Thursday, March 08, 2007

అంతర్జాతీయ మహిళల దగా దినోత్సవం

ఈ రోజంతా ప్రపంచంలో వున్న సర్వ మహిళా జనం అమాయకంగా మురిసిపోయిన రోజు ఇది. ఓహో మీరు అదుర్స్, మీరు కత్తి, మీరు కమాల్ అని ఈ రోజంతా ఒకటే ఊదర. రకరకాల కంపనీలు మహిళా సాధికార దినోత్సవాలు హడావిడిగా జరిపేసాయి. అందులో కూడా పాల్గొన్న వారంతా సాధికారత సాధించిన వారే. మళ్ళీ వారికి దగ్గులు నేర్పడం ఎందుకో అర్ధం కాదు. ఏదైనా పల్లెటూరుకో, సిటీలో ఏదో గల్ల్లీకి వెళ్లి, అక్కడ అమ్మలక్కలందరికి అవసరమైన సాధికారత గూర్చి చెప్పొచ్చు కదా…

RTC బస్సులలో ఈ విధంగా రాసి వుంటుంది. "మహిళను గౌరవించటం మన సంప్రదాయం. వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం". ఇక్కడ "మనం" ఎవరు? ఆ "మనం"లో మహిళలు లేరా? "కూర్చోనిద్దాం" ఏమిటి? ఏదో "అవి కుక్క బిస్కట్టు, దానినే తిననిద్దాం" అన్నట్లు? ఇవి రాసిన వెధవలకున్న భావ దారిద్ర్యం మనలో చాలా మందికి ఉంది. బయట ఒప్పుకోలేకపోతే…టాయిలెట్లోకి వెళ్లి ఒప్పేసుకోవచ్చు. అక్కడెవరూ వుండరు.

ఇదే మంచి రోజని ఒక ఎక్స్ ప్రెస్ రైలులో మహిళా బోగీ దోపిడీకి గురి అయింది. రాజకీయ నాయకులందరికీ ఒక్క సారి మహిళా బిల్లు గుర్తుకొచ్చింది (ఊహించిందే…) పాపం మహిళా ప్రజా ప్రతినిధులందరూ ఒకే తాటిపై నిలబడినా లాభం లేక పోయింది. అందరు మగరాయిళ్ళు నిశ్శబ్ధంగా చోద్యం చూసారు. బల్లలు చరచడం ..పోడియం పైకి దూసుకుపోవడం అంతకన్నా మరచిపోయారు. చివరికి చప్పటి గొంతుతో మన ప్రధాని "అందరి సానుకూలతతో" ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. నేరస్తుల మీద ఒక ఫైలును తిప్పిన రాష్ట్రపతినే ఏకగ్రీవ తీర్మానంతో ఖంగు తినిపించి సంతకం పెట్టించిన మన ప్రజా ప్రతినిధులకు ఈ బిల్లు అంటే తెగ చేదు. అసలు 33% ఏమిటి? 50% శాతం ఎందుకు ఇవ్వకూడదు? అలా జరిగిన రోజు తప్పని సరిగా మన పార్లమెంటులో మంచి వాతావరణం, పనికి వచ్చే చర్చలు జరుగుతాయి.

ఒక టీవీలో సాధికారత సాధించిన మహిళలంటూ ర్యాంప్ మోడల్లు, వర్ద్గమాన తెలుగు సినీ హీరోయిన్లను (పేర్లు మనకు తెలియవు లెండి) తెగ ఇంటర్వూలు చేసేసారు. మహిళలంటే అత్యంత నీచంగా ప్రవర్తించే సినిమా పరిశ్రమ నుంచా ఉదాహరణలు? అదా సాధికారత?

గత సంవత్సరం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో జరిగిన అత్యాచారాల సంఖ్య దాదాపు 900. అంటే 356 రోజులలో 900. ఇవి కేవలం ఠాణాలలో నమోదు అయినవి మాత్రమే. రోజుకు దాదాపు నలుగురి అన్యాయానికి గురి అవుతున్నారు మన రాష్ట్రంలో. ఇదే విషయం మీద ఆ మధ్య రాఖీ అని ఒక మంచి సినిమా వచ్చింది. ఇవి ఏమైనా తగ్గుతున్నాయా? లేవే? అసలు మహిళా కమీషన్ ఏం చేస్తుంది? వారి ప్రోగ్రెస్ ఫలితాలు ఎక్కడ?

ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్త్రీని ముందు మనిషిగా గౌరవించటం నేర్చుకుని మసలుకోవడం మంచిది. అదేదో ఇంట్లో నుంచే మొదలు పెడితే మరీ మంచిది.

(ఈ వ్యాసం లో మీ మగ పాత్ర లేదని అనిపిస్తే మీరు మా మంచి మగరాజన్న మాట, ఏ మాత్రం వున్నట్లనిపించినా…ఏమి అనుకోమాకండి…ఇది నా ఆలోచనలకు ఒక రూపం, ఒక ఆశ అంతే)

12 comments:

cbrao said...

మహిళల దగా దినోత్సవం
వ్యాసం పేరు, వ్యాసంలో చెప్పిన విషయాలు బాగా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రజ్యొతి ప్రకారం ఈ మహిళల దినం అంటే ఏమిటో చాల మంది ఉద్యొగినులకు, కాలేజ్ విధ్యార్ధినులకు తెలియదని రాసారు. అదీ సంగతి.

Anonymous said...

దళితులకి ఎలక్షన్లో రిజర్వేషన్లిచ్చినా ఇలాంటి ( http://www.hinduonnet.com/fline/fl2210/stories/20050520002603900.htm ) సిగ్గుచేటు పనులు జరుగుతున్నాయి..ఇక మహిళలకి రిజర్వేషన్లిచ్చినా పెద్ద లాభంలేదు..అయినా మహిళలు అల్పసంతోషులండోయ్..సంవత్సరంలో ఒకరోజు మహిళదినం మిగిలిన 364 రోజులన్నీ పురుషదినాలే..హా హా హా..

Unknown said...

ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్త్రీని ముందు మనిషిగా గౌరవించటం నేర్చుకుని మసలుకోవడం మంచిది. అదేదో ఇంట్లో నుంచే మొదలు పెడితే మరీ మంచిది.
మీరన్నదాంట్లో దీనితో నేను ఏకీభవిస్తాను.

రిజర్వేషన్ల మీద మాత్రం మీతో ఏకీభవించలేను.

Naveen Garla said...

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

రాజకీయ పదవులు వ్యక్తిగత నాయకత్వ లక్షణాలకి సంబంధించినవి.వ్యక్తిగత సేవాభావానికి సంబంధించినవి.అవి చోరీసొత్తులా చీట్లేసి పంచుకునేవి కావు. వ్యవస్థ లక్ష్యం సర్వే జనా స్సుఖినో భవంతు కావాలి. అంతేగాని రిజర్వుడు వర్గం సుఖినో భవంతు కాదు.స్త్రీలకి రిజర్వేషనిస్తే పురుషులకి నష్టం జరుగుతుందని మర్చిపోవద్దు.ఆ నష్టపోయే వారిలో మీ కొడుకు మీ మనవడు కూడా ఉంటారు. రిజర్వుడు స్థానాలతో మొదలై ఓపెన్ కేటగరీ పేరుతో అన్‌రిజర్వుడు స్థానాల్ని కూడా కబళించే కులగజ్జి రాజకీయం మొదలయిందని గుర్తించండి.ఆ రాజకీయం రేపు స్త్రీల విషయంలో కూడా జరుగుతుంది. 50 శాతం రిజర్వేషనిస్తే స్త్రీలు బ్రూట్ మెజారిటీతో తమకి అనుకూలంగా నిరంకుశ చట్టాలు చేసుకుంటూంటే మనం గుడ్లప్పగించి చూడాల్సి వస్తుందని తెలుసుకోండి. ఇప్పటికే 498-a డొమెస్టిక్ వయొలెన్స్ చట్టాల మూలంగా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కుని లాకోలేక పీక్కోలేక చస్తున్న అభాగ్యుల గురించి మీకు తెలిస్తే మీరు అవాక్కయిపోతారు. మనం (మగవాళ్ళం)స్త్రీల గురించి ఆలోచించే రోజులు పోయాయి.కాలం చాలా మారిపోయింది.మీరు మానసికంగా 21వ శతాబ్దంలోకి రావాల్సిన అవసరం ఉంది.మన సానుభూతి జాలి చేయూత వారికి అవసరం లేదు.మనల్ని మనం కాపాడుకోగలిగితే చాలు స్త్రీలని ఉద్ధరించినంత ఫలితం.

