Monday, May 28, 2007

గుర్తుకొస్తున్నాయీ...గుర్తుకొస్తున్నాయి...

నా జీవితంలో అతి మధురంగా, అలా అలా గడచిపోయిన రోజులు నా చిన్న నాటి రోజులు, పీ.జీ చదువుతున్న రోజులు. అవన్నీ ఒక్క సారి గుర్తుకొస్తే ఛ ! ఏం హైదరాబాదు బ్రతుకురా బాబు అనిపిస్తుంది. ఇక్కడ నా స్నేహితులు కొంత మంది ఒక్క సారి కూడా పొలం గానీ, పల్లెటూరు గానీ చూడలేదంటే నమ్ముతారా? వారి బాల్యం నుంచి పట్టణపు వాసమే. వారికి నా బాల్యం ఒక సినిమాలా చెప్పే ఛాన్సు దక్కినందుకు కొద్దిగా అప్పుడప్పుడూ సరదాగా వుంటుంది. ప్రతీ విద్యార్ధి అసలు ఒక్క సంవత్సరమైనా పల్లెలో గడపాలనే స్కూల్ల్లు వస్తే ఎంత బాగుంటుందో? పల్లె చెప్పే పాఠాలు, కబుర్లు పట్టణం చచ్చినా చెప్పలేదేమో కదా?

మా నాన్నగారు ఉద్యోగరీత్యా ప్రతీ మూడేళ్లకు బదిలీల మీద ఊర్లు మారుతుండేవారు. ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి పోయి చదవటమే మన పని. అది ఎంత చిన్న పల్లె అయినా సరే. అలా మొట్టమొదటి సారిగా మారిన వూరు "వజ్రపుకొత్తూరు". అది ఒక ఉద్దానం పల్లె. ఉద్దానం అంటే ఉత్తర కోస్తాలో తీర ప్రాంతం అన్న మాట. ఆ వూరు ఒక మోస్తరు పల్లె. మండల కార్యాలయం, హైస్కూలు ఉన్న పల్లె అన్న మాట. ఊరికి ఒక వైపంతా సముద్రం. కాలుష్యం అంటే తెలియని తీరప్రాంతం వుంటుంది. ఊరి నుంచి ఒక రెండు కిలో మీటర్ల దూరంలో సముద్రం వుండటం వలన రాత్రంతా సముద్ర ఘోష మంద్ర స్థాయిలో వినిపిస్తూనే వుంటుంది. సముద్ర తీరానికి వెళ్లాలంటే మనం రకరకాల తోటలు (కొబ్బరి, జీడి, సర్వీ) మధ్యలో నుంచి తూర్పు వైపు గుడ్డిగా నడిచెయ్యటమేనన్న మాట. ప్రతీ తోటకూ, తోటకూ మధ్యలో ఒక సన్నని ఎడ్ల బండి దారి వుండి, దారి మొత్తం రెండువైపులా మొగలి పొదలతో కప్పబడి వుంటుంది. అందువలన అక్కడొక దారి వుందని మనకి బాగా తెలిస్తే తప్ప కనపడదు. ఆ దారి కూడా మొత్తం మోకాలి లోతు సముద్రపు ఇసుకతో ఉంటుంది. ఎడ్ల బళ్లు జాగ్రత్తగా ముందరి బళ్లు ఏర్పరిచిన రెండు లోతైన గీతల మీదగానే పోతాయి. లేక పోతే ఎద్దులు లాగలేవు ఆ ఇసుకలో.

