Sunday, December 09, 2007

ఏమిటీ చిరు భజన?

ఎవరేమనుకున్నా మన ఆంధ్రులకు ఒక చెత్త గుణం వుంది. అదేమిటంటే మాస్ హిస్టీరియా గుణం. ఎవడో ఏదో మొదలుపెట్టడం, దానికి అసలు ఆలోచనే లేకుండా చెక్క భజన గుడ్డిగా చెయ్యటం మనకు మామూలయ్యింది. దీనికి తోడుగా ఇప్పటి పార్టీలు కూడా తయారయ్యాయి. ఇది చాలా ప్రమాదకరం.

టాటా టీ వారి ఒక ప్రకటన ఇప్పుడు వస్తూ వుంది. అందులో వోట్లు అడగటానికి వచ్చిన రాజకీయ నాయకుడికి టీ తాగమని చెప్పి అతని పరిపాలనా దక్షత గురించి ఒక యువకుడు అడుగుతాడు. దానికి ఆ నాయకుడు హేళనగా నవ్వి నన్ను ఇంటర్వూ చేస్తున్నావా? ఏ ఉద్యోగానికి అని అడుగుతాడు. దానికి ఆ యువకుడి ఈ దేశాన్ని పాలించే ఉద్యోగం అని కళ్ళు తెరుచుకునే సమాధానం ఇస్తాడు. అవును ఈ దేశంలో అత్యంత క్లిష్టమైన, అత్యంత దక్షత కావాల్సిన ఉద్యోగం "నాయకుడు". ఈ నిజం జనాలు మరిచిపోయే విధంగా మన నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తూ వుంటారు. ఆ నిజం మన దేశ పౌరుల నరనరాల జీర్ణించుకున్న మరుక్షణం దేశం బాగు పడటం మొదలవుతుంది.

చిరంజీవి తెలుగు ప్రజలు గర్వించే నటుడిగా అందరికి తెలుసు. నాకు చాలా నచ్చే నటులలో చిరు ఒకరు. ఒక మనిషిగా కూడా. అయితే అవి సినిమాలకే పరిమితం. అతని ప్రమేయం లేకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిరు భజన ఏమిటో అర్ధం కావటం లేదు. స్వతహాగా చిరంజీవిలో నాకు నాయకత్వ లక్షణాలు అంతగా కనిపించవు. చాలా సున్నిత మనస్కుడుగా అనిపిస్తాడు. అది చాలా విషయాలలో బాహాటంగా తెలిసిన విషయమే. అయితే ఒక మంచి మనిషిగా చిరంజీవి చాలా పనులు చెయ్యటం అనేది కేవలం అతని వ్యక్తిగత స్వభావం, నిర్ణయము మాత్రమే అని తీసుకోకుండా దానిని రాజకీయం చెయ్యటం మన రాష్ట్రానికే చెల్లింది. నిజానికి మన దేశంలో, రాష్ట్రంలో ఇంతకంటే చాలా ఎక్కువ మంచి సేవలు చేసేవారెందరో వున్నారు. వారెవ్వరికీ ఈ గుర్తింపులు, పద్మ భూషణ్ లు అవసరం లేదు. ఆ మాటకొస్తే చిరంజీవి కూడా ఈ గుర్తింపుల కోసం చేస్తున్నారనిపించదు. మరి ఈ హడావిడికి కారణమెవ్వరు?

నిజానికి ఈ హడావిడి చిరంజీవి అభిమానుల పేరు మీద జరుగుతున్నా, దీని వెనుక ఒక బలమైన కుల వర్గం వుంది. చిరంజీవి ఇప్పుడున్న మేరు నగ స్థానానికి కారణం కులం కాదు. కానీ అతని జీవితంలో తరువాయి అంకంలో రాబోయే అన్ని మచ్చలకూ అదే కారణం అవుతుంది. ఈ బెల్లం చుట్టూ మూగిన ఈగల గోల కూడా దాని వల్లనే. అది అలా వదిలేస్తే, కేవలం సినిమాలు, కొన్ని ఛారిటీ పనులు చేసినంత మాత్రాన వచ్చిన ఫేమ్ ను పరిపాలానాధికారాలు సాధించడానికి వాడుకోవటం విజ్ఞత కూడా కాదు. మొదట ఈ ప్రభుత్వాల మీద, పరిపాలన మీద తనకున్న ఆలోచనలను ప్రజలతో ప్రస్పుటంగా పంచుకోవాలి. అందులో ఒక విజన్ వుండాలి. అవి వుంటే ఎవరూ చిరంజీవి రాజకీయ ప్రవేశం మీద లేశమాత్రమైనా వ్యాఖ్యలు చెయ్యరు.

