శ్రీకృష్ణుడు ఎవరితో యుద్ధం చెయ్యలేక పారిపోయాడు? ఇదీ నాకు ఒక స్నేహితురాలు సంధించిన ప్రశ్న. అది కూడా పండుగ
సెలవు మీద ఇంట్లో కూర్చుని ఏం చెయ్యాలో తోచనప్పుడు అడిగిన ప్రశ్న. ఎంత ఆలోచించినా జవాబు అందలా. ఇంట్లో
అడిగితే నరకాసుర యుధ్ధమేమో అన్నారు, కానీ అప్పుడు మూర్ఛ పొయ్యాడు గదా (సత్యభామకు ఒక అవకాశం ఇవ్వటం
కోసమని అందంగా చెప్తారనుకోండి) పారిపోలేదు కదా అని ఒక డౌటు. మొత్తానికి మనకి కిష్టిబాబు ఒక హీరోగా ముద్ర
పడిపోవటం వలన ఈ విషయం బుర్రకు అంతగా అంటలేదని అర్ధం అయ్యి, ఇక అనాధ రక్షకా శరణు, శరణు అని పుస్తకాల
బీరువాను వేడుకున్నాను.
ఒక పాత పుస్తకం దొరికింది, పేరు పూర్వ గాధాలహరి. పురాణాలలో ఉన్న అన్ని పాత్రలు (చిన్న పక్షి పాత్రలు, మఖలో పుట్టి
పుబ్బలో పోయే పాత్రలు కూడా) గురించి ఆ పుస్తకరాజంలో ఒక డిక్షనరీ రూపంలో ఉంటాయన్న మాట. పుస్తకం అట్ట మీద
అందమైన గొలుసుకట్టు ఆంగ్లం. మా ముత్తాత గారి పుస్తకం అని తెలుపుతూ "దిస్ బుక్ ఈజ్ బిలాంగ్స్ టూ ...." అని. అప్పట్లో పుస్తకాల మీద ఆపేక్షకు అది నిదర్శనం.
ఇక పుటలు తిప్పుతూ ఒకొక్క పాత్ర గబగబా చదవటం మొదలుపెట్టా..ఒక ముప్పయి నిమిషాల తరువాత "క" విభాగంలో
నాకు జవాబు దొరికేసింది.
కాలయవనుడు అనేవాడు తరచుగా ద్వారక పై దండెత్తేవాడు. వాడి ధాటిని కృష్ణుడు తట్టుకోలేకపోయేవాడు. వీడిని ఇలా
అయితే లాభం లేదని, ఒక పన్నాగం పన్నాడు. ద్వారకకు దగ్గరలో ఒక గుహలో ముచికుందుడు అనే మహాముని ఉండేవాడు.
అతడు మహా తపశ్శాలి. నిద్రని వరంగా కోరుకున్నవాడు. ఎప్పుడూ నిద్ర పోతూ ఉంటాడు.
కృష్ణుడు యుద్ధం చేస్తూ, చేస్తూ ఆ గుహలోకి పారిపోయి దాక్కున్నాడు. అతడిని తరుముతూ వచ్చిన కాలయవనుడు
ముచికుందుని ఆచూకీ అడిగాడు. నిద్ర పోతుండటంతో సమాధానం రాదు. కా.య కి తెగ కోపం వచ్చి ఆ మహామునిని
ఒక్క తన్ను తన్నాడు. ఆగ్రహంతో లేచిన ఆ మహాముని కళ్ళు తెరచి కా.య ని చూశాడు....అంతే భస్మం....
కృష్ణుడు హాయిగా ఇంటికి పోయాడు. అందుకే అంటారు....హార్డ్ వర్కు కాదురా బాబు, స్మార్ట్ వర్కు చెయ్యాలి అని.
నేను ఈ ప్రశ్న అడిగిన వారికి దిగ్విజయంగా జవాబు చెప్పానని వేరే చెప్పాలా :-)
10 comments:
eppuduu vinaledu ii kadha.baagumdi.
కథ బాగుంది..చిన్నప్పుడు విన్నాను. మీరు చెప్పిన పుస్తకం గురించి తెలిసాక కొనుక్కోవలనిపిస్తుంది. ఎక్కడైన దొరుకుతుందంటారా? సూక్తి కూడా అక్షరాలా సత్యం.
విన్నాను,
బాపు భాగవతంలో అద్భుతంగా తీసినారు కూడా
ఇంకో విశేషము ఏమిటంటే, ఈ కాల యవ్వనుడు భారతీయ రాజు కాదు యవ్వన దేశస్తుడు (ఇరానా? గ్రీకా? )
వీడికి ఏదో వరము ఉన్నట్టున్నది అందరికంటే బలవంతుడను అని, వాడి దేశంలో యుద్ధం చేయడానికి ఎవ్వడూ కనిపించకపోతే నారదుల వారి సలహాపై భారత దేశం వచ్చి కృష్ణుడిపై యుద్ధం చేస్తాడు.
మొదటి యుద్ధంలోనే కృష్ణుడు వాడిని తెలివిగా ఓడించినట్టు గుర్తు.
ఇహ పోతే కృష్ణుడు నిజంగా పారిపొయినది మాత్రం జరాసంధుడి నుండి, మొత్తం రాజ్యాన్నే ద్వారకకు మార్చేసినడు కదా
ఓం శాంటి
శంనో కృష్ణః
నా దగ్గర ఉన్న పుస్తకం చాలా పాత పుస్తకం చేతన గారు. మద్రాసులో ముద్రితమైంది. (వెంకట్రావు అండ్ సన్స్). అందువలన అది ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు. :-)
బాగుంది. ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడూ ఎవరైనా అడుగుతూండకపోతే పురాణాలు పుక్కిటిలో నిలవవు. శ్రీకృష్ణవిజయము సినిమా చూసి ఇది కల్పితమేమో అనుకున్నాను. కామయవనుని ప్రస్తావన పోతనభాగవతంలో ఎక్కడైనా వుందా అని ఇప్పటికీ నాకు అనుమానమే. కనుక్కోవాలి.
మంచి నీతి (కథ)!
చేతన గారూ! మీకు ఆసక్తి ఉంటే ఆర్వియార్ రాసిన పూర్వగాథా కల్పతరువు అనే పుస్తకం చదవండి. పురాణ గ్రంథాల్లోని విశేషాలను వివరించే ఈ పుస్తకం ప్రతిభ పబ్లికేషన్స్ వారిది. విశాలాంధ్రలో దొరుకుతుంది.
యార్నార్! అతడిపేరు కామయవనుడు కాదు, కాలయవనుడు.
యవనులంటే గ్రీకులే.
జరాసంధుడి గురించి నేను రాసింది ఇక్కడ ఉంది. :)
మంచి కథ తెలియజేసినందుకు కృతజ్ఞతలు
ఈ బ్లాగు ప్రపంచం లో పడ్డ తరువాత చాల విషయాలు తెలుస్తున్నాయి.
చెరకు కొరకకుండా రసం అందించినట్టు ఈ బ్లాగులు గైడ్ లాగ ఉపయోగ పడుతున్నాయి.
చాల మంచి విషయాన్ని తెలియ చేశారు.
విహారి
కృష్నుడు ఎదురుపడలేక పారిపోయింది ముఖ్యంగా జరాసంధుడి నుండే!
--ప్రసాద్
http://blog.charasala.com
కృష్ణుడు జరాసంధుడితో యుద్ధం చేస్తూ పారిపోలేదేమో?
Post a Comment