Sunday, March 04, 2007

రంగు పడిందిరో !

ఈ రోజు హోలీ…మన దేశంలో జరిగే అందమైన పండుగలలో ఒకటి. అయితే ఈ రోజు నేను ఎక్కడికీ బయటకు వెళ్లలేదు. చాలా రోజుల క్రితం జరిగిన ఒక కామెడీ సంఘటన వలన హోలీ అంటేనే ఏదో తెలియని అయిష్టత ఏర్పడిపోయింది. ఆ సంఘటన గుర్తుకొస్తే ఇప్పటికీ మా స్నేహితులందరం తెగ నవ్వుకుంటాం.

పీ.జీ చేస్తున్న రోజులలో కొంతమంది స్నేహితులతో కలసి విశాఖలో మద్దిలపాలెంలో కొన్ని రోజులు వున్నాను. అప్పుడు వచ్చిన హోలీ రోజు జరిగినది ఎప్పటికీ మర్చిపోలేని కామెడీ.

తెల్లవారు జామున ఏడు గంటలకు అనుకుంటా తలుపు ఎవరో చాలా వైల్డ్ గా బాదుతున్నారు. బద్ధకంగా అటు ఇటూ దొర్లుతున్న నేను "ఇది కల…ఇది కలే కదా" అని కోట శ్రీనివాసరావు టైపులో అనుకుంటుండగా, అలా అనుకోలేని నా స్నేహితుడు వెళ్లి తలుపు తీసేశాడు. అప్పుడు తీసిన తలుపు మరలా తియ్యటానికి మాకు మధ్యాహ్నం రెండు వరకూ కుదరలేదు..ఎందుకో తెలియాలంటే మొత్తం చదవాలి మరి.

తలుపు తీసి చూసిన వెంటనే మెరుపు వేగంతో మొహాల మీద రంగులు ఎవరో పులిమేస్తున్నారు. నిద్రలోనుంచి మొత్తం తేరుకుని చూస్తే మా రాజు గాడు. వాడు తెళ్లారే సరికి మరో కోతి పనుల స్పెషలిష్టు అమర్, మిగతా వాళ్లను వేసుకుని మా మీదకు దండయాత్రకు వచ్చాడన్న మాట. మాకు జరిగిన సత్కారమే మిగిలిన వారికి జరిగిందనటానికి వాళ్ల మొహాల్లో కనిపిస్తున్న అతి ఆనందం తెలుపుతుంది. అదీ కాక మమ్మల్ని త్వరగా తయారు కమ్మని ఆదేశాలు జారీ అయ్యాయి. కష్టం మీద కాలకృత్యాలు తీర్చుకుని, ఒక పనికి రాని టీ-షర్టు వేసుకుని ఆ గుంపులో పడి రోడ్డు మీద పడ్డాం. రోడ్ల మీద ఎక్కడ చూసిన తెగ హడావిడిగా రంగులు జల్లుకుంటూ తిరుగుతున్నారు. అలా వెళ్తూ మా బెంగాలీ ఫ్రెండు సౌరవ్ భౌమిక్ ఇంటికి వెళ్లాం…వాడి సుడి బాగుండి ఎక్కడికో తెలియని ప్రదేశానికి అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు. వాడికి ఎవరయినా ఉప్పందించారో ఏమో మరి.

