Tuesday, January 30, 2007

తెలుగు సినిమా వజ్రోత్సవాలు..హీరోలు, జీరోలు

తెలుగు సినిమా వజ్రోత్సవాలు ధాటిగా ప్రారంభమై వాగ్ధాటిగా ముగిసాయి. ఈ హడావిడిలో కొన్ని నిజాలు తెలిసాయి. నటీ నటుల నిజమైన హీరోయిజం అర్ధమయింది.

ఈ వజ్రోత్సవాలలో హీరోగా నిలచి అందరి మనసులు కొల్ల గొట్టిన వాడు ఒకే ఒక్కడు...

ఆశ్చర్యంగా ఉన్నా అది...బాలకృష్ణ

హుందాతనం, చెరగని చిరునవ్వు, పెద్దలంటే గౌరవం, చిన్న పెద్ద తారతమ్యం లేకపోవటం , కొట్టొచ్చిన అమాయకత్వం, బోళాతనం అందరిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో రాజకీయాలకు పూర్తిగా అతీతంగా కనిపించాడు.

నేను ముందర బాలకృష్ణ అంటే చాలా తేలిగ్గా తీసి పడేసే వాడిని. (సినిమాల వలన).కానీ బాలకృష్ణ నిజ జీవితంలో పూర్తిగా తేడా ఉందనిపించింది. నాకు ఇవన్నీ చూస్తే అలనాటి విమాన ప్రమాదం ఒక్క సారి గుర్తుకొచ్చింది. చిరంజీవి భోరున ఏడుస్తూ పొలాల నుంచి బయటకు వస్తే, ఒక్క బాలకృష్ణ మాత్రం చాలా స్థిమితంగా, ప్రశాంతంగా బయటకు నడుచుకు వచ్చేసాడు.

ఇక జీరోలు

౦౧. ఖచ్చితంగా ఈ ఉత్సవాల కమిటి. ఖర్చు పెట్టిన డబ్బంతా ఎక్కడ పోయిందో అర్ధం కాలేదు. విమానం ఛార్జీలు చెల్లించి మరీ ముంబయి హీరోయిన్లను రప్పించారో ఏంటో? దిగ్గజాలన్నారు...బతికున్న మహామహులను మర్చిపోయారు. చనిపోయిన మహా నటుల కుటుంబాలను ఆహ్వానించి వారికి ఇవ్వొచ్చుగా దిగ్గజాల అవార్డులు? అలా అయితే ఖచ్చితంగా ఇప్పటి తరం నటులు మొదటి 75  దిగ్గజాలలో ఉండరు.  రంగస్థలం మీద కనీసం సినీ మహామహుల చిత్రాలు లేవు. కార్యక్రమాలన్నీ ముంబాయి భామలు, చెన్నై భామల చేతుల మీదగానే. శ్రీదేవి(ఇప్పటి), సుహాసిని(ఇప్పటి) వంటి తెలుగు తారలు నృత్యాలకే పరిమితం.పురుషాధిక్యత సుస్ప్రష్టం. శ్రీదేవి(సీనియర్) వంటి సినీ దిగ్గజం అసలు హాజరు కాలేదు. చిరంజీవి పద్మ భూషణ్ సత్కారానికి ఇంతకంటే బాగనే తెలుగు హీరోయిన్లు వచ్చారేమో.

౦౨. మోహన్ బాబు : చెప్పేదంతా నిజమే అనిపించినా చెప్పిన విధానం చాలా చవకబారుగా ఉంది. నేను గొప్ప అని చెప్పుకోవటం గొప్పవాళ్ళ లక్షణం అసలు కాదు. చెప్పిన కారణాలు కూడా కొద్దిగా అతడు ఆలోచించుకుని చెప్పాలి. ఎందుకంటే ఒక విద్యా సంస్థను స్థాపించటం గొప్ప కాదు...అందులో 25% ఉచిత విద్య మరీ అంత గొప్ప విషయం కాదు. పూర్తిగా ఉచితంగా వైద్యం చేసే వైదులు, చదువు చెప్పే టీచర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక రాజ్య సభకు ఎంపిక కావటం. అతను ఆ సభకు ఎలా వెళ్ళాడు? రాజ్య సభ అంటే ఒకొప్పుడు మేధావుల సభ.ఇప్పుడు అది ఒక రాజకీయ పునరావాస సభ. అందువలన వాటిని ప్రాతిపదికగా తీసుకుని సినీ దిగ్గజం అంటారనుకుంటే టొమేటో పప్పులో కాలు వేసినట్లే.ఇతడికి అస్సలు క్రమశిక్షణ లేదు. ఒక నలభై నిమిషాలు తినేసాడు (నాలుగు నిమిషాల ప్రసంగం చెయ్యబోయి).