Sudhakar said...

తాడేపల్లి గారు,

మీరు రిజర్వేషన్ల మీద అన్నది ఒక్క ఈ రిజర్వేషన్లే కాదు,అసలు రిజర్వేషన్ అనే విషయం వలన వచ్చే నష్టాలకు చెందుతుంది. కాబట్టి ఆ విషయం వదిలేద్దాం. రిజర్వేషన్లు ఇవ్వని ప్రభుత్వం మనుగడ సాధించలేని రోజులివి. ఇక స్త్రీలకు ఇస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పారు..మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి...ఇప్పుడు జరుగుతున్న చెత్త రక్షణ వలన మన తరాలలో నష్టపోయే స్త్రీలు వుండరంటారా? కొడుకు, మనవడు లానే కూతురు, మనవరాళ్ళు మన వాళ్లే కదా? :-)

మీరు చెప్పిన అన్యాయంగా కేసుల్లో ఇరుక్కోవటం జరుగుతున్నదే. కానీ ఆ శాతం ఎంత? స్త్రీల వల్లనే ఇరుక్కోబడుతున్న శాతం ఎంత? మొత్తంగా ఇరికించబడుతున్న కేసుల సముద్రంలో దాని శాతం ఎంత? అసలు చేతులు కలవకుండానే చప్పట్లు పుడతాయా? "అమాయకులు" ఇరుక్కుంటారా?

Naveen Garla said...

ఒక పెద్ద వ్యాఖ్యను వ్రాసాను...విండోస్ కు ఏం మాయరోగమో...ఆ పెద్దవ్యాఖ్య బదులు "అ" అని మాత్రం వచ్చింది. ఇప్పుడు అది అంతా మళ్ళి వ్రాసే ఓపిక లేదు కానీ టూకీగా వ్రాస్తా.
మాయావతి, రబ్రీదేవి, జయలలితా లాంటి వాళ్ళు 50శాతం ఉంటే స్త్రీ జనోద్దారణ జరిగిపోతుందా? ఆడవారికైనా..మగవారికైనా అర్హులైన వారికి పదవులిస్తే అంతా అవే చక్కబడతాయి

spandana said...

సుధాకర్ గారూ,
చక్కగా చెప్పారు. ముందు స్త్రీని గౌరవించడం ఇంటినుండి ప్రారంబించాలి. మహిళా దినోత్సవమని చంకలు గుద్దుకొని, సభలు పెట్టి సత్కరించుకోవడమే తప్ప పల్లెల్లో, బడుగుల్లో దీనంగా విలపిస్తున్న స్త్రీల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు?
ఇప్పటికీ పల్లెల్లో బార్య తన ఆస్తి (బానిసత్వపు రోజుల్లో బానిస ఆస్తి అయినట్లు) అని భావించుకొనే ప్రభుద్దులూ, అదే నిజమై నమ్ముతున్న అబలలూ వున్నారు.

తాడేపల్లి గారూ ఏ మాట చెప్పినా మీరు విప్లవాత్మకంగా చెబుతారండీ.
"స్త్రీలకి రిజర్వేషనిస్తే పురుషులకి నష్టం జరుగుతుందని మర్చిపోవద్దు." మన ఇంట్లో తండ్రి పెత్తనమున్నందుకు జరగని నష్టం తల్లికి పెత్తనమిస్తే జరుగుతుందంటారా?

