Sunday, May 06, 2007

మన అభాగ్యనగర్

మొన్న ఒక ప్రముఖ బ్లాగరుతో జీటాక్ లో మాట్లాడుతుంటే, విషయం ప్రమాదాల మీదకు, భద్రత మీదకు మళ్లింది. హైదరాబాదు ప్రస్తుతం అన్ని నగరాల కంటే అతి సుఖవంతమైన, భద్రత కలిగిన నగరం అని ఆ బ్లాగరు అంటే నాకు ఒక్క సారి మన నగర ముఖ చిత్రం కళ్ల ముందర గిర్రున తిరిగింది. అందువల్లన ఆ విషయ ముఖంగా నాకు తెలిసిన నాలుగు ముక్కలు, వార్తా పత్రికల ఆధారంగా ఒక చిన్న అవలోకనం.

హైదరాబాదు ప్రస్తుతానికి పౌర జీవన ప్రమాణాల సూచీలో చాలా తక్కువ స్థాయి కలిగివుందని నా అభిప్రాయం. ఎందుకో చూద్దాం.

పౌర జీవన ప్రమాణ సూచీ (Life Index) అనేది అనేక కారణాల మీద అధారపడి వుంటుంది. చక్కని పొందిక కలిగిన సమాజం, ఆరోగ్యకరమైన గాలి, నీరు, శుభ్రత, నాణ్యత కలిగిన సేవలు, ఆర్ధిక సమానతలు, పేదరికం అనే విషయాలు ముఖ్యమైనవి. అయితే ఇవి కాక మరికొన్ని కారణాలు కూడా ఈ సూచీ ని ప్రభావితం చేస్తాయి. అవి మానసిక ఆనందం, ప్రశాంతత, పర్యావరణం, సమాజ చైతన్యం వంటివి. అయితే ఇవన్నీ మన రాజధాని నగరంలో ఎలా వున్నాయి?

శాంతి భద్రతలు : అతి దీనావస్థలో వున్నవి ఇవే. పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో తొమ్మిది కోట్ల చోరీ, అసలు ఇప్పటికి అంతు చిక్కని ఆంధ్రా బ్యాంకు చోరీ, పట్ట పగలు దోపిడీలు లాంటివి మచ్చుకు కొన్నొ. తీవ్ర కొరత వున్న పోలిస్ సిబ్బంది. వున్న కొద్ది మంది కూడా రకరకాల గడ్డి తిని, తినిపించి రాజధాని నగరంలో పోష్టింగులు వెయ్యించుకుని ఏదో కొంత వెనకాద్దామనుకునేవాళ్లే. కొన్ని పోలిస్ స్టేషన్ల యస్.ఐ, సీ.ఐ పోష్టులయితే దాదాపు నలభై లక్షలవరకూ పలుకుతున్నాయి. రోడ్డు మీద అన్యాయం జరిగితే పిలుద్దామంటే కనుచూపు మేరలో కనిపించని పోలీసులు ఇక్కడే వున్నారు. "పోలీస్ ను పిలుస్తా" అంటే…పిల్చుకో ఫో, వాళ్ల సెటిల్మెంట్ ఎప్పుడో అయిపోయిందనే మాటలు ఇక్కడ సర్వ సాధారణం.

అవసరం అయిన దానికంటే కనీసం అరవై శాతం మంది తక్కువున్న ట్రాఫిక్ పోలీసులు. అందులో కొంత మంది సరి అయిన ట్రైనింగు, అధికారం లేని హోమ్ గార్డులు. ఇక ట్రాఫిక్ గురించి మాట్లాడే ముందు ఈ నగరంలో ప్రమాదాల సంగతి చూద్దాం.

dangers

అంటే మిగతా రాష్ట్ర ప్రజలందరి కంటే, ఈ నగర పౌరుడికి రోడ్డు మీద ప్రమాదానికి గురి అయ్యే సంభావ్యత చాలా అధికంగా వుంది. బయటకు బండి వేసుకు వెళ్తే తిరిగి వస్తామో రామో తెలియదు. ఏ టిప్పర్ (ఇవి రాజధాని లోగో కింద పెట్టుకోవచ్చు) ఎటువైపు నుంచి వచ్చి గుద్దేస్తుందో తెలియదు. ఏ బీ.పి.వో కారు (వీటికి ప్రత్యేకంగా ఫార్ములా - 0 రేస్ పెట్టొచ్చు) మనల్ని రాసుకుంటూ పోతుందో తెలియని భయం. అసలు ఆ కార్లకు అన్ని సొట్టలు, గీతలు, మరకలు (ఇవి సర్వ సాధారణం) ఎలా వచ్చాయని మన పోలీస్ లకు ఒక ఆలోచన వచ్చి ఏడిస్తే కదా? రోడ్లన్ని తమవే అనుకుని తిరిగే ఆటోవారి ఆగడాలు ఇక చెప్పనక్కరలేదు. లెక్కకు మించిన ఆటోలు ఇక్కడ వున్నాయి. ఏదో సర్వే వారు హైదరాబాదులో ప్రతీ పన్నెండు మందికీ ఒక ఆటో వుందని తేల్చారు. నిజమో కాదో తెలియదు కానీ, అసలు కొత్త ఆటోలను ఈ ప్రభుత్వం ఆపుతున్నట్లు లేదు. ఒకొక్క ఆటోలో పది మంది ప్రయాణించటం (స్కూలు పిల్లలు కూడా) ఇక్కడ సర్వ సాధారణం. ఎవడో ఎప్పుడో చస్తే అప్పుడు హడావిడిగా ఒక ప్రకటన మాత్రం చేస్తారు, ఇకపై అది నిషిద్ధం, ఇది నిషిద్ధం అని. అది ఒక పది రోజులు అమలు. తర్వాత అందరూ మర్చిపోతారు. ఇద్దరు ముగ్గురు పిల్లల ప్రాణాలు పోతే గానీ క్రాస్ ఓవర్ బ్రిడ్జీలు కట్టారా? ఇక్కడ అన్నీ ప్రాణాలు పణంగా పెడితే గానీ జరగవా?