మొత్తానికి ఎలా అయితేనేం బయలు దేరి అలా RTC X Roads కు వచ్చాం. ఇంతలో అతి దగ్గరలో ఒక పోలీస్ జీప్ కనిపించింది. వైజాగ్‌లో ఎలాగూ పోలిస్ హడావిడి ఎక్కువే గదా అని వారి దగ్గరగా వెళ్లాం. అందరూ త్వరగా ఎక్కాలమ్మా…త్వరగా అని వినిపించింది. ఎవరిని వీళ్లు ఎక్కమంటున్నార్రా అని చూస్తే…అక్కడ మేం తప్ప ఇంకెవరూ లేరని అర్ధం అయింది. కానిష్టేబుల్ కొద్దిగా మర్యాదగా చెప్పాడన్నమాట. మా వాడు ధైర్యంగా ఎందుకు,ఏమిటి, ఎలా అని వారిని అడిగాడు. పోలీస్ ఎప్పుడయినా జవాబు చెప్తాడా..? ఉట్టిదేనమ్మా…కొద్దిగా అల్లర్లు అవుతున్నాయి. మిమ్మల్ని తీసుకెల్లి ప్రశ్నలు నాలుగడిగి వదిలేస్తారంతే అన్నాడు. సరే ప్రశ్నలన్ని స్టేషన్ హెడ్డు గారినడగండి, ముందు ఎక్కండి బాబు అన్నాడు. మేము ఏం తప్పు చెయ్యలేదు కనక హాయిగా లిఫ్టు అడిగి ఎక్కి కూర్చున్నట్లు జీపులో మొత్తం పొలో అని ఎక్కేసాం. మేం పోలీసుల మీద, వారు మా మీద జోకులేసుకుంటుండగా 2-టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేసింది. అదే జీవితంలో మొదటి సారి ఒక పోలీస్ స్టేషన్లోనికి పోయి కూర్చోవటం. అక్కడా ఒక ఏభై మంది వరకూ విధ్యార్ధులు వున్నారు. అందరి మొహాలు రంగు రంగులతో కోతుల్లా వున్నారు.

కాసేపు హెడ్డు గారిని సతాయించితే మాకొక దండం పెట్టేసి అక్కడ గోల చెయ్యకుండా కూచోండి బాబు అని బెంచీలు చూపించారు. సరే అని కూర్చున్నాం. మనసు వూరుకోక అలా వైర్లెస్ సెట్లో వస్తున్న మాటలు వినసాగాం..

ఆ సార్ ఇక్కడ ఒక పది మందిని తెస్తున్నాం సార్…ఓవర్

లేదు సార్..నేను బీచ్ పార్టీ సార్…అవును సార్ మొత్తం ఒక ఇరవై మంది వుంటారు సార్ ఓవర్

ఇలా సాగిపోతుంటే…ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. నవ్వటానికి కండరాలు మొరాయిస్తున్నాయ్. మెల్లగా ఒక కానిస్టేబుల్ ని కదిపితే అసలు విషయం తెలిసింది. అదేమిటంటే…

ఆ రోజు చాలా మంది ఆకతాయిలు రంగులలో కోడిగుడ్లు కలిపేసి జనాల మీద చల్లటం మొదలు పెట్టారు. కొంత మంది దారిన పోతున్న నన్స్ మీద పొయ్యటంతో వాళ్లు ఫిర్యాదు చేసారంట. అంతే ఇక విశాఖ పోలీసులకు అసలే పని వుండదు. ఇలాంటి అవకాశాలు వదులుతారా? జీపులేసుకుని రోడ్ల మీద పడ్దారు. ఫలితం మేం ఇక్కడా ఈ విషయాన్ని గురించి ఆరా తీస్తూ….కూర్చున్నాం. నాకు ఆ భయం కంటే ఆ రోజు కాలేజీలో వున్న ఇంటర్నల్ పరీక్ష మీదే దృష్టంతా….డుమ్మా కొడితే ఫలితాలు ఎలా వుంటాయో చెప్పలేం. కాసేపయ్యాక మేమందరం ఒక వంద మంది తయారయ్యాం. అప్పట్లో సెల్ ఫోన్లు అంతగా లేవు కనక ఎవరినీ పిలవలేని పరిస్థితి. ఒక పక్క ఆకలి.

