగే వాళ్లందరూ పొగ తాగితే అనారోగ్యం అని తెలియకుండా తాగుతున్నారా? ఒక వేళ తాగినా సరే, వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏమిటి? ఏది ముఖ్యం? ఆరోగ్యమా ? ఓట్లా?
 • హఠాత్తుగా నరేంద్ర గారికి విజయశాంతి (అదేనండీ తెలంగాణాకు ఏదో రకంగా మానస పుత్రిక) ని ఆహ్వానించడానికి అనుమతి లభించింది. పాపం ఇతను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తే ఇన్నాల్లకు కె.సి.ఆర్ గులాబీ ఊపాడు. మన విశాంతి గారు మద్రాసు యాస తెలుగులో ఒక రకంగా ఎదో వాగారు టీవీలలో...ఇక ఈవిడ జనాలమీద తన సినిమ తైతక్కలు ప్రదర్శించటమే తరువాయి.
 • సంవత్సరాల నుంచి సినిమాలలో అపహాస్యం పాలవుతున్న ఉత్తరాంధ్ర యాస ఇప్పటికి రాజకీయ నాయకుల కళ్ళకు ఆనింది. కుళ్ళును కుళ్ళపొడుస్తున్న ఈనాడును మరేటీ సెయ్యనేక, ఇదో ఇలాగ నరుక్కొత్తన్నారు...ఇప్పటికైనా భాషకు, యాసకు ఉన్న సంబంధాన్ని అందరు గమనిస్తే మంచిది. కళ్ళు చిదంబరం చేత ఈ యాసతో అపహాస్యం చేస్తే తప్పులేదు కానీ, అన్నింటినీ బొక్కే బొత్సను అనేటప్పటికి ఎక్కడి లేని రోషం వచ్చేసింది..ఎవరికీ? మన రాజమహేంద్రంలో వున్న డిటెక్టివ్ ఉండవల్లి గారికి.

Thursday, November 16, 2006

శోధన వంద టపాలు పూర్తి
ప్రస్తుత తెలుగు బ్లాగుల హోరులో, అత్యంత చురుకయిన గుంపు అయిన తెలుగు బ్లాగర్ల ఆశీస్సులు, అభినందనలతో శోధన వంద బ్లాగు టపాల సంబరం పూర్తి చేసుకుంది..ఇది 101 వ టపా.పార్టీ...అంటున్నారా? డిసెంబర్ తెలుగు బ్లాగర్ల సమావేశానికి రండి, అక్కడే తీసుకోవచ్చు ;-)

సొమ్ములు పోనాయా? మరేం పరవానేదులే

మనకి సొమ్ములన్ని మళ్ళీ వచ్చేత్తాయి. ఎవరికబ్బా అనుకుంటున్నారా? మరెవరికి ? మన బొత్స గారికి..

అవసరంలేని అతి తెలివితో పదకొండు కోట్లు "పోనాయి" అనిపించారు..దానికి బహుమతి ఎంట్రా అంటే...ఈ బహుముఖ ప్రతిభావంతుడి భార్య గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వటం. ఆవిడ గారి అర్హత ఏమిటంటే...పెద్దగా ఏమి లేవు, ఎంతో కొంత కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకోవటమే...ఈ కుటుంబ వారసత్వ దురాక్రమణలు ఎప్పుడు పోతాయిరా బాబు...ఏదైనా ఒక చట్టం వచ్చినా బాగున్ను...ఒక కుటుంబంలో ఒక్క రాజకీయవేత్త మాత్రం ఉండాలని.

 

ఇంతకీ ఆ పదకొండు కోట్లు ఏటయిపోనాయండి? నాకేటీ అర్ధం కాట్లేదు..మీకు తెలిస్తే నాకు కుసింత సెప్త్దురూ...

Tuesday, November 14, 2006

తెలుగులో అపురూప గీతాలు

సీ.ఎన్.ఎన్ ఐ.బి.యన్ వారు ఒక సర్వే చేసి ఆంధ్రులకు అత్యంత ప్రీతి పాత్రమైన ఐదు పాటలను పట్టుకున్నారు.

ఆ పాటలు ఇవి..

