Thursday, April 12, 2007

పిల్లికి చెలగాటం…ఎలుకకి ప్రాణ సంకటం [కొసరుతో]

అంత అనుకున్నట్లే అయ్యింది. నేను ఎప్పుడు ఈ యూనిపోల్ జైంట్ హోర్డింగులు చూసినా ఒకటే అనుకుండే వాడిని. ఏదైనా తుఫాన్ వస్తే ఏంటబ్బా సంగతి అని. సరేలే చాలా బలమైనవి కాబోలు అనుకునే వాడిని. MCH వారి ధన దాహానికి మరొక ప్రాణం బలి అయ్యింది. ప్రతీ కిలోమీటరుకూ ఒక హోర్డింగు. పార్కుల మధ్యలో, ఆఖరుకు ఇళ్ల మధ్యలో కూడా…వై.యస్ ఇంటి ముందర అయితే మరీ దారుణం. మొత్తం హోర్డింగు రోడ్డు పైనే వుంటుంది. వీటికి సర్వ వేళలా విద్యుత్తు సరఫరా వుంటుంది. దాని పైన యాడ్ లేక పోయినా సరే….ఫలానా వారిని యాడ్ కోసం సంప్రదించండి అని రాత్రంతా వందల యూనిట్లు ఖర్చు చేస్తూనే వుంటారు.

అసలు ఎందుకు ఇవి పెరిగాయి? అని చూసుకుంటే MCH వారి ఆశ తప్ప మరోటి కనిపించదు.

రోడ్డు మధ్యలో చెట్లు వున్నాయో లేవో గానీ, చిన్న చిన్న విద్యుత్తు బోర్డులు వందలు, వేలు నగరమంతటా…ఒకే యాడ్ ను ఆ రోడ్డు మొత్తం చూపించటం వీటి ప్రత్యేకత. ఇవి తెల్లవారు ఝాము వరకూ వెలుగుతూనే వుంటాయి. విచిత్రంగా సైబర్ గేట్ వే దగ్గర అయితే ఇవి మాత్రమే వెలుగుతుంటాయి..వీధి దీపాలు వెలగవు. అదీ సంగతి.

ఇక హోర్డింగులు….ఒకొక్కటి ఇరవై టన్నుల బరువు. హోరిత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే. సీరియస్ గా నడుపుతున్న వాడికి హఠాత్తుగా ఆకర్షించే హోర్డింగులు ఎన్నో. ఒక్క మాదాపూర్ లోనే ఇవి దాదాపు పది వరకూ వున్నాయి. ప్రతీ నగరం పైన ఒక రకమైన వాయు వాతావరణం వుంటుంది. గాలి రకరకాల దిశలలో తిరుగుతూ వుంటుంది. పార్కులు, జలాశయాలు ఎక్కువ వుంటే ప్రజలకు మంచి గాలి అనుభూతి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ హోర్డింగులు దానిని కాల రాస్తున్నాయి. ఈ భారీ హోర్డింగులు మొత్తం నగర ఉపరితలంలో వుండే గాలిని అడ్డుకుని స్థంభింప చేస్తున్నాయి. ఈ కారణం వలన ముంబయి కొలాబా ప్రాంతంలో హోర్డింగులు నిషేధించారు. మన పాలకులకు అసలు బుర్రలు ఎప్పుడు పని చేస్తాయో ఇంక. దీనికి తోడు ప్రాణ నష్టం. ఇరవై టన్నుల హోర్డింగు పడితే? ఎలా వుంటుంది? నిన్ననే చూసాను. భీభత్సంగా వుంది ఆ ప్రాంతం. మూడు కార్లు నుజ్జు, కనీసం ఒక పది మంది చనిపోయే ప్రమాదం..అదృష్టవశాత్తు ఆ సమయంలో అంతగా ట్రాఫిక్ లేదు.

