Friday, September 15, 2006

అంతా మన మంచికే...^%$#@#

ఈ మధ్య వింటున్న అప్పు ముక్కలు (క్రెడిట్ కార్డులు) వాళ్ళ ఆగడాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. ప్రధమ దశలో వారి నక్క వినయాలు, మీరు అప్పు పడ్డాక వారి హైనా అరుపులు...ఇవన్ని వారికి గురుకులంలో పెట్టిన విద్యలు. దీనికి ఏ బ్యాంకు మినహాయింపు కాదు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం చాలా తక్కువ. ఈ కాకా పనులు, ముక్కుపిండే పనులు బయటి కంపనీలు వీరికి చేసిపెడతాయి. అందువల్లన మీరు ఎంత పెద్ద, పాత వినియోగదారు అయినా, వాళ్ళు వారి బాష లోనే పని చేస్తారు. తస్మాత్ జాగ్రత్త సుమాండీ...

ఇదే విషయం మీద ఈ మధ్య నాకు ఒక హాస్య గుళిక ఈ-టపా లో వచ్చింది. అది ఇక్కడ మీ కోసం తెలుగులో....


ఒక జంట అలా విహారయాత్రకు వెళ్ళి వద్దామని, మలేషియాకు దక్కన్ అయిర్ లైన్స్ వారి  విమానం చెన్నయ్ లో ఎక్కారు. వారితో పాటూ ఒక ఇరవై మంది ప్ర్రయాణీకులూ వున్నారు. కొంత దూరం సాఫీగా ప్రయాణించాక విమానం తాలుకా ఇంజన్ ఒకటి పనిచెయ్యటం మానేసింది(ఇది దక్కన్ కు మామూలే).

పైలట్ తాపీగా విషయాన్ని ఇలా ప్రకటించాడు. "ధైర్యవంతులు, సాహసికులైన ప్రయాణికులారా ! మీరు ప్రయాణిస్తున్న విమానం యొక్క రెండు ఇంజన్‍లలో ఒకటి ఇప్పుడే పనిచెయ్యటం మానేసింది. రెండవది కూడా అతి తొందరలో  ఆగిపోవచ్చు. అందువల్లన మనం మధ్యలోనే ఎక్కడో విమానాన్ని దింపెయ్యటం తప్పని సరి. ప్రస్తుతం  నేను ఒక పేరు తెలియని ద్వీపం మీద క్రాష్ లాండింగ్ చెయ్యబోతున్నాను. మీరు మీ శేష జీవితాన్ని ఈ ద్వీపం పైనే గడపటానికి సిధ్ధపడండి. ఎందుకంటే ఇది ఎవ్వరికి తెలియని ద్వీపం మరియు మన రేడియో పాడయ్యింది కూడా.."

ఏడుపులు , పెడ బొబ్బలు నేపధ్యం‍లో విమానం ద్వీపం మీద దిగింది. అందరూ దేవుడా ఇక్కడ ఎలా జీవితం గడపాలిరా బాబు అని ఇటూ అటూ చూడటం మొదలుపెట్టారు.

అప్పుడు మన కథా నాయకుడు (జంటలో) ఆదుర్దాగా తన భార్యని అడిగాడు. " నువ్వామధ్య అలుక్కాస్ లో కొన్న వజ్రాల హారానికి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టావా? ముందర కట్టాల్సిన తొంబైవేలకు నేను ఇచ్చిన చెక్కు డ్రాప్ బాక్సులో వేసావా? అన్నాడు.

భార్యకు ఒక్కసారి గుండె గతుక్కుమంది. ఆమె ప్రయాణం హడావిడిలో ఆ పనులు మర్చిపోయింది. "లేదండీ...మరి మరి ..." అంటూ భయంగా భర్త వైపు చూసింది.

మన హీరో ఒక్కసారిగా ఎగిరి గంతేసి భార్యను ముద్దుల్తో ముంచెత్తాడు.

"వాళ్ళు తప్పక మనలని కనుక్కుంటారు" పరమానందంగా అరిచాడు.

2 comments:

spandana said...

గమ్మైత్తైన హాస్యం.
collections వాళ్ళ గురించి బాగా చెప్పింది.

--ప్రసాద్
http://charasala.wordpress.com

Anonymous said...

హాస్యపూరకంగా చెప్పినా అది అచ్చంగా నిజమేనండి. :-)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name