Saturday, September 30, 2006

నిమజ్జనం చేసాక వినాయకుడు ఏం చేస్తాడబ్బా?

మనం లక్షల గణపతులను నిమజ్జణం చేస్తాం కదా...నీటిలో మునిగాక గణేశుడు ఏం చేస్తాడబ్బా అని వచ్చిన కొంటే ఊహకు రూపం కల్పిస్తే ?

ఉల్టా చోర్ కొత్వాల్‍కో డాంటే

దీన్నే కాస్త తెలుగులో చెప్పుకోవాలంటే : ఎద్దు తన తోక మీద కాలేస్తే పిల్లి ఎలక వంక ఎర్రగా చూసిందంట :-)

కాకపోతే ఇక్కడ 'ఈనాడు' ఎలక కానే కాదు, అక్కడే వచ్చింది చిక్కు మన "భగవంతుని పాలనకు".

దొరికింది దొరికినట్లు మేసెయ్యవచ్చు అనుకొని వేసుకున్న డొంకలు తీగలు లేకున్న కదుల్తున్నాయి. మీరు మీ ప్రభుత్వం లో తిన్నారు, మేము ఎందుకు తినకూడదు అన్నట్లుగా ఉంది ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తాము చిక్కుల్లో పడ్డట్లు తెలియగానే ఇక అతి దరిద్రమైన రాజకీయం మొదలయింది. గత ప్రభుత్వం ఐ.ఎమ్.జి సంస్థ కు లీజుకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుని దానిపై సీ.బీ.ఐ విచారణ మొదలుపెట్టింది. ఎంత సిగ్గు చేటు. అంటే పత్రికలు ఈ భూబాగోతం బయటపెడితేనే ఇట్లాంటివి ప్రభుత్వానికి గుర్తొస్తాయా? లేకపోతే చూసీ చూడనట్లు సర్దుకుపోవటమేనా?

 

ఇవన్నీ కాక పత్రికల మీద దుమ్మెత్తి పొయ్యటం, ప్రెస్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేస్తామనటం పరిపక్వత లేని, హుందాతనం అస్సలు లేని చేతకానితనాన్ని చూపిస్తుంది. ఈ రోజు ఈనాడు తన మీద వస్తున్న ఆరోపణల మీద విరుచుకు పడిన తీరు నాకు చాలా నచ్చింది.

కొన్ని మంచి చెణుకులు

"పత్రికల మీద విశ్వాసం లేకుంటే ఒక్క రోజులో వాటిని వదిలించుకోవచ్చు, కానీ వచ్చిన చిక్కల్లా, మీ లాంటి నాయకులను ఒక సారి ఎన్నుకున్న తరువాత , ఐదేళ్ళ పాటూ మోయక తప్పదు ప్రజలకు !"

"పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నయని ఆక్షేపిస్తున్నారు వై.ఎస్. అవును అందులో తప్పేముంది? ప్రతిపక్షాల్లా కాక అధికార రాజపత్రికలలా ఉండాలా?"

ఇక ఇందిరమ్మ రాజ్యం మీద మంచి వ్యాఖ్యలు పడ్డాయి. ఇందిరమ్మ రాజ్యం అనిచెప్పి అమాయకులను మోసం చెయ్యొచ్చేమో గానీ, ఆ ఇందిరమ్మ గారు ఏలిన చీకటి రాజ్యం, మొండిగా భ్రష్టు పట్టించిన విదేశీ సంబంధాలు, అవివాహితులకు బలవంతపు కుటుంబ నియంత్రణలు, తమిళ తీవ్రవాదులకు పెరటి సాయం తెలిసిన వాడెవడయినా నవ్విపోతాడు. ఇంకా ఇందిరమ్మ వ్యక్తిత్వం మీద ఏవైనా భ్రమలు ఉంటే పుపుల్ జయకర్ (ఇందిర స్నేహితురాలు) రాసిన బయోగ్రఫీ చదవాల్సిందే. ఎమ్బీఎస్ ప్రసాద్ గార "పడక్కుర్చీ కబుర్లు" లో చెప్పినట్లు భారత దేశం లో నెహ్రూ కుటుంబ పరిపాలన నెహ్రూ తోనే అంతమయ్యింది. తరువాత నుంచి ఇందిరమ్మ కుటుంబ పాలనే !

