ఇదేనా భాగ్యనగరం అనుకుని పదిహేను రోజులయ్యిందేమో...మరికొంత మంది అభాగ్యులు కన్ను తెరిచేలోపు ప్రాణాలు వదిలేసారు. ఎప్పటిలానే మన ఎక్స్ గ్రేషియా రాజకీయం రంగప్రవేశం చేసింది. ప్రతి రాజకీయ నాయకుడు పరిగెత్తుకొచ్చేసి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించేసారు..ఎంత దయార్ద హృదయులు? వారికి చెందిన పార్టీల కార్యకర్తలు ఒక్కడొస్తే ఒట్టు. ఒక్క నాయకుడైనా తమ పార్టీ తరపున ఒక్క లక్ష ఎక్స్ గ్రేషియా ప్ర్రకటిస్తారేమో అని చూసా? ఛ ఛ అంత పని మన వాళ్లు చెయ్యటమా? నాయకుల సభలకు బ్యానర్లకు పెడతారు కోట్లు..మరి ఇక్కడ ఏం అడ్డు వస్తుందో వీళ్లకు?
మొత్తానికి ఒకటి అర్ధం అయ్యింది. మనకు ప్రత్యేకంగా ఎక్స్ గ్రేషియా మంత్రిత్వ శాఖ వుండాల్సిందే. ప్రతి నెలా క్రమం తప్పకుండా చనిపోతున్న రైతులు, అభాగ్యులు, పోలిస్ బాధితులు మొదలైన వారికి సక్రమంగా ఈ డబ్బులు అందచెయ్యటం అప్పుడు సులభం అవుతుంది.
మొన్నామధ్య ఈ నగరానికి ఏ.వన్ హోదా ఇచ్చినపుడు నాకు తిక్క రేగింది. అసలు ఏ.వన్ హోదా ఎందుకు, ఏ నగరానికి ఇస్తారో నాకు తెలియదు కానీ, మామూలు స్థాయి నుంచి అతి దరిద్ర స్థాయికి చేరుకున్న నగరాలకు ఇవ్వరని మాత్రం నాకు గట్టి నమ్మకం వుండేది. ఆ నమ్మకం ఆ రోజుతో పోయింది.
ఇక్కడ వర్షం పడితే ఒకరిద్దరు చనిపోతారు...మాన్ హోల్లలో పడి. దీనిని ఎవడూ బాగు చెయ్యలేడు. చేతులెత్తేసారు.
ఇక్కడ తీవ్ర వాదులు హాయిగా పాస్ పోర్టులు, రేషన్ కార్డులు తీసుకోవటానికి వస్తారు. ఇక్కడే సురక్షితంగా మకాం చేస్తారు.
ఇక్కడ చినుకు పడితే ట్రాఫిక్ నరకం. పోలీసులు మాత్రం మాయం
చలానాలతోనే సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం సంపాదిస్తారు ఇక్కడి పోలీసులు.
ఇక్కడ రోజుకు మద్యం విక్రయం ఒకటిన్నర కోటి.
ఎక్కడ బాంబుకు పేల్తాయో తెలియదు. ఎవరు పేల్చారో ప్రభుత్వానికి అంతకన్నా తెలియదు.
నాసి రకం రోడ్లు, స్కూల్లు, పార్కింగులు కూడా లేని షాపింగు మాల్లు..
ఇంకా చెప్పాలంటే ఇది ఒక భూలోక అవినీతి నరకంగా తయారయింది.
ఇది ఒక తగలబడుతున్న రోమ్
దేవుడా మా నీరో శేఖరుడికి కాస్త మెదడును, ప్రజలను పాలించే ప్రజ్ఞను ప్రసాదించు తండ్రీ..
రవీంద్రుని మాటలలో..
ఎక్కడ ప్రభుత్వం ప్రజలను తన వాళ్ళనుకుంటుందో
ఎక్కడ అవినీతి అడ్రస్ లేకుండా పోతుందో
ఎక్కడ అధికారులు, తమ పదవులను సేవాతత్పరతతో నిర్వహిస్తారో
ఎక్కడ ప్రజలు తాము సురక్షిత సమాజంలో వున్నామని భావిస్తారో
అక్కడా నా దేశాన్ని మేల్కొలుపు తండ్రీ