పావుకిలో పేరు మార్చాల్సిందిగా ఈ భారత ప్రభుత్వానికివే నా విన్నపాలు. పావుకిలో అనే దానిని ఇక మీదట కిలో అని పేరు మారిస్తే, కనీసం మధ్య తరగతి ప్రజలు "అబ్బా కిలో టొమేటో ఆరు రూపాయలేనా" అని సంతోష పడతారు.
రైతుకు దక్కుతున్న టొమేటో ధర కిలోకు (1000 gms) రూ. 0.50. మహా అయితే రెండు రూపాయలు. జూబిలీ హిల్స్ ఫ్రెష్ అండ్ నాచురల్ లో టొమేటో ధర కిలోకు రూ. 28.00. వీరు ఈ టొమేటోలను ఆల్ప్స్ పర్వతాలనుంచి దిగుమతి చేసుకోవటం లేదు. ఇక్కడే రంగారెడ్డి జిల్లా రైతుల రక్తం కన్నీరుగా మారితే ఎర్రగా పండిన టొమేటోలు అవి. వారు పడుతున్న బాధలు చూస్తే మనిషనే వాడికి కంట తడి రాక మానదు.
ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఈ ప్రభుత్వాలకు మైనారిటీలు, రిజర్వేషన్లు తప్పితే ఇంకేమీ పట్టవా? ఎప్పటికి గ్రామీణ రైతు స్వావలంబన సాధ్యమవుతుంది. ఈ భారత దేశంలో మైనారిటీలు ఎవరంటే కళ్ళు మూసుకుని "రైతులు" అని చెప్పవచ్చు. వీరు ఎవరికి అవసరం లేదు. వీరు చావు ఎవరికి పట్టదు. ఎందుకంటే రైతులు ఏ మతానికి సంభందించిన, కులానికి సంభందించిన వర్గం కారు. వారు ఈ రాజకీయ కుల మహా సభలు నిర్వహించి రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకు బలం చూపి హెచ్చరికలు పంపలేరు.
రైతు బజార్లు మొదలయినప్పుడు కొంతవరకూ దాని ప్రభావం కనిపించింది. RTC ప్రత్యేక బస్సులు కూడా నడిపింది. ఈ పధ్ధతి చాలా ఉత్తమ మైనది. కాకపోతే ఈ బజార్లలో కూడా దళారీలు ప్రవేశించటం, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, అవినీతి విజృంభించింది. వీటిని బాగు చేస్తే ఎక్కడ తెలుగు దేశానికి పేరు వస్తుందో అని కాంగ్రెస్ వాటిని అలానే వదిలేసింది తప్పితే రైతుల గురించి పట్టించుకోవటం మానేసింది. అదీ కాక సిగ్గు లేకుండా మాది రైతు ప్రభుత్వం అని బాజా ఒకటి.
రైతులకు మేలు చెయ్యాలంటే, ఈ ప్రభుత్వాల దృష్టిలో వారికి ఉచిత విద్యుత్తు ఇచ్చెయ్యటమో (మాట వరసకు), రుణాలు ఇచ్చెయ్యటమో అనుకుంటే అంతకంటే గుడ్డితనం మరొకటి ఉండదు. పట్టణాల మోజులో పడి, వేసిన రోడ్లనే మళ్లీ మళ్ళీ వెయ్యటం, పరిశ్రమలన్ని పట్టణాలలో పెట్టుకుని, రింగు రోడ్లకు మాత్రం పొలాలని తవ్వుకుంటూ పోవటం...ఏమిటి ఈ దోపిడీ? ఇంత చిన్న అంశం కూడా ఆలోచించలేని పరిస్థితులలో ఉందా భారత ప్రభుత్వం?
రైతుల విద్యపై ప్రభుత్వం గట్టిగా చూపు సారించాలి. వారికోసం ప్రతి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల నెలకొల్పాలి. వ్యవసాయ కళాశాలలో పట్టబధ్రులయిన రైతులను ఇతర రైతులకు మార్గదర్శులుగా (mentors) గా నియమించాలి. ఈ మార్గదర్శులకు ఏటా అవార్డులను ప్రదానం చెయ్యాలి(ఉత్పత్తి ప్రకారం). ప్రతి జిల్లా నుంచి వీరు ఆయా జిల్లాల వ్యవసాయ కార్యాలయాల ప్రోటొకాల్ లో ఒక భాగస్వామ్యులుగా చెయ్యాలి.
