Friday, December 28, 2007

గూగులు తెలుగు

గూగుల్ భారతీయ భాషలపై చాలా సీరియస్ గానే దృష్టి పెట్టింది. భారతీయ మార్కెట్ ను సొమ్ము చేసుకోవాలంటే వారి భాషలోనే ప్రయత్నించాలనే ప్రధమ సూత్రాన్ని తొందరగా వంటపట్టించుకుంది. మన దేశంలో పిచ్చి పిచ్చిగా కుర్ర జనం వాడే ఓర్కుట్ తోనే అది శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఓర్కుట్లో హాయిగా తెలుగులో స్క్రాప్ లు రాసుకోవచ్చు. దీనికి RTS రానక్కరలేదు. తెలుగును ఆంగ్లంలో రాసుకుంటూ పోవడమే.

orkut_telugu

ఇప్పుడు మూలనున్న ముసలమ్మలు కూడ ఓర్కుట్లోకి దూకుతారనడంలో ఆశ్చర్యం లేదు.

Thursday, December 27, 2007

మానవత్వం మతంతో మరో సారి ఓడింది

పోయిన చోటే వెతుక్కోమని ఎవడు చెప్పాడో గానీ, అది పాకిస్తాన్ లాంటి మతమౌఢ్యపు నాయకులున్న రాజ్యంలో పనికి రాదని తెలుసుకోవాలి. తివిరి ఇనుమున తైలమ్ము తీయవచ్చేమో గానీ ఈ దేశంలో మాత్రం ప్రజాస్వామ్యం ఒక్క చుక్క కూడా పిండలేం.

ముదనష్టపు బుష్షు గాడు ఏమంటాడో మరి. వాడికసలే జనరల్ బుషారఫ్ అంటే తెగ మోజు.

Wednesday, December 26, 2007

మరిచిపోయిన మధురగీతం

ఎందుకో గానీ ఈ మధుర గీతం చాలా మందికి తెలియదు. గానీ ఈ పాట నేను సంవత్సరానికి ఒక్క సారైనా విని తీరుతాను. ఎమ్.యస్ రామారావు గారి అతి మధురమైన, అదో రకమైన మత్తుతో వుండే గొంతుతో పాడిన లాలి పాటలా వుండే ఈ పాట మీరూ వినండి మరి.

చిమట సంగీత ప్రపంచపు లంకెలో చివరి పాటను వినండి.

ఈ పాటకు మధురమైన సంగీతాన్ని ఓపీ నయ్యర్ జీ అందించారు.

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో...

నిదురించు జహాపనా -  ||

పండు వెన్నెల్లో వెండి కొండల్లే

తాజ్ మహల్ ధవళా కాంతుల్లో ||

నిదురించు జహాపనా - ౨

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

నీ జీవిత జ్యోతీ నీ మధుర మూర్తి - ౨

ముంతాజ్ సతీ సమాధి

సమీపాన నిదురించు - ౨

జహాపనా...

ఈ విశాల…ప్రశాంత …ఏకాంత సౌధంలో

నిదురించు జహాపనా -  ||

Monday, December 17, 2007

వింటర్ విస్టా : ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన కూర

ఇక్కడ రాస్తున్న కూర చాలా జాగ్రత్తగా చెయ్యాల్సిన కూర. ఒక విప్లవాత్మకమైన కూర. చెయ్యటానికి విశాల దృక్ఫదం వుండాలి. ముఖ్యంగా సహనం వుండాలి. ఇది నేను సొంతంగా తయారుచేసిన, పేరు పెట్టిన కూర. తయారు చేసి మీ తిట్లు వ్యాఖ్యలుగా రాయవచ్చు. కూర మొత్తం చేసాక ఈ కూరకు ఈ పేరు ఎందుకు పెట్టానో అర్ధం అవుతుంది. ఇది చాలా తక్కువ కాలరీలు కలిగే ఆరోగ్యకరమైన కూర.

కావలసిన దినుసులు

ఎర్రని కారట్ దుంపలు - నాలుగు

ఉల్లిపాయలు - రెండు

కాలీ పువ్వు రెమ్మలు - పది

పచ్చ్ఝ బఠానీలు - వంద గ్రాములు

గుడ్లు - రెండు

బంగాళా దుంప - ఒకటి (చిన్నది)

కార్న్ పిండి - వంద గ్రాములు

టొమేటోలు - మూడు (పెద్దవి, బాగా పండినవి)

పచ్చి మిరప - ఐదు కాయలు

ఆలివ్ ఆయిల్ - ఒక టీ స్పూన్

కార్న్ ఆయిల్ - మూడు టీ స్పూనులు

జీలకర్ర - ఒక స్పూను

మిరియాలు - పది

ముందుగా గుడ్లు, బంగాళా దుంప బాగా ఉడకబెట్టి పక్కన పెట్టాలి. గుడ్లు ఒలిచి మధ్యలో వుండే పచ్చని భాగాన్ని తీసుకుని, తొక్క తీసిన బంగాళాదుంపతో కలపి మిక్సీలో వేసి బాగా ముద్దగా చేసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి.

