Sunday, January 28, 2007

మెగా ఆ(టో)గడాలు

అసలే కోతి, ఆపై కల్లు తాగింది అన్న చందాన ఉంది నగరంలో ఆటోవాలాల పరిస్థితి.

ఛార్జీలు పెంచాలని ఒక రెండు రోజులు బందు...ప్రభుత్వం దిగి వచ్చి LPG, Petrol, Diesel అనే తేడా లేకుండా అన్ని ఆటోలకు భయంకరమైన వరాలిచ్చేసింది. కుయ్యో, మొర్రో మన్న నగర సామాన్యుడు తప్పని సరిగా ఆ బరువు మోస్తున్నాడు. దీనికి తోడు రాత్రి పది గంటలు దాటితే ఒకటిన్నర ఛార్జీలు అదేదో శ్రీవారి ప్రత్యేక సేవ లాగ...దీనికి తోడు ఏ ఒక్క ఆటో మీటరూ సరిగ్గా పని చెయ్యదని ఒట్టేసి చెప్పుకోవచ్చు. అంతా మోసమే, సామాన్యుడుని దోపిడె చెయ్యటమే. ఇవన్నీ చాలవన్నట్లు ఎక్కిన ప్రయాణీకులపై అత్యాచారాలు, దోపిడీలు. రోడ్దు నియమాల ఖూనీ, ప్రమాదకరమైన డ్రైవింగూ...ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందీ? నగరంలో సామాన్య పౌరుడినుంచి అత్యధికంగా డబ్బులు పిండుకుంటున్నది ఎవరో కాదు...ఈ ఆటోవాలాలే...ప్రధానమైన రిస్కు, ట్రాఫిక్ భారం...వీరిని పోలిసులు అడ్డుకోలేరు, కొక్కెం పెట్టి మీ కారునో, బైకునో తీసుకు పోయినట్లు తీసుకుపోరు...రోడ్డుకు అడ్డంగా ఆర్.టి.సి బస్ బే లను ఆక్రమించుకున్నా ఏమనరు...వీళ్ళు మన నగర చిట్టి తమ్ముళ్ళూ, ముద్దు బిడ్డలూను. ఏమడిగితే అదివ్వాలి, ఎంతడిగితే అంత ఇవ్వాలి.

ఇంత కాలానికి పాపం ప్రభుత్వానికి కనీసం ఈ మీటర్ల విషయంలో జనానికి న్యాయం చెయ్యాలనిపించింది. ఢిల్లీ ప్రభుత్వంలా కఠినంగా CNG వాడి తీరాలని అనలేదు. డిజిటల్ మీటర్లు పెట్టుకోమంది అంతే! ఇక యూనియన్లు రంగంలోకి దిగాయి. ఆసుపత్రి రోగులను తీసుకెల్తున్న ఆటోలను టైర్లు కోసెయ్యటం, తిరగవెయ్యటం మొదలు పెట్టారు. నిజానికి ఒకొక్క డిజిటల్ మీటరు దాదాపు రెండువేలు అవుతుంది. అది కూడా రుణం కింద వస్తుంది. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని తిరిగే ఆటోలు, ఈ మాత్రం భరించలేవా? ఆ మాట కొస్తే దాదాపు 70%  ఆటోలన్నీ అద్దెకు తీసుకుని తిప్పుతున్నవే...వాటి యజమానులు ఒకొక్కరూ పది ఆటోలు అద్దెకిస్తున్నవారే (ఇది నాకొక ఆటోవాలా చెప్పిన విషయం). ఇప్పుడు ఈ కల్లు తాగిన కోతులు కూడా వీళ్ళేనని నా అనుమానం. పైగా కావలంటే ఇప్పుడున్న మీటర్ల టాంపరింగు ఆపుకోండని ఉచిత సలహా ఒకటి.

నా ఉద్దేశంలో ప్రభుత్వం ఇలాఆంటి బ్లాక్ మెయిలింగులను , చట్టవిరుద్దమయిన సమ్మెను అణిచి వేసి సామాన్యుడికి న్యాయం చెయ్యాలి. ఆటోవాలాలకు ఇచ్చి పుచ్చుకోవటం అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో తెలిసి వచ్చేలా చెయ్యాలి.

1 comments:

kiran kumar Chava said...

అవును అధ్యక్షా

ఈ విషయంలో ప్రతిపక్షాల వాళ్ళు మొత్తం తమ స్వార్దం కోసరం ఆటో కోతులతో ఉన్నా ప్రజలమైన మేము మాత్రం డిజిటల్ మీటర్లవైపే
ఉన్నామని మనవి చేసుకుంటున్నాము

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name