ఈ మధ్యనే కొంత మంది మిత్రులతో వారి అమెరికా అనుభవాలు పంచుకుంటుంటే నా మొదటి అనుభవం కూడా గుర్తుకొచ్చింది. బారిష్టరు పార్వతీశం లా కాక పోయినా నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అది. తప్పక బ్లాగాల్సిన విషయం కూడా….
ఐదు సంవత్సరాల క్రితం. అది నాకు మొదటి సారి అమెరికా ప్రయాణం. కాబట్టి చాలా ఉత్సాహంగా ముంబయి విమానాశ్రయంలో చెక్-ఇన్ అయిపోయాను. రెండు వెర్రి ప్రశ్నలు వేసి ఎంబార్కేషన్ లో ఒక స్టాంపు వేసి ఇక పో మళ్ళీ రాకు అన్నట్ట్లుగా నిర్వికారంగా చూసాడు మన తోటి భారతీయుడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఎగరాల్సిన డెల్టా గాలి మార్గాల వారి విమానం చల్లగా తెల్లవారు ఝామున నాలుగు గంటలకు బయలు దేరింది. విమానం ఎక్కాక బిజినెస్ క్లాసులో(అప్పటి కంపనీ వారి దయ) సీటు వెతుక్కుని కూర్చున్నాక విమాన సేవిక చల్లగా చావు కబురు చెప్పింది. అదేమిటంటే ఆ విమానంలో సామానులు ఉంచే గదిలో అగ్ని మాపక వ్యవస్థ పని చేయనందున సామాను మొత్తం మరుచటి రోజు విమానంలో వచ్చును. అది ఇష్టం లేని వారు దిగి ఆ విమానం లో రావచ్చు లేదా, అందరు ఒప్పుకుంటే ప్రస్తుత విమానం రద్దు చేయబడును అని. వెంటనే ప్రయాణీకులు హాహాకారాలు మొదలు పెట్టారు. ఒకతను వాషింగ్టన్ లో జరగబోయే ఒక రోజు సెమినార్ కు వెళ్తున్నాడు. అతను వెర్రిగా చూశాడు. నా లగేజీ అమెరికా వచ్చే సరికి నేను ఇండియా బయలు దేరిపోతాన్రా బాబు అని. ఇలా రక రకాల గోలల తరువాత చాలా మంది విమానం బయలు దేరటానికి ఓటు చేసి టైమే మాకు ప్రధానం అని తేల్చి చెప్పేసారు. నా కేబిన్ లగేజిలో కేవలం పాస్ పోర్టు, వీసా, బ్రష్, పేస్టు వంటివి, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే వున్నాయి. నేను అవి తలుచుకోగానే బుర్ర దిమ్మెక్కింది. సరే ఒక్క రోజే కదా అని హాయిగా కూర్చున్నా.
చాలా గంటల ప్రయాణం తరువాత ప్యారిస్ ఛార్లెస్ డీ గాల్ విమానాశ్రయంలో దిగాం. తెల్ల వారు ఝామున మసక మసకగా ఉన్న వెలుతురులో పూర్తిగా తెల్లని మంచులో కప్పబడి ఉంది ఆ ప్రేమ నగరం, ఫ్యాషన్ రాజధాని.
త్వరలో తరువాయి భాగం…..
5 comments:
cool...looking forward for the next part
మీరస్సలు బాగా రాయలేదు. :) మరేంటండీ ఈ సస్పెన్సు!
--ప్రసాద్
http://blog.charasala.com
ఇదేమీబాగోలేదండి.టీవీ సీరియల్ కన్న దారుణం గా వుంది.మరీ ఇంత చిన్న ఎపిసోడా?నేనొప్పుకోను.
సీరియల్ బ్లాగుపోస్చులతో జనాల్నిలాగే చంపాలిపుడు చట్టానికి దొరక్కుండా!!
నా మొదటి విమాన ప్రయాణ ప్రహసనం ఇక్కడ రాసిపెట్టాను. నాకప్పటికి తెలుగు బ్లాగుల గురించి తెలియదు.
:-) నేను ఈ టపా ఈ మాత్రం రాసే సరికి తెల్లవారు రెండు గంటలయ్యింది. బద్దకం నిద్రను డ్యూయెట్ పాడుకుందాం రమ్మనడంతో సశేషించేసా...:-)
Post a Comment