పచ్చ బఠానీలు, కాలీ పువ్వు రెమ్మలు, క్యారట్లు, జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయలు (ముక్కలు కావు) కలిపి కుక్కర్లో వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి, రెండు కప్పుల నీరు పోసి మూత పెట్టి మూడు కూతలు వచ్చే వరకూ వుంచి దింపెయ్యాలి.

కొంత సేపయ్యాక కుక్కరు మూత తీసి కూరగాయల నీటిని ఒక పాత్రలో సేకరించాలి.ఈ నీరు చాలా ముఖ్యం.

ఉడికిన కూరగాయలు పక్కన పెట్టి, ఉడికిన క్యారట్లు తీసుకుని నిలువుగా చీల్చాలి. ఇలా చీల్చిన వాటిని కార్న్ ప్లోర్, జీలకర్ర పొడి కలపిన ద్రావకంలో ముంచి నూనెలో బాగా వేపి ప్రక్కన పెట్టుకోవాలి.

ఒక బాణలి తీసుకుని కొద్దిగా కార్న్ నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేసి పోపు వెయ్యాలి.

దానిలో ఉడికిన కూరగాయలన్నీ వేసి బాగా కలిపి కొద్దిగా మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వటం మొదలుపెట్టాలి.

పక్కన పెట్టుకున్న కూరగాయల నీటిలో గుడ్ల, బంగాళా దుంపల పేస్టుని కలిపి బాగా బీట్ చెయ్యాలి. దీనిలో కొద్దిగా కార్న్ పిండిని కొద్దిగా కలుపుకోవచ్చు.

ఇప్పుడు ఉడుకుతున్న కూరలో, మెల్లగా ఈ నీటిని కలిపి బాగా కలిపి అలానే ఒక పదిహేను నిమిషాలు ఉడకపెట్టి (ఉప్పు తగినంత కలిపి) బాగా కూర చిక్కబడిన తరువాత దింపాలి.

ఇప్పుడు దానిపై బాగా తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వింటర్ విస్టా కర్రీ రెడీ.

మీ విజిటింగ్ కార్డుపై అందమైన క్యాలండరు

మనం చాలా మంది విజిటింగ్ కార్డులు అచ్చు వేయిస్తుంటాం. కానీ మనం ఇచ్చిన ముక్కలు వెనక్కి తిరిగేలోపు పర్సులో ఓ మూలకు పోతాయి. అలా కాకుండా సంవత్సరమంతా మన ముక్కనే మరీ మరీ వాడుకునే విధంగా చెయ్యాలంటే క్రింద చూపిన విధంగా ఒక అందమైన క్యాలండరు వెనుక ముద్రిస్తే సరి :-)ఇక దీనిని వాడటం చాలా సులువు. ఏ నెల చూడాలో అది మాత్రమే కనిపించేటట్లు ఈ కార్డుని వేళ్ళతో పట్టుకుంటే సరి.


మీకు ఇంకా మిగతా సైజులు కావాలంటే ఇక్కడి నుంచి తెచ్చుకోండి.

ThumbCalendar

Sunday, December 09, 2007

ఏమిటీ చిరు భజన?

ఎవరేమనుకున్నా మన ఆంధ్రులకు ఒక చెత్త గుణం వుంది. అదేమిటంటే మాస్ హిస్టీరియా గుణం. ఎవడో ఏదో మొదలుపెట్టడం, దానికి అసలు ఆలోచనే లేకుండా చెక్క భజన గుడ్డిగా చెయ్యటం మనకు మామూలయ్యింది. దీనికి తోడుగా ఇప్పటి పార్టీలు కూడా తయారయ్యాయి. ఇది చాలా ప్రమాదకరం.

టాటా టీ వారి ఒక ప్రకటన ఇప్పుడు వస్తూ వుంది. అందులో వోట్లు అడగటానికి వచ్చిన రాజకీయ నాయకుడికి టీ తాగమని చెప్పి అతని పరిపాలనా దక్షత గురించి ఒక యువకుడు అడుగుతాడు. దానికి ఆ నాయకుడు హేళనగా నవ్వి నన్ను ఇంటర్వూ చేస్తున్నావా? ఏ ఉద్యోగానికి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడి ఈ దేశాన్ని పాలించే ఉద్యోగం అని కళ్ళు తెరుచుకునే సమాధానం ఇస్తాడు. అవును ఈ దేశంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత దక్షత కావాల్సిన ఉద్యోగం "నాయకుడు". ఈ నిజం జనాలు మరిచిపోయే విధంగా మన నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తూ వుంటారు. ఆ నిజం మన దేశ పౌరుల నరనరాల జీర్ణించుకున్న మరుక్షణం దేశం బాగు పడటం మొదలవుతుంది.

