Monday, April 23, 2007

శత చిత్ర టప టప చిటపట టప టపావళి

హమ్మయ్య చాన్నాళ్లకు కొన్ని నవయవ్వన చిత్ర రాజాలను క్లిక్కు మనిపించి నా చిత్ర బ్లాగు సెంచరీ పూర్తి చేసా :-) ఈ సందర్భంగా నా చిత్ర టపాలకు ప్రేరణనిచ్చిన గురు ద్రోణులెందరికో మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాతో మూడు కళ్లూ పంచుకున్న నా కెమెరాలకు (ముఖ్యంగా నా DSC - P72 కు) ఈ సంధర్భంగా నా కృతజ్ఞతలు.

ఈ మధ్య జత చేసిన మూడు చిత్రాలు రామోజీ చిత్ర ప్రపంచ వీధిలో అసలు కనిపించని అందాలను బంధించినవి.

కూల్ క్లిక్కుల కిక్కులకు ఇక్కడ నొక్కండి

Saturday, April 21, 2007

పెరటి దేవుడీ వెంకటేశ్వరుడు

అసలే వేసవి. ఆపై భయంకరమైన రద్దీ. దేవుడిపై భారం వేసి రోజుల తరబడి క్యూ కాంప్లెక్సులలో కాపురాలు గడిపే పరమ భక్తులు..ఆహా ఏమి విశేష అభిమానులునారయ్యా వెంకు బాబు నీకు :-)

మరి వీళ్లందరిని ఇలా పడిగాపులు కాయించి పెరట్లో నుంచి అమితాబు కుటుంబానికి పెరటి దేవుడివైపోయావే? ఇది న్యాయమా? అసలే వీ.ఐ.పీ విహారాలతో పోటెత్తి పోతున్న తిరుమలలో ఇదొక కొస మెరుపా? లేదా 'సిరి' ఉన్నవాడిదే వేంకటేశ్వరమా?

రేపు చి..ల.సౌ. ఐష్ బచ్చన్ గారు, తన నూతన భర్త చి. అభి తో నీ దర్శనానికి వచ్చి కేవలం గంట అంటే గంటలో అన్నీ ముగించుకుని విమానమెక్కి పోతారంట గదా? ఆహా దేశ అభివృద్ధితో పాటు నీ పూజారుల బుర్రలు కూడా ఏమి అభివృధ్ధి చెందుతున్నాయి స్వామీ ? అటు ముగ్గురు, ఇటు ముగ్గురు పూజారులు ఐషమ్మ చుట్టూ రేపు వుండక పోతే నన్నడుగు. పందెమా?

Wednesday, April 18, 2007

మొబైల్ ఫోన్ ను వెతికి పట్టుకోవటం ఎలా?

మీ గర్ల్ ఫ్రెండు గానీ, బాయ్ ఫ్రెండు గానీ "నేను ఆఫీసులో వున్నాను, పని మీద వున్నాను" లాంటి సాకులు చెప్తున్నట్లు మీకనిపిస్తే తక్షణం ఈ ఉపగ్రహ సాఫ్టువేర్ ద్వారా వారిని ఎక్కడున్నారో ఇట్టే పట్టెయ్యొచ్చు. కేవలం వారి మొబైల్ నంబరు ఇస్తే చాలు...వారి మొబైల్ సిగ్నల్ బట్టి ఏ ప్రాంతం (కూకట్ పల్లి, అమీర్ పేట లాంటివి) చెప్తుంది.

మొదటి నాలుగు సంఖ్యలు ఒక పెట్టెలో, మిగతావి మరొక పెట్టెలో వేసి సెర్చ్ నొక్కండిక.....

http://www.sat-gps-locate.com/

Thursday, April 12, 2007

పిల్లికి చెలగాటం…ఎలుకకి ప్రాణ సంకటం [కొసరుతో]

అంత అనుకున్నట్లే అయ్యింది. నేను ఎప్పుడు ఈ యూనిపోల్ జైంట్ హోర్డింగులు చూసినా ఒకటే అనుకుండే వాడిని. ఏదైనా తుఫాన్ వస్తే ఏంటబ్బా సంగతి అని. సరేలే చాలా బలమైనవి కాబోలు అనుకునే వాడిని. MCH వారి ధన దాహానికి మరొక ప్రాణం బలి అయ్యింది. ప్రతీ కిలోమీటరుకూ ఒక హోర్డింగు. పార్కుల మధ్యలో, ఆఖరుకు ఇళ్ల మధ్యలో కూడా…వై.యస్ ఇంటి ముందర అయితే మరీ దారుణం. మొత్తం హోర్డింగు రోడ్డు పైనే వుంటుంది. వీటికి సర్వ వేళలా విద్యుత్తు సరఫరా వుంటుంది. దాని పైన యాడ్ లేక పోయినా సరే….ఫలానా వారిని యాడ్ కోసం సంప్రదించండి అని రాత్రంతా వందల యూనిట్లు ఖర్చు చేస్తూనే వుంటారు.

