Monday, January 30, 2006

ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ? అందాలనద్దమని అడుగు అడుగుకు...

ఇటీవల సంక్రాంతి తరువాత ఇంటి నుంచి తిరుగు ప్రయాణం ఫలక్ నుమా లో (రెండు గంటలు ఆలస్యం) వచ్చాను.రాత్రి అంతా బాగానే గడిచింది కాని, తెల్లవారాకా నాకు ఆ ఏ.సి కంపార్టుమెంటు తిక్క పుట్తించింది.పెద్దగా మాటలాడటానికి ఇష్టపడని ప్రయాణీకులు, ఇష్టపడినా భాష రాని బెంగాలీ వాళ్లు, తెరవలేని గాజు అద్దాలు, తెల్లవారి బారెడు పొద్దు ఎక్కినా, బెర్తులు దిగని మహానుభావులు, అందరిని చూస్తే జాలి, కోపం రెండూ వచ్చాయి.

బయట అందమయిన పొలాలు, కరకు రాతి నేలలు, చిన్న చిన్న కాలువలు వెనక్కు పరుగులు తీస్తుంటే చూసి ఆనందించలేక, కృత్రిమ చల్లదనాన్ని ఆబగా ఆలింగనం చేసుకున్న బడుధ్ధాయిలు అనిపించింది.

బయటకు వెళ్లి కాసేపు కోచ్ అటెండెంట్ తో మాట్లాడాకా, తలుపు తీసా, ఎదో పచ్చని పల్లె ఒక్క సారి నా కళ్లను మొత్తం తన వయిపు తిప్పుకునేలా చేసి, ముసి ముసి నవ్వులు రువ్వినట్టయింది.ఆ నిలుచున్న కాసేపు నా మదిలో సాగిన ఆలోచనల రూపం ఇది.

సంక్రాంతి లక్ష్మి పెద్దగా సిరులు ఇవ్వక పోయినా, పల్లె మొహాలలో వదిలివెల్లిన సంతోషం ఛాయలు...
పండక్కి కొత్త టైరు దొరికితే, దాన్ని బెంజి కారులా తోలుకెల్తున్న భావి పల్లె పౌరులు...
దొరికిన గాలిపటాల నన్నింటిని, అందిచ్చుకుని, ఎడా పెడా జడలో తురుముకుని మురిసిపోతున్న మర్రిమానులు, రావి చెట్లు...
ఆ చెట్ల పైనే కొత్తగా వచ్చిన గాలి పటాల తో యుద్ధం చేస్తూ, వాటిని కుళ్ళబొడిచేస్తున్న కాకులు...
మేని నిండా రాసిన పసుపుతో గర్వంగా, భూమిలోకి ముందుకి చొచ్చుకు పోతున్న ఇనుపనాగల్లూ...
శ్వేత ఛాయ మేనితో మెరిసిపోతూ, యజమాని కళ్ల మెరుపు లో కదుల్తున్న గిత్తలు...

ఇవన్నీ చూస్తుంటే, ఎవరు నేర్పారమ్మ ఈ పల్లెకూ? అందాలనద్దమని అడుగు అడుగుకు అని పేరడీ పాడాలనిపిస్తుంది.

4 comments:

Vilekhari said...

chala bagundi ramana www.veduku.com

Vilekhari said...

mari telugu lo blog write cheyadam elaga kaas ta cheppagalara please

చేతన_Chetana said...

మీ బ్లాగు, ఫొటోలు చాలా బాగున్నాయి. మీ పాత పోస్టులు, ఫొటోలు చాలా రోజుల క్రితం చూసాను. అప్పట్లో షివ షైలు అనే తాగుబోతు పదాల గురించి మీరు చేసిన పోస్టు చాలా నచ్చింది. ఇప్పుడు మీరు చేసిన "ఎవరు నేర్పారమ్మా పల్లెకు" పోస్టు కూడా చాలా బాగుంది. మీరు కథలేమన్న రాస్తుంటారా? మీ శైలి బాగుంది. కొందరు ఇంగ్లీషు పదాలు ఉపయోగించకుండా రాస్తే కావాలని తెచ్చిపెట్టుకుని రాస్తున్నట్టు, కొంచెం టెక్స్ట్ బుక్ తెలుగు లాగా అనిపిస్తుంది. చాలా సార్లు ప్రచురితమైన కథల్లో కూడా చదవటానికి అడ్డు తగులుతున్నట్టుగా, కృతకంగా, ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కానీ మామూలు పోస్టులో మామూలు గా సరళంగా, "ఎవరు నేర్పారమ్మా.." పోస్టు లో లాగా కొంచెం కవితాత్మకం గా రాసినా బాగుండే కొన్ని తెలుగు బ్లాగుల్లో మీది ఒకటి అనిపించింది.

Sudhakar said...

థాంక్స్ చేతన మరియు ఐపి గారు...నాకు కధలు రాసే అలవాటు పెద్దగా లేదు కాని, చదివే అలవాటు మాత్రం చాలా వుంది.

తెలుగులో బ్లాగు రాయాలంటే ఇది చదవండి...
http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name