ఇప్పుడున్న రాజకీయనాయకులకు వోటు ఎందుకు వెయ్యకూడదు అనుకుంటే సవాలక్ష కారణాలు వరసగా చెప్పుకుపోవచ్చు. అందుకే నేనిప్పటి వరకూ వోటు వెయ్యలేదు. పొరపాటున కూడా నా వోటు హక్కు కోసం నేను ఒక వెధవ నాయకుడికి వోటు వెయ్యనుగాక వెయ్యను.

నేను చిరుకు ఓటు వెయ్యాలంటే, వేస్తా…నా మట్టుకు అతని వెయ్యకపోవటానికి ఏ కారణాలూ లేవు. కానీ ఎందుకు వెయ్యాలి అని ఆలోచిస్తే నాకు మనస్సులో అంతా ఖాళీగా వుండకూడదు. అప్పుడే మనస్పూర్తిగా వోటు వెయ్యగలుగుతా. లేక పోతే నా వోటు ఒక వంద రోజుల సినిమా టికెట్ట్లుకు సమానం. సినిమా అయిపోయాకా దానికి ఏ మాత్రం విలువుండదు.

16 comments:

దీపు said...

మంచి విశ్లేషణ సుధాకర్ గారు... నా మటుకు నేను మీతో ఏకీభవిస్తాను... ఈ విషయమై ఇప్పటి పరిస్థితుల్లొ రాయడానికి ప్రయత్నించడం తల నొప్పికి, కొంత సేపైనా ప్రశాంతలేమికి తట్టుకొడానికి సిద్ధంగానే ఉన్నారని భావిస్తున్నాను... మీరు ఈ అంశాన్ని ఎందుకు బ్లాగులో పెట్టానా అని కూడా అనుకోవచ్చు... నేను ఇప్పటికి జీర్ణించుకోలేను మనం ఏ కాలం లో ఉన్నాము అని.. ఏంటి ఇలా జనం అని! ఒక పక్క జయప్రకాష్ నారాయణ అనుభవంతో రాజకీయాన్ని పారదర్శకం చేయాలన్న మంచి ఆలొచనతో, ఎలా చెయ్యాలన్న మార్గదర్శకాలతో కూడా ముందుకు వెళ్తుంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహించకుండ...! నిజంగా వాళ్ళు ప్రత్యామ్నాయం కోరుకుంటే లోక్ సత్తా కన్నా మంచి ప్రత్యామ్నాయం ఎవరు ఉండగలరు? వాళ్ళ ప్రయత్నం మన రాష్ట్రంలో మొదలు పెట్టడం మనం గర్వంగా భావించాలి... వాళ్ళకి సహకరించాలి...

చిరంజీవి అందరి అభిమానులు అతను రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు అన్నది నిజం.. ఆంధ్ర ప్రదేశ్లో అందరు చిరంజీవి అభిమానులూ కాదు.. సినెమా హాల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి మూడు ఘంటలు వినోదాన్ని మాత్రమే అతని సినెమ నుండి ఆశిస్తారు... అంత కన్నా వాళ్ళకి ఆలోచన ఉండదు...
అభిమానుల పేరుతో ఎవరు ముందుండి నడిపిస్తున్నారో కూదా అందరికి విదితమే...
మొన్న పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి భారీ ప్రదర్శనలు జరిగిన ప్రదేశాలు చూసినా ప్రజలందరికి ఇట్టే అర్ధం అయిపోతుంది...

Chikka said...