ఇప్పుడు కొత్తగా LCD హోర్డింగులు వస్తున్నాయి. ఇందులో ఏకంగా పాటలు, సినిమా యాడ్లు చూపిస్తున్నారు, అసలు డ్రైవింగ్ చెయ్యాలా, ఇవి చూడాలో తిక మక. చాలా మంది ఇప్పటికే సెల్ ఫోన్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్నారు, దానికి తోడు ఇప్పుడు ఇవి. ఎవడి ప్రాణాన్నో తీసుకుని గానీ వీటి వైపు చూడదు ప్రభుత్వం.

ఇక పాద చారుల వంతెనలు…బాగా కడుతున్నారు. అయితే…వాటిని హోర్డింగులు పెట్టుకోవటానికే కడుతున్నారేమో అనిపిస్తుంది. సింగపూర్ లా చేస్తాం అని వాగేటఫ్పుడు, కనీసం కొన్ని అయినా సింగపూర్ లా చెయ్యాలి కదా. సింగపూర్లో ఈ పాద చారుల వంతెనలు చాలా ఎక్కువ. అయితే వాటిని అందంగా పూల తీగెలతో అలంకిరిస్తారు. మనం వాటిపై కూడా ఫోటోలు దిగేంత అందంగా…మరి ఇక్కడా? అసలు ఆ వంతెన మీద ఒకరి మీద అత్యాచారం చేసినా బయటకు కనపడనంతటి భారీ హోర్డింగులతో మొత్తం వంతనలను కప్పేస్తున్నారు. ఎవరైనా సరే ఆ యాడ్ చూసుకుంటూ వెళ్లవలసిందేనన్న్న మాట.

ఇలా చెప్పుకుంటు పోతే టన్నుల కొద్ది మేధావి తనం బయటపడుతూనే వుంటుంది.

వారికది కాసులాట…మన ప్రాణాలకు సంకటం. నగరజీవి…నీ సగటు ఆయుష్షు ప్రతి రోజు లెక్క పెట్టుకోవాల్సిందే..

 

నిన్న చెప్పటం మరిచా…కొత్త రకం యాడ్‌ మార్కెటింగు కూడా వస్తోందిప్పుడు. అదేమిటంటే ఒక పెద్ద ట్రక్ వాహనం మీద భారీ హోర్డింగును వూరంతా తిప్పడం. అది కూడా మంచి ట్రాఫిక్ రద్దీ సమయాలలో. ఆ సమయంలో అయితే ఎక్కువ మంది చూస్తారు కదా…అదీ అవుడియా అన్నమాట.

కొస మెరుపు :

నిన్నటి ఈదురు గాలులకు చిరిగిపోయిన జైంట్ యాడ్ హోర్డింగుల ప్రకటనలను మొత్తం శుభ్రం చేశారు. ఇప్పుడు చాలా వాటికి కేవలం ఫ్రేములు మాత్రమే వున్నాయి. అయితే కళ్ళు జిగేల్మనిపించే విద్యుత్తు కాంతులు మాత్రం యధాతధం. ఈ భాధ్యతారాహిత్యం మీద ఎవరికి, ఎలా ఫిర్యాదు చెయ్యాలో కాస్త తెలిస్తే చెప్పండి దయ చేసి..

2 comments:

చదువరి said...

బాగా రాసారు. బేగంపేట దగ్గరి పాద వంతెన చూసినపుడు నేనూ సరిగ్గా మీలానే అనుకుంటాను - ఆ వంతెన మీద, హోర్డింగు మాటున ఏం జరిగినా మూడో కంటి వాడిక్కూడా తెలీదు. అన్నట్టు, వీటిలో కొన్నిటిని సరసాదేవి కట్టిస్తోందట!

Anonymous said...

బాగా చెప్పావ్ సుధాకర్... అసలే ఇరుకు రోడ్లు ఆ పైన హొర్డింగ్లు. ఫిరియాదు చేయడం మంచిదే గాని, పట్టించుకొనే నాధుడే లేడు, ఉన్నా పట్టించుకోరు.వీళ్ళకి చిత్తసుద్ధి ఉంటే ఎప్పుడో బాగున్ను.ఈ వ్యవస్థ లో కొన్ని ఖటినమైన మార్పులు వస్థె గాని సుఖం లేదు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name