మన భాగ్యనగరానికే సొంతం అయిన అవలక్షణాలలో ఆణిముత్యాల లాంటి నాలుగు అవలక్షణాలను నేను ఈ మధ్య సరదాగా నా సెల్ ఫోన్ తో క్లిక్కు మనిపించా...వీటిలో కొన్ని ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి, ఇంకా చాలా మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతూనే వున్నాయి. అయినా "నాకేంటంటా? అహ...నాకేమిటంట?" అనే రకంగా వున్న ప్రభుత్వ వ్యవస్థ పిల్లి నిద్ర పోతూనే వుంది.
౦౧. మహానగరపు అమీర్ పేట సార్వత్రిక విశ్వవిద్యాలయం జడల మర్రి
బ్యానరు కడతారు....కొద్ది రోజులలో కొత్త కోర్సు వస్తుంది....బ్యానరు విప్పరు...తెంపుతారు...కొత్తది కడతారు. ఇలా తాళి మీద తాళి ఈ స్థంభానికి కడుతూనే వుంటారు. ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.
౦౨. ప్రత్యక్ష నరక ప్రాయమైన ట్రాఫిక్
ప్రపంచంలోనే అతి విచిత్రమైన ట్రాఫిక్. రోడ్లు విశాలంగా వుంటే ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. వున్నా వారికి సగానికి పైగా రూల్స్ తెలియవు. వారికి తెలిసి ఎవరిని ఆపినా ఎవరూ ఆగరు...పారిపోతారు. అడ్డంగా కట్టి పడేసిన మసీదులు, గుడులు, సమాధులు ఈ నరక ప్రగతికి సోపానాలు.
౦౩. కబ్జా కింగుల కనక సింహాసనం
ఎక్కడ చెరువుంటే, సముద్రముంటే అక్కడ నాగరికతా, ప్రకృతి వెల్లివిరుస్తాయి. ఇక్కడ మాత్రం డంపింగు విరిసి కురుస్తుంది. ఆనక ఆ చెరువుని మెల్లగా కప్పేస్తుంది. కబ్జా చేస్తుంది.
౦౪. అధికారుల ధన దురాశాపరత్వం : గ్రేటర్ మెగా యాడ్ సిటీ
మీరు ఒక గంట రోడ్డు మధ్య కదలకుండా నిల్చుంటే, మీ వీపు భాగాన్ని బల్దియా జాలిమ్ లోషన్ వారికి యాడ్ అతికించుకోవటానికి అద్దెకిచ్చేస్తుంది. నగరమంతటా యాడ్లే. ఫుట్ ఓవర్ వంతెనలు కూడా వదలరు. చెట్లు నాటితే ఏమొస్తుంది నా బొంద...యాడ్లు నాటుదాం రండి. రాత్రింబవళ్ళు విద్యుత్తు సరఫరా కూడా వుంటుంది. యాడు వున్నా లేకున్నా సరే...
9 comments:
అసలు మన భాగ్యనగరంలో ప్రతీదీ సమస్యే. వీటిలో ముఖ్యమైనవి ట్రాఫిక్, మంచినీరు, డ్రైనేజీ, అస్తవ్యస్త కరెంట్, వీధిభాలలు, అనాధలు, బిచ్చగాళ్లు ఇంకా ఇలా ఎన్నో ఎన్నెన్నో..మన నాయకులు వీటిని ఎప్పుడు పరిష్కరిస్తారో, మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో...
ఇదేనా మన నగర అభివృద్ధి? ఏమీ చెయ్యలేమా?
మంచి అపార్ట్‌మెంట్లు ఉంటాయి. పక్కనే మరుగు దొడ్లను మరిపించే చెత్తా చెదారం.
సమయం ఉండటం లేదా, priority కాదా, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకనా? ప్రభుత్వాన్ని ఏమనుకుంటాం? బాధ్యతగా ఏ విషయంలో ప్రవర్తిస్తున్నారు గనక? ఎవరి చుట్టూ ఉన్న పరిస్థితిని వారు బాగు చెయ్యడం కోసం ఆలోచన, సమయం కేటాయించలేరా?
ఊరవతల బాగా ఉంటుంది(ట)? ఊరెవరి కోసం?
జడలమర్రి -ఫోటో చాలా బాగుంది. ఎన్నో సంగతులు చెబుతోంది. ఒహోటో వ్యాసం బాగుంది.
రోజు రోజుకీ సమాజం లో ధనాపేక్ష తప్ప ఇతరుల ఇబ్బందుల గురించి ఆలొచన తగ్గిపోతోంది. మార్పు మనలోనే మొదలవ్వాలి. మనం మన వరకు వీలున్నంతలో సరి అయిన దారిలో నడిస్తే మన వల్ల ఏ కొందరిలో అయినా మార్పు రాదంటారా?
రోజు రోజుకీ సమాజం లో ధనాపేక్ష తప్ప ఇతరుల ఇబ్బందుల గురించి ఆలొచన తగ్గిపోతోంది. మార్పు మనలోనే మొదలవ్వాలి. మనం మన వరకు వీలున్నంతలో సరి అయిన దారిలో నడిస్తే మన వల్ల ఏ కొందరిలో అయినా మార్పు రాదంటారా?
అవును మొదటిది చూసి, జడుచుకున్నా..నేనలాంటిది మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు!!
మంచి టపా. నిబంధనలు పాఠించాలి అన్న సామాజిక స్ప్రుహ, పెరుగుతున్న జనాభాకు అనుగణంగా మౌలిక సదుపాయాలు అంద చేయగల అధికార గణం వుంటే భాగ్యనగరంకు తిరుగు లేదు.
"బ్యానరు విప్పరు...తెంపుతారు...కొత్తది కడతారు. ఇలా తాళి మీద తాళి ఈ స్థంభానికి కడుతూనే వుంటారు."
"అడ్డంగా కట్టి పడేసిన మసీదులు, గుడులు, సమాధులు ఈ నరక ప్రగతికి సోపానాలు."
"ఎక్కడ చెరువుంటే, సముద్రముంటే అక్కడ నాగరికతా, ప్రకృతి వెల్లివిరుస్తాయి. ఇక్కడ మాత్రం డంపింగు విరిసి కురుస్తుంది."
"చెట్లు నాటితే ఏమొస్తుంది నా బొంద...యాడ్లు నాటుదాం రండి. రాత్రింబవళ్ళు విద్యుత్తు సరఫరా కూడా వుంటుంది. యాడు వున్నా లేకున్నా సరే..."
పై వాక్యాలు నాకు పరిస్తితిని వివరించడంతో ఫాటు నవ్వునూ తెప్పించాయి.
సరే ప్రభుత్వం సంగతీ, అధికారుల సంగతీ మనకు తెలుసు. మనం పౌరులం ఏమీ చేయలేమా?
ఇక్కడ అమెరికాలో పౌరులే సంఘాలుగా ఏర్పడి ఏడాదికొక్కసారి నదుల్లో, కాలువల్లో కాలుష్యాన్ని శుభ్రపరుస్తారు. అలాంటిదేదో మనం చేయలేమా? మనింటిముందు లేదా మన కాలనీ ముందు మురికి పేరుకుంటే వాడేవడో వచ్చి తీసేదాకా మనం తీయకూడదా?
లలిత గారన్నట్లు "ఎవరో వస్తారని.." చూసే బదులు మనమేం చేయగలమో చూద్దామా?
--ప్రసాద్
http://blog.charasala.com
Mana bhagyanagaram lo pratide smasye. Samsye lanu ala vadileste adi pedda samsya avutundi.
Post a Comment