Wednesday, August 16, 2006

ఆహా...మీడియా...నీకు జోహార్లు

నిన్న టీవీలో ఒక దారుణమైన న్యూస్ వీడియో చూపించారు. మనోజ్ మిశ్రా అనే ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థ అయిన సుధా డైరీ ముందు కూర్చుని తన వంటికి నిప్పు అంటించుకోవటం.

అగ్గి పుల్ల గీసిన దగ్గరనుంచి (రెండు సార్లు వెలగలేదు) మీడియా మహానుభావులు దాన్ని చిత్రీకరిస్తూనే వున్నారు తప్పితే ఆపే ప్రయత్నం చెయ్యకపోవటం దారుణమైన విషయం. కెమెరా ముందరే అతను సజీవంగా మాడిపోయాడు. అది చూస్తున్నప్పుడు నేను మంచం నుంచి అప్రయత్నంగా లేచి నిల్చున్నా...ఏమి చెయ్యలేనని తెలిసినా..:-(


అసలు ఎందుకు ఇలా మానవత్వం మంట కలసిపోతుంది? పోలీసులు కాస్త ఆలస్యం చేస్తే విరుచుకు పడే మీడియా తనకు మాత్రం బాధ్యత అవసరం లేదనుకుంటుందా? రేపు ఎవరైనా నాగర్జున సాగర్ కింద బాంబు అమరిస్తే దాన్ని అమర్చడం వీడియో తీస్తారేమొ గాని, చచ్చినా దాన్ని ఆపరు....

కొన్ని చానల్స్ అయితే "మెరుగైన సమాజం కోసం" అని రాసుకుంటున్నాయి. వారు ఇంటిని చక్క బెట్టి రచ్చ మీదకి బయలుదేరితే మంచిది...

6 comments:

వెంకట రమణ said...

నిన్న ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నాక్కూడా మీలానే అనిపించింది. బహుశా ఆ మంటలు ఆపితే ఆత్మహత్యను రికార్డు చేసి వాళ్ళ చానల్లో చూపే ఆపురూప అవకాశం చేజారి పోతుందను కున్నారేమో..

Sudhakar said...

ఖచ్చితంగా అంతే...వీళ్ళు మనుషులు కారండీ...

త్రివిక్రమ్ Trivikram said...

మీడియా వాళ్ళు ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందొకసారి మనరాష్ట్రంలోనే ఒకతను కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్యాప్రయత్నం చేస్తే అతణ్ణి కాపాడే ప్రయత్నం చెయ్యకుండా అతడి నోట్లో మైకులు పెట్టి ఇంటర్వ్యూ చేశారు. సినీనటుడు బాలకృష్ణ ఇంట్లో హత్యాప్రయత్నం జరిగిన తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన అభిమానులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడే అవకాశముందని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా సదరు అభిమానులు "ఊహించిన"(అంతరార్థం 'ఆశించిన ' అని అనుకోవాలేమో?) స్థాయిలో స్పందించలేదని టీవీ9 విలేకరి చెప్పిన తర్వాత అది అవమానంగా భావించిన అభిమానులు రెచ్చిపోయారు. మొన్నటి 'స్థానిక' ఎన్నికలప్పుడు "ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరుపొందిన కడప జిల్లాలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయని" చెప్తున్నప్పుడు న్యూస్‌రీడర్, విలేకరి ఇద్దరి గొంతుల్లో ధ్వనించిన నిరాశను వర్ణించడానికి మాటలు చాలవు.

spandana said...

ఎవడి కక్కుర్తి వాడిదే.
ఆత్మహత్యను లేదా ఏ నేరమైనా ఆపగలిగీ, చూస్తూ ఆపకపోవటం కూడా నేరమేనన్న నేర నిర్వచనం ఇప్పుడుందో లేదో? వుండకపోతే దాన్ని చేర్చాలి.
ఇంకా ముందుకు పోయి అగ్నిలో తోసి మరీ చిత్రీకరిస్తారేమొ సంచలనం కోసం! హథవిధీ!
-- ప్రసాద్
http://charasala.wordpress.com

వెంకట రమణ said...

ఇందాకనే వార్తలు విన్నాను. ఆ మీడియా వాళ్ళమీద ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు పెట్టారట. రాజకీయనాయకులు ప్రతీకారం తీర్చుకోడానికి తమకు దొరకిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నట్లున్నారు.రాజకీయనాయకుల మీద విలేకరులు పెట్టిన కేసుల్లోలా కాకుండా, వీళ్ళలో కొందరికైనా శిక్ష పడితే ఈ విలేఖరులకి కొంచమైనా బుద్ది వస్తుందేమో..

Naga said...

ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం. ఎంతో దు:ఖం కలిగించే వార్త. వాళ్ళు మనుషులా లేక రాక్షసులా?. విదేశాల్లోనయితే ఈ పాటికి ఆ మీడియా సంస్థ నెత్తిమీద తెల్లగుడ్డ వేసుకునేది, విలేఖరులు జైళ్ళలో ఊచలు లెక్కబెట్టుకుంటూ ఉండేవారు.
మరి పవిత్ర భారతిలో....

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name