ప్రజాస్వామ్యాన్ని నక్క తెలివితేటలతో హత్య చేసెయ్యటం ఇందిర తోనే మొదలయ్యింది. ఇందిర హత్య గానీ, రాజీవ్ హత్య గానీ త్యాగలనీ చెప్పలేము. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందంట ఒక చీమ; రాజీవ్ విషయంలో అది చీమ కాదు, తమిళ పులి. ఇప్పుడు బుష్ చేస్తున్నదీ అదే...అనుభవిస్తాడు.

Thursday, September 28, 2006

మరో పద్మ వ్యూహమా? - 1

భాగ్యనగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య భూతంలా పెరిగిపోతుంది.ఇది ఎంత తీవ్రంగా ఉంది అంటే;గ్రామ ప్రాంతాలలోని ప్రజలు,మా నగరంలో ట్రాఫిక్ ఇలా ఉంటుంది అంటే నవ్వి పోతారు. అయితే దీనికి ఎవరు బాధ్యులు? అతి వేగంగా అభివృధ్ధి చెందుతున్న ఈ నగరం ఇకనైనా మేలుకోకుంటే త్వరలోనే బెంగుళూరులా చెడ్డపేరు తెచ్చుకోవటం ఖాయం.ఇక మనం ఈ నాణేనికి రెండు వైపులా చూద్దాం.


పోలీసులు మాత్రం ట్రాఫిక్ అనేది మాకు సంబంధించిన విషయం కాదన్నట్లే ఉన్నారు. నగర అదనపు కమీషనరు మాత్రం నెలకోసారి తూతూ అని ఒక రెండు పత్రికా సమావేశాలు నిర్వహించేస్తున్నారు.

నేను గమనించిన విషయాలలో ముఖ్యమైనవి ఇవి. (ఈ రోజు సమస్యలు మాత్రమే రాస్తా...పరిష్కారాలు తరువాతి టపాలో)

  • మన రోడ్లు, వాటి ప్రమాణాలు అతి చెత్తగా ఉన్నాయి.
  • వాటి నిర్మాణం కూడా చాలా అశాస్త్రీయం.
  • పోలీసులు అతి కొద్ది మంది ఉన్నారు. (కావలసిన దానికంటే ఒక పది రెట్లు తక్కువ)
  • అతి చెత్త ఆటో డ్రయివర్లు
  • బాధ్యతలేని ఆర్టీసి బస్సు డ్రయివర్లు
  • అస్సలు లేనే లేని ర్యాపిడ్ రోడ్ ప్యాచింగ్ టీములు
  • సరిగ్గా రోడ్డు వంపులలోనే నిర్మించిన బస్ (ఆటో?) స్టాపులు
  • నామ మాత్రం అక్కడక్కడా నిర్మించిన ఫుట్‍పాత్ లు.
  • రోడ్ మీద మాత్రమే నడిచే తొంభై శాతం జనాభా
  • నత్త నడక నడిచే ఫ్లై ఓవర్ నిర్మాణాలు
  • రోడ్లను మింగేస్తూ అక్రమ నిర్మాణాలు, అడ్డంగా గుడులు, మసీదులు, శ్మశానాలు
  • ప్రభుత్వ ట్రాఫిక్ సమాచార వ్యవస్థ లేదు
  • దారుణస్థితిలో ఉన్న మురుగునీటి వ్యవస్థ.
  • అడ్డదిడ్డమైన పార్కింగులు, అక్రమ పార్కింగులు
  • క్రమ పధ్ధతిలేని రోడ్డు తవ్వకాలు

 పైన పేర్కొన్నవి కాక, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఎన్నో విదేశీ యాత్రలు చేసి కూడా మన అధికారులు పని దగ్గరకొచ్చేసరికి ఆవులింతలు తీస్తున్నారు. పోలీసులలో చాలా మందికి కొన్ని రూల్సే తెలియవు. జాగ్రత్తగా గమనిస్తే వారి ఉద్యోగం పట్ల నిరాసక్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

Wednesday, September 27, 2006

ఏడు తరాలు

ఈ రోజు జీ స్టూడియో వారు అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ధ రచన "రూట్స్" ఆధారంగా నిర్మించిన టెలీ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రసారం చేశారు. నవల నన్ను కదిలించినంతగా ఈ చిత్రం కదిలించలేకపోయింది.