ప్రతి గ్రామంలో వ్యవసాయ సంఘాలను పరిపుష్టం చెయ్యాలి. ఈ సంఘాల నిధులకు NRI లు కూడా ఒక హస్తం వేసేలా చేస్తే గ్రామీణ సౌభాగ్యం సాధించటం చాలా సులభం. మన ఊరు బాగుపడాలి, మన ఊరి రైతులు బాగు పడాలి అని ఏ NRI కోరుకోరు? నేను NRI అని ప్రత్యేకంగా ఎందుకు అన్నానంటే...వారికి కన్న భూమిమీద, సొంత ఊరు మీద ఉన్న అభిమానం మనలో ఉండదు మరి.
దేశంలో రిటైల్ చైనులు పెరగాలి. రిలయన్స్, భారతి, సుభిక్ష, వాల్ మార్టు వంటివి ఎన్ని ఎక్కువయితే రైతుకు అంత లాభం. వీరు రైతుల నుంచి మార్కెట్ ధరకు కొంటారు. కొద్దిగ లాభానికి ఎక్కువ మొత్తంలో సరుకును తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తారు. ఈ మార్టులు ఎక్కువ అవుతున్నాయని రాజకీయ పార్టీలు చేసే గోల పట్టించుకోనక్కరలేదు. వారు ఆ సరుకులను ఎక్కడినుంచో కొనటం లేదు, మన రైతుల నుంచే, మన దళారీల కంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. చిన్న చిన్న కిరాణా కొట్లలో ఉండే అపరిశుభ్రత, మోసం, కల్తీ అందరికీ తెలిసిందే...వారు నష్టపోతారని గొంతు చించుకోనక్కరలేదు.
నేను అమెరికాలో కూరగాయల దుకాణం చూసాను. ఒక అంధుడు కూడా నిరభ్యంతరంగా కూరగాయలను కొనుక్కోవచ్చు. అంతటి ప్రమాణాలు పాటిస్తారు. ఒక రోజు ధరలు తగ్గుతాయి, ఒక రోజు పెరుగుతాయి...అంతా రైతు దగ్గర కొన్న ధరల ప్రకారమే. ఎక్కువగా అమ్ముడయ్యేవి తక్కువ ధరకు దొరుకుతాయి (మనకు పూర్తి వ్యతిరేకం). ఏది నచ్చక పోయినా మర్యాదగా మార్చెయ్యటమో లేదా డబ్బులు తిరిగి ఇచ్చెయ్యటమో చేస్తారు. అదంతా చూస్తే నాకనిపించింది. "ఎక్కడ నిజాయతీ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది".
13 comments:
mii ii vyaasaniki nenu 100 ku 105 marks vestanu.emdukamtea chala patrikalu raasea vyaasala kamtea idi chala vunnatamayinadi.loapalanu chuupadam toa paatuu emi ceyyaaloa,emi ceste baaguntundoa vivaram ga suucimcaaru.caalaa manchi vyaasam
చాలా బాగా వ్రాశారు. పావుకిలోను కిలో అని మార్చడంతోపాటు, వందరూపాయలను కూడా రూపాయి అని పేరుమారిస్తే ఇంకా బాగుంటుంది :)
చాలా బాగుంది. అలోచింపజేసే అర్ధవంతమైన వ్యాసం ఇది. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? రైతుల విద్యపై ప్రభుత్వం గట్టిగా చూపు సారించాలి. వంటి వాక్యాలలో ప్రభుత్వానికి బదులు "మనము" పెట్టుకుంటే ఎంతో కొంత ఈ దిశగా ప్రగతి సాధించొచ్చు. ప్రభుత్వముతో పెట్టుకుంటే అంతే సంగతులు...
రాధిక గారు, ధన్యవాదాలు.
వెంకట రమణ గారు, :-) నిజమే తొందరలో అలానే అవుతుంది.ఇప్పటికే సినిమా టికెట్టు 150, కోక్ 20, పాప్ కార్న్ 50 రూపాయలు మన థియేటర్లలో...
