Tuesday, February 13, 2007

అందమైన జీవితమా? అందమైన సెల్ ఫోనా?

ఈ మధ్య నా సెల్ ఫోన్ నా వైపు చూసి నవ్వుతున్నట్లనిపిస్తుంది. అది నా పై స్వారీ చేస్తుందో లేదా నేనే దానిని నెత్తి మీదకెక్కించుకున్నానో అర్ధం కావటం లేదు. ఒకప్పటి రోజులు గుర్తుకొస్తుంటే మరీ బాధగా ఉంది. అందంగా ఆలోచించి మరీ ఇన్ లాండు లెటరులలో ఉత్తరాలు మిత్రులకు రాస్తే ఆ మజానే వేరు. ఒకే ఉత్త్రరంలో అమ్మకు, నాన్నకు, చెల్లికీ ఒకో వేరే పేరాలలో వేరే భావాలతో ఉత్తరం రాసి ఒక జన్మ అయినట్లుంది. దీనంతటికి కారణం ఈ సెల్లుటకాజీ అని నేను బల్ల గుద్ది చెప్పగలను. ఇప్పుడు కాల్ ఎత్తక పోతే ఎవడికో ఎక్కడో కాలిపోతుంది. ఎవరో చెప్పాపెట్ట కుండా అలుగుతారు. ఏంట్రా ఎన్ని కాల్స్ చేసినా ఎత్తవు? ఆ సెల్లు తీసుకెల్లి పొయ్యలో తగలెయ్ అని తిట్టేవారు లేకపోలేదు. ఒక రోజంతా సెల్లు ఎత్తక పోతే కొంప తీసి కిడ్నాపయిపోయాడా అని ఆలోచిస్తున్నారు.

సెల్లు విశ్వరూపం వలన ముఖ్యంగా ప్రభావితం అయ్యింది అమ్మాయిలు. అమీరుపేట లో ఒక్క పది నిమిషాలు గమనిస్తే కనీసం ఒక పది మంది అమ్మాయిలు సెల్లు చెవికి తగిలించుకుని అదేదో లోకాలలో తేలిపోతూ నేలకు ఒక్క అర ఇంచీ ఎత్తులో నడుస్తు అడ్డ దిడ్డంగా వెలుతుంటారు. ఒక భారీ ట్రక్కు వారికి పది ఇంచీల దూరంగా బ్రేకు వేసి ఆగినా కూడా కనీసం చూడని సంఘటనలు నేను చూసాను. ఇక లేడీస్ హాష్టల్ అయితే సరే సరి. రాత్రి ఫోనులో మాట్లాడని అమ్మాయి ఒక బకరా టైపు కింద లెక్కట. ఇది ఫోను పిచ్చి ఉన్న ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను మెల్లగా కదిపితే తెలిసింది. ఇక అబ్బాయిలంటారా? వీరిదీ అదే దారి ..కాక పోతే వీరు బైకులపై మెడకాయతో సెల్లును భుజం మీద అదిమి అదో రకమైన విన్యాసం చేస్తూ ఊరంతా తిరిగేస్తుంటారు. వీళ్ళు ఊడబొడిచే ఉద్యోగాలేంటో, అంత కంగారు ఎందుకో అర్ధం కాదు.