 

 •  05 . ఓం నమహా అధర జతులకు (ఇళయరాజా)
 •  04. కుడి ఎడమయితే పొరపాటు లేదోయి (సి.ఆర్ సుబ్రమణ్యం)
 •  03. శివ శంకరీ, శివానందలహరీ (పీ.ఎన్. రావు)
 •  02. శంకరా నాదశరీరాపరా (కె.వి.మహదేవన్)
 •  01. నీవేనా నను పిలచినదీ, నీవేనా నను తలచినది? (జీ.వి. రావు)

నా అరాధ్య సంగీత దర్శకుడు రాజా ఈ పట్టికలో చోటు చేసుకోవటం అంతో ఆనందంగా ఉంది...

కొన్ని ఇళయరాజా వజ్రాలు

 •  జిలిబిలి పలుకులు చిలిపిగ పలికే ఓ మైనా మైనా
 •  వెన్నెల్లో గోదారి అందం
 •  ఆమనీ పాడవే హాయిగా
 •  అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలోచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
 •  ఇలాగే ఇలాగే సరాగమాడితె..వయ్యారం నీ యవ్వనం
 •  మాటే మంత్రమూ మనసే బంధమూ
 • మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా
 • మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
 •  ప్రేమ లేదనీ...ప్రేమించరాదనీ..సాక్ష్యమే నీవనీ
 • సాగర సంగమమే..ప్రణయ....సాగర సంగమమే..
 • తరలి రాద తనే వసంతం
 • వాగర్ధావివ సంప్రుక్తౌ...నాద వినోదము

Saturday, November 11, 2006

అపహాస్యం అంటని నంది అవార్డులు

విచిత్రంగా ఉంది కదా...బురదకు బురద అంటితే ఏమవుతుంది...బురదే అవుతుంది. ఈ సారి కూడా మన నంది అవార్డులు అదే విషయాన్ని నిరూపించాయి. మహేష్ బాబు, సిరివెన్నెల, శ్రీహరి, అనుకోకుండా ఒక రోజు తప్పితే మిగతా అవార్డులన్నీ పోటీ ఎవరూ లేక ఇవ్వలేదనిపిస్తోంది. అసలు ఈ నంది అవార్డు కమిటీలో ఎవరుంటారో, వారి భావ చైతన్యం స్థాయి ఎంత ఉందో అర్ధం కాదు..

నాకు చిరాకు పుట్టిన కొన్ని అవార్డులు...

01. ఉత్తమ కధానాయకి : కుమారి త్రిష (ను.వ.నే.ఒ ?) - ఇందులో త్రిష బాగానే చేసింది కాదనటం లేదు, కానీ అవార్డు స్థాయి మాత్రం అస్సలు లేదు. నా మట్టుకు ఈ అవార్డు ఛార్మికి (అనుకోకుండా ఒక రోజు) దక్కాలి.

02. ఉత్తమ చిత్రం : పోతే పోనీ (ఎప్పుడైనా విన్నారా ఈ పేరు?)...ఇది ఒక భారీ పరాజయం పొందిన చిత్రం...ఇది వారికి ఉత్తమ చిత్రం ఎలా అయిందో మరి. తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రభావం అనుకుంటా...ఎంతైనా నిర్మాతల మండలి అధ్యక్షుడు కదా..

03. ఉత్తమ సంపూర్ణ హాస్య చిత్రం : పెళ్ళాం పిచ్చోడు ...జుగుప్స కలిగించే ఒక కధనంతో చిరాకు పుట్టించే చిత్రం ఇది.

04. ఉత్తమ సహాయక నటి : భానుప్రియ (ఛత్రపతి) : నేను ఈ చిత్రం చూసాను. భానుప్రియ నటన ఎంత కృత్రిమంగా ఉంటుంది అంటే..పావలా ఇస్తే పది రూపాయల నటన చేసినంతగా...

 

తెలుగు చిత్ర పరిశ్రమా నువ్వు బాగుపడవు....హాలీవుడ్ వర్ధిల్లాలి. ఉత్తమ విలువలకు పెట్టింది పేరు హాలీవుడ్ చిత్రాలే...