As usual fantastic post sudhakar

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

సుధాకర్ గారూ,
మీ అభిప్రాయలని ఖండిచటం కాదు గానీ,ఆధునిక పాలనావ్యవస్థల్లో కొద్దిపాటి మెరుగయ్యింది ప్రజాస్వామ్యం.ప్రజల కోసం,ప్రజలచే....అనే నిర్వచనంతో పాటు ఎవ్రిబడి హాజ్ ఏ సే అనే మరో సూత్రీకరణ కూడా ఉంది.వోటు వేయకపోవటం,ఉన్న రాజకీయనాయకులను ఈసడించుకోవటం ఏవిధంగా మనహక్కులని భావిస్తున్నామో మనం వోటు ఎందుకు వేయకూడదూ, మంచి రాజకీయనాయకులుగా మనం ఎందుకు కాకూడదూ కనీసం మంచి వారిని ఎందుకు ప్రొత్శహించకూడదూ అనుకోవాలేమో,మంచి వారే లేరనుకున్నప్పుడు మౌనంగా ఉండిపోవటం మాత్రం సంస్యకు పరిష్కరం అవుతుందంటారా?
చిరంజీవి వెనుక అతని కులం వారే ఉన్నారనుకొవటంకూడా సరికాదని నా భావం. పాతికేళ్ళ అతని సినీజీవితంలో తన కులం వారితో చిరంజీవి బంధాలు,అనుబంధాలు ఎవరితోనో అనేది సామాన్య ప్రేక్షకుడికి కూడా తెలిసిన విషయం.

అలాగే వర్తమాన సమాజంలో మీడియ పోకడలను అధ్యనం చేసే వారికి సెలెబ్రిటీస్ ముఖ్యంగా సినీరంగానికి చెందినవారి మీద ఎంత పరాన్నభుక్కులుగా బతుకుతున్నాయో,ఒక నాన్ ఈవెంటును కూడా సంచలనంగా ఎలా మలుస్తున్నాయో పెద్ద లోతుగా చూడకుండానే,స్పష్టంగా, నగ్నంగా కనిపిస్తున్నాయి.

@దీపు గారు,రేపు లోక్ సత్తా మీ రాజకీయ,పరిపాలనా పరమయిన ఉద్దెశాలను నెరవేరిస్తే మంచిమాటే,విఫలమయితే?మంచికో చెడ్డకో కాంగ్రెస్,టిడిపీ లకు ఒక మాస్ బేస్ ఉంది.ప్రజలన్నా,ఓటర్లన్నా ప్రస్తుతం లోక్ సత్తా ప్రభావితం చేస్తున్నాను అనుకుంటున్న వర్గాలే కాదు, భారతీయ ఓటర్లంటే ప్రపంచంలోని ఏ సెఫాలజిస్టుకూ అర్ధంకాని,అంతుబట్టని ఒక దృగ్విషయం చిరంజీవి రాకతో అన్నీ మంచిరోజులొస్తాయని కొందరు భావిస్తున్నట్లే లోక్ సత్తాకు ఆ సత్తా ఉందని మీలాంటి వాళ్ళు నిర్ధారణకు వస్తున్నారు.ఎన్ని లోపాలున్నా ప్రజస్వామ్యం వ్యవస్థగా గొప్పది. కౌమార దశలోని మనలాంటి దేశాలకు అన్నివిధాలా అనువయినది.మీరు పేర్కొంటున్న లోక్ సత్తా గతంలోని గ్రీకు నగరరాజ్యాలకు-సిటి స్టేట్సుకు అద్భుతంగా పనిచేస్తుంది.

ముగించేముందు ఒకచిన్నమాట--ఈమధ్య రాష్ట్ర పతి పదవికి అభ్యర్ధులుగా ఇన్ ఫోసిస్ నారాయణ మూర్తి,రజనీకాంత్ పేర్లు వెలుగులోకి వచ్చాయి,వాటి వెనుక ఎవరున్నారని మీ అభిప్రాయం?

Sudhakar said...

రాజేంద్ర గారు,

మీరన్నది నూరుపాళ్ళు నిజమే.ప్రజాస్వామ్యాన్ని మించినది లేదు. కానీ ఒక అతి పెద్ద ప్రజాస్వామ్య దేశపు పౌరులుగా మనకుండాల్సిన పరిణితి ఇన్నేళ్ళ తరువాత కూడా రాలేదు అనేదే నా బాధ. ఇప్పటికీ మనకు నాయకులను ఎంచుకోవటానికి ప్రజాస్వామ్యానికి సంభంధం లేని ఆటవిక పద్ధతులే శరణ్యం అవుతున్నాయి.