౦౩. ఇక చిరంజీవి....మొదలు పెట్టటమే ఉబికి వస్తున్న కన్నీళ్ళతో మొదలు పెట్టాడు. చెప్పేది మోహన్ బాబును ఉద్దేశించి అయినా ముందర మోహన్ బాబు సభలో ఉన్నాడో, లేనిదీ ఒక సారి టెస్ట్ చేసి (ఏడీ మోహన్ బాబు...) మరీ మొదలు పెట్టాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కాదు ..నేనే అనిపించాడు, క్లాస్ గానే మాట్లాడుతూ డ్రామా రక్తి కట్టించాడు. ఇతడు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఒక విషయంలో పొంతన కుదరలేదు. ఒకప్పుడు దర్శకులు పిలిచి వేషం ఇస్తే ఎంతో సంతోషంగా చేసేవాళ్ళం, ఒదిగి ఉండే వాళ్ళం...ఇప్పుడూ అలానే ఉందాం..అర్ధాకలితో ఉందాం అన్నాడు. అయితే ఆ ప్రసంగానికి ఒక రోజు ముందరే పూరీ జగన్నాధ్ సుమతో "చిరంజీవి గారికి నాలుగు కధలు వినిపించా, కానీ అతనికి నచ్చలేదు" అని చెప్పాడు. ఇప్పుడు తెలుగులో ఉన్న దుస్థుతి ఇది. ఇదే కారణం మీద రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో సినిమాకు గుడ్ బై చెప్పేసాడు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమనే తన్ని పోయాడు. ముఖ్యమంత్రి చేతుల మీదగా ఇచ్చిన అవార్డును తిరస్కరించి చాలా తప్పు చేసాడు. అది ముఖ్యమంత్రికే అవమానం. అది చాలక డ్రామా సహితంగా టైమ్ కాప్స్యూల్ లో వెయ్యటం ఒకటి. ఆ పెట్టెలో ఏమి వెయ్యవచ్చో అల్లు అరవింద్ పది సార్లు చెప్పినా కూడా చిరంజీవి ఆ పని చెయ్యటం ద్వారా ఈ అవమానకర సంఘటనను తరువాత ఇరవై అయిదు సంవత్సరాలకు, ప్రతిష్టాత్మకమైన శత వత్సర పండుగ వరకు పొడిగించారు. అప్పటికి చిరంజీవి, మోహన్ బాబు స్నేహితులుగా చెట్టా పట్టాలు వేసుకుని ఉంటే వారికి ఆ శత వత్సర పండుగలో వారు చేసిన పనులు చాలా చెత్తగా అనిపించక మానవు. ఎప్పుడూ  ఆదర్శంగా
మాట్లాడే చిరంజీవి ఇలా ప్రవర్తించటం అసలు ఊహించనిది.


౦౪. దాసరి : శకుని పాత్ర అంటున్నారు.


౦౫. పవన్ కల్యాణ్ : అస్సలు మెచ్యూరీటీ లేదు. తప్పనిరిగా మానసిక వైద్యం అవసరం. నాకుండే గౌరవం పోయింది.

శోధన మీకు నచ్చిందా?

మొదటిగా...బ్లాగులు సొంతంగా రాసుకునేవి. ఎవరి కోసమో మనం రాయటం లేదా రాయకుండా మిన్నకుండటం అస్సలు బ్లాగు దేహానికి సరిపడదు అని నమ్మే వారిలో నేనొకడిని. గత నూటా ఇరవై టపాలలో కూడా నేను ఇదే ధోరణిలో పోయాను. తోటి బ్లాగరుల అభినందనలు అందుకున్నాను. దాదాపు పదిహేను వేలకు పైగా హిట్లు వచ్చాయి. కాబట్టి ఇకపై కూడా ఇదే రకంగా బ్లాగుతాను :-)

మీకు శోధన నచ్చినప్పుడల్లా నాకు కామెంట్ల ద్వారా అభినందించారు. అందుకు అందరికీ నా ధన్యవాదాలు. అదృష్టవశాత్తు నాకిప్పటివరకూ సద్విమర్శలే వచ్చాయి. అది కేవలం నా తోటి బ్లాగు మిత్రుల, ప్రియ పాఠకుల సంస్కారానికి, హుందాతనానికి గీటురాయిగానే నేను భావిస్తున్నాను.