రవి గారు, మీరన్నది నిజమే గానీ ఇది ప్రజల సమస్య. "మనము" అనేది అత్యంత బలహీనమైన, అందమైన భావన. మన దేశంలో ఈ "మనము" సాధించటం ఎడారిలో నీళ్ళు వెతకటంతో సమానం. అదీకాక రాష్ట్రంలో అందరు రైతులు బాగు పడాలంటే భారీ యంత్రాంగం ఉన్న ప్రభుత్వమే ఆ పని చెయ్యగలదు. మనం మొదలు పెడితే మహా అయితే మన ఊరు, చుట్టు పక్కల ఒక పది ఊర్లు బాగు పడతాయేమో. ఇప్పుడున్న పరిస్థితులలో కొన్నాళ్ళకు మనమే రంగంలోనికి దిగాలేమో
''నేను'' అన్నది బలహీనమైన భావనేమో కానీ మనము అన్నది కాదు. ప్రభుత్వ యంత్రాంగమే బలహీనమైనది. సగటు గ్రామములో ప్రభుత్వ యంత్రాగమనబడే ఉద్యోగులు 2-3. మరి మనము వందలు, వేలు. రైతుల్లో సాధించాలి, బతకాలి, పోరాడాలి అన్న తపనే ఉండాలి కానీ మా ఊరి లాంటి చిన్న ఊరికి చదువుచెప్పడానికి ఒక యువకుడు చాలు. మనము అంటే రైతులు కూడా. వాళ్లలో చైతన్యం లేకపోతే ఎంత డబ్బైనా పానకాలస్వామి నోట్లో పోసినట్టే. అందరూ డబ్బు సమస్య అనుకుంటారు..కానీ కాదు. మా కుటుంబము గత 20 సంవత్సరాలుగా ఒక స్వచ్చంద సేవా సంస్థ నడుపుతున్న అనుభవముతో తెలిసిందేంటంటే తగినంత మంది పనిచేసే వాళ్లు లేకపోవటమే సమస్య. 10 సంవత్సరాల క్రితం ఈనాడు ఆదివారము సంచికలో తెలంగాణాలో అంకపూర్ అనే గ్రామ ప్రజల సమిష్టి కృషితో దుర్భిక్ష గ్రామము నుండి గ్రామ ప్రజలందరూ కేవలము తమకున్న వనరులతో ఎలా ధనవంతులయ్యారొ అన్న వార్త చదివా. అలాంటి అంకాపూర్లే మనకు కావలసింది. చాలామంది సంఘటిత కార్యమంటే..సంఘటితంగా ప్రభుత్వాన్ని అర్ధిస్తాం అన్న ఆలోచనా ధోరణి విచారకరం
నా దృష్టిలో ప్రభుత్వం అంతే ప్రజలు. ఈ సమాజం. సమాజాన్ని ఇలానే వదిలేస్తే చాలా ప్రమాదం, ఈ ప్రభుత్వాలకు ఎప్పటికీ మంచి బుద్ధి రాదు. అయితే మీరన్నది నాకు ప్రాక్టికల్ గా అనిపిస్తుంది. బాగుంది. ఒప్పుకుంటున్నా..
మన దేశంలో ఏ వస్తువుకైనా ఉత్పత్తిదారుడే వెలకడ్తాడు - ఒక్క వ్యవసాయ ఉత్పత్తులకు తప్ప. పైగా రైతే రాజు అని, దేశానికి వెన్నెముక రైతేనని కల్లబొల్లి కబుర్లొకటి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి క్షేత్ర పరిశోధనాలయాలు ఇప్పటికే ప్రతి జిల్లాలో ఉన్నాయనుకుంటా. లేనట్లైతే స్థాపించాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు పొలాలకు వెళ్ళి చూడాలి. రైతులకు అక్కడి భూసారాన్ని, నేల లక్షణాన్ని బట్టి, నీటి సదుపాయాన్ని బట్టి పంట దిగుబడి పెంచడానికి తగిన సూచనలివ్వాలి. వాణిజ్య పంటలు వేసే రైతులకు మార్కెట్ స్థితిగతుల గురించిన సమాచారం అందివ్వాలి. వైఙాసత్య అన్నట్లు ఇంత చేసినా ఒకే మూసలో ఆలోచించడానికి అలవాటు పడిన రైతులూ ఉంటారు కానీ చాలా తక్కువని నా అభిప్రాయం. గ్రామాల్లో ఉండే/గ్రామాల నుంచి వచ్చిన విద్యావంతులు వ్యవసాయం మీద కాస్త దృష్టిపెడితే ఇంతకంటే ఎక్కువ ప్రయోజనముంటుంది. రైతును దోచుకునేది దళారీలే. మార్కెట్ మొత్తం ఒకరిచేతిలోకెళ్ళకుండా రీటెయిల్ చెయిన్లు ఎన్ని ఎక్కువయితే రైతుకు అంత ప్రయోజనకరం. ఉత్పత్తిని వెంటనే తెగనమ్మే దుస్థితి నుంచి రైతు బయటపడాలంటే గిడ్డంగి సౌకర్యముండాలి. ఇది ప్రభుత్వమే చెయ్యాల్సిన పని.
