Thursday, November 29, 2007

నిప్పులాంటి నిజాం

పైన రాసిన టైటిల్ని చూస్తే మీకు ఒళ్ళు మండిందా? అయితే మీరు ఖచ్చితంగా తెలంగాణా స్వాతంత్ర సమరయోధుల కష్టాలతో తడిసిన చరిత్ర తెలిసిన వారయి వుంటారు. మరి ఇప్పుడు అనుకోకుండా నిజాం నిప్పు ఎలా అయ్యాడబ్బా? పోనీ ఎవడైనా రాత్రి బాగా తాగి మాట్లాడినా చాలా వరకూ నిజాలు కక్కుతారు గానీ ఇలా అడ్డగోలు చరిత్ర మాట్లాడరే ?. ఈ లెక్కన మనకు పాకిస్తాను, బంగ్లాదేశు కూడా అద్భుతమైన పాలకులు పరిపాలించిన దేశాల క్రిందే లెక్క.పోనీ మన మాష్టారు నిజమే చెప్పారనుకుందాం...మరి ఆ లెక్కన తెలంగాణా ఉద్యమం ఎవరికి ఎదురొడ్డి జరిగింది? అది కూడా కొంపతీసి వలస వాదుల మీదేనా? రజాకార్లందరూ తూర్పు గోదావరి, గుంటూరుల నుంచి భూములు కొనటానికి వచ్చిన తురుమ్ ఖాన్లా? సరిగ్గా చెప్తే చరిత్ర మార్చేసుకుంటాం కదా?

పీవీ నరసింహారావు గారి ఆటో బయోగ్రఫీ చదువుతుంటే అందులో ఆనంద్ పాత్రధారి పర్షియన్ భాష చదివి, అది ఎందుకు చదవాల్సి వచ్చిందో చెప్తూ వుంటే మనిషన్న వాడికి మంట పుట్టటం ఖాయం.ఫలక్ నుమా వాడు కట్టాడు, అసెంబ్లీ హాలు వీడు కట్టాడు అని చెప్పేముందర అవి ఇప్పుడు వాడుతున్న కారణాల కోసం అప్పటి రోత నవాబులు కట్టలేదని పిల్లి పిడికిలంత మెదడున్నవాడికెవడికైనా అర్ధం అవుతుంది.మరి అంత మంచి నిజాము ఇక్కడుండకుండా టర్కీ ఎందుకెళ్ళి బతుకుతున్నాడో ఈ మన నవాబుకే తెలియాలి.

Tuesday, November 13, 2007

TV9 : కోఠీ కాలేజీపై కుక్కల దాడి (కేవలం TV9 లో)

ఇరవై నాలుగ్గంటల వార్తల ఛానల్ పెడితే ఇన్ని కష్టాలుంటాయని తెలీదు. :-)కాదేదీ వార్తా స్రవంతికి అనర్హం అని నిరూపించారు. అదీ లైవ్ కామెంటరీ (చాలా కామెడి కామెంటరీ)

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హాట్ హాట్. ఏ వీడియో పడితే ఆ వీడియోని ప్రైవసీ అనే పదాన్నే పట్టించుకోకుండా ప్రసారం చేసే TV9 మరి ఈ వీడియోని కూడా ప్రసారం చేస్తే మంచిది.

Sunday, November 11, 2007

అంతా నువ్వే చేశావు....అవును అంతా నువ్వే చేశావు.

ఈ మధ్య ఈనాడు ఆదివారం సంచికలో ఇదే తరహాలో ఒక పేరడీ ప్రచురించారు. అది చూసి, ఆ ప్రేరణతో రాసినది ఇది.

ఇవి బొమ్మరిల్లు అనే మంచి చిత్రంల్లో, బాగా హిట్టయిన సంభాషణల పరంపర. దీనిని సిద్ధార్ద్, ప్రకాష్ రాజ్ అద్భుతంగా రక్తి కట్టించారు.గోపి : అంతా నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు. చాలు రాధా పెళ్ళైన నాటి నుంచి నువ్వు నా చేత చెయ్యించిన పనులు చాలు. ఇక వద్దు ప్లీజ్.

రాధ : గోపీ…నేనేం చేసాను

గోపి : ఇంకా అర్ధం కాలేదా నీకు. పక్కింటి బ్యాచిలర్ కుర్రోడు దగ్గర ఏముందో, అదే నేను కోల్ఫోయింది. ఆనందం. జీవితంలో సొంత ఆనందాలను కోల్పోయాను నీ వల్ల.

