ఈ మధ్యనే ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం చదివాను. దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను. అందులో చెప్పిందేమిటంటే రచయతలు "ఇజాలలో" పడి పాళీల ములుకులు వంకర చేసుకుంటున్నారని. ఒకటే మూసలో రాసేస్తూ, ఒకటే కోణం నుంచి చూస్తు రాయటం అన్న మాట. ఉదాహరణలు రంగనాయకమ్మ గారు. మొదట్లో నాకు తెగ నచ్చిన రామాయణ విష వృక్షం రెండు అధ్యాయాలు దాటే సరికి రంగనాయకమ్మ గారికి రాయటంలో మరీ వెకిలితనం శృతి మించినట్లు కనిపించింది. అయితే ఆమెను తప్పుపట్టే స్థాయి నాకు లేదనుకోండి. నా అభిప్రాయం అది. అంతే.
ఇక విషయానికొస్తే…
మూస రచన అంటే ఇది.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాకళ వారు ప్రచురించిన కవిత చదవండి. బుర్ర బద్దలు కొట్టుకున్నా దాని భావమేంటో నాకర్ధం కాలేదు. దానికి తోడు ఆ బొమ్మ తాలుకా అంతరార్ధం ఏమిటో కూడా అర్ధం కాలేదు. (మార్పు : బొమ్మ ఇప్పుడు మార్చబడింది)
అర్ధం అయ్యిందల్లా...ప్రజాకళ లేదా ప్రజా సాహిత్యం అంటే "యుద్ధోన్మాది, రక్తం, శవాలు, రష్యా" లాంటివి వుండి తీరాలేమో అనిపిస్తుంది. నేనైతే "ఏరువాకా సాగరో .." లాంటి పాటలు కూడా ప్రజల సాహిత్యం అని నమ్మేవాడిని. ఈనాటి ప్రజా సాహిత్యం మనకర్ధం కావటం అటుంచి, పల్లె ప్రజలలో ఒక్క ముక్క అర్ధం అవుతుందో లేదో తెలియటం లేదు. సాదా మాటలలో, ఉదాత్త సాహిత్యంతో ప్రజలను రంజించి, ఆలోచింప చేసిన పాటలు, సాహిత్యం ఎన్ని రాలేదు? పాటల వరకూ ఎందుకు, "నిగ్గ దీసి అడుగు, సిగ్గు లేని జనాన్ని….మారదు లోకం" అంటూ మాటలతోనే పరుగులు పెట్టించిన సాహిత్యం ప్రజా సాహిత్యం కాదా? "ఘర్జన, దూషణ, ఘోషన, అమెరికా, రక్తం, కామ్రేడ్, శవాలు, నక్కలు, ముక్కలు, కుక్కలు, బూర్జువా" లాంటి పదాలు దాటి ఈ ప్రజా కవులు ముందుకు పోలేరా?
నిజం ఒప్పుకోండి…ప్రజా సాహిత్యం విఫలం కావటానికి కేవలం రచయతలే కారణం. ప్రతీ ఒక్కడు మోనార్కే. రాస్తే సద్దాం మీద ఒక వంద కవితలు…లేక పోతే ప్రపంచ బ్యాంకుపై కోటి తిట్లు…ఇవేనా ప్రజా సాహిత్యం…చస్తే కాదు..కావాలంటే మక్సీమ్ గోర్కీని పోయి అడగండి…లేదా పావెల్ తాలుకా "అమ్మ" ని అడగండి.
8 comments:
నిజం చెప్పారు శోధన గారూ. ఈ కాలపు ప్రజా సాహిత్యం ప్రజలతో కలసి అడుగువెయ్యలేక పోతోంది.
సుధాకర్ గారూ...మీరు చెప్పింది నిజం. కనీస విచక్షణ లేని రాతల వల్ల ఏమి ప్రయోజనమో, అసలు ఏమి ఆశించి రాస్తారో అన్నది నాకు అర్ధం కాదు. ఆలోచనామృతంగా ఉండేది మంచి కవిత్వం కానీ అర్ధంకాకుండా ఉండేది కాదని ఈ రచయితలకి తెలీదు.
ప్రసాదుగారూ, ఆవేశంలో రాసినట్టున్నారు, మీ భావం పూర్తిగా అర్థం కాలేదు. ఇంతకీ మీరు ఆ వ్యాసంలో చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నారా, విభేదిస్తున్నారా?
పడికట్టు మాటల్తోనూ పడికట్టు ఐడియాలజీలతోనూ మంచి సాహిత్యం పుట్టదని ఇంగితజ్ఞానం ఉన్నవాళ్ళెవరైనా గ్రహిస్తారు.
ఒక వస్తువుని సాహిత్య స్థాయికి ఎత్తాలంటే రచయితకి ఆ వస్తువు మీద తనదైన (అద్దెకి తెచ్చుకున్నది కాదు) ఆలోచన ఉండాలి, ఆ ఆలోచనలో లోతు ఉండాలి, పరస్పర సంబంధాల్ని గమనించగల సునిశిత దృష్టి ఉండాలి, ఆపైన వీటన్నిటినీ ఒక కృతిగా ఆవిషకరించగల సృజనశక్తి, భాష ఉండాలి. ఇవి ఉన్న కవులు రచయితలు (ఉ. పాటిబండ్ల రజని, కాట్రగడ్డ దయానంద్, స్వామి, మొ.) మీరు ఎద్దేవా చేసిన వస్తువులమీదే మెచ్చుకోదగిన రచనలు చేశారు.