వ్యవసాయ క్షేత్రాలున్నా వాటి విస్తృతి చాలా తక్కువ ఉదాహరణకి పాలెం వ్యవసాయ క్షేత్రం వళ్ల చూట్టూ ఉన్న కొన్ని గ్రామలు తప్ప మిగిలిన వాళ్లకు పెద్ద ప్రయోజనము లేదు. చాలా మంది రైతులకు అలాంటి సౌకర్యము ఉందన్న సంగతి కూడా తెలియదు. గిడ్డంగులు ఉండాలన్నది చాలా మంచి ఆలోచన. కానీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ప్రణాలికలు, కాంట్రాక్టులు, టెండర్లు, స్కాములంటు నానా రచ్చ చేస్తారు. గ్రామస్తులే కలసికట్టుగా ఒక చిన్న గిడ్డంగితో ప్రారంభించాలి. ఆ తరువాత విజయవంతమైతే పెద్ద గిడ్డంగి నిర్మించుకోవచ్చు. అబ్దుల్ కలాం సమాచార సాంకేతిక రంగము దేశానికి ఎంత ముఖ్యమో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా అంతే ముఖ్యమన్నాడు. ఎందుకంటే టొమాటో ధరల సంగతి, పాల సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ NRI లు ముఖ్య పాత్ర పోషించడానికి చక్కని అవకాశం.
ఇక దేశమంటే ప్రజలని గురజాడ అన్నాడు కానీ..ప్రభుత్వమంటే ప్రజలని ఎవరూ అనటం వినలేదు. నేనిందులో మీతో ఏకీభవించట్లేదు.
చర్చా కొచ్చింది కదా అని అంకాపూర్ ఇప్పుడు ఎలా ఉందో అని గూగూల్లో శోధించి చూసా. ఇంకా ప్రగతి పథములోనే ఉన్నట్టుంది. ఇదిగో ఒక వార్త
http://www.rediff.com/telugu/2000/jun/20anka.htm
ప్రభుత్వం అంటే for/by/to the people అంటారు కదా..ప్రజల కోసం కాకపోతే ప్రభుత్వం ఉన్నది ఎలక్షన్ల కోసమా ? :-) నేను "మనము" అనే భావన అత్యంత బలహీనమైనది అని ఎందుకన్నానంటే చుట్టూరా ఉన్న సమాజం అలా ఉంది కాబట్టి. ఊర్లో రైతులు రోజుకొక్కడు చచ్చిపోతుంటే ఊరంతా ఏకమై నిరసన చెప్పే సీనే లేదు మనకు. ఇది నిరాశావాదం కాదు. నిజవాదం. అయితే నేను మనస్ఫూర్థిగా కోరుకునేది "మనం" భావన ఈ సమాజంలో వెల్లివిరియాలనే.కానీ ఈ ప్రభుత్వాలింతే అని ఎన్నాల్లు ఊరుకుంటాం? V for Vendetta అనే చిత్రంలో ఇలా అంటారు "governments should fear of thier people". పని చెయ్యని ప్రభుత్వాలని అంశాల వారీగా దింపే సమయం రావాలి,అది కుల పరంగానో, ప్రాంత పరంగానో, మత పరంగానో కాక దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలైన అంశాల ప్రాతిపదిక కావాలి. ఒకడు నకిలీ ఎరువులు అమ్మితే వాడిని ప్రభుత్వం దండించగలదేమో గానీ ప్రజలు ఏం చేసినా అది నేరం కిందకు వస్తుంది కదా...నా దృష్టిలో ప్రభుత్వం పాత్ర అక్కడ వస్తుంది.
దేశ సార్వభౌమికతను పరిరక్షించడము, న్యాయ వ్యవస్థను అమలుపరచటము. కష్టపడి సంపాదించిన దాన్ని పక్కవాడు లాక్కోకుండా కాపాడటము ఇవి ప్రభుత్వ బాధ్యతలు.(ఫుల్ స్టాప్) బస్తా బియ్యాన్ని ఇంతకమ్మాలి అంతకమ్మాలి అని శాసించటం నిరంకుశత్వం. ఈ కులానికి ఇన్ని సీట్లివ్వాలని నిర్ణయించటం అమానుషం.
చక్కటి వ్యాసం. సుధాకర్ గారికి కృతజ్ఞతలు.
నా అక్కసు అంతర్మధనం కూడా ఇదే! రైతును పట్టించుకునే వాడే లేడు. సంఘటిత వుద్యోగులు అన్ని రకాలా తమ తమ కోరికలను సాధించుకుంటున్నారు. చివరికి కుల సంఘాలు కూడా తమతమ కోర్కెలను సాధించుకుంటున్నాయి. అయితే రైతు గోడు వినేవాడే లేడు. కడుపుకు తిండిపెట్టే వాడికే అదేదో ముష్టి విదిల్చినట్లు ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అదీ సక్రమంగా అమలు కాదు.
ఈ సమస్యలకి రిటైన్ చెయిన్లు రావడం ఒక పరిష్కారాన్ని చూపిస్తుందని నేనూ అనుకుంటున్నా! రైతు ధాన్యం పండిస్తున్నా అందులో మధ్యలో రాళ్ళు కల్తీ వచ్చి చేరుతుంది. అటు పండించినవాడూ ఇటు తింటున్నవాడూ ఇద్దరూ నష్టపోతున్న ప్రస్తుత వ్యవస్త లోపభూయిష్టమయింది. టోకు వర్తకులు నష్టపోతారనే సాకుతో ఈ వ్యవస్థను ఇలానే సాగదీయడం వుచితం కాదు. మనకు వీధికి పది కిరాణా షాపులు వున్నా ప్రతిదానిలోనూ కల్తీనే! పళ్ళూడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేం అన్నదోరణితో మనమూ వాటికి అలవాటు పడిపోయాం. ఒకవేళ ఎవడో నిజాయితీతో ఇద్దామనుకున్నా వాడీ పై సప్లయిరే కల్టీ చేస్తుంటే కిరాణా వర్తకుడు చేసేదేమీ లేదు. కాబట్టి పైనుంచి కిందివ్గరకు సరుకు కల్తీకి బాద్యత వహించే బ్రాండు రావడమే మంచిది. ఇందులో కూడా పోటీ వుండాలి. అప్పుడు వినియోగదారుడే రాజు అవుతాడు. అప్పుడు ఉత్పత్తిదారుడికీ గిట్టుబాటు లభిస్తుంది. ఏ సమయంలో దేనికి డిమాండ్ వుంటుందో చైనుకు తెలుస్తుంది గనుక రైతులను అది ఆ విదమైన పంటలని ప్రోత్సహించే జరుగుతుంది. అటు రైతుకూ ఇటు వినియోగదారుడికీ మేలు అవుతుంది.
ఇక "మనం" చాలా చేయవచ్చు. మనం చేస్తూనే ప్రభుత్వం మిదా ఒత్తిడి తేవచ్చు.
రవి గారూ అర్థవంతంగా సాగుతున్న రైతుల సమస్యమీద చర్చను "కులానికి సీట్లవ్వడం" లాంటి సున్నిత విషయాలమీదికి మళ్ళించకండి.
--ప్రసాద్
http://blog.charasala.com
అవునండి ప్రసాద్ గారూ..నేనా సైడు విషయము ఎత్తకుండా ఉండాల్సింది. క్షమించగలరు.
దొంగలు దొంగలు కలిసి ఊల్లు దోచు కున్నట్టుగా!, నేడు ప్రభుత్వం, దలారులు కలిసి రైతును దోచు కుంటున్నారు.
Post a Comment