అసలు ఎందుకు ఇవి పెరిగాయి? అని చూసుకుంటే MCH వారి ఆశ తప్ప మరోటి కనిపించదు.

రోడ్డు మధ్యలో చెట్లు వున్నాయో లేవో గానీ, చిన్న చిన్న విద్యుత్తు బోర్డులు వందలు, వేలు నగరమంతటా…ఒకే యాడ్ ను ఆ రోడ్డు మొత్తం చూపించటం వీటి ప్రత్యేకత. ఇవి తెల్లవారు ఝాము వరకూ వెలుగుతూనే వుంటాయి. విచిత్రంగా సైబర్ గేట్ వే దగ్గర అయితే ఇవి మాత్రమే వెలుగుతుంటాయి..వీధి దీపాలు వెలగవు. అదీ సంగతి.

ఇక హోర్డింగులు….ఒకొక్కటి ఇరవై టన్నుల బరువు. హోరిత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే. సీరియస్ గా నడుపుతున్న వాడికి హఠాత్తుగా ఆకర్షించే హోర్డింగులు ఎన్నో. ఒక్క మాదాపూర్ లోనే ఇవి దాదాపు పది వరకూ వున్నాయి. ప్రతీ నగరం పైన ఒక రకమైన వాయు వాతావరణం వుంటుంది. గాలి రకరకాల దిశలలో తిరుగుతూ వుంటుంది. పార్కులు, జలాశయాలు ఎక్కువ వుంటే ప్రజలకు మంచి గాలి అనుభూతి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ హోర్డింగులు దానిని కాల రాస్తున్నాయి. ఈ భారీ హోర్డింగులు మొత్తం నగర ఉపరితలంలో వుండే గాలిని అడ్డుకుని స్థంభింప చేస్తున్నాయి. ఈ కారణం వలన ముంబయి కొలాబా ప్రాంతంలో హోర్డింగులు నిషేధించారు. మన పాలకులకు అసలు బుర్రలు ఎప్పుడు పని చేస్తాయో ఇంక. దీనికి తోడు ప్రాణ నష్టం. ఇరవై టన్నుల హోర్డింగు పడితే? ఎలా వుంటుంది? నిన్ననే చూసాను. భీభత్సంగా వుంది ఆ ప్రాంతం. మూడు కార్లు నుజ్జు, కనీసం ఒక పది మంది చనిపోయే ప్రమాదం..అదృష్టవశాత్తు ఆ సమయంలో అంతగా ట్రాఫిక్ లేదు.

ఇప్పుడు కొత్తగా LCD హోర్డింగులు వస్తున్నాయి. ఇందులో ఏకంగా పాటలు, సినిమా యాడ్లు చూపిస్తున్నారు, అసలు డ్రైవింగ్ చెయ్యాలా, ఇవి చూడాలో తిక మక. చాలా మంది ఇప్పటికే సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు, దానికి తోడు ఇప్పుడు ఇవి. ఎవడి ప్రాణాన్నో తీసుకుని గానీ వీటి వైపు చూడదు ప్రభుత్వం.

ఇక పాద చారుల వంతెనలు…బాగా కడుతున్నారు. అయితే…వాటిని హోర్డింగులు పెట్టుకోవటానికే కడుతున్నారేమో అనిపిస్తుంది. సింగపూర్ లా చేస్తాం అని వాగేటఫ్పుడు, కనీసం కొన్ని అయినా సింగపూర్ లా చెయ్యాలి కదా. సింగపూర్లో ఈ పాద చారుల వంతెనలు చాలా ఎక్కువ. అయితే వాటిని అందంగా పూల తీగెలతో అలంకిరిస్తారు. మనం వాటిపై కూడా ఫోటోలు దిగేంత అందంగా…మరి ఇక్కడా? అసలు ఆ వంతెన మీద ఒకరి మీద అత్యాచారం చేసినా బయటకు కనపడనంతటి భారీ హోర్డింగులతో మొత్తం వంతనలను కప్పేస్తున్నారు. ఎవరైనా సరే ఆ యాడ్ చూసుకుంటూ వెళ్లవలసిందేనన్న్న మాట.

ఇలా చెప్పుకుంటు పోతే టన్నుల కొద్ది మేధావి తనం బయటపడుతూనే వుంటుంది.

వారికది కాసులాట…మన ప్రాణాలకు సంకటం. నగరజీవి…నీ సగటు ఆయుష్షు ప్రతి రోజు లెక్క పెట్టుకోవాల్సిందే..