మా అందరినీ మేడ పైన ఉన్న ఒక పెద్ద రూములో సమావేశపరిచి మమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో ఒకతను వివరించాడు. అందరూ పిల్లి గుడ్లేసుకుని విని "ఆ మనం కాదులే" అనుకున్నారు. నిజానికి అక్కడున్న వాళ్లందరూ అమాయకులే. మొహాన రంగున్న పాపానికి అక్కడ వున్నారు.ఒకడు మెల్లగా హెడ్డు దగ్గరకు వెళ్లి, "సార్ నేను AVN College సీనియర్ ని సార్" అన్నాడు…ఏదో డాన్ కి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్లు. హెడ్డు అదోలా మొహం పెట్టి…"అహా అలాగా…అయితే ఇప్పుడు ఏంటి?" అన్నాడు. పప్పులుడకవని అర్ధం అయ్యి వాడు మెల్లగా జారుకున్నాడు.

మా స్నేహితులలోని ఒకడు లాయర్ గారి అబ్బాయి. వాడు మెల్లగా ఎలాగో ఒక ఫోన్ చెయ్యించాడు ఇంటికి. ఆ తరువాత మేం ధీమా సరదాగా కూర్చుని మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మా ఎనిమిది మందిని మాత్రమే వదిలారు. అది కూడా ఆ లాయర్ గారు చేసిన కాల్ వలన. మేం హమ్మ్యయ్య అనుకుని ఇంటికి వచ్చి తలుపు మరలా తీసే సరికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. ఆ తరువాత తెలిసిందేమిటంటే, పాపం మిగిలిన వాళ్లందరికి రాత్రి ఎనిమిది గంటల వరకూ వుంచేసారంట. అప్పుడు వేసింది మాకు భయం :-)

అలా జరిగింది ఆ హోలీ. రంగులన్నీ కలిస్తే తెలుపు రంగు అవుతుంది. మాకు మాత్రం ఎరుపు రంగు తయారయింది. చివరికి రంగు పడింది :-)

4 comments:

srinivas said...

నీను కూడా అందు లొ వున్నా :-) నాకు ఇప్పటికి జ్ఞాపకం మా ఫ్రెండ్ రాంకి పాస్పొర్ట్ రాదెమొ అని భయపడటం, (ఎఫ్.ఐ.ఆర్ ఎక్కడ రాస్తారొ అని) అబ్బో నాకు ఇప్పటికి నవ్వు వస్తోంది. ఈ రాజు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్హి రంగులు పుస్తాడు. ఈ సంవత్సరం వాడ్ ఇండియ లొ లేడు :-(

- శ్రీనివాస్

Anonymous said...

అవును ఈ కధంతా ఆ రోజు సాయంత్రం తెలిసింది నాకు. మా ఇంటి నుంచి బయలు డేరేకీనా ఈ సంఘటన? మొదట 'అయ్యో' అని అనిపించినా తర్వాత అందరం నవ్వుకున్నాం. మొత్తానికి భలే రంగు పడింది కదా... హోలీ శుభాకాంక్షలు సుధాకర్ ;-)

cbrao said...

కోతి పనుల స్పెషలిష్టు అమర్ -ప్రస్తుతం Boston లో film making course చేస్తున్న అమరేనా?

Sudhakar said...

శ్రీని..అవును...గానీ ఇప్పుడు రాజు గాడున్న దేశంలో రంగులు రాస్తే చెయ్యో, కాలో తీసేస్తారు కనుక, వాడా పని చెయ్యడని నాకు గట్టి నమ్మకం :-) రామ్‌‍కీ టెన్షన్ నాకిప్పటికీ గుర్తుంది. :-)

సునీతా, బాగా గుర్తుందే :-) అవును...నీకూ, సురేష్ కు హోలి శుభాకాంక్షలు.

మా అమర్ గాడు సినిమాలు చూపించే టయిప్ అండి, తీసే సీను వాడికి లేదు. ఇప్పుడు అమెరికాలో సొంత కంపనీ నడుపుకుంటున్నాడు.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name