ఈ మధ్య మనం ఫోనులో మాట్లాడే మాటల నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. టీవి సీరియల్ల మీద గుక్క తిప్పుకోకుండా మాటలు, ఆదివారం అవాక్కయిపోవడానికి చిట్కాలు, కదిలిస్తే కనక మహాలక్ష్మి మాటలు, "ఇంకా ఏంటి చెప్పు…?" అని ఒక వంద సార్లు….అక్కడ ఎండలెలా ఉన్నయి? వర్షం పడుతుందా? ఇక్కడ పడట్లా…కొన్ని సార్లు మన మాటలు వింటే మనకే నవ్వు రాక మానదు. ఇంత భారీగా మాట్లాడే చాలా మందికి ఉద్యోగాలలో కావల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ అస్సలు ఉండవంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ జాడ్యాలన్నింటి వలన లాభపడుతున్నది ఎవరూ? నోకియా వారిది అగ్ర తాంబూలం…వారి విపణిలో నలభై శాతం ఇండియా లోనే అమ్ముతారంట. తరువాతి స్థానం మొబైలు సర్వీసు ప్రొవైడర్లది. వీళ్ళు కోట్లు ఆర్జిస్తున్నారు. ఒకొక్కరికి ఒక రేటు. బాగా జీతాలొచ్చే వాడికి తక్కువ బిల్లింగు…సెల్ వైపు చూడననుకునే వాడికి రకరకాల జీవిత ప్లానులతో మంగళ సెల్లు మెడకు కట్టెయ్యటం. తరువాత స్థానం టీవీలది. ప్రస్తుతం ఉన్న అతి చెత్త మీడియా ఇదే. పత్రికలలా లేఖలు రాయనివ్వరు, ఈమెయిల్లు ఉండవు. ఏది చెప్పాలన్నా అది SMS మాత్రమే చెయ్యాలి. ఈ SMS ల బిజినెస్ సామాన్య మానవుడుకి ఇంకా అర్ధం కావటం లేదు. అయితే గుండెలు బాదుకుంటాదు. కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి కార్యక్రమాలలో విజేతకు ఇచ్చే కోటి రూపాయలు టీవీ వారికి ఒక్క నెలలో SMS ల ద్వారానే వచ్చేస్తాయి. మిగిలినదంతా మనం అమితాబు, షారుక్ ల కోసం ధార పోస్తామన్న మాట.

ఇక ఈ సెల్ రోగాన్ని కొద్దిగా తగ్గించుకుని బాగు పడటం ఎలా?

  1. "ఇంకా ఏంటి చెప్పు…" అని ఎప్పుడయితే మొదటి సారి మీ నోటంట గానీ, అవతలి నుంచి గానీ వచ్చిందో అప్పుడే అవసరం అయిన మాట్లన్ని అయిపోయినట్లు. అయితే ఇక ఉంటా, తరువాత మాట్లాడుదాం అని సున్నితంగా ఫోను పెట్టెయ్యటం మంచిది.
  2. ఫోను మోగ గానే గాభరాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తి మాట్లాడటం తగ్గించుకుని, కాస్త నెమ్మదిగా నెంబరు చూసుకుని మాట్లాడటం మంచిది. ఒకరనుకుని మరొకరితో మాట్లాడటం చాలా ప్రమాదకరం.
  3. బైకుపైన గానీ, క్లాసులో గానీ, మీటింగులలో గానీ చస్తే ఫోను ముట్టుకోనని ఒట్టేసుకోవాలి. దగ్గరి వారు పదే పదే చేస్తే, బైకు ఒక పక్కకు మెల్లగా ఆపి మీరు ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నారో వెంటనే చెప్పాలి. అవతలి వ్యక్తి విషయం పెద్దగా అవసరం కానిది అయితే మిమ్మలని రోడ్దు మీద మాట్లాడమని కోరడు. చాలా మంది ముందు జాగ్రత్తగా "ఎక్కడున్నావు" అని అడుగుతారు. ఇది చాల మంచి పద్ధతి. మీరు ఫోను చేసిన వ్యక్తి మీ ఫోను వలన బైకుపై వెళుతూ మాట్లాడడం వలన ప్రమాదం జరిగి దుర్మరణం పాలయితే తట్టుకో గలరా? ఆలోచించండి.
  4. ఖాళీ సమయాలలో ఫోనుతో ఆటలాడటం తగ్గించాలి. వీలయితే పుస్తకాలు చదవండి. అవి మెదడును యుక్త వయస్సులో ఉంచుతాయి. ఊసుపోక ఎవరికో కాల్ చెయ్యటం, SMS చెయ్యటం అనేవి మరీ చిన్న పిల్లల లక్షణాలు. అవి ఆపుకోవాలి.
  5. వంద రకాల పనులు చేసే సెల్ ఫోను కొనేటప్పుడు, అసలు మనం ఆ పనిముట్లనీ వాడతామా? అని ఆలోచించాలి. ఈ రకమైన సెల్ ఫోన్ల వలన ఎక్కువగా ఎవరికైనా ఫోన్ చెయ్యాలనిపిస్తుంది.
  6. ప్రతి నెలా సెల్ ఫోనుకు ఒక ఖచ్చితమైన బడ్జెట్ పెట్టుకోవాలి. అది దాటుతుంటే ఒక సారి మన వాడకం ఎలా ఉందో చూసుకోవటం మంచిది.
  7. ప్రతీ చెత్త టీవీ ప్రోగ్రాములకూ SMS లు పంపటం మానండి. అవన్నీ లాటరీని అందంగా ఒక టీవీ ప్రోగ్రాములా మలచి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారాలు. ప్రభుత్వానికి అది అర్ధమయ్యేలోపు మన జేబులు ఖాళీ. గృహిణులు ఎక్కువగా ఈ పని చేస్తుంటారు.
  8. టీవీలలో "మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగే ప్రశ్నలకు SMS వ్యాఖ్యలు పంపేటప్పుడు ఒక్క సారి ప్రశ్నను గమనించండి. చాలా ప్రశ్నలు మనలోని సున్నితమైన భావాలను గుచ్చుకునేలా, ఉద్రేకపడేలా తయారు చేస్తారు. ఎంత ఎక్కువ మంది ఉద్రేకపడితే అన్ని ఎక్కువ SMS లు, అంత ఎక్కువ లాభం అన్న మాట.
  9. పదే పదే మిస్డ్ కాల్ల్స్ చేసి ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు. వారి ఏకాంతానికి, జీవితానికి మీరు భంగం కలిగించినట్లవుతుంది. అత్యవసరం అయితే తప్ప ఇలా చెయ్యకూడదు.
  10. ఆఖరుగా సెల్ ఫోనును ఒక సెల్ ఫోనులానే వాడాలి, అంతే గానీ, మన గళానికి, చెవులకు ప్రధమ ప్రతినిధిగా పదవోన్నతి ఇస్తే అంతే సంగతులు. జీవితాన్ని మన చేతులలోకి తీసుకోవాలంటే సెల్ ఫోన్ ని కాసేపు కింద పెట్టక తప్పదు. అందులో తప్పేమీ లేదు. అందమైన జీవితం కావాలా? అందమైన సెల్ ఫోన్ కావాలా? తేల్చుకోండి మరి.