చిరంజీవి తెలుగు ప్రజలు గర్వించే నటుడిగా అందరికి తెలుసు. నాకు చాలా నచ్చే నటులలో చిరు ఒకరు. ఒక మనిషిగా కూడా. అయితే అవి సినిమాలకే పరిమితం. అతని ప్రమేయం లేకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిరు భజన ఏమిటో అర్ధం కావటం లేదు. స్వతహాగా చిరంజీవిలో నాకు నాయకత్వ లక్షణాలు అంతగా కనిపించవు. చాలా సున్నిత మనస్కుడుగా అనిపిస్తాడు. అది చాలా విషయాలలో బాహాటంగా తెలిసిన విషయమే. అయితే ఒక మంచి మనిషిగా చిరంజీవి చాలా పనులు చెయ్యటం అనేది కేవలం అతని వ్యక్తిగత స్వభావం, నిర్ణయము మాత్రమే అని తీసుకోకుండా దానిని రాజకీయం చెయ్యటం మన రాష్ట్రానికే చెల్లింది. నిజానికి మన దేశంలో, రాష్ట్రంలో ఇంతకంటే చాలా ఎక్కువ మంచి సేవలు చేసేవారెందరో వున్నారు. వారెవ్వరికీ ఈ గుర్తింపులు, పద్మ భూషణ్ లు అవసరం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి కూడా ఈ గుర్తింపుల కోసం చేస్తున్నారనిపించదు. మరి ఈ హడావిడికి కారణమెవ్వరు?

నిజానికి ఈ హడావిడి చిరంజీవి అభిమానుల పేరు మీద జరుగుతున్నా, దీని వెనుక ఒక బలమైన కుల వర్గం వుంది. చిరంజీవి ఇప్పుడున్న మేరు నగ స్థానానికి కారణం కులం కాదు. కానీ అతని జీవితంలో తరువాయి అంకంలో రాబోయే అన్ని మచ్చలకూ అదే కారణం అవుతుంది. ఈ బెల్లం చుట్టూ మూగిన ఈగల గోల కూడా దాని వల్లనే. అది అలా వదిలేస్తే, కేవలం సినిమాలు, కొన్ని ఛారిటీ పనులు చేసినంత మాత్రాన వచ్చిన ఫేమ్ ను పరిపాలానాధికారాలు సాధించడానికి వాడుకోవటం విజ్ఞత కూడా కాదు. మొదట ఈ ప్రభుత్వాల మీద, పరిపాలన మీద తనకున్న ఆలోచనలను ప్రజలతో ప్రస్పుటంగా పంచుకోవాలి. అందులో ఒక విజన్ వుండాలి. అవి వుంటే ఎవరూ చిరంజీవి రాజకీయ ప్రవేశం మీద లేశమాత్రమైనా వ్యాఖ్యలు చెయ్యరు.

ఇప్పుడున్న రాజకీయనాయకులకు వోటు ఎందుకు వెయ్యకూడదు అనుకుంటే సవాలక్ష కారణాలు వరసగా చెప్పుకుపోవచ్చు. అందుకే నేనిప్పటి వరకూ వోటు వెయ్యలేదు. పొరపాటున కూడా నా వోటు హక్కు కోసం నేను ఒక వెధవ నాయకుడికి వోటు వెయ్యనుగాక వెయ్యను.

నేను చిరుకు ఓటు వెయ్యాలంటే, వేస్తా…నా మట్టుకు అతని వెయ్యకపోవటానికి ఏ కారణాలూ లేవు. కానీ ఎందుకు వెయ్యాలి అని ఆలోచిస్తే నాకు మనస్సులో అంతా ఖాళీగా వుండకూడదు. అప్పుడే మనస్పూర్తిగా వోటు వెయ్యగలుగుతా. లేక పోతే నా వోటు ఒక వంద రోజుల సినిమా టికెట్ట్లుకు సమానం. సినిమా అయిపోయాకా దానికి ఏ మాత్రం విలువుండదు.

Saturday, December 08, 2007

చెన్నయ్ సూపర్ స్టార్ర్సు....!

ఐసియల్ ప్రకటనలు చాలా సృజనాత్మకంగా భలే వున్నాయి. మచ్చుకి ఇది చూడండి. :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name