Thursday, November 09, 2006

ఆడలేక మద్దెల ఓడు

మన చిత్ర నిర్మాతల మండలి పరిస్థితి అలానే ఉంది మరి. ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలక వైపు ఎర్రగా చూసినట్లు...పస లేని సినిమాలు తియ్యలేక, వాటిని ఆడించుకోలేక డబ్బింగు సినిమాల నిషేధం వైపు చూడటం మొదలు పెట్టారు. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఉంటే "అనువాద చిత్రాల నిషేధం పై నిరాహార దీక్ష ద్వారా నిరసన" అని బ్యానర్ లు కనిపించాయి. విచారిస్తే అసలు సంగతి తెలిసింది.

ప్రస్తుతం మన తెలుగు సినిమాల దుస్థితి అందరికీ తెలిసిందే...కోట్లు ఖర్చు పెట్టేసి ఫ్లాపులు మీద ఫ్లాపులు ఇస్తున్న xxxxxxయ్యలు, xxxxxస్టారులతో వ్యాపారం నడుస్తుంది. జనాలు ఏ చిత్రాన్ని ఆదరిస్తున్నారు అనే సమీక్ష లేనే లేదు..ఒక సగటు భారీ నిర్మాత ప్లాన్ ఎలా ఉంటుంది అంటే..ఈ సంవత్సరం నేను ఫలానా అయ్యతోనో, ఫలానా మైక్రో స్టార్ తోనో ఒక సినేమా (నిర్మాతల భాష అట్లనే ఉంటది) తీసెయ్యాల. కాల్షీట్లు దొరికితే అదే పది వేలు...కధ సంగతంటారా? హెచ్.బీ.ఓ ఒక నెల రోజులు చూస్తే పది కధలు తయారౌతాయి కదా? మరి ఇలా తీసిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుడు చూస్తాడా? ఈ మధ్య లాగి పెట్టి తంతున్నారు...అక్కడే చిక్కొచ్చి పడింది. జనాలకు తెలివి పెరిగింది. మునుపటి రోజుల్లో సినిమా తప్ప ఇంకొక వినోదం ఉండేది కాదు, కాబట్టి ఎలాంటి పిచ్చి సినిమా అయినా ఆడేది. ఇప్పుడలా కాదే...రేడియోలు, శాటిలైట్ దూరదర్శినులు, ఇంటర్నెట్ ఒకటేమిటి..సవాలక్ష శత్రువులున్నాయి తెలుగు సినిమాకి...అన్నింటిలోకి అతి పెద్ద శత్రువు మన తెలుగు ప్రసార వాహికలలో వచ్చే ఏడుపుగొట్టు ధారావాహికలు. వీటి మీద నిషేధం విధిస్తే సగం గొడవ తీరుతుంది...ఏ.పి. ట్రాన్స్ కో ఊపిరి పీల్చుకుంటుంది. (సీరియల్ల వలనే 40% అధిక విద్యుత్తు మనం వాడేస్తున్నామని ఒక అంచనా.).

ఇక విషయానికొస్తే...ఈ అనువాద చిత్రాల వలన చిన్న తెలుగు చిత్రాలకు సినిమా హాల్లు దొరకటం లేదట (అని అసలు సినిమాలు తియ్యటమే మానేసిన నిర్మాత తమ్మారెడ్డి గారి ఉవాచ). అందువలన ఏకంగా అనువాద చిత్రాలనే కత్తిరించేద్దామని ప్లాను. మరి అపరిచితుడు, చంద్ర ముఖి లాంటి చిత్రాలు మన తెలుగులో రావటం లేదే...ఇదంతా వదిలేస్తే మన తెలుగు చిత్రాలను ఏకంగా నలభై నకలులతో కర్ణాటకలో విడుదల చేస్తున్నారే...మరి వాళ్ళు ఏమని ఏడవాలి? మొన్న బంగళూరు లో చూసా...ఎక్కడ చూసినా "అతడు", "స్టాలిన్", "బాస్" ఇవే...ఇప్పుడు అనువాద చిత్రాలను నిషేధిస్తే మొత్తం అనువాద యంత్రాంగం మూలన పడతారు. చిన్న సినిమా హాల్లు మూత పడతాయి.