 

మీకు కూడా శోధన నిజంగా నచ్చితే (భావ వ్యక్తీకరణ, వైవిధ్యం, ముక్కుసూటితనం, మరియు క్లుప్తత అంశాలుగా) మీరు ఇండిబ్లాగర్స్ అవార్డులకు ఈ బ్లాగును సూచించవచ్చును. మంచి తెలుగు బ్లాగు అవార్డును తేనెగూడు వారు అందిస్తున్నారు.

 

మీరు శోధనను గానీ మరో తెలుగు బ్లాగును గానీ ఈ విధంగా నామినేట్ చెయ్యవచ్చు.

౦౧. మీకు http://del.icio.us అనే సైట్లో ఒక లాగిన్ ఉండాలి. దానిని సృష్టించండి. తరువాత లాగిన్ అవ్వండి.

౦౨. తరువాత ఈ పేజీలో క్రింద చూపిన విధంగా ఎంపిక చేసుకోవాలి.

tags ఇవ్వాల్సిన చోట తప్పని సరిగా మీరు "ib06 ib06Indic ib06Telugu" అని నింపాల్సి ఉంటుంది. ఇది చాల ముఖ్యం.

౦౩. "Save"  బటన్ నొక్కండి. అంతే మీరు మీ అభిమాన బ్లాగును నామినేట్ చెయ్యటం అయిపోయింది.

ధన్యవాదాలు...ఇక మీ అభిమాన బ్లాగును నామినేట్ చెయ్యటమే ఆలస్యం.

Sunday, January 28, 2007

చిత్ర బ్లాగు పునఃప్రారంభం

చాలా రోజులుగా నా మూడో నేత్రానికి పని లేక మూలన పడి ఉంది. మొన్నామధ్య ఇంటికి  వెళ్ళినప్పుడు దానికి పని చెప్పా. అయితే  సారి సోనీ సైబర్ షాట్ కాకుండా ఫుజి ఫైన్ పిక్స్ నేత్రాన్ని వాడా!. ఆపై పికాసాతో మెరుగులు దిద్దాను.

అవన్నీ నా కూల్ క్లిక్స్ లో పెడుతున్నా...


ఈ పూలన్ని, అక్షరాల ఇంటి ముందు చిన్న చిన్న కుండీలలో ఉన్నవే. కానీ కాస్త శ్రద్ధ పెడితే అద్భుతమైన సొంత గ్రీటింగు కార్డులు తయారుచేసుకోవచ్చు :-)

మెగా ఆ(టో)గడాలు

అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్న చందాన ఉంది నగరంలో ఆటోవాలాల పరిస్థితి.

ఛార్జీలు పెంచాలని ఒక రెండు రోజులు బందు...ప్రభుత్వం దిగి వచ్చి LPG, Petrol, Diesel అనే తేడా లేకుండా అన్ని ఆటోలకు భయంకరమైన వరాలిచ్చేసింది. కుయ్యో, మొర్రో మన్న నగర సామాన్యుడు తప్పని సరిగా ఆ బరువు మోస్తున్నాడు. దీనికి తోడు రాత్రి పది గంటలు దాటితే ఒకటిన్నర ఛార్జీలు అదేదో శ్రీవారి ప్రత్యేక సేవ లాగ...దీనికి తోడు ఏ ఒక్క ఆటో మీటరూ సరిగ్గా పని చెయ్యదని ఒట్టేసి చెప్పుకోవచ్చు. అంతా మోసమే, సామాన్యుడుని దోపిడె చెయ్యటమే. ఇవన్నీ చాలవన్నట్లు ఎక్కిన ప్రయాణీకులపై అత్యాచారాలు, దోపిడీలు. రోడ్దు నియమాల ఖూనీ, ప్రమాదకరమైన డ్రైవింగూ...ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందీ? నగరంలో సామాన్య పౌరుడినుంచి అత్యధికంగా డబ్బులు పిండుకుంటున్నది ఎవరో కాదు...ఈ ఆటోవాలాలే...ప్రధానమైన రిస్కు, ట్రాఫిక్ భారం...వీరిని పోలిసులు అడ్డుకోలేరు, కొక్కెం పెట్టి మీ కారునో, బైకునో తీసుకు పోయినట్లు తీసుకుపోరు...రోడ్డుకు అడ్డంగా ఆర్.టి.సి బస్ బే లను ఆక్రమించుకున్నా ఏమనరు...వీళ్ళు మన నగర చిట్టి తమ్ముళ్ళూ, ముద్దు బిడ్డలూను. ఏమడిగితే అదివ్వాలి, ఎంతడిగితే అంత ఇవ్వాలి.