కాకపోతే హృదయాన్ని కలచివేసే "ఏడు తరాలు" మరలా చదవాలనిపించే ఆసక్తి పుట్టింది.

Monday, September 25, 2006

విని వినిపించు లైఫ్ అందించు

బిగ్ 92.7 : ఈ కొత్త ఎఫ్.ఎం ప్రసార వాహిక మెచ్చుకోదగినదిగా వుంది. వ్యాఖ్యాతలు అధిక ప్రసంగం, అనవసరపు దీర్ఘ్హాలు తీయకుండా స్ప్రష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నాల్లు ఉంటుందో తెలియదు గానీ, ప్రస్తుతానికి ఈ ప్రసార వాహిక నా మదిలో వరల్డ్ స్పేస్ తరువాత స్థానాన్ని పొందింది.

Wednesday, September 20, 2006

విశాఖ థియేటర్ల సమ్మెలో న్యాయం ఎంత?

గత నాలుగు రోజులుగా విశాఖలో థియేటర్ల మూసివేత చూస్తే మనవాళ్ళు సమ్మెకు కాదేదీ అనర్హం అనుకుంటున్నారు. నగర అదనపు కమీషనర్ మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఒక హాలుని మూత వేస్తే, మిగతా థియేటర్లు ఆ కసిని ప్రేక్షకుల మీద తీర్చుకుంటున్నారు.

ఆ సంగతి అటు ఉంచితే, విశాఖ థియేటర్లలో ఈ విధమైన సౌకర్యాలు ఉన్నాయి.

  •  అతి చెత్తగా, రోజుకు ఒక సారి శుభ్రం చేసే టాయిలెట్లు.
  • పార్కింగు పైన కట్టేసిన థియేటర్లు (రమాదేవి)
  • అసలు కారు పార్కింగు కూడా లేక పోవటం (జగదాంబ)
  • ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే తినుబండారాలు
  • కనీస అగ్ని మాపక సదుపాయాలు, అగ్ని మాపక యంత్రం తిరిగే సదుపాయం కూడా లేక పోవటం. (ఏదో ఒకటి జరిగితేనే మన ప్రభుత్వం హడావిడి చేస్తుంది.)

ఎన్ని రోజులు సినిమాలు ఆపేసినా ఫర్వాలేదు కానీ, ఈ థియేటర్లు బాగుపడ్దాకే వాటికి అనుమతి ఇస్తే బాగుంటుందేమో...

Tuesday, September 19, 2006

ఐ.ఐ.టి కోర్సులు ఆన్‍లైన్ లో...

మన దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలయిన భారత సాంకేతిక విద్యాలయాలు అన్ని పాఠ్యాంశాలను వెబ్బీకరించే ప్రయత్నం మొదలుపెట్టాయి. దీని వలన అత్యున్నత ప్రమాణాలు కలిగిన పాఠాలు అన్ని స్థాయిల విద్యార్ధులు చదువుకునే వీలు కలుగుతుంది.

ఈ లంకెను అనుసరించండి.

  • http://nptel.iitm.ac.in
  • కోర్సులపై నొక్కండి.
  • కొత్త సభ్యునిగా చేరండి.
  • మీరు ఇప్పుడు అన్ని పాఠ్యాంశాలను చదవగలరు.

మంటగలసి పోయిన ఎమ్‍సెట్

ఎమ్‍సెట్ ని దిగ్విజయంగా మంటగలిపేసారు. దేశంలో ఐ.ఐ.టి లాంటి పరీక్షల స్థాయిలో కాకునా మన ఎమ్ సెట్‍ని అంతో ఇంతో గౌరవించేవారు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రతరం కావటం, కోచింగు సెంటర్లు పోటీ పడి పిల్లల్ని చదివించటం, తల్లితండ్రుల బుర్రల్లో డాక్టరు, ఇంజనీరు తప్ప ఇంకేమీ వుండక పోవటమూ లాంటి కారణాలతో ఎమ్‍సెట్ ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉండేది.