చిన్న చిత్రాలకు హాల్లు దొరకవు అనేది మన చిత్ర పరిశ్రమ చేసుకున్న స్వయంకృతాపరాధం. మన వాళ్ళు హీరో బట్టి అది చిన్నదా, పెద్దదా అని లెక్క కడతారు. చిరంజీవి ఒక డాక్యుమెంటరీ లో నటించినా అది పేద్ద సినిమా హాల్లో విడుదల కావాల్సిందే..అయితే జనాలు మాత్రం ఈ మధ్య సినిమా బాగుంటేనే ఆదరిస్తున్నారు. "అయితే" చిత్రం కేవలం రెండు ప్రింట్లతో ఎక్కడో చిన్న ధియేటర్లో విడుదల అయ్యింది, పది రోజులు గడవక ముందే బ్రహ్మాండమయిన విజయం దిశగా పరుగులు తీసింది..అందరినీ ఊదరగొట్టిన స్టాలిన్, బాస్ అంతంత మాత్రమే ఆడుతున్నాయి...

దీని బట్టి అర్ధమయ్యేదేమిటి?

పస ఉండాలిరా ప్రొడ్యూసురుడా ! పదుగురు మెచ్చిన హీరో ఉన్నా !

Wednesday, November 08, 2006

బంగారు దక్షిణ భారతం -ఆంధ్ర ప్రదేశ్

సీ.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్ వారు దక్షిణ భారత దేశం ఏభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన అన్ని రాష్ట్రాలలో సుపరిచిత వ్యక్తులపై ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఈ లంకె ను అనుసరించండి....

మీ ఎంపిక కూడా నమోదు చెయ్యండి.

Monday, November 06, 2006

నవంబరు రచన పత్రిక : వాహిని ట్రష్టు వారి కానుక

ఈ నెల రచన సంచిక ఒక మంచి కానుక తాలుకా సమాచారంతో వచ్చింది. ఆ పత్రికలో ఉన్నది ఇక్కడ రాస్తున్నా...

1946 నుంచి ఈనాటి దాకా అవిరామంగా తెలుగువారిని తమ అపురూప చిత్రకళా - రచనా రీతులతో అలరిస్తున్న సుప్రసిధ్ధ జంట 'బాపు రమణ'.

శ్రీ బాపుగారు వేసిన బొమ్మల కధలన్నింటిని, ఒక దగ్గర కూర్చి, కొంచెం అటూ ఇటూ 400  పేజిలతో (80  పేజీలు రంగులలో) 1/4 డెమీ సైజులో, అతి చక్కని బైండింగుతో ప్రచురిస్తున్నాము.

 •  దాదాపు 400  పేజీల ఈ 'బొమ్మల కధలు' గ్రంధం ఖరీదు :  495/- మాత్రమే.
 •  15 డిసెంబరు 2006 లోపల ప్రచురణలు ముందే కొనుగోలు చేసే వారికి కేవలం రు.450/- లకే లభ్యం.

ఎలా పొందగలరు?

నగదు/ఎమ్.ఓ/డి.డి/లోకల్ చెక్ (బయటి ఊరి చెక్కులు అంగీకరింపబడవు) ద్వారా "వాహిని బుక్ ట్రష్టు" పేరిట, "హైదరాబాదు" లో చెల్లింపబడే విధంగా రు.450/-  పంపిన వారికి గ్రంధం, ఖర్చులు భరించి రిజిష్టరు పోష్టు ద్వారా, 15.12.2006  తర్వాత జరుగుతుంది. వి.పి.పి పధ్ధతి లేదు.

ఎం.వో లు పంపేటప్పుడు స్ప్రష్టంగా మీ చిరునామా, ఫోన్ నెంబరుతో సహా "స్పేస్ ఫర్ కమ్యూనికేషన్" అని ఉన్న చోట రాయడం తప్పని సరి.

ఇక ఆలస్యం ఎందుకు...ఈ సంచికను మీ మిత్రులకు బహుమతిగా కొని ఇవ్వండి. వారు ప్రత్యేకంగా ఆనందించటం మీరే గమనిస్తారు.

