Tuesday, September 19, 2006

మంటగలసి పోయిన ఎమ్‍సెట్

ఎమ్‍సెట్ ని దిగ్విజయంగా మంటగలిపేసారు. దేశంలో ఐ.ఐ.టి లాంటి పరీక్షల స్థాయిలో కాకునా మన ఎమ్ సెట్‍ని అంతో ఇంతో గౌరవించేవారు. ఎందుకంటే పోటీ చాలా తీవ్రతరం కావటం, కోచింగు సెంటర్లు పోటీ పడి పిల్లల్ని చదివించటం, తల్లితండ్రుల బుర్రల్లో డాక్టరు, ఇంజనీరు తప్ప ఇంకేమీ వుండక పోవటమూ లాంటి కారణాలతో ఎమ్‍సెట్ ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉండేది.

అప్పుడే మన ప్రభుత్వాలకు దానిపై కన్ను పడింది. వీధికో కళాశాల పెట్టేస్తే మన పిల్లోల్లు అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోయి వాళ్ళ ఇంటిపేరు నిలపెడతారు, మనకి కూడా బోలెడంత ఫీజు డబ్బులు, కాలేజీల డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి గేట్లు ఎత్తేసారు. ఇప్పుడు సీట్లే సీట్లు. మనకు బుర్ర ఉందా లేదా? లేకా ప్రభుత్వం రుమాలు (రిజర్వేషన్లు) వుందా లేదా అక్కరలేదు. ఎలాగో ఒకలా ఇంటర్ అయిపోతే చాలు. మన కోసం ఒక ఇంజనీరింగు సీట్ తయారుగా వుంటుంది. ఎమ్‍సెట్ కూడా రాయనక్కరలేదు. దేవుడి దయవలన ఆ కోర్సు అయిపోతే బీ.టెక్  అని చెప్పి ఎదో ఒక కంపనీ దొడ్డిదారిలో సాప్టువేరు ఇంజనీరు కావచ్చు, లేకా మంచి కాంట్రాక్టరు అయ్యి బోలెడంత సంపాదించి చచ్చు పుచ్చు ఆనకట్టలు కట్టవచ్చు.

ఇక డబ్బు ఉండీ లేని మధ్యతరగతి ఇంజనీర్లు ఏం చేస్తారబ్బా? ఇంక ఏం చేస్తారు? ఈ వీధి కళాశాలలో పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్లు వాళ్ళే కదా ! నాకు తెలిసీ అన్ని చిన్నా చితకా ఇంజనీరింగు కళాశాలలో  అందరూ ఈ కుర్ర ప్రొఫెసర్లే.


ఒక్క ఉపయోగం ఏమిటంటే, ఇక తల్లి తండ్రులకి కొద్దిగా స్వాంతన. ఎవడూ మీ అబ్బాయికి సీటు రాలేదా  అని దెప్పడు...పిల్ల్లల ఆత్మహత్యలు తగ్గుతాయి.  అసలు ఎమ్‍సెట్ నే తీసేస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది.కోచింగు సెంటర్ల గాలీ తగ్గుతుంది.

0 comments:

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name