మీరన్నట్లు రాష్ట్రపతి పదవికి నామినేషన్లు కూడా ఈ ప్రజాస్వామ్యంలోని చిన్న చిన్న తప్పులను ఆసరా తీసుకుని చేయబడుతున్నవే. ఆఖరికి ఈ మధ్య ఒక నేత సోనియాను పట్టుకుని తనకు రాష్ట్రపతి పదవి కావాలని బతిమాలాడు.సోనియా కనీసం ఒక ప్రధాని కూడా కాదు. ప్లానింగ్ కమీషన్ ఛైర్ పర్సన్ మాత్రమే. ఆ మాత్రం మెచ్యూరిటీ లేని నేత మనకు రాష్ట్రపతి అయ్యి సాధించేదేముంది? మన దేశంలో మేధావులందరూ గవర్నర్లు, రాష్ట్రపతులూ అవుతారు. దద్దమ్మలందరూ ప్రత్యక్ష పరిపాలనలోనికి దిగుతారు. ఇది ఆపడమే లోక్ సత్తా కర్తవ్యంగా నాకు తోచింది.

చదువరి said...

"అతని ప్రమేయం లేకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా ఈ చిరు భజన ఏమిటో అర్ధం కావటం లేదు." అని అన్నారు.. కానీ అది నిజమని నేననుకోను! చిరంజీవి అమాయకుడేం కాదు. తనకెంత మాత్రమూ ఇష్టం లేకపోతే అసలింత హడావుడి జరిగేదే కాదు. మొన్న తానిచ్చిన పత్రికాప్రకటన అంత అస్పష్టంగానూ ఉండేది కాదు. టెస్టింగ్ ది వాటర్స్ అంటారే అది జరుగుతోందిప్పుడు, బహుశా.

చిరంజీవి రాజకీయాల్లోకి దిగేందుకు అసలింత కసరత్తు అవసరం లేదు, నిజానికి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మథనంలోంచి ఏ ఫలితం బయటికొస్తుందో వేచి చూట్టం ఈ ఆలస్యానికి ఒక కారణం కావచ్చు.

ఏదేమైనా, అతడు రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గదే.

జ్యోతి said...

సుధాకర్,

నీకు ఎవ్వరూ నచ్చలేదని ఓటు హక్కు వినియోగించుకోకుంటే వాళ్ళకు లాభమే కాని నష్టం కాదు. నీ ఓటు కూడా వాళ్ళే వేసుకుంటారు. అందుకే నీ ఓటు వేయడానికి వెళ్ళు, అది వేరేవాళ్ళు వేసుకోకుండా , పనికిరాకుండా చేయి.(రెండు గుర్తుల మీద ముద్ర వేసేయ్. లేదా ఎదో ఒక ఇండిపెండెంటు గుర్తు మీద ముద్ర వేయి. కనీసం మన ఓటు దుర్వినియోగం కాలేదన్న తృప్తి ఉంటుంది కదా

satyavani said...

sudhakar garitho nenu kuda yekibhavistanu.loksatta jayaprakash narayana nijanga paristulanubatti matladutunnaru.naku kuda nizanga athane rajakiyallo marpu tisukostharanipistundi.papers,media athanni prothsahinchite public lo automaticga athniki maddadu perugutundani naa abhiprayam.chirangeevi manchi natudu.kani rajakiyalloki vaste athani lopalu vedaki mari vimarsistharu.athani meeda abhimanam unnavallu badhapede avakasam undi.vimarsinchadame paniga pettukuntaru.athani manchitanam antha vrudha avutundi ani naa uddeshyam.naku telugulo yela type cheyalo ravatam ledu.dayachesi ardham chesukogalaru.

సూర్యుడు said...