Sunday, November 05, 2006

మౌల్వీ నసీరుద్దీన్ జోకు

నాగ రాజా గారు ఒక మంచి నసీరుద్దీన్ జోకు రాసారు..అది చదివి నాకు మహీధర నళినీ మోహన్ రావ్ గారి మౌల్వీ నసీరుద్దీన్ కధలు చదివిన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. ఈ సందర్చంలో నాకు గుర్తుకొచ్చిన ఒక మౌ.న.క జోకు..

తైమూరు యుధ్ధానికి బయలు దేరాడు. నసీరుద్దీన్ ను కూడా మూటా ముల్లె సర్దుకుని బయలు దేరన్నాడు. అది నసీరుద్దిన్ కు ప్రాణ సంకటం గా తయారయ్యింది.

చివరికి ఒక ముసలి గాడిద సంపాదించి దాని మీద బయలు దెరాడు. అది చూసి తైమూరు నవ్వు అపుకోలేక "నసీరుద్దీన్..గాడిద ఉంది సరే, మరి బాణాలేవి అన్నాడు.."

"శత్రువులు మన పైకి బాణాలు వేస్తారు కదా! అవే తిరిగి వారి మీద ప్రయోగిస్తా! " అన్నాడు నసీరుద్దీన్.

"మరి శత్రువులు బాణాలు వెయ్యకపోతే?" అన్నాడు తైమూరు తెలివిగా..

"దొడ్డ ప్రభువులు, క్షమించాలి..మీకు చెప్పేంతటి వాడిని కాదు...శత్రువులు మన పైకి బాణాలు వెయ్యకపోతే యుద్ధమే ఉండదు కదా..అప్పుడు నాకు బాణాలతో పని ఏముంది?" అన్నాడు నసీరుద్దీన్. smile_confused

తెలుగు అక్షర దశతంత్ర యజ్ఞ్ఙం

ఇది ఒక అద్భుత యజ్ఞ్ఙం. కుక్క పిల్లా, సబ్బు బిల్లా కాదేదీ అక్షరానికి అనర్హం...మెదక్ జిల్లా లో ఈ మంత్రంతో శంఖం పూరించిన విశ్వనాథుల భీమాచారి మాష్టారు అక్షరాలను దిద్దటానికి పలకొక్కటే మార్గం కాదంటున్నారు. ముగ్గులు, దీపాలు, గోవులు, కరడాలు, జంతికలు...ఏవైనా, ఎక్కడైనా, ఏ రూపంలో అయినా మీరు అక్షరాన్ని సృష్టించి పూజించవచ్చునంటున్నారు. దీనినే అక్షర దశ తంత్రం అంటున్నారు.

మెదక్ లో జిల్ల కలెక్టర్ గారి చొరవతో డబ్బై రోజుల తెలుగు అక్షర యజ్ఞ్ఙం (సంక్రాంతి వరకూ) మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అక్షర దీపారాధన, అక్షర దశ తంత్రం మొదలైనవి పాటించనున్నారు.

మన నాయకులు పనికిరాని ప్రాచీన హోదా మాటలు ఆపి, ఇలాంటివి మరిన్ని చేపడితే అదే తెలుగు తల్లికి కనకాభిషేకం...తెలుగు ప్రాచీనమైనది అయినా, తెలుగు తల్లి నిత్య యవ్వన సంపన్నురాలని చాటినట్లు అవుతుంది.

Thursday, November 02, 2006

నేను నష్టపోయాన్రా బాబు..

రామూ చాలా అసహనంగా తిరుగుతూ ఎవరినో తిడుతున్నాడు...

సోము అది చూసి మెల్లగా కారణం అడిగాడు..

మన ఇండియా క్రికెటర్లు చెత్తగా ఆడి మన సొమ్మంతా తినేస్తున్నారు...ఇప్పటికే కోట్లు నష్టం అని మరౌలా తిట్టడం మొదలు పెట్టాడు.

సోము తెల్లబోయి, అది ఎలారా? నువ్వు ఎక్కడైనా సొమ్ము పెట్టుబడి గానీ పెట్టావా వాళ్ళ మీద? అన్నాడు.