ఈ రోజు ఈనాడు వార్త చదివితే చాలు…శాంతి భద్రతలు మసి పూసిన మారేడు కాయని అర్ధం అవుతుంది.

ఇక క్రిమినల్స్ సంఖ్య చూస్తే గుండె గుభిల్లు మనే గణాంకాలు కనిపిస్తాయి. ఎక్కడెక్కడి కేసులకూ పుట్టినిల్లు మన వూరే. తాళాలు వేస్తే చాలు, కూరగాయలకు వెళ్లి వచ్చేలోపే ఇళ్ళు ఖాలీ చేసిన కేసులు కనిపిస్తాయి. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి లెక్క చెయ్యని ముఠాలు ఇక్కడే తిరుగుతున్నాయి.

పర్యావరణం : మన నగరం ఇటీవలే దేశ రాజధానిని తోసి అత్యంత కాలుష్య నగరాల పట్టికలో నిలిచింది చల్లగా జలాశయాలలోనికి విషాన్ని వదిలేసే ఫ్యాక్టరీలు, అవి అస్సలు కనిపించని గుడ్డి పీ.సీ.బీ ఇక్కడ వున్నాయి. పత్రికలు విషయాలు బయట పెడితే కానీ పని చెయ్యని సంస్థ అది.

వందల సంఖ్యలో అక్రమ బోరు బావులు తవ్వి, ఆ నీటిని ట్యాంకర్ల లెక్కన అమ్మేస్తున్నారు. దీని వలన భూగర్బ జలాలు తీవ్ర స్థాయిలో పడి పోతున్నాయి. ఎక్కడో వున్న బాబ్లీనీరు రాక పోవటం కాదు, మన క్రింద పారుతున్న నీరు మనమే పోగొట్టుకుంటున్నాం. ఇది అస్సలు రాజకీయ పార్టీలకు, రాష్త్ట్ర సమితులకు బుర్రకు పొరపాటున కూడా అందని విషయం. ఇది ఇలానే జరిగితే రానున్న పదేళ్లలో హైదరాబాదు ఒక చెన్నయి లా మారుతుంది.

రోడ్ల పక్కన వున్న చెట్లను పెంచటం మాట తరువాయి. వాటిని చల్లగా నరికేస్తున్నారు, వాటి స్థానే యాడ్ బోర్డులు పుట్ట గొడుగుల్లా వస్తున్నయి.

వున్న వేల ఆటోలు అన్నీ కిరోసిన్ కల్తీ పెట్రోలును వాడుతున్నాయి. అలా అయితే డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ. దీనివలన కాలుష్యం భూతంలా నగరాన్ని కమ్ముకుంటుంది.

సమాజం: అతి దరిద్రంగా వుంది. పక్కింటోల్లు ఎవడో కూడా తెలియని ఆపార్టుమెంట్లు వేలు వున్నాయి. మొహంలో నవ్వు కాదు సరికదా, పలకరింపు కూడా ఇక్కడ దొరకదు. అందరూ సీరియస్ గా అగ్ని మాపక సిబ్బందిలా రోడ్డు మీద హార్న్ కొట్టుకుంటూ వెళ్లిపోవటమే. ఆంబులెన్స్ లకే దారి దొరకడం లేదంటే ఇక ఇంకేముంది? ఇక్కడ గుండె పోటొస్తే దగ్గరలో వున్న గుడికి వెళ్లటమే మంచిది. కనీసం రోడ్డు మీద కన్ను మూయకుండా వుంటాం.

ప్రపంచ అతి లంచావతారాలన్నీ ఈ నగరంలోనే తిష్ట వేసాయి. MLA, MP, IPS, IAS ల నుంచి గుమాస్తాల వరకూ చెయ్య తడపనిదే పని జరగదు. అసలు ఇప్పుడు ఇక్కడ లంచం అనే దానికి అర్ధం లేదు. అది కూడా పనిలో ఒక భాగం.

తెలుగు వారు సహజంగా పాటించే గౌరవం ఇక్కడ మీకు దొరకదు. అతి నిర్దాక్షిణ్యమైన, కరుకైన సమాధానాలు, స్వార్ధం పొంగుతో కలసి వస్తుంటాయి. ఎంతో బిజీ నగరం అయినా ముంబయిలో కూడా ఇలాంటి ప్రజని చూడలేదు. ముంబయ్ ప్రజలు కష్టంలో ఆదుకునే తీరు చూస్తే ముచ్చటేస్తుంది.

ఇక ఈవ్ టీజింగు గురించి చెప్పనక్కరలేదు…చెప్పలేని సంఘటనలు, అసభ్య మూకలు లెక్కకు మిక్కిలిగా వున్నాయ్.

ఇక మిగతా భాగాలు వీలు చిక్కినపుడు రాస్తా….

1 comments:

cbrao said...

బాబోయ్ accidents అనిపించేలా ఉన్నాయి. గత వారం రోజులలో మా బంధువులు ఇద్దరు మరణించారు.ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. హైదరాబాదు - విజయవాడ రహదారి ఈ ప్రమాదాలకు ఒక hotspot గా మారింది.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name