చిన్న వూరవటం వల్లన చాలా మందికి అక్కడ ఒకరికొకరు పేర్లతో సహా పరిచయం. అందులోనూ ఆ ప్రాంత ప్రజల ప్రేమ వర్ణనాతీతం. పెద్దగా బాదరాబందీలు లేని జీవితం, కాలుష్యం లేని తోటలు, ప్రవాసం (అండమాను దీవులు) వెళ్లిన కుటుంబ సభ్యులు. ఇవే వారి జీవితం. అంతర్లీనంగా నక్సలిజం కూడా వుంటుంది. మనకు కనిపించదు, కనపడనివ్వరు కూడా(అచ్చం సిందూరం సినిమాలానే). మనం ఏ తోటలో నుంచి వెళ్లినా ఆదరంగా పలకరిస్తారు. వీలైతే ఒక రెండు కొబ్బరి బోండాలు తాగమని బలవంతం చేస్తారు. అక్కడ జీడి పళ్లు ఎవరూ పెద్దగా తినరు. ఒక పెద్ద గోతిలో కుప్పలుగా ఎర్రని, తియ్యని జీడిపళ్లను పోస్తారు. అవి పశువులు తింటాయన్నమాట. మాకు జీడి పళ్లు కొనుక్కు తినటం అలవాటు కాబట్టి, అక్కడ అలా గోతిలో పారేస్తుంటే మనస్సు చివుక్కుమనేది. మనం ఆ పళ్లు తినే జీవులని తెలిసి మాకు దోరగా, ఎర్రగా వుండే జీడి పళ్లు ఇచ్చేవారనుకోండి. అక్కడ మనం ఎన్ని పళ్లయినా కోసుకు తినవచ్చు. జీడిపిక్కలు మాత్రం చెట్ల దగ్గరే పడెయ్యాలి. అది మాత్రం ఒక రూలు. దారికి రెండు వైపులా వుండే మొగిలి పొదలు చాలా గుబులు పుట్టిస్తాయి. ఎందుకంటే అవి పాములకు మంచి ఆవాసం. కాకపోతే మొగలి పువ్వుల సువాసన మాత్రం అద్భుతంగా వుంటుంది. ఆ పువ్వుల రేకులను అల్లి మరలా పువ్వులా చేసుకొని ధరిస్తారు. మొగలి పొదల మధ్యలో అక్కడక్కడా సీతాఫలం చెట్లు తప్పనిసరిగా వుంటాయి. నేను నా స్నేహితులతో సీతా ఫలం పళ్ల వేటకు తరచుగా వెళ్లేవాడిని. ఒక పది, పదిహేను పెద్ద పళ్లు దొరికాక, దగ్గరలో ఒక మొగలిపొద దగ్గరలో మాలో ధైర్యం కాస్త వున్నోడు ఒక గొయ్య తవ్వి అందుకో ఆ పళ్లను పోసి, ఇసుక పోసి కప్పి, పైన ఏదో కొండ గుర్తు పెట్టేవాడు. మరుచటి రోజు వచ్చేసరికి ఘుమఘుమ లాడే సీతాఫలం పళ్లు తయారుగా వుండేవి. స్కూలు ఇంటర్వల్ (సాయింత్రం) ఇవ్వగానే మేము ఈ ఫలాల స్నాక్స్ తినటానికి దగ్గరలో వున్న తోటల్లోనికి పరారయ్యేవాళ్లం.

ఒక రోజు ఇలాంటి ప్రయత్నంలో నేను ఒక పది నిమిషాలు వెనకబడ్డాను. కాకపోతే గొయ్య తవ్విన స్థలం తెలుసుకాబట్టి నడుస్తూ, పరిగెడుతూ ఆ తోట దారి (గోర్జి అంటారు) వెంబడి వెళుతున్నాను. ఒక దగ్గర దారి రెండుగా చీలివుంది. అంటే నా ఎదురుగా గంభీరంగా వున్న మొగలిపొదల గోడ వుంది. నేను మధ్యలో ఆగి ఎటువైపా అని చూస్తున్నాను. సాధారణంగానే మొగలి పొదలు కప్పేసిన దారికో పగలు కూడా సాయింత్రం లానే వుంటుంది. ఇక సాయింత్రాలు చెప్పాలా? నాకు కొద్దిగా జంకు మొదలయ్యింది. చుట్టుపక్కల ఎవరూ లేరు, చీమ చిటుక్కుమన్న శబ్ధమూ లేదు. వెనక్కు తిరుగుదామా అని ఆలోచిస్తున్న సమయంలో ఏదో శబ్ధం వినిపించింది. నాకు గుండె గొంతులోకి వచ్చింది. అటూ, ఇటూ పరికించా…ఎవరూ లేరు. నా ముందర ఏదో కదలిక అతి దగ్గరలో అయినట్లనిపించి అటు తిరిగా…ఎవరూ లేరు. నాకు చెమటలు పట్టేసాయి. అప్పటికి నా దెయ్యాల కధలు చాలా మంది చెప్పేవారు. నేనూ నమ్మేవాడిని కూడా. అందువలన నా మెదడు అటువైపు ఆలోచన మొదలుపెట్టడంతో నాలుక పిడచకట్టుకుపోయింది. అయితే అప్పుడు కనిపించింది నాకు, ఆ అలజడికి కారణం అయిన భూతం. అంతే ! నా మెదడు మొద్దుబారిపోయింది. సరిగ్గా నా ఎదురుగా, నాకు ఒక రెండు మీటర్ల దూరంలో మొగలి పొదల మధ్య పడగ విశాలంగా విప్పి చూస్తుంది ఒక త్రాచు పాము. ఒక్క సారిగా జరజరమని ప్రాకింది. అప్పుడు చూశాను దాని పొడవు. అంతే వెనక్కు తిరిగి పరుగు లంకించుకున్నాను. శనిగాడు ముందరికాళ్లతో తంతే గాడిద వెనక్కాల్ల దగ్గర పడ్డానన్నట్లు, పారిపోతున్నప్పుడే ఒక చెప్పు(హవాయి చెప్పులు) ఇసుకలో కూరుకుపోయింది. వెనక్కు గబుక్కున తిరిగాను కానీ, పాము వున్న వైపు చూసే ధైర్యం లేదు, అలా అని చెప్పును సరిగా పట్టుకోలేపోతున్నాను. మొత్తానికి రెండు చెప్పులూ మర్యాదగా చేత్తో పట్టుకుని డెకథ్లాన్ క్రీడాకారుడిగా ఇంటికి చేరిపోయి పక్క ఎక్కేసాను. ఆ రోజు తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది.

