Thursday, November 29, 2007

నిప్పులాంటి నిజాం

పైన రాసిన టైటిల్ని చూస్తే మీకు ఒళ్ళు మండిందా? అయితే మీరు ఖచ్చితంగా తెలంగాణా స్వాతంత్ర సమరయోధుల కష్టాలతో తడిసిన చరిత్ర తెలిసిన వారయి వుంటారు. మరి ఇప్పుడు అనుకోకుండా నిజాం నిప్పు ఎలా అయ్యాడబ్బా? పోనీ ఎవడైనా రాత్రి బాగా తాగి మాట్లాడినా చాలా వరకూ నిజాలు కక్కుతారు గానీ ఇలా అడ్డగోలు చరిత్ర మాట్లాడరే ?. ఈ లెక్కన మనకు పాకిస్తాను, బంగ్లాదేశు కూడా అద్భుతమైన పాలకులు పరిపాలించిన దేశాల క్రిందే లెక్క.పోనీ మన మాష్టారు నిజమే చెప్పారనుకుందాం...మరి ఆ లెక్కన తెలంగాణా ఉద్యమం ఎవరికి ఎదురొడ్డి జరిగింది? అది కూడా కొంపతీసి వలస వాదుల మీదేనా? రజాకార్లందరూ తూర్పు గోదావరి, గుంటూరుల నుంచి భూములు కొనటానికి వచ్చిన తురుమ్ ఖాన్లా? సరిగ్గా చెప్తే చరిత్ర మార్చేసుకుంటాం కదా?

పీవీ నరసింహారావు గారి ఆటో బయోగ్రఫీ చదువుతుంటే అందులో ఆనంద్ పాత్రధారి పర్షియన్ భాష చదివి, అది ఎందుకు చదవాల్సి వచ్చిందో చెప్తూ వుంటే మనిషన్న వాడికి మంట పుట్టటం ఖాయం.ఫలక్ నుమా వాడు కట్టాడు, అసెంబ్లీ హాలు వీడు కట్టాడు అని చెప్పేముందర అవి ఇప్పుడు వాడుతున్న కారణాల కోసం అప్పటి రోత నవాబులు కట్టలేదని పిల్లి పిడికిలంత మెదడున్నవాడికెవడికైనా అర్ధం అవుతుంది.మరి అంత మంచి నిజాము ఇక్కడుండకుండా టర్కీ ఎందుకెళ్ళి బతుకుతున్నాడో ఈ మన నవాబుకే తెలియాలి.

2 comments:

anil said...

ఇది ఓటుబాంక్ రాజకీయమా!
అవును అన్నది జవాబైతే, మరి నిజాం మతస్థులకి అవగాహనకి వచ్చి ఉండదా?
తెలంగాణా ప్రాంత ప్రజలకి అర్ధం కాదా?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

నేను రాయాలనుకుని మానేసినది మీరు రాశారు. నెనర్లు. నేనెందుకు మానేశానంటే- ఎలాగూ తెలంగాణా రాదని నాకు నేను తగినన్ని కారణాల వల్ల తృప్తిచెందాను గనుక ఆ దిశగా వృథాప్రయత్నం చేసేవాళ్ళ మాటలకు నేను స్పందించడం కూడా వృథానే అనిపించింది.

నిజాం ఉన్నంతకాలం తెలంగాణా ఎక్కడుంది ? అప్పుడున్నది నైజామే కదా !

నాకు మొదట్నుంచి ఒక సందేహం - ప్రత్యేక తెలంగాణా ఔత్సాహికులు తమ కార్యక్రమాలకు పెట్టే పేర్లలో తెలుగు కాకుండా ఉర్దూనే ఎందుకుంటుంది ? అని. తెలంగాణా ధూమ్ ధామ్ మొ.చూడండి. ఇదొక రకం fore-taste కాదు గదా !

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name