Thursday, November 09, 2006

ఆడలేక మద్దెల ఓడు

మన చిత్ర నిర్మాతల మండలి పరిస్థితి అలానే ఉంది మరి. ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలక వైపు ఎర్రగా చూసినట్లు...పస లేని సినిమాలు తియ్యలేక, వాటిని ఆడించుకోలేక డబ్బింగు సినిమాల నిషేధం వైపు చూడటం మొదలు పెట్టారు. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఉంటే "అనువాద చిత్రాల నిషేధం పై నిరాహార దీక్ష ద్వారా నిరసన" అని బ్యానర్ లు కనిపించాయి. విచారిస్తే అసలు సంగతి తెలిసింది.

ప్రస్తుతం మన తెలుగు సినిమాల దుస్థితి అందరికీ తెలిసిందే...కోట్లు ఖర్చు పెట్టేసి ఫ్లాపులు మీద ఫ్లాపులు ఇస్తున్న xxxxxxయ్యలు, xxxxxస్టారులతో వ్యాపారం నడుస్తుంది. జనాలు ఏ చిత్రాన్ని ఆదరిస్తున్నారు అనే సమీక్ష లేనే లేదు..ఒక సగటు భారీ నిర్మాత ప్లాన్ ఎలా ఉంటుంది అంటే..ఈ సంవత్సరం నేను ఫలానా అయ్యతోనో, ఫలానా మైక్రో స్టార్ తోనో ఒక సినేమా (నిర్మాతల భాష అట్లనే ఉంటది) తీసెయ్యాల. కాల్షీట్లు దొరికితే అదే పది వేలు...కధ సంగతంటారా? హెచ్.బీ.ఓ ఒక నెల రోజులు చూస్తే పది కధలు తయారౌతాయి కదా? మరి ఇలా తీసిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుడు చూస్తాడా? ఈ మధ్య లాగి పెట్టి తంతున్నారు...అక్కడే చిక్కొచ్చి పడింది. జనాలకు తెలివి పెరిగింది. మునుపటి రోజుల్లో సినిమా తప్ప ఇంకొక వినోదం ఉండేది కాదు, కాబట్టి ఎలాంటి పిచ్చి సినిమా అయినా ఆడేది. ఇప్పుడలా కాదే...రేడియోలు, శాటిలైట్ దూరదర్శినులు, ఇంటర్నెట్ ఒకటేమిటి..సవాలక్ష శత్రువులున్నాయి తెలుగు సినిమాకి...అన్నింటిలోకి అతి పెద్ద శత్రువు మన తెలుగు ప్రసార వాహికలలో వచ్చే ఏడుపుగొట్టు ధారావాహికలు. వీటి మీద నిషేధం విధిస్తే సగం గొడవ తీరుతుంది...ఏ.పి. ట్రాన్స్ కో ఊపిరి పీల్చుకుంటుంది. (సీరియల్ల వలనే 40% అధిక విద్యుత్తు మనం వాడేస్తున్నామని ఒక అంచనా.).

ఇక విషయానికొస్తే...ఈ అనువాద చిత్రాల వలన చిన్న తెలుగు చిత్రాలకు సినిమా హాల్లు దొరకటం లేదట (అని అసలు సినిమాలు తియ్యటమే మానేసిన నిర్మాత తమ్మారెడ్డి గారి ఉవాచ). అందువలన ఏకంగా అనువాద చిత్రాలనే కత్తిరించేద్దామని ప్లాను. మరి అపరిచితుడు, చంద్ర ముఖి లాంటి చిత్రాలు మన తెలుగులో రావటం లేదే...ఇదంతా వదిలేస్తే మన తెలుగు చిత్రాలను ఏకంగా నలభై నకలులతో కర్ణాటకలో విడుదల చేస్తున్నారే...మరి వాళ్ళు ఏమని ఏడవాలి? మొన్న బంగళూరు లో చూసా...ఎక్కడ చూసినా "అతడు", "స్టాలిన్", "బాస్" ఇవే...ఇప్పుడు అనువాద చిత్రాలను నిషేధిస్తే మొత్తం అనువాద యంత్రాంగం మూలన పడతారు. చిన్న సినిమా హాల్లు మూత పడతాయి.

చిన్న చిత్రాలకు హాల్లు దొరకవు అనేది మన చిత్ర పరిశ్రమ చేసుకున్న స్వయంకృతాపరాధం. మన వాళ్ళు హీరో బట్టి అది చిన్నదా, పెద్దదా అని లెక్క కడతారు. చిరంజీవి ఒక డాక్యుమెంటరీ లో నటించినా అది పేద్ద సినిమా హాల్లో విడుదల కావాల్సిందే..అయితే జనాలు మాత్రం ఈ మధ్య సినిమా బాగుంటేనే ఆదరిస్తున్నారు. "అయితే" చిత్రం కేవలం రెండు ప్రింట్లతో ఎక్కడో చిన్న ధియేటర్లో విడుదల అయ్యింది, పది రోజులు గడవక ముందే బ్రహ్మాండమయిన విజయం దిశగా పరుగులు తీసింది..అందరినీ ఊదరగొట్టిన స్టాలిన్, బాస్ అంతంత మాత్రమే ఆడుతున్నాయి...

దీని బట్టి అర్ధమయ్యేదేమిటి?

పస ఉండాలిరా ప్రొడ్యూసురుడా ! పదుగురు మెచ్చిన హీరో ఉన్నా !

2 comments:

రానారె said...

ఎద్దు తోక తొక్కితే పిల్లి ఎలక వైపు ఎర్రగా చూసినట్లు..
ప్రొడ్యూసురుడా... (బకాసురుడా, రావణాసురుడా)భలే.
మీరన్నట్లు సరైన అభిరుచిలేని నిర్మాత అసురుడే. నాగిరెడ్డి-చక్రపాణి లాంటి సురలు నిర్మించిన ప్రతిసినిమా ఇప్పటికీ ఎప్పటికీ నిలిచివుంటుంది.

Anonymous said...

మా బాగా చెప్పారు. ఒకప్పుడు కన్నడిగులు ఇట్లాంటి తీర్మానమే చేస్తే ఇదే మనవాళ్ళు వాళ్ళతో తగువేసుకున్నారు. పరభాషా సినిమాలు విడుదల చెయ్యరాదనేది అప్పటి వాళ్ళ గోడు, పాపం. ఇప్పుడు వీళ్ళది మరీ దారుణం.. డబ్బింగులు కూడదట! వీళ్ళు మంచి సినిమాలు తీస్తే ఆ డబ్బింగు గోల చూడాల్సిన ఖర్మ మనకేంటి?

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name