రెండు మూడు విషయాలు:

నా వ్యక్తిగత అభిప్రాయమైతే, నటులకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు, ఇది వారి యొక్క పాపులారిటీ ని దుర్వినియోగం చెయ్యడమే అవుతుంది. ఎందుకంటే మన వోటర్లలో (మీరు చెప్పినట్లు) అంత ఆలోచించే (కాని మన భారతీయ వోటర్లు చాలా తెలివైన వారని చాలా సార్లు టి.వి, రేడియోలలో విన్నాను) శక్తి లేదేమోనని నా ఉద్దేశ్యం.

1. ఇకపోతె, ఇప్పుడు చిరంజీవి రాజకీయ ప్రవేశాన్ని ప్రశ్నిస్తున్నవాళ్లు ఎంతమంది తెలుగుదేశం పార్టీ స్థాపనని వ్యతిరేకించారు, ఇంకా వ్యతిరేకిస్తున్నారు?

2. నా ఉద్దెశ్యంలో సినేమా నటులపై అభిమానం, రాజకీయ పార్టీలపై అబిమానం వకరకంగా పర్సనల్ చోయస్, అంటే నాకు ఈ నటుడు నచ్చుతాడు, ఎందుకంటే ఊరికినే, నాకే తెలియదు ఎందుకో. అలా అని అతను అద్భుతంగా నటిస్తాడా అంటె, కాకపోవచ్చు కాని నాకు అతనటేనే ఇష్టం. అలాగే, రాజకీయ పార్టీలు కూడ. నాకు ఫలానా రాజకీయ పార్టీ అంటేనే ఇష్టం, ఎందుకంటే నాకు తెలీదు, ఇష్టమంతే. నేనెప్పుడు ఆ పార్టీ ప్రణాళికను చదవలేదు. చదివినా అర్ధం కాదు కూడా. నా ఊహ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీ ప్రణాళికలు ఇంచుమించు వకలగే ఉండవచ్చు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలకి అపకారం చేస్తామని చెప్పదు కదా.

ఇకపోతే నా ఇంకొక అభిప్రాయమేమంటే, మనదేశంలో కూడా రెండు పార్టీ ల సిస్టం రావాలి. ఊరికే ఎక్కడా అవకాశం రాని ప్రతి వక్కడు పార్టీ పెట్టేస్తూంటే, మన దెశంలో ఇంటికొక పార్టీ వచ్చేస్తుంది.

రక రకాల ఆలోచనల్ని క్రోడీకరించడం కష్టంగా ఉంది.

నమస్కారలతో,
సూర్యుడు :-)

Sudhakar said...

జ్యోతి గారు,
నా వోటు దుర్వినియోగం కాదులెండి.నాకు వోటర్ ఐడెంటిటీ కార్డు కూడా లేదు. అసలు జనాభాలో నా పేరుందో లేదో కూడా నాకు తెలీదు. ఇప్పటికి పది సార్లు అప్లై చేసి అలసి పోయా. ఇప్పటికీ నా ఆన్లయిన్ అప్లికేషన్ పరిశీలనలో వుంది.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నేనే ఈ ప్రస్తావన మీద రాస్తే మీ అంత బాగా రాయలేనేమో ! అభినందనలు.

ఇహపోతే నా సన్నాయి నొక్కుడు :-

ప్రజాస్వామ్యం కూడా (రాజఱికం, సోషలిజం మొ.) అన్ని వ్యవస్థల వంటిదే. ఏ ప్రత్యేకతా లేదు. కాని ఏదో ప్రత్యేకత ఉందనే భావం పెట్టుకుంటే తప్ప మనం ఇందులో బ్రతకలేం. ఇదొక మతవిశ్వాసం.

Budaraju Aswin said...

"చిరంజీవి అమాయకుడేం కాదు. తనకెంత మాత్రమూ ఇష్టం లేకపోతే అసలింత హడావుడి జరిగేదే కాదు."

ఇది నిజము కాదా

karasu said...

చిరంజీవి పార్టీ పెడతాడు.ఇప్పుదు వేరే పార్టీలలో ఉన్న ఈ కుల్లూ రాజకీయ నాయకులు ఆపార్టీలో చేరి దాన్నీ కంపు
చేస్తారు.ఇక షరా మామూలే !!!

రవి వైజాసత్య said...