అప్పుడే మన ప్రభుత్వాలకు దానిపై కన్ను పడింది. వీధికో కళాశాల పెట్టేస్తే మన పిల్లోల్లు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోయి వాళ్ళ ఇంటిపేరు నిలపెడతారు, మనకి కూడా బోలెడంత ఫీజు డబ్బులు, కాలేజీల డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి గేట్లు ఎత్తేసారు. ఇప్పుడు సీట్లే సీట్లు. మనకు బుర్ర ఉందా లేదా? లేకా ప్రభుత్వం రుమాలు (రిజర్వేషన్లు) వుందా లేదా అక్కరలేదు. ఎలాగో ఒకలా ఇంటర్ అయిపోతే చాలు. మన కోసం ఒక ఇంజనీరింగు సీట్ తయారుగా వుంటుంది. ఎమ్‍సెట్ కూడా రాయనక్కరలేదు. దేవుడి దయవలన ఆ కోర్సు అయిపోతే బీ.టెక్  అని చెప్పి ఎదో ఒక కంపనీ దొడ్డిదారిలో సాప్టువేరు ఇంజనీరు కావచ్చు, లేకా మంచి కాంట్రాక్టరు అయ్యి బోలెడంత సంపాదించి చచ్చు పుచ్చు ఆనకట్టలు కట్టవచ్చు.

ఇక డబ్బు ఉండీ లేని మధ్యతరగతి ఇంజనీర్లు ఏం చేస్తారబ్బా? ఇంక ఏం చేస్తారు? ఈ వీధి కళాశాలలో పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్లు వాళ్ళే కదా ! నాకు తెలిసీ అన్ని చిన్నా చితకా ఇంజనీరింగు కళాశాలలో  అందరూ ఈ కుర్ర ప్రొఫెసర్లే.


ఒక్క ఉపయోగం ఏమిటంటే, ఇక తల్లి తండ్రులకి కొద్దిగా స్వాంతన. ఎవడూ మీ అబ్బాయికి సీటు రాలేదా  అని దెప్పడు...పిల్ల్లల ఆత్మహత్యలు తగ్గుతాయి.  అసలు ఎమ్‍సెట్ నే తీసేస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది.కోచింగు సెంటర్ల గాలీ తగ్గుతుంది.

Saturday, September 16, 2006

కౌసల్యా సుప్రజా రామా...

ఈ రోజుకీ మన చెవులలో మారు మోగే ఒక పవిత్రమైన మేలుకొలుపు. ఆ పవిత్రతకు ప్రాణం పోసిన అమరజీవికి ఈ రోజు తొంభైవ జయంతి.

ఈ అసలు సిసలైన భారత రత్నానికి ఇవే హార్దిక నివాళులు.

ఇలా ఉంటే ఎలా ఉండేదో మన ప్రపంచం

అద్భుతమైన ఈ వీడియో చూడండి. ఈ ప్రకటన ప్రతిష్టాత్మకమైన ఎపికా బహుమతి గెలుచుకుంది.

ఇలాంటిదే ఆపిల్ వారి మరొక ప్రకటన...కాకపోతే ఇది వివాదాస్పదమైంది.

వెనకబడిన వాళ్ళ్సు ఎవరు?

తెలంగాణా వాణి ప్రధానంగా వెనుకబాటుతనం అన్నది తెలిసిందే. ఈ విషయంలో అసలు సందేహమే అక్కరలేదు.

టీ.జీ వెంకటేష్ : రాయలసీమ వెనకబడి వుంది.

రాయపాటి : ఆంధ్ర వెనకబడి వుంది. (ఇతనికి గుంటూరు తప్పితే ఇంకో ప్రాంతం తెలిసినట్లు లేదు).

కోస్తా మీద ఎవరూ ఇంతవరకూ మాట్లాడలేదు...(వాళ్ళు రాజకీయంగా కూడా వెనుకబడినట్లున్నారు :-))

ఇవన్నీ చూస్తోంటే రెండు విషయాలు అర్ధం అవుతున్నాయి.