నువ్వు ప్రపంచంలోనే గొప్ప భార్యవి రాధా. నీ భర్త ప్రపంచంలోనే ఒక గ్రీకు వీరుడు అవ్వాలని ఆలోచిస్తావు తప్ప, అసలు నా సీను ఏంటో అర్ధం చేసుకోవు.

రాధ : నేనేది చేసినా వెయ్యి సార్లు మీకు అది బాగుంటుందో లేదో ఆలోచిస్తా గదండి.

గోపి : అవును వెయ్యిసార్లు నాకు బాగుంటుందో లేదో ఆలోచిస్తావు, నాకు నచ్చిందో లేదో ఆలోచించవు.

పని చెయ్యటంలో ఆనందం నీకు తెలుసు. గానీ ఏ పని చెయ్యనివ్వకపోతే పడే కష్టం ఏంటో నాకు తెలుసు.

అసలు నన్ను ఏదైనా చెయ్యనిస్తేగా నా బాధేంటో తెలియటానికి. నీకు ఏదైనా ప్రాబ్లెం వస్తే ఎదురింటి రిటైర్డు ముసలాయన్ను సలహా అడుగుతావు. నన్ను అడగవు. నాతో మాట్లాడు రాధా…ఫ్రెండ్లీగా వుండు రాధా…

రాధ : ఆ మాట అనేది నేను కదండీ (గద్గద స్వరంతో)

గోపి : అంటావు. కానీ వుండవు. ఎందుకంటే అంతా నువ్వనుకున్నట్లే జరగాలి కదా

ఈ కూరలు కొనాలో నువ్వే చెప్తావు. నాకెలా వుంటుందో తెలుసా. నాకు ఆ కాకరకాయ నచ్చదూ అని గొంతెత్తి అరవాలనిపిస్తుంది. నేను తినను అని పారిపోవాలనిపిస్తుంది.

బజారుకెళ్ళి చికెన్ తెమ్మంటావు. అక్కడికి వెళ్లేలోగానే పక్కింటి కుర్రాడిని పంపి వాడి చేతే అది బేరమాడించి కొనిపించేస్తావ్. నవ్వుతున్నారు రాధా బజారులో అందరూ.

నేనేదో క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటాను. గానీ నువ్వు నేను "సాగే జీవితం 34233 వ ఎపిసోడ్" చూసి ఆనందించాలనుకుంటావ్. అదే నాకిష్టమని అందరితో చెప్తావు.

నేనేదో మాడి పోయిన మసాలా దోశ ఒకటి వెయ్యాలనుకుంటాను. కానీ నువ్వు దానిని ఇంకా బాగా, అందంగా ఎలా చెయ్యెచ్చో చెప్తూ నా దోశ కూడా నువ్వే వేసేసి సరదా పడిపోతావ్. నేనెలా చెయ్యాలో కూడా నువ్వే చెప్ర్తుంటే ఇంకా నేనెందుకు రాధా దోశలు వెయ్యటం?

చివరికి షేవింగ్ ఎలా చేసుకోవాలో కూడా నువ్వు చెప్తుంటే గడ్డం అస్సలు తెగటం లేదు రాధా. నీకు తెలీదు. నువ్వు చెప్పింది చెయ్యలేక, నాకు నచ్చింది చెప్పలేక నరకం అనుభవించాను రాధా. నరకం.

ఈ ఫ్రస్టేషన్, బాధ ఎవరిమీద చూపించాలో తెలియక ఒక సారి మన టామీ మీద గట్టిగా అరిచాను కూడా. అది ఇప్పటికీ నా వైపు అనుమానంగా చూస్తునేవుంది. దగ్గరికి రావటం లేదు.

సరే, నేనిప్పుడు ధోనీలా జుత్తు పెంచాలి అంతే గదా? మీసాలు తీసెయ్యాలి అంతే కదా. చేస్తాను రాధా. నేను అవి చేస్తే ఛండాలంగా వుంటానని తెలుసు. అయినా చేస్తాను.

భార్యగా నువ్వు ఇన్నాళ్లు ఉప్పొంగిపోతున్నావు కదా? నువ్వలా ఉప్పొంగిపోవటం కోసం గత ఏడు సంవత్సరాలుగా నేను భర్తగా ఓడిపోతూనే వున్నాను రాధా. ఇలా ఓడి పోతూ వుంటే మరో మూడేళ్ళలో నా పెళ్ళి జీవితం ఏంట్రా అని చూస్తే, అందులో నేనుండను. నువ్వుంటావు. అంతా నువ్వే వుంటావు.