10 comments:

radhika said...

caalaa machi vishayaalu cepparu.

Ramanadha Reddy said...

సినిమాథియేటర్లోకి వచ్చి అవతల కొంపలుమునిగే పనులున్నట్లు హాయిగా సినిమాని ఎంజాయ్ చెయ్యడానికొచ్చిన వాళ్లందరికీ ఇబ్బందికలిగించే సెల్లురక్కసుల గురించి కూడా ఒకమాట చెప్పుకోవాలి.
రెండుమార్లు ఫోనెత్తకపోతే నేనింకా ఊపిరితోవున్నానో లేదోననే ఆందోళనతో మా నాన్న ఆ తరువాత నేను మాట్లాడినపుడు సంజాయిషీ అడగడం, ఒకసారి నేను విసుక్కుంటే నీకూ ఒకడు పుడితేగానీ తెలీదురా నా పరిస్థితి అని నానోరుమూయించడం కూడా జరిగిపోయింది. రెండుసార్లు ఫోనెత్తని నేరానికి తిట్లు భరించాల్సిన పరిస్థితికి, 2004 వరకూ ఉత్తరాలలో జరిగిన మా సంభాషణలకూ పోలికే లేదు. సెల్‌ఫోన్ల వల్ల ఎంత సౌకర్యమైనా, మానవసంబంధాలలోని తడి (ఆర్థ్రత) ఆరిపోతుంది. సంబంధాలు బాగా డ్రై ఐపోతున్నాయి. దీన్ని సీరియస్‌గా పరిగణించి పరిష్కారం ఆలోచించాలి. నేనుమాత్రం "మ్.. ఇంకేంటి" అనే మాట వినగానే కంపరం పుట్టి కాల్‌ కట్ చేసిపారేస్తాను.

raghu said...