లేదు..నేను పెప్సీ, కోక్ తాగుతుంటా అని చెప్పాడు..

ఇంకా తెల్ల బోవటానికి శక్తి లేక, "మరి నీ అలవాటుకి కోట్ల నష్టానికి సంబంధం ఎంట్రా?" అన్నాడు సోమూ అయోమయంగా..

రామూ : నేను కొన్న ప్రతీ కోక్, పెప్సీల మీద ఒక 20 పైసలు ప్రకటనల మీద ఖర్చు అవుతుంది. ఆ 20 పైసలు నేను ఇస్తున్నాను కదా ?. రోజూ మన వంద కోట్ల జనాలలో ఒక 50 లక్షల మంది అయినా ఇవి తాగుతారా?

సోమూ (అయోమయంగా) : అవును ..అయితే ?

రామూ : అంటే రోజుకి అధమం పది లక్షలు...సంవత్సరానికి 36.5 కోట్లు అవునా? మరి ఈ కోట్లన్ని క్రికెటర్లు హూ హా ఇండియా అనడానికి ఖర్చు అవుతున్నాయా లేడా?

సోమూ (కొయ్యబారిన మొహంతో) : అవును..

రామూ : మరి మన డబ్బు తింటున్న వీళ్ళు బాగా ఆడాలా వద్దా? ఆడకపోతే మనం ఒక పెట్టుబడిదారుడిగా తనివి తీరా తిట్టాలా వద్దా?

సోమూ : నిజమే గనీ, నువ్వు అవి తాగటం మానెయ్యొచ్చు కదా? ఎలాగూ పురుగులు కోసమే అవి తయారవుతున్నాయని అన్నారు..

రామూ (చల్లగా) : అందరూ మానేస్తే, మన క్రికెటర్లకు వచ్చిన డబ్బులు కూడా రావు, ఈ ఆట కూడా ఆడరు. అందువల్ల ఒక నిజమైన భారతీయ క్రికెట్ ఫ్యాన్ గా వారి కోసం నేను ఈ సాఫ్టు డ్రింకులు తాగుతున్నా...అని ఒక డ్రింకు ఎత్తి గట గటా తాగి..హూ హా ఇండియా..ఆయా ఇండియా అని గాఠ్ఠిగా అరిచాడు...

సోమూ : ^%$%*&^*&^%$^%$##$

అంకితం : ఈ జోకు మన భారత క్రికెటర్లలో అత్యధిక పారితోషికం తీసుకునే ఒక అద్భుత ఆటగాడికి..

నల్ల రాజకీయాలు

 • కేసీయార్ నల్ల రాజకీయాలు శ్రుతి మించి పాకాన పడ్డాయి...త్యాగాలు, ప్రాణాలు బలిగొన్న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నల్ల దినంగా పాటించమనటం ఒక దుస్సాహసం. పోతే ఆ సందర్భంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా మాట్లాడే తెలుగు మీద, తెలుగు తల్లి అనే భావన మీద దాడి మరీ నీచం . మరి ఈ వికారపు ఆలోచనలు ఎవరికి వస్తున్నాయో తెరాసలోని మేధావులమని చెప్పుకునే వారినే అడగాలి. ఇలాంటి వెధవలు రేపు హైదరాబాదు, కాశ్మీరు పాకిస్తాన్ కు చెందుతాయని వాదించే సందర్భం రావచ్చు. ఈ బాషా విద్రోహం ఎవరు క్షమిస్తారు? వీరసలు తెలంగాణా ప్రాంత ప్రజలు మాట్లాడే బాష ఏ బాష అనుకుంటున్నారు?
 • ఈ రోజు బంద్ అంట. కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమే బంద్ జరిగిందని ప్రసారవాహికలు చెప్తుంటే, తెరాసా మాత్రం బంద్ సంపూర్ణం అంటోంది smile_sarcastic. ప్రసార వాహికలలో చూపించిన ప్రకారం...పాఠశాలలోనికి దౌర్జన్యంగా ప్రవేశించి విద్యార్ధులను బలవంతంగా పంపటం, బస్సుల టైర్లలోని గాలి తియ్యటం, రైల్లను ఆపివేయటం, దుకాణాలు మూసివేయించటం...ఏమిటివి? దీన్ని సంపూర్ణ బంద్ అని ఎలా అంటారో వారికే తెలియాలి..అల్లరి మూకల్ని వెంటేసుకుని దేనినయినా ఆపవచ్చు. కాని అది ఎంత మందిని ఇబ్బందికి గురి చేస్తుందో తెలుసుకోవటం మంచిది...మీరు మీ వీ.ఐ.పి వాహనాలలో వస్తే మేమందరం గంటలు ఆగి మరి దారి ఇస్తున్నామే? మరి మీరు మా జీవిత గమనాన్ని ఎందుకు స్థంభింప చేస్తారు? smile_angry
 • తెలుగు దేశం, కాంగ్రెస్ పిచ్చోల్లందరూ మూగ ప్రాణాల మీద పడ్డారు. వాటిని పేర్లు పెట్టి, కొడుతూ  రోడ్ల మీద తిప్పటం...ఎంత సిగ్గు మాలిన పని? పార్టీ పెద్దోల్లు మొట్టి కాయలు వేస్తే గాని ఆగడాలు ఆపలేదు...దేవుడా ఎందుకు ఈ సృష్టిలో ఈ నీచ రాజకీయ జాతిని పుట్టించావు? లోక్ సత్తా ఏమి చేస్తుందో చూడాలి మరి.