Friday, November 09, 2007

ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే

రాత్రి హ్యాపీ డేస్ సినిమాకెళ్లాను. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ (మన నగరానికి అదొక నగ అని చంద్రబాబు అభిప్రాయం) రాత్రి పది నలభై అయిదు నిమిషాలకు సినిమా అయితే నేను దాదాపు తొమ్మిదిన్నరకే చేరుకున్నా (ఇంటర్నెట్ కొనుగోలు కాబట్టి). నా స్నేహితుడు రావటానికి ఇంకా సమయముండటం వలన అటూ ఇటూ తిరుగుతుండగా సెక్యూరిటి మనుషులు నా దృష్టిని ఆకర్షించారు. అసలు వీల్లెలా పని చేస్తున్నారో చూద్దామని ఆసక్తిగా గమనించటం మొదలు పెట్టా…

అక్కడ రెండు సెక్యూరిటీ ద్వారాలున్నాయి. చెక్కతో చేసినవవి. కాబట్టి కాస్త చవకవే కొనుక్కున్నట్టున్నారు. రెండింటి గుండా పొలో మని జనాలు రావటం మొదలుపెట్టారు. మగవాళ్ళందరిని ఆపి ఏదో తడమాలన్నట్లు తడిమి వదులుతున్నారు.( నన్ను తనిఖీ చేసినపుడయితే వాడి చెయ్యి నా మొబైల్ని ముట్టలేదు కూడా). ఈలోగా కొంతమంది స్త్రీలు వచ్చారు. లోపలికి వచ్చాక దిక్కులు చూస్తున్నారు. బహుశా తనిఖీ చేస్తారని అనుకుంటా..

మీరెళ్ళండి మేడమ్ అని వారిని లోపలకు పంపేసారు. ఇక అప్పటి నుంచి వస్తున్న స్త్రీలందరికి ఇదే తంతు. మరి ఇదే రకం సెక్యూరిటినో అర్ధం కాదు. మగోల్లేమన్నా బాంబులు బుర్రలో పెట్టుకుని పుట్టారా? ఆడోల్లలో ఆత్మహత్యా బాంబర్లు వుండరా? అసలే ఈ మధ్య ఆడోల్లు మగాళ్ళతో పొట్టలలో సమానత్వం సాధించేసారు. (సీరియస్ గా తీసుకోవద్దు…ఇది మా ఆఫీస్లో ఆడోల్లు వేసుకునే జోకే…:-))

నేను వుండబట్టలేక వెళ్ళి వాడినడిగా. వాడు నా వైపు చూసి హి హి అని నవ్వాడు. నేను కాస్త సీరియస్ గా చూసేసరికి "నన్నడుతారేంటండి…మానేజర్ని అడగండి" అన్నాడు. వాళ్లే అమ్మాయిలను పెట్టటం లేదు ఈ పనికి…మేమేం చేస్తాం సార్ అన్నాడు. అయితే మీ మానేజర్ని పిలు అన్నాను. వాడికి లైట్లు ఆరిపోయాయి. మౌనంగా తన పని తను చెయ్యటం మొదలుపెట్టాడు. మరీ తిడితే ఫీలవుతాడేమొనని నేను నోర్మూసుకుని సినిమా చూడటనికి పోయాను. ఇక్కడ సంగతేంటంటే స్త్రీలను తనిఖీ చేసే స్త్రీలు రాత్రి తొమ్మిది తర్వాత పని చెయ్యరంట. మరి ఈ పద్దతితో వాళ్ళ సెక్యూరిటీ ఏ విధంగా ఏడుస్తుందో అర్ధం అవుతుంది.

ఆ ద్వారాల నుంచి పోతుంటే ఒక సారి కుయ్ మని , ఒక కుయ్ కుయ్ కుయ్, కక్, క్వీ అంటుంది. ఈ భాషకు అర్ధం వాళ్లకు తెలుసా అంటే…ఏమో చెప్పలేం.

ఏది ఏమైనా పేరు గొప్ప వూరు దిబ్బ అన్న నానుడి ఈ ప్రసాద్ ఐమాక్స్ కు సరిపోతుంది. పాప్ కార్న్, ఖరీదయిన మంచి నీరు అమ్మటానికి కుప్పలు కుప్పలు జనాలుండే ఈ థియేటర్లో ప్రేక్షకుడి రక్షణ ఒక "చేతి తడుముడు" పొడవు మాత్రమే.