మానవ సంబంధాలలోని ఆర్ద్రత కొద్దిగయినా మిగలటానికి కారణం మన భారతీయులలో వుండే కుటుంబ లక్షణాలే. నాకైతే నా మిత్రులు ఇన్లాండు ఉత్తరం అంచులలో నిలువుగాకూడా అక్షరాలు ఇరికించి చీమల బారులా మొత్తం రాసేవారు. ఇప్పుడు సెల్ లో అలా ఎలా చెయ్యటం?నాకొచ్చేవన్నీ పనికి రాని ఎస్.ఎమ్మెస్ లే. గొలుసు కట్టులో ఎవరి నుంచో వచ్చినవి. ఈ మధ్యనే సెల్ ని వుపయోగించడం పూర్తిగా తగ్గించుకున్నాను. మంచి వ్యాసం అందించినందుకు Thanks.

Dil said...

చాలా అవసరమైన చర్చ ఇది. సెల్ ఫోను ని ఎక్కడుంచాలో అక్కడుంచాల్సిన సమయం వచ్చేసింది. టీవీ కి కూడ సెల్ ఫోన్ కన్నా కొంచెం తక్కువ స్థాయి మర్యాదే ఇవ్వలి మనం.

వెంకట రమణ said...

SMS కాంటెస్టులకు, లాటరీలకు తేడా ఏమీలేదు. లాటరీలను నిషేదించిన ప్రభుత్వం టీవీలు SMS కాంటెస్టులు పెట్టకుండా నిషేదించే రోజెప్పుడు వస్తుందో..

రవి వైజాసత్య said...

అయ్య బాబోయ్ అలా అంటారేంటండి సెల్లుఫోను లేకపోతే సగం జనానినికి ఊపిరాగిపోదూ :-D ఆ ప్రభుద్ధులకు సెల్లుఫోను స్విచ్చాఫ్ బటనొకటుంటుందని పదే పదే గుర్తుచెయ్యాలి. అదినొక్కటం మాహా పాపమేమీకాదు..

ఇండియానుండి ఫోను చేసేవాళ్లు చచ్చినా మేసేజ్ పెట్టకుండా తెగ కంగారు పెడుతుంటారు. వెంట వెంటనే రింగుల మీద రింగులు..మేసేజి ఉండదు..ఏ కొంప మునిగిందో అని ఫోన్ చేస్తే విషయమేమి ఉండదు. ఫోన్ ఎత్తకపోతే నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని గదమాయింపులు. ఫోన్ చేసినప్పుడు బాత్రూంలో ఉండొచ్చు..బాసుతో మీటింగులో ఉండోచ్చు..భార్యతో సరసమాడుతుండొచ్చు..సెల్లుఫోను నిర్వహాణ ఎలా మాట్లాడాలనే విషయమ్మీద ఈసారి ఇండియా వెళ్లినప్పుడు సీరియస్ గా క్లాసు పీకాలి

ఉదయ్ భాస్కర్ said...

సుధాకర్‌ గారు,
ఎమిటి అండి మీరు లేడీస్‌ హాస్టలు లొ అమ్మయిల సెల్లుఫొను కబుర్లు చెపుతున్నారు??

సుధాకర్(శోధన) said...

:-) అవును ఉదయ్. బ్లాగున్నదే చెప్పడానికోసం. కాకపోతే ఆ అమ్మాయిల సెల్లుఫోను కాల్ అవతల నేను అంత మాత్రం లేనన్నిను విన్నవించుకుంటున్నాను.
నేను అసలు విద్యార్ధులకు సెల్ కొని ఇవ్వటంపై కొంత వ్యతిరేకం. అది ఇక్కడ రాసాను కూడా...

సుధాకర్(శోధన) said...

లంకె ఇవ్వటం మరిచా
http://suds.spaces.live.com/blog/cns!D7FAAD13440E8158!160.entry

Sunitha B said...

Yentho manchi vyasa andarikee andincharu sudhakar. Oka vasthu va viluva telusu koni daani manchi ga upayo ginchadam yenthaina avasaram.

About Us | Site Map | Privacy Policy | Contact Us | Blog Design | 2007 Company Name