Tuesday, May 29, 2007

అమెరికాలో భారతీయ అనుభవం - 3

ఇది నేను చాలా రోజులుగా రాయాలని అనుకుని నాలోని ప్రొక్రాష్టినేటరును జయించలేక వదిలేసిన టపా. గత కొద్ది రోజులుగా ఇది పూర్తి చెయ్యాలనుకున్నాను కానీ, ఈ రోజు సీ.బి. రావు గారి వ్యాఖ్య చూసి, హమ్మో ఈ టపాను గమనిస్తున్నవారు కనీసం ఒక్కరున్నారని కంగారేసి ఇప్పుడు రాస్తున్నాను.

ఈ సోది చదవని వారు ముందర ఇది చదవండి…

తరువాత ఓపికుంటే ఇది చదవండి…

అప్పటికీ నిద్ర రాకపోతే….ఈ టపా చదవండి.

న్యూయార్కు నుంచి సిన్ సినాటి వెళ్లే విమానం ఎలానో వెతుక్కుని తాపీగా కూర్చున్నానే గానీ "బాగా ఆలస్యం అయిందే" అని మనసులో కొద్దిగా పీకుతూనే వుంది ఎందుకంటే నన్ను రిసీవ్ చేసుకోవటానికి రావాల్సిన వ్యక్తి అసలు వేచి ఉంటాడో లేదో తెలియదు. మొత్తానికి ఆ దేశవాళీ విమానం మెల్లగా డల్లాస్-ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగేటప్పటికి రాత్రి పన్నెండు గంటలయ్యింది. డెల్టా వాళ్లకు నా బాగేజీ మిస్ అయిన సంగతి రిపోర్టు చేసి అటు ఇటు చూసాను. విమానాశ్రయం మొత్తం మీద ఒక పది మంది వుంటారేమో. అంత ఖాళీగా వుంది. దగ్గరలో వున్న ఫోన్ నుంచి మా పీ.యమ్ కు ఫోన్ చేద్దామంటే అన్ని ఫోన్లూ క్రెడిట్ కార్డుతో పని చేసేవే. కాసేపు తిట్టుకుని ఎవరైనా నా గురించి లాంజ్ లో వున్నారేమో అని వెతికా…ఒక్కడూ లేడూ. ఎందుకుంటారు? ఏడు గంటలకు రావాల్సిన విమానం పన్నెండుకు వస్తే.

ఇక బయటకు వెళ్లే దారి చూసుకుంటూ నడక ప్రారంభించాను. ఒక దగ్గర క్రిందకు పోతున్న ఎస్కలేటర్ కనిపించింది. సరే చూద్దాం అని క్రిందకు దిగితే అక్కడ ఒక గది, దానికి బయటకు పోయే తలుపు వున్నాయి. ఆ తలుపు తీసుకుని చూస్తే అది పార్కింగుకు పోయే భూగర్బ టన్నెల్ అని అనిపించింది. నర సంచారమే లేదు. అందులో రుయ్యి మని చప్పుడు చేస్తూ చలి గాలి. డల్లాస్ లో పగలు అదిరిపోయే ఎండ, రాత్రి ఇలా చలిగా వుంటుందని తరువాత రోజులలో నాకర్ధం అయింది. సరే ఇక వెనక్కు వద్దామని చూస్తే పైకి వెళ్లే ఎస్కలేటర్ లేదు. అది వన్ వే అన్న మాట. చచ్చి చెడి ఎస్కలేటర్ కు అడ్డం పడి పైకెక్కాను. కాసేపు నడిచాకా బయట అద్దాలు, వాటి వెనుక కొంత మంది మనుషులు కనబడి, అక్కడ ఒక ఎస్కలేటర్ పట్టుకుని క్రిందకు దిగాను.

దూరాన చిన్న టేబుల్ ఒకటి వేసుకుని ఒకమ్మాయి కూర్చుని కనిపించింది. ఆమె చుట్టు ఒక నలుగురు బ్లాక్స్ మాట్లాడుతూ కనిపించారు. మెల్లగా వెళ్లి నా విషయం చెప్పాను. అడ్రెస్ వుందా? అనడిగింది ఆమె. ఉందని చెప్పాక, నేను ఇండియా నుంచి వచ్చానని అర్ధం చేసుకుని "మొహమ్మద్" అని అరిచింది. ఒక గోల్డెన్ కాబ్ వచ్చి ఆగింది. అతను మీ దేశమే, నిన్ను దిగపెడతాడు అని చెప్పి ఆ టాక్సీ ఎక్కించింది.