మరిన్ని మధుర జ్జాపకాలు తరువాత….

9 comments:

శ్రీనివాస said...

బాగున్నాయ్. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు వేసవి శెలవులకు బాగా ఎంజాయ్ చేస్తుంటే మేము కూడా శెలవులకు మా తాతగారింటికి వెళ్ళినప్పుడు జరిగినవి గుర్తుకు వచ్చి రెండు వారాల నుండీ రాద్దాం రాద్దాం అనుకూంటూ బద్దకంతో వెళ్లబుచ్చుతున్నాను. బాగా గుర్తు చేసారు. ధన్యవాదాలు.

సత్యసాయి కొవ్వలి said...

బాగుంది. నాక్కూడా పాములని చూస్తే భలే ధైర్యం, మీలాగే. ఇచ్చాపురంలో చదివినప్పుడు మా స్కూలు చుట్టుతా మొగలిపొదలూ, పాములే. మీ టపా చదివితే ఆరోజులు గుర్తొచ్చాయి.

ప్రవీణ్ గార్లపాటి said...

చిన్ననాటి గుర్తులు ఎంత మధురమయినవో కదూ...

రమేశ్ said...

"శనిగాడు ముందరికాళ్లతో తంతే గాడిద వెనక్కాల్ల దగ్గర పడ్డానన్నట్లు" ఎక్కడ దొరుకుతాయండీ ఇలాంటివి? చాలా బాగుంది, మొదతి సారి వింతున్నాను ఈ సామెత.

నవీన్ గార్ల said...

తెలుగులో ఇలాంటి అద్భుతమైన సామెతలు, జాతీయాలు బోలెడు. ఐతే...కావలసిందల్లా సమాయానికి తగిన సామెత వాడాల్సిన నేర్పు.

http://te.wikipedia.org/wiki/సామెతలు

కొత్త పాళీ said...

చాలా బావుంది సుధాకర్!

radhika said...

నాకు పాము అన్నమాట వింటేనే చాలు వణుకు వచ్చేస్తుంది.అయినా పరిగెడితే పాము మనవెనకాలె వచ్చేస్తుంది కదా.అది మీ వెనకాల రాలేదా?నాకు నాగుపాములతో పెద్దగా టచ్ లేదు గానీ నీరు కట్లు మాత్రం రోజూ మా ఇంటికి వచ్చేవి.ఎందుకంటే మా ఇంటి పక్కనే పొలాలు.నాకు వాటిని చుస్తేనే చాలా భయం.బావలు,తమ్ముళ్ళు ,అన్నయ్యలు,పాలేరులు మాత్రం వాటిని పట్టుకుని మమ్మలిని భయపెట్టేవారు.[ముఖ్యం గా నన్ను] నా జీవితం లో అత్యంత భయంకరమయిన రోజు ఏదంటే ఒక సాయంత్రం మా ఇంట్లోకి దూరిన గోధుమత్రాచు ఎక్కడుందో కనపడలేదు.వెతికి వెతికి దొరక్క అలాగె ఇంట్లోనే పడుకున్నాము.నాకు ఏనిమిషం లో గుండె ఆగిపోతుందో అన్నట్టు గడిపాను.ఇంతకీ అది బయటి తలుపు గడప మూల వుంది.ఈ పోస్ట్ చదువుతున్నప్పుడు ఇదంతా రాస్తున్నప్పుడు నా గుండెలు వేగం గా కొట్టుకోవడం ఎవరికన్నా తెలుస్తుందా?

శోధన said...

రాధిక గారు,
వచ్చిందో, లేదో తెలియదండి. అసలు మనం వెనక్కి తిరిగి చూస్తే కదా? ఆ సమయంలో నేను పీ.టి ఉషను కూడా గెలిచేవాడినని గట్టి నమ్మకం :-)

musunuripadma said...

chala bagundi. chadivi maspurtiga navvu kunnamu. kaani padina tension gurtuku vaste chala jali vestundi

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name