ఇంత కాలానికి పాపం ప్రభుత్వానికి కనీసం ఈ మీటర్ల విషయంలో జనానికి న్యాయం చెయ్యాలనిపించింది. ఢిల్లీ ప్రభుత్వంలా కఠినంగా CNG వాడి తీరాలని అనలేదు. డిజిటల్ మీటర్లు పెట్టుకోమంది అంతే! ఇక యూనియన్లు రంగంలోకి దిగాయి. ఆసుపత్రి రోగులను తీసుకెల్తున్న ఆటోలను టైర్లు కోసెయ్యటం, తిరగవెయ్యటం మొదలు పెట్టారు. నిజానికి ఒకొక్క డిజిటల్ మీటరు దాదాపు రెండువేలు అవుతుంది. అది కూడా రుణం కింద వస్తుంది. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని తిరిగే ఆటోలు, ఈ మాత్రం భరించలేవా? ఆ మాట కొస్తే దాదాపు 70%  ఆటోలన్నీ అద్దెకు తీసుకుని తిప్పుతున్నవే...వాటి యజమానులు ఒకొక్కరూ పది ఆటోలు అద్దెకిస్తున్నవారే (ఇది నాకొక ఆటోవాలా చెప్పిన విషయం). ఇప్పుడు ఈ కల్లు తాగిన కోతులు కూడా వీళ్ళేనని నా అనుమానం. పైగా కావలంటే ఇప్పుడున్న మీటర్ల టాంపరింగు ఆపుకోండని ఉచిత సలహా ఒకటి.

నా ఉద్దేశంలో ప్రభుత్వం ఇలాఆంటి బ్లాక్ మెయిలింగులను , చట్టవిరుద్దమయిన సమ్మెను అణిచి వేసి సామాన్యుడికి న్యాయం చెయ్యాలి. ఆటోవాలాలకు ఇచ్చి పుచ్చుకోవటం అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో తెలిసి వచ్చేలా చెయ్యాలి.

Friday, January 26, 2007

గెలవాలంటే కొన్ని సార్లు పారిపోవాలి.

శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చెయ్యలేక పారిపోయాడు? ఇదీ నాకు ఒక స్నేహితురాలు సంధించిన ప్రశ్న. అది కూడా పండుగ
సెలవు మీద ఇంట్లో కూర్చుని ఏం చెయ్యాలో తోచనప్పుడు అడిగిన ప్రశ్న. ఎంత ఆలోచించినా జవాబు అందలా. ఇంట్లో
అడిగితే నరకాసుర యుధ్ధమేమో అన్నారు, కానీ అప్పుడు మూర్ఛ పొయ్యాడు గదా (సత్యభామకు ఒక అవకాశం ఇవ్వటం
కోసమని అందంగా చెప్తారనుకోండి) పారిపోలేదు కదా అని ఒక డౌటు. మొత్తానికి మనకి కిష్టిబాబు ఒక హీరోగా ముద్ర
పడిపోవటం వలన ఈ విషయం బుర్రకు అంతగా అంటలేదని అర్ధం అయ్యి, ఇక అనాధ రక్షకా శరణు, శరణు అని పుస్తకాల
బీరువాను వేడుకున్నాను.