ఇక టాక్సీలో సంభాషణ భలే నడిచింది. పరిచయాలు అయ్యాక ఆ డ్రయివర్ ఒక పాకిస్తానీ అని తెలిసింది. మనకు చిన్నప్పటి నుంచి పాలతో పాటూ పాకిస్తాన్ అంటే ద్వేషం నేర్పించేస్తారు కాబట్టి, నాకు కొద్దిగా భయం వేసింది. అయితే అతడు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఆ భయం పోగొట్టాడు. మధ్యలో కాఫీ తాగిస్తానని బలవంతం చేసినా, డల్లాస్ అంత మంచి పేరున్న వూరు కాదు కాబట్టి సున్నితంగా తిరస్కరించాను. ఈలోగా రాజకీయాలు మాట్లాడటం మొదలు పెట్టి ఇండియా, పాక్ రాజకీయనాయకులను చెడా మడా తిట్టాడు. కొద్ది సేపటి తరువాత నా అడ్రస్ తీసుకుని ఒక మాప్ తీసి దానిని గుర్తించాడు. అయితే నా ఆఫీస్ వాళ్లు నాకు పొరపాటున తప్పు అడ్రస్ ఇచ్చారు. Colby Street, 2026 అని ఇవ్వబోయి Colby Street 24 అని ఇచ్చారు. కాసేపు రకరకాల ఫోన్లు చేసి మొత్తానికి ఆ వీధిని పట్టేసాడు. ఇక చూడాలి మా పాట్లు. అక్కడ అన్నీ బంగళాలే. మా దగ్గరున్న నెంబరు ఎక్కడా లేదు. ఇలా కాదని అతని ఫోన్ నుంచి నా పీ.యమ్ కు ఒక కాల్ చేసాం. మా పీ.యమ్ పేరు సైమన్ జాన్సన్. అతడు బ్ర్టిటీష్ జాతీయుడు. జనరల్ డయ్యర్ కు స్వయాన ముని ముని ముని మనవడు. అచ్చమైన బ్రిటీష్ యాసలో మాట్లాడే వాడు. ఇక కాల్ ఎత్తిన తరువాత నేను మాట్లాడి డ్రయవర్ కు దారి చెప్పమని మొబైల్ డ్రయవర్ కు ఇచ్చాను. అతను మాట్లాడే ఇంగ్లీష్ నా డ్రయవర్ కు ఒక్క ముక్క అర్ధం కాలేదు. యస్, యస్, యస్..ఓఖే అని పెట్టేసి ఇక తిట్లు మొదలు పెట్టాడు బ్రిటీష్ వాళ్లని. రెండు మూడు రౌండ్లు తిరిగి మొత్తానికి బంగళాని పట్టుకున్నాం. అప్పుడు జరిగింది నేను మరచిపోలేని సంఘటన…మా కోసం చూస్తున్న మా పీ.యమ్ నైట్ గౌన్ వేసుకుని బయట ఎదురు చూస్తున్నాడు. కారు ఆగగానే దగ్గరకి వచ్చి…తలుపు తెరచి నేను దిగటానికి సాయం చేసాడు..

పాకిస్తానీ డ్రయవర్, భారత పాసింజర్….డయ్యర్ వంశంలోని ఒక బ్రిటిష్ వ్యక్తి తలుపు తీసి పట్టుకోవటం ..అంతా మాయలా అనిపించింది.

సాఫ్టువేరు మాతా ! నీకు  వందనాలు అనుకున్నాను :-)

స్వతహాగా ఎంతో మంచివాడైన సైమన్ తరువాత చాలా ఫీలయ్యి విమానాశ్రయంలో ఎవరూ లేనందుకు క్షమాపణ చెప్పాడు.

అదండీ నా మొదటి అమెరికా అనుభవం.

హలో…నిద్రపోయారా?

9 comments:

రానారె said...

నిద్ర'పోయి' లేచామండి. ఇంత మంచి అనుభవం చదువుతూ ఎలా నిద్రపోతాం!? ఈ కథలో నేను చూసిన నీతి: సాటి మనిషిని 'ఫలానా జాతివాడు','ఫలానా కులంవాడు' అనే దృష్టితో చూడటాన్ని కనీసం ఈ కాలంలో అయినా మనం మానుకోవలెను.

పారుపల్లి said...

బాగుందండీ

నవీన్ గార్ల said...

మరి నీ లగేజి సంగతో.....అది కూడా చెప్పు మరి...

cbrao said...

పాకిస్తానీ డ్రయవర్, భారత పాసింజర్….డయ్యర్ వంశంలోని ఒక బ్రిటిష్ వ్యక్తి తలుపు తీసి పట్టుకోవటం ..అంతా మాయలా అనిపించింది. -సుధాకర్

అమెరికాలో భారతీయులు, పాకీస్తానీయులు స్నేహంగా ఉంటారు. కెనడాలో కూడా. ఈ జాతి వైషమ్యాలన్నీ రాజకీయవాదులు తమ స్వార్థానికి పైకి ఎగదోసేవే. తరువాయి కొనసాగించండి. మీ cool clicks ఏవి?

Deepthi Mamiduru said...

chala chala bavundandi me article...chala baga vrasaru..nice to see such an interesting article :)

radhika said...

మన పాత సినిమాల్లో చూపించే బ్రిటిష్,ఇండియావాళ్ళ వేషధారణల్లో మీరు చెప్పిన సీన్ సినిమాలాగా కనిపిస్తుంది నాకు.

భాస్కర్ రామరాజు said...

అన్నా
నాదొక సందేహం
సిన్ సినాటి ఒహాయో అని చెప్పవ్ ముందు. తర్వాత డల్లాస్ అన్నావ్?? అర్ధంకాలా!@#$

శోధన said...

భాస్కర్ రామరాజు గారు,

భలే పట్టుకున్నారే...కంగారుగా రాస్తూ, నేను సిన్ సినాటి నుంచి డల్లాస్ వెళ్లే విమానం అందుకున్నట్లు రాయటం మరిచాను :-)

భాస్కర్ రామరాజు said...

కధలో ఆ ఊహించని మలుపుని కూడా మీశైలిలో గుప్పించండి. నా మేకతనం లో కొన్ని - నేను మొదటిసారి వచ్చినప్పుడు "రెస్ట్-రూం" అంటే అర్ధం కాక బుఱ్ఱగోక్కున్నా. :):)

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name