౦౧. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వెనుకబడి వున్నాయి (ప్రపంచబ్యాంకు అప్పులు చూస్తే తెలుస్తాయి)

౦౨. అందరు రాజకీయ నాయకులు తమ భవిష్యత్తుకు బాటలు ఇలా వేర్పాటు కూతల ద్వారా వేసేసుకుంటున్నారు.

అంత వరకూ ఎందుకూ, మన రాజధాని నగరంలోనే పూటకి తిండిలేని అభాగ్యులు ఎంత మందో...

రైతుల ఆత్మహత్యలకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ తేడా లేదు.

కాంట్రాక్టర్ల, భూబకాసరుల పాపాలకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ తేడా లేదు.

కుల వివక్షతకు, వరకట్నాలకూ, హత్యలు, అభధ్రతకూ, అశాంతికి ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ తేడా లేదు.

మన రాష్ట్రం వంద రాష్ట్రాలైనా వీటి పెద్దగా ఎదురుండక పోవచ్చు. ఏమంటారు.

Friday, September 15, 2006

అంతా మన మంచికే...^%$#@#

ఈ మధ్య వింటున్న అప్పు ముక్కలు (క్రెడిట్ కార్డులు) వాళ్ళ ఆగడాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. ప్రధమ దశలో వారి నక్క వినయాలు, మీరు అప్పు పడ్డాక వారి హైనా అరుపులు...ఇవన్ని వారికి గురుకులంలో పెట్టిన విద్యలు. దీనికి ఏ బ్యాంకు మినహాయింపు కాదు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం చాలా తక్కువ. ఈ కాకా పనులు, ముక్కుపిండే పనులు బయటి కంపనీలు వీరికి చేసిపెడతాయి. అందువల్లన మీరు ఎంత పెద్ద, పాత వినియోగదారు అయినా, వాళ్ళు వారి బాష లోనే పని చేస్తారు. తస్మాత్ జాగ్రత్త సుమాండీ...

ఇదే విషయం మీద ఈ మధ్య నాకు ఒక హాస్య గుళిక ఈ-టపా లో వచ్చింది. అది ఇక్కడ మీ కోసం తెలుగులో....


ఒక జంట అలా విహారయాత్రకు వెళ్ళి వద్దామని, మలేషియాకు దక్కన్ అయిర్ లైన్స్ వారి  విమానం చెన్నయ్ లో ఎక్కారు. వారితో పాటూ ఒక ఇరవై మంది ప్ర్రయాణీకులూ వున్నారు. కొంత దూరం సాఫీగా ప్రయాణించాక విమానం తాలుకా ఇంజన్ ఒకటి పనిచెయ్యటం మానేసింది(ఇది దక్కన్ కు మామూలే).

పైలట్ తాపీగా విషయాన్ని ఇలా ప్రకటించాడు. "ధైర్యవంతులు, సాహసికులైన ప్రయాణికులారా ! మీరు ప్రయాణిస్తున్న విమానం యొక్క రెండు ఇంజన్‍లలో ఒకటి ఇప్పుడే పనిచెయ్యటం మానేసింది. రెండవది కూడా అతి తొందరలో  ఆగిపోవచ్చు. అందువల్లన మనం మధ్యలోనే ఎక్కడో విమానాన్ని దింపెయ్యటం తప్పని సరి. ప్రస్తుతం  నేను ఒక పేరు తెలియని ద్వీపం మీద క్రాష్ లాండింగ్ చెయ్యబోతున్నాను. మీరు మీ శేష జీవితాన్ని ఈ ద్వీపం పైనే గడపటానికి సిధ్ధపడండి. ఎందుకంటే ఇది ఎవ్వరికి తెలియని ద్వీపం మరియు మన రేడియో పాడయ్యింది కూడా.."

ఏడుపులు , పెడ బొబ్బలు నేపధ్యం‍లో విమానం ద్వీపం మీద దిగింది. అందరూ దేవుడా ఇక్కడ ఎలా జీవితం గడపాలిరా బాబు అని ఇటూ అటూ చూడటం మొదలుపెట్టారు.

