రాజకీయ నాయకులకు దిక్కుమాలిన తెలివితేటలు మెండు అని నిరూపించాలంటే మన కె.సి.ఆర్ ని ఒక పది నిమిషాలు మాట్లాడిస్తే చాలు. అతని ది.మా.తె లకు కొన్ని మచ్చు తునకలు.
"ఆంధ్రా వాళ్ళు సొరకాయ అంటారు, తెలంగాణా వాళ్ళు ఆనపకాయ అంటారు." :- ఇతనెప్పుడైనా ఉత్తరాంధ్ర మొహం చూస్తే కదా తెలిసేది. మా వైపు సొరకాయ అంటే ఎవడికీ అర్ధం కాదు, ఆనపకాయ అనే వాడుతారు. అయినా కూరగాయ పేర్లు కూడా వివాదాస్పదం చెయ్యటం ఒక పరాకాష్ట. ఆల్ప్స్ పర్వతాలలో పుట్టిన టొమేటో పండుకు రామ ములగ పండు అని ఓ జమాన కాలం నుంచి పేరు...మరి కె.సి.ఆర్ బజారుకు వెలితే ఏ పదం వాడుతాడో? తెలంగాణా కూరగాయలపై ఆధిపత్యం వహిస్తున్న ఈ యూరోపియన్ కూరగాయల్ని తరిమేద్దాం అంటాడేమో !
తెలంగాణా వారికి తెలివి లేదని ఆంధ్రా వాళ్లు అంటారంట. ఏంటీ విచిత్ర వాదన? అయ్యా మీతో అలా ఎవరైనా అన్నప్పుడు ఇంత వరకు ఎందుకు ఊరుకున్నారు? పళ్లు రాలగొట్టండి పర్వాలేదు. ఏ ప్రాంతంలోనైనా మీ లాంటి రాజకీయ నాయకులు మాత్రమే ప్రజలంతా తెలివితక్కువ వారని భావిస్తారు. దానికి మీకు ప్రాంతాలతో సంబంధం లేదులెండి.
జొన్నన్నం తిని బతికి గుంటూరు వాసులు ఇప్పుడు తెలంగాణా నీటి వనరులు కొల్ల గొట్టి సన్నన్నం తినే స్తాయికి చేరి మనల్ని జొన్నన్నం తినే స్తాయికి దిగ జార్చిండ్రు. సారూ...జొన్నన్నం తినే స్తాయి గానీ, పత్తి పురుగుల రైతుల ఆత్మహత్యలు గాని, తెలంగాణాలో తీవ్రమైన ఫ్లోరైడు సమస్య గానీ మీ రాజకీయనాయకుల పుణ్యమే ! మీరు ఎన్ని తెలంగాణా ఊర్లను ఈ సమస్యలనుంచి బయట పడేసారు? ఎన్ని ఊర్లకు మీ ఖర్చుతో టాంకర్లతో నీరు అందిచారు? గుంటూరులో జొన్నన్నం తింటారని ఇప్పటి వరకూ తెలియదు. మీరు ఇంకొకటి తెలుసుకోవాలి. రాయలసీమలో ఇప్పటికి సంకటి తిని పడుకునే ఊర్లు వేల కొలది ఉన్నాయి. కోస్తాలో గంజి తాగి బతికే కుటుంబాలు లక్షలున్నాయి. వారికి జొన్నలు పండవు, సన్నన్నం దొరకదు...మీ రాజకీయ నాయకులిచ్చే ముక్కిపోయిన బియ్యం డీలరు తినేస్తాడు.
చిత్తశుద్ధితో ప్రయత్నించితే తెలంగాణా అదే వస్తుంది, అంతే గానీ ఇలాంటి దిక్కు మాలిన మాటలు మాట్లాడితే మీ వెనక ఉన్న సిద్ధాంతకర్త జయశంకర్ గారే సిగ్గు పడాల్సి వస్తుంది. మీరు సిధ్ధార్ధుడిలా ఇంటిలోనే ఉండి కబుర్లు చెప్పకుండా ఒక్క సారి రధం బయటకు తీసి మొత్తం రాష్ట్రం తిరిగి మాట్లాడితే కొద్దిగా బాగుంటుందేమో కదా?