" 50 శాతం రిజర్వేషనిస్తే స్త్రీలు బ్రూట్ మెజారిటీతో తమకి అనుకూలంగా నిరంకుశ చట్టాలు చేసుకుంటూంటే మనం గుడ్లప్పగించి చూడాల్సి వస్తుందని తెలుసుకోండి." ఇప్పుడు మగవాళ్ళు 90శాతం కంటే ఎక్కువ వుండీ పరిపాలిస్తున్నా బ్రూట్‌గా మహిళలు పాలించగలరంటారా?

"ఇప్పటికే 498-అ డొమెస్టిక్ వయొలెన్స్ చట్టాల మూలంగా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కుని లాకోలేక పీక్కోలేక చస్తున్న అభాగ్యుల గురించి మీకు తెలిస్తే మీరు అవాక్కయిపోతారు." వీటి గురించి తెలుసుకొంటే గానీ తెలవవు. స్త్రీల పట్ల రోజూ జరిగే దురాగతాలు తెలుసుకోవాల్సిన శ్రమ లేకుండానే మనకు రోజుకెన్ని చేరిపోతున్నాయో!

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

నా అనుభవం, ఆలోచన చూడండి దయచేసి:

రాధిక said...

రావు గారు ఆ చాలా మంది ఆడవాళ్ళలో నేను వున్నానండి.నాకూ తెలీదు మహిళా దినోత్సవం గురించి..తెలుసుకోవాలని కూడా నేను అనుకోలేదు.నేనయితె రిజర్వేషన్లకి పూర్తిగా వ్యతిరేకిని.చూస్తూవుండేవాళ్ళం గా టాలెంట్ తో కొన్ని సీట్లు,మహిలా రిజర్వేషన్ తో కొన్ని సీట్లు,కుల రిజర్వేషన్ లతో కొన్ని సీట్లు ఇలా తన్నుకుపోతూ వుంటే నిజం గా బాగా చదివే మగ పిల్లలు డొనేషన్లు కట్టి చదవాల్సొచ్చేది.బస్సుల్లో వుండే ఆ మహిలా సూత్రాలు నాకు నచ్చవు.ఎదో గర్భిణిలు,ముసలివాళ్ళు,వికలాంగులకి వుంటే పర్లేదు.ఏమి తక్కువని ఆడవాళ్ళకి ఇవ్వాలో నాకు అర్దం కాదు.ఇలాంటి చోట్ల కాకుండా మిగిలిన అన్ని విధాలు గా మహిళలకు మర్యాద ఇస్తే బాగుంటుంది. కానీ బాల సుబ్రహ్మణయం గారి వాదనతో మాత్రం ఏకీభవించను.

Anonymous said...

థంక్ యౌ సుధాకర్. ఒక మంచి ఆలోచనని ఈ బ్లోగ్ ద్వారా ఇచ్చినందుకు. మన తల్లిని , తోబుట్టువులను మనం ముందు గౌరవం ఇచ్చి వారు చేస్తున్న ఎంతో త్యాగాన్ని మనం గుర్తుతెక్చుకొని, ఈ రోజైన వారిని అభినందించాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం. మనిషి సన్మతిని బట్టి సద్‌గతి సంభవిస్తుంది. ఇలా ప్రతీ మనిషి ప్రపంచం లో ముందుకు నడిస్తే , ఎన్నో సమస్యలు గట్టెక్కుతాయి.

త్రివిక్రమ్ Trivikram said...

సాధికారత మాట దేవుడెరుగు. మహిళలను కనీసం సాటి మనుషులుగా గుర్తిస్తే అదే పదివేలు. స్త్రీలు ఇంటాబయటా వివక్షకు, గృహహింసకు, లైంగికవేధింపులకు గురికాకుండా చూడగలిగితే చాలు. బస్సుల్లో ఆడవాళ్లకు సీట్లను కేటాయించడం ఆడవాళ్ళు weaker sex అనే అభిప్రాయం ఉండడం వల్లనేమో. పైగా రద్దీగా ఉండే బస్సుల్లో నిలబడి ప్రయాణం చెయ్యడం ఆడవాళ్ళకు నరకమే. సునీతగారూ! మహిళలు అనవసర (undeserving) త్యాగాలు చెయ్యడం ఇకనైనా మానుకోవాలండీ!

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name