కొత్త పార్టీలు కొన్నాళ్ళన్నా ఆశయాల చుట్టూ తిరుగుతాయని ఒక "చిరు" దురాశ అంతే. మీరన్నది నిజమే చిరంజీవిని దేనికోసం నిలబడతాడని ఓటెయ్యాలి అని ఆలోచిస్తే ఏమీ కనిపించదు. వెనుక మంద ఉంది, గెలవగలిగే సత్తా ఉంది కాబట్టి ఓటెయ్యాలి??
రెండు పార్టీల పద్ధతి భారతదేశానికి అంతగా సరిపడదని నా వ్యక్తిగత అభిప్రాయం. అమెరికాలో రాజకీయాలు అష్టదరిద్రంగా తయారుకావటానికి ఇదే కారణం. అయితే ఇక్కడ నాయకులు ఎన్నికలముందు వివిధ విషయాలపై తాము ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారో తెలుసుకునే అవకాశం ఉండటం, వాటిపై కూలంకషంగా చర్చించటం ఒక మంచి విషయం. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన పార్టీలలో సైద్ధాంతిక స్థాయిలో ప్రస్తుతం పెద్ద తేడా ఏమీ లేకపోవటం పెద్ద దరిద్రం. (మా ఆశయం ఏంటంటే..అవతలివాడు ఎడ్డం అన్నప్పుడు తెడ్డం అనటం..:-))

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

అవును..జయప్రకాష్ నారాయణ వస్తే బాగుంటుంది..., కానీ మనం రానివ్వం కదా..! మనకేమో ఓటెయ్యటమే బద్దకం... పోలింగు రోజంటే మనకు మరొక సెలవు రోజు.

ఓటు వెయ్యకపోవటం లేదా ఓటు హక్కు లేక పోవటం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పాపం గా భావించాలి. ఎందుకంటే ఒక వెధవ ని గెలవకుండా నియంత్రించగలిగేది ఆ ఓటే కాబట్టి.

అసలు ఓటే వేయకుండా..., ప్రజాస్వామ్య ప్రక్రియ లో భాగం కాకుండా.., మనం అనుకున్నవన్నీ జరిగి పోవాలనుకోవటం సోమరి-గొడ్డలి కధ లో లా అత్యాసే అవుతుంది. మనం ఓటు వెయ్యటం లేదు కాబట్టే మన రాజకీయాలలా అఘోరించాయి...!

నేనైతే, నాకు ఓటుహక్కు వచ్చిన తర్వాత ప్రతిసారీ నా హక్కు ను వినియోగించుకున్నా... అందుబాటు లో లేకపోతే దూర ప్రయాణం చేసి మరీ...అలా అని నేను ఏ పార్టీ కి పంఖా ని కాదు..., ప్రజాస్వామ్యానికి మాత్రమే.

ఇంతకీ నా బాధేంటంటే వ్యవస్థ లో మంచి మార్పు రావాలి...అందరూ బాగుపడాలి అని కోరుకునే మంచివాళ్లంతా ఓటెందుకెయ్యరనే...!!? నా ఉద్దేశ్యం లో ఈ చదువుకున్న నిరక్షరాస్యుల ఆలోచనా పరిధి విస్తృత మైతే తప్ప ఈ రాజకీయాలు బాగు పడవు...ఎంత మంది "చిరు"లు "జయప్రకాష్"లు వచ్చినా ఇవి ఇలాగే ఉంటాయి..!!!

vijay said...

సుధాకర్ గారి సందేశం చాలా ఆలోచనాత్మకంగా వుంది.

Uday said...

Sudhakar,
Excellent Analysis. I leave aside the aspect of chiranjeevi and his political ambitions. Coming to our people, yes I agree they are not yet matured enough to know who is right leader and who is not. Most of the current crop of people who are demanding for Chiru's entry into politics are greedy and expecting something out of return in favour of their support. One thing for sure, Chiru never encouraged his caste people and he makes sure he never have them around him. Remember,his favourite director and producer are still KRR and CAD. If reports by news papers are to be believed, he is trying to create a broad base of caste support and never interested to be branded as a caste leader.

Democracy will really bear fruits when people have the brains to decide and choose the right person for leading them. Or else the rotten eggs who are elected will rotten the society beyond repair.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name