 

ఒక పాత పుస్తకం దొరికింది, పేరు పూర్వ గాధాలహరి. పురాణాలలో ఉన్న అన్ని పాత్రలు (చిన్న పక్షి పాత్రలు, మఖలో పుట్టి
పుబ్బలో పోయే పాత్రలు కూడా) గురించి ఆ పుస్తకరాజంలో ఒక డిక్షనరీ రూపంలో ఉంటాయన్న మాట. పుస్తకం అట్ట మీద
అందమైన గొలుసుకట్టు ఆంగ్లం. మా ముత్తాత గారి పుస్తకం అని తెలుపుతూ "దిస్ బుక్ ఈజ్ బిలాంగ్స్ టూ ...." అని. అప్పట్లో పుస్తకాల మీద ఆపేక్షకు అది నిదర్శనం.

ఇక పుటలు తిప్పుతూ ఒకొక్క పాత్ర గబగబా చదవటం మొదలుపెట్టా..ఒక ముప్పయి నిమిషాల తరువాత "క" విభాగంలో
నాకు జవాబు దొరికేసింది.

కాలయవనుడు అనేవాడు తరచుగా ద్వారక పై దండెత్తేవాడు. వాడి ధాటిని కృష్ణుడు తట్టుకోలేకపోయేవాడు. వీడిని ఇలా
అయితే లాభం లేదని, ఒక పన్నాగం పన్నాడు. ద్వారకకు దగ్గరలో ఒక గుహలో ముచికుందుడు అనే మహాముని ఉండేవాడు.
అతడు మహా తపశ్శాలి. నిద్రని వరంగా కోరుకున్నవాడు. ఎప్పుడూ నిద్ర పోతూ ఉంటాడు.

కృష్ణుడు యుద్ధం చేస్తూ, చేస్తూ ఆ గుహలోకి పారిపోయి దాక్కున్నాడు. అతడిని తరుముతూ వచ్చిన కాలయవనుడు
ముచికుందుని ఆచూకీ అడిగాడు. నిద్ర పోతుండటంతో సమాధానం రాదు. కా.య కి తెగ కోపం వచ్చి ఆ మహామునిని
ఒక్క తన్ను తన్నాడు. ఆగ్రహంతో లేచిన ఆ మహాముని కళ్ళు తెరచి కా.య ని చూశాడు....అంతే భస్మం....

కృష్ణుడు హాయిగా ఇంటికి పోయాడు. అందుకే అంటారు....హార్డ్ వర్కు కాదురా బాబు, స్మార్ట్ వర్కు చెయ్యాలి అని.

నేను ఈ ప్రశ్న అడిగిన వారికి దిగ్విజయంగా జవాబు చెప్పానని వేరే చెప్పాలా :-)

Wednesday, January 24, 2007

ఇదో రకం పిచ్చి

సద్దాంని అన్యాయంగా చంపేసారు సరే? అన్యాయం అన్నారు..అమెరికా నువ్వు నాశనం అయిపోతావ్ అన్నారు సరే...అంతవరకూ బాగానే ఉంది. దానిని అందరూ ముక్త కంఠంతో ఒప్పుకుంటారు.

 

కానీ, ఎక్కడ ఆగాలో తెలిస్తే మేమెందుకు పిచ్చోల్లమవుతాం అన్నట్లు సద్దాం భజనపరులు అకస్మాత్త్తుగా రాత్రికి రాత్రి బయలు దేరారు. తెగ కవితలు, దండలు వేసేస్తున్నారు. ఒక సభకయితే ఏకంగా చంద్రబాబు హాజరయిపోయి "........విన్నవించకుంటున్నాను" అని ఏదో తెలియని వాగుడు వాగాడు.ఇది దిగ్భ్రాంతి కలిగించే పరిణామం. అసలు అతని చరిత్ర ఏమిటి? ఎలాంటి నియంత ఇవన్నే తెలియని వారు ఇందులో ఉన్నారను కుంటే మన భ్రమే. అన్నీ తెలిసి కూడా..అమెరికాని తిట్టడానికి, సామ్రాజ్యవాదాన్ని తిట్టడానికి సందు దొరికింది కదా అని హంతక భజన మొదలు పెట్టడం సిగ్గు చేటు. అమెరికా సామ్రాజ్య వాదాన్ని తిట్టడానికి వంద మార్గాలున్నాయ్. ఈ కీర్తనలు ఏ స్థాయిలోకి పోయాయంటే సద్దాం గాడు పుట్టిందే అమెరికాను అణచడానికి అన్నట్లు ఉన్నాయి.

