చాలా రోజులుగా తెలుగు సినిమా చూడలేదు కదా అని అలా ఏదో ఒక సినిమా చూద్దామని ఫ్రెండ్స్ తో కలసి పైన చెప్పున సినిమాకు వెళ్ళాను. ఆహా ఏమి చిత్ర రాజం?
అసలు ఇది పూరి జగన్నాధ్ చిత్రమేనా అనిపించింది ముందర (అమ్మా..నాన్న..తమిళమ్మాయి ప్రభావం వలన). తరువాత మెల్లగా ఇలాంటి సినిమాలు కేవలం పూరి మాత్రమే తియ్యగలడు అని అర్ధం అయింది. అసలు కధ ఏమిటో ఎందుకు ముందుకు సాగుతుందో అర్ధం కాదు. కధతో సంబంధం లేని కామెడీ ట్రాకు (కాస్త బాగున్నది ఇదే). విపరీతమైన అరుపులు సినిమా అంతటా సమంగా పరచుకున్నాయి. హీరోయిన్ తప్పితే ప్రధాన పాత్రలు అన్ని కనీసం 150 డెసిబల్స్ స్థాయిలో అరుపులు, సంభాషణలు సాగిస్తాయి. అది పూరి మార్కు.
ఇక కధ విషయానికొస్తే పెద్దగా ఏమి లేదు. అన్ని తెలుగు సినిమాలలాగానే బయటి రాష్ట్రాలలో (కులూ, మనాలి) అందరూ తెలుగు మాట్లాడేస్తుంటారు. ఇక మన రాష్ట్రంలో ఉన్న విలనీయులు మాత్రం తెలంగాణా యాసతో కూడిన తమిళం (అదే మరి పూరి స్టయిల్) మాట్లాడుతుంటారు (అరుస్తుంటారు). హీరో విషయానికొస్తే తండ్రిని ఏరా అని పిలిచే స్థాయి ఉన్న ఒక చిన్న సైజు సిల్వస్టర్ స్టాలిన్. ఇతనికి ఎదురంటూ పెద్దగా ఏమీ లేవు/లేదు. పిట్ట కొంచం కూత ఘనం అన్న మాట. మా-టీవి ని సొంత టీవి లా వాడేసుకుంటూ వుంటాడు.(అల్లు అరవింద్ కి కూడా మా-టీవీ వాటాలున్నాయా? కొంపతీసి?). ఒక టీవి ఛానల్ వారు గూండాలు వస్తున్నారని వణికి పోవటం మనం ఈ చిత్రంలో చూస్తాం.
హీరో ఉద్యోగ నిమిత్తం కులూ, మనాలి వెళ్ళి అక్కడ ఉన్న ఒక యోగినిని ప్రేమ అని వేధించటం చిత్రంలో 50% వుంటుంది. అది కూడా పూరీ మార్కులో "ఏమే…నాకు ఏం తక్కువే? , నీకు కొవ్వెక్కిందే? …" ఇలా సాగిపోతుంది. ఇలా వేధిస్తే ప్రేమలో పడే అమ్మాయిలు ఎక్కడ వుంటారో పూరికే ఎరుక. ఈ యోగినిలు కూడా చాలా విచిత్రంగా వుంటారు. పూర్తిగా మస్కారా, లిప్ స్టిక్కు, ఫేషియల్ తో భలే వుంటారన్న మాట. అన్నట్లు కలర్డ్ జుత్తు కూడా. అన్ని తెలుగు సినిమాలలానే హీరోయిన్ అందరి మధ్యలో, ముందరగా నడుస్తూ ఫ్రేమ్ ను లీడ్ చేస్తూ వుంటుంది.
ఇక మిగతా విషయాలు…దయ చేసి మీ పిల్లలను మాత్రం ఈ చిత్రానికి తీసుకు వెళ్ళవద్దు. విపరీతమైన హింస, మొహానికి రక్తాలు రాసుకోవడాలు లాంటివి జుగుప్సాకరంగా వున్నాయి. మనిషిని పట్టుకుని పరపరా మధ్యకు విరిచెయ్యటం వంటివి అయితే చెప్పనక్కరలేదు.
చక్రి, పూరి కలిస్తే ఎలా వుంటుంది? చెవులు దిమ్మెక్కిపోయే అరుపులుతో కూడన పాటలు పుట్టాయి. అవి కూడా చక్రి తనదైన గొంతులో పాడి చిరాకు తెప్పించాడు. అర్జున్ చేసిన డాన్సులు మాత్రం బాగున్నాయి.
మొత్తం మీద ఈ చిత్రం నన్ను బాగా నిరాశ పరిచింది. నేను ఈ చిత్రం మీద ఏ రకమైన ఊహతో వెళ్ళలేదు కానీ, కనీసం ఒక మంచి తెలుగు చిత్రం స్థాయిలో అయినా వుంటుందని ఆశించాను. పదికి మూడు మార్కులు వస్తాయి ఈ చిత్రానికి.
