ఈ కధ ఏసొప్ ఫేబుల్స్ నుంచి తర్జుమా చేసాను.
అది ఒక ప్రభాత సమయం. ఒక చీమ వడి వడి గా అడుగులు వేసుకుంటూ ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. దారిలో దానికి ఒక పట్టు పురుగు కనిపించింది. అది దాదాపుగా సీతా కోక చిలుకగా మారే సమయం వచ్చింది కానీ ఇంకా పట్టు గూడు నుంచి బయట పడలేదు. చీమ దగ్గరకు రాగానే అది తన తోకను కాస్తా కదిలించింది. అది చీమను ఆకర్షించింది. చీమ ఎప్పుడూ అలాంటి జీవిని చూడలేదు మరి.
అరే, పాపం అనుకుంది చీమ. ఎంతటి దురదృష్టం నీది అంది. నేను ఎక్కడికి కావాలంటె అక్కడికి నడవగలను, చెట్లు ఎక్కగలను...చాలా సంతోషంగా జీవితం గడుపుతున్నాను...నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నీ జీవితం అంతా ఆ గూడు లోనే వుండాలి...మహా అయితే నీ తోక ని అటూ ఇటూ కదపగలవేమొ అంది. ఇదంతా విన్న పట్టు పురుగు ఏమి మాట్లాడకుండా వూరుకుంది.
కొన్ని రోజుల తరువాత చీమ అదే దారి వైపు వచ్చింది. దానికి అక్కడ ఖాళీ గూడు తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు. చీమ ఆశ్చర్యపోయింది. అయితే ఒక్క సారిగా ఏదో పెద్ద నీడ తనని కప్పివేసినట్లు అనిపించి వెనక్కు తిరిగి చూసింది. ఒక అందమైన సీతాకోకచిలుక పెద్ద పెద్ద రెక్కలతో తన వైపే చూస్తూ కనిపించింది.సీతాకోకచిలుక మాట్లాడ సాగింది...నన్ను తెగ వెక్కిరించిన ఓ మిత్రుడా.....ఇప్పుడు నీ శక్తులన్ని ఉపయోగించి నడిచి, పరిగెత్తి , చెట్టులెక్కి నన్ను వెంబడించగలవేమో చూడు అని ఒక్క సారిగా గాలిలోకి ఎగిరి ఆ వేసవి గాలుల వెంట ఎగురుతూ చీమ దృష్టి నుంచి శాశ్వతంగా మాయమయ్యింది.
నీతి : కంటికి కనిపించేవి అన్నీ నిజం కావు.మోసపూరితంగా వుండవచ్చు.
Friday, July 07, 2006
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment