ఈ వారాంతం హైదరాబాదు పుస్తక జాతరకు వెళ్ళాను. తెలుగులో కొని చదవాల్సిన చాలా పుస్తకాలు అక్కడ ఉన్నాయి. ఈ సారి రష్యన్ బాల సాహిత్యం కూడా లభ్యమవుతుంది. నేను ఆంధ్ర కేసరి ఆత్మ కధ, బారిష్టరు పార్వతీశం, దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు కొన్నాను... విచిత్రం ఏమిటంటే బారిష్టరు పార్వతీశం రాసిన మొక్కపాటి, ఆంధ్ర కేసరి ప్రకాశం దగ్గర ప్లీడరు గా ఉండేవారు. ఆ విధంగా గురు శిష్యులిద్దరి రచనలు ఒకే రోజు కొన్నట్లు అయ్యింది. అక్కడే కలసిన చావా కిరణ్ కూడా ఆంధ్ర కేసరి పుస్తకంతోనే కనిపించటం మరొక విషయం :-).
ప్రస్తుతం పి.వి "లోపలి మనిషి" చదువుతున్నాను. పి.వి.నరసింహరావు గారి రచనా శైలి, భావ ఉన్నతి అద్భుతం అని చెప్పక తప్పదు. ముఖ్యంగా బాల్యం గురించి వివరించేటప్పుడు....
ఇక పోతే, ఈ మధ్య జరుగుతున్న వెధవ రాజకీయాల గురించి చాలా ఆసక్తికరమైన చర్చలు మిత్రులతో జరిగాయి. ప్రతి ఒక్కరు రాజకీయాన్ని తిట్టి మరీ సంభాషణ మొదలు పెడుతున్నారు.
శుభ్రంగా ఎన్నుకున్న ప్రజలని కాలదన్ని కె.సి.ఆర్ రాజీనామా చెయ్యటం ఏమిటీ? చేసాక మరలా ఎన్నిక కావటం కోసం అష్టకష్టాలు పడటం ఏమిటి? అతగాడు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్, టి.డి.పి లకు సారా, డబ్బు పంచడానికి అవకాశం ఇవ్వటం ఏమిటి? ఇవన్నీ జరగటానికి ఎవరు కారణం ? శుభ్రంగా ఉన్న సీటుకు రాజీనామా చేసి, ఇప్పుడు ఆ ఎన్నిక తెలంగాణ ఆత్మభిమానానికి పరీక్ష అనటం ఏమిటి? రెండు సంవత్సరాలు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగినది అస్సలు తెలియనట్లు ఇప్పుడు శఫధాలు చెయ్యటం ఏమిటి?
కేవలం, కరీంనగర్ ఎన్నిక దానిని ఎలా నిర్ణయిస్తుంది? అలా అయితే దారుణంగా ఒడిపోయిన జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల సంగతి ఏమిటి?
ఈ రోజు, ఈనాడు ప్రతిధ్వనిలో ఒకతను భలే చెప్పాడు...
తెలంగాణ : ప్రతి పార్టి అంటుంది, మేమే మొదలు పెట్టాం. మేమే తెస్తాం.
బీడి పుర్రె : ప్రతి పార్టి అంటుంది, మేము చెయ్యలేదు, మేమే తీసెయ్యగలం.
దాదాపు వందకోట్ల అవినీతి ధనం, మూడు కోట్ల వరకు ప్రజాధనం కరీంనగర్ ఎన్నికలలో ఖర్చు అవుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పాపం వోక్స్ అవినీతిని కూడా మించిపోయింది. ఇది ప్రజాస్వామ్యాన్ని తీవ్రస్థాయిలో మానభంగం చెయ్యటమే.
నా అంచనా నిజమైతే..కరీంనగర్ కె.సి.ఆర్ కు దక్కుతుంది, బొబ్బిలి తెలుగుదేశంకు దక్కుతుంది. కాంగ్రెస్ కు వోటేసి గెలిపించే ధైర్యం బొబ్బిలిలో అయితే చెయ్యరు. అసలే అక్కడ కుటుంబాలకు కుటుంబాలు అవినీతి గబ్బిలాలు వేలాడుతున్నాయి.
4 comments:
నేను కూడా పుస్తక మేళాలో "ఆంధ్ర కేసరి" గారి జీవిత్ర చరిత్ర పుస్తకం కొన్నాను.
దర్గామిట్ట కతలు - నెల్లూరియాసలో రాశారని విన్నాను. రచయిత పేరు - అబ్దుల్ ఖాదిర్, ఔనా?
ఇ పుస్తకాలు చదివేటపుడు, మీకు నచ్చిన అంశాలు, అందరూ చదవతగినవని అనిపించినవి బ్లాగులో రాస్తారని ఆశిస్తున్నాను.
అవునండీ రానారె గారు, అబ్దుల్ కదీర్ బాబు రచయత.
Post a Comment