9 comments:
సుధాకర్ గారూ,
మీ వాదనతో నేను ఏకీభవిస్తాను. కానీ సంగటితో మాత్రం కాదు.
రాయలసీమలో పేదవాళ్ళు సంగటి తినడం నిజమే కానీ, దాని రుచే వేరు. మా ఇంట్లో ఇక్కడ అమెరికాలో కూడా వారానికోసారైనా సంగటి తినకపోతే ఎలాగో వుంటుంది. సంగటి, చెనక్కాయ పచ్చడి అంటే నాకు భలే ఇష్టం (మాంసం తింటున్న రోజుల్లో అయితే సంగటి కోడి పులుసూ ఇష్టం).
--ప్రసాద్
http://charasala.com/blog/
"దిక్కుమాలిని తెలివి కలవాళ్ళలో దిక్కుమాలినోళ్ళు వేరయా."
కలిసి మెలసి ఉన్నోళ్ళ లో లేని సంగతులు చెప్పి రెచ్చ గొట్టడం లో నాయకులు చాలా గొప్ప వాళ్ళు.
చక్క గా చెప్పారు.
విహారి
http://vihaari.blogspot.com
ప్రసాద్ గారు, మీరన్నది నిజమే...నేను ఇక్కడ సదరన్ స్పైస్ అనే చోటకు వెళ్ళ్సి మరీ తింటా...గాని ఈ టపాలో నా అభిప్రాయం ఏమిటంటే, కేవలం అది మాత్రమే తిని (నంచుకోవటానికి మిరపకాయ సంగతి వదిలేయండి)..బతికే కుటుంబాలు ఉన్నాయి.
ఇక్కడ KCR బాధ ఏంటో అర్థం కావట్లేదు. తెలుగువారందరికీ కలిపి ఒకే మాండలికం, ఒకే సంస్కృతి లేదని బాధపడుతున్నాడా ? సంతోషిస్తున్నాడా ? ఒకవేళ అవి ఉంటే వాటిలో లేని భేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడా ? తెలుగువారి మధ్య ఉన్న 90 పోలికల్ని పక్కన పెట్టి 10 భేదాల్ని హైలైట్ చేస్తున్నాడా ? తెలంగాణా అనే ఒక పదం చుట్టూ సుదూర ఖండానికి వర్తించేటంత సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని రాజకీయ సార్వభౌమత్వాన్ని ఐడెంటిటీని అల్లడానికి ఈ బాపతు జనం పడుతున్నది "శ్రమ ఏవ హి కేవలం" అంత సీను లేదని తెలుసుకుంటే మంచిది.
బాగా వ్రాసారు. ఇంతకీ "కె.సి.ఆర్"ను ఆంధ్రాలో ఏమంటారో?
ఏమంటారో తెలియదండి. ఇంతకీ ఆంధ్రా అంటే మన రాష్ట్రం గురించే కదా మాట్లాడుతున్నారు? లేదా ఈ వెధవ రాజకీయాలు సృష్టించిన "తెలంగాణ తప్ప మిగిలిన జిల్లాలు" అనే అర్దంలోనా? :-)
Hey, Good!
According to reliable sources KCR is from uttarandhra (Bobbili)!
I will try to post comments in telugu Next time!
Good!
According to reliable Sources KCR is from BObbili, not from Telangana!
Next time will try to comment in telugu!
పాపం కె. సి .అర్ రాజకియ పార్టిలను, నాయకులను తిట్టడం, తిట్టించుకొవడం అంతా అయిపొయింది ఇంక ఇలా ఉరుకుంటె లాభంలెదను కున్నాడెమొ, ఇలా జనాల పైన పడ్డాడు.
Post a Comment