 

నిన్న చెప్పటం మరిచా…కొత్త రకం యాడ్‌ మార్కెటింగు కూడా వస్తోందిప్పుడు. అదేమిటంటే ఒక పెద్ద ట్రక్ వాహనం మీద భారీ హోర్డింగును వూరంతా తిప్పడం. అది కూడా మంచి ట్రాఫిక్ రద్దీ సమయాలలో. ఆ సమయంలో అయితే ఎక్కువ మంది చూస్తారు కదా…అదీ అవుడియా అన్నమాట.

కొస మెరుపు :

నిన్నటి ఈదురు గాలులకు చిరిగిపోయిన జైంట్ యాడ్ హోర్డింగుల ప్రకటనలను మొత్తం శుభ్రం చేశారు. ఇప్పుడు చాలా వాటికి కేవలం ఫ్రేములు మాత్రమే వున్నాయి. అయితే కళ్ళు జిగేల్మనిపించే విద్యుత్తు కాంతులు మాత్రం యధాతధం. ఈ భాధ్యతారాహిత్యం మీద ఎవరికి, ఎలా ఫిర్యాదు చెయ్యాలో కాస్త తెలిస్తే చెప్పండి దయ చేసి..

Wednesday, April 11, 2007

ప్రాణ సంకట బాదు

మన భాగ్యనగరంలో ఒక రోడ్డును దాటాలంటే సామాన్యమా? మన మీద నుంచైనా వాహనాన్ని పోనిస్తారేమో కానీ, ఆపే సమస్యే లేదు. ఇది చూడండి. తీసిన వ్యక్తి ఎవరో గానీ గుండె ధైర్యం మస్తుగా వున్నవాడు.

Saturday, April 07, 2007

మౌనమేలనోయి...ఈ మరపురాని రేయీ

గాత్రం : ఎస్.జానకి

చిత్రం : సాగరసంగమం

Thursday, April 05, 2007

ఆకాశం ఏనాటిదో...అనురాగం ఆనాటిది.

మనందరిని సుస్వర స్వర ఝరిలో ముంచి తేల్చడమే ఊపిరిగా బ్రతుకుతున్న మన జానకి పాటలలో కొన్ని వరుసగా ఇక్కడ వుంచడానికి ప్రయత్నిస్తా. 

Wednesday, April 04, 2007

మూడు వందల వీరులు

300. ఇది ఒక సినిమా పేరు. గత ఆదివారం ఈ సినిమా చూశాను. లక్షల మంది వున్న పర్షియన్ సైన్యాన్ని స్వేచ్చనే వూపిరిగా, వీరత్వాన్ని ఆభరణంగా ధరించే ఒక స్పార్టన్ రాజు (లియొనార్డైస్) మెరికల్లాంటి, మడమ తిప్పని మూడు వందల యోధులతో ఎలా ఎదుర్కున్నాడో చూపే చిత్రం ఇది. 480 BC లో జరిగిన థెర్మోపైలే యుద్ధ అధారంగా దీనిని నిర్మించారు.

అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో చూడదగ్గది. గ్లాడియేటర్ చిత్రాన్ని కొన్ని చోట్ల గుర్తుకు తెస్తుంది. అరే రస్సెల్ క్రో ఈ చిత్రంలో రాజు పాత్ర పోషించాల్సింది అని అనిపించింది కాసేపు.

దర్శకుడు గంటన్నర పాటూ అసలు సుత్తి అనేదే కొట్టకుండా ప్రేక్షకులను ఆ యుగంలోనికి తీసుకు పోయాడు.

క్సెరెక్సెస్ అనే పర్షియన్ రాజు వేషధారణ కూడా చాలా విచిత్రంగా వుంటుంది. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

అయితే చిన్న పిల్లలను మాత్రం ఈ సినిమా చూడనివ్వక పోవటం మంచిది. రక్తం ఏరులై పారటం, శవాలు గుట్టలై పడటం అతియోశక్తులు అసలే కావు ఈ చిత్రంలో…అసలు శవాలతో ఒక గోడనే కట్టే సీను కూడా ఉంది.

స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వుంటాయి. సాంకేతికంగా "ఇరగ దీసారు" :-) యుద్ధ సన్నివేశాలు అయితే చెప్పనక్కరలేదు. లక్షల మంది వచ్చి పడినా సడలని ధైర్యం, యుద్ధ నైపుణ్యం చూపించడంలో చాలా శ్రద్ధ చూపించారు.

ప్రేమ, స్వేచ్చ, రాజ కర్తవ్యం, నాయకత్వ పటిమ, ధీరత్వం వంటివి ఈ చిత్రం తాలుకా కధా వస్తువులు.

2007 ఆస్కార్ పందెంలో పాల్గొనే ధైర్యం నిండుగా వున్న చిత్రం ఇది.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name