అప్పుడు మన కథా నాయకుడు (జంటలో) ఆదుర్దాగా తన భార్యని అడిగాడు. " నువ్వామధ్య అలుక్కాస్ లో కొన్న వజ్రాల హారానికి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టావా? ముందర కట్టాల్సిన తొంబైవేలకు నేను ఇచ్చిన చెక్కు డ్రాప్ బాక్సులో వేసావా? అన్నాడు.

భార్యకు ఒక్కసారి గుండె గతుక్కుమంది. ఆమె ప్రయాణం హడావిడిలో ఆ పనులు మర్చిపోయింది. "లేదండీ...మరి మరి ..." అంటూ భయంగా భర్త వైపు చూసింది.

మన హీరో ఒక్కసారిగా ఎగిరి గంతేసి భార్యను ముద్దుల్తో ముంచెత్తాడు.

"వాళ్ళు తప్పక మనలని కనుక్కుంటారు" పరమానందంగా అరిచాడు.

Wednesday, September 13, 2006

ఇది ఒక పరీక్ష

నాకు గత వారం రోజులుగా ఈ బ్లాగర్ తో తెగ చిక్కులొస్తున్నాయి. ఎన్ని సార్లు కొత్త పోస్ట్ జత చేసినా కూడా అది కేవలం ఒక్క గంట లో విచిత్రంగా మాయమవ్వటం. తీరా బ్లాగర్ సహాయ సమూహాలు గాలిస్తే నాలాంటి అభాగ్యులు అక్కడ ఎంతో మంది వున్నారని అర్ధం అయ్యింది. బ్లాగర్ సాంకేతిక సహాయ బృందంలో మహా అయితే ఇద్దరు ఉద్యోగులు వుంటారేమో, రోజులు గడిచిపోతున్నా మీ బాధ మాత్రం పట్టించుకోరు. ఎంతైనా గూగుల్ కదా, మనమూ పెద్దగా ఇలాంటి చెత్త సర్వీసును పెద్ద మనసుతో పట్టించుకోం...

Friday, September 08, 2006

తెలుగు వికీపీడియా శోధన

ఇప్పుడు దాదాపు అన్ని (ఐ.యి 7, ఫైర్ ఫాక్స్ 1.5 మొదలైనవి) కొత్త బ్రౌజర్లు ఓపెన్ సెర్చ్ మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నాయి. అందువలన మనకు కావలసిన శోధనా పరికరాలను బ్రౌజరుకు జత పరుచుకొనవచ్చు. నేను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తెవికీ యొక్క శోధనా యంత్రాన్ని జతపరిచేందుకు కావలసిన సరంజామా ఇక్కడ సిధ్ధం చేసాను.


తెలుగు వికీపీడియా శోధన

మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయగలరు. :-)

నేతి బీరకాయలు

మన తెలుగు ఛానల్స్ బాగా పరిశీలించితే నాకు ఈ క్రమంలో తెలుగుతనం కనిపించింది. చిట్టాలో చివర వున్నవి తెలుగు చానల్లు అని ఇంక చెప్పుకోనక్కరలేదు :-)

01. దూరదర్శన్ - సప్తగిరి
02. ఈనాడు టీ.వీ 2
03. ఈనాడు టీ.వీ
04. జెమిని
05. తేజా
06. మా టీ.వీ
07. టీ.వీ 9 (వీళ్ళ కట్టు బొట్టు కూడా తెలుగు కాదు)

వీటిలో కొన్ని ఛానల్లు, తెలుగులో మాట్లాడి నాలుక్కరుచుకుని ఆంగ్లంలో చెప్పిన సందర్భాలు వున్నాయి. మొత్తం ఆంగ్లపదాలనే కార్యక్రమాలకు పేర్లుగా వాడిన ఛానల్లున్నాయి.

మీరూ మీ అభిప్రాయాలు, క్రమం తెలియచేయండి...

Thursday, September 07, 2006

వందేమాతరం

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం !!
శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల-కుసుమిత-ద్రుమ దళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం

Tuesday, September 05, 2006

తొలి తెలుగు తీర్పు

ఒక హత్య కేసుకు సంబంధించి తెలుగులో తొలి తీర్పు (పూర్తిగా) ను గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదిత్య భాంజ్‌దేవ్ రాష్ట్ర న్యాయ చరిత్రలో తనకొక పుట రాసుకున్నారు.

