Sunday, June 10, 2007

అమెరికాలో భారతీయ అనుభవం - కొసమెరుపు

మీరు ఈ మిగతా మూడు టపాలు చదివి వుంటేనే ఈ టపా చదవండి. :-)

ఈ సోది చదవని వారు ముందర ఇది చదవండి…

తరువాత ఓపికుంటే ఇది చదవండి…

అప్పటికీ నిద్ర రాకపోతే….ఈ టపా చదవండి.

పై మూడూ చదివితే (శభాష్) చచ్చినట్లు ఇది చదవాల్సిందేనని మనవి...ఇది సీరియల్ ముగింపు..ఎలా వదిలేస్తారు?
-------------
నా లగేజీ కోసం ఇక వేట మొదలయ్యింది. మొదటి రెండు రోజులు డెల్టా వాడికి ఫోన్ చేసి విసిగిపోయాను. ఇక మా పీ.యమ్ రంగంలోనికి దిగి వారిని చెడామడా తిట్టి మిలియన్ డాలర్ల నష్టపరిహారం వేస్తా అన్న తీరులో మాట్లాడితే చావు కబురు చల్లగా చెప్పారు. ముంబయిలో నా లగేజీని మోసుకున్న తరువాతి విమానం పారిస్ వచ్చేసరికి, అక్కడ ఒక దరిద్రపు సమ్మె మొదయిందంట. ఛార్లెస్ డీ గాల్ విమానాశ్రయం మొత్తం సమ్మెలోనికి దిగిందంట. అందువలన దాదాపు ఎనభయి వేల బ్యాగేజీ పీసులు సిబ్బంది లేక అలా పడివున్నాయని డెల్టా భామ చెప్పింది. మా పీయమ్ ని కొద్దిగా చల్లబరచటానికి ఏదో అమెరికన్ జోక్ పేల్చి తెగ నవ్వింది కానీ, మా బ్రిటీష్ పీయమ్ గాడు సీరియస్ గా ఫోన్ పెట్టేసి, నా వైపు, నా బట్టల వైపు చూసాడు. "అదీ సంగతి" అని జీవం లేని నవ్వు నవ్వాడు. నేను ఏడుపుని బలవంతంగా నవ్వుగా మార్చుకుంటూ అయితే ఇప్పుడేం చేద్దాం అన్నా. "పద షాపింగ్ కి....నేను కొంటా నీకు బట్టలు...కంపెనీనే డబ్బులిస్తుంది...కంగారు పడక" అని ఓదార్పు చెప్పాడు.

సాయింత్రం ఒక పెద్ద షాపింగ్ మాల్ కు తీసుకెళ్లాడు. అప్పడు నాకర్ధం అయ్యింది. ఇక్కడ చెడ్డీలు అమ్ముకున్నా కోటీశ్వరుడు కావచ్చని. భారీ ధరలు, తీరా చూస్తే మన దేశంలో దొరికే రకాలే అన్నీ కూడా...సగానికి పైగా జీన్స్ బ్రాండులకు అరవింద్ మిల్స్ నుంచే కాటన్ ముడి సరుకు. సగటు అమెరికన్ల మీద కొద్దిగా జాలి వేసింది. నేను ముందర కొద్దిగా ధరలు చూసి కంగారు పడి.."కొద్దిగా ధరలు అధికంగా వున్నాయి కదా" అన్నాను. "ఏం ఫర్వాలేదు..కంపనీ కొంటుంది కదా ..." అని భరోసా ఇచ్చాడు. దానితో ఇక నాకు చుట్టూ వున్న షాపులన్నీ మన పుట్ పాతులమీద షాపులలాగా కనిపించటం మొదలుపెట్టాయి :-)

నేను రెండు ప్యాంట్స్ , మూడు షర్టులు తీసుకున్నా,..ప్యాంట్లు గాప్ జీన్స్ అని గుర్తుంది కానీ, మిగిలినవి గుర్తులేదు. మొత్తం బిల్లు మూడొందల డాలర్ల వరకు అయ్యింది. హమ్మయ్య అనుకుని ఇక ఇంటికి బయలు దేరాం. మధ్యలో ఏవో పచారీలు కొనుక్కొని రూము చేరేసరికి....

డెల్టా వాడు ఒక వ్యాన్లో నా సామాను, ఆలస్యానికి పరిహారంగా ఒక క్షమాపణ పత్రం పట్టుకొచ్చి సిద్ధంగా వున్నాడు. నేను మా పీయమ్ వైపు చూసి చిన్నగా నవ్వా...వాడు నా వైపు చూసి నవ్వలేక నవ్వాడు. ఆ చూపుల్లో నీ సామాను వచ్చిందని ఆఫీస్ లో ఎవరికీ చెప్పకు ప్లీజ్ అన్న వేడుకోలు కనిపించింది.

మొత్తానికి కధ అలా సుఖాంతమయిందన్న మాట...

త్వరలో మళ్లీ అమెరికా వెళ్లవచ్చు, మరి ఆ మలి అనుభవాలు ఎలా వుంటాయో....(ఈ మధ్య మన భారతీయులను మొత్తం బట్టలూడదీసి చెక్ చేస్తున్నారంట...వార్నాయనో...)

4 comments:

sahi said...

విహారి గారి కధలో సీనుగాడికి వచ్చిన కష్టాల లాంటివి మీకేమీ రాలేదా?

రాజశేఖర్ said...

చాలా బాగా వ్రాశారండీ.. కథనం చాలా బావుంది.

సునీత said...

మొత్తానికి భలే జరిగింది నీ అమెరికా ప్రయానం. హమ్మాయ్య... యెన్నాళ్ళకి ముగించేవో! నీ కధనం బాగ నచ్చింది సుధాకర్ ! మాకు కూడా బాగా గుర్థుకుంటుంది. నీ రెండో అమెరికా ప్రయాణం బాగా జరగాలని ఆసిద్దాం.

తెలుగు'వాడి'ని said...

@Sudhakar Garu :

FYI : You gave the same link for the first and second parts in this post.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name