13 comments:
ఈ మధ్యే హైదరబాదు నుంచి వచ్చిన నా స్నేహితుడు.. ఈ సినిమా చాలా బాగా ఆడుతోందని చప్పాడు. అంటే మిగిలిన సినిమాలు ఇంకా చండాలంగా ఉన్నాయన్న మాట. మొతానికి మగాళ్ళందరూ హన్సికాకోసం..అమ్మాయిలందరూ అర్జున్ కోసం ఈ సినిమాను చూస్తూ బండిని 100 రోజుల వైపుకు లాగుతున్నారన్నమాట
కరక్టుగా చెప్పారు నవీన్ :-) కాకపోతే ఘర్షణ సినిమాలో పండా ఉన్నాడు చూసారా? కొన్ని సార్లు అర్జున్ అచ్చం అలానే కనిపిస్తాడు దీనిలో. పండా కి తమ్ముడిలా...హంసిక అయితే పెదాలు సరిగా విప్పటం లేదు డైలాగులు డబ్బింగులో వచ్చేస్తున్నాయి. ఈ సినిమా చెత్తగా వుందని చెప్పడం కాదు కానీ..మిగతా సినిమాలు అంత దరిద్రంగా ఏడిసాయి. మధుమాసం ఏదో కొద్దిగా పర్వాలేదంట ఇప్పుడు.
అలీ ఆదుకొనకపోతే ఇది చెత్త సినిమా.
అర్జున్ డాన్స్,అలి కామెడీ,హంసిక...ఇవి మూడూ తప్పించి సినిమాలో చెప్పుకునేది ఏమి లేదు.
గుడు..గుడు..గుడు..గుడుంబా శంకర్ :)
కీడు ఎంచి మేలు ఎంచా మన్నారు...గాని ప్రస్తుత తెలుగు సినేమా ధోరణి చూస్తూ ఉంటే అంతా కీడు తప్పిస్తే, మేలు , ఎక్కడా కనిపించడం లేదు, కొన్ని సినెమలు తప్ప. పాత సినెమాలు ఐతే కుటుంభ సామేతంగా చూసే వాళ్ళం, ఒక సందేశం ఉండేది. ఆ పాత బంగారం లాంటి సినెమలు, సమాజాని కి దొహధ పడే సమయం వస్తుందా? వేచి చూడాల్సిందే !
అల్లు అర్జున్, పూరీ కాంబినేషన్ కదా అని 2వ రోజు 2వ ఆటకి వెళ్ళాను. తల నొప్పితో రాత్రంతా నిద్ర పోలేదు :-(
hi chek out for more reviews www,famus.blogspot.com
తండ్రి ని "ఒరేయ్" అని సంబోధించే సంస్కృతి మనవాళ్ళూ ఎక్కడ నుంచి అరువు తెచ్చుకున్నారో నాకు అర్థం కావటం లేదు.
పూరి గాడే దీనిని మొదట వాడినట్లున్నాడు.
ఇక పూరి,రవితేజ కలిసారంటే (విక్రమార్కుడు)ఇలాంటి చెత్త సంబోధనలకు కొరతే ఉండదు. ఎమన్నా అంటే "మాస్" అంటారు.
తెలుగు సినిమా ఎక్కడకు పోతున్నదో అర్థంగాని పరిస్థితి.
స్నేహితులారా, మనం ఇలాంటి సినిమాలు చూడద్దు.
-శ్రవణ్
నేను దేశముదురు చూడలేదు. కాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఎవరూ బాధపడొద్దని మనవి. తెలుగు సినిమా మరణించి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడొస్తున్నవన్నీ దాని ప్రేతాత్మలు. లేదా సంతాప సందేశాలు.
తాడేపల్లి గారు బాగా చెప్పారు. నిజమే మనకిప్పుడు ఒక భూతవైద్యుడు అవసరం. ఇక హంసిక గురించి ఏం చెప్పమంటారు; తెల్ల తోలు తప్ప హావభావాలు లేవు. హంసిక, కత్రినాకైఫ్... వీళ్ళందరూ ఒకటే జాతి. పాలరాతి శిల్పాలకు చలనం ఉండదు కదా! మీకు జగన్ నాగ్ మంచి దోస్తులని తెలుసు కదా. నాగ్‌కి మా-టీవీలో షేర్ ఉందండోయ్. అందుకే ఈ సినిమాలో మా-టీవీ హడావిడి.
పిచ్చిపుల్లయ్యలు మన సినిమా వాళ్ళు .. పూరి అసలు తనని తాను ఏమనుకుంటాడో? సూపర్ సినిమయే భయంకరం అనుకుంటే అదో గొప్ప సినిమా అనేసుకుని పోకిరి. honeshtly నాకు పోకిరి అంత పెద్ద hit ఎలా అయిందో అస్సలు అర్థం కాలేదు. అదో గొప్ప చిత్రమనుకుని ఇప్పుడు దేశముదురు.
నాన్నని ఒరే అని మొదట హెలో బ్రదర్‌లో రమ్యకృష్ణ అనటం విన్నాను.
విక్రమార్కుడు దర్శకుడు పూరి కాదు రాజమౌళి.
hai sodhana this is sudha reddy today (15/0907)i have to see in your blog site and come to open your site really it is verry fanstastic (hard work makes a man perfect) keep it up
ch sudhakar reddy
(sudhareddy_009@yahoo.com)
Post a Comment