 

ఈ సద్దాం సుద్దకాయ కవులందరూ తెలుసుకోవాల్సింది ఒకటుంది. మొదటిది సద్దాం, ఫిడెల్ క్యాస్ట్రో లాంటి కమ్యూనిస్టు యోధుడు కాదు. అమెరికా పాలు పోసి పెంచిన కింగ్ కోబ్రా. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడాడు.దీన జనోద్ధారకుడు అంతకంటే కాదు. ప్రజల సొమ్ములతో బంగారపు టాయిలెట్ సీట్లు చెయ్యించుకున్నాడు.ఇక  వీడి కొడుకులు చేసిన వెధవ పనులు ఇంక చెప్పనక్కర లేదు.  అంతా కలిపి చూస్తే ఒక భయంకరమైన నియంత.

 

ఈ లెక్కలో రేపు అప్జల్ గాడిని భగత్ సింగుతో పోలుస్తారేమో.... కవులూ పెన్నులు తియ్యండి మీ కవిత్వంతో  హంతక కీర్తనలు రాద్దురు గాని.

Friday, January 12, 2007

దీర్ఘ విరామం

ఈ రోజు నుంచి మరలా 22 వ తారీఖు వరకు కూడలికి, బ్లాగులకు, టెక్ మెమెకు, డిగ్ కు, గూగుల్ రీడర్ కు, నానా రకాల ఈమెయిల్లకు, ఎందుకో సగం మందికి తెలియని వీడియో కాన్ఫరెన్సులకూ, మీటింగులకూ ఇదే నా వీడ్కోలు.

ఈ-ప్రపంచంలోనికి మరలా పున:ప్రవేశం 23వ తేదీనే.

తోటి తెలుగు జనాలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Thursday, January 04, 2007

ఓర్కుటాయ నమహ:

వెబ్ లో ఓర్కుట్ మహత్యం, జబ్బు అందరికీ తెలిసిందే. దానిపైన ఒక హాస్య వల్లరి. (శివ ఆకుల ద్వారా)

 

Tuesday, January 02, 2007

కౌముది...మీ ముంగిట్లో సాహితీ వెన్నెల ప్రారంభం

ఇన్నాళ్ళు ఇంటర్నెట్లో సరైన తెలుగు సాహితీ సంచికలు లేవేంటా అని బాధపడే వారికి ఇది శుభవార్త. కౌముది, తెలుగు సాహితీ పత్రిక ఈ రోజే ప్రారంభం అయ్యింది. ప్రారంభ సంచికను మీరు www.koumudi.net లో ఆస్వాదించగలరు.

తాజా సంచికలో మందపాటి సత్యం, గొల్లపూడి, యద్దనపూడి వంటి మహామహుల రచనలు ఉన్నాయి. అయితే ఈ సంచిక ఇంకా యూనికోడులో లేదు. ఆ ఒక్కటి తప్ప ఈ వెన్నెలకు మచ్చలు ఏమీ లేవు. అంతా పండు వెన్నెలే.

Monday, January 01, 2007

కూడలి...కొత్త సొగసులతో

తెలుగు బ్లాగర్ల ఇంటర్నెట్ వేదిక అయిన కూడలి ఇప్పుడు కొత్త సొగసులతో అద్భుతంగా మన కోసం తయారుగా ఉంది. కూడలి బ్రహ్మ వీవెన్ కు ధన్యవాదాలు. ఇప్పుడు కూడలిని koodali.org ద్వారా దర్శించవచ్చు. కూడలి అంటే మన హై.భాషలో చౌరస్తా అన్న మాట. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళు రాసే అభిప్రాయాలను ఒకే వేదిక మీద పంచుకునేందుకు కూడలి ఒక వేదికగా నిలచింది.

తెలుగు బ్లాగులు, వికీపీడియాలపై మేము వెలువరించిన పుస్తకము ప్రపంచ తెలుగు సాహితీ సభలో ప్రముఖుల చేతులలో పడినప్పుడే కూడలి ఈ అందాలను సంతరించుకోవటం ఆనందంగా ఉంది.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name