ఈనాడు నుంచి సేకరణ

Monday, September 04, 2006

చరిత్రలో చెవిలో పువ్వులు

చరిత్ర, పురాణాలు చదువుతుంటే కొన్ని సార్లు అవి అవి రాసిన రచయతల అభూత కల్పనలకు, వక్ర బుధ్ధికి బలయి పోయాయేమొ అనిపిస్తాయి. ఎవరో చెప్పినట్లు చరిత్ర విజయవంతులు, బలవంతులు చుట్టూనే తిరుగుతుంది. శతాబ్దాల తరబడి ప్రజలను మోసగిస్తూ వుంటుంది.

ఉదాహరణకి : గెలీలియో పీసా శిఖరం ప్రయోగం.

అందరూ దీన్ని గురించి చదివే వుంటారు. గురుత్వాకర్షణ కు భారంతో సంబంధం లేదని నిరూపించడానికి గెలీలియో పీసా శిఖరం నుంచి ఒక సీసపు గుండును, పావురాయి ఈక ను వదిలాడని,అవి రెండూ ఒకే సారి భూమి మీద పడ్డాయని సవాలక్ష పుస్తకాలలో రాసేసారు. అయితే మీరు ఆ ప్రయోగమే ఒక వంద సార్లు చేసినా సీసపు గుండే ముందు భూమిని తాకుతుంది.ఎందుకంటే అక్కడ చాలా ప్రసిద్ధమైన జడత్వం, ఘర్షణ అనే కారకాలు పనిచేస్తాయి. ఇక్కడ గెలీలియో చేసిన ప్రయోగం తప్పు కాదు. చేసిన వర్ణన తప్పు. నిజానికి సీసపు గుండుని, పావురాయి రెక్కని ఒక శూన్య నాళికలో వదిలితే అవి ఒకే సారి భూమిని తాకుతాయి.

ఇలాంటివి చరిత్ర పుస్తకాలలో కోకొల్లలు.

Saturday, September 02, 2006

జ్వాలా జంబూకం

ఈ రోజు ఫైర్ ఫాక్స్ 2.0 బీటా 2 వ్యవస్థాపితం చేసాను. చాలా బాగుంది. మొదలవ్వటానికి కొంత సమయం పట్టినా కూడా, అంతా శుభ్రంగా అందంగా అనిపించింది. ముఖ్యంగా పుటలు (టాబ్స్) పొందిగ్గా వున్నాయి. అయితే తెలుగు చదవటంలో వున్న ఇబ్బందులు ఇంకా తొలిగిపోలేదు :-( ఒత్తులు, నుడికారాలు అన్ని విడిపోతున్నాయి. పద్మను కూడా వ్యవస్థాపితం చేసి చూడాలి.

అసలు ఫైర్ ఫాక్స్ మొదటి పుట (గూగుల్ శోధన) తెలుగు లో మార్చి అన్ని సైబర్ కేఫ్ లలో వ్యవస్థాపితం కోసం పంచితే ఎలా వుంటుంది? ఆ పుట లో తెలుగు వికీ, బ్లాగర్లు, దినపత్రికల లింకులు వుంచితే ఇంకా ఫలితం వుండవచ్చు.

(నా బ్లాగులో ఇది షష్టి పూర్తి టపా :-))

ఇంటర్నెట్ నిశ్శబ్దం

గత వారం రోజులుగా నేను ఇంటర్నెట్ నిశ్శబ్ధంలో వున్నాను. దానికి కారణం నేను శలవు పెట్టేసి ఇంటికి చెక్కెయ్యటమే కాక మరేమీ కాదు :-) నిన్నటి నుంచి మా ఇంట్లో కూడా ఇంటర్నెట్ ప్రపంచం మొదలయ్యింది. భారత సంచార నిగమం వాళ్ళకు కృతఙ్ఞతలు. చాలా నాణ్యమైన సేవలు అందిస్తున్నారు.
About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name