Wednesday, November 01, 2006

గురజాడ పై గుర్రు...రెండవ భాగం

ముందర దీనిని చదవండి : గురజాడపై గుర్రు....

ఇప్పుడు నేను దీనిని రెండవ భాగం అని ఎందుకు అన్నానంటే, ఎక్కడైయితే ఈ గురజాడ పై యుధ్ధం మొదలయిందో అక్కడ ఇంకా జనాలు కొట్టుకుంటున్నారు కాబట్టి...:-)


ఆంధ్రభూమి సాహితి నాకు బాగా నచ్చింది...నాణేనికి రెండు వైపులా అది ప్రచురిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఒకే సంచికలో ఒకరు తిట్టారు...ఒకరు పొగిడారు...ఏది ఏమైనా, ఇలాంటి సాహితి సాంఘిక రచ్చలు భలే ఉంటాయి.


... గురజాడ మహా రచయతా కాదా అనేది ముఖ్యం కాదు..అతను ఒక రచయతగా తన బాధ్యత నెరవేర్చాడా లేదా అనేదే ముఖ్యం. అలా చూస్తే గురజాడ తప్పని సరిగా ఒక అద్భుతమైన రచయత. రచయత కలంతో దాడి చేస్తాడ. గురజాడ యుగ పురుషుడా? అని ఒకరి డౌటూ...!

 ఇక యుగ పురుషులు అంటారా? యుగస్త్రీ అనే పదమే లేని కాలంలో పుట్టిన పదం "యుగ పురుషుడు"....నా వరకు ఆ పదం ఒట్టి మిథ్య. రాజులను పొగడటానికి వంధి మాగధులు సృష్టించిన వందల పదాలలో అది ఒకటి.

 

సమాజం ఒక ఈగలు మూగిన బెల్లం లాంటిది. ఒకరిద్దరు వాటిని తరిమినా అవి మూగక మానవు. సమాజానికి పట్టిన జాడ్యం కూడా అంతే. తెలుగు తల్లి ఎవరు? అని ప్రశ్నించే మహా మాయగాల్లు ఉన్న సంఘంలో ఎవరు ఎవరి చరిత్రను ఎలా అయినా చూపించవచ్చు....వీరప్పన్ భార్య ఎమ్.పి కావచ్చు...అఫ్జల్ గురు కాశ్మీరు సీ.ఎమ్ కావచ్చు.

 

ఆంధ్ర భూమి ప్రతీ సాహితీ సంచిక, ముందరి సంచికను తీసివేసి పెట్టబడుతుంది, అందువలన నేను వీటిని ఫ్లికర్ లో పెట్టా..

sahi1

sahi2

sahi3

sahi4

 

sahi14sahi15sahi16

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name