సాహిత్యాన్ని వామపక్షవాదులు "హైజాక్" చేశారనేది మీ ఆరోపణ అయినట్లైతే - ఇది పాత ఆరోపణే. నన్నడిగితే, అమెరికాలో తప్ప మిగతా ప్రపంచంలో నేను రచయితని అని గర్వంగా కలంపట్టిన వారెవరైనా వామపక్ష భావజాలానికి ఎక్కడో ఒకచోట దగ్గరగా వచ్చారంటాను.
Sorry, Sudhakar. In a momentary confusion I thought I was in Charasala Prasad's blog. Sorry about that.
కొత్తపాళీ గారు, మీరు ఆవేశంలో రాస్తూ ప్రసాద్ అని రాసిసినట్లున్నారు గానీ ఒకటి మరచిపోయారు. ఎవరూ ప్రశాంతంగా ఇలా సాహిత్యాన్ని తిట్టుకోరు కదండీ :-) నేను కూడా ఆవేశం వచ్చే తిట్టా...అర్ధం కాక తిట్టా...ఒక పామరుడిని అయి పామర సాహిత్యం అర్ధం కాక తెల్లబోయి తిట్టాను.
మీరు ఇక్కడ "సాహిత్యం" హైజాక్ కావడం రాసారు. నేను "ప్రజా సాహిత్యం" గురించి రాసాను. రెండింటిలో తేడా వుంది.
మీరు "సాహిత్య వస్తువు" మీద రాసినవి నిజం. కానీ ప్రజా సాహిత్యానికి కావలసినవి "ప్రజలకు కావలసిన" వస్తువులు. అంతే కానీ నేను చెప్పిన ఆ వస్తువులు వాడకూడదని ఎక్కడా లేదు. నా వుద్దేశ్యం అది కాదు. నేను అన్నది, అవి తప్ప ఇంకొకటి లేవా అనే.
మీరన్న చివరి పేరా నాకర్ధం కాలేదు. సాహిత్యకారులందరూ వామ పక్షమా? ప్రజా సాహిత్యం అంటే వామపక్షమా? అమెరికాలో ప్రజా సాహిత్యం రాలేదని మీ గట్టి నమ్మకమా?
మీరు తీసుకుని వచ్చేtopics ఆలోచించేట్లు గా ఉంటాయి.మానవుడు ఏ స్థితి లో ఉన్నాడో comments ద్వారా తెలుస్తుంది.ఏందులో నిజం ఉందో పంచుకోవడం వలన మనము తీసుకునే చర్యలు అవగాహనకు వస్తుంది.స్త్రీ తన శక్తిని తాను తెల్సుకోవాలి మొదట,అది గమనించిన తక్షణం ఎదుర్కోవడానికి,సమ్రక్షించు కోవడానికి ఏ కొత్త రిజర్వేషన్లు అవసరం లేదేమో. ప్రజా సాహిత్యం స్త్రీ కి awareness కల్గించేట్లు ఉండాలి.స్త్రీ ఆలోచనని,ఎంతసేపు ఎవరో ఆసరా యిస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసే విధంగా తయారు చేస్తోంది సమాజం.
మీరు తీసుకుని వచ్చేtopics ఆలోచించేట్లు గా ఉంటాయి.మానవుడు ఏ స్థితి లో ఉన్నాడో comments ద్వారా తెలుస్తుంది.ఏందులో నిజం ఉందో పంచుకోవడం వలన మనము తీసుకునే చర్యలు అవగాహనకు వస్తుంది.స్త్రీ తన శక్తిని తాను తెల్సుకోవాలి మొదట,అది గమనించిన తక్షణం ఎదుర్కోవడానికి,సమ్రక్షించు కోవడానికి ఏ కొత్త రిజర్వేషన్లు అవసరం లేదేమో. ప్రజా సాహిత్యం స్త్రీ కి awareness కల్గించేట్లు ఉండాలి.స్త్రీ ఆలోచనని,ఎంతసేపు ఎవరో ఆసరా యిస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసే విధంగా తయారు చేస్తోంది సమాజం.
ఎవరూ ప్రశాంతంగా ఇలా సాహిత్యాన్ని తిట్టుకోరు కదండీ
:-)))))
అవును, ఆ మాత్రం ఆవేశం రాకపోతే అది సాహిత్యమూ కాదు, మనం సాహిత్యప్రియులమూ కాదు.
మీ ఆవేదనని తప్పుగా అర్థం చేసుకున్నాను.
అమెరికాలో ప్రజా సాహిత్యం రాలేదని కాదు - వామపక్ష భావజాలం లేదని, ఉన్నా తక్కువని నా ఉద్దేశం.
ఇక్కడ వామపక్ష భావజాలం అంటే నా నిర్వచనం - అ) మన బాగే కాకుండా పక్కవాడు కూడా బాగు పడాలి అనే ఆలోచన, ఆ) సమాజంలో అందరూ బాగుండాలి, అందరికీ సమాన హక్కులు అవకాశాలు ఉండాలి అనే ఆలోచన.
మీరు మాట్లాడే ప్రజాసాహిత్య మేవిటో నాకు పూర్తిగా అర్థం కాలేదు.
మీరు గోరటి వెంకన్న పాటలు విన్నారా/చదివారా?
Post a Comment