మాకు తెలీదేటి మరి

ఏటండీ ఈ ఇడ్డూరం. నీ సంగతి నాకు తెలుసంతారొకరు….సె ఎల్లెహె నీ సంగతి నాకూ తెలుసంతాడింకొకాయన. మరి తెలిస్తే మాకు సెప్పకుండా ఎందుకూంతున్నారు బాబు. అహ నా కర్ద్గం గానేదు కానీ, ఈ సంగతులేవో సెప్పేత్తే మా బాగా వుంటాది కదా.

ఓహొ మా బాబులు మా సెవుల్లో పువ్వుల్నేవండీ. మాకందరికీ మీ ఇద్దరి సంగతులూ తెలుసునండీ బాబులు. ఏటి? అలా సూత్తారేటి. ఎందుకు మిమ్మల్ని అదే పనిగా గుద్ది గుద్ది గెలిపిత్తన్నామనా?

అదేనండి మా జన్మలో చేసుకున్న ఖర్మ..

మీరంతే రోజు గుప్పెళ్లు, గుప్పెళ్లు కారం, వుప్పు తింతారు. మాకు అవి అట్టుకురావటానికి సొమ్ములేవి? అందుకే మామవి తినం.

అందువల్ల మాకు సిగ్గు నేదు, శరం నేదు. వోట్లు గుద్ది మిమ్మల్ని ఆ మాయదారి ఇల్లు, అదేటండి అంటారు….ఆ ఏదో అసెంబులీ అని….అక్కడికి పంపుతాం. కొట్టుకు సావడానికి మీ జిమ్మలరిగి పోయేలా…

Thursday, November 08, 2007

ఒప్పించే శక్తి ఒక వరం

ఈ మధ్యన ముంబైలో ఒక సెమినార్ కు హాజరయ్యాను. ఆ సెమినార్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ ఫర్ సాఫ్ట్ వేర్ ఆర్కిటక్ట్స్ అనే అంశం మీద ఒకాయన అద్బుతంగా ప్రసంగించాడు. అందులో నాకు బాగా నచ్చింది "conviction" అనే అంశం. మనం చెప్పేది తప్పా? ఒప్పా అనే విషయం ఎక్కడా పనిచెయ్యదు. మనం ఎదుటివారిని కన్విన్స్ చేసామా లేదా? అనేదే ముఖ్యం. అందుకు ముందర మనలని మనం కన్విన్స్ చేస్తుకోవటం చాలా ముఖ్యం. ప్రముఖ వార్తా పత్రికలు చేసేది అదే. అవి రాసేది తప్పుడు వార్తలయినా ఈ "conviction" అనే దానిని మహా బలంగా వాడుతాయి. జనాలలో వున్న Negative Pulse ని బాగా లాగి లాగి ఒక్క సారి వదిలి, అప్పుడు విషయాన్ని రాస్తాయి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. పైన చెప్పిన వక్త ఒక మంచి జోకు కూడా చెప్పాడు (ప్రసంగం మొత్తం నవ్విస్తూనే వున్నాడనుకోండి)

ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు.

అది ఒక సాఫ్టు వేర్ నిపుణుడు చూసి, అతనిని ఎలా అయినా ఆపాలని…కేకలు వేస్తూ ఒక్కసారి ఆగు వస్తున్నా అని అరిచాడు

అతడు మనోడి వైపు చూసి, కొద్ది సేపు ఆగాడు…

అతికష్టం మీద ఆ శిఖరం ఎక్కి అతని దగ్గరకు వెళ్ళాడు

ఒక పది నిముషాలు వాళ్లిద్దరు మాట్లాడుకున్నాక……

ఇద్దరూ ఆ శిఖరం మీది నుంచి దూకి చచ్చారు.

అదన్న మాట "conviction" కి వున్న శక్తి. :-)

Sunday, November 04, 2007

ఎంత అందమైన లోకం? - లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్

ఈ పాట నాకు జాజ్ సంగీతంలో తెలిసిన ఏకైక పాట. అత్యంత ఇష్టమైన పాట. రాప్సోడీలో ఈ పాటను రోజుకొక్కసారయినా వినాలనిపిస్తుంది.
మీరు వినండి. ఈ పాటను ప్రఖ్యాత జాజ్ గాయకుడైన లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ పాడారు. ఆనందం, మార్దవం, ఆప్యాయత అంతా ఒకే సారి చూడాలనుకుంటే లూయిస్ పాడుతున్నపుడు అతన్ని చూడాలి.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name