ఈ మధ్య నేను నిశితంగా గమనిస్తున్నవి వివిధ రకాల ప్రకటనలు. నాకీ అలవాటు అమూల్ ప్రకటనల పట్ల ఇష్టంతో మొదలయ్యింది. అమూల్ ప్రకటనలు అత్యంత భారతీయంగా చూడగానే నవ్వొచ్చే సమకాలీన అంశాలను పేరడీ చేస్తూ చాలా బాగుంటాయి. అలా మొదలయ్యిన ఇష్టం అమెరికాలో ప్రకటనలు చూసాకా ఇంకా ఎక్కువయింది. అయితే ఈ మధ్య మన దేశంలో వస్తున్న టీవీ, హోర్డింగుల ప్రకటనలు చూస్తే చాలా బాధగా వుంది. అసలు ఈ ప్రకటనలపై ఒక సెన్సారు బోర్డు వుందా లేదో నాకు తెలియదు కానీ...వుంటే బాగుండునేమో అనిపిస్తుంది. కొన్ని యాడ్లు ఆగి చూస్తే గానీ అర్ధం కావు. మరికొన్ని కొన్ని వర్గాలను తీవ్రంగా అవమానిస్తు వుంటాయి. జాగ్రత్తగా అలోచిస్తే గానీ అవి అర్ధం కావు.
ముఖ్యంగా ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనలు. ఈ ప్రకటనలు ఎంతకు తెగిస్తున్నాయంటే నలుపు అనేది అందవికారానికి చిహ్నం అని నూరిపోసేంతగా.. ఒక క్రీము కంపనీ ఒక నల్లని అమ్మాయిని చూపించి...ఆమెని మైకేల్ జాక్సన్ తెలుపుకు క్రమంగా తెచ్చి "అందమే ఆత్మ విశ్వాసం" అని డప్పు కొడుతుంది. ఫెయిర్ నెస్ అంటే "తెలుపు" రంగనుకునే బ్రిటీష్ కాలపు బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతాం?
ఇంకొక క్రీము కంపనీ...మగవాళ్లు ఆడవారి క్రీమ్ వాడటమా అని హేళన చెయ్యటం. స్త్రీల మీద వారి వుద్దేశ్యమేంటో అర్ధం కాదు. అసలు ఈ క్రీముల వలన చర్మంలోని మెలనిన్ శాతాన్ని తగ్గించగలం అని ఇప్పటివరకూ ఎవడు ఇతమిధ్ధంగా నిరూపించలేకపోయారు. ఈ మధ్య ఒక సర్వే ప్రకారం తెలిసిందేంటి అంటే ఆసియన్లకు తెలుపు మీద వెర్రి ప్రేమ అని, అదే అమెరికన్ తెగలకు కాంతివంతమైన చర్మం మీద అధికమని. ఈ కారణం మీద అన్ని ప్రకటనలు ఇప్పుడు "తెలుపు" మంత్రాన్ని "అందానికి" అందలంగా చూపిస్తున్నాయి, డబ్బులు పిండుకుంటున్నాయి. మన దేశంలో ఈ దరిద్రమైన ఆర్యన్ దేహ "అందపు" నిర్వచనానికి బలం చేకూర్చే ఎటువంటి పనినైనా ప్రభుత్వం సెన్సారు చెయ్యాల్సిన పని వుంది. లేకపోతే ఇప్పటికే తెల్లవాళ్లకు అమ్ముడు పోయిన ఆత్మ గౌరవపు చివరి ఎంగిలి మెతుకుల్ని కూడా "తెలుపు" రంగు పేరిట చాలా మంది కోల్పోయి అందుకు నల్లగా పుట్టాన్రా బాబు అని బాధపడుతూనే వుంటారు.
6 comments:
చాలా మంచిమాట చెప్పారు.
ఇక్కడ మా పొరిగింటి తెల్లామె అలా అంది కూడా! "మీరు తెల్లగ వుండాలని తపించిపోతారటగా" అని. మా ఆవిడకు ఏమి చెప్పాలా అర్థం కాలేదు. తీరా వాళ్ళేమొ నల్లబడాలని ట్యానింగ్ అదీ అని ఎండలో శరీరాన్ని నల్లబరచుకుంటారు.
దూరపు కొండలు నునుపు అంటే ఇదే కదా? నల్లగా వున్నా కాంతిమంతంగా వున్న వాళ్ళు బోలెడంత అందంగా వుంటారు. ఇక అన్నిటినీ మించినది ఆత్మ సౌందర్యం అనుకోండి.
--ప్రసాద్
http://blog.charasala.com
బాగా చెప్పారు. ఈ ప్రకటనలు నలుపో జబ్బు అన్నట్టుగా మన సబ్‌కాన్షియస్ మైండును ప్రోగ్రాము చేశాయి. ఈ జబ్బు మనకే కాదు యావత్ప్రపంచానికి ఉన్నది. ఆఫ్రికాలో, చైనాలో, భారత్ తో తెలుపంటే పిచ్చి అదే అమెరికాలో మరొక పిచ్చి (టూత్ పేస్టు తెలుపంటే అందవికారమని అర్ధం).
అమెరికాలో ప్రజలకు తెల్లని పళ్ళు అంటే పిచ్చి. ఈ మొత్తం ప్రకటనల మాయాజాలల్ని తోసిరాజన్నది కేవలం ఒక యూరప్లోనే అని నాకనిపిస్తుంది (కానీ వాళ్ళ నోళ్ళు తెరిస్తే భరించలేమనుకోండి. అది వేరే సంగతి)
మీరు చెప్పింది నిజమే, కానీ మరీ అన్ని అలా లేవు.. కొన్ని యాడ్స్ చూస్తుంటే, మనసుకి హత్తుకుంటాయి.. ఉదాహరణకి, ఎల్.ఐ.సి వాళ్ళది తీసుకోండి.. అది చాలా బావుంటుంది.. ఇక రిలయన్స్ ఫోన్ వాళ్ళది కూడా బావుంటుంది.. అలానే శాంత్రో కార్, ఆ యాడ్ కూడా బావుంటుంది..
మీరన్నది అక్షరసత్యం! మొన్ననే 'వాల్ స్ట్రీట్ జర్నల్'లో ఈ విషయమై ఓ వ్యాసం చదివాను. ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన మరో పరిశోధనా పత్రం "ఫెయిర్ & లవ్లీ కేస్ స్టడీ":అనిల్ కర్నానీ-http://www.wdi.umich.edu/files/Research%20Initiatives/Bottom%20of%20the%20Pyramid/Cases/karnani_fairandlovely.pdf
అందులో ఢిల్లీ 'ఎయిమ్స్' చర్మవిభాగపు అధినేత డా.పాంథి ప్రకారం చర్మంలోని మెలనిన్ రెండు పొరల కింద ఉంటుంది.(ఆ మెలనినే నలుపు రంగుకు కారణం) మధ్యలో నున్న పొర శరీరంలోనికి ఏ ఇతర పదార్థమూ పోకుండా రక్షిస్తుంది ఈ క్రీముల్తో సహా! మన శరీరానికి కల అతి పెద్ద రక్షణకవచం మన చర్మమే. కాబట్టి ఈ క్రీములు,పై పూతలన్నీ ఒట్టి బూటకం.
దేశంలో జరుగుతున్న అనేక వ్యాపార దోపిడీల్లో ఇది కూడా ఒకటి. హార్లిక్స్, బోర్నవిటా, బూస్ట్ వంటి పానీయాలతో శరీరానికి కొత్తగా వచ్చే పోషకాహారం ఏదీ లేదని ఎప్పుడో ౠజువైంది - ఐనా ఒక కాలంలో (ఇప్పటి సంగతి తెలీదు) పిల్లలకి ఉత్త పాలకి బదులు వీటిన్ ఇ కలిపి ఇవ్వడం ఒక స్టేటస్ సింబల్ గా ఉండేది. ఇన్నాళ్ళూ హిందూస్తాన్ లీవర్ వాడి ఫెయిర్ అండ్ లవ్లీ ఏఖఛ్ఛత్రంగా పాలించేది - ఇప్పుడు పోటీ ఎక్కువైంది. ఈ విషయం మీద యూ ఆఫ్ మిషిగన్ లో వాణిజ్య బడి ఆచార్యులు కర్నానీ ఒక పరిశోధనాపత్రం సమర్పించారు. ఇదే విషయం మీద ఇక్కడి స్థానిక భారతీయ మాసపత్రిక లిటిల్ ఇండియా ముఖచిత్ర కథనం ప్రచురించింది.
http://www.littleindia.com/
Aathma soundryaniki minchina andam emee ledu. Ivanni pi pi